1.28 మొక్కుబడుల ప్రకరణం| మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
మొక్కుబడుల ప్రకరణం [PDF]

మొక్కుబడుల ప్రకరణం
(మొక్కుబడి చేసుకునే విధానాలు)

1061 – حديث ابْنِ عَبَّاسٍ، أَنَّ سَعْدَ بْنَ عُبَادَةَ رضي الله عنه، اسْتَفْتَى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: إِنَّ أُمِّي مَاتَتْ وَعَلَيْهَا نَذْرٌ، فَقَالَ: اقْضِهِ عَنْهَا
__________
أخرجه البخاري في: 55 كتاب الوصايا: 19 باب ما يستحب لمن يتوفى فجأة أن يتصدقوا عنه، وقضاء النذور عن الميت

1061. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఒక సమస్యను గురించి ప్రస్తావిస్తూ “(దైవప్రవక్తా!) నా తల్లి చనిపోయింది. (జీవించి ఉన్నప్పుడు) ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది. దాన్ని తీర్చే బాధ్యత ఆమెపై ఉండిపోయింది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “ఆమె తరఫున నీవా మొక్కుబడి తీర్చు” అని సెలవిచ్చారు.

[సహీహ్ బుఖారీ : 55వ ప్రకరణం, 19వ అధ్యాయం]

1062 – حديث ابْنِ عُمَرَ، قَالَ: نَهى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ النَّذْرِ، قَالَ: إِنَّهُ لاَ يَرُدُّ شَيْئًا، وَإِنَّمَا يُسْتَخْرَجُ بِهِ مِنَ الْبَخِيل
__________
أخرجه البخاري في: 82 كتاب القدر: 6 باب إلقاء النذر العبد إلى القَدَر

1062. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- “మొక్కుబడులు చేసుకోవద్దని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్మల్ని వారించారు. మొక్కుబడి అనేది జరగవలసిన ఏ సంఘటననూ ఏ కాస్త కూడా నివారించజాలదని, కాకపోతే మొక్కుబడి మూలంగా పిసినారి సయితం డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుందని ఆయన అన్నారు” .*

[సహీహ్ బుఖారీ : 82వ ప్రకరణం, 6వ అధ్యాయం]

[*] ఈ హదీసు మొక్కుబడులను వ్యతిరేకిస్తున్నట్లు పైకి అనిపిస్తోంది. కాని ధర్మసమ్మతమైన వ్యవహారంలో దైవప్రసన్నత కోసం మొక్కుబడి చేసుకోవడంలో తప్పులేదని ధర్మవేత్తల ఏకాభిప్రాయం. మొక్కుబడి పాప వ్యవహారానికి సంబంధించినదయితే దాన్ని తీర్చకపోవడమే గాక, తీర్చనందున పరిహారం (కఫ్ఫారా) కూడా చెల్లించనవసరం లేదని వారి అభిప్రాయం. అయితే ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), మరికొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం, మొక్కుబడి తీర్చకూడదు కాని ప్రమాణ భంగం అయినందుకు కఫ్ఫారా (పరిహారం) మాత్రం విధిగా చెల్లించాలి.

ఈ హదీసు ద్వారా మరొక విషయం కూడా తెలుస్తోంది. ధర్మసమ్మతమైన మొక్కుబడి చేసుకొన్నప్పుడు దాన్ని తప్పకుండా తీర్చాలి. లాభనష్టాలు, కష్టసుఖాలతో సహా సమస్త కార్యాలు నిర్వహించేవాడు అల్లాహ్ మాత్రమేనని నమ్మాలి. కార్యసాధన కోసం మానవుడు చేసే వివిధ ప్రయత్నాలలో మొక్కుబడి కూడా ఒకటని గ్రహించాలి. కేవలం మొక్కుబడి చేసుకొని ప్రయత్నం చేయకపోవడం అవివేక మనిపించుకుంటుంది. అలాగే మొక్కుబడి మన విధి వ్రాతను మార్చి వేస్తుందని భావించడం కూడా అవివేకమే.

1063 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ يَأْتِي ابْنَ آدَمَ النَّذْرُ بِشَيْءٍ لَمْ يَكُنْ قُدِّرَ لَهُ، وَلكِنْ يُلْقِيهِ النَّذْرُ إِلَى الْقَدَرِ قَدْ قُدِّرَ لَهُ، فَيَسْتَخْرِجُ اللهُ بِهِ مِنَ الْبَخِيلِ، فَيُؤْتِي عَلَيْهِ مَا لَمْ يَكُنْ يُؤْتِي عَلَيْهِ مِنْ قَبْلُ
__________
أخرجه البخاري في: 83 كتاب الأيمان والنذور: 26 باب الوفاء بالنذر، وقوله (يوفون بالنذر)

1063. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “మొక్కుబడి మనిషికి అతని అదృష్టంలో లేని ఏ ప్రయోజనమూ చేకూర్చదు. కాకపోతే మొక్కుబడి అతడ్ని అతని అదృష్టంలో రాసి ఉన్న దాని వైపుకు తీసికెళ్ళి కలుపుతుంది. మొక్కుబడి ద్వారా అల్లాహ్ పిసినారి చేత కూడా డబ్బు ఖర్చు చేయిస్తాడు. ఆ పిసినారి మొక్కుబడికి పూర్వం ఇవ్వనిది మొక్కుబడి కారణంగా ఇచ్చివేస్తాడు.”

[సహీహ్ బుఖారీ : 83వ ప్రకరణం, 26వ అధ్యాయం]

1064 – حديث أَنَسٍ رضي الله عنه، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى شَيْخًا يُهَادَى بَيْنَ ابْنَيْهِ، قَالَ: مَا بَالُ هذَا قَالُوا: نَذَرَ أَنْ يَمْشِيَ؛ قَالَ: إِنَّ اللهَ عَنْ تَعْذِيبِ هذَا نَفْسَهُ لَغَنِيٌّ وَأَمَرَهُ أَنْ يَرْكَبَ
__________
أخرجه البخاري في: 28 كتاب جزاء الصيد: 27 باب من نذر المشي إلى الكعبة

1064. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి ఒక వృద్ధుడ్ని చూశారు. అతను తన కొడుకు లిద్దరి మధ్య వారిచ్చిన ఊతంతో నడుస్తున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడి జనాన్ని ఉద్దేశించి “ఏమయింది ఇతనికి? ఎందుకిలా నడుస్తున్నాడు?” అని అడిగారు. “అతను కాలి నడకన కాబా గృహానికి వెళ్తానని మొక్కుబడి చేసుకున్నాడు” అన్నారు ప్రజలు. “ఈ మనిషి తనకు తాను విధించుకున్న ఈ శిక్షను అల్లాహ్ లెక్కలోనికి తీసుకోడు. వాహనమెక్కి వెళ్ళమని చెప్పండతనికి” [*] అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్ బుఖారీ : 28వ ప్రకరణం, 27వ అధ్యాయం]

[*] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తిని అతని మొక్కుబడిని తీర్చుకోవాలని ఆదేశించలేదు. పైగా ఆ మొక్కుబడికి వ్యతిరేకంగా నడచుకోవాలని అన్నారు. దానిక్కారణం, హజ్ యాత్ర కోసం వాహనం ద్వారా ప్రయాణమవడం కాలినడకన ప్రయాణం కన్నా శ్రేష్ఠమైనదై ఉండవచ్చు. శ్రేష్ఠమైనదానికి ప్రాధాన్యత నివ్వాలి గనక, ఆ మొక్కుబడిని తీర్చనవసరం లేదని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించి ఉంటారు. లేదా ఆ వ్యక్తికి మొక్కుబడి తీర్చే (శారీరక) శక్తి లేనందున ఆ విధంగా ఉపదేశించి ఉంటారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అల్లాహ్ ఏ మనిషి పైనా అతను మోయలేని భారాన్ని వేయడు. అందువల్ల అతడ్ని వాహనమెక్కి ప్రయాణం సాగించమని ఆదేశించి ఉంటారు.

1065 – حديث عُقْبَةَ بْنِ عَامِرٍ، قَالَ: نَذَرَتْ أُخْتِي أَنْ تَمْشِيَ إِلَى بَيْتِ اللهِ، وَأَمَرَتْنِي أَنْ أَسْتَفْتِيَ لَهَا النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَاسْتَفْتَيْتُهُ فَقَالَ عَلَيْهِ السَّلاَمُ: لِتَمْشِ وَلْتَرْكَبْ
__________
أخرجه البخاري في: 28 كتاب جزاء الصيد: 37 باب من نذر المشي إلى الكعبة

1065. హజ్రత్ అఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ సారి నా సోదరి కాలినడకన కాబా గృహానికి వెళ్తానని మొక్కుబడి చేసుకొని, దాని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విచారించి రమ్మని నన్ను పురమాయించింది. నేను వెళ్ళి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఈ విషయం ప్రస్తావించాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) విని “కాలినడకతో పాటు ఆమె వాహనం కూడా ఎక్కి ప్రయాణం చేయాలి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 28వ ప్రకరణం, 27వ అధ్యాయం]

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) . 

1.6 బహిష్టు ప్రకరణం | మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
బహిస్టు ప్రకరణం [PDF]

168 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَتْ إِحْدَانَا إِذَا كَانَتْ حَائِضًا، فَأَرادَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يُبَاشِرَهَا، أَمَرَهَا أَنْ تَتَّزِرَ فِي فَوْرِ حَيْضَتِهَا، ثُمَّ يُبَاشِرُهَا قَالَتْ: وَأَيُّكُمْ يَمْلِك إِرْبَهُ كَمَا كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَمْلِكُ إِرْبَهُ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض

168. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ అయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- “మాలో ఎవరైనా బహిష్టు అయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె దేహానికి దేహం ఆనించ దలచుకుంటే, ఆమెను (లంగోటి లాంటి) లోఉడుపును కట్టుకోమని ఆదేశించేవారు. ఆ తరువాత ఆమె దేహానికి దేహం ఆనించేవారు… లైంగికవాంఛపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కున్న ఇంతటి నిగ్రహశక్తి మీలో ఎవరికైనా ఉందా?” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అన్నారు.

[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 5వ అధ్యాయం – ముబాషిరతిల్ హాయిజ్]

169 – حديث مَيْمُونَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ أَنْ يُبَاشِرَ امْرَأَةً مِنْ نِسَائِهِ، أَمَرَهَا فَاتَّزَرَتْ وَهِيَ حَائِضٌ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض

169. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భార్యలలో ఎవరితోనైనా దేహానికి దేహం ఆనించ దలచుకున్నప్పుడు, * ఆమె బహిష్టు అయి ఉంటే, (లంగోటిలాంటి) లో ఉడుపు కట్టుకోమని ఆమెను ఆదేశించేవారు.

[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం, – హైజ్, 5వ అధ్యాయం]

* ఇక్కడ మూలభాషలో ‘ముబాషిరత్‘ అనే పదం వచ్చింది. అంటే శరీరంతో శరీరం కలపడం అని అర్థం. అంతేగాని ఇక్కడ సందర్భాన్ని బట్టి లైంగిక సంపర్కం అనే భావం రాదు. ఎందుకంటే దివ్యఖుర్ఆన్ఆ “రుతుస్రావం గురించి ఆజ్ఞ ఏమిటని అడుగుతున్నారు వారు, ఆదొక అపరిశుద్ధావస్థ అనీ, ఆ స్థితిలో భార్యలకు దూరంగా ఉండాలని, వారు (స్నానం చేసి) పరిశుభ్రం కానంత వరకు వారి దగ్గరకు వెళ్ళకూడదని చెప్పెయ్యి” అని ఉంది. (2:222)

1.10 జుమా ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

485 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا جَاءَ أَحَدُكمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 2 باب فضل الغسل يوم الجمعة

485. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “జుమా (నమాజు) కు వచ్చేవాడు గుస్ల్ (స్నానం) చేసి రావాలి.” [సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 2వ అధ్యాయం – ఫజ్లిల్ గుస్లి యౌముల్ జుమా)

486 – حديث عُمَرَ بْنِ الْخَطَّابِ عَنِ ابْنِ عُمَرَ، أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ بَيْنَمَا هُوَ قَائمٌ فِي الْخُطْبَةِ يَوْمَ الْجُمُعَةِ إِذْ دَخَلَ رَجُلٌ مِنَ الْمُهَاجِرينَ الأَوَّلَينَ مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَنَادَاهُ عُمَرُ: أَيَّةُ سَاعَةٍ هذِهِ قَالَ: إِنِّي شُغِلْتُ فَلَمْ أَنْقَلِبْ إِلَى أَهْلِي حَتَّى سَمِعْتُ التَّأْذينَ، فَلَمْ أَزِدْ عَلَى أَنْ تَوَضَّأْتُ فَقَالَ: وَالْوُضُوءُ أَيْضًا وَقَدْ عَلِمتَ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَأْمُرُ بِالْغُسْلِ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 2 باب فضل الغسل يوم الجمعة

486. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) జుమా ప్రసంగం చేస్తుంటే, ప్రవక్త సహచరుల్లో ముహాజిరీన్ వర్గానికి చెందిన గతకాల* అగ్రగణ్యుల్లోని ఒక సహాబి (ప్రవక్త సహచరుడు) వచ్చారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని ఉద్దేశించి “మీరిలా ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటీ?” అని ప్రశ్నించారు. దానికి ఆ సహాబి (రదియల్లాహు అన్హు) “నేనొక ముఖ్యమైన పనిలో ఉండిపోవడం వలన కాస్త ఆలస్యమయింది. నేను (పని ముగించుకొని) ఇంటికి వచ్చేటప్పటికి అజాన్ వినపడసాగింది. వెంటనే నేను వుజూ మాత్రమే చేసి, మరేపనీ చేయకుండా (నమాజుకు) వచ్చేశాను” అని అన్నారు. “ఏమిటీ వుజూ మాత్రమే చేశారా? (జుమా నమాజు కోసం) స్నానం (గుస్ల్) చేయాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞాపించిన సంగతి తెలియదా?” అని అన్నారు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు).

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 2వ అధ్యాయం – ఫజ్లిల్ గుస్లి యౌముల్ జుముఆ]

* గతకాల అగ్రగణ్యులు అంటే బద్ర్ యుద్ధంలో పాల్గొన్న వారు, రిజ్వాన్ శపథం చేసినవారు, రెండు ఖిబ్లాల (బైతుల్ మఖ్దిస్, కాబా షరీఫ్)ల వైపు అభిముఖులై నమాజ్ చేసినవారు – అని అర్థం. వారిలో ఒక సహాబీ అంటే హజ్రత్ ఉస్మాన్ జున్నూరైన్ (రదియల్లాహు అన్హు) అని అర్థం. ఇస్లామీయ చరిత్రలో ఈ సంఘటన కూడా సమతా, న్యాయాలకు ఒక మచ్చుతునక. ఆత్మపరిశీలన విషయంలోగానీ, విమర్శ విషయంలో గానీ అందరూ సమానులేనని ఈ సంఘటన తెలియజేస్తోంది.

487 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 161 باب وضوء الصبيان ومتى يجب عليهم الغسل

487. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : “ప్రతి వయోజన పురుషుడు శుక్రవారం నాడు తప్పనిసరి (వాజిబ్)గా స్నానం చేయాలి. (*)

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 16వ అధ్యాయం – వుజూ ఆస్సిబ్యాని వ మతా యజిబు అలైహిముల్ గుస్ల్)

* ఈ హదీసుని బట్టి శుక్రవారం రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలని తెలుస్తోంది. దీన్ని కొందరు సహాబీలు పాటించారు. అయితే హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు)గారి ఉల్లేఖనం బట్టి శుక్రవారం స్నానం వాజిబ్ (విధి) కాదని మస్తహిబ్ (అభిలషణీయం) మాత్రమేనని కూడా మరొక వైపు తెలుస్తోంది. అందువల్ల అత్యధిక మంది ధర్మవేత్తలు ఈ పద్ధతినే అవలంబించారు. దీనికి మరింత బలం చేకూర్చుతున్న మరో హదీసు ఉంది. అందులో దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైనా (శుక్రవారం రోజు) వుజూ చేస్తే సరే (సరిపోతుంది). అయితే గుసుల్ చేయడం మరింత మంచిది”

488 – حديث عَائِشَةَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: كَانَ النَّاسُ يَنْتَابُونَ يَوْمَ الْجُمُعَةِ مِنْ مَنَازِلِهِمْ وَالْعَوَالِي، فَيَأْتُونَ فِي الْغُبَارِ، يُصِيبُهُمُ الْغُبَارُ وَالْعَرَقُ، فَيَخْرُجُ مِنْهُمُ الْعَرَقَ فَأَتَى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِنْسَانٌ مِنْهُمْ وَهُوَ عِنْدِي، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَوْ أَنَّكُمْ تَطَهَّرْتُمْ لِيَوْمِكُمْ هذَا
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 15 باب من أين تؤتى الجمعة

488. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) కథనం:- శుక్రవారం రోజు ప్రజలు తమ ఇండ్లలో నుంచి మదీనా చుట్టు ప్రక్కల గ్రామాల నుండి, దుమ్ము, ధూళి కొట్టుకొని చెమటలతో తడిసి గుంపులు గుంపులుగా (జుమా నమాజుకు) వచ్చేవారు. దుమ్ముతో కలిసి చెమట కారుతూ (దుర్వాసన కొడుతూ) ఉండేది. ఒకసారి అలాంటి వారిలో ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చాడు. ఆ సమయంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గర కూర్చొని ఉన్నారు. ఆయన ఆ వ్యక్తిని చూసి “ఈ రోజు మీరు (ప్రజలు) గనక శుచి శుభ్రతలు పాటిస్తే (అంటే స్నానం చేసి ఉంటే) ఎంత బాగుంటుంది?” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 15వ అధ్యాయం – మిన్ ఐన తూతల్ జుముఆ]

489 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّاسُ مَهَنَةَ أَنْفُسِهِمْ، وَكَانُوا إذَا رَاحُوا إِلَى الْجُمُعَةِ رَاحُوا فِي هَيْئَتِهِمْ، فَقِيلَ لَهُمْ لَوِ اغْتَسَلْتُمْ
__________
أخرجه البخاري في: 10 كتاب الجمعة: 16 باب وقت الجمعة إذا زالت الشمس

489. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) కథనం:- ప్రజలు (ఆ కాలంలో) తమ పనులు తామే చేసుకునేవారు. (అలా పనులు చేసి) జుమా నమాజుకు అవే బట్టలతో (దుమ్ము చెమటలతో కూడిన) శరీరంతో వచ్చేవారు. అందువల్ల ‘మీరు స్నానం చేసి వస్తే ఎంత బాగుండేది’ అని (దైవప్రవక్త) చెప్పేవారు వారికి.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 16వ అధ్యాయం – వఖ్తిల్ జుముఅతి ఇజా జాలతిషమ్స్)

490 – حديث أَبِي سَعِيدٍ، قَالَ: أَشْهَدُ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ، وَأَنْ يَسْتَنَّ، وَأَنْ يَمَسَّ طيبًا، إِنْ وَجَدَ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 3 باب الطيب للجمعة

490. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “శుక్రవారం రోజు ప్రతి ముస్లిం యువజనుడు విధి (వాజిబ్)గా స్నానం చేయాలి. మిస్వాక్ (బ్రష్) కూడా చేయాలి. ఉంటే సువాసనలు కూడ పూసుకోవాలి.” [సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 3వ అధ్యాయం – అత్తీ బిలిల్ జుముఆ]

491 – حديث ابْنِ عَبَّاسٍ عَنْ طَاوُسٍ عَنِ ابْنِ عَبَّاسٍ، أَنَّهُ ذَكَرَ قَوْلَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي الْغُسْلِ يَوْمَ الْجُمُعَةِ، فَقُلْتُ لاِبْنِ عَبَّاسٍ: أَيَمَسُّ طيبًا أَو دُهْنًا إِنْ كَانَ عِنْدَ أَهْلِهِ فَقَالَ: لاَ أَعْلَمُهُ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 6 باب الدهن للجمعة

491. హజ్రత్ తావూస్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) స్నానం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకటించిన ఒక హదీసు విన్పించారు. అప్పుడు నేను జోక్యం చేసుకుంటూ, “ఈ హదీసులో, అతని భార్య దగ్గర తైలం సువాసనలు ఉంటే వాటిని సయితం ఉపయోగించాలన్న విషయం కూడా ఉందా?” అని అడిగాను. దానికి ఆయన “ఈ సంగతి నాకు తెలియదు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం, జుమా, 6వ అధ్యాయం – అద్దుహ్నిలిల్ జుముఆ]

492 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: حَقٌّ عَلَى كُلِّ مُسْلِمٍ أَنْ يَغْتَسِلَ فِي كُلِّ سَبْعَةِ أَيّامٍ يَوْمًا يَغْسِلُ فِيهِ رَأْسَهُ وَجَسَدَهُ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 12 باب هل على من لم يشهد الجمعة غسل من النساء والصبيان وغيرهم

492. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ప్రతి ముస్లిం వారానికి (కనీసం) ఒకసారి స్నానం చేయాలి. ఆ స్నానంలో తల, శరీరం పూర్తిగా కడుక్కోవాలి. ఇది ముస్లింలపై ఉన్న అల్లాహ్ హక్కు.” [సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 12వ అధ్యాయం – హల్ అలామన్ లమ్ యష్ హదుల్ జుముఅత గుస్లున్ మినన్నిసా]

493 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنِ اغْتَسَلَ يَوْمَ الْجُمُعَةِ غُسْلَ الْجَنَابَةِ ثُمَّ رَاحَ فَكَأَنَّمَا قَرَّبَ بَدَنَةً، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّانِيَةِ فَكَأَنَّمَا قَرَّبَ بَقَرَةً، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّالِثَةِ فَكَأَنَّمَا قَرَّبَ كَبْشًا أَقْرَنَ، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الرَّابِعَةِ فَكَأَنَّمَا قَرَّبَ دَجَاجَةً، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الْخَامِسَةِ فَكَأَنَّما قَرَّبَ بَيْضَةً، فَإِذَا خَرَجَ الإِمَامُ حَضَرَتِ الْمَلاَئِكَةُ يَسْتَمِعُونَ الذِّكْرَ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 4 باب فضل الجمعة

493. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తిస్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళేవాడికి ఒక పొట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళేవాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడి గ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 4వ అధ్యాయం – ఫజ్లిల్ జుముఆ]

494 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا قُلْتَ لِصَاحِبِكَ يَوْمَ الْجُمُعَةِ أَنْصِتْ، وَالإِمَامُ يَخْطُبُ، فَقَدْ لَغَوْتَ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 36 باب الإنصات يوم الجمعة والإمام يخطب

494. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడిన వారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 36వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్)

495 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ذَكَرَ يَوْمَ الْجُمُعَةِ، فَقَالَ: فيهِ سَاعَةٌ لاَ يُوَافِقُهَا عَبْدٌ مُسْلِمٌ وَهُوَ قَائمٌ يُصَلِّي، يَسْأَلُ اللهَ تَعَالَى شَيْئًا إِلاَّ أَعْطَاهُ إِيَّاهُ وَأَشَارَ بِيَدِهِ يُقَلِّلُهَا
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 37 باب الساعة التي في يوم الجمعة

495. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా గురించి ప్రస్తావిస్తూ ఇలా ప్రవచించారు:- “ఆ రోజు ఓ ప్రత్యేక (శుభ) ఘడియ ఉంది. ఆ ఘడియలో ఎవరైనా ముస్లిం నమాజు స్థితిలో అల్లాహ్ ను ఏదైనా వేడుకుంటే అల్లాహ్ అతని కోరికను తప్పకుండా తీర్చుతాడు.” దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సంగతి చెబుతూ “ఆ ఘడియ అతి స్వల్పంగా ఉంటుంది” అని చేత్తో సైగ చేశారు.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 37వ అధ్యాయం – అస్సా అతిల్లతీ ఫీయౌమిల్ జుముఅ]

496 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: نَحْنُ الآخِرُونَ السَّابِقُونَ يَوْمَ الْقِيَامَةِ، بَيْدَ كُلُّ أُمَّةٍ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِنَا، وَأُوتينَا مِنْ بَعْدِهِمْ؛ فَهذَا الْيَوْمُ الَّذي اخْتَلَفُوا فِيهِ؛ فَغَدًا لِلْيَهُودِ، وَبَعْدَ غَدٍ لِلنَّصَارَى
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 54 باب حدثنا أبو اليمان

496. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ప్రపంచంలో మనం యావత్తు అనుచర సమాజాల కంటే వెనుక వచ్చాము. అయితే ప్రళయదినాన మనం అందరికన్నా మించిపోతాము. మనకు పూర్వమే యావత్తు అనుచర సమాజాలకు (దైవ) గ్రంధం లభించింది. మనకు వారి తరువాత లభించింది. (అంటే వారు గతంలోనికి పోయారు. మనం వారి వెనుక ఉన్నాం) కాని ఈ రోజు (అంటే శుక్రవారం) విషయంలో వారు దైవాజ్ఞ పాటింపుతో విభేదించారు. (అంచేత ఈ శుభదినం మనకు లభించింది. ఈ కారణంగానే మనం ప్రళయ దినాన వారిని మించిపోతాము) రేపటి దినం (శనివారం) యూదులకు లభించింది. ఎల్లుండి దినం (ఆదివారం) క్రైస్తవులకు లభించింది.”

[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్]

497 – حديث سَهْلٍ، قَالَ: مَا كُنَّا نَقِيلُ وَلاَ نَتَغَدَّى إِلاَّ بَعْدَ الْجُمُعَةِ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 40 باب قول الله تعالى: (فإِذا قضيت الصلاة فانتشروا في الأرض)

497. హజ్రత్ సహల్ (రదియల్లాహు అన్హు) కథనం:- “మేము (దైవప్రవక్త కాలంలో) శుక్రవారం రోజు నమాజుకు పూర్వం అన్నం తినడం గాని, విశ్రాంతి తీసుకోవడం గాని చేసే వాళ్ళము కాము. నమాజు ముగించిన తరువాతనే ఈ పనులు చేసే వాళ్ళం.”

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 40వ అధ్యాయం – ఖాలల్లాహుతాలా ఫయిజా ఖుజియతిస్సలాతు ఫన్తషిరూ ఫిల్ అర్జ్)

498 – حديث سَلَمَةَ بْنِ الأَكْوَعِ قَالَ: كُنَّا نُصَلِّي مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْجُمُعَةَ ثُمَّ نَنْصَرِفُ وَلَيْسَ لِلْحِيطَانِ ظِلٌّ نَسْتَظِلُّ فِيهِ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 35 باب غزوة الحديبية

498. హజ్రత్ సలమా బిన్ అక్వా (రదియల్లాహు అన్హు) కథనం:- శుక్రవారం రోజు మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి నమాజు చేశాక ఇండ్లకు తిరిగి వస్తున్నప్పుడు గోడలు మేము ఆశ్రయం పొందే అంత నీడలు ఇచ్చేవి కావు. (సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 35వ అధ్యాయం – గజ్వతుల్ హుదైబియా)

499 – حديث ابْنِ عُمَرَ قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ قَائمًا، ثُمَّ يَقْعُدُ، ثُمَّ يَقُومُ، كَمَا تَفْعَلُونَ الآنَ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 27 باب الخطبة قائما

499. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిలబడి (జుమా) ప్రసంగం చేసేవారు. మధ్యలో కాసేపు కూర్చుంటారు. తర్వాత తిరిగి లేచి మీరీనాడు ప్రసంగిస్తున్నట్లే నిలబడి ప్రసంగించేవారు. (సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 27వ అధ్యాయం – అల్ ఖుత్బతి ఖాయిమా)

500 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: بَيْنَمَا نَحْنُ نُصَلِّي مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذْ أَقْبَلَتْ عيرٌ تَحْمِلُ طَعَامًا، فَالْتَفَتُوا إِلَيْهَا، حَتَّى مَا بَقِيَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلاَّ اثْنَا عَشَرَ رَجُلاً، فَنَزَلَتْ هذِهِ الآيَةُ (وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انْفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائمًا)
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 38 باب إذا نفر الناس عن الإمام في صلاة الجمعة فصلاة الإمام ومن بقى جائزة

500. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక (జుమా) నమాజు చేస్తుంటే, ఆహారధాన్యాలు తీసుకొని ఒక వర్తక బిడారం (నగరానికి) వచ్చింది. దాంతో చాలా మంది జనం దానివైపు దృష్టి మరల్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు పన్నెండుమంది మాత్రమే (మస్జిదులో) ఉండిపోయారు. ఆ సందర్భంలో “వ ఇజా రఔ తిజారతన్ ఔ లహ్ వానిన్ ఫజూ ఇలైహా వతర కూక ఖాయిమా” (వారు వ్యాపారం, వినోదం, తమాషా జరుగుతుంటే చూసి నిన్ను ఒంటరిగా వదిలేసి అటువైపు పరుగెత్తారు” అనే (జుమా సూరాలోని) సూక్తి అవతరించింది.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 38వ అధ్యాయం – ఇజానఫరన్నాసు అనిల్ ఇమామి ఫీ సలాతిల్ జుముఆ]

501 – حديث يَعْلَى بْنِ أُمَيَّةَ رضي الله عنه، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ عَلَى الْمِنْبَرِ (وَنَادَوْا يَا مَالِكُ)
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 7 باب إذا قال أحدكم آمين والملائكة في السماء

501. హజ్రత్ యాలబిన్ ఉమయ్య (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (శుక్రవారం రోజు) “వ నాదవ్ యా మాలికు లియఖ్జి అలైనా రబ్బుక్’ (జుఖ్రుఫ్ సూరా –77వ సూక్తి) అనే సూక్తి పఠిస్తుంటే నేను విన్నాను.

[సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బదాయిల్ ఖల్ఖ్ , 7వ అధ్యాయం – ఇజా ఖాల అహదుకుమ్ ఆమీని…]

502 – حديث جَابِرٍ قَالَ: دَخَلَ رَجُلٌ يَوْمَ الْجُمُعَةِ وَالنَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ فَقَالَ: أَصَلَّيْتَ قَالَ: لاَ، قَالَ: فَصَلِّ رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 33 باب من جاء والإمام يخطب صلى ركعتين خفيفتين

502. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ సారి శుక్రవారం రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం ఇస్తుంటే, ఒక వ్యక్తి అప్పుడే మస్జిదులోనికి ప్రవేశించాడు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అతడ్ని ఉద్దేశించి “నీవు నమాజు చేశావా?” అని అడిగారు. దానికా వ్యక్తి చేయలేదన్నాడు. “అయితే ముందు రెండు రకాతులు (నఫిల్) నమాజు చెయ్యి” అని అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 33వ అధ్యాయం – మన్ జా అవల్ ఇమామి యఖ్ తుబు సలారకాతైని ఖఫీఫతైన్]

503 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَهُوَ يَخْطُبُ: إِذَا جَاءَ أَحَدُكُمْ وَالإِمَامُ يَخْطُبُ أَوْ قَدْ خَرَجَ فَلْيُصَلِّ رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 25 باب ما جاء في التطوع مثنى مثنى

503. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం ఇస్తూ “ఇమామ్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు” లేక ఉపన్యాసం ఇవ్వడానికి ఉపక్రమించినపుడు ఎవరైనా వస్తే అతను (ముందుగా) రెండు రకాతులు (నఫిల్) నమాజు చేయాలి” అని అన్నారు.* [సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజుద్, 25వ అధ్యాయం – మాజాఆ ఫిత్తత్వా మన్నామన్నా]

504 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ فِي الْجُمُعَةِ، فِي صَلاَةِ الْفَجْرِ، آلَم تَنْزيلُ، السَّجْدَةَ، وَهَلْ أَتَى عَلَى الإِنْسَانِ أخرجه البخاري في، 11 كتاب الجمعة: 10 باب ما يقرأ في صلاة الفجر يوم الجمعة

504. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- శుక్రవారం రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫజ్ర్ నమాజులో సజ్దా దహర్ సూరాలు పఠించేవారు. [సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 10వ అధ్యాయం – మాయఖ్రావు ఫీసలాతిల్ ఫజ్రి యౌముల్ జుముఆ]

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1.7 నమాజు ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

213 – حديث ابْنِ عُمَرَ كَانَ يَقُولُ: كَانَ الْمُسْلِمُونَ حِينَ قَدِمُوا الْمَدِينَةَ يَجْتَمِعُونَ فَيَتَحيَّنُونَ الصَّلاَةَ، لَيْسَ يُنَادَى لَهَا؛ فَتَكَلَّمُوا يَوْمًا فِي ذَلِكَ، فَقَالَ بَعْضُهُمْ اتَّخِذُوا نَاقُوسًا مِثْلَ نَاقُوسِ النَّصَارَى، وَقَالَ بَعْضُهُمْ: بَلْ بُوقًا مِثْلَ بُوقِ الْيَهُودِ؛ فَقَالَ عُمَرُ رضي الله عنه: أَوَلاً تَبْعَثُونَ رَجُلاً يُنَادِي بِالصَّلاَةِ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَا بِلاَلُ قُمْ فَنَادِ بِالصَّلاَةِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 1 باب بدء الأذان

213. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ముస్లింలు మదీనా వచ్చిన తరువాత ప్రారంభంలో నమాజు కోసం అజాన్ చెప్పే సంప్రదాయం ఉండేది కాదు, నిర్ణీత వేళకు ప్రజలు తమంతట తామే (మస్జిద్ లో) గుమిగూడి నమాజు చేసుకునేవారు. కొన్నాళ్ళ తరువాత ఓ రోజు ముస్లింలు దీన్ని గురించి పరస్పరం సంప్రదించుకోవడానికి సమావేశమయ్యారు. అప్పుడు కొందరు తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ “క్రైస్తవుల మాదిరిగా ఒక గంట ఏర్పాటు చేసుకొని మోగించాల’ని అన్నారు. మరి కొందరు యూదుల మాదిరిగా శంఖం ఊదాలని అన్నారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ, “మనం నమాజు ప్రకటన కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎందుకు నియమించుకోకూడదు?” అని అన్నారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సలహా విని హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)తో “లే, లేచి నమాజు కోసం ప్రకటన చెయ్యి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 1వ అధ్యాయం – బయీల్ అజాన్]

డెబ్బై యేళ్ళ క్రితం ఒక రాయిని నరకంలో పడవేయటం జరిగింది …

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారు చేసిన కథనం: ఒకసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంటఉండగా ఏదో వస్తువు క్రింద పడ్డట్టు పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడాయన మమ్మల్ని ఉద్దేశించి, "ఇప్పుడు మీకు వినపడిన శబ్దం ఏమిటో తెలుసా?”అని అడిగారు. మేము,“అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు“ అని అన్నాం. “డెబ్బై యేళ్ళ క్రితం ఒక రాయిని నరకంలో పడవేయటం జరిగింది. ఇప్పటివరకూ అది నరకం(కూపం)లో పడుతూనే ఉంది. ఇప్పుడే దాని అడుగు భాగానికి చేరుకుంది. ఇప్పుడు వినపడిన పెద్ద శబ్దం అదే!“ అని అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (సహీహ్ ముస్లింలోని స్వర్గ సుఖాల ప్రకరణం) [రియాదుస్సాలిహీన్ : హదీస్ నెంబర్: 405] ముఖ్యాంశాలు: 1. నరక కూపమే డెబ్బై సంవత్సరాల లోతు ఉందంటే, అక్కడి శిక్ష ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించండి 2. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల మహిమ వెల్లడౌతోంది. దైవప్రవక్తతో పాటు వాళ్ళు కూడా నరకంలో రాయి పడిన శబ్దం విన్నారు 3. మానవులు అత్యంత బాధాకరమైన నరక శిక్షకు భయపడి చెడు ఆలోచనలకు, చెడు చేష్టలకు దూరంగా ఉండాలన్నదే ఈ హదీసు ఉద్దేశ్యం

భర్తకు అవిధేయత చూపించే స్త్రీలకు హితబోధ

బిస్మిల్లాహ్

عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اللهِ – صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ :
«اثْنَانِ لَا تُجَاوِزُ صَلَاتُهُمَا رُؤُوسَهُمَا: عَبْدٌ أَبَقَ مِنْ مَوَالِيهِ حَتَّى يَرْجِعَ، وَامْرَأَةٌ عَصَتْ زَوْجَهَا حَتَّى تَرْجِعَ»
[رواه الطبراني في”المعجم الأوسط“ (٣٦٢٨)، و”المعجم الصغير “ (٤٧٨) بإسناد جيد؛ والحاكم في ”المستدرك على الصحيحين“ (٧٣٣٠)؛ وصححه الألباني في”صحيح الترغيب والترهيب“ (١٨٨٨)]

ఇబ్నె ఉమర్ (రజియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: అల్లాహ్ యొక్క సందేశ హరులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

“ఇద్దరి వ్యక్తుల యొక్క నమాజులు వారి యొక్క తలలను మించిపోవు (అనగా స్వీకరించబడవు) :(1) తన యజమాని నుండి పారిపోయిన బానిస మరల తిరిగి వచ్చేంత వరకు అతని నమాజు స్వీకరించబడదు, (2) తమ భర్తకు అవిధేయత చూపించే భార్య, మరల తిరిగి విధేయురాలు అయ్యేంతవరకు ఆమె నమాజు స్వీకరించబడదు”

[ఈ హదీసు ను ఇమాం అత్-తబరానీ “ముఅ్‌జమ్ అల్-ఔస’త్” (3628) లో, మరియు “ముఅ్‌జమ్ అస్సగీర్” (478) లో ఉత్తమమైన పరంపర తో; మరియు ఇమాం హాకిం “అల్-ముస్తద్రక్ అలా సహీహైన్” (7330) లో ఉల్లేఖించారు; మరియు అల్లామహ్ అల్బానీ గారు “సహీహ్ అత్తర్గీబ్ వత్తర్హీబ్” (1888) లో సహీహ్ (ధృఢమైనది) గా ఖరారు చేశారు]

అనువాదం: ముహమ్మద్ అబ్దుల్ బాఖీ ఫారూఖీ
https://teluguislam.net

మూడో అతను మఖం తిప్పుకున్నాడు. అల్లాహ్ కూడా అతని నుండి ముఖం తిప్పుకున్నాడు

బిస్మిల్లాహ్

حَدَّثَنَا إِسْمَاعِيلُ، قَالَ حَدَّثَنِي مَالِكٌ، عَنْ إِسْحَاقَ بْنِ عَبْدِ اللَّهِ بْنِ أَبِي طَلْحَةَ، أَنَّ أَبَا مُرَّةَ، مَوْلَى عَقِيلِ بْنِ أَبِي طَالِبٍ أَخْبَرَهُ عَنْ أَبِي وَاقِدٍ اللَّيْثِيِّ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم بَيْنَمَا هُوَ جَالِسٌ فِي الْمَسْجِدِ وَالنَّاسُ مَعَهُ، إِذْ أَقْبَلَ ثَلاَثَةُ نَفَرٍ، فَأَقْبَلَ اثْنَانِ إِلَى رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم وَذَهَبَ وَاحِدٌ، قَالَ فَوَقَفَا عَلَى رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم فَأَمَّا أَحَدُهُمَا فَرَأَى فُرْجَةً فِي الْحَلْقَةِ فَجَلَسَ فِيهَا، وَأَمَّا الآخَرُ فَجَلَسَ خَلْفَهُمْ، وَأَمَّا الثَّالِثُ فَأَدْبَرَ ذَاهِبًا، فَلَمَّا فَرَغَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏

‏ أَلاَ أُخْبِرُكُمْ عَنِ النَّفَرِ الثَّلاَثَةِ أَمَّا أَحَدُهُمْ فَأَوَى إِلَى اللَّهِ، فَآوَاهُ اللَّهُ، وَأَمَّا الآخَرُ فَاسْتَحْيَا، فَاسْتَحْيَا اللَّهُ مِنْهُ، وَأَمَّا الآخَرُ فَأَعْرَضَ، فَأَعْرَضَ اللَّهُ عَنْهُ ‏”

అబూ ‘వాఖిద్‌ అల్లెతి (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు; ఒకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మసీదులో కూర్చొని ఉన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో పాటు ఇంకా కొందరు కూడా అక్కడ కూర్చోని ఉన్నారు. ఇంతలో ముగ్గురు మనుషులు అక్కడకు వచ్చారు. వారిలో ఇద్దరయితే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు ప్రసంగం వినేందుకు వచ్చారు. మూడో మనిషి అక్కణుంచి వెళ్లిపొయ్యాడు. ఆ ఇద్దరూ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందుకు వచ్చి కొంతసేపు నిలబడ్డారు. అంతలో వారిలో ఒకడు సభలో మధ్యన ఒకచోట కొంచెం ఖాళీ స్థలం ఉండటాన్ని గమనించి అక్కడకు పోయి కూర్చున్నాడు. రెండో అతను సభలో జనం వెనుక భాగంలో కూర్చున్నాడు. మూడో అతను వెనుతిరిగి వెళ్లిపోయాడు. తమ ప్రసంగాన్ని ముగించిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఈ ముగ్గురి వ్యక్తుల గురుంచి మీకు తెలుపనా? ఒకతను ఆ అల్లాహ్‌ శరణు కోరుకున్నాడు; అల్లాహ్‌ అతన్ని కరుణించి అతనికి స్థలాన్ని ప్రసాదించాడు. రెండో అతను సభ లోపలకు చొరబడటానికి పోయి కూర్చోటానికి సిగ్గుపద్డాడు. అల్లాహ్ కూడా అతన్ని చూసి సిగ్గుపడ్డాడు, అతనిపై కృప చూపాడు. మూడో అతను మఖం తిప్పుకున్నాడు. అల్లాహ్ కూడా అతని నుండి ముఖం తిప్పుకున్నాడు.”

సహీహ్ బుఖారి. 3 వ అధ్యాయం “జ్ఞానం”. హదీథ్ నెంబర్:66

చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు

షేఖ్ ముహమ్మద్ బిన్ సాలీహ్ అల్-ఉతైమీన్ [రహిమహుల్లాహ్ ] ఇలా అన్నారు: "చాలా చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు." [రియాద్ అస్-సాలీహీన్ వ్యాఖ్యానం, (1/273) | ఇంగ్లిష్ అనువాదం: అబ్బాస్ అబూ యాహ్యా హఫిజహుల్లాహ్]

ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత [ఆడియో క్లిప్]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (30 సెకండ్లు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


ఫజ్ర్‌ నమాజుకు ముందు రెండు రకాతులు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:

عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا

“ఫజ్ర్‌కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి”. (ముస్లిం 725).

నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండి: ఫజ్ర్‌ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము,బిల్జింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.

నమాజు నిధులు (Treasures of Salah) అను పుస్తకం నుండి


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది; “ఆ రెండు రకాతులు నాకు ప్రపంచమంతటి కన్నా ప్రియమైనవి.”

عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ قَالَ فِي شَأْنِ الرَّكْعَتَيْنِ عِنْدَ طُلُوعِ الْفَجْرِ: «لَهُمَا أَحَبُّ إِلَيَّ مِنَ الدُّنْيَا جَمِيعًا» مسلم 725

 


[ముస్లింల ధార్మిక విశ్వాసం] అల్లాహ్‌ మనల్ని ఎందుకు పుట్టించాడు?

బిస్మిల్లాహ్

1. ప్రశ్న : అల్లాహ్‌ మనల్ని ఎందుకు పుట్టించాడు?

జవాబు:

ఆయన మనల్ని కేవలం తన ఆరాధన కొరకు సృష్టించాడు.

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

నేను జిన్నాతులనూ, మానవులనూ కేవలం నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను.[1]
(సూరా అజ్‌ జారియాత్‌ 51:56)

హదీస్‌ : అల్లాహ్‌కు ఆయన దాసులపై ఉన్న హక్కు ఏమిటంటే, వారు ఆయన్నే ఆరాధించాలి. ఈ ఆరాధనలో మరెవ్వరినీ భాగస్వాములుగా చెయ్యకూడదు. (బుఖారీ, ముస్లిం)


ఈ పోస్ట్ ముస్లింల ధార్మిక విశ్వాసం – జమీల్ జైనూ అను పుస్తకం నుండి తీసుకోబడింది

[1] నోట్స్: ఆహ్సనుల్ బయాన్ నుండి:

మానవులను, జిన్నులను పుట్టించటంలోని తన ఉద్దేశ్యమేమిటో అల్లాహ్ ఈ వాక్యంలో తెలియపరచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులనుగానీ, జిన్నాతులనుగానీ కట్టుబానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్చా స్వాతంత్రాలను హరించ లేదు. ఒకవేళ అదేగనక అయివుంటే మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా  అల్లాహ్ ఆరాధనకు కట్టుబడి ఉండేవారు. కాని అల్లాహ్ వారికి స్వేచ్చను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుకలోని పరమార్ధాన్ని వారికిక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్థాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు.

“నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు”. (సూరా అజ్‌ జారియాత్‌ 51:57)

ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా నా పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో! అదేమీ కాదు. ప్రపంచంలో మీరు కల్పించే చిల్లర దేవుళ్ల లాంటి వాణ్ని కాదు నేను. ఆ మాటకొస్తే భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు నా అధీనంలోనే ఉన్నాయి. నా ఆరాధన వల్ల నా భక్తులకే లాభం చేకూరుతుంది. వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగాని నాకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.


మరింత సమాచారం కోసం క్రింది లింక్ సందర్శించండి:

మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? (The Purpose of Creation)