ఖుత్బా అంశము : రమజాన్ పండుగ గురించి పది ముఖ్య విషయాలు
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటికంటే ఉత్తమమైనమాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తతమైన పద్దతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారిపద్దతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడినవి బిద్అత్ కార్యకలాపాలు. ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది. ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకములోకి తీసుకువెళ్ళేదే.
1. ఓ అల్లాహ్ దాసులరా! అల్లాహ్ తో భయపడవలసిన విధంగా భయపడండి మరియు ఎల్ల వేళలా దైవభీతి కలిగి ఉండండి. ఇస్లాం పై స్థిరంగా ఉండండి. ఆయన మనందరినీ ఈ రమజాన్ చివరి వరకు చేర్చినందుకు అల్లాహ్ కు స్తోత్రాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. అల్లాహ్ సాక్షిగా ఇది ఆయన యొక్క గొప్పవరం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.
وَلِتُكۡمِلُواْ ٱلۡعِدَّةَ وَلِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ
(మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది ఆయన అభిలాష!)
కనుక మనందరము ఈమాసాన్ని పూర్తి చేసుకున్నందుకు గాను అల్లాహ్ ను కీర్తించాలి మరియు కృతజ్ఞతతో ఆయన ఆరాధన చేస్తూ ఉండాలి.
2. ఓ ముస్లింలారా! నిశ్చయంగా అల్లాహ్ వాక్కు సత్యమైనది. (రమజాన్ కేవలం లెక్కించ బడిన దినాలే ) ఆ పగలు రాత్రి ఎంత వేగంగా గడిచి పోయాయో, అసలు ఎలా గడిచిపోయాయో మీకు తెలుస్తుందా?
3. ఓ విశ్వాసులారా! పూర్తి రమజాన్ ను పొందినందుకు మరియు అందులో ఉపవాసాలు పాటించినందుకు మీకు అభినందనలు. మరియు ఈ రమజాన్ రాత్రులలో మేల్కొని ఆరాధనలు చేసినందుకు మీకు అభినందనలు. ఎందుకంటే ఎంతో మంది ఈ రమజాన్ మాసం రాక మునుపే వెళ్లిపోయారు. ఈ రమజాన్ చివరి దశను కూడా పొందలేక పోయారు. ఆయన తన వరాల జల్లును తన అనుగ్రహాలను మనపై కరిపించినందుకు వేయి నూళ్ళ కోటానుకోట్ల స్తుతులూ స్తోత్రాలు తెలియ చేస్తున్నాను.
4. ఓ ముస్లింలారా! మీ అందరికీ ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇస్లాం మూలస్తంభాలలో ఒకటైన ఈ ఉపవాసాలు పూర్తి చేసుకున్నందుకు గాను నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అల్లాహ్ యొక్క గొప్పదనాన్ని కొనియాడుతూ ఉండండి. ఆయన ఏకత్వాన్ని గురించి చాటి చెప్పండి. అల్లాహ్ పట్ల దృఢమైన నమ్మకాన్ని కలిగి ఈ రమజాన్ లో మీ సత్కార్యాలను రెట్టింపు అయ్యి ఉండవచ్చు, పాపాలు క్షమించబడవచ్చు మరియు మీ అంతస్తులు కూడా పెంపొందించవచ్చు.
5. అల్లాహ్ దాసులారా! సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క వివేకం ఏమిటంటే ఆయన రెండు గొప్ప సందర్భాల తర్వాత మన కొరకు రెండు పండుగలను ప్రసాదించాడు. ఒకటి ఉపవాసాలు ముగించుకున్న తర్వాత రంజాన్ పండుగ. రెండు హజ్జ్ పూర్తి చేసుకున్న తర్వాత బక్రీద్ పండుగ జరుపుకుంటాము. మన ఈ పండుగలలో ఎన్నో గొప్ప ఆరాధనలు ఉన్నాయి – నమాజ్, రోజా, జిక్ర్, ఖుర్బానీ, ఫిత్రా దానం మొదలైనవి.
అంతేకాదు ఈ శుభసందర్భంలో బంధుత్వ సంబంధాలు పెరుగుతాయి. బంధుమిత్రుల కలయిక జరుగుతుంది. ఒకరినొకరు ప్రేమానురాగాలతో కలుసుకుంటారు, ఒకరి పట్ల మరొకరు మన్నింపుల వైఖరి అవలంభిస్తారు మరియు కుళ్ళు కుతంత్రాలు, ఈర్షద్వేషాలు అన్నింటిని మరిచిపోయి అందరూ కలిసిమెలిసిపోతారు. ఒకవేళ మనలో ఎవరైనా ఈ విధంగా సంబంధాలు తెంపుకొని ఉంటే వారు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరికొత్త రీతిలో సంబంధాలను బలపరచుకొని సంతోషాలను పంచాలి.
6. ఓ విశ్వాసులారా! బహుదైవారాలకులు మరియు అన్యమతస్తుల దేశాలలో కనిపించని మన ఈ స్వచ్ఛమైన పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. వారి పండుగలలో పాపము మరియు అల్లాహ్ అవిధేయత తప్ప మరి ఏమీ కానరావు. ఈ విధమైన దురాచరణల ద్వారా వారు అల్లాహ్ తో దూరం పెంచుకుంటున్నారు.
అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క ఈ కారుణ్యం పట్ల సంతోషంగా ఉండండి ఎందుకంటే అల్లాహ్ ఇలాఅంటున్నాడు
[قُلۡ بِفَضۡلِ ٱللَّهِ وَبِرَحۡمَتِهِۦ فَبِذَٰلِكَ فَلۡيَفۡرَحُواْ هُوَ خَيۡرٞ مِّمَّا يَجۡمَعُونَ]
(ఇలా అను: ఇది అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దాని కంటే ఎంతో మేలైనది.)
7. ఓ ముస్లింలారా పండుగపూట అందంగా తయారవ్వండి మరియు సుగంధం పరిమళాలను పూసుకోండి మరియు ఇతరులకు కూడా పూయండి. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) గారు ఇలాతెలియజేస్తున్నారు “నేను అహ్లె ఇల్మ్ (పండితుల) ద్వారా విన్నాను. వారు తప్పనిసరిగా ప్రతి పండుగ రోజున అందంగా తయారై సుగంధ పరిమళాలను పూసుకునేవారు”.(షరహ్ బుఖారి లిఇబ్నె రజబ్ 68/6)
8. ఓ విశ్వాసులారా! ఈ పండుగ రోజున మన ఇళ్ల ద్వారాలతో పాటు మన హృదయాల ద్వారాలను కూడా తెరిచి ఉంచండి, ఒకరి కొరకు మరొకరు తప్పక దుఆ చేయండి. అల్లాహ్ తఆలా అందరి సత్కర్మలను స్వీకరించుగాక. మరియు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోండి. మన సహాబాలు కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకునేవారు. ఇలా అనేవారు
(تقبل الله منا ومنكم)
అల్లాహ్ మా సత్కార్యాలను మరియు మీ సత్కార్యాలను స్వీకరించుగాక!
9. ఓ ముస్లింలారా! గడిచిపోయిన పొరపాట్లను మన్నించడం విధేయత యొక్క గొప్ప చర్యలలో ఒకటి. అల్లాహ్ వద్ద దీనికొరకు గొప్ప ప్రతిఫలం ఉంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
[فَمَنۡ عَفَا وَأَصۡلَحَ فَأَجۡرُهُۥ عَلَى ٱللَّهِۚ]
(కానీ ఎవరైనా క్షమించి సంధి చేసుకుంటే అతని ప్రతి ఫలం అల్లాహ్ దగ్గర ఉంది)
అల్లాహ్ వద్ద ప్రతిఫలం ఉందంటే వాస్తవంగా ఈ పని ఎంతోగొప్పది అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది.
ఓ విశ్వాసులారా! హృదయాలను పరిశుభ్రపరచుకోండి. ఇది కూడా ఒక గొప్ప ఆచరణ. దీని కొరకు కూడా మంచి సాఫల్యం ఉంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
[قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا٩ وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا]
(వాస్తవానికి తన ఆత్మను శుద్దపరచుకున్నవాడే సఫలుడౌతాడు మరియు వాస్తవానికి దానిని అణగద్రొక్కిన వాడే విఫలుడౌతాడు)
అల్లాహ్ దాసులారా! సంతోషాన్ని కలుగజేసేటువంటి పనులలో ఒకటి సంబంధాలను కలుపుకోవడం. సంవంత్సరం మొత్తంలో మనిషి మనసులో ఉండేటువంటి ఈర్ష ద్వేషాల నుండి మనిషి తన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలి. ఆవ్యక్తి కొరకు శుభవార్త ఉంది ఎవరైతే ఈ పండుగ రోజున సద్వినియోగం చేసుకుని తెగిపోయినటువంటి బంధాలను కలుపుకుంటాడో మరియు విరిగిన హృదయాలను కలుపుతాడో. దానివలన కుటుంబంలో ఏర్పడిన కలహాలు దూరమైపోతాయి కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.
ఓ అల్లాహ్! సమస్త ప్రశంసలు మరియు సకల ఆరాధనలు అన్నీ కూడా నీకే శోభిస్తాయి. నీ కారుణ్యంతో మమ్మల్ని అందరినీ ఈ రమజాన్ మాసం చివరి వరకు చేర్చి పండుగను మాకు ప్రసాదించావు. ఓ అల్లాహ్ నీకు విధేయత చూపడంలో మాకు సహాయం చేయి. ఓ అల్లాహ్ మాకు నీ ప్రేమని ప్రసాదించు మరియు నీకు దగ్గర చేసేటువంటి ప్రతి పనిపై మాకు ప్రేమను ప్రసాదించు. ఓ అల్లాహ్! మేము మా పాప క్షమాపణ గురించి నిన్ను వేడుకుంటున్నాము. నిశ్చయంగా నువ్వు ఎంతో క్షమాగుణం కలవాడవు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
10. ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ మిమ్మల్ని కరుణించుగాక. మీరు తెలుసుకోండి. అన్నిటికంటే గొప్ప ఆనందం అల్లాహ్ ను కలిసి ఆయన దగ్గర నుండి మనం చేసినటువంటి సత్కార్యాల ప్రతిఫలం పొందేటప్పుడు లభించేది.
అల్లాహ్ తఆల స్వర్గవాసులతో ఇలా అంటాడు “ఓ స్వర్గ వాసులారా! అప్పుడు స్వర్గవాసులు ఇలా సమాధానం ఇస్తారు – ఓ అల్లాహ్ మేము నీ సన్నిధిలో హాజరయ్యాము. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు – మీరు సంతోషంగా ఉన్నారా! అప్పుడు వారు అంటారు- ఎందుకు కాదు అల్లాహ్! మీరు ఈ సృష్టిలో ఎవరికీ ప్రసాదించనివి మాకు ప్రసాదించారు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు- ఏమిటి దాని కంటే ఉత్తమమైనటువంటి దానిని మీకు ప్రసాదించనా! స్వర్గ వాసులు ఇలా ఉంటారు – ఓ మా ప్రభువా! దీనికంటే మేలైనది ఇంకేం ఉంటుంది. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు- ఇప్పటి నుండి నేను శాశ్వతంగా మీ పట్ల ఇష్టుడనయ్యాను ఇక ఎప్పటికీ మీపై కోపంగా ఉండను.(బుఖారి 6549 – ముస్లిం 2829)
11. ఓ విశ్వాసులారా! ఈ రమజాన్ మాసము సంస్కరణ కోసం అల్లాహ్ తో సంభందాన్ని దృడపరచుకోవడానికి అతి గొప్ప అవకాశం కనుక మీరందరూ కూడా ఆరాధనలో నిమగ్నమై ఉండండి ఎందుకంటే ఆరాధన రమజాన్ తో ముగిసిపోదు, మనిషి మరణం వరకు కూడా సదా చరణ చేస్తూఉండాలి అల్లాహ్ ఇలా అంటున్నాడు
[وَٱعۡبُدۡ رَبَّكَ حَتَّىٰ يَأۡتِيَكَ ٱلۡيَقِينُ]
(మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాదిస్తూఉండు)
ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు:
అల్లాహ్ వద్ద అన్నిటికంటే ఇష్టమైనటువంటి ఆచరణ ఎల్లకాలం చేస్తూ ఉండేటువంటిది అది ఎంతచిన్న ఆచరనైనా సరే. (బుఖారి 5861)
ఓ ముస్లింలారా! రమజాన్ తర్వాత సదాచరణపై స్థిరంగా ఉండటం ఇది అల్లాహ్ వద్ద ఆచరణ స్వీకారయోగ్యం పొందడానికి సూచన. దీనికి వ్యతిరేకంగా కేవలం రమజాన్ లో మాత్రమే చేసి మిగతా రోజుల్లో మానుకోవడం ఇది అజ్ఞానము. అల్లాహ్ యొక్క భాగ్యం నుంచి దూరం అవడానికి ఒక సూచన. ఎందుకంటే రమజాన్ ప్రసాదించిన ప్రభువే మిగతా నెలలు కూడా మనకు ప్రసాదించాడు. ఒక వ్యక్తి గురించి సలఫ్ ను ఈ విధంగా అడగడం జరిగింది. ఎవరైతే కేవలం రమజాన్ లో మాత్రమే ప్రార్థన చేస్తాడో మరియు ఇతర దినాలలో ఆరాధనను వదిలిపెడతాడో ఆ వ్యక్తి గురించి చెప్పండి? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు – ఆ వ్యక్తి లేక ఆ జాతి చెడ్డది ఎవరైతే కేవలం అల్లాహ్ ని రమజాన్ లోనే గుర్తు చేసుకుంటారో.
ఓ విశ్వాసులారా! ముస్లింల యొక్క ఒక ఉత్తమ గుణం ఏమిటంటే వారు విధేయతా పరులై ఉంటారు. విధేయత అంటే ఆరాధనపై స్థిరంగా ఉండటమే. అల్లాహ్ విధేయత చూపేవారి గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
[إِنَّ ٱلۡمُسۡلِمِينَ وَٱلۡمُسۡلِمَٰتِ وَٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ وَٱلۡقَٰنِتِينَ وَٱلۡقَٰنِتَٰتِ وَٱلصَّٰدِقِينَ وَٱلصَّٰدِقَٰتِ وَٱلصَّٰبِرِينَ وَٱلصَّٰبِرَٰتِ وَٱلۡخَٰشِعِينَ وَٱلۡخَٰشِعَٰتِ وَٱلۡمُتَصَدِّقِينَ وَٱلۡمُتَصَدِّقَٰتِ وَٱلصَّٰٓئِمِينَ وَٱلصَّٰٓئِمَٰتِ وَٱلۡحَٰفِظِينَ فُرُوجَهُمۡ وَٱلۡحَٰفِظَٰتِ وَٱلذَّٰكِرِينَ ٱللَّهَ كَثِيرٗا وَٱلذَّٰكِرَٰتِ أَعَدَّ ٱللَّهُ لَهُم مَّغۡفِرَةٗ وَأَجۡرًا عَظِيمٗا]
(నిశ్చయంగా ముస్లిం పురుషులు – ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు – విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు- విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు – సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు – సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు – అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు – దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు – ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు – కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.)
12. ఓ అల్లాహ్ దాసులారా! రమజాన్ తర్వాత షవ్వాల్ నెల యొక్క ఆరు ఉపవాసాలు ఉండటం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ వారి సాంప్రదాయం. అల్లాహ్ దీని కొరకు గొప్ప ప్రతిఫలం ఉందని వాగ్దానం చేశాడు.
అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ గారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే రమజాన్ యొక్క ఉపవాసాలు ఉంటారో మరియు ఆతర్వాత షవ్వాల నెల యొక్క ఆరు ఉపవాసాలు ఉంటారో వారు పూర్తి సంవత్సరం యొక్క ఉపవాసాలు ఉన్నట్లే” (ముస్లిం-1164)
ఈ ఆరు ఉపవాసాలు ప్రసాదించడానికి గల కారణం ఏమిటంటే రంజాన్ యొక్క విధి చేయబడినటువంటి ఉపవాసాలలో ఏదైనా లోపం ఉండి ఉంటే ఈ నఫీల్ ఉపవాసాల ద్వారా అవి చెరిగిపోతాయి. ఎందుకంటే ఉపవాసి ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు అతనితో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుంది కనుక ఈ ఉపవాసాలు ఆ సమయంలో ఏర్పడినటువంటి ఆ యొక్క కొరతని పూర్తి చేస్తాయి.
పండుగ గురించి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. కనుక ఒక విశ్వాసి రంజాన్ పండుగ సందర్భంగా వీటిని గుర్తు పెట్టుకోవాలి మరియు వాటిపై ఆచరించాలి. కేవలం వాటిని ఒక రివాజుగా భావించి వదిలి పెట్ట కూడదు.
ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.
ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు. మాకు మోక్షాన్ని ప్రసాదించు.
ఓ అల్లాహ్! మాకు స్వర్గాన్ని ప్రసాదించు మరియు ఫిర్దౌస్ యొక్క వారసులుగా చేయు మరియు ఎటువంటి లెక్కాపత్రం లేకుండా మరియు శిక్ష లేకుండా మమ్మల్ని స్వర్గంలోకి ప్రవేశింపచేయి.
ఓ అల్లాహ్! నువ్వు కరుణామయుడవు, కృపాశీలుడవు. మమ్మల్ని మా పాపాల నుండి పరిశుభ్రం చేయి, ఏ విధంగా అయితే తల్లి గర్భంలో నుండి వచ్చామో ఆ విధంగా మమ్మల్ని పరిశుభ్రపరుచు.
ఓ అల్లాహ్! మా అందరి ఈ సమావేశాన్ని స్వీకరించి మాకు పాపక్షమాపణ కలుగచేయి. మా ఆచరణలను స్వీకరించు.
ఓ అల్లాహ్! మా దేశంలో మరియు ముస్లిం దేశాలన్నింటిలో శాంతి భద్రతలను ప్రసాదించు.
ఓ అల్లాహ్! రమజాన్ తర్వాత కూడా సదాచరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు, నీకు విధేయత చూపే వారిగా చేయి, మరియు ఇలాంటి వరాల వసంతాలను మా జీవితంలో మరెన్నో ప్రసాదించు.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ
—
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి
పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

You must be logged in to post a comment.