అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని, ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా (వసీలాగా) మనం పెట్టుకోవచ్చు? [మరణానంతర జీవితం – పార్ట్ 17] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని, ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు?
[మరణానంతర జీవితం – పార్ట్ 17] [25 నిముషాలు]
https://www.youtube.com/watch?v=x27-UYBIOU4
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద అమ్మాబాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు.

అయితే మహాశయులారా మన అంశం మరణానంతర జీవితం. మనం సీరియల్ వారీగా పరలోకంలో ఏ ఏ మజిలీలు ఉన్నాయి, ఏ ఏ విషయాలు సంభవిస్తాయి వాటి గురించి వింటూ వస్తున్నాము.అయితే అల్లాహుతాలా తీర్పు గురించి రావడంలో ఏదైతే చాలా ఆలస్యం జరుగుతుందో ఆ దీర్ఘ సమయాన్ని ప్రజలు భరించలేక సిఫారసు గురించి ఏదైతే ప్రవక్తల వద్దకు వెళ్తారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చివరికి వస్తారు. ఆ విషయాలు వింటూ ఉన్నాము కానీ సిఫారసుకు సంబంధించిన విషయం చాలా ముఖ్య విషయం.

ఆ రోజు ఇంకా ఎన్ని రకాల సిఫారసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పొందడం చాలా ముఖ్యము గనుక, దానికి సంబంధించిన ఒక భాగం అంటే ఇహలోకంలో సిఫారసుకు సంబంధించిన ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని మనం దూరం చేసుకొని సరైన విశ్వాసాన్ని, సరైన సిఫారసు వివరాల్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అందుగురించి మనం మనం అసలైన మన అంశాన్ని విడిపోయాము అని ఏమాత్రం భావించకండి. అయితే మహాశయులారా మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు అల్లాహ్ తో దుఆ చేసే సందర్భంలో ఎవరినైనా మధ్యవర్తిత్వంగా వసీలాగా పెట్టుకోవడం ఎంతవరకు యోగ్యం.

అయితే దుఆ చేస్తున్నప్పుడు స్వయంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క శుభ నామాలను, ఆయన యొక్క ఉత్తమ గుణాలను మనం వసీలాగా (మధ్యవర్తిత్వంగా) పెట్టుకొని దుఆ చేయడం. ఇది చాలా దుఆ స్వీకరించబడడానికి ఉత్తమ మార్గం. అల్లాహుతాలా సూరె ఆరాఫ్ లో, వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా. అల్లాహ్ కు చాలా ఉత్తమమైన సుందర నామములు ఉన్నాయి. మీరు వాటి ఆధారంగా ఆ నామముల వసీలాతో దుఆ చేయండి.

మరియు సహీ హదీద్ లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లోనే ఉన్నారు. ఒక వ్యక్తి నమాజ్ చేశాడు. చివరిలో దుఆ ఏం చేశాడు? అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బి అన్నక అంతల్లాహ్ అల్ అహద్ అస్సమద్ అల్లదీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్ అంతగ్ఫిరలీ. అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను ప్రస్తావించి దుఆ చేస్తూ, ఓ అల్లాహ్ నా యొక్క పాపాల్ని క్షమించు అని వేడుకున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక, ఓ అల్లాహ్ నేను నీతో ప్రశ్నిస్తున్నాను, నీతో అడుగుతున్నాను, నీతో కోరుతున్నాను. మరియు దీనికై బి అన్నక అంతల్ అహద్ అస్సమద్ అల్లదీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్ అతని నామాలను, గుణాలను అన్నిటిని పేర్కొన్నాడు. ఏదైతే సూరె ఇఖ్లాస్ లో వచ్చి ఉందో. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. ఇప్పుడు ఇతను ఏ దుఆ చేసినా గాని అంగీకరింపబడుతుంది.

ఈ విధంగా అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలను, ఉత్తమ గుణాలను ప్రస్తావించి వాటి యొక్క ఆధారంగా దుఆ చేయడం చాలా మంచి విషయం. అల్లాహ్ కు ఇష్టమైన విషయం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇది ఎంతో ఇష్టమైన మార్గం.

ఇక రెండవ రకం. మనం ఏ విశ్వాసాన్ని అవలంబించామో, ఏ సత్కార్యాలు చేస్తున్నామో ఆ విశ్వాసాన్ని, ఆ సత్కార్యాల్ని ఆధారంగా పెట్టుకొని వాటి యొక్క వసీలాతో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో దుఆ చేయడం. దీని ప్రస్తావన కూడా ఖురాన్ లో ఉంది, హదీద్ లో ఉంది.

ఖురాన్ లో ఎన్నో దుఆలు ఈ విధంగా మనకు నేర్పబడ్డాయి. రబ్బనా ఇన్ననా ఆమన్నా ఓ మా ప్రభువా మేము విశ్వసించాము. ఫగ్ఫిర్లనా ఇప్పుడు ఈ విశ్వాస ఆధారంతో దుఆ చేస్తున్నాము. కనుక నీవు మమ్మల్ని క్షమించు. మమ్మల్ని మన్నించు. మా పాపాలను ప్రక్షాళనం చెయ్.

మరి ఇబ్రాహీం, ఇస్మాయిల్ అలైహిమస్సలాం వారి యొక్క దుఆలు సూరె బకరాలో కూడా తెలపబడ్డాయి. ఎక్కడైతే వారు అల్లాహ్ యొక్క గృహం కాబతుల్లాహ్ ను నిర్మిస్తారో ఆ సందర్భంలో. వఇద్ యర్ ఫవు ఇబ్రాహీముల్ ఖవాఇద మినల్ బైతి వ ఇస్మాయిల్. ఎప్పుడైతే ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిముస్సలాం కాబా యొక్క పునాదుల మీద ఆ గృహాన్ని నిర్మించారో, రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్సమీవుల్ అలీమ్. కాబా గృహం యొక్క నిర్మాణం ఎంతో గొప్ప పుణ్యం కదా? దాన్ని మరియు అల్లాహ్ యొక్క సుందర నామాలను ప్రస్తావించి దుఆ చేస్తున్నారు.ఓ అల్లాహ్ మా ఈ కృషిని నీవు స్వీకరించు. నిశ్చయంగా నీవే వినేవాడివి. మరియు నీవు సర్వజ్ఞానివి.

ఇంకా ఈసా అలైహిస్సలాం వారిని విశ్వసించిన వారి ప్రస్తావనలో, మూసా అలైహిస్సలాం వారిని విశ్వసించిన వారి ప్రస్తావనలో, నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావనలో, ఇలాంటి ఖురాన్ లో ఎన్నో దుఆలు ఉన్నాయి. అక్కడ విశ్వాసాన్ని కొన్ని సత్కార్యాలను పురస్కరించుకొని వాటిని ప్రస్తావించి వాటి ఆధారంగా, వాటి వసీలాతో దుఆ చేయడం అనేది నేర్పడం జరిగింది.

మరియు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు కొన్ని హదీస్ లలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు సహీ బుఖారీలోని చాలా ప్రఖ్యాతి గాంచిన గుహలో ఇరుక్కుపోయిన ముగ్గురి సంఘటనలో కూడా ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీకంటే ముందు ఉన్న వారిలో ముగ్గురు ఒక దారిన వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ వర్షం మొదలై కుండపోత వర్షం కురవడం మొదలైంది. వారు వర్షం నుండి రక్షణ పొందడానికి సమీపంలోనే ఒక గుహ ఉంటే ఆ కొండ గుహలో ప్రవేశించారు. ప్రవేశించిన కొంతసేపటికే పై నుండి ఒక పెద్ద రాయి వచ్చేసి ఆ గుహ ద్వారం మీద ఇరుక్కుపోయింది. అది ఎంత పెద్దగా ఉందంటే ముగ్గురు కలిసి కూడా దాని నెట్టేసి వెళ్ళడానికి మార్గం చేసుకోలేకపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అప్పుడు వారు ముగ్గురు ఏకమై ఇక్కడ మా ఈ కష్టాన్ని గమనించండి ముందు మీరు. ఎంతటి ఇబ్బందిలో వారు ఇరుక్కున్నారో. మరి ఈనాటి కాలం కాదు కదా? మొబైల్ ఫోన్ వెంట ఉంది, వెంటనే కాల్ చేసి ఫైర్ స్టేషన్ వారికి ఇన్ఫార్మ్ చేయడం గానీ లేకుంటే ఇంకా వేరే ఏదైనా సంస్థకు ఫోన్ చేసి క్రేన్ గిట్ల తెప్పించుకోవడం ఇలాంటివి ఏవి సాధ్యపడవు కదా. అయినా విశ్వాసి ఎక్కడ ఏ సందర్భంలో కూడా ముందు అల్లాహ్, సృష్టికర్త అయిన ఆ సృష్టికర్తను మొరపెట్టుకుంటాడు. ఆయనతో తన సంబంధాన్ని బలపరుచుకుంటాడు. ఆయన్ని వేడుకుంటాడు. అయితే వారు ముగ్గురు కూడా ఏకమై ఇప్పుడు అల్లాహ్ తప్ప మరే మార్గము మనకు లేదు. ఆయన మన దుఆలను అంగీకరించాలంటే మనలో ప్రతి ఒక్కడు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో కేవలం అల్లాహ్ ఇష్టానికి, అల్లాహ్ మెచ్చుకోవడానికి కేవలం ఆయన ప్రీతి పాత్రులు అవ్వడానికి ఏదైనా సత్కార్యం చేసి ఉంటే దాని వసీలాతో, దాని యొక్క ఆధారంగా ఇప్పుడు అల్లాహ్ తో దుఆ చేయండి. అల్లాహ్ తఆలా మన ఈ కష్టాన్ని దూరం చేయాలి.

అందులో ఒక వ్యక్తి దుఆ చేయడం మొదలు పెట్టాడు. ఓ అల్లాహ్ నేను మేకల కాపరిగా పని చేస్తూ ఉండేవాడిని. అయితే ఉదయం మేకలను తీసుకువెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసరికి సాయంకాలం అయ్యేది. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఒక పాత్రలో పాలు తీసుకొని ముందు తల్లిదండ్రులకు త్రావించి ఆ తర్వాత నేను నా భార్య పిల్లలకు త్రాపించేవాడిని. అయితే ఒకసారి నేను చాలా దూరం వెళ్లిపోయాను తిరిగి వచ్చేసరికి రాత్రి అయింది. పాత్రలో పాలు తీసుకొని వెళ్లేసరికి నా అమ్మ నాన్న పడుకొని ఉన్నారు. వారి నిద్రలో వారిని డిస్టర్బ్ చేసి వారిని మేలుకొలపడం అది కూడా నాకు ఇష్టం కాలేకపోయింది. మరియు అటు నా తల్లిదండ్రుల కంటే ముందు నా భార్య పిల్లలకు త్రాపించడం, ఇది ఇది కూడా నాకు ఇష్టం లేకపోయింది. ఆ సందర్భంలో నా పిల్లలు ఆకలితో తల్లడిస్తున్నారు. ఇదే సంకోచంలో తెల్లారేసరికి నేను పాల పాత్రను పట్టుకొని నా తల్లిదండ్రుల వద్ద నిలబడి ఉన్నాను. ఎప్పుడైతే వారు మేల్కొన్నారో వారికి ఆ పాలు త్రాపించాను. ఓ అల్లాహ్ నేను నా తల్లిదండ్రుల పట్ల ఈ సద్వర్తన ఏదైతే అవలంబించానో కేవలం నీ సంతృప్తి కొరకు, నీవు దానిని స్వీకరించి ఉంటే ఈరోజు మేము ఏ కష్టంలో ఉన్నామో మా కష్టాన్ని దూరం చెయ్యి ఓ అల్లాహ్ అని దుఆ చేశాడు.

రెండో వ్యక్తి అన్నాడు. ఓ అల్లాహ్ నా యొక్క పినతండ్రి కూతురు ఉండింది. ఆమె పట్ల నాకు ప్రేమ కలిగింది. ఎన్నోసార్లు ఆమెను నేను చెడు వైపునకు ఆహ్వానించాను కానీ ఆమె స్వీకరించలేదు. ఒక సందర్భంలో ఆమె ఎంతో ఇబ్బందికి గురై నాతో కొన్ని డబ్బులు తీసుకోవడానికి అప్పుగా వచ్చింది. ఆమె ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉంది అంటే ఆ సందర్భాన్ని నేను అవకాశంగా భావించి ఆమెకు సహాయం చేశాను కానీ నేను ఒక నిబంధన తప్పకుండా నా కోరిక పూర్తి చేసుకో అనడానికి అనుమతి ఇవ్వాలి అని అన్నాను. నేను ఆ కోరిక పూర్తి చేసుకోవడానికి ఎప్పుడైతే సమయానికి వెళ్ళానో, ఆ తీర సమయంలో ఇక నేను కోరికను తీర్చుకోవడానికి ఎలాంటి అడ్డు ఏర్పడలేదు. ఆమెకు చేరువయ్యాను. అంతలోనే ఆమె, ఓ అల్లాహ్ దాసుడా అల్లాహ్ తో భయపడు అని నీ భయాన్ని నాకు గుర్తు తెచ్చింది. నేను వెంటనే ఆ చెడు కార్యాన్ని వదిలేశాను మరియు ఆమెకు ఇచ్చిన ఆ సహాయాన్ని కూడా నీ సంతృష్టి కొరకు తిరిగి ఆమె నుండి తీసుకోలేదు. ఓ అల్లాహ్, నీవు గనక దీన్ని స్వీకరించి ఉంటే నన్ను ఈ రోజు ఈ కష్టం నుండి తొలగించు అని దుఆ చేశాడు.

మూడో వ్యక్తి ఏమి దుఆ చేశాడు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. మొదటి వ్యక్తి దుఆ చేసిన తర్వాత ఆ పెద్ద రాయి కొంచెం పక్కకు జరిగింది కానీ మనిషి దాని నుండి దాటే అంత స్థలం లేకుండింది. రెండో వ్యక్తి దుఆ చేసిన తర్వాత కూడా మరికొంత జరిగింది కానీ మనిషి దాటే అంత స్థలం లేదు. ఆ తర్వాత మూడో వ్యక్తి దుఆ చేశాడు. ఓ అల్లాహ్, ఒకసారి నా వద్ద ఒక వ్యక్తి వచ్చాడు పని చేయడానికి. సాయంకాలం వరకు అతను ఏదో కోపానికి గురియై తన ఆ రోజు తీసుకోవలసిన ఏ బత్తెం అయితే ఉండేనో దాన్ని వదిలి వెళ్లిపోయాడు. మరి కొంత కాలం తర్వాత ఒకసారి వచ్చి ఓ యజమాని నేను నీ దగ్గర ఫలానా సమయంలో పని చేశాను. అప్పుడు నేను నా యొక్క కూలి ఏదైతే మీ వద్ద ఉండినదో వదిలి వెళ్ళాను. ఇప్పుడు నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. అల్లాహ్ కొరకు నీవు నా ఆరోజు పనిచేసిన కూలి నాకు ఇచ్చేసేయ్. నేను అతనితో చెప్పాను, ఈ మేకల మంద, ఈ ఆవుల మంద, ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా నీవు తీసుకొని వెళ్ళు. అతడు అన్నాడు నాలాంటి బీదవాడితో ఎందుకు నీవు పరిహసిస్తున్నావు? ఒకరోజు కూలి మాత్రమే నీ వద్ద ఉంది. అది నాకు ఇవ్వు. నేను అన్నాను, నీ ఆ ఒక్క రోజు కూలీని నేను వ్యాపారంలో పెట్టాను. ఇదంతా శుభం అల్లాహ్ నాకు కల్పించాడు. అందు గురించి ఇదంతా కూడా నీ కొరకే ఉంది. నీవు తీసుకొని వెళ్ళు. అతడు సంతోషంగా అన్నిటిని తీసుకొని వెళ్లిపోయాడు. ఓ అల్లాహ్, కేవలం నీ సంతోషం కొరకే, నీవు ఇష్టపడటానికే నేను అతనికి అదంతా ఇచ్చేశాను. నీవు దానిని స్వీకరించి ఉంటే ఈరోజు మేము ఏ కష్టంలో ఉన్నామో మా కష్టాన్ని నీవు తొలగించు ఓ అల్లాహ్.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఆ రాయి మరింత పక్కకు జరిగింది. ముగ్గురు ఎంతో సునాయాసంగా బయటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా మహాశయులారా ఇలాంటి ఇంకెన్నో కూడా మనకు హదీదుల్లో ఆధారాలు లభిస్తాయి. చెప్పే విషయం ఏంటంటే ఈ విధంగా మన విశ్వాసం, మనం చేసుకున్న సత్కార్యాలు అల్లాహ్ సంతృష్టి కొరకు మాత్రమే చేయాలి, ఇఖ్లాసు లిల్లాహియత్తో చేయాలి. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మన ఆ సత్కార్యాన్ని స్వీకరించాడు అంటే ఇన్షాఅల్లాహ్ అలాంటి వాటితో మనం దుఆలు చేసుకోవడం, అలాంటి వాటిని వసీలాగా పెట్టుకోవడం ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇక మూడో రకమైన వసీలా, ఎవరైనా పుణ్యాత్ముడు బ్రతికి ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు, అతని వద్దకు మనము వెళ్లి నా ఈ కష్టం ఉంది, నేను ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, అల్లాహ్ కొరకు మీరు నా గురించి దుఆ చేయండి అని అనడం, అతను దుఆ చేయడం మరియు మనం అల్లాహ్ తో దుఆ చేయడం ఓ అల్లాహ్ ఇతను నా గురించి ఏ దుఆ అయితే చేస్తున్నాడో నీవు స్వీకరించు అని.ఇది కూడా యోగ్యమే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆ పుణ్యాత్ముడు దగ్గరగా ఉండాలి, మరియు బ్రతికి ఉండాలి. మరియు మనం అతనితో ఏ విషయంలో దుఆ చేయమని కోరుతున్నామో అది ధర్మ ప్రకారంగా యోగ్యమై అది అతను చేయగలిగేటువంటి శక్తి ఉండాలి.

సహీ బుఖారీలో హదీస్ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమపదించిన తర్వాత, అల్లాహ్ ను కలుసుకున్న తర్వాత హజ్రత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు గారి కాలంలో చాలా గడ్డు స్థితి ఏర్పడింది. వర్షాలు లేకుండా కరువు కాలం వచ్చింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని అవలంబించి సలాతుల్ ఇస్తిస్కా వర్షము కోరుతూ అల్లాహ్ తో దుఆ చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి నమాజ్ ఉంది. ఈద్ గాహ్ లో వెళ్లి ఆ నమాజ్ చేసి అల్లాహ్ తో దుఆ చేస్తారు. ఆ సలాతుల్ ఇస్తిస్కా హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు చేయించారు. ఆ తర్వాత హజ్రత్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారిని ముందుకు పిలిచి, ఓ అబ్బాస్, నీవు వర్షం గురించి అల్లాహ్ తో దుఆ చేయి అని చెప్పారు. మరియు ఇటు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు, ఓ అల్లాహ్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలో ఎప్పుడైనా వర్షాలు లేకుంటే మేము ఆయన వద్దకు వెళ్లి ఆయనతో దుఆ చేయండి అని కోరేవారిమి. ఆయన దుఆ చేసేవారు మరియు ఓ అల్లాహ్ నీవు ఆయన దుఆను స్వీకరించి వర్షం కురిపించేవానివి. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి లేరు గనుక నేను ఆయన యొక్క పినతండ్రి అబ్బాస్ ను ముందుకు పెట్టాను. ఓ అల్లాహ్ ఆయన చేసే దుఆను నీవు అంగీకరించు అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు గారు కూడా కోరారు.

ఇక్కడ గమనించండి విషయం. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఆ సందర్భంలో ఖలీఫా. వందలాది మంది సహాబాలు ఆ సందర్భంలో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమయంలో బ్రతికి లేరు. ఆ విషయం కూడా హజ్రత్ ఉమర్ ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ బ్రతికి ఉన్న పుణ్యాత్ములతో కాకుండా, చనిపోయిన వారితో, చనిపోయిన ప్రవక్తలతో, చనిపోయిన పుణ్యాత్ములతో దుఆ చేయడం, వారి యొక్క వసీలా పెట్టుకొని, వారి యొక్క ఆధారంగా, వారి మధ్యవర్తిత్వంతో దుఆ చేయడం యోగ్యం ఉంటే మదీనాలోనే దుఆ చేయడం జరుగుతుంది. ప్రవక్త గారి యొక్క సమాధి అక్కడే ఉంది. హజ్రత్ ఉమర్, ఇంకా సహాబాలు అలా చేయకపోయారా? అలా చేయలేదు గనుక అది ధర్మం కాదు అన్న విషయం సహాబాలకు తెలుసు అందు గురించే వారు అలా చేయలేదు. బ్రతికి ఉన్న వారిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పినతండ్రి, వారిని ముందుకు పెట్టి వారితో దుఆ చేయించారు.

అలాగే సూరె యూసుఫ్ లో కూడా మనకు ఒక సంఘటన కనబడుతుంది. ఎప్పుడైతే యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క సోదరులు యూసుఫ్ అలైహిస్సలాం వారిని గుర్తుపట్టారో మరియు వారికి తమ యొక్క తప్పు అర్థమైందో, తండ్రితో ఏమంటారు? యా అబానస్ తగ్ఫిర్లనా దునూబనా. ఓ నాన్న, మా పాపాలు క్షమించాలని మీరు కూడా అల్లాహ్ తో దుఆ చేయండి.

ఈ విధంగా బ్రతికి ఉన్న వారి వద్దకు వెళ్లి నా పాపాల మన్నింపుకై మీరు దుఆ చేయండి, నాకు సంతానం కలగాలని మీరు దుఆ చేయండి, మరియు నా కష్టాలు దూరం కావాలని మీరు దుఆ చేయండి. మరియు మనం ఓ అల్లాహ్, ఈ పుణ్యాత్ముడు చేసే దుఆను నీవు నా గురించి స్వీకరించు అని మనం దుఆ చేయడం ఇది యోగ్యమైన పద్ధతి.

ఈ విధంగా మహాశయులారా ఈ మూడు రకాలు యోగ్యమైనవి. అల్లాహ్ యొక్క ఉత్తమ నామములతో, అల్లాహ్ యొక్క సుందర నామములతో, ఉత్తమ గుణాలతో వాటి ఆధారంగా మరియు రెండవ రకం మన యొక్క విశ్వాసం, మనం చేసిన సత్కార్యాలు వాటి ఆధారంగా, వాటి యొక్క వసీలాతో. అలాగే బ్రతికి ఉన్న, దగ్గరగా ఉన్న పుణ్యాత్ముని వద్దకు వెళ్లి అతన్ని దుఆ చేయమని కోరడం మరియు మనం దుఆ చేయడం ఓ అల్లాహ్ ఇతని దుఆను నీవు స్వీకరించు అని. ఈ మూడు రకాల మధ్యవర్తిత్వాలు యోగ్యమైనవి.

ఇవి కాకుండా మిగతా వాటివన్నీ కూడా ధర్మానికి వ్యతిరేకమైనవి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక ప్రళయ దినాన ప్రవక్తల సిఫారసు పొందడానికి మనం ఇంతకుముందే తెలుసుకున్నట్లు అల్లాహ్ పై నమ్మకం బలంగా ఉండాలి. మనం ఇహలోకంలో ఎవరిని కూడా నియమించుకొని మీరు నాకు సిఫారసు చేయండి అని వారితో కోరరాదు, వారితో మొరపెట్టుకోరాదు, ఆరాధనకు సంబంధించిన ఏ విషయం కూడా వారి వద్ద చేయరాదు. ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఐదు మూల స్తంభాలు ఏదైతే మనకు తెలిపారో, ఇస్లాంకు సంబంధించినవి వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సత్యంగా సాక్ష్యం పలుకుతూ దాని ప్రకారం ఆచరించాలి. ఐదు పూటల నమాజులు చేయాలి. మరియు ఉపవాసాలు ఉండాలి, విధిదానం చెల్లించాలి, హజ్ చేయాలి. ఎందుకంటే పుణ్యాత్ములకు, ప్రవక్తలకు, దైవదూతలకు నరకంలో పడిన కొందరు పాపాత్ములను నరకం నుండి తీయడానికి ఏదైతే సిఫారసు హక్కు ఇవ్వడం జరుగుతుందో, అక్కడ వారు ఏమంటారు? మాతో ఎవరైతే నమాజ్ చేసేవారో, మాతో ఎవరైతే ఉపవాసాలు ఉండేవారో, మాతో ఎవరైతే హజ్ చేసేవారో అలాంటి వారు కూడా కొందరు నరకంలో పడి ఉన్నారు ఓ అల్లాహ్ వారిని నీవు బయటికి తీయండి అని. ఏదైతే సిఫారసు చేస్తారో, అందులో ముఖ్య విషయం ఏమి విన్నాం మనము? నమాజుల వల్ల వారి యొక్క ఈ ముఖాలు అగ్ని ఏమాత్రం తినకుండా ఉంటుంది, అగ్ని ఏమాత్రం కాల్చకుండా ఉంటుంది. ఈ విధంగా సోదరులారా ఈ పుణ్యాలు మనం చేసుకుంటూ ఉండాలి.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఒక సహాబీ రబీఆ బిన్ కాబల్ అస్లమీ రదియల్లాహు అన్హు ఉండేవారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. రబీఆ, నీకు ఏదైనా ఇష్టం ఉంటే కోరు. నాతో అడుగు, నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని. అప్పుడు రబీఆ చాలా చాలా ఆలోచించి రెండో రోజు వచ్చి చెప్పారు, ప్రవక్తా, స్వర్గంలో నేను నీతో ఉండే అటువంటి భాగ్యం నాకు కలగాలి. దాని గురించి మీరు ఏదైనా నాకు ప్రయత్నం చేయండి. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నవయువకుడు అయినటువంటి రబీఆ యొక్క ఆలోచనతో ఆశ్చర్యపడి ఎవరు నీకు ఈ ఆలోచన ఇచ్చారు? మీ తల్లియా, లేక మీ తండ్రియా? అతను అంటాడు లేదు, నేను వెళ్లి చాలా ఆలోచించాను. ప్రవక్తతో ఏ విషయం అడిగినా గానీ, ఏది కోరినా గానీ ఇహలోకంలో అది సమాప్తం కావచ్చు కానీ ఒకవేళ రేపటి రోజు నేను స్వర్గంలో వెళ్ళినా గానీ మీరు ఏ స్థానంలో, ఏ గొప్ప స్థానంలో ఉంటారో, నేను ఏ అల్ప స్థానంలో ఉంటానో, అందుగురించి అక్కడ మిమ్మల్ని చూసుకోవడం కూడా నాకు అవకాశం లభిస్తుందో లేదో, ఆ రంది ఆ యొక్క బాధ నాకు కలిగింది. అందుగురించి నేను స్వర్గంలో మీతో తోడుగా ఉండాలి అని కోరడానికి నేను సాహసం వహించాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు. ఫ అఇన్నీ అలా నఫ్సిక బి కస్ రతిస్సుజూద్. ఇలా నీవు ప్రళయదినాన నా సిఫారిషు పొందడానికి, ప్రళయదినాన నా యొక్క సహవాసం పొందడానికి నీవు అధికంగా సజ్దాలు చేస్తూ ఉండు, అధికంగా నఫిల్ నమాజులు చేస్తూ ఉండు అని చెప్పారు.

అలాగే ఇంకా సోదరులారా, మనం కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఏదైతే నోటితో పలుకుతామో, ఇది కేవలం నోటి వరకే పరిమితం కాకుండా స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలి. అదే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీద్ లో, ఒక సందర్భంలో అబూ హురైరా రదియల్లాహు అన్హు అడిగారు, ప్రవక్తా, మన్ అస అదున్నాసి బి షఫా అతిక యౌమల్ ఖియామతి యా రసూలల్లాహ్. ఓ ప్రవక్తా, ప్రళయ దినాన నీ సిఫారసును పొందే అదృష్టవంతుడు ఎవడవుతాడు అని. ప్రవక్త గారు చెప్పారు. అస అదున్నాసి బి షఫాఅతీ మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ ఖాలిసన్ మిన్ ఖల్బిహ్. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠిస్తారో, సాక్ష్యం పలుకుతారో అలాంటి వారు నా సిఫారసుకు ప్రళయ దినాన నా సిఫారసుకు అర్హులు అవుతారు.

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ముస్లిం షరీఫ్ లోని హదీస్, మీరు అజాన్ విన్నప్పుడు ముఅద్దిన్ ఎలా సమాధానం పలుకుతాడో అలాగే సమాధానం పలుకుతూ ఉండండి. ఆ తర్వాత నాపై దరూద్ చదవండి అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ చివరి వరకు. ఎవరైతే ఒక్కసారి నాపై దరూద్ చదువుతారో అల్లాహ్ పది సార్లు వారిని దైవదూతల ముందు ప్రశంసిస్తాడు. ఆ తర్వాత అల్లాహ్ తో నా గురించి మీరు ప్రళయ దినాన ఏ మకామె మహమూద్ అని ఉందో దాని గురంచి అది నాకు ప్రాప్తం కావాలని దుఆ చేయండి. అంటే, అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతి త్తామ్మ వస్సలాతిల్ ఖాయిమ ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫదీల వబ్ అస్ హు మకామన్ మహమూదనిల్లదీ వ అద్త అని భావం. ఇది చదివిన వారికి హల్లత్ లహు షఫాఅతీ, నా యొక్క సిఫారిసు వారికి తప్పకుండా ప్రాప్తం అవుతుంది అని చెప్పారు.

ఈ విధంగా మహాశయులారా, మనం మూఢనమ్మకాలను వదులుకొని, దురవిశ్వాసాలను వదులుకొని సిఫారసు ప్రళయ దినాన పొందడానికి ఏ మంచి విషయాలు, మంచి మార్గాలు అల్లాహ్ ఖురాన్ లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో తెలిపారో వాటిని అవలంబించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ ఆ సద్భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]