ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4 నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? [మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు] https://www.youtube.com/watch?v=vnw-1Kcariw వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.
నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.
కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.
ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.
అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.
సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”
మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులోఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మూసా, ఖిజర్ లు బయలు దేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగుల గొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరి ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు. (సూరా అల్ కహఫ్ 18: 71)
ఒ క రోజు, మూసా (అలైహిస్సలాం) ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వారిపై తీవ్రమైన ప్రభావం వేసింది. ప్రజల్లో ఒక వ్యక్తి, “దైవప్రవక్తా! భూమిపై మీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు, తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు కాబట్టి తానే అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడినని భావిస్తూ మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తితో, “లేడు” అని జవాబిచ్చారు. కాని తెలుసుకోవలసినదంతా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరని, సంపూర్ణ జ్ఞానానికి ఒకే దైవప్రవక్త కేంద్రం కావడం కూడా జరగదని, ఒక వ్యక్తికి తెలియని విషయాలు తెలిసిన మరో వ్యక్తి ఎల్లప్పుడు ఉంటాడని అల్లాహ్ ఆయనకు తెలియజేశాడు. అప్పుడు మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో, “ప్రభూ! ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? నేను ఆయన్ను కలుసుకుని ఆయన నుంచి విద్య నేర్చు కోవాలని భావిస్తున్నాను” అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి గుర్తు చెప్పమని కూడా అల్లాహ్ ను కోరారు.
అల్లాహ్ ఆయనకు మార్గం చూపుతూ, నీటితో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకుని బయలుదేరాలని, ఆ చేప పాత్ర నుంచి మాయమైన ప్రదేశంలో ఆ వ్యక్తి కనబడతాడని చెప్పాడు. మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఆయన వెంట ఒక అనుచరుడు చేపవున్న నీటిపాత్రను పట్టుకుని రాసాగాడు. వారిద్దరు రెండు నదులు కలసిన సంగమ ప్రదేశానికి చేరు కున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. మూసా (అలైహిస్సలాం) అక్కడ నిద్రలోకి జారుకున్నారు.
ఆయన నిద్రపోతున్నప్పుడు, నీటి పాత్రలోని చేప ఎగిరి నదిలో దూకడాన్ని ఆయన అనుచరుడు చూశాడు. కాని అతడు ఈ సంఘటన గురించి మూసా (అలైహిస్సలాం)కు చెప్పడం మరచిపోయాడు. మూసా (అలైహిస్సలాం) లేచిన తర్వాత ఇద్దరూ ప్రయాణం కొనసాగించారు. వారు బాగా అలసిపోయారు, చాలా ఆకలితో ఉన్నారు. మూసా(అలైహిస్సలాం) తన అనుచరునితో ఆహారం గురించి అడిగారు. అప్పుడు అనుచరునికి నీటి పాత్రలోని చేప నదిలో దూకి వెళ్ళిపోయిన విషయం గుర్తుకువచ్చింది. ఆ విషయాన్ని మూసా (అలైహిస్సలాం)కు తెలియజేశాడు. మూసా (అలైహిస్సలాం), “అర్రర్రె.. మనం వెదుకుతున్న ప్రదేశం అదే” అన్నారు. వారు త్వరత్వరగా వెనక్కి వచ్చారు. రెండు నదులు కలసిన ప్రదేశానికి, చేప నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగ భాగాన్ని ఒక వస్త్రం కప్పిఉంది. ఆయనే ఖిజర్ (అలైహిస్సలాం)… మార్గదర్శి!
వింత మనిషి
మూసా (అలైహిస్సలాం) ఆయనకు అభివాదం చేశారు. “అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక!)” అన్నారు. ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు. “మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారు. కాని ఈ దేశంలో శాంతి ఉందా? అసలు మీరెవరు?” అని ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను ఇస్రాయీల్ వారి ప్రవక్తను” అన్నారు. ఆ వ్యక్తి తిరిగి, “మీకు బోధనలు ఎవరు చేశారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడకు పంపించారు?” అనడిగారు. మూసా (అలైహిస్సలాం) జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. చాలా మర్యాదగా, “నేను మీతో రావచ్చా.. ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడకు వచ్చాను. నేను మీకు అవిధేయత చూపను” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు జవాబిస్తూ, “మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే మీరు అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు. చాలా విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది. అందువల్ల మీరు వాదనకు దిగుతారు” అన్నారు. మూసా (అలైహిస్సలాం) చాలా నిజాయితీగా, “అల్లాహ్ తలిస్తే… నేను సహనంతో ఉంటాను. మీ పట్ల అవిధేయత చూపను” అన్నారు. చివరకు ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంట తీసుకువెళ్లడానికి అంగీకరిస్తూ ఒక షరతు పెట్టారు. తాను ఏం చేసినా ప్రశ్నించరాదని అన్నారు. మూసా (అలైహిస్సలాం) తన అనుచరుడిని వెనక్కు పంపి తాను ఖిజర్ (అలైహిస్సలాం)తో పాటు బయలుదేరారు.
పడవకు నష్టం కలిగించడం
వారు ఒక నది వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒక పడవలోకి ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ (అలైహిస్సలాం) చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకిపారేశారు. దాని వల్ల పడవకు ఒకవైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా (అలైహిస్సలాం), “అరె, ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది” అన్నారు.
ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. మూసా (అలైహిస్సలాం)కు వెంటనే తాను చేసిన పొరపాటు గుర్తుకువచ్చింది. ఆయన్ను క్షమాపణలు కోరుకున్నారు. “నా మతిమరుపుకు కోపం తెచ్చుకోవద్దు, నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు. మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండడానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను” అన్నారు. అందుకు అంగీకరించి ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంటతీసుకుని బయలుదేరారు.
పిల్లవాడిని హతమార్చడం
దారిలో వారికి ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనబడ్డాడు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆ పిల్లవాడిని మిత్రబృందం నుంచి వేరు చేసి ఒక ప్రక్కకు తీసుకు వెళ్ళి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా (అలైహిస్సలాం) నిర్ఘాంతపోయారు. “మీరు ఒక అమాయక పిల్లవాడిని చంపేశారు. ఇది నిజంగా అమానుషం” అని అరిచారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన వైపు తీక్షణంగా చూసి తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. తన పనులను మరోసారి ప్రశ్నిస్తే ఇక తనతో రావడం ఉండదని హెచ్చరించారు. మూసా (అలైహిస్సలాం) మళ్ళీ క్షమాపణ కోరుకున్నారు. “నేను మరోసారి ఈ పొరపాటు చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను మన్నించారు.
ఖిజర్ (అలైహిస్సలాం) చేసిన మంచి పని
వారిద్దరు ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో వారు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కోరారు. కాని పిసినారి ప్రజలు వారికి ఏదీ ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెడుతున్నప్పుడు ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ (అలైహిస్సలాం) ఆ గోడను మరమ్మత్తు చేయడానికి పూను కున్నారు. ఇది చూసిన మూసా (అలైహిస్సలాం) ఉండబట్టలేక, “మీరు భలే విచిత్రమైన మనిషి. ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు. పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకుని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకో గలిగే వాళ్ళం” అన్నారు. తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా (అలైహిస్సలాం) భరించలేరని ఖిజర్ (అలైహిస్సలాం)కు అర్థమయ్యింది. “ఇక చాలు… ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు. అయితే మనం వేరయ్యే ముందు నేను చేసిన పనులకు కారణాలు వివరిస్తాను” అన్నారు. మూసా సిగ్గుపడుతూ తల వంచుకున్నారు.
1. నేను నష్టపరచిన పడవను కిరాయికి నడుపుకుని ఆ పడవ యజమాని, అతని భార్య బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరిచానంటే, వారి రాజు పడవలను స్వాధీనం చేసుకుని పెద్ద నౌకాదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ పడవను నష్టపరచడం వల్ల దీన్ని చూసినా కూడా పనికిరానిదిగా భావించి రాజు దాన్ని వదలివేస్తాడు. మూసా! నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనబడినా… నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి, పడవ యజమానిపై సానుభూతితో చేసిన పని.
2. నేను చంపిన పిల్లవాడి తల్లిదండ్రులు నిజమైన విశ్వాసులు. కాని ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం గురించి నాకు తెలిసింది. కన్నకొడుకు కాబట్టి ఆ తల్లి దండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు. కాని, చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. అతడిని చంపి నేను వారి విశ్వాసాన్ని కాపాడాను. అల్లాహ్ వారికి మంచి సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
3. నేను ఆ గోడను నిర్మించినది స్వార్థపరులైన గ్రామస్తుల కోసం కాదు, ఆ గోడ ఇద్దరు అనాధలైన బాలలది. ఆ గోడ క్రింద గుప్తనిధి ఉందని అల్లాహ్ నాకు తెలియజేశాడు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు, దానధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్తనిధి రహస్యంగా ఉండడం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లాహ్ వారికి ఆ నిధిని చూపిస్తాడు. ఆ గోడ పడిపోతే స్వార్థపరులైన గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు. కాబట్టి నేను చేసిన ప్రతీ పని నా ప్రభువు కారుణ్యం వల్ల చేసిన పని. నేను ఏ పనీ నా స్వంతంగా చేయలేదు. ఈ మాటలు చెప్పి ఖిజర్ (అలైహిస్సలాం) వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
(చదవండి దివ్యఖుర్ఆన్: 18:60-82)
గ్రహించవలసిన పాఠాలు
జ్ఞానం పొందిన వ్యక్తి తానొక్కడే కాదన్న విషయం తెలిసిన వెంటనే మూసా (అలైహిస్సలాం) మరింత జ్ఞానం సంపాదించడానికి కష్టసాధ్యమైన ప్రయాణానికి పూనుకున్నారు. జ్ఞానం సులభసాధ్యంగా లభించేది కాదు. జీవితంలో విజయం సాధించాలంటే మనిషి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది.
అల్లాహ్ ఆదేశాల మర్మాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేము. మనకు తప్పుగా కనబడుతున్న విషయం నిజానికి ఒక అనుగ్రహం కావచ్చు. “తాను చేసేది అల్లాహ్ కు బాగా తెలుసు”.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net