మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/3nniRG7Y6vU (12 నిముషాలు)
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
ఈ ప్రసంగంలో ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత శుభ్రత గురించి వివరించబడింది. మూత్ర తుంపరల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది సమాధి శిక్షకు కారణమయ్యే ఒక పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. చాడీలు చెప్పడం కూడా సమాధి శిక్షకు మరో కారణమని పేర్కొనబడింది. చిన్న పిల్లల మూత్రం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇస్లామిక్ ధర్మశాస్త్రపరమైన సులభమైన పరిష్కారాలు మరియు ఆధునిక కాలంలో మూత్రశాలల వాడకంలో ఉన్న ధార్మిక పరమైన ప్రమాదాల గురించి కూడా చర్చించబడింది.
మూత్ర తుంపరల నుండి జాగ్రత్త
ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతీ విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాల్ని, అపరిశుభ్రతను దూరం చేసి, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది.
అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుభ్రతలోనూ అలక్ష్యం చేస్తారు, అంటే అశ్రద్ధ వహిస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అంతేకాదు, అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు.
مَرَّ النَّبِيُّ ﷺ بِحَائِطٍ مِنْ حِيطَانِ الْمَدِينَةِ فَسَمِعَ صَوْتَ إِنْسَانَيْنِ يُعَذَّبَانِ فِي قُبُورِهِمَا فَقَالَ النَّبِيُّ ﷺ يُعَذَّبَانِ وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ ثُمَّ قَالَ بَلَى {وفي رواية: وإنه لَكَبِير} كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ وَكَانَ الْآخَرُ يَمْشِي بِالنَّمِيمَةِ…
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్లీ చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (సహీ బుఖారీ 216, సహీ ముస్లిం 292)
ఇక్కడ ఈ హదీథ్ లో మీరు, “వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు” అని ఒకసారి చదివి, మళ్ళీ వెంటనే “ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే” దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి. ఇక్కడ మాట ఏమిటంటే, ఆ మనుషులు ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో, వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు, ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు. ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి హదీథ్ లో. అర్థమైందా? అంటే, అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే. కానీ చేసేవారు పెద్ద పాపమని భయపడేవారు కాదు. ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా, “ఏ పర్లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది లేరా మన మధ్యలో?” అనుకుంటారు.
ప్రత్యేకంగా కాలేజీల్లో, అటు పనులో ఉండేటువంటి పురుషులు, యువకులు, చివరికి ఎన్నోచోట్ల యువతులు, ఇళ్లల్లో తల్లులు. నమాజ్ సమయం అయిపోయి, దాన్ని దాటి పోయే సమయం వచ్చింది. అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది. నమాజ్ చదివారా అంటే, లేదండీ కొంచెం తహారత్ లేదు కదా. ఎందుకు లేదు తహారత్? ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి. లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను.
ఇక ఇళ్లల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో, “ఆ ఇక పిల్లలు మా సంకలోనే ఉంటారు కదా, మాటిమాటికీ మూత్రం పోస్తూ ఉంటారు, ఇక ఎవరెవరు మాటిమాటికీ వెళ్లి చీర కట్టుకోవడం, మార్చుకోవడం, స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండీ” అని ఎంతో సులభంగా మాట పలికేస్తారు. కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు, వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు?
ఆ బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో. అయ్యో ఇంత చిన్న పిల్లల, వారి మూత్రముల నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి? పిల్లలే కదా, ఎప్పుడైనా పోసేస్తారు, తెలియదు కదా. మీ మాట కరెక్ట్, కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి అలవాటు చేయించాలి మనం. ఎందరో తత్వవేత్తలు, మాహిరే నఫ్సియాత్, సైకియాట్రిస్ట్, ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి, ఎప్పుడైనా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే, స్వాభావికంగా వారు ఏడవడమో, అటూ ఇటూ పక్క మార్చడమో, ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట. ఎందుకు? తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని, చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని. అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, పిల్లలు చెప్పి మూత్రం పోయరు. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు, కరెక్టే. కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని, మీరు అదే అపరిశుభ్ర స్థితిలో, అశుద్ధ స్థితిలో ఉండటం ఇది కూడా సమంజసం కాదు. ఎప్పటికి అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి.
మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం. మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అని మాటిమాటికీ మేము మొత్తుకుంటూ ఉంటాము. ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో, అల్లాహ్ మనపై ఎంత కరుణ కనుకరించాడో అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏంటి? ఎప్పటివరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో, వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో, అలాంటి పిల్లల విషయంలో మగపిల్లలు అయ్యేదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గానీ, బొంతలో గానీ, చద్దర్ లో గానీ, మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. మరియు ఒకవేళ ఆడపిల్ల అయ్యేదుంటే, ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రానికంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది. మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు, పూర్తి చీర మార్చుకునే, పూర్తి షర్ట్ సల్వార్ మార్చుకునే అవసరం లేదు. ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో, శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది.
ఇక పెద్దల విషయానికి వస్తే, వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు, ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై, మన కాళ్లపై, మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి మన్ను మీద, లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కలు, తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైనా లేక నమ్మకమైనా కలిగితే, ఎంతవరకు పడ్డాయో అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది. మొత్తం మనం స్నానం చేయవలసిన, అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు.
అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా, ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీథ్ ఏముంది?
أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌల్)
“అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).
మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట, మూత్ర తుంపరలు తనపై పడవచ్చునని తెలిసి కూడా అదేచోట మూత్ర విసర్జన చేయుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నియు మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి.
ఈ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ, అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపులా ఏ అడ్డు ఉండదు. అందరూ వచ్చిపోయే వారి ముందు లజ్జా సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్లీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. అంటే ప్యాంటుని ఈ విధంగా. ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి, తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం. రెండవది, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం.
ఇంతే కాకుండా, అంటే ఈ రెండే కాకుండా, అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు. అంతేకాకుండా, సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నాడు కదా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేది ఉంటే గమనించండి, మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నాము.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41051
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
![ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]
సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్ -500059.](https://teluguislam.net/wp-content/uploads/2025/06/islam-mechina-mahilalu.jpg?w=713)

You must be logged in to post a comment.