సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) & సమాధుల వైపు నమాజ్ చెయ్యడం https://youtu.be/mtb-SmruW8E [6 నిముషాలు] షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగంలో, సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయడం మరియు వాటి వైపు తిరిగి నమాజ్ చేయడం ఇస్లాంలో నిషేధించబడినవని స్పష్టంగా వివరించబడింది. తవాఫ్ అనేది మక్కాలోని కాబతుల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఆరాధన అని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలాలుగా మార్చుకున్న వారిని అల్లాహ్ శపించాడని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాధిని పూజించే స్థలంగా మార్చవద్దని ప్రార్థించారని ఉల్లేఖించబడింది. ప్రవక్త యొక్క మస్జిద్ (మస్జిదె నబవి) ఎంతో పవిత్రమైనదైనప్పటికీ, దాని చుట్టూ కూడా తవాఫ్ చేయడానికి అనుమతి లేనప్పుడు, ఇతర సమాధులు లేదా దర్గాల చుట్టూ తిరగడం ఘోరమైన పాపం (షిర్క్) అవుతుందని హెచ్చరించబడింది. ముస్లింలు ఇలాంటి షిర్క్ మరియు బిద్అత్ (మతంలో నూతన కల్పనలు)లకు దూరంగా ఉండాలని ప్రసంగం ముగిసింది.
ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బ’అదహు అమ్మా బ’అద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ 12వ ఎపిసోడ్లో, సమాధుల ప్రదక్షిణం చేయటం, దాని వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం. సోదరులారా, మన సమాజంలో కొందరు అమాయకులు, అజ్ఞానం వల్లో అలాగే ఇస్లాం గురించి సరైన అవగాహనం లేనందువల్ల సమాధుల వద్ద పోయి పూజిస్తున్నారు, సమాధుల తవాఫ్ (ప్రదక్షిణం) చేస్తున్నారు.
ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తవాఫ్ తప్ప ఇతరుల తవాఫ్‌కి అనుమతి లేదు. అది ఎంత పవిత్రమైన స్థలమైనా సరే, కాబతుల్లాహ్ తప్ప మరేదానిని తవాఫ్ చేయకూడదు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు,
وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ (వల్ యత్తవ్వఫూ బిల్ బైతిల్ అతీఖ్) వారు ఆ ప్రాచీన గృహానికి (కాబతుల్లాహ్కు) ప్రదక్షిణ చేయాలి. (22:29)
అంటే ఆ కాబతుల్లాకి తవాఫ్ చేయాలి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది, ఎవరైతే ఆ కాబతుల్లాకి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తాడో, తవాఫ్ చేస్తాడో, ఆ తర్వాత రెండు రకాత్ నమాజులు పాటిస్తాడో, ఆ వ్యక్తికి ఒక బానిసను విముక్తి ప్రసాదించే అంత పుణ్యం లభిస్తుంది.
సమాధుల వైపు నమాజ్ చేయడం
అభిమాన సోదరులారా, సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం అది అధర్మము, అసత్యము, అది హరామ్ అవుతుంది. కొందరు మదీనాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు, వేడుకుంటారు, దుఆ చేస్తారు, నమాజ్ చేస్తారు, ఇది అధర్మం. ఈ విషయం గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠినంగా ఖండించారు.
అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
لَعَنَ اللَّهُ الْيَهُودَ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ (ల’అనల్లాహుల్ యహూద వన్ నసారా ఇత్తఖదూ ఖుబూర అంబియా’ఇహిమ్ మసాజిదా) అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యూదుల పైన మరియు క్రైస్తవుల పైన శపించుగాక! ఎందుకంటే వారు ప్రవక్తల సమాధులను సజ్దాగా(ఆరాధన స్థలాలు) చేసుకున్నారు. (ముత్తఫకున్ అలైహ్)
అంటే మస్జిద్ గా చేసుకున్నారు. అంటే సజ్దా అల్లాహ్ కోసమే చేయాలి. అది మనము నమాజ్ ఎక్కడ చేస్తాము? మస్జిద్ కి పోయి చేస్తాము. కాకపోతే యోధులు మరియు క్రైస్తవులు ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చేశారు, మస్జిదులుగా ఖరారు చేసుకున్నారు.
అలాగే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
اللَّهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا يُعْبَدُ (అల్లాహుమ్మ లా తజ్’అల్ ఖబ్రీ వసనన్ యు’బద్) ఓ అల్లాహ్, నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చకు.
అంటే, ఓ అల్లాహ్, నేను చనిపోయిన తర్వాత నా సమాజంలో, నా ఉమ్మత్ లో కొంతమంది రావచ్చు, వచ్చి నా సమాధి వైపు తిరగవచ్చు, ప్రదక్షిణం చేయవచ్చు, కాకపోతే ఓ అల్లాహ్ నువ్వు నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చవద్దు.
ఆ జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుంది, ఏ జాతి పైన?
“ఏ జాతి వారు, ఏ వర్గం వారు ఎవరైతే ప్రవక్తల సమాధులను ప్రదక్షిణం చేస్తారో, ప్రవక్తల సమాధులను ఆరాధన స్థలంగా మార్చుకుంటారో, అటువంటి జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుందని” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో తెలియజేశారు.
అభిమాన సోదరులారా, అలాగే సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయకూడదు. ఎటువైపు త్రిప్పి నమాజ్ చేయాలి? అది కేవలం కాబతుల్లాహ్ వైపు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు సూరతుల్ బఖరాలో,
అభిమాన సోదరులారా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, “మీరు సమాధుల పై గానీ, సమాధుల వైపునకు గానీ ముఖాలను త్రిప్పి నమాజు చేయకండి.”
అభిమాన సోదరులారా, ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తర్వాత, మస్జిదె హరామ్ తర్వాత పవిత్రమైన స్థలాలు రెండు ఉన్నాయి. ఒకటి మస్జిదె నబవి, రెండవది మస్జిదె అఖ్సా.
మస్జిదె హరామ్, మస్జిదె నబవి, మస్జిదె అఖ్సా – ఈ మూడు మస్జిదులకు నమాజ్ చేసే ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. మస్జిదె నబవిలో ఒక నమాజ్ చేస్తే వెయ్యి నమాజుల పుణ్యం అంత లభిస్తుంది. అంటే అది హరమ్ అది. ఏ విధంగా మస్జిదె హరామ్ హరమ్ కిందికి వస్తుందో, అలాగే మస్జిదె నబవి కూడా హరమ్ లో వస్తుంది. అయినప్పటికీ, ఆ మస్జిదె నబవి యొక్క ప్రదక్షిణం చేయటం కూడా ధర్మసమ్మతం కాదు, మరి మనం దర్గాలకు, దర్గాల వైపు తిరుగుతున్నాము, సమాధుల వైపు తిరుగుతున్నాము, బాబాలని, పీర్లని, ఔలియాలని… మన ప్రవక్త కంటే పెద్ద వలీ ఎవరండీ?
కాకపోతే ఈ కాబతుల్లా తవాఫ్ తప్ప, కాబతుల్లా ప్రదక్షిణం తప్ప ప్రపంచంలో, ఈ భూమండలంలో దేనిని ప్రదక్షిణం చేసినా అది అధర్మం అవుతుంది. ఈ విషయం గురించి ఎన్నో వందలాది హదీసులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ షిర్క్ నుండి, బిద్ఆ నుండి, ఖురాఫాతు నుండి కాపాడుగాక. ఇస్లాం పట్ల సరైన అవగాహనను అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, “తబర్రుక్ వాస్తవికత” (శుభాన్ని ఆశించడం యొక్క వాస్తవికత) అనే అంశంపై చర్చించబడింది. వక్త తబర్రుక్‌ను రెండు రకాలుగా విభజించారు: ధర్మసమ్మతమైనది (మష్రూ) మరియు నిషిద్ధమైనది (మమ్నూ). ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా ధృవీకరించబడిన తబర్రుక్ మాత్రమే ధర్మసమ్మతమైనదని, ఉదాహరణకు మూడు మస్జిద్‌లకు (మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవి, మస్జిద్-ఎ-అఖ్సా) ప్రయాణించడం, జమ్ జమ్ నీరు త్రాగడం, మరియు ఖురాన్‌ను పఠించి, అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా శుభం పొందడం వంటివి వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వం, ఆయన వస్తువులు, మరియు ఆయన శరీరం నుండి వేరైన భాగాల (వెంట్రుకలు) ద్వారా శుభం పొందడం కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకం అని, సహాబాలు ఇతరులతో ఇలా చేయలేదని స్పష్టం చేశారు. ఖురాన్ మరియు సున్నత్‌లలో ఆధారం లేని ఏ వస్తువు, ప్రదేశం, లేదా వ్యక్తి ద్వారా శుభాన్ని ఆశించడం నిషిద్ధమైన తబర్రుక్ అని, ఇది షిర్క్‌కు దారితీస్తుందని హెచ్చరించారు. దర్గాలు లేదా ఇతర సమాధుల వద్దకు శుభం కోసం ప్రయాణించడం హరామ్ అని హదీసుల ఆధారంగా వివరించారు.
الْحَمْدُ لِلَّهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ، (అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త ఈనుహూ వ నస్తగ్ ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్.) సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని కోరుతున్నాము, ఆయన క్షమాపణను వేడుకుంటున్నాము, ఆయనను విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే నమ్మకం ఉంచుతున్నాము.
وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، (వ న ఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’అమాలినా) మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా కర్మల చెడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، (మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్ లిల్హు ఫలా హాదియ లహ్.) అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, వారిని ఎవరూ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు ఆయన ఎవరిని మార్గభ్రష్టులుగా వదిలేస్తాడో, వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، (వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్.) అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، (వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్.) మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
أَرْسَلَهُ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا، وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُنِيرًا. (అర్సలహూ బిల్ హఖ్ఖి బషీరవ్ వ నజీరా. వ దాఇయన్ ఇలల్లాహి బి ఇజ్నిహీ వ సిరాజమ్ మునీరా.) ఆయన (అల్లాహ్) అతన్ని (ముహమ్మద్‌ను) సత్యంతో శుభవార్తలు అందించేవాడిగా, హెచ్చరించేవాడిగా, తన అనుమతితో అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవాడిగా మరియు ప్రకాశవంతమైన దీపంగా పంపాడు.
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ (అమ్మా బ’అద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్) నిశ్చయంగా, అన్ని మాటలలోకెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్).
وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم (వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అన్ని మార్గాలలోకెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గం.
وَشَرُّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ (వ షర్రల్ ఉమూరి ముహ్ దసాతుహా, వ కుల్లు ముహ్ దసతిన్ బిద్ అహ్) మరియు అన్ని కార్యాలలోకెల్లా చెడ్డ కార్యం (ధర్మంలో) కొత్తగా కల్పించబడినది, మరియు ప్రతి కొత్త కల్పన ఒక బిద్అత్ (ఆవిష్కరణ).
وَكُلُّ بِدْعَةٍ ضَلاَلَةٌ وَكُلُّ ضَلاَلَةٍ فِي النَّارِ (వ కుల్లు బిద్ అతిన్ దలాలహ్, వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్) మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారి తీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధముల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. కారుణ్య శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, నాటి ఈ జుమా ప్రసంగాంశం, తబర్రుక్ వాస్తవికత. తబర్రుక్ అనే విషయంలో మన సమాజంలో అనేక విధాల అపార్థాలు, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా కాకుండా బిద్అతులు చోటు చేసుకున్నాయి. ఇన్షా అల్లాహ్ ఈరోజు తబర్రుక్ వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం.
తబర్రుక్ అర్థం మరియు రకాలు
తబర్రుక్ అంటే బరకత్ నుంచి. బరకత్ పొందటం, శుభాలను పొందడం, శుభాలను ఆశించడం, శుభాలు కలగడం అనే అర్థాలు వస్తాయి తబర్రుక్ అంటే. అత్తబర్రుక్ బిష్షై అంటే ప్రత్యేకమైన ఓ వస్తువు ద్వారా శుభాన్ని కోరటం.
ఈ తబర్రుక్ రెండు రకాలు. మష్రూ తబర్రుక్ (ధర్మ సమ్మతమైన తబర్రుక్). రెండవది మమ్నూ తబర్రుక్ (నిషిద్ధమైన తబర్రుక్).
ధర్మసమ్మతమైన తబర్రుక్ (మష్రూ తబర్రుక్ )
ధర్మ సమ్మతమైన తబర్రుక్ అంటే, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అయిన తబర్రుక్. ఉదాహరణకు, శుభం కొరకు, మేలు కొరకు, శుభం పొందటానికి మస్జిద్-ఎ-హరామ్ వైపుకు పయనించటం, ప్రయాణించటం. అది హదీసులో ఉంది. అలాగే మస్జిద్-ఎ-నబవి ప్రయాణించటం, అలాగే మస్జిద్-ఎ-అఖ్సా వైపు పోవటం. అంటే ఈ మూడు మస్జిదుల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, శుభం కొరకు, మేలు కొరకు, పుణ్యం కొరకు ఈ మూడు మస్జిదుల వైపుకు ప్రయాణం చేయవచ్చు. ఇది ధర్మ సమ్మతమైన తబర్రుక్ పొందటం.
అలాగే జమ్ జమ్ నీరు, దాని గురించి స్పష్టమైన హదీసులు ఉన్నాయి, దాని యొక్క శుభం గురించి.
అలాగే ఖురాన్. స్వయంగా ఖురాన్ గ్రంథం తబర్రుక్‌తో నిండి ఉన్నది. స్వయంగా ఖురాన్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అన్ఆమ్ ఆయత్ నంబర్ 155లో ఇలా తెలియజేశాడు:
وَهَـٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ మరియు ఈ ఖురాన్ మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి, భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గురించి సూర సాద్, ఆయత్ 29లో ఇలా తెలియజేశాడు:
كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ ఇదొక శుభప్రదమైన గ్రంథం. బరకత్‌తో కూడిన గ్రంథం, తబర్రుక్‌తో నిండియున్న గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు దీనిని నీ వైపుకు పంపాము అని అల్లాహ్ సెలవిచ్చాడు.
ఇక ఖురాన్‌తో బరకత్ పొందటం, ఖురాన్‌తో తబర్రుక్ ఆశించటం, ఇలాంటి చాలా ఆయతులు ఖురాన్‌లో ఉన్నాయి. నేను రెండు ఆయతులు పఠించాను, అన్ఆమ్ మరియు సూర సాద్ లోనిది.
ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందాలంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీంట్లో కండిషన్ పెట్టాడు. ఖురాన్ శుభప్రదం, ఎప్పుడు? ఖురాన్‌ని అనుసరిస్తే. ఖురాన్‌ని ఎప్పుడు అనుసరించాలి? పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు అనుసరించవచ్చు. అలాగే ఖురాన్ శుభప్రదం ఎప్పుడు? చింతన చేస్తే, గుణపాఠం నేర్చుకుంటే, మన జీవితాలు ఖురాన్ పరంగా ఉంటే ఈ ఖురాన్ మనకోసం బరకత్‌గా మారిపోతుంది, మన జీవితాలలో శుభం జరుగుతుంది, శుభం మనం పొందవచ్చు, శుభాన్ని ఆశించవచ్చు ఖురాన్ ద్వారా, అంటే ఖురాన్‌ను పఠించి, ఖురాన్ పారాయణం చేసి, ఖురాన్ చింతన చేసి, గుణపాఠం నేర్చుకొని ఆచరించినట్లయితే, ఈ ఖురాన్ ద్వారా మనకి బరకత్ వస్తుంది, శుభం అవుతుంది. అలా కాకుండా, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో పఠించడం లేదు, ఖురాన్ తెరిచి చూడటం లేదు, అర్థం చేసుకోవడం లేదు, కేవలం బరకత్ ఉద్దేశంతో అందమైన దుస్తులు, అందమైన ఒక చిట్టీలో, ఖరీదైన దుస్తులలో దాన్ని బంద్ చేసి, ప్రయాణం చేసేటప్పుడు వాహనంలో, కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో, దుకాణంలో, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో, చదవటం లేదు, అర్థం చేసుకోవటం లేదు, పారాయణం లేదు, ఏమీ లేదు, అది సమంజసం కాదు. ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందటం స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. ఖురాన్ ద్వారా, ఖురాన్ ఆ గ్రంథమే బరకత్‌తో కూడిన గ్రంథం. ఆ ఖురాన్ ద్వారా మనం బరకత్ పొందాలంటే పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి, దాని అనుగుణంగా నడుచుకోవాలి. దీని ద్వారా ఖురాన్ మనకి బరకత్ అవుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తబర్రుక్
అసలు విషయం ఏమిటంటే, ఖురాన్ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో శుభాన్ని పొందటం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా శుభాన్ని పొందటం, తబర్రుక్ ఆశించటం,
ఇవి రెండు విధాలు. ఒకటి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందటం, వ్యక్తిత్వంతో ఆయన ఉన్నప్పుడు. సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చుంబించేవారు, శుభప్రదమైన చేతులను పట్టుకునేవారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చేతులను పట్టుకొని తమ ముఖాన్ని పైన స్పర్శించుకునేవారు, తిప్పుకునేవారు, శుభం ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో. అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వంతో తబర్రుక్‌ని పొందటం.
రెండవది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన శరీరంతో, శుభవంతమైన శరీరంతో వేరైన వస్తువులు, వేరైన భాగాలు. ఆయన శుభవంతమైన శిరోజాలు, తల వెంట్రుకలు. ఆయన శరీరంకి ముట్టిన దుస్తులు, ఆయన వాడిన పాత్రలు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సంబంధించిన, ఆయన వాడిన, ఆయన తొడిగిన పాత్రలు, వస్తువులతో తబర్రుక్ పొందటం.
ఇది ధర్మ సమ్మతమైనది అని మనకు పలు హదీసుల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి ఒక రెండు, మూడు హదీసులు మనం పరిశీలిద్దాం. ముస్లిం గ్రంథంలో హదీస్ ఉంది, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఈ హదీస్ కి కథనం ఉల్లేఖులు. ఆమె ఇలా అంటున్నారు, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఎవరంటే, అబూబకర్ గారి కూతురు, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క అక్క అస్మా రదియల్లాహు అన్హా. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు యొక్క తల్లి అస్మా రదియల్లాహు అన్హా. ఆవిడ రదియల్లాహు అన్హా ఇలా తెలియజేశారు, ఒక ప్రవక్త గారి ఒక జుబ్బాని తీశారు, జుబ్బా, చొక్కా. అస్మా రదియల్లాహు అన్హా ఒక జుబ్బాని తీసి, ఈ జుబ్బా ఆయిషా రదియల్లాహు అన్హా బ్రతికున్నంత కాలం ఆవిడ దగ్గర ఉండింది ఈ జుబ్బా. ఆయిషా రదియల్లాహు అన్హా పరమపదించిన తర్వాత ఆ జుబ్బాని నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఆ జుబ్బా ఎవరిది? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన జుబ్బా, తొడిగిన జుబ్బా అది. ఇప్పుడు ఆ జుబ్బా నా దగ్గర ఉంది. ఇప్పుడు మనం మనలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, కీడు జరిగితే, స్వస్థత కోసం, చికిత్స కోసం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధరించిన ఆ జుబ్బాని మనం నీళ్ళలో వేసి, ఆ జుబ్బాని పిండితే, ఆ నీళ్ళతో మనం ఆరోగ్యం కోసం వాడేవారము, చికిత్స నిమిత్తం ఆ నీళ్లు వాడేవారము, అని అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హుమా సెలవిస్తున్నారు. అంటే ఈ హదీస్ ప్రామాణికమైన హదీస్, ముస్లిం గ్రంథంలో ఈ హదీస్ ఉంది.
అలాగే ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా తెలియజేశారు, ఆయన దగ్గర ఒక పాత్ర ఉండింది, మంచి నీళ్లు తాగే పాత్ర, గ్లాస్ లాంటిది, పాత్ర ఉండింది. ఆ పాత్ర, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్రలో నీళ్లు ఒకప్పుడు తాగారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉండగా ఆ పాత్రలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మంచి నీళ్లు తాగారు. ఆ పాత్ర సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు దగ్గర ఉండింది. ఆ పాత్ర తీసి సహల్ రదియల్లాహు అన్హు తబర్రుక్ కోసం, శుభం పొందటం కోసం తాగారని అబూ హాజిమ్ తెలియజేశారు. ఆ తర్వాత అదే పాత్రను నాకు కావాలని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి కోరారు. ఎవరిని? సహల్ బిన్ స’అద్ రదియల్లాహు అన్హుని. ఆ పాత్ర నాకు ఇస్తారా అని కోరితే, సహల్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గారికి కానుకగా ఆ పాత్రను ఇచ్చేశారు. అర్థం ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్ర ఆయన అనుచరులు ఆ తర్వాత తాబయీన్లు తబర్రుక్‌గా, శుభం కోరటం కోసం వాడేవారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్రలు, ధరించిన దుస్తులు తబర్రుక్ కోసం వాడవచ్చు అని ఈ బుఖారీ హదీస్ ద్వారా రూఢి అవుతుంది.
అలాగే అబూ జుహైఫా రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణ నిమిత్తం మధ్యాహ్న సమయంలో బయలుదేరారు. ఒక ప్రయాణంలో మధ్యాహ్నం బయలుదేరారు. దారిలో బతహా ప్రదేశంలో నమాజ్ నిమిత్తం ఆగటానికి. దారిలో నమాజ్ చేయడానికి, జొహర్ మరియు అసర్ నమాజ్ చేయడానికి. ఆ స్థలం పేరు బతహా. అక్కడ ఆగి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసి జొహర్, అసర్ నమాజ్ చేశారు. సహాబాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యితో, చెయ్యి పట్టుకొని సహాబాలు తమ ముఖం పైన తిప్పుకున్నారు. ఈ హదీస్ రావి జుహైఫా అంటున్నారు, నేను కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యిని పట్టుకొని నా ముఖం పైన తిప్పాను, ఉంచాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యి చల్లగా, కస్తూరి కంటే ఎక్కువ సువాసనగా ఉండింది, అని తెలియజేశారు. అంటే ఈ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాడిన వస్తువుల ద్వారా, స్వయంగా ఆయన బ్రతికి ఉన్నంతకాలం, స్వయంగా ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ తీసుకోవటం, తబర్రుక్ ని పొందటం ఇది ధర్మ సమ్మతము.
బుఖారీలోనే ఇంకో హదీసులో ఇలా ఉంది:
فَجَعَلَ النَّاسُ يَأْخُذُونَ مِنْ فَضْلِ وَضُوئِهِ فَيَتَمَسَّحُونَ بِهِ (ఫ జ’అలన్నాసు య’ఖుజూన మిన్ ఫద్లి వుజూఇహీ ఫ యతమస్సహూన బిహీ) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేస్తే, వుజూలో మిగిలిన నీళ్లను సహాబాలు తీసుకునేవారు. ఆ నీళ్లను తమ శరీరం పైన పూసుకునేవారు, ముఖం పైన పూసుకునేవారు, తమ పైన జల్లుకునేవారు, తబర్రుక్ ఉద్దేశంతో.
అభిమాన సోదరులారా, అలాగే ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ ఉంది, హజ్ సమయంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినా రోజు అది ఖుర్బానీ ఇచ్చిన తర్వాత, క్షవరం చేసుకున్నప్పుడు, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభవంతమైన శిరోజాలను కుడి వైపు, ఎడమ వైపు సహాబాలకు పంచారు. తబర్రుక్ ఉద్దేశంతో సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన శిరోజాలను తమ వద్ద ఉంచుకున్నారు.
దీంతో ఏమర్థమవుతుంది? అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికున్నంత కాలం ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందవచ్చు, ఆయన వాడిన, వేసుకున్న, ధరించిన దుస్తుల ద్వారా, ఆయన శరీరం నుంచి వేరైన, అది వెంట్రుకలు, ద్వారా, అలాగే ఆయన వాడిన పాత్రల ద్వారా సహాబాలు తబర్రుక్ పొందారని రూఢి అయ్యింది, ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే, ఇది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం. ప్రత్యేకంగా ఆయన కొరకే ఇది.
అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని పోల్చుకుంటూ ఇతర ఔలియాలు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనుల విషయంలో ఇలా చేయటం షిర్క్ అవుతుంది. ధర్మ పండితులు ఇతరులకి, దర్గాలకి పోయి శుభాన్ని కోరటం, ఇది ఫలానా పీర్ జుబ్బా అని, ఇది ఫలానా ఔలియా చొక్కా అని, ఇది ఫలానా ఔలియా పాత్ర అని, ఇది ఫలానా ఔలియాకి ఇది, ఇది అని, అది అని, ఇది ఔలియాలు, బుజుర్గులు, పీర్లు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనులు ఎవరైనా సరే. అంతెందుకు? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత అందరి కంటే ఉత్తములు ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఉమ్మతె ముహమ్మదియాలో, ప్రవక్తల పరంపర తర్వాత, ప్రవక్తల తర్వాత, ఉమ్మతె ముహమ్మదియాలో అందరికంటే పెద్ద వలీ ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఎవరైతే ప్రపంచంలో వలీ, వలీ, వలీ అని పేరు పొందారో, వారికంటే పెద్ద వలీ అబూబకర్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అషర ముబష్షరా. పది మంది సహాబాలకి ప్రవక్త గారు స్వయంగా ఒకే హదీసులో స్వర్గం శుభవార్త ఇచ్చారు. ముహాజిర్లు, అన్సార్లు, అంత పెద్ద పెద్ద సహాబాల ద్వారా ఎవరైనా ఇతర సహాబాలు, తాబయీన్లు శుభాన్ని ఆశించారా? తబర్రుక్ పొందారా? తబర్రుక్ నిమిత్తం ఇలా చేశారా? స్వయంగా ఈ నలుగురు ఖలీఫాలు, అషర ముబష్షరా, ముహాజిరీన్లు, అన్సార్లు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో కాకుండా, ఆయన జుబ్బా, ఆయన వాడిన పాత్ర, ఆయన శరీరం నుంచి వేరైన ఆ శుభవంతమైన శిరోజాలు, ఇవి కాకుండా, ప్రవక్త గారు ఎక్కడ నమాజ్ చేశారో, ప్రవక్త సమాధి నుంచి శుభం తీసుకున్నారా? మనకంటే ఎక్కువగా ధర్మం తెలిసిన వారు. ప్రవక్త గారి జీవితాన్ని చూసిన వారు. ఖురాన్ యొక్క అర్థం ప్రవక్తతో తెలుసుకున్న వారు. అటువంటి సహాబాలు కూడా, ఇది తబర్రుక్ అనేది చేయలేదు. అది ఒక ప్రత్యేకంగా ఉంది, దేని ద్వారా తబర్రుక్ తీసుకోవాలి అనేది ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడు, హదీసులలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఖురాన్ మరియు హదీస్ పరంగా ఉంటే అది ధర్మ సమ్మతం, అది చేయాలి. మంచి విషయం.
ఉదాహరణకు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. జమ్ జమ్ నీరు ఉంది. వర్షపు నీళ్లు ఉంది. వర్షపు నీరు శుభవంతమని, ఎందుకు? దాంతో ప్రయోజనం ఉంది. తాగుతాము, బ్రతుకు ఉంది, పంటలు పండుతాయి, దాంతో మేలు జరుగుతుంది. శుభవంతమైనది. హజరె అస్వద్ ఉంది. ప్రవక్త గారు ముద్దాడారు. స్వర్గం నుంచి వచ్చిందని చెప్పారు. శుభవంతమైన ఉద్దేశంతో మనం కూడా ముద్దాడతాం. ఆ విధంగా దేని గురించి ఖురాన్లో ఉందో తబర్రుక్ పొందవచ్చు అని, దేని గురించి ప్రవక్త గారు స్వయంగా చెప్పారో తబర్రుక్ ఉంది అని, మరి ఏ విషయాల గురించి ప్రాక్టికల్గా సహాబాలు అమలు చేశారో వాటితో తబర్రుక్ పొందటం, ఆశించటం ధర్మ సమ్మతమే. అవి కాకుండా ప్రస్తుతం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు, పరమపదించారు. అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందేది లేదు, అది అయిపోయింది. రెండవది, ఆయన శరీరం నుంచి వేరైన వస్తువులు, ఆయన దుస్తులు, పాత్రలు, వెంట్రుక, అవి ఇప్పుడు ప్రపంచంలో ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అవ్వలేదు, ఎక్కడ ఉన్నాయి అనేది. నిజంగానే ప్రామాణికమైన హదీసుల ద్వారా ఇప్పుడు కూడా రూఢి అయితే అది ధర్మ సమ్మతమే, తబర్రుక్ ఉద్దేశంతో వాడవచ్చు. కాకపోతే రూఢి అవ్వలేదు, ప్రవక్త యొక్క సంబంధించిన వస్తువులు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంతో వేరైన వస్తువులు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అనేది ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి లేదు కాబట్టి. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ తబర్రుక్‌తో కూడిన అన్ని విషయాలన్నీ పాత ఇండియాలోనే ఉన్నాయి. ఇది ఫలానా ఔలియా, ఇది ఫలానా పీరు, ఇది ఫలానా సహాబీ, ఇది ఫలానా వ్యక్తిది పగడా, ఇది ఫలానా వ్యక్తిది పగడి, ఇది ఫలానా వ్యక్తిది జుబ్బా, ఇది ఫలానా వ్యక్తిది పాత్ర, ఇది ఫలానా ఔలియా గ్లాసు, ఇది ఫలానా ఔలియా వెంట్రుక, ఇది ఫలానా ఔలియా పాదము, ఇది ఫలానా ఔలియా చెప్పులు, ఇవంతా పాత ఇండియాలోనే ఉన్నాయి, అరబ్ దేశాల్లో లేవే? అంటే మనము సృష్టించుకున్నాము. ఒకవేళ ఉన్నా, ఆ తబర్రుక్ అనేది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం, ప్రత్యేకం. ఆయన తప్ప సహాబాలకి అది లేదు. అబూబకర్ రదియల్లాహు కంటే పెద్ద వలీ ఉన్నారా? ఉమర్ కంటే పెద్ద వలీ ఉన్నారా? ఖులఫా-ఎ-అర్బా కంటే పెద్ద వలీలు ఉన్నారా? వారి ద్వారానే వారి అనుచరులు, వారి స్నేహితులు ఆ తర్వాత తాబయీన్లు వారి ద్వారా తబర్రుక్ పొందలేదు కదా, అంటే అది ధర్మ సమ్మతం కాదు అని అర్థం అయిపోయింది.
నిషిద్ధమైన తబర్రుక్ (మమ్నూ తబర్రుక్)
కాకపోతే ఒక హదీస్ ద్వారా మనము తెలుసుకుందాము. ఒక సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ కి పోయారు. అబూ వాఖిద్ అల్లైసీ తెలియజేస్తున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى حُنَيْنٍ (ఖరజ్నా మ’అన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హునైన్) మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
అది యుద్ధ సమయంలో.
وَنَحْنُ حُدَثَاءُ عَهْدٍ بِكُفْرٍ (వ నహ్ను హుదసాఉ అహ్దిన్ బికఫ్రిన్) అప్పుడు మేము కొత్త కొత్తగా ఇస్లాం స్వీకరించాము. అంటే అప్పుడే మేము ఇస్లాం స్వీకరించిది, కొత్తగా ముస్లిములము. కొత్తగా ఇస్లాం స్వీకరించాము.
وَلِلْمُشْرِكِينَ سِدْرَةٌ يَعْكُفُونَ عِنْدَهَا وَيَنُوطُونَ بِهَا أَسْلِحَتَهُمْ (వ లిల్ ముష్రికీన సిద్రతున్ య’అకిఫూన ఇందహా వ యనూతూన బిహా అస్లిహతహుం) అక్కడ ఆ హునైన్ ఆ స్థలంలో ఒక రేయి చెట్టు ఉండింది. ముష్రికీన్లు, బహుదైవారాధకులు ఆ రేయి చెట్టు పైన తమ ఆయుధాలను వ్రేలాడదీసేవారు, తబర్రుక్ ఉద్దేశంతో. చేసేది ఎవరు? ముష్రికీన్లు, తబర్రుక్ ఉద్దేశంతో అలా చేసేవారు.
అది చూసి ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు, “ఓ దైవ ప్రవక్త,” దానికి జాతు అన్వాత్ అని పేరు ఉంది హదీస్ పుస్తకంలో, ఆ రేయి చెట్టు పైన అది వారు ఆయుధాలు వ్రేలాడదీస్తారు కదా, దాని పేరు జాతు అన్వాత్. ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు దైవ ప్రవక్తతో, “ఓ దైవ ప్రవక్త, ఏ విధంగా అయితే ఆ బహుదైవారాధకులు, ఆ ముష్రికీన్లు తబర్రుక్ నిమిత్తం, శుభం పొందటానికి ఈ చెట్టు పైన ఆయుధాలు వ్రేలాడదీస్తున్నారు కదా, మా కోసం కూడా మీరు ఒక అన్వాత్‌ని తయారు చేయండి” అన్నారు, తబర్రుక్ కోసం.
అప్పుడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహనంతో ఏమన్నారంటే:
قُلْتُمْ وَالَّذِي نَفْسِي بِيَدِهِ كَمَا قَالَ قَوْمُ مُوسَى: اجْعَل لَّنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ (ఖుల్తుమ్ వల్లజీ నఫ్సీ బియదిహీ కమా ఖాల ఖవ్ము మూసా: ఇజ్అల్ లనా ఇలాహన్ కమా లహుమ్ ఆలిహహ్) అల్లాహ్ సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో, అంటే అల్లాహ్ సాక్షిగా, మీరు చెప్పిన మాట చాలా పెద్ద మాట. ఏ విధంగా అయితే మూసా జాతి ప్రజలు మూసా అలైహిస్సలాంని కోరారు. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్. ఆ బనీ ఇస్రాయిల్లో బహుదైవారాధకులు షిర్క్ చేసేవారు ఆ ఆవు దూడని పూజించేవారు కదా. మూసా అలైహిస్సలాంకి విశ్వసించిన వారు కూడా అడిగారు: “ఓ మూసా అలైహిస్సలాం, వారికి ఏ విధంగా ఇలాహ్ ఉన్నాడో, అలాగే మాకు కూడా ఒక ఇలాహ్ తయారు చేయండి” అన్నారు.
ఇన్నకుమ్ కౌమున్ తజ్హలూన్ (నిశ్చయంగా మీరు ఇంకా అజ్ఞానులే) అని సమాధానం ఇచ్చారు. అంటే అది ఉపమానంగా ఇస్తూ అంతిమ దైవ ప్రవక్త, “ఇప్పుడు కూడా మీకు ఇంకా పాత జ్ఞాపకాలే ఉన్నాయా? పాత ఆచారాలే ఉన్నాయా? ఇంకా మీ ఈమానంలో, మీ విశ్వాసంలో ఇంకా తేడా రాలేదా?” అని అసహనంగా ప్రవక్త గారు బాధపడ్డారు. అంటే, ఇది అధర్మమైన తబర్రుక్, మమ్నూ తబర్రుక్. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉన్నా కూడా, ఈ చెట్ల ద్వారా, పుట్టల ద్వారా, పండ్ల ద్వారా తబర్రుక్ లేదు అని ఈ హదీస్ ద్వారా రూఢి అయిపోయింది. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో ఉంది, ఇది సహీ హదీస్ ఇది.
అలాగే చివర్లో, బుఖారీ కితాబు ఫద్లిస్సలాత్‌లో ఒక హదీస్ ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
لاَ تُشَدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَلاَثَةِ مَسَاجِدَ الْمَسْجِدِ الْحَرَامِ وَمَسْجِدِ الرَّسُولِ -صلى الله عليه وسلم- وَمَسْجِدِ الأَقْصَى (లా తుషద్దుర్రిహాలు ఇల్లా ఇలా సలాసతి మసాజిద్: అల్ మస్జిదిల్ హరామ్, వ మస్జిదిర్రసూల్, వ మస్జిదిల్ అఖ్సా.)
ఈ భూమండలంలో అన్నిటికంటే పవిత్రమైన స్థలాలు ఏమిటి? మస్జిద్‌లు. ఎక్కడైనా సరే, పవిత్రంగా, అన్నిటికంటే పవిత్రం. కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ తెలియజేశారు, శుభాలు పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం నిషిద్ధం, హరామ్. అది మస్జిద్ అయినా సరే.
ఫలానా దేశంలో ఫలానా మస్జిద్ ఉంది, అక్కడ పోయి నమాజ్ చేస్తే పుణ్యం వస్తుంది, శుభం కలుగుతుంది, తబర్రుక్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్. మూడు మస్జిద్‌లు తప్ప. మస్జిద్-ఎ-హరామ్ (మక్కా), మస్జిద్-ఎ-నబవి (మదీనా), మస్జిద్-ఎ-అఖ్సా (ఫలస్తీన్). ఈ మూడు మస్జిద్‌లు తప్ప, అంటే ఈ మూడు మస్జిద్‌లు శుభం పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. హదీస్ ద్వారా రూఢి అయ్యింది, ధర్మ సమ్మతం. ఈ మూడు మస్జిద్‌లు తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే, మస్జిద్ అయినా సరే, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్.
అయితే, దర్గా విషయం ఏమిటి? దర్గాకి పోతున్నారు, స్త్రీలు, పురుషులు, హిజాబ్ లేదు, చాలా ఖురాన్‌కి, హదీస్‌కి విరుద్ధంగా, మరి తబర్రుక్. ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధితో తబర్రుక్ లేదు. ఆయన మదీనాలో నడిచిన వీధులతో తబర్రుక్ లేదు. ఆయన యుద్ధాలు చేసిన యుద్ధ మైదానం ద్వారా తబర్రుక్ లేదు. దేని ద్వారా తబర్రుక్ ఉందో, అది రూఢి అయ్యింది ఖురాన్, హదీస్‌లో ఉంది. అవి తప్ప అది మస్జిద్ అయినా, సమాధి అయినా, దర్గా అయినా, ఔలియా అయినా, సజ్జనులైనా, పుణ్య పురుషులైనా తబర్రుక్ అనేది లేదు. ఒకవేళ తబర్రుక్‌గా భావిస్తే, వాటి ద్వారా శుభాన్ని కోరితే, అది షిర్క్ క్రిందికి వస్తుందని ధర్మ పండితులు తెలియజేశారు.
అభిమాన సోదరులారా, ఇవి సారాంశం, ధర్మ సమ్మతమైన తబర్రుక్, నిషిద్ధమైన తబర్రుక్.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్‌ను అర్థం చేసుకొని, దాని అనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ యొక్క సరైన అవగాహన కలిగే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్, సుమ్మా ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[1 నిముషం] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు –19
19- ఆరాధన ఉద్దేశంతో మూడు మసీదులు తప్ప మరెక్కడికీ ప్రయాణం చేయకు. 1. మక్కాలో ఉన్న మస్జిదుల్ హరాం. 2. మదీనలో ఉన్న మస్జిదె నబవి[1]. 3. ఫాలస్తీనలోని ఖుద్స్ లో ఉన్న మస్జిదె అఖ్సా. ఇవి గాకుండా వేరే మస్జిదుల వైపునకు వాటిని ఉద్దేశించి ప్రయాణం చేయరాదు.
“మస్జిదె హరాం, మస్జిదె నబవి మరియు మస్జిదె అఖ్సా. ఈ మూడు మస్జిదులు తప్ప మరే చోట (పుణ్యాన్ని ఆశించి) ప్రయాణించవద్దు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు
(బుఖారి/ బాబు ఫజ్లిస్ సలాతి ఫీ మస్జిది మక్కా వ మదీన/ 1189, ముస్లిం/ బాబు లా తుషద్దుర్ రిహాలు ఇల్లా…/ 1397).
[1] ప్రవక్త సమాధినుద్దేశించి మదీన ప్రయాణం చేయుట నిషిద్ధము. స్వయంగా ప్రవక్తయే దీనిని నిషేధించారు, హెచ్చరించారు. ఇలా చేయుట ఒక పండుగగా, ఉత్సవంగా అయిపోతుంది. ఇలా చేయువాడు హదీసు ఆధారంగా శాపగ్రస్తుడవుతాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.