నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? – [మరణానంతర జీవితం – పార్ట్ 54] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4
నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి?
[మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=vnw-1Kcariw
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.

నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.

కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.

ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.

అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.

సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”

మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులో ఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.

జుమా ఖుత్బా సందర్భంలో మౌనంగా ఉండుట తప్పనిసరి [ఆడియో, టెక్స్ట్]

[8 నిముషాలు]
https://youtu.be/cRqGXyIpURs
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం శుక్రవారం ఖుత్బా (ప్రసంగం) సమయంలో నిశ్శబ్దం పాటించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఖుత్బా జరుగుతున్నప్పుడు ఇతరులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పడం కూడా నిషేధించబడినదని, అలా చేయడం శుక్రవారం నమాజ్ యొక్క పుణ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. శుక్రవారం నాడు త్వరగా వచ్చి, స్నానం చేసి, నఫిల్ నమాజ్ చేసి, మౌనంగా ఖుత్బా విన్నవారికి పది రోజుల పాపాలు క్షమించబడతాయని చెప్పబడింది. ఖుత్బా వినడం అనేది అజాన్‌కు సమాధానం ఇవ్వడం కంటే ముఖ్యమైనదని, ఆలస్యంగా వచ్చినవారు కూడా సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసి ఖుత్బా వినడంలో నిమగ్నం కావాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد.
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.)
(అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీపై వర్షించుగాక. సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)

باب الإنصات للخطبة يوم الجمعة
(బాబుల్ ఇన్సాతి లిల్ ఖుత్బతి యౌమల్ జుమా)
(శుక్రవారం రోజు ఖుత్బాకు మౌనంగా వినడం అనే అధ్యాయం.)

జుమా రోజు ఖుత్బా జరుగుతున్న సమయంలో మౌనం వహించడం, గమ్మున ఉండడం.

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: إذا قلت لصاحبك يوم الجمعة أنصت والإمام يخطب، فقد لغوت
(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: ఇదా ఖుల్త లిసాహిబిక యౌమల్ జుముఅతి అన్‌సిత్ వల్ ఇమాము యఖ్తుబు, ఫఖద్ లగౌత)

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “జుమా రోజు ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో నీవు నీ పక్కన ఉన్న సోదరునితో ‘మౌనం వహించు’ అని అంటే, నీవు ఒక లగ్వ్ (వ్యర్థమైన) పని చేసినవానివి అవుతావు.”

ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో, జుమా రోజు, మనం సైలెంట్‌గా ఉండాలి, మౌనం వహించాలి. ఏ కార్యకలాపాలు చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు.

రెండో బోధ మనకిందులో, మన పక్కన ఎవరినైనా మనం చూస్తున్నాము, కొందరు మాట్లాడుకుంటున్నారు, ఏదైనా వృధా కార్యకలాపాల్లో ఉన్నారు, వారికి కూడా మనం చెప్పకూడదు. “అరే ఇలా చేయకు,” “ఓ బాయ్, ఖామోష్ రహో,” “మౌనం వహించు,” “ప్లీజ్ సైలెంట్‌గా ఉండు” అని మనం చెప్పకూడదు. ఇది ఇమామ్ యొక్క బాధ్యత, ఇమామ్ చెప్పాలి.

ఇక అతి ముఖ్యమైన విషయం ఇందులో మనకు తెలిసింది మరొకటి ఏమిటంటే, ఒకవేళ మనం ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో వేరే ఎవరితోనైనా, “మీరు గమ్మున ఉండండి,” “మాట్లాడకండి,” “ప్లీజ్ సైలెంట్” అని మనం చెప్పామంటే, మనం లగ్వ్ చేసిన వాళ్ళం అయ్యాము అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.

లగ్వ్ అంటే ఇక్కడ ఏంటి? లగ్వ్ అంటే ఇక్కడ పనికిమాలిన, వృధా మాట. అయితే, చూడటానికి ఇక్కడ గమనించండి, గమనించండి, చూడటానికి మనం ఒక మంచి పని చేశామని అనిపిస్తుంది కదా? ఒక ఇద్దరు మాట్లాడుకుంటే, “ష్, సైలెంట్ ప్లీజ్” ఈ విధంగా మెల్లగా చెప్పేశాము. మనం ఒక మంచి పని చేశాము అనే భావన మనకు ఏర్పడింది. కానీ ప్రవక్త ఏమంటున్నారు? فقد لغوت (ఫఖద్ లగౌత) – “నీవు ఒక లగ్వ్ పని చేశావు” అని. మరియు ఇక్కడ లగ్వ్ అన్నదానికి భావం, ఇమామ్ హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహ్మతుల్లా అలై తెలిపినట్లు,

خبت من الأجر
(ఖిబ్త మినల్ అజ్ర్)
నీవు జుమా యొక్క పుణ్యాన్ని కోల్పోయావు.

بطلت فضيلة جمعتك
(బతలత్ ఫజీలతు జుముఅతిక్)
జుమాకు సంబంధించిన ఏ ఘనత, ఏ గొప్పతనం అయితే ఉందో దాన్ని నీవు కోల్పోయావు అని భావం. అల్లాహు అక్బర్.

حرم فضيلة الجمعة
(హురిమ ఫజీలతల్ జుమా)
జుమా యొక్క ఫజీలత్ ఏదైతే ఉందో దాని నుండి అతడు మహ్రూమ్ అయిపోయాడు

అందుకొరకు సోదర మహాశయులారా, కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, ప్రత్యేకంగా అరబ్ ప్రాంతాల్లో, అనేకమంది మన సోదరులు, మిత్రులు ఖుత్బా అరబీలో జరుగుతుంది, మనకేం అర్థమవుతుంది అది అని చిన్నపాటిగా గుంపులుగా చేసుకొని ఇద్దరు, ముగ్గురు, నలుగురు వెనుక కూర్చుండి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఇంకా మహా ఘోరమైన విషయం.

గమనించండి ఇక్కడ. ఇద్దరు మాట్లాడుకునే వారిని, “మీరు సైలెంట్‌గా ఉండండి” అని చెప్పడంలోనే పాపం ఉన్నది, జుమా యొక్క సవాబ్ (పుణ్యం) కోల్పోతున్నారంటే, ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో గమనించండి. ఈ హదీస్ ఏదైతే మీకు వినిపించానో, సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 934, అలాగే సహీ ముస్లిం, హదీస్ నంబర్ 851.

ఇక సంక్షిప్తంగా మరొక హదీస్ కూడా మనం విందాము.

عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من اغتسل ثم أتى الجمعة، فصلى ما قدر له، ثم أنصت حتى يفرغ من خطبته، ثم يصلي معه، غفر له ما بينه وبين الجمعة الأخرى، وفضل ثلاثة أيام

(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: మనిగ్తసల సుమ్మ అతల్ జుముఅత, ఫసల్లా మా ఖుద్దిర లహు, సుమ్మ అన్‌సత హత్తా యఫ్రుగ మిన్ ఖుత్బతిహి, సుమ్మ యుసల్లీ మఅహు, గుఫిర లహు మా బైనహు వ బైనల్ జుముఅతిల్ ఉఖ్రా, వ ఫద్లు సలాసతి అయ్యామ్)

ఎవరైతే మంచి రీతిలో స్నానం చేశారో, జుమా నమాజు కొరకు హాజరయ్యారో మరియు ఖుత్బా కంటే ముందు వచ్చి అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతులు చేశాడో (ఇది జుమా ఖుత్బా కంటే ముందు, సామాన్యంగా వీటిని మనం నఫిల్ అంటాము. జుమా కంటే ముందు ఇన్ని రకాతులు అని ఫిక్స్ లేదు. కనీసం రెండు రకాతులు, కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నైనా చదవవచ్చు. ఇమామ్ ఖుత్బా స్టార్ట్ చేసేకి ముందు వరకు), ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమామ్ ఖుత్బా మొదలు పెడతాడో అప్పటి నుండి ఖుత్బా పూర్తి అయ్యే వరకు అన్‌సత (أنصت) – సైలెంట్‌గా ఉన్నాడు, మౌనం వహించాడు, గమ్మున ఉండిపోయాడు. ఆ తర్వాత ఇమామ్‌తో నమాజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఈ జుమా నుండి మళ్ళీ వచ్చే జుమా వరకు, అంతకంటే మూడు రోజులు ఇంకా అదనంగా, అంటే మొత్తం పది రోజుల పాపాలు అల్లాహ్‌తాలా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్.

గమనించండి, పది రోజుల పాపాలు జుమా రోజు నమాజుకు హాజరై, త్వరగా వచ్చి ఎన్ని రకాతులు అంటే అన్ని చేసుకొని, ఇమామ్‌తో ఖుత్బా వినడంలో శ్రద్ధ వహించడం, మౌనం వహించడం, అలాంటి వారి కొరకు ఈ గొప్ప ఘనత ఉంది. అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటి? ఒకవేళ ఎవరైనా మాట్లాడారో, మధ్యలో ఏదైనా వృధా కార్యకలాపాలు చేశారో అంటే వారు జుమా యొక్క సవాబును కోల్పోయారు.

ఇక కొందరు ఒక ప్రశ్న అడుగుతారు. వచ్చేసరికి ఏదైనా ఆలస్యం అయిపోయింది, మేము మస్జిద్‌లోకి వచ్చాము, ఇమామ్ అజాన్ ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఏం చేయాలి? రెండు రకాతులు సున్నతులు చేసుకోవాలా? లేకుంటే అజాన్ అయ్యేవరకు మేము వేచి ఉండాలా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడానికి? అయితే సోదర మహాశయులారా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడం చాలా పుణ్యకార్యం, కానీ ఇమామ్ యొక్క ఖుత్బా వినడం అనేది అజాన్ యొక్క జవాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది గనక, సంక్షిప్తంగా రెండు రకాతులు చేసుకొని కూర్చోవాలి, ఇమామ్ యొక్క ఖుత్బా శ్రద్ధగా వినాలి.

అల్లాహ్ మనందరికీ మన జీవితంలోని ప్రతీ సమస్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి పరిష్కారాన్ని స్వీకరించి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక.


494. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]

జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్


ఇతరములు:

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి

జుమా (శుక్ర వారం)
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం [ఆడియో, టెక్స్ట్]

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం
https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.

జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ‏”‌‏
అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”.
(అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.)
(సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ‏”‌‏
అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”.
(అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم ‏ “‏ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ‏”‏
అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.

(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ ఫ అహ్సనల్ వుదూఅ సుమ్మ అతల్ జుముఅత ఫదనా వస్తమఅ వఅన్సత గుఫిర లహు మాబైనహు వబైనల్ జుముఅ వజియాదతు సలాసతి అయ్యామ్, వమన్ మస్సల్ హసా ఫఖద్ లగా”.

(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).

ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.

మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.

ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.

عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ، قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ “‏ لاَ يَغْتَسِلُ رَجُلٌ يَوْمَ الْجُمُعَةِ، وَيَتَطَهَّرُ مَا اسْتَطَاعَ مِنْ طُهْرٍ، وَيَدَّهِنُ مِنْ دُهْنِهِ، أَوْ يَمَسُّ مِنْ طِيبِ بَيْتِهِ، ثُمَّ يَخْرُجُ فَلاَ يُفَرِّقُ بَيْنَ اثْنَيْنِ، ثُمَّ يُصَلِّي مَا كُتِبَ لَهُ، ثُمَّ يُنْصِتُ إِذَا تَكَلَّمَ الإِمَامُ، إِلاَّ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ الأُخْرَى ‏”‌‏

అన్ సల్మానల్ ఫారిసీ రదియల్లాహు అన్హు ఖాల్, ఖాలన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం, “లా యగ్తసిలు రజులున్ యౌమల్ జుముఅ, వ యతతహ్హరు మస్తతాఅ మిన్ తుహ్రిన్, వ యద్దహిను మిన్ దుహ్నిహి, అవ్ యమస్సు మిన్ తీబి బైతిహి, సుమ్మ యఖ్రుజు ఫలా యుఫర్రిఖు బైనస్నైన్, సుమ్మ యుసల్లీ మా కుతిబ లహు, సుమ్మ యున్సితు ఇదా తకల్లమల్ ఇమాము, ఇల్లా గుఫిర లహు మా బైనహు వబైనల్ జుముఅతిల్ ఉఖ్రా”.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).

ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.

అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/