దాన ధర్మాల విశిష్టత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దాన ధర్మాల విశిష్టత
సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/UA3H7Z8PhLY [34 నిముషాలు]

1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ?
2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ?
3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ?
4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ?
5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ?
8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ?
9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ?
10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم
ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.

అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.

ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا

వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.

అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:

مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ

అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.

మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.

సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.

అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

إن الصدقة لتطفئ عن أهلها حر القبور
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్)
నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.

అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس
(కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్)
ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.

అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.

అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:

إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ)
నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.

మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.

దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:

ملكان يناديان
(మలకాని యునాదియాని)
ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.

అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?

اللهم أعط منفقا خلفا
(అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్)
ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.

దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.

ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:

ما نقصت صدقة من مال
(మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్)
దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.

తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:

قال الله: أنفق يا ابن آدم أنفق عليك
(ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్)
ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.

ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.

అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:

أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا
(అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా)
ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.

అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.

మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.

ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.

ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.

ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.

మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.

అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:

مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً
అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.

ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.

కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.

ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.

అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.

మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.

ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.

అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.

అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.

మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى
(అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా)
నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.

అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.

అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:

أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ
(అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న)
ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:

يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها
(యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా)
ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.

ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى
(అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)

నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.

ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:

إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول
(ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్)
ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.

కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.

రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్‌ఫామ్‌లో, స్టేటస్‌లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్‌లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:

ومن تصدق يرائي فقد أشرك
(వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక)
ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.

అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.

మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.

ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!

ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=28200

జకాతు & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

ఇస్లాంలో పవిత్ర మాసాలు, రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? [2 వీడియోలు & టెక్స్ట్]

మొదటి భాగం:

పార్ట్ 1: ఇస్లాం లో పవిత్ర మాసాల విషయం, వాటి ప్రాముఖ్యత, మరియు వాటిలో జుల్మ్ (అన్యాయం) చేసుకోకూడదు
https://www.youtube.com/watch?v=lDeA6oFXxIc
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [28 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త రజబ్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇది ఇస్లామీయ క్యాలెండర్‌లోని నాలుగు పవిత్ర మాసాలలో ఒకటి అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. ఈ పవిత్ర మాసాలలో అన్యాయానికి (జుల్మ్) పాల్పడటం తీవ్రంగా నిషేధించబడింది. పాపాలు చేయడం మరియు అల్లాహ్ ఆదేశాలను విస్మరించడం ద్వారా మనిషి తనకు తాను అన్యాయం చేసుకుంటాడని వక్త వివరిస్తారు. షిర్క్, అవిధేయత, మరియు ఇతరులను పీడించడం వంటివి ఆత్మపై చేసుకునే అన్యాయానికి ఉదాహరణలుగా పేర్కొన్నారు. జీవితం అశాశ్వతమని, ఎప్పుడైనా మరణం సంభవించవచ్చని గుర్తు చేస్తూ, పాపాలకు పశ్చాత్తాపం చెంది (తౌబా), అల్లాహ్ వైపునకు మరలాలని వక్త ఉద్భోదిస్తారు.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
[బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్]
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

మహాశయులారా! ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల రజబ్ నెల మొదలైపోయింది. ప్రత్యేకంగా రజబ్ నెల విషయంలో ఏదైనా ప్రసంగం అవసరం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది మన ముస్లిం సోదర సోదరీమణులు రజబ్ నెలలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాత్రం తెలుపని కొన్ని కార్యాలు చేస్తున్నారు. వాటిని ఖండించడానికి రజబ్ విషయంలో ప్రత్యేకంగా ప్రసంగం అవసరం ఉంటుంది.

ఒక విషయం గమనించండి, మనమందరం ఎవరి దాసులం? అల్లాహ్ దాసులం. మనమందరం అల్లాహ్ యొక్క దాసులమైనప్పుడు, అల్లాహ్ కు ఇష్టమైన విధంగానే మనం ఆయన దాస్యం చేయాలి, ఆయనను ఆరాధించాలి. నిజమే కదా? ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. కానీ ఆయన దాస్యం, ఆయన ఆరాధన ఎలా చేయాలి, అది చూపించడానికి అల్లాహ్ ఏం చేశాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకు ఒక ఆదర్శంగా పంపించారు. అందు గురించి మహాశయులారా, మనం ఏ కార్యం చేసినా కానీ దానికి అల్లాహ్ వైపు నుండి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు నుండి సాక్ష్యాధారం, రుజువు, దలీల్ తప్పనిసరిగా అవసరం ఉంది.

సామాన్యంగా ఈ రోజుల్లో ఎంతోమంది ఏమనుకుంటున్నారు? పర్వాలేదు, ఇది మంచి కార్యమే, ఇది చేయవచ్చు అన్నటువంటి భ్రమలో పడి ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ అల్లాహ్ వద్ద మనకు ఇష్టమైనటువంటి, మనకు మెచ్చినటువంటి పని స్వీకరించబడదు. అల్లాహ్ వద్ద ఏదైనా పని, ఏదైనా సత్కార్యం స్వీకరించబడడానికి అది అల్లాహ్ లేక ప్రవక్త ఆదేశపరంగా ఉండాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన పద్ధతి ప్రకారంగా ఉండడం తప్పనిసరి.

రజబ్ నెల దీనికి ఏదైనా ప్రత్యేకత ఉంటే, ఏదైనా గౌరవప్రదం ఉంటే, ఒకే ఒక విషయం ఉంది. అదేమిటి? అల్లాహ్ త’ఆలా తన ఇష్టానుసారం సంవత్సరంలో 12 నెలలు నిర్ణయించాడు. ఆ 12 నెలల్లో నాలుగు నెలలను గౌరవప్రదమైనవిగా ప్రస్తావించాడు. ఆ నాలుగు గౌరవప్రదమైన మాసాల్లో రజబ్ కూడా ఒకటి ఉంది.

సూరె తౌబా ఆయత్ నంబర్ 36 లో అల్లాహ్ త’ఆలా చెప్పాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర – అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.)”  (9:36)

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ వద్ద పన్నెండు నెలలు ఉన్నాయి. ఫీ కితాబిల్లాహ్, ఈ విషయం అల్లాహ్ వద్ద ఉన్నటువంటి గ్రంథంలో కూడా వ్రాసి ఉంది. ఎప్పటి నుండి ఉంది?

يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ
[యౌమ ఖలకస్సమావాతి వల్ అర్ద్]
ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన నాటి నుండి

భూమి ఆకాశాలను ఆయన సృష్టించినప్పటి నుండి ఈ నిర్ణయం, ఈ విషయం ఉంది.

مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ
[మిన్హా అర్బఅతున్ హురుమ్]
వాటిలో నాలుగు నెలలు పవిత్రమైనవి.

ఆ 12 మాసాల్లో నాలుగు నెలలు, నాలుగు మాసాలు హురుమ్ – నిషిద్ధమైనవి అన్న ఒక భావం వస్తుంది హురుమ్ కు, హురుమ్ అన్న దానికి మరో భావం ఇహ్తిరామ్, హుర్మత్, గౌరవప్రదమైనవి, ఎంతో గొప్పవి అన్నది కూడా భావం వస్తుంది.

ఆయత్ యొక్క ఈ భాగం ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, అల్లాహ్ ఎప్పటి నుండి భూమి ఆకాశాలను సృష్టించాడో అప్పటి నుండి నెలల సంఖ్య ఎంత? సంవత్సరంలో ఎన్ని నెలలు? 12 నెలలు. దీని ద్వారా మనకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఎవరెవరి వద్ద వారు లెక్కలు చేసుకోవడానికి రోజుల సంఖ్య, నెలల సంఖ్య ఏది ఉన్నా గానీ అల్లాహ్ త’ఆలా నిర్ణయించినటువంటి నెలల సంఖ్య సంవత్సరంలో 12 నెలలు. ఆ నెలల పేర్లు ఏమిటి? మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీసుల్లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. మరో విషయం మనకు ఏం తెలిసిందంటే అల్లాహ్ వద్ద గ్రంథం ఏదైతే ఉందో, లౌహె మహ్ఫూజ్ అని దాన్ని అంటారు, అందులో కూడా ఈ విషయం రాసి ఉంది. మరియు నాలుగు నెలలను అల్లాహ్ త’ఆలా గౌరవప్రదమైనవిగా, నిషిద్ధమైనవిగా ప్రస్తావించాడు. ఆ తర్వాత చెప్పాడు:

ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ
[జాలికద్దీనుల్ ఖయ్యిమ్]
ఇదే సరైన ధర్మం. (9:36)

ఇదే సరైన ధర్మం అనడానికి భావం ఏంటంటే, కొందరు నెలల సంఖ్యలో ఏదైతే తారుమారు చేసుకున్నారో అది తప్పు విషయం. మరి ఎవరైతే కొన్ని నెలలను అల్లాహ్ నిషిద్ధపరిచినటువంటి నెలలను ధర్మసమ్మతంగా చేసుకొని, అల్లాహ్ నిషేధించిన కార్యాలు వాటిలో చేస్తూ ఏ తప్పుకైతే గురయ్యారో, అది వాస్తవం కాదు. అల్లాహ్ ఏ విషయం అయితే తెలుపుతున్నాడో అదే సరైన విషయం, అదే నిజమైన విషయం, అదే అసలైన ధర్మం. దీనికి భిన్నంగా, విరుద్ధంగా ఎవరికీ చేయడానికి అనుమతి లేదు. ఇందులో అల్లాహ్ త’ఆలా ఒక ప్రత్యేక ఆదేశం మనకు ఏమి ఇచ్చాడంటే:

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. (9:36)

ఇందులో మీరు ఏ మాత్రం అన్యాయం చేసుకోకండి. ఏ మాత్రం జుల్మ్ చేసుకోకండి.

ఇక సోదరులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినటువంటి హదీస్ ఏమిటంటే, సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది,

“అల్లాహ్ త’ఆలా భూమి ఆకాశాలను పుట్టించినప్పటి స్థితిలో నెలల సంఖ్య ఎలా ఉండిందో, అలాగే ఇప్పుడు అదే స్థితిలో తిరిగి వచ్చింది. సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలల్లో నాలుగు నెలలు నిషిద్ధమైనవి. ఆ నాలుగు, మూడు నెలలు క్రమంగా ఉన్నాయి. జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. ఈ మూడు నెలలు కంటిన్యూగా, క్రమంగా ఉన్నాయి. మరియు ముదర్ వంశం లేక ముదర్ తెగ వారి యొక్క రజబ్, అది జమాదిల్ ఆఖిరా మరియు షాబాన్ మధ్యలో ఉంది.”

ఇక్కడ ఈ హదీసులో కొన్ని విషయాలు మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ప్రభవింపక ముందు మక్కావాసులు, ఆ కాలం నాటి ముష్రికులు, బహుదైవారాధకులు ఈ నాలుగు నెలలను గౌరవించేవారు. ఈ నాలుగింటిలో మూడు నెలలు క్రమంగా ఉన్నాయి కదా, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం.

అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఒక దురాచారం, ఒక చెడ్డ అలవాటు, కొన్ని మహా ఘోరమైన పాపాల్లో ఒకటి ఏమిటి? ఇతరులపై అత్యాచారం చేయడం, ఇతర సొమ్మును లాక్కోవడం, దొంగతనాలు చేయడం. ఇటువంటి దౌర్జన్యాలు ఏదైతే వారు చేసేవారో, వారు ఈ నిషిద్ధ మాసాల్లో, గౌరవమనమైన నెలల్లో అలాంటి ఆ చెడు కార్యాల నుండి దూరం ఉండేవారు. విషయం అర్థమవుతుందా? అల్లాహ్ తో షిర్క్ చేసేవారు, ఇంకెన్నెన్నో తప్పు కార్యాలు, పాపాలు చేసేవారు. ప్రజలను పీడించేవారు, బలహీనుల హక్కులను కాజేసేవారు, ఎంతో దౌర్జన్యం, అత్యాచారాలు చేసేవారు. కానీ, ఈ మూడు నెలలు వారు ఎలాంటి దౌర్జన్యానికి, ఇతరులపై ఏ అత్యాచారం చేయకుండా, దొంగలించకుండా వారు శాంతిగా ఉండేది. కానీ మూడు నెలలు కంటిన్యూగా శాంతిపరంగా ఉండడం వారికి భరించలేని విషయమై, మరో చెడ్డ కార్యం ఏం చేశారో తెలుసా? జుల్ హిజ్జాలో హజ్ జరుగుతుంది. అందుగురించి జుల్ ఖాదా, జుల్ హిజ్జా ఈ రెండు మాసాలు గౌరవించేవారు.

కానీ ముహర్రం నెల గురించి ఏమనేవారు? ఈసారి ముహర్రం సఫర్ లో వస్తుంది, ఈ ముహర్రంని ఇప్పుడు మనం సఫర్ గా భావిద్దాము. సఫర్ నెల ఎప్పుడు ఉంది? రెండో నెల. ముహర్రం తర్వాత సఫర్ ఉంది కదా. వాళ్ళు ఏమనేవారు? సఫర్ ను ముహర్రం గా చేసుకుందాము, ఈ ముహర్రంను సఫర్ గా చేసుకుందాము. ఇప్పుడు ఈ ముహర్రం మాసాన్ని ఏదైతే సఫర్ గా వారు అనుకున్నారో, దొంగతనం చేసేవారు, లూటీ చేసేవారు, ఇంకా పాప కార్యాలకు పాల్పడేవారు. ఆ తర్వాత నెల ఏదైతే ఉందో, దాన్ని ముహర్రంగా భావించారు కదా, అప్పుడు కొంచెం శాంతిగా ఉండేవారు. ఎందుకంటే మూడు నెలలు కంటిన్యూగా ఉండడం వారికి కష్టతరంగా జరిగింది. అయితే అలాంటి విషయాన్ని కూడా అల్లాహ్ త’ఆలా ఖండించాడు. సూరె తౌబా ఆయత్ నంబర్ 37 లో ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే చెప్పారో, కాలం తిరిగి తన అసలైన స్థితిలోకి, రూపంలోకి వచ్చింది అని ఏదైతే ప్రవక్త చెప్పారో, ఈ విషయం ఎప్పుడు చెప్పారు ప్రవక్త? తాను హజ్ ఏదైతే సంవత్సరంలో చేశారో ఆ సంవత్సరం చెప్పారు. ఆ సంవత్సరంలో నెలల్లో ఎలాంటి తారుమారు లేకుండా, వెనక ముందు లేకుండా, అల్లాహ్ త’ఆలా సృష్టించినప్పటి స్థితిలో ఎట్లానైతే అసల్ స్థితిలో ఉండెనో, అదే స్థితిలో ఉండినది. అదే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

మరో విషయం ఇందులో గౌరవించగలది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నాలుగు మాసాలు నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి. వాటిలో మూడు కంటిన్యూగా ఉన్నాయి, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. నాలుగవది రజబ్. ఆ రజబ్ అని కేవలం చెప్పలేదు, ఏం చెప్పారు? రజబ్ ముదర్ అని చెప్పారు. ముదర్ ఒక తెగ పేరు. కబీలా అని అంటాం కదా. ప్రవక్త కాలంలో అప్పుడు ఇంకా ఎన్నో తెగలు ఉండేవి. జమాదుల్ ఆఖిరా తర్వాత రజబ్ ఉంది, రజబ్ తర్వాత షాబాన్. అయితే కొన్ని తెగలు ఈ రజబ్ ను రజబ్ గా భావించకుండా, రమదాన్ ను రజబ్ గా కొందరు అనేవారు. రమదాన్ మాసాన్ని ఏమనేవారు? ఎవరు? వేరే కొన్ని తెగల వాళ్ళు. కానీ ముదర్ తెగ ఏదైతే ఉండెనో, ఆ తెగ వారు రజబ్ నే రజబ్ గా నమ్మేవారు. రజబ్ ను ఒక గౌరవప్రదమైన, అల్లాహ్ నిషేధించిన ఒక మాసంగా వారు విశ్వసించేవారు. అందు గురించి ప్రజలందరికీ తెలియడానికి, వేరే ప్రజలు ఎవరైతే రమదాన్ ను రజబ్ గా చేసుకున్నారో ఆ రజబ్ కాదు, ముదర్ ఏ రజబ్ నైతే రజబ్ మాసంగా నమ్ముతున్నారో మరి ఏదైతే జమాదుల్ ఆఖిరా తర్వాత, షాబాన్ కంటే ముందు ఉందో ఆ రజబ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశదీకరించారు, వివరించారు.

అయితే ఈ గౌరవప్రదమైన మాసంలో అల్లాహ్ త’ఆలా మనల్ని ఒక ముఖ్యమైన విషయం నుండి ఆపుతున్నాడు. అదేమిటి?

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
మీరు ఈ గౌరవప్రదమైన మాసంలో జుల్మ్ చేయకండి, జుల్మ్ చేసుకోకండి, అన్యాయం చేయకండి, అన్యాయం చేసుకోకండి.

ఇక్కడ కొందరు ఇలాగ అడగవచ్చు, ఈ నాలుగు మాసాల్లోనే జుల్మ్ చేయరాదు, మిగతా మాసాల్లో చేయవచ్చా? అలా భావం కాదు. ప్రతిచోట అపోజిట్ భావాన్ని తీసుకోవద్దు. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. మన సమాజంలో ఎవరైనా మస్జిద్ లో కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా అబద్ధం పలికాడు అనుకోండి, మనలో ఒక మంచి వ్యక్తి ఏమంటాడు? అరె, ఏంట్రా, మస్జిద్ లో ఉండి అబద్ధం మాట్లాడుతున్నావా? అంటారా లేదా? అంటే భావం ఏంటి? మస్జిద్ బయట ఉండి అబద్ధం మాట్లాడవచ్చు అనే భావమా? కాదు. ఆ బయటి స్థలాని కంటే ఈ మస్జిద్ యొక్క స్థలం ఏదైతే ఉందో దీనికి ఒక గౌరవం అనేది, ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. నువ్వు బయట చెప్పినప్పుడు, అబద్ధం పలికినప్పుడు, ఏదీ ఏమీ నీవు ఆలోచించకుండా, కనీసం ఇప్పుడు నీవు అల్లాహ్ యొక్క గృహంలో ఉన్నావు, మస్జిద్ లో ఉన్నావు. ఈ విషయాన్ని గ్రహించి అబద్ధం ఎందుకు పలుకుతున్నావు? అక్కడ విషయం మస్జిద్ బయట అబద్ధం పలకవచ్చు అన్న భావం కాదు. మస్జిద్ లో ఉండి ఇంకా మనం చెడులకు, అన్ని రకాల పాపాలకు ఎక్కువగా దూరం ఉండాలి, దూరంగా ఉండాలి అన్నటువంటి భావం. అలాగే ప్రతి నెలలో, ప్రతి రోజు జుల్మ్ కు, అన్యాయానికి, దౌర్జన్యానికి, అత్యాచారానికి దూరంగా ఉండాలి. కానీ ఈ నిషిద్ధ మాసాల్లో, ఈ నాలుగు మాసాల్లో ప్రత్యేకంగా దూరం ఉండాలి. ఇది అయితే తెలిసింది. కానీ జుల్మ్ అని ఇక్కడ ఏదైతే చెప్పబడిందో, ఆ జుల్మ్ అన్నదానికి భావం ఏంటి? మరి అల్లాహ్ త’ఆలా ఏమన్నాడు ఇక్కడ?

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
మీ ఆత్మలపై మీరు అన్యాయం చేసుకోకండి.

మీ ఆత్మలపై మీరు దౌర్జన్యం చేసుకోకండి అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా. ఎవరైనా తెలివిమంతుడు, బుద్ధి జ్ఞానం గలవాడు, తనకు తాను ఏదైనా అన్యాయం చేసుకుంటాడా? చేసుకోడా? అందరూ ఇదే నిర్ణయంపై ఉన్నారు కదా. మరి అల్లాహ్ త’ఆలా అదే విషయం అంటున్నాడు, మీరు అంటున్నారు చేసుకోరు. మరి వారు చేసుకోకుంటే, అల్లాహ్ త’ఆలా ఎందుకు చేసుకోకండి అని అంటున్నాడు? వారు చేసుకుంటున్నారు గనుకనే అల్లాహ్ త’ఆలా చేసుకోకండి అని అంటున్నాడు. అంటే మన ఆత్మలపై మనం అన్యాయం ఎలా చేసుకుంటున్నాము? మన ఆత్మలపై మనం జుల్మ్ ఎలా చేస్తున్నాము? ఈ విషయం మనం గ్రహించాల్సింది.

ఈ విషయాన్ని మనం ఖురాన్, హదీస్ ఆధారంగా సరైన విధంలో అర్థం చేసుకుంటే, మన జీవితాల్లో వాస్తవానికి ఎంతో గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఇమాం తబరీ రహమతుల్లా అలైహి చెప్పారు: “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్”, మీరు ఇందులో ప్రత్యేకంగా ఈ మాసాల్లో మీపై అన్యాయం చేసుకోకండి అంటే ఏమిటి? ఇర్తికాబుల్ మాసియా వ తర్కుత్తాఆ. జుల్మ్ దేన్నంటారు? ఇర్తికాబుల్ మాసియా – పాప కార్యానికి పాల్పడడం వ తర్కుత్తాఆ – అల్లాహ్ విధేయతను, పుణ్య కార్యాన్ని వదులుకోవడం. పాపానికి పాల్పడడం, పుణ్యాన్ని వదులుకోవడం, దీన్ని ఏమంటారు? జుల్మ్ అంటారు.

సామాన్యంగా మన సౌదీ దేశంలో ఉండి, జుల్మ్ అంటే ఏంటి అంటే, కఫీల్ మనకు మన జీతాలు ఇవ్వకపోవడం అని అనుకుంటాము. అది కూడా ఒక రకమైన జుల్మ్. కానీ అందులోనే జుల్మ్ బంధించిలేదు. జుల్మ్ యొక్క భావం కొంచెం విశాలంగా ఉంది. ఇమాం కుర్తుబీ రహమతుల్లా అలైహి చెప్పారు, “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్ బిర్తికాబి జునూబ్”, మీరు పాపాలకు పాల్పడి అన్యాయం చేసుకోకండి.

ఇక మీరు ఖురాన్ ఆయతులను పరిశీలిస్తే, ఎప్పుడైతే ఒక మనిషి అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని వదులుకుంటున్నాడో, పాటించడం లేదో, లేక అల్లాహ్ త’ఆలా ఏ దుష్కార్యం నుండి వారించాడో, చేయవద్దు అని చెప్పాడో, దానికి పాల్పడుతున్నాడో, అతడు వాస్తవానికి తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతున్నాడు.

ఉదాహరణకు స్కూల్ లో ఒక స్టూడెంట్ హోంవర్క్ చేసుకొని రాలేదు. అతనికి తెలుసు, నేను ఈ రోజు హోంవర్క్ ఇంట్లో చేయకుంటే రేపటి రోజు స్కూల్ లో వెళ్ళిన తర్వాత టీచర్ నన్ను దండిస్తాడు, కొడతాడు, శిక్షిస్తాడు. తెలుసు విషయం. తెలిసి కూడా అతను హోంవర్క్ చేయలేదు. వెళ్ళిన తర్వాత ఏమైంది? టీచర్ శిక్షించాడు అతన్ని. అతడు స్వయంగా తనపై అన్యాయం చేసుకున్నవాడు అయ్యాడా లేదా? ఎట్లా? అతనికి ఏ దెబ్బలైతే తగిలిందో టీచర్ వైపు నుండి, లేక ఏ శిక్ష అయితే టీచర్ వైపు నుండి అతనిపై పడిందో, అది ఎందువల్ల? ముందు నుండే అతడు అతనికి టీచర్ ఏదైతే ఆదేశం ఇచ్చాడో హోంవర్క్ చేయాలని అది చేయనందుకు. ఈ విషయం ఈ సామెత, ఈ ఉదాహరణ అర్థమవుతుంది కదా. అలాగే అల్లాహ్ త’ఆలా మనకు డైరెక్ట్ గా స్వయంగా ఖురాన్ ద్వారా గానీ, లేకుంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా గానీ ఏ ఆదేశాలు అయితే ఇచ్చాడో, వాటిని పాటించకపోవడం, వేటి నుండి అల్లాహ్ త’ఆలా మనల్ని వారించాడో, ఇవి చేయకండి అని చెప్పాడో, వాటికి పాల్పడడం, ఇది మనపై మనం అన్యాయం చేసుకుంటున్నట్లు.

దీనికి ఖురాన్ సాక్ష్యం చూడండి సూరె బఖరా ఆయత్ నంబర్ 54.

إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ
[ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్ బిత్తిఖాజికుముల్ ఇజ్ల్]
మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు.” (2:54)

ఇది మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ వారితో చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాంని అల్లాహ్ త’ఆలా తూర్ పర్వతం వైపునకు పిలిపించాడో, ఆయన అటు వెళ్లారు, ఇటు కొందరు ఒక ఆవు దూడను తయారు చేశారు, బంగారంతో తయారు చేసి అందులో ఒక వ్యక్తి ఏమన్నాడు? ఇదిగో మూసా అల్లాహ్ పిలుస్తున్నాడు అని ఎక్కడికో వెళ్ళాడు. మీ దేవుడు ఇక్కడ ఉన్నాడు, వీటిని మీరు పూజించండి అని చెప్పాడు, అస్తగ్ఫిరుల్లాహ్. మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చిన తర్వాత వారిపై చాలా కోపగించుకున్నాడు. చెప్పాడు, “ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్”, మీరు మీ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారు. “బిత్తిఖాజికుముల్ ఇజ్ల్”, ఈ దూడను ఒక దేవతగా చేసుకొని. మీకు ఆరాధ్య దైవంగా మీరు భావించి, మీపై అన్యాయం చేసుకున్నారు. ఇక ఈ ఆయత్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది? షిర్క్ అతి గొప్ప, అతి భయంకరమైన, అతి చెడ్డ దౌర్జన్యం, అతి చెడ్డ జుల్మ్.

ఇంకా అలాగే సోదరులారా, అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పాటించకపోవడం, అల్లాహ్ కు కృతజ్ఞత, శుక్రియా చెప్పుకోకపోవడం, తెలుపుకోకపోవడం ఇది కూడా మహా దౌర్జన్యం, జుల్మ్ కింద లెక్కించబడుతుంది. మరి మూడు ఆయతుల తర్వాత, అదే బనీ ఇస్రాయిల్ పై అల్లాహ్ త’ఆలా వారికి ఏ వరాలైతే ప్రసాదించాడో, వారికి అల్లాహ్ త’ఆలా కారుణ్యాలు ఇచ్చాడో ప్రస్తావిస్తూ: “వ జల్లల్నా అలైకుముల్ గమామ్”, మేము మీపై మేఘాల ద్వారా నీడ కలిగించాము. “వ అన్జల్నా అలైకుముల్ మన్న వస్సల్వా”, మన్ మరియు సల్వా తినే మంచి పదార్థాలు మీకు ఎలాంటి కష్టం లేకుండా మీకు ఇచ్చుకుంటూ వచ్చాము. “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్”, మేము ప్రసాదించిన ఈ ఆహారాన్ని మీరు తినండి. కానీ ఏం చేశారు వాళ్ళు? కృతజ్ఞత చూపకుండా దానికి విరుద్ధంగా చేశారు. మూసా ప్రవక్త మాటను వినకుండా అవిధేయతకు పాల్పడ్డారు. అల్లాహ్ అంటున్నాడు, “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్ వమా జలమూనా”, అయితే వారు మాపై అన్యాయం చేయలేదు, మాపై జుల్మ్ చేయలేదు. “వలాకిన్ కానూ అన్ఫుసహుమ్ యజ్లిమూన్”, వారు తమ ఆత్మలపై మాత్రమే అన్యాయం చేసుకున్నారు.

ఎంత మంది మీలో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు? ఎందుకంటే భార్య భర్తల జీవిత విషయంలో కూడా అల్లాహ్ త’ఆలా ఒక విషయాన్ని తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నట్లు అని అంటున్నాడు. కానీ సామాన్యంగా మనం ఈ విషయం గమనించము. నేనే పురుషుడిని, నేనే మగవాడిని, భార్య నాకు బానిస లాంటిది అన్నటువంటి తప్పుడు భావాల్లో పడి ఎంతో పీడిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఎప్పుడైతే జీవితాల్లో ప్రేమానురాగాలు తగ్గుతాయో, మందగిస్తాయో, మంచి విధంగా జీవించి ఉండరు, మంచి విధంగా తెగతెంపులు చేసుకోకుండా పీడిస్తూ ఉంటారు. ఇది మహా పాపకార్యం. సూరె బఖరా 231 ఆయత్ లో అల్లాహ్ చెప్తున్నాడు:

وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوا
[వలా తుమ్సికూహున్న జిరారల్ లితఅతదూ]
“వారిని నష్టపరచాలనే దురుద్దేశంతో (ఇద్దత్ సమయంలో) ఆపకండి. (2:231)

వారికి ఏదైనా నష్టం చేకూర్చడానికి మీరు వారిని ఆపి ఉంచకండి. “లితఅతదూ”, వారిపై ఏదైనా దౌర్జన్యం చేయడానికి, వారిపై ఏదైనా అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. అంటే ఆపుకొని ఉంచకండి అంటే విడాకులు ఇవ్వడం లేదు, ఇటు మంచి విధంగా ప్రేమపూర్వకమైన జీవితం గడపడం లేదు. అల్లాహ్ ఏమంటున్నాడు?

وَمَن يَفْعَلْ ذَٰلِكَ
[వమయ్ యఫ్అల్ జాలిక]
ఎవరైతే ఇలా చేస్తారో,

అల్లాహ్ ఒక ఆదేశం ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు? మీరు నష్టం చేకూర్చడానికి, అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. ఇక ఎవరైతే ఇలా చేస్తారో, “వమయ్ యఫ్అల్ జాలిక”, ఎవరైతే తమ భార్యలను వారిని పీడించడానికి, వారిపై అన్యాయం చేయడానికి, నష్టం చేకూర్చడానికి ఆపుకొని ఉంటారో,

فَقَدْ ظَلَمَ نَفْسَهُ
[ఫఖద్ జలమ నఫ్సహ్]
అతను తనపై అన్యాయం చేసుకుంటున్నాడు, తనపై జుల్మ్ చేస్తున్నాడు. (2:231)

చూడడానికి అతడు ఆమెపై దౌర్జన్యం చేస్తున్నాడు, కానీ వాస్తవానికి “జలమ నఫ్సహూ”, అతడు తనపై అన్యాయం చేసుకుంటున్నాడు. తనపై జుల్మ్ చేస్తున్నాడు.

ఇక ఈ అతడు తనపై ఎలా అన్యాయం చేస్తున్నాడు అనే విషయాన్ని వివరించడానికి ఎంతో సమయం అవసరం. ఇలాంటి ఉదాహరణలు మన సమాజంలో ఎంతో, ఎన్నో మనకు కనబడతాయి. కానీ నేను చెప్పబోయే విషయం ఏంటి? ఎప్పుడైతే మనిషి అల్లాహ్ యొక్క ఆజ్ఞను దాటుతాడో, అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడతాడో, అతడు వాస్తవానికి తనపై జుల్మ్ చేసుకున్నవాడు అవుతున్నాడు.

ఈ విధంగా ఖురాన్ లో చూస్తూ పోతే ఎన్నో ఆయతులు మనకు కానవస్తాయి. కానీ సోదరులారా, గమనించవలసిన విషయం ఏంటంటే అల్లాహ్ త’ఆలా ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాల్లో, ఇంకా మిగతా 12 మాసాల్లో కూడా మనల్ని అన్ని రకాల జుల్మ్, అన్ని రకాల పాప కార్యాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరి వైపు నుండి ఏదైనా అన్యాయం, జుల్మ్ వారి తమ ఆత్మలపై జరిగితే ఏం చేయాలి? సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో చెప్పాడు:

وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ غَفُورًا رَّحِيمًا

[వమయ్ యఅమల్ సూఅన్ అవ్ యజ్లిమ్ నఫ్సహూ సుమ్మ యస్తగ్ఫిరిల్లాహ యజిదిల్లాహ గఫూరర్ రహీమా]
ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు.” (4:110)

ఎవరైనా ఏదైనా పాప కార్యానికి పాల్పడితే, లేదా తన ఆత్మపై తాను జుల్మ్ చేసుకుంటే, ఆ తర్వాత స్వచ్ఛమైన రూపంలో అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే, అల్లాహ్ ను క్షమించేవాడు, కరుణించేవాడు, మన్నించేవాడుగా పొందుతాడు.

అందు గురించి సోదరులారా, ఇకనైనా గమనించండి. జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలుసా? ఎప్పుడు ప్రాణం పోతుందో తెలుసా మనకు? ఏ మాత్రం తెలియదు. ఇంచుమించు నెల కాబోతుంది కావచ్చు. ఒక టైలర్, పెద్ద మనిషి ఇక్కడ చనిపోయి. సామాన్యంగా వచ్చాడు, భోజనం చేశాడు, హాయిగా స్నేహితులతో కూర్చున్నాడు, కొంత సేపట్లోనే నాకు ఛాతీలో చాలా నొప్పి కలుగుతుంది అని, కొంత సేపటి తర్వాత, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళండి, ఇక నేను భరించలేను అన్నాడు. మిత్రులు బండిలో వేసుకొని వెళ్తున్నారు, హాస్పిటల్ చేరకముందే ఈ జీవితాన్ని వదిలేశాడు. మనలో కూడా ఎవరికి ఎప్పుడు చావు వస్తుందో తెలియదు. ఇంకా మనం ఏ కలలు చూసుకుంటూ ఉన్నాము? ఇంకా ఎందుకు మనం పాప కార్యాల్లో జీవితం గడుపుతూ ఉన్నాము? అల్లాహ్ ఆదేశాలకు దూరంగా, ఖురాన్ నుండి దూరంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలకు దూరంగా, నమాజులను వదులుకుంటూ, ఇంకా ఇతర పాప కార్యాల్లో మనం మునిగిపోతూ, ఇంకెన్ని రోజులు మనం ఇలాంటి జీవితం గడుపుతాము?

సోదరులారా, వాస్తవానికి ఏ ఒక్క మనిషి ఏ చిన్న పాపం చేసినా గానీ అతను తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతాడు. కానీ ఇకనైనా గుణపాఠం తెచ్చుకొని సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో అల్లాహ్ చెప్పినట్లుగా, వెంటనే మనం ఇస్తిగ్ఫార్, తౌబా, పశ్చాత్తాపం చెందుతూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే తప్పకుండా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు.

ఇక రజబ్ మాసంలో ఇంకా ఏ దురాచారాలు, ఏ బిదత్లైతే జరుగుతాయో, వాటి గురించి మనం వచ్చే వారంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


రెండవ భాగం:



రజబ్ మాసంలో జరిగే బిద్’అత్ (దురాచారాలు)

రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? 
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=cNwTV9mjw1g [29 నిముషాలు]

ఈ ప్రసంగంలో, రజబ్ నెల యొక్క పవిత్రత మరియు ఆ నెలలో ముస్లింలు దూరంగా ఉండవలసిన పాపాల గురించి వివరించబడింది. అజ్మీర్ ఉర్సు, ప్రత్యేక నమాజులు (సలాతుర్ రగాఇబ్), ప్రత్యేక ఉపవాసాలు మరియు 27వ రాత్రి మేరాజ్ ఉత్సవాలు వంటివి ఇస్లాంలో లేని నూతన కల్పనలని (బిద్అత్) వక్త స్పష్టం చేశారు. అనంతరం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గగన ప్రయాణం (ఇస్రా మరియు మేరాజ్) యొక్క అద్భుత సంఘటనను వివరించారు. ఈ ప్రయాణం ఎందుకు జరిగింది, దాని సందర్భం, ప్రయాణంలో ఎదురైన అద్భుతాలు, వివిధ ప్రవక్తలతో సమావేశం, మరియు ఐదు పూటల నమాజ్ వంటి బహుమానాలు ఎలా లభించాయో వివరించారు. మేరాజ్ నుండి మనం నేర్చుకోవలసిన అసలైన గుణపాఠం ఉత్సవాలు జరుపుకోవడం కాదని, అల్లాహ్ ప్రసాదించిన ఆదేశాలను, ముఖ్యంగా నమాజ్‌ను మన జీవితంలో ఆచరించడమని నొక్కిచెప్పారు.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బఅద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా మరియు ఆయన సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యం వర్షించుగాక. ఆ తర్వాత…

గతవారంలో మనం రజబ్ నెలలో అల్లాహ్ మనకు ఇచ్చిన ఆదేశం ఏంటి? రజబ్ నెలతో పాటు మిగతా మూడు నెలలు, అంటే టోటల్ నాలుగు గౌరవప్రదమైన నెలలలో ప్రత్యేకంగా జుల్మ్ నుండి, అన్యాయం, అత్యాచారం, దౌర్జన్యం వీటి నుండి దూరం ఉండాలన్న ఆదేశం అల్లాహ్ మనకిచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు అనండి, ఎంతోమంది ముస్లింలు ఈ రజబ్ నెలలో ఎన్నో దురాచారాలకు పాల్పడుతున్నారు.

ఉదాహరణకు, రజబ్ నెల మొదలైన వెంటనే, అజ్మీర్ అన్న ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడ ఉన్న ఒక సమాధికి ఎంతో గౌరవ స్థానం ఇచ్చి, దాని యొక్క దర్శనం, దాని యొక్క ఉర్స్, యాత్రలు చేయడం. వాస్తవానికి, సమాధిని ఇటుక సిమెంట్లతో కట్టి, దాని మీద గోపురాలు కట్టి, దానికి ఒక సమయం అని నిర్ణయించి ప్రజలు అక్కడికి రావడం, ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన కార్యం. అంతేకాకుండా మరో ఘోరమైన విషయం ఏమిటంటే, ఎందరో సామాన్య ప్రజలలో ఒక మాట చాలా ప్రబలి ఉంది. అదేమిటి? ధనవంతుల హజ్ మక్కాలో అవుతుంది, మాలాంటి బీదవాళ్లు ఏడుసార్లు అజ్మీర్‌కు వెళ్తే ఒక్కసారి హజ్ చేసినంత సమానం అని. ఇది కూడా మహా ఘోరమైన, పాపపు మాట. అల్లాహ్ త’ఆలా ఇహలోకంలో సర్వ భూమిలోకెల్లా హజ్ అన్నది కేవలం మక్కా నగరంలో కాబతుల్లా యొక్క తవాఫ్, సఫా మర్వా యొక్క సయీ, ముజ್ದలిఫా, అరఫాత్, మినా ఈ ప్రాంతాల్లో నిలబడటం, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి కార్యాలు చేయడం, ఇదే హజ్ కానీ, ఇది కాకుండా వేరే ఏదైనా సమాధి, వేరే ఏదైనా ప్రాంతం, ఏదైనా ప్రదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి, దానికి హజ్ లాంటి పేరు పెట్టుకోవడం ఇది చాలా ఘోరమైన పాపం.

ఇంకా మరికొందరు ఈ రజబ్ నెలలోని మొదటి వారంలో గురువారం రాత్రి, శుక్రవారానికి ముందు ఒక ప్రత్యేక నమాజ్ చదువుతారు. సలాతుర్ రగాఇబ్ అని దాని పేరు. ఇలాంటి నమాజ్ చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ ఒక్క హదీసు, ఏ ఒక్క ఆదేశం లేదు. పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు సహాబా-ఎ-కిరామ్ మరియు ఆ తర్వాత కాలాలలో శ్రేష్ఠ కాలాలలో వచ్చినటువంటి ధర్మవేత్తలు, ధర్మ పండితులు ఇలాంటి నమాజ్ గురించి ఏ ఒక్క ఆదేశం లేదు అని స్పష్టం చేశారు.

ఇంకా మరికొందరు ప్రత్యేకంగా రజబ్ నెలలో ఉపవాసాలు పాటిస్తారు. అయితే రజబ్ నెలలో ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించినట్లు ప్రవక్త ద్వారా ఏ రుజువు లేదు. కాకపోతే, ఎవరైనా ప్రతీ నెలలో సోమవారం, గురువారం అల్లాహ్ వద్ద సర్వ మానవుల కార్యాలు లేపబడతాయి గనుక, ఇతర నెలలో ఉంటున్నట్లు ఈ నెలలో కూడా ఉపవాసాలు ఉండేది ఉంటే అభ్యంతరం లేదు. ప్రతీ నెలలో మూడు ఉపవాసాలు ఉన్నవారికి సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త చెప్పారు గనుక, ఎవరైనా రజబ్ నెలలో కూడా మూడు ఉపవాసాలు ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే ఇతర రోజుల్లో కూడా వారు, ఇతర మాసాల్లో కూడా వారు ఉంటున్నారు గనుక. కానీ ప్రత్యేకంగా రజబ్ కు ఏదైనా ప్రాధాన్యత ఇస్తూ ఉపవాసం ఉండటం ప్రవక్తతో, సహాబాలతో రుజువు లేని విషయం.

అలాగే మరో దురాచారం ఈ రజబ్ నెలలో ఏమిటంటే, కొందరు 22వ తారీఖు నాడు రజబ్ కే కూండే అని చేస్తారు. అంటే ఓ ప్రత్యేకమైన కొన్ని వంటకాలు చేసి దానిపై ఫాతిహా, నియాజ్‌లు చేసి జాఫర్ సాదిక్ (రహ్మతుల్లాహి అలైహి) పేరు మీద మొక్కడమనండి, లేక ఆయన పేరు మీద నియాజ్ చేయడం అనండి. అయితే సోదరులారా, నియాజ్ అని ఏదైతే ఉర్దూలో అంటారో, మొక్కుకోవడం అని దానికి భావన వస్తుంది. అయితే ఇది కేవలం అల్లాహ్ గురించే చెల్లుతుంది. అల్లాహ్ కు కాకుండా ఇక వేరే ఎవరి గురించి ఇలాంటి నియాజ్‌లు చేయడం ధర్మ సమ్మతం కాదు. పోతే ఈ పద్ధతి, అంటే ఏదైనా ప్రత్యేక వంటకాలు చేసి, వాటి మీద కొన్ని సూరాలు చదివి ఊది నియాజ్‌లు చేయడం, ఇది ఈ నెలలో గాని, ఏ నెలలో గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ పద్ధతిని నేర్పలేదు. అందు గురించి ఇలాంటి దురాచారాల నుండి కూడా మనం దూరం ఉండాలి.

ఇంకొందరు మనం చూస్తాము, 27వ రాత్రి జాగారం చేస్తారు, రాత్రి మేల్కొని ఉంటారు, మస్జిద్ లలో పెద్ద లైటింగ్‌లు చేస్తారు. ఆ మస్జిద్ లలో వచ్చి కొన్ని ప్రార్థనలు, నమాజులు, ఖురాన్ పారాయణం, ఇంకా వేరే కొన్ని కార్యాలు చేసి ఆ రాత్రిని, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు మేరాజ్ ఉన్-నబీ ఏదైతే ప్రాప్తమైందో, మేరాజ్. అంటే రాత్రి యొక్క అతి చిన్న సమయంలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ త’ఆలా జిబ్రీల్ ద్వారా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు తీసుకెళ్లారు. అక్కడ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లారు. అక్కడ స్వర్గం, నరకాలను దర్శించారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌తో మాట్లాడారు. మరియు తిరిగి వస్తూ వస్తూ ఐదు పూటల నమాజ్‌ల యొక్క గొప్ప బహుమానం కూడా తీసుకొచ్చారు.

ఇది వాస్తవమైన విషయం. దీనినే సామాన్యంగా తెలుగులో గగన ప్రయాణం అని అంటారు. ఈ గగన ప్రయాణం మన ప్రవక్తకు ప్రాప్తమైంది, ఇది నిజమైన విషయం. కానీ ఏ తారీఖు, ఏ నెల మరియు ఏ సంవత్సరంలో జరిగిందో ఎలాంటి సుబూత్, ఎలాంటి ఆధారం అనేది లేదు. కానీ మన కొందరు సోదరులు 27వ తారీఖు నాడు రాత్రి, అంటే 26 గడిచిన తర్వాత 27, 26 మధ్య రాత్రిలో జాగారం చేసి, ఇది గగన ప్రయాణం, జష్న్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని చేస్తారు. ఇలాంటి మేరాజ్-ఉన్-నబీ ఉత్సవాలు జరపడం కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం.

ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లు, గగన ప్రయాణం ప్రవక్తకు మేరాజ్ ప్రాప్తమైంది కానీ, ఏ తారీఖు, ఏ నెల, ఏ సంవత్సరం అన్నది రుజువు లేదు. అయినా, ప్రవక్త గారు మక్కా నుండి మదీనాకు వలస పోక ముందు, హిజ్రత్ చేయక ముందే ఇది జరిగింది అన్నటువంటి ఏకాభిప్రాయం కలిగి ఉంది. అయితే ఈ గగన ప్రయాణం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పది సంవత్సరాలు మదీనాలో ఉన్నారు. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా మేరాజ్‌ను గుర్తు చేసుకొని ఆ రాత్రి జాగారం చేయడం లాంటి పనులు చేయలేదు.

అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది. దీన్ని ఒక చిన్న సామెత, లేదా అనండి ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇహలోకంలో మనం కొందరు పండితులను లేదా విద్వాంసులను, లేదా దేశం కొరకు ఏదైనా చాలా గొప్ప మేలు చేసిన వారికి, ఏదైనా సంస్థ గానీ లేకుంటే ప్రభుత్వం గానీ వారిని గౌరవించి వారికి ఇతర దేశంలో టూర్ గురించి వెళ్లి అక్కడి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను దర్శించి రావడానికి అన్ని రకాల సౌకర్యాలు, టికెట్ ఖర్చులతో పాటు అక్కడ ఉండడానికి, హోటల్లో, అక్కడ తిరగడానికి, అక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజుల ఖర్చు గిట్ల మొత్తం భరించి వారిని గౌరవిస్తారు, వారిని సన్మానిస్తారు. విషయం అర్థమవుతుందా? సైన్సులో గాని, ఇంకా వేరే ఏదైనా విషయంలో గాని ఎవరైనా గొప్ప మేలు చేస్తే, వారిని సన్మానించడం, సన్మానిస్తూ వారు చేసిన ఆ మేలుకు ప్రభుత్వం గాని లేదా ఏదైనా సంస్థ గాని ఏం చేస్తుంది? మీరు ఫలానా దేశంలో టూర్ చేసి రండి అన్నటువంటి టికెట్లతో సహా అన్ని ఖర్చులతో సహా వారిని పంపుతుంది.

అలాంటి వ్యక్తి బయటికి పోయి వచ్చిన తర్వాత, అక్కడి నుండి కొన్ని విషయాలు, కొన్ని మంచి అనుభవాలు తీసుకొని వస్తాడు. అయితే, వచ్చిన తర్వాత తన ఇంటి వారికి లేదా తన దేశ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి మంచి విషయాల గురించి తెలియజేస్తాడు. ఉదాహరణకు ఎవరైనా జపాన్ వెళ్ళారనుకోండి. అక్కడ టెక్నాలజీ, వారి యొక్క దైనందిన జీవితంలో, డైలీ జీవితంలో ఒక సిస్టమేటిక్‌గా ఏదైతే వారు ఫాలో అవుతున్నారో, వాటవన్నీ చాలా నచ్చి మన భారతదేశాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే అలాంటి మంచి విషయాలు పాటించాలి అని బోధ చేస్తాడు.

అయితే ఇప్పుడు ఆ మనిషి ఎవరికైతే ఒక సంస్థ లేక ప్రభుత్వం పంపిందో, ఉదాహరణకు అనుకోండి జపాన్‌కే పంపింది, ఏ తారీఖులో ఆయన అటు పోయి వచ్చాడో, ప్రతీ సంవత్సరం ఆ తారీఖున ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటే లాభం కలుగుతుందా? లేకుంటే అక్కడికి వెళ్లి వచ్చి అక్కడి నుండి తెచ్చిన అనుభవాలను అనుసరిస్తే లాభం కలుగుతుందా? అక్కడ తీసుకు… అక్కడి నుండి ఏదైతే అనుభవాలు తీసుకొచ్చాడో, అక్కడి నుండి ఏ మంచి విషయాలు అయితే తీసుకొచ్చాడో, వాటిని ఆచరిస్తేనే లాభం కలుగుతుంది. అలాగే, మన ప్రవక్తకు, మన ప్రవక్తను అల్లాహ్ త’ఆలా ఆకాశాల్లోకి పిలిపించి అక్కడ ఏదైతే గొప్ప బహుమానాలు ప్రసాదించాడో అవి మనకు కూడా ఇచ్చారు. అయితే వాటిని మనం ఆచరిస్తేనే మనకు లాభం కలుగుతుంది కానీ, మా ప్రవక్త గారు ఫలానా తారీఖున గగన ప్రయాణం చేశారు అని కేవలం మనం సంతోషపడితే మనకు ఎలాంటి లాభాలు కలగవు.

అయితే సోదరులారా, మనం ఈ మేరాజ్-ఉన్-నబీ సంఘటనలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎలాంటి సందర్భంలో మన ప్రవక్తకు మేరాజ్ గౌరవం ప్రాప్తమైంది? ఈ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు ఏ ఏ విషయాలు లభించాయి? రండి సంక్షిప్తంగా ఆ విషయాలు తెలుసుకుందాం.

మక్కాలో మన ప్రవక్త గారు ఇస్లాం ధర్మ ప్రచారం మొదలుపెట్టి ఇంచుమించు 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా అవిశ్వాసుల వైపు నుండి కష్టాలు, బాధలు పెరుగుతూనే పోతున్నాయి. చివరికి ఎప్పుడైతే అబూ తాలిబ్ చనిపోయాడో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి హజ్రత్ ఖదీజా రదియల్లాహు అన్హా గారు చనిపోయారో ఆ తర్వాత మన ప్రవక్త వారిపై దౌర్జన్యాలు, హింసలు ఇంకా పెరిగిపోయాయి.

ఆ సందర్భంలో ప్రవక్త ఏం చేశారు? తాయిఫ్ నగరానికి వెళ్లారు. బహుశా అక్కడి వారు కొందరు ఇస్లాం స్వీకరిస్తారేమో కావచ్చు. కానీ అక్కడ కూడా వారికి, ప్రవక్త గారికి చాలా శారీరకంగా చాలా బాధించారు. అంతేకాకుండా తప్పుడు సమాధానాలు పలికి ప్రవక్త మనసును కూడా గాయపరిచారు. ప్రవక్త అదే బాధలో తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఈ గగన ప్రయాణం జరిగింది.

అయితే ఇందులో ఒకవైపు ప్రవక్తకు తృప్తిని ఇవ్వడం జరుగుతుంది. మీరు బాధపడకండి, ఈ భూమిలో ఉన్న ప్రజలు మీ గౌరవాన్ని గుర్తు చేసుకోకుంటే, మీకు అల్లాహ్ త’ఆలా ఎలాంటి స్థానం ఇచ్చాడో దాన్ని వారు గ్రహించకుంటే మీరు ఆకాశాల్లో రండి. ఆకాశంలో ఉన్న వారు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారో, మీ యొక్క స్థానాన్ని ఎలా వారు గుర్తిస్తారో చూడండి అని ప్రవక్త గారికి ఒక నెమ్మది, తృప్తి, శాంతి, మనసులో ఏదైతే బాధ ఉందో దానికి మనశ్శాంతి కలిగించడం జరిగింది. దాంతోపాటు ఇదే ప్రయాణంలో ప్రవక్త గారికి ఇంకా ఎన్నో మహిమలు, ఎన్నో రకాల అద్భుతాలు కలిగాయి. ఒక్కొక్కటి వేసి మనం దాన్ని తెలుసుకుందాం.

ప్రవక్త గారి హార్ట్ ఆపరేషన్ ఈ గగన ప్రయాణం కంటే ముందు జరిగింది. అంతకు ముందు ఒకసారి నాలుగు సంవత్సరాల వయసులో కూడా జరిగింది. కానీ గగన ప్రయాణానికి ముందు కూడా ఒకసారి గుండె ఆపరేషన్ చేయడం జరిగింది. అనస్ రదియల్లాహు అన్హు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఛాతి మీద నేను ఆ ఆపరేషన్ చేసినటువంటి కుట్ల గుర్తులను కూడా చూశాను. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంలో విశ్వాసం, వివేకాలు నింపబడ్డాయి. (సహీహ్ బుఖారీలో ఈ హదీస్ ఉంది).

గాడిద కంటే కొంచెం పెద్దగా మరియు కంచర గాడిద కంటే కొంచెం చిన్నగా ఉన్నటువంటి ఒక వాహనంపై ప్రవక్తను ఎక్కించడం జరిగింది. దాని పేరు అరబీలో బురాఖ్. రాత్రిలోని అతి తక్కువ సమయంలో మక్కా నుండి ఎక్కడికి వెళ్లారు? బైతుల్ మఖ్దిస్. అక్కడ అల్లాహ్ త’ఆలా తన శక్తితో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని మన ప్రవక్త ముహమ్మద్ కంటే ముందు వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలందరినీ అక్కడ జమా చేశాడు. ప్రవక్త గారు వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు.

అక్కడి నుండి, అంటే బైతుల్ మఖ్దిస్ నుండి, ప్రవక్త ఆకాశాల పైకి వెళ్లారు. మొదటి ఆకాశంలో ఆదం అలైహిస్సలాం, రెండవ ఆకాశంలో హజ్రత్ ఈసా మరియు యహ్యా, మూడవ ఆకాశంలో యూసుఫ్, నాల్గవ ఆకాశంలో ఇద్రీస్, ఐదవ ఆకాశంలో హారూన్, ఆరవ ఆకాశంలో మూసా, ఏడవ ఆకాశంలో ఇబ్రాహీం (అలైహిముస్సలాతు వ తస్లీమ్). వీరందరితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుసుకున్నారు.

ఏడవ ఆకాశాలకు పైగా “సిద్రతుల్ ముంతహా” అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక రేగు చెట్టు ఉంది. ఆ రేగు చెట్టు ఎంత పెద్దదంటే, దాని యొక్క పండు (రేగు పండు ఉంటుంది కదా) చాలా పెద్ద కడవల మాదిరిగా మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటుంది, అంత పెద్ద చెట్టు. దాని యొక్క వ్రేళ్ళు, ప్రతీ చెట్టుకు వ్రేళ్ళు ఉంటాయి కదా కింద, అవి ఆరవ ఆకాశంలో ఉన్నాయి, దాని యొక్క కొమ్మలు ఏడవ ఆకాశంలో చేరుకుంటాయి. అక్కడే ఎన్నో అద్భుతాలు, ఎన్నో విషయాలు జరిగాయి. దానికి దగ్గరే “జన్నతుల్ మఅవా” అన్న స్వర్గం ఉంది.

దైవదూతలు కొందరు ఎవరైతే రాస్తూ ఉంటారో అల్లాహ్ ఆదేశాలను, వారు రాస్తున్న కలముల చప్పుడు కూడా వినిబడుతుంది. ఆ సిద్రతుల్ ముంతహా, ఆ రేగు చెట్టు అక్కడే ప్రవక్త గారికి మూడు విషయాలు ఇవ్వడం జరిగాయి:

  1. 50 పూటల నమాజ్.
  2. సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతులు.
  3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిజంగా విశ్వసించి ఆయనను ఆచరించే వారిలో షిర్క్ చేయని వారు ఎవరైతే ఉంటారో, వారి పెద్ద పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా మన్నిస్తాను అంటున్నాడు.

ఇదే రేగు చెట్టు వద్ద ప్రవక్త గారు జిబ్రీల్ అలైహిస్సలాంను ఆయన అసలు సృష్టిలో చూశారు. అక్కడే ప్రవక్త గారు నాలుగు రకాల నదులను చూశారు.

ఆరవ విషయం, అక్కడే ప్రవక్త గారికి పాలు ఒక పళ్లెంలో, మరో పళ్లెంలో తేనె, మరో పళ్లెంలో మత్తు పదార్థం ఇవ్వడం జరిగింది. అయితే ప్రవక్త గారు పాలు తీసుకున్నారు.

ఏడవ ఆకాశంపై బైతుల్ మామూర్ అని ఉంది. ఇక్కడ మనకు భూమి మీద మక్కాలో కాబా ఎలా ఉంది, బైతుల్లాహ్, అక్కడ బైతుల్ మామూర్ అని ఉంది. ప్రతీ రోజు అందులో 70,000 దైవదూతలు నమాజ్ చేస్తారు. ఒకసారి నమాజ్ చేసిన దేవదూతకు మరోసారి అక్కడ నమాజ్ చేసే అవకాశం కలగదు.

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన మూసా అలైహిస్సలాంను కూడా చూశారు. మూసా అలైహిస్సలాం ఎలా ఉన్నారు, ఈసా అలైహిస్సలాం ఎలా ఉన్నారో ఆ விவரం కూడా ప్రవక్త గారు చెప్పారు. ఇంకా నరకంపై ఒక దేవదూత ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, అతని పేరు ఖురాన్‌లో మాలిక్ అని వచ్చి ఉంది. ప్రవక్త ఆయన్ని కూడా చూశారు, అతను ప్రవక్తకు సలాం కూడా చేశారు.

ఇదే ప్రయాణంలో ప్రవక్త గారు దజ్జాల్‌ను కూడా చూశారు.

ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని దర్శించారు. ఆ స్వర్గంలో మంచి ముత్యాలు, పగడాలు, (హీరే, మోతీ అంటాం కదా) ముత్యాలు, పగడాలతో మంచి వారి యొక్క గృహాలు ఉన్నాయి. ఇంకా అక్కడి మట్టి కస్తూరి వంటి సువాసన ఉంటుంది. స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక చాలా పెద్ద హౌజ్ (సరస్సు), స్వర్గపు నీళ్లు దొరుకుతుంది, దాన్ని కౌసర్ అంటారు, దాన్ని కూడా ప్రవక్త గారు చూశారు.

ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూతల ఏ సమూహం నుండి దాటినా వారందరూ “ఓ ప్రవక్తా, మీ అనుచరులకు చెప్పండి వారు కప్పింగ్ (హిజామా) చేయాలి” అని. అరబీలో హిజామా అంటారు, ఉర్దూలో పఛ్నా లగ్వానా, సీంగీ లగ్వానా అంటారు. ఇంగ్లీషులో కప్పింగ్ థెరపీ అంటారు. అంటే ఏంటి? శరీరంలో కొన్ని ప్రాంతాల్లో చెడు రక్తం అనేది ఉంటుంది. దానికి ప్రత్యేక నిపుణులు ఉంటారు, దాన్ని ఒక ప్రత్యేక పద్ధతితో తీస్తారు. ఇది కూడా ఒక రకమైన మంచి చికిత్స. దీనివల్ల ఎన్నో రోగాలకు నివారణ కలుగుతుంది.

ఇదే ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి సువాసన పీల్చారు. ఇదేంటి సువాసన అని అడిగితే, ఫిరౌన్ కూతురుకు వెంట్రుకలను దువ్వెనతో దువ్వి వారి సేవ చేసే ఒక సేవకురాలు ఎవరైతే ఉండెనో, ఆమె, ఆమె సంతానం యొక్క ఇల్లు ఏదైతే ఉందో స్వర్గంలో, అక్కడి నుండి ఈ సువాసన వస్తుంది. ఆమె సంఘటన విన్నారు కదా ఇంతకుముందు? ఫిరౌన్ యొక్క కూతురికి ఒక ప్రత్యేక సేవకురాలు ఉండింది, ఆమె వెంట్రుకలను దువ్వడానికి. ఒకసారి చేతి నుండి దువ్వెన కింద పడిపోతుంది. బిస్మిల్లా అని ఎత్తుతుంది. ఫిరౌన్ కూతురు అడుగుతుంది, “ఎవరు అల్లాహ్? అంటే నా తండ్రియా, ఫిరౌనా?” ఆమె అంటుంది సేవకురాలు, “కాదు. నీ తండ్రికి మరియు నాకు ప్రభువు అయినటువంటి అల్లాహ్.” పోయి తండ్రికి చెప్తే, అతడు ఏం చేస్తాడు? ఒక చాలా పెద్ద డేగలో నూనె మసలబెట్టి, ఆమె పిల్లవాళ్ళను ముందు అందులో వేస్తాడు. తర్వాత ఆమెను కూడా అందులో వేసేస్తాడు. ఇలాంటి శిక్ష వారికి ఇవ్వబడుతుంది, కేవలం అల్లాహ్ ను విశ్వసించినందుకు. అయితే వారికి అల్లాహ్ త’ఆలా ఏదైతే గౌరవ స్థానం, గొప్ప గృహం ఇచ్చాడో స్వర్గంలో, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు.

హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాంతో కలిసినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు, “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ అనుచర సంఘానికి నా సలాం చెప్పండి. మరియు వారికి చెప్పండి, స్వర్గంలో ఉన్నటువంటి భూమి అది చాలా మంచి పంటనిస్తుంది. కానీ అక్కడ ఆ భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందులో విత్తనాలు వేయాల్సిన అవసరం ఉంది.” ఏంటి అని అడిగితే:

سُبْحَانَ اللَّهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ
(సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్)
అల్లాహ్ పవిత్రుడు, సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ గొప్పవాడు.

అని చెప్పారు. మరొక హదీస్‌లో ఉంది:

لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ
(లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)
పాపాల నుండి రక్షణ మరియు పుణ్యాలు చేసే శక్తి అల్లాహ్ ప్రసాదిస్తేనే లభిస్తాయి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకొందరిని చూశారు నరకంలో, అక్కడ వారికి గోర్లు ఇత్తడి, రాగితో ఉన్నాయి. వారి గోళ్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, రాగితో ఉన్నాయి. దాంతోనే వాళ్ళు తమకు తాము తమ ముఖాన్ని, తమ శరీరాన్ని ఇలా గీక్కుంటున్నారు. మొత్తం తోలంతా పడిపోతుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అని అడిగినప్పుడు జిబ్రీల్ చెప్పారు, ఎవరైతే ఇతరుల మాంసాన్ని తినేవారో మరియు వారి అవమానం చేసేవారో అలాంటి వారికి. మాంసం తినడం అంటే ఇక్కడ వారి యొక్క చాడీలు చెప్పడం. గీబత్, చుగ్లీ, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, ఇంకా ఇతరుల అవమానం చేయడం.

ఇంకొందరిని చూశారు ప్రవక్త గారు, అగ్ని కత్తెరలతో వారి యొక్క పెదవులను కట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి శిక్ష అంటే, ఎవరైతే ఇతరులకు మంచి గురించి చెప్తుంటారో కానీ స్వయంగా దానిపై ఆచరించరో అలాంటి వారికి శిక్ష జరుగుతుంది.

మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు గారు “సిద్దీఖ్” అన్న బిరుదు ఏదైతే పొందారో, ఇదే ప్రయాణం తర్వాత పొందారు. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త గారికి ఈ గగన ప్రయాణంలో ఏ ఏ విషయాలను దర్శించారో, వాటి కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సహీ హదీసుల ఆధారంగానే ఉన్నవి. పోతే ఇందులో ప్రత్యేకంగా నమాజ్ యొక్క విషయం, సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతుల విషయం, సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ లాంటివన్నీ విషయాలు మనం పాటిస్తూ ఉండాలి. అల్లాహ్ మీకు, మాకు మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ దయ కలిగితే మరెప్పుడైనా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=8783

స్వర్గానికి చేర్చే విశ్వాసం

7. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరి కొచ్చి “ధైవప్రవక్తా! నన్ను స్వర్గానికి గొనిపోగల సత్కర్మలేమిటో  కాస్త చెప్పండి” అని అన్నాడు. ప్రజలు (అతను ముందుకు వస్తూ మాట్లాడుతున్న తీరును చూసి) “ఏమయింది ఇతనికి (ఒక పద్ధతి అంటూ లేకుండా) ఇలా అడుగుతున్నాడు?” అని చెప్పుకోసాగారు.  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “ఏం కాలేదు. అతనికి నాతో పని పడింది, మాట్లాడనివ్వండి” అని అన్నారు. తరువాత ఆయన ఆ వ్యక్తి వైపుకు తిరిగి

“పూర్తి ఏకాగ్రతతో ఒక్క దేవుడ్ని మాత్రమే ఆరాధించు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించకు. ఆ దైవారాధనలో మరెవరినీ ఆయనకు సహవర్తులుగా కల్పించకు. నమాజ్ వ్యవస్థను నెలకొల్పు. జకాత్ (పేదల ఆర్ధిక హక్కు) చెల్లించు. బంధువులతో కలసిమెలసి ఉంటూ మంచిగా మసలుకో. ఇక దీన్ని వదలిపెట్టు” (*) అని అన్నారు.

హజ్రత్ అబూ అయ్యూబ్ (రధి అల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒంటె ఎక్కి ఉన్నారని, ఆ వ్యక్తి దాన్ని నిరోధించి  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికాయన సమాధానమిచ్చి, చివర్లో ఇక దీన్ని (ఒంటె పగ్గాన్ని) వదలిపెట్టు అని చెప్పి ఉంటారని తెలియజేశారు.

(*) ఇక్కడ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట వెలువడిన అసలు మాటేమిటో హదీసు ఉల్లేఖకునికి గుర్తులేదు

[సహీహ్ బుఖారీ : ప్రకరణం – 78 (అదబ్), అధ్యాయం – 10 (సలాతుర్రహం)]

విశ్వాస ప్రకరణం – 5 వ అధ్యాయం – స్వర్గానికి చేర్చే విశ్వాసం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్