స్వర్గానికి చేర్చే విశ్వాసం

7. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరి కొచ్చి “ధైవప్రవక్తా! నన్ను స్వర్గానికి గొనిపోగల సత్కర్మలేమిటో  కాస్త చెప్పండి” అని అన్నాడు. ప్రజలు (అతను ముందుకు వస్తూ మాట్లాడుతున్న తీరును చూసి) “ఏమయింది ఇతనికి (ఒక పద్ధతి అంటూ లేకుండా) ఇలా అడుగుతున్నాడు?” అని చెప్పుకోసాగారు.  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “ఏం కాలేదు. అతనికి నాతో పని పడింది, మాట్లాడనివ్వండి” అని అన్నారు. తరువాత ఆయన ఆ వ్యక్తి వైపుకు తిరిగి

“పూర్తి ఏకాగ్రతతో ఒక్క దేవుడ్ని మాత్రమే ఆరాధించు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించకు. ఆ దైవారాధనలో మరెవరినీ ఆయనకు సహవర్తులుగా కల్పించకు. నమాజ్ వ్యవస్థను నెలకొల్పు. జకాత్ (పేదల ఆర్ధిక హక్కు) చెల్లించు. బంధువులతో కలసిమెలసి ఉంటూ మంచిగా మసలుకో. ఇక దీన్ని వదలిపెట్టు” (*) అని అన్నారు.

హజ్రత్ అబూ అయ్యూబ్ (రధి అల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒంటె ఎక్కి ఉన్నారని, ఆ వ్యక్తి దాన్ని నిరోధించి  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికాయన సమాధానమిచ్చి, చివర్లో ఇక దీన్ని (ఒంటె పగ్గాన్ని) వదలిపెట్టు అని చెప్పి ఉంటారని తెలియజేశారు.

(*) ఇక్కడ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట వెలువడిన అసలు మాటేమిటో హదీసు ఉల్లేఖకునికి గుర్తులేదు

[సహీహ్ బుఖారీ : ప్రకరణం – 78 (అదబ్), అధ్యాయం – 10 (సలాతుర్రహం)]

విశ్వాస ప్రకరణం – 5 వ అధ్యాయం – స్వర్గానికి చేర్చే విశ్వాసం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

%d bloggers like this: