ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి?
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/7wdS1-T5Pkg [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ముస్లింలు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ అంతిమ గీటురాయిగా దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) మాత్రమే స్వీకరించాలని వక్త నొక్కి చెప్పారు. పూర్వీకుల ఆచారాలు, వ్యక్తిగత కోరికలు లేదా ఇతరుల అభిప్రాయాలు ఈ రెండు మూలాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అనుసరించవద్దని హెచ్చరించారు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం యొక్క తీవ్రమైన పరిణామాలను వివరించడానికి సూరహ్ మాయిదాలోని వాక్యాలను ఉదహరించారు. అలాంటి చర్యలను అవిశ్వాసం (కుఫ్ర్), దుర్మార్గం (జుల్మ్), మరియు అవిధేయత (ఫిస్ఖ్)గా వర్గీకరించారు. అల్లాహ్ చట్టం కంటే తమ చట్టం గొప్పదని భావించి తీర్పు ఇవ్వడం (పెద్ద కుఫ్ర్) మరియు అల్లాహ్ చట్టం యొక్క ఆధిక్యతను విశ్వసిస్తూనే ప్రాపంచిక కోరికల కారణంగా దానిని ఉల్లంఘించడం (చిన్న కుఫ్ర్) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సమాజంలోని వివాదాలు మరియు తగాదాలకు దైవిక చట్టాన్ని ప్రమాణంగా విడిచిపెట్టడమే కారణమని ఒక హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం ముస్లిములు దేనిని తమ గీటురాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది, మా అమ్మానాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైనా, అన్యాయమైనా, సత్యమైనా, అసత్యమైనా, ఇది పక్కన పెట్టి, న్యాయం-అన్యాయం, సత్యం-అసత్యం, మంచి విధానం, చెడు విధానం, కరెక్టా కాదా ఇవి పక్కన పెట్టి, ముందు నుంచి వస్తా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు.

ముస్లిములు దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి, విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మానాన్నతో నేర్చుకోవాలి, కాకపోతే అమ్మానాన్న, తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు? గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకుని మనకి నేర్పించారు? విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకుని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం.

అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మానాన్న విషయంలో, భార్యాపిల్లల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, రాజకీయపరమైనా, ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖుర్ఆన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ మాయిదా, ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు:

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహు వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.”  (5:49)

అంటే, నీవు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి.

وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)
వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.

వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో మంచి హోదాలో, మంచి పొజిషన్‌లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరైనా సరే. ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు ఎవ్వరైనా సరే అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం.

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహ్)
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చట్టం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు? మరియు దానికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి? ఆయన విధానం ఏమిటి? ఇది మనకు తప్పనిసరి.

ఇదే ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు:

وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ
(వ ఇన్న కసీరమ్ మినన్నాసి లఫాసిఖూన్)
 “ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.“(5:49)

ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను? ఎవరి కలిమా నేను చదువుతున్నాను? ఎవరి విధేయత నేను చూపాలి? ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను? ఇవి కాకుండా, మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి, మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్న వారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట.

అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే, అదే సూరహ్, సూరహ్ మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముజ్జాలిమూన్)
అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.” (5:45)

ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం, అనగా ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే, వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూరహ్, ఆయత్ 44 లో ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముల్ కాఫిరూన్)
ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.” (5:44)

అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరహ్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యం 44, అదే సూరహ్ వాక్యం 45, అదే సూరహ్ వాక్యం 49లో, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతులో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసిఖులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతులో జాలిమూన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతులో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు.

అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవప్రవక్త యొక్క ప్రవచనం.

అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మ సమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖుర్ఆన్‌కి వ్యతిరేకంగా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే, సమ్మతమే అని భావించడం కుఫ్ర్ అక్బర్ అవుతుంది. పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఇబ్నె బాజ్ రహమతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే, అది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు.

మొదటి రకం ఏమిటి? (ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్) అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా, అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? (యఅతఖిదు హల్ల దాలిక్), అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు, దీంట్లో పరిష్కారం ఉంది ఆ సమస్యకి. అల్లాహ్ ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా (అవ అన్న దాలిక అఫ్దల్), నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, (అవ్ అన్నహు యుసావి లిష్షరిఅ), లేకపోతే నా తీర్పు కూడా అల్లాహ్ తీర్పుకి సమానంగానే ఉంది, షరిఅత్‌కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, (కాన కాఫిరన్ ముర్తద్దన్), ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు. అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు.

రెండో రకమైన తీర్పు ఏమిటి? (అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్), అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు, ఉద్దేశం ఏమిటి? (లిహవా), తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసైపోయి ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. (అవ్ లిమకాసిద్ సయ్యిఅ) చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. (అవ్ లితమఇన్), లేకపోతే ఏదో ఒక ఆశించి. (అవ్ లిర్రిశ్వా) లంచం కోసం. నేను అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థికపరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లాహ్ తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద కుఫ్ర్ నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక.

అంటే, నా నిర్ణయం, నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే, అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది.

అభిమాన సోదరులారా, చివర్లో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటని ముగిస్తాను. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “వారి నాయకులు దైవగ్రంథం ప్రకారం తీర్పు చేయకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు.” ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది.

ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నాము అంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మనం తీసుకున్న గీటురాయి అది ఖుర్ఆన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు.

ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన మధ్య వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గీటురాయిగా తీసుకొని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43352

అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి(హఫిజహుల్లాహ్)
https://youtu.be/omW0Jrb-7Xk [5 నిముషాలు]

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రమైన విధేయతను చర్చిస్తుంది. ఒక విశ్వాసి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్పష్టమైన ఆదేశాల కంటే ఇతరుల—కుటుంబం, పండితులు లేదా తనతో సహా—మాటలకు లేదా అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చా అనే కేంద్ర ప్రశ్నను ఇది అన్వేషిస్తుంది. అలాంటి ప్రాధాన్యత అనుమతించబడదని వక్త ఖురాన్ (సూరా అల్-హుజురాత్ 49:1 మరియు సూరా అల్-మాయిదా 5:2) మరియు బుఖారీ, ముస్లింల నుండి ఒక హదీసును ఉటంకిస్తూ దృఢంగా స్థాపించారు. నిజమైన విశ్వాసానికి దైవిక ఆదేశాలకు సంపూర్ణ లొంగుబాటు అవసరమని, మరియు మతపరమైన విషయాలలో ఏదైనా విచలనం, జోడింపు లేదా స్వీయ-ఉత్పన్నమైన తీర్పు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కంటే “ముందుకు వెళ్ళడంగా” పరిగణించబడుతుందని దీని ముఖ్య సారాంశం. పుణ్యం మరియు ధర్మబద్ధమైన పనులలో సహకారం ప్రోత్సహించబడింది, కానీ పాపం మరియు అతిక్రమణ విషయాలలో ఖచ్చితంగా నిషేధించబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా? ఈ ప్రశ్నకి మనము ఈరోజు సమాధానం తెలుసుకుంటున్నాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలపై మనం ఇతరులకు, ఆ ఇతరులు బంధువులు కావచ్చు, అమ్మానాన్న కావచ్చు, పండితులు కావచ్చు, ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా?ముమ్మాటికీ లేదు. మనము అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలపై ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వలేము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో సూరతుల్ హుజురాత్, ఆయత్ నంబర్ ఒకటిలో ఇలా సెలవిచ్చాడు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లహి వ రసూలిహీ వత్తఖుల్లాహ, ఇన్నల్లాహ సమీవున్ అలీమ్)

విశ్వాసులారా, అల్లాహ్ ను ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ సమస్తము వినేవాడు, సర్వము ఎరిగినవాడు.” (49:1)

అంటే ధార్మిక విషయాలలో తమంతట తాముగా నిర్ణయాలు తీసుకోవటం గానీ, తమ ఆలోచనలకు పెద్ద పీట వేయటం గానీ చేయరాదు. దీనికి బదులు వారు అల్లాహ్ కు, దైవ ప్రవక్తకు విధేయత చూపాలి. తమ తరఫున ధర్మంలో హెచ్చుతగ్గులు చేయటం, సరికొత్త విషయాలను కల్పించటం వంటి పనులన్నీ దైవాన్ని, దైవ ప్రవక్తకు మించిపోవటంగా భావించబడతాయి.

అలాగే, ఖురాన్ మరియు హదీసులతో నిమిత్తం లేకుండా ధార్మిక తీర్పు ఇవ్వకూడదు. అలాగే ఒకవేళ ఏదైనా తీర్పు ఇస్లామీయ షరీఅతుకు విరుద్ధంగా ఉందని తెలిస్తే, ఇక దాని కోసం ప్రాకులాడకూడదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆజ్ఞలను శిరోధార్యంగా భావించటమే ఒక విశ్వాసికి శోభాయమానం. తద్భిన్నంగా అతను ఇతరుల అభిప్రాయాలను కొలబద్దగా తీసుకుంటే తలవంపు తప్పదు అని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి.

దీనికి సారాంశం బుఖారీ మరియు ముస్లింలోని ఒక హదీస్ ఉంది. దాని అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవిధేయతకు, అంటే అల్లాహ్ అవిధేయతకు దారి తీసే ఏ విషయంలోనూ ఎవరికీ విధేయత చూపకూడదు. అయితే మంచి విషయాలలో విధేయత చూపవచ్చు అన్నమాట. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.

ఈ విషయాన్నే ఇంకో విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ మాయిదాలో సెలవిచ్చాడు,

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَلْعُدْوَانِ
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా, వలా తఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్)
సత్కార్యాలలో, అల్లాహ్‌ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి (5:2)

అంటే అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒకరికొకరుని తోడుపడుతూ ఉండండి, సహాయం చేస్తూ ఉండండి, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండండి, తోడుపడుతూ ఉండండి. పాప కార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రాధాన్యత అల్లాహ్ కి, ప్రాధాన్యత ఆయన ప్రవక్తకి మాత్రమే ఇవ్వాలి.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43614


హిజ్రత్ (షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట) ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది [వీడియో & టెక్స్ట్]

హిజ్రత్ (షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట) ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

https://youtu.be/GWB2_SlYVsw [14 నిముషాలు]

ముస్లిం ఉమ్మత్ పై హిజ్రత్ (వలస) అనేది ప్రళయం వరకు విధిగా ఉంది. షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశం నుండి ఇస్లాం ఉన్న ప్రదేశానికి వెళ్లడమే హిజ్రత్. తౌహీద్ (ఏకదైవారాధన) పై స్థిరంగా ఉండటం, కేవలం అల్లాహ్ ను ఆరాధించడం కష్టంగా లేదా అసాధ్యంగా ఉన్నప్పుడు, మరియు దాని కారణంగా హింసించబడుతున్నప్పుడు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. ఇది దేశం నుండి దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కూడా కావచ్చు. అయితే, స్వేచ్ఛగా ఇస్లాంను ఆచరించగలిగే మరియు ఇస్లాం గురించి ప్రచారం చేయగలిగే అవకాశం ఉన్న చోట హిజ్రత్ అవసరం లేదు. శక్తి ఉండి కూడా, ప్రపంచ ప్రయోజనాల కోసం హిజ్రత్ చేయని వారికి ఖుర్ఆన్ లో కఠినమైన హెచ్చరిక ఉంది. కానీ నిజంగా బలహీనులకు, మార్గం తెలియని వారికి మినహాయింపు ఉంది. హిజ్రత్ చేయని వాడు పాపాత్ముడు అవుతాడు కానీ అవిశ్వాసి కాడు. పశ్చాత్తాప ద్వారం మూసుకుపోయే వరకు (సూర్యుడు పడమర నుండి ఉదయించే వరకు) హిజ్రత్ కొనసాగుతుంది, కానీ వ్యక్తిగత పశ్చాత్తాపం మరణ ఘడియ రాకముందే చేయాలి.

భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు, ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి? [ఆడియో]

భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు,
ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి?
https://youtu.be/HORMsPWKEDQ [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, భర్త నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయెత్తులు వేసుకుంటూ, దర్గాల వద్దకు వెళ్తూ షిర్క్ చేస్తున్నప్పుడు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారం జీవించాలనుకునే భార్య అతని నుండి ఖులా (విడాకులు) తీసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. దర్గాలకు వెళ్లడం, తాయెత్తులు ధరించడం వంటివి షిర్క్ వరకు తీసుకెళ్లే తీవ్రమైన పాపాలని, ఖురాన్ ఆయతుల ఆధారంగా వివరించబడింది. ముఖ్యంగా అల్లాహ్ ను కాకుండా ఇతరులను ప్రార్థించడం, ఇతరులకు సజ్దా చేయడం స్పష్టమైన షిర్క్. అలాగే, నమాజును నిర్లక్ష్యం చేయడం లేదా వదిలివేయడం కూడా చాలా పెద్ద పాపమని, అది కుఫ్ర్ వరకు వెళ్ళవచ్చని హెచ్చరించబడింది. భర్త ఈ పాపాలనుండి పశ్చాత్తాపపడకపోతే, భార్య ఖులా తీసుకోవడం ధర్మసమ్మతమని పండితులు అభిప్రాయపడతారని, అయితే ఓపికతో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయవచ్చని, కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇవ్వబడింది.

భర్త ఏ మాత్రం నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయీజులు వేసుకుంటూ దర్గాల వద్దకు వెళ్తూ ఉంటాడు. భార్య ఇస్లాం యొక్క ప్రేమికురాలు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది. అయితే ఆ భర్త, ఆ భర్త నుండి ఖులా తీసుకోవడానికి, వేరుకోవడానికి ఇస్లాంలో ఏదైనా అనుమతి ఉందా అని మీరు అడిగారు.

వాస్తవానికి చూసేది ఉంటే, మనిషి దర్గాలకు వెళ్లి అక్కడ అల్లాహ్ కు చేయబడే అటువంటి కొన్ని ఆరాధనలు అక్కడ చేస్తున్నాడు, తాయీదులు వేసుకుంటున్నాడు, ఇవి రెండూ కూడా షిర్క్ వరకు తీసుకెళ్లే పాపాలు.

దర్గా కాడికి వెళ్లి డైరెక్ట్ దర్గా వారితో దుఆ చేస్తే, దర్గా వారికి సజ్దా చేస్తే, అల్లాహ్ అలాంటి పరిస్థితి నుండి మనందరినీ కాపాడుగాక, షిర్క్ చేసినవాడైపోతాడు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు.

وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ
(వస్ జుదూ లిల్లా హిల్లాజి ఖలకహున్)
వాటిని సృష్టించిన అల్లాహ్‌కే సాష్టాంగపడండి. (41:37)

భూమి ఆకాశాలు, సూర్య చంద్రాలు ఇంకా ఈ సృష్టి అంతటినీ సృష్టించిన ఆ ఏకైక అల్లాహ్ కు మాత్రమే మీరు సజ్దా చేయండి.

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ కాల రబ్బుకుముద్ ఊని అస్తజిబ్ లకుం)
మీ ప్రభువు అంటున్నాడు: “నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. (40:60)

మీ ప్రభువు మీతో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను మాత్రమే అర్థించండి, నాతో మాత్రమే దుఆ చేయండి, నేను మీ దుఆలను అంగీకరిస్తాను.

ఇంత స్పష్టమైన ఆయతులు ఉన్నప్పటికీ మనిషి దర్గాల కాడికి వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే స్పష్టమైన షిర్క్ కు గురి అవుతున్నాడు. ఇక ఆ మనిషి అల్లాహ్ ను నమ్ముతూ, ప్రవక్తను నమ్ముతూ, పరలోక దినాన్ని నమ్ముతూ నమాజులు చేస్తూ ఇదే పెద్దలు చేసిన్లు మా ఊర్లో, నేను ఎక్కడా ఇంకా బయటికి వెళ్ళలేదు ఏమీ వేరేది చూడలేదు, దీనినే నిజమైన ఆరాధన అనుకుంటున్నాను అన్నటువంటి భ్రమలో ఉండి ఉంటే, అల్లాహ్ అలాంటి వ్యక్తితో ఎలా మసులుకుంటాడో కరుణాకటాక్షాలతో లేదా ఇంకా వేరే ఏదైనా పరీక్ష తీసుకుంటాడా అది వేరే విషయం. కానీ ఈనాటి కాలంలో నెట్ ద్వారా, మొబైల్ ల ద్వారా సత్యం అనేది ఎంత ప్రస్ఫుటమవుతుంది, అయినా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇలాంటి షిర్క్ పనికి లోనవుతూ ఉంటే ఇది చాలా భయంకరమైన విషయం.

భార్య వాస్తవానికి ఇస్లాం ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది అంటే ముందు భర్తను ఇలాంటి షిర్క్ పనుల గురించి ప్రేమగా, మంచి విధంగా, ఆధారాలు చూపుతూ ఇవి తప్పు అని తప్పకుండా తెలియజేస్తూ ఉండాలి.

దీనిపై ఇంకా తాయీదులు వేసుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో దర్గాల వద్ద నుండి వేరే కొందరు మౌల్సాబుల నుండి ఏదైతే తాయీదులు ఇవ్వడం జరుగుతున్నాయో, సర్వసాధారణంగా ప్రజలు ఆ తాయీదుల మీదనే మొత్తం నమ్మకం ఉంచుతున్నారు. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎందరితోనో మనం మాట్లాడి, ఎంతో ప్రేమగా దీని గురించి చెప్పి తీయించాలని ప్రయత్నం చేస్తే, అయ్యో వద్దండి వద్దండి ఇది తీసేస్తుంటే ఖలాస్ ఇక నా ప్రాణం పోతది, లేదు నాకు మళ్లీ కడుపునొప్పి మొదలైపోతది, ఇక ఇది తీసేది ఉంటే నేను మళ్ళీ అనారోగ్యానికి గురైపోతాను అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇది కేవలం ఒక చిన్న సబబుగా అల్లాహ్ యే షఫా ఇచ్చేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం లేదు. దీనిమీదనే, ఈ తాయీదుల మీదనే నమ్మకం ఉన్నది. మరి ఇలాంటి ఈ నమ్మకాన్ని కూడా పెద్ద షిర్క్ లో పడవేసేది అని ఖురాన్ హదీస్ ఆయతుల ద్వారా ధర్మ పండితులు చెప్పి ఉన్నారు.

దీనికంటే కరేలా నీమ్ చడా అన్నట్టుగా ఇంకా ఘోరమైన విషయం మీరు తెలిపింది ఏమిటంటే ఆ భర్త నమాజుకు ప్రాముఖ్యత ఏమీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. అదేమిటంటే నమాజుకు ఏదైనా ఎప్పుడైనా బద్ధకంతో వెళ్లకపోతే అదే చాలా ప్రమాదకరమైన విషయం అని ఖురాన్ హదీసులో చెప్పడం జరిగింది.

ఉదాహరణకు మీరు గమనించండి, ఒక చిన్న సూరాలో అంటే సూరతుల్ మాఊన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

فَوَيْلٌ لِلْمُصَلِّينَ
(ఫ వైలుల్ లిల్ ముసల్లీన్)
వయిల్ (అధోలోకం) ఉన్నది ఆ నమాజీల కొరకు, (107:4)

الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ
(అల్లజీనహుం అన్ సలాతిహిం సాహూన్)
ఎవరయితే తమ నమాజుల పట్ల ఏమరుపాటుగా ఉంటారో, (107:5)

ఎవరైతే నమాజు బద్ధకంగా చేస్తున్నారో, టైం యొక్క సమయపాలన లేకుండా, రుకున్ వాజిబాత్ ఇంకా సున్నత్ ప్రకారంగా చేయకుండా, ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నాడు లేదా అంటే వదిలేస్తున్నాడు, ఇలా బద్ధకంగా చేసే వారి గురించే వినాశకరమైన వైల్ ఉన్నది అని అల్లాహ్ త’ఆలా హెచ్చరిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరైతే దానికి ప్రాముఖ్యతనే ఇవ్వరో, అయ్యో నమాజ్ చదవాలి అన్నటువంటి మనసులో ఒక తపన లేనే లేదో వారు ఇంకా ఎంత భయంకరమైన పాపములో పడి ఉన్నారో గమనించండి.

అయితే ఇలాంటి భార్య అతని నుండి ఆ భర్త నుండి ఖులా తీసుకోవచ్చా? ఎంతోమంది ధర్మపండితులు చెప్పే విషయం ఏమిటంటే ఇలాంటి షిర్క్ మరియు నమాజును వదిలేటువంటి కుఫ్ర్ పని నుండి అతను తోబా చేయకుంటే తప్పకుండా భార్య ఖులా తీసుకోవాలి.

కానీ మన చోట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ భార్య ఇంకా దావత్ ఇస్తూ, భర్తకు నచ్చజెప్పుతూ ఓపిక కొంచెం వహించింది అంటే ఒకరకంగా మంచిది కావచ్చు. కానీ అలాగే ఉండిపోవడం, ఆ భర్త అంటే ఆమె పిల్లల యొక్క తండ్రి యొక్క శిక్షణలో ఈ పిల్లలు ఎలా ఎదుగుతారు అనే విషయంలో భార్య తప్పకుండా భయపడాలి. అల్లాహ్ తో అధికంగా దుఆ చేయాలి, అధికంగా దుఆ చేయాలి. అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. ఇస్లాంపై స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక.


తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు [వీడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు
[https://youtu.be/1saC1XDHDgo [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 


తయమ్ముమ్‌:

క్రింద తెలుపబడే కారణాలు సంభవించినప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్‌ కు బదులుగా తయమ్ముమ్‌ చేయవచ్చును.

1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పుడు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్‌ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్‌ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్‌ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

3- ఏ నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

తయమ్ముమ్‌ విధానం:

మనుసులో నియ్యత్‌ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్‌ చేయాలి. (కొందరు వుజూ చేసినట్టుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్‌ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయమ్ముమ్‌ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజు మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముమ్‌ భంగమవుతుంది. నమాజు పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజు అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ ఆడియోలో, ప్రవక్త తయమ్ముమ్ (నీరు లేనప్పుడు చేసే శుద్ధి) గురించి వివరిస్తున్నారు. తయమ్ముమ్ అంటే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టిపై రెండు చేతులు కొట్టి ముఖాన్ని మరియు రెండు అరచేతులను తుడుచుకోవడం. నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దాని వాడకం హానికరమైనప్పుడు తయమ్ముమ్ చేయడం విధిగా చెప్పబడింది. ఇది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉమ్మత్‌కు మాత్రమే ఇవ్వబడిన ఒక గొప్ప వరం మరియు సౌకర్యం అని, గత ప్రవక్తల అనుచరులకు ఈ సౌలభ్యం లేదని హదీసుల ద్వారా వివరించబడింది. తయమ్ముమ్ యొక్క షరతులు – నియ్యత్ (ఉద్దేశం), నీరు లేకపోవడం, మరియు పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించడం. చిన్న అశుద్ధి (హదసె అస్గర్) మరియు పెద్ద అశుద్ధి (హదసె అక్బర్) రెండింటికీ తయమ్ముమ్ సరిపోతుంది. అయితే, నీరు అందుబాటులోకి వచ్చిన వెంటనే, తయమ్ముమ్ చెల్లదు మరియు స్నానం లేదా వుదూ చేయడం తప్పనిసరి అవుతుంది.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్‌బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

తయమ్ముమ్ అంటే అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టి మీద రెండు అరచేతులను కొట్టి ముందు ముఖం మీద తర్వాత రెండు అరచేతుల మీద ఇలా తుడుచుకోవడం.

నీళ్లు లేని సందర్భంలో లేదా నీళ్లు ఉండి దాని ఉపయోగం హానికరంగా ఉన్నందువల్ల ఈ తయమ్ముమ్ చేయటం విధిగా ఉంది. అల్లాహుతాలా దీని గురించి చాలా స్పష్టంగా ఆదేశించాడు. సూరె మాయిదా సూర నెంబర్ ఐదు ఆయత్ నెంబర్ ఆరులో అల్లాహ్ ఆదేశం ఉంది.

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా
మీరు నీళ్లు పొందని స్థితిలో పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి.

فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ
ఫమ్సహూ బివుజూహికుమ్ వ ఐదీకుమ్ మిన్హ్
మీ ముఖాలను తుడుచుకోండి. మీ చేతులను కూడా తుడుచుకోండి.

అయితే దీని ఆదేశం ఏంటి? విధిగా ఉంది. నీళ్లు లేని సందర్భంలో లేక నీళ్లు ఉండి మన కొరకు హానికరంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ తప్పనిసరిగా చేయాలి.

అయితే ఇక్కడ ఇంకో విషయం మనకు తెలిసి ఉండటం చాలా మంచిది. అందువల్ల మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత అనేది ఇంకా ఎంతో గొప్పగా చెల్లించుకోవచ్చు. అదేమిటి?

ఈ తయమ్ముమ్ యొక్క సౌకర్యం ఇది అల్లాహ్ వైపు నుండి కేవలం మన కొరకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇంతకుముందు ప్రవక్తల అనుసరులకు, ఇంతకుముందు ప్రవక్తలను విశ్వసించిన వారికి ఇలాంటి సౌకర్యం అల్లాహ్ ప్రసాదించలేదు. ఈ సౌకర్యం అల్లాహ్ తాలా ఎవరికి ఇచ్చాడు ప్రత్యేకంగా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరులకు, ఆయనను విశ్వసించిన వారికి ప్రసాదించాడు.

ఈ విషయం బుఖారీ ముస్లింలో ఒక చాలా స్పష్టమైన హదీస్ ఉంది. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు: “ఐదు విషయాలు ఉన్నాయి, నాకంటే ముందు ఏ ప్రవక్తకు అవి ఇవ్వబడలేదు.” గమనించండి. అంటే ఈ ఐదు విషయాల ప్రత్యేకత అనేది కేవలం మన ప్రవక్తకే ప్రసాదించబడినది. ఒకటి, నా శత్రువులు నా నుండి ఒక నెల దూర ప్రయాణంలో ఉంటారు కానీ వారి హృదయాల్లో అల్లాహ్ నా యొక్క భయం వేస్తాడు. రెండవది, అది మన టాపిక్ కు సంబంధించింది.

وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا
వ జుఇలత్ లియల్ అర్దు మస్జిదవ్ వతహూరా
సర్వభూమిని అల్లాహ్ నా కొరకు నమాజు చేయుటకు స్థలంగా, పరిశుభ్రత పొందుటకు సాధనంగా చేశాడు.

فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلَاةُ فَلْيُصَلِّ
ఫఅయ్యుమా రజులిమ్ మిన్ ఉమ్మతీ అద్రకత్ హుస్సలా ఫల్ యుసల్లీ.
ఈ భూమిలో మీరు ఎక్కడ సంచరిస్తున్నా సరే, ఎక్కడా ఉన్నా సరే నమాజ్ టైం అయిన వెంటనే నమాజ్ చేసుకోవాలి. నీళ్లు లేవు, తహారత్ లేదు ఇలాంటి ఏ సాకులు చెప్పుకోరాదు.

మూడో విషయం,

وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ وَلَمْ تَحِلَّ لِأَحَدٍ قَبْلِي
వ ఉహిల్లత్ లియల్ గనాయిమ్ వలమ్ తహిల్ల లిఅహదిన్ ఖబ్లీ.
యుద్ధ ఫలం నా కొరకు హలాల్, ధర్మసమ్మతంగా చేయబడింది. నాకంటే ముందు ఎవరి కొరకు కూడా అది ధర్మసమ్మతంగా లేకుండింది.

మాలె గనీమత్, యుద్ధ ఫలం, యుద్ధ ధనం, యుద్ధం జరిగినప్పుడు ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో ఇస్లాం పై ఉన్నవారు గెలిచిన తర్వాత అవిశ్వాసుల ధనం ఏదైతే పొండేవారో దానిని మాలె గనీమత్ అని అనబడుతుంది.

నాలుగో విషయం, وَأُعْطِيتُ الشَّفَاعَةَ వ ఉ’తీతుష్షఫాఆ. ప్రళయ దినాన సిఫారసు చేసే ఈ గొప్ప భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించనున్నాడు.

ఐదో విషయం,

وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً
వ కానన్నబియ్యు యుబ్అసు ఇలా కౌమిహీ ఖాస్సతన్ వ బుఇస్తు ఇలన్నాసి ఆమ్మహ్.
ఇంతకుముందు ప్రవక్తలు ప్రత్యేకంగా తమ జాతి వారి వైపునకు పంపబడేవారు. కానీ నేను సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను.

ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, చనిపోయారు కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రళయం వచ్చే వరకు ప్రతి మనిషి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడం తప్పనిసరి. లేకుంటే అతని అంతిమ గతి ఏమవుతుంది? నరకమే అవుతుంది. అయితే మన టాపిక్ కు సంబంధించిన విషయం ఏంటి ఇక్కడ? భూమి మస్జిద్ గా కూడా ఉంది, అది తహూర్, పరిశుభ్రతకు సాధనంగా కూడా అల్లాహ్ తాలా దానిని చేశాడు.

మూడు విషయాలు మనం విన్నాము. తయమ్ముమ్ అంటే ఏమిటి, దాని ఆదేశం ఏంటి అంటే అది విధిగా ఉంది, మూడో విషయం అది అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప వరం.

నాలుగో విషయం, ఖురాన్లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో దీని గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి గనక, ఎవరికీ ఏ సందేహం అనేది ఉండకూడదు. తయమ్ముమ్ చేసే విషయంలో, ఎక్కడ ముస్లిం, ఒక విశ్వాసుడు ఏ ప్రాంతంలో ఉన్నా గానీ, అక్కడ అతనికి నైట్ ఫెయిల్ అయింది అని, భార్య భర్తలు ఉండేది ఉంటే వారిద్దరూ మధ్యలో సంబంధాలు జరిగాయి గనక వారిపై ఇప్పుడు స్నానం చేయడం విధిగా ఉంది, నీళ్లు లేవు అని, ఇంకా వేరే ఏ సాకులు కూడా చెప్పకుండా, నమాజ్ టైం అయిన వెంటనే నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ చేసి లేక నీళ్లు ఉండి మన ఆరోగ్యానికి, మన శరీరానికి హానికరంగా ఉంటే నీళ్లు వాడకుండా తయమ్ముమ్ చేసి వెంటనే నమాజ్ చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది యువకులు ప్రత్యేకంగా బజారుల్లో తిరగడం, ఇంకా వేరే పనుల్లో ఉండి, నమాజ్ టైంలో ఏదైనా మస్జిద్ దగ్గర ఉన్నప్పటికీ కూడా నమాజ్ కు రారు. సాకు ఏం చెప్తారు ఎక్కువ శాతం? “నాకు తహారత్ లేదు”. ఇది చాలా ఘోరమైన పాపం.

తయమ్ముమ్ హదసె అక్బర్ (పెద్ద అశుద్ధి), హదసె అస్గర్ (చిన్న అశుద్ధి) రెండిటికీ పనిచేస్తుంది. హదసె అక్బర్ అంటే ఏంటి? స్వప్న స్కలనం కావడం (నైట్ ఫెయిల్ కావడం), లేక భార్య భర్తలు కలుసుకోవడం. ఇందువల్ల ఏదైతే స్నానం చేయడం విధిగా ఉంటుందో దానిని హదసె అక్బర్ అంటారు. సామాన్యంగా మలమూత్ర విసర్జన తర్వాత, ఏదైనా అపాన వాయువు (గాలి) వెళితే, ఇలాంటి స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని హదసె అస్గర్ అంటారు.

ఈ రెండిటికీ కూడా తయమ్ముమ్ సరిపోతుంది. దానికి దలీల్ (ఆధారం) ఏమిటి? సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో ఒక చాలా పెద్ద హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రయాణ విషయంలో. అందులో ఒక తయమ్ముమ్ కు సంబంధించిన విషయం ఏంటంటే, ఒకచోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేసి,

فَلَمَّا انْفَتَلَ مِنْ صَلَاتِهِ إِذَا هُوَ بِرَجُلٍ مُعْتَزِلٍ لَمْ يُصَلِّ مَعَ الْقَوْمِ
ఫలమ్మన్ ఫలత మిన్ సలాతిహీ ఇదా హువ బిరజులిమ్ ముఅతజిలిల్ లమ్ యుసల్లి మఅల్ కౌమ్
నమాజ్ చేసి తిరిగిన తర్వాత ఒక వ్యక్తిని చూశారు ప్రవక్త గారు. అతను ఒక పక్కకు ఉన్నాడు, అందరితో కలిసి నమాజ్ చేయలేదు.

مَا مَنَعَكَ يَا فُلَانُ أَنْ تُصَلِّيَ مَعَ الْقَوْمِ
మా మనఅక యా ఫులాన్ అన్ తుసల్లి మఅల్ కౌమ్
అందరితో జమాఅత్ తో సహా, సామూహికంగా నమాజ్ ఎందుకు చేయలేదు నీవు అని ప్రవక్త వారు అతన్ని అడిగారు.

అప్పుడు అతడు ఏం చెప్పాడు?

أَصَابَتْنِي جَنَابَةٌ وَلَا مَاءَ
అసాబత్నీ జనాబతున్ వలా మా
నేను అశుద్ధావస్థకు గురయ్యాను, స్నానం చేయడం నాకు విధిగా అయిపోయింది. నీళ్లు లేవు.

అందు గురించి ఇంతవరకు నేను స్నానం చేయలేకపోయాను గనక, మీతో పాటు నేను నమాజ్ చేయలేదు. అప్పుడు ప్రవక్త ఏమన్నారు?

عَلَيْكَ بِالصَّعِيدِ فَإِنَّهُ يَكْفِيكَ
అలైక బిస్సయీద్ ఫఇన్నహూ యక్ఫీక్
పరిశుభ్రమైన మట్టి ఉంది కదా, అది నీకు సరిపోతుంది.

అలాగే సహీహ్ బుఖారీలోనే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సంఘటన ఉంది. అప్పటి వరకు ఆయనకు తయమ్ముమ్ విషయం తెలియదు. నమాజ్ టైం అయిపోయింది, స్నానం చేయడం విధిగా ఉంది. ఆయన ఏం చేశాడు? గాడిద మట్టిలో ఎలా పొర్లుతుందో చూశారా ఎప్పుడైనా? అతను స్వయంగా అంటున్నాడు, గాడిద ఎలా మట్టిలో పొర్లుతుందో అలా నేను మట్టిలో మొత్తం స్నానం చేసినట్టుగా లేచి నమాజ్ చేసుకొని ప్రవక్త వద్దకు వచ్చాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విషయం అడిగాను. ప్రవక్త గారు చెప్పారు, “అంతగా చేసే అవసరం లేదే నీకు. కేవలం రెండు చేతులు పరిశుభ్రమైన మట్టి మీద కొట్టి, మట్టి అంటి ఉంటుంది గనక అని ఒక్కసారి ఊదుకొని ముఖముపై, కుడి చేయి అరచేతితో ఎడమ చేయి అరచేతి మీద, ఈ ఎడమ చేయి యొక్క అరచేతి లోపలి భాగంతో కుడి చేయి అరచేతి పై భాగం మీద మసాజ్ చేస్తే ఒక్కసారి సరిపోతుంది.”

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది? స్నానం చేయడం విధిగా అయిన సందర్భంలో గానీ, లేక వుదూ చేయడం విధిగా ఉన్న సందర్భంలో గానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ సరిపోతుంది.

స్నానం అంటే తెలుసు, వుదూలో మనం కొన్ని ప్రత్యేక అవయవాలు కడుగుతాము. స్నానం చేయడం విధిగా ఉంటే ఏం చేస్తాము? గోరంత కూడా ఎక్కడా పొడితనం ఉండకుండా మంచిగా స్నానం చేస్తాము. కానీ నీళ్లు లేని సందర్భంలో ఒకే ఒక తయమ్ముమ్ రెండిటికీ సరిపోతుంది. ఒకసారి స్నానానికి ఇంకొకసారి వుదూకు అని రెండు రెండు సార్లు తయమ్ముమ్ చేసే అవసరం లేదు. ఒక్కసారి తయమ్ముమ్ చేసి నమాజ్ చేసుకుంటే స్నానానికి బదులుగా మరియు వుదూకు బదులుగా సరిపోతుంది.

తయమ్ముమ్ కూడా ఒక ఇబాదత్. నమాజుకు వుదూ చేయడం షరత్ కదా. వుదూ దేనితో చేస్తాము? నీళ్లతోని. నీళ్లు లేని సందర్భంలో అల్లాహ్ మనకు ఈ సౌకర్యం కలుగజేశాడు. అందు గురించి ఇది కూడా ఒక ఇబాదత్ గనక ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి.

మొదటి షరత్, మొదటిది నియ్యత్. నియ్యత్ అంటే తెలుసు కదా ఇంతకు ముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. ఏదో పెద్ద మంత్రం అలా చదవడం కాదు నోటితోని. ఏ కార్యం చేస్తున్నామో, ఏ సత్కార్యం, ఏ మంచి కార్యం, ఏ ఇబాదత్, దాని యొక్క సంకల్పం మనసులో చేసుకోవాలి. ఏమని? ఈ నా యొక్క సత్కార్యం ద్వారా అల్లాహ్ యే సంతృప్తి పడాలి, అల్లాహ్ యే నాకు దీని యొక్క ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి నమ్మకం ఉండాలి, అన్నటువంటి సంకల్పం, నియ్యత్ అనేది ఉండాలి. వేరే ప్రజలకు చూపడానికి గాని, ముతవల్లాకు చూపడం గాని, ఇంకా మన సంతానానికి చూపించడానికి గాని, నేను ఒక ముస్లింగా అన్నటువంటి భావన ఇతరులకు కలిగించడం కొరకు ఇలాంటి ఏ ప్రాపంచిక ఉద్దేశాలు ఉండకూడదు.

రెండవ నిబంధన, రెండవ షరత్, నీళ్లు లేకపోవడం లేదా ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉండడం. అందుగురించి అల్లాహుతాలా సూరె మాయిదాలో ఏదైతే చెప్పాడో, అది కూడా మనకు ఒక ఆధారంగా ఉంది:

وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ
వ ఇన్ కున్తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్
ఒకవేళ మీరు రోగులై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా…

హానికరంగా ఉండడం అనేదేదైతే చెప్తున్నామో, అది మనకు కొన్ని హదీసుల ద్వారా కూడా వివరంగా తెలుస్తుంది. అంతే కాకుండా ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? సూరె నిసా, ఆయత్ నెంబర్ 29లో ఉంది:

وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ
వలా తఖ్తులూ అన్ఫుసకుమ్
మీకు మీరు (లేదా ఒకరినొకరు) చంపుకోకండి.

ఆత్మహత్యలు చేసుకోకండి, పరస్పరం ఒకరు మరొకరిని హత్య చేయకండి. ఇవన్నీ భావాలు దీంట్లో వస్తాయి.

إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
ఇన్నల్లాహ కాన బికమ్ రహీమా
నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల చాలా కనికరం కలవాడు.

ఈ విధంగా ఈ షరతులు మనకు తెలిసినాయి, అర్థమైనాయి.

మూడో షరత్ ఏంటంటే, తయమ్ముమ్ చేయడానికి పరిశుభ్రమైన మట్టితో చేయాలి. ఈ మూడు షరతులు తయమ్ముమ్ కు సంబంధించినవి.

ఇందులో రెండు ఫర్దులు ఉన్నాయి. ఒకటి ఏమిటి? ముఖాన్ని తుడవడం. మరొకటి? రెండు అరచేతులను.

అయితే ఏ సందర్భాల్లో తయమ్ముమ్ చేయవచ్చు అన్న విషయం మనకు ఇంతకు ముందే సంక్షిప్తంగా వచ్చింది. నీళ్లు లేనప్పుడు లేక ఉండి కూడా వాడడం నష్టంగా ఉన్నప్పుడు. దానినే మరికొంచెం వివరంగా తెలుసుకుందాం.

నీళ్లు లేకపోవడం అంటే ఏమిటి? నీళ్లు లేకపోవడం అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడా నీళ్లు వుదూ చేయడానికి దొరకకపోవడం. మనం అక్కడి వరకు మన వద్ద బండి ఉంటే బండి ద్వారా వెళ్లడం గానీ, లేక కాలి నడకతో వెళ్లడం గానీ సాధ్యం ఉండి కొన్ని అడుగులు వెళ్తే అక్కడ దొరుకుతాయి అన్నటువంటి ఛాన్స్ ఉండేది ఉంటే, నీళ్లు లేని కింద లెక్కించబడదు. ఉదాహరణకు, ఇప్పుడు ఇక్కడ మనం సౌదియాలో ఉన్నాం గనక ఇక్కడి నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నీళ్లు ఉన్నాయి అనుకోండి. మనకు ఇక్కడ దగ్గరలో లేవు, అయితే నమాజ్ టైం అయినప్పుడు మన దగ్గర ఏదైనా బండి ఉంది లేక కార్ ఉంది, లేక మన మిత్రుని దగ్గర బండి ఉంది, వేరే ఎన్నో అవసరాలకు మనం తీసుకుంటూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాము. ఆ రెండు కిలోమీటర్ల దూరానికి వెళ్లి ఆ నీళ్లు తీసుకురావడం మనకు కష్టంగా ఉంటుందా? ఉండదు. అయితే దాన్ని నీళ్లు లేవు అన్న విషయం అక్కడ వర్తించదు. మనం ఎక్కడి వరకు వెళ్లి నీళ్లు తీసుకోవడం సాధ్యం ఉన్నదో అక్కడి వరకు వెళ్లి తీసుకోవాలి. ఇక ఎక్కడైతే సాధ్యం కాదో అది నీళ్లు లేవు అన్న దానికి కింద లెక్కించబడుతుంది.

రెండో విషయం, మన దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ త్రాగడానికి ఉన్నాయి. ఆ నీళ్లతో మనం స్నానం చేస్తే లేక వుదూ చేయడం మొదలు పెడితే త్రాగడానికి మనకు నీళ్లు దొరకవు. కొన్ని కొన్ని సందర్భాల్లో కరువు ఏర్పడుతుంది, వర్షాలు ఉండవు, మన దగ్గర కూడా అలాంటి ప్రాంతం అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. నీళ్లు త్రాగడానికి మాత్రమే ఉన్నాయి. వాడుకోవడానికి లేవు. అలాంటి సందర్భంలో కూడా అది నీళ్లు లేని కిందనే లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇస్లాం మనల్ని మనం నష్టపరుచుకోవడానికి ఆదేశించదు. ఇదే ఆయత్లో, ఎక్కడైతే మనం ఇంతకు ముందు సూరె మాయిదా ఆయత్ చదివామో అందులోనే అల్లాహుతాలా ముందు ఏం చెప్తున్నాడు?

مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ
మా యురీదుల్లాహు లియజ్అల అలైకుమ్ మిన్ హరజ్
అల్లాహుతాలా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదల్చుకోలేదు.

وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ
వలాకిన్ యురీదు లియుతహ్హిరకుమ్
అల్లాహ్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని శుభ్రపరచడం, పరిశుద్ధులుగా చేయడం.

وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ
వ లియుతిమ్మ నిఅమతహూ అలైకుమ్
తన యొక్క కారుణ్యాన్ని మీపై సంపూర్ణం చేయడం.

ఎందుకు?

لَعَلَّكُمْ تَشْكُرُونَ
లఅల్లకుమ్ తష్కురూన్
మీరు కృతజ్ఞత చెల్లించే వాళ్ళు కావాలి అని.

గమనించండి. నీళ్లు త్రాగడానికి కూడా మనకు లేకుంటే మన జీవితమే చాలా నష్టంలో పడిపోవచ్చు. అందుగురించి వాడుకోవడానికి ఉన్న నీళ్లు మొత్తానికి అయిపోయి, కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నాయి, దానిని వాడితే ఇక మనకు చాలా ఇబ్బందికి గురవుతాము, అలాంటప్పుడు కూడా నీళ్లు లేవు అన్న విషయంలోనే వర్తిస్తుంది.

మూడో రకం, నీళ్లు ఉన్నాయి చాలా. కానీ కొనాల్సి వస్తుంది. కొనాల్సి వస్తుంది. అయితే పిసినారితనం చేసి డబ్బు పెట్టి ఎందుకు కొనాలి? ఎక్కడైనా ఫ్రీగా దొరికితే చూసుకుందాము. అన్నటువంటి భావన ఉంచుకొని, శక్తి ఉండి కూడా మనం కొనకుంటే అది పాపంలో పడిపోతాము. కానీ మన దగ్గర నీళ్లు కొనేంత శక్తి లేదు. ఉన్నాయి నీళ్లు కానీ కొనాల్సి వస్తుంది. కొనేంత శక్తి కూడా మన దగ్గర లేదు. కొన్నే కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి మన ఈ రోజుకు గాని, లేకుంటే ఇంకా కొన్ని రోజుల వరకు మన అతి ముఖ్యమైన తిండి ఏదైతే ఉందో దాని గురించి గడవాలి. ఇలాంటి ఇబ్బందికరమైన జీవితం ఉన్నప్పుడు కొనడం కష్టతరంగా ఉన్నప్పుడు, కడుపు నిండా భోజనం చేసుకొని డ్రింకులు తాగవచ్చు కానీ ఇక్కడ వుదూ చేసుకోవడానికి ఒక నీళ్లు, ఒక అర లీటర్ నీళ్లు కొనలేము? ఆ డ్రింకులు ఏంటి, పెప్సీలు ఏంటి అవి మన జీవనానికి అత్యవసరమైన తిండి కింద లెక్కించబడుతుందా? లెక్కించబడదు.

విషయం అర్థమవుతుంది కదా. నీళ్లు లేవు అన్న ఈ పదం అనేది ఎన్ని రకాలుగా వస్తుంది, దాని యొక్క రూపాలు ఏంటున్నాయో అవన్నీ నేను వివరిస్తున్నాను.

రెండో విషయం, నీళ్లు ఉన్నాయి కానీ దాని ఉపయోగం మనకు నష్టకరంగా ఉంది. అంటే చలి వల్ల కావచ్చు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వేడి చేసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు. ఒకవేళ ఉన్నది సౌకర్యం కానీ ఎంత సేపు పడుతుందంటే, మన ఈ నమాజ్ టైం అనేది దాటిపోతుంది. అలాంటప్పుడు ఆ నీళ్లు ఉపయోగించడం వల్ల మనకు నష్టం కలుగుతుంది అన్న భయం ఉండేది ఉంటే తయమ్ముమ్ చేయవచ్చు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో ఒకసారి ఏం జరిగింది? ఒక వ్యక్తికి నెత్తిలో గాయమైంది. ప్రయాణంలో ఉన్నాడు, నెత్తిలో గాయమైంది. చాలా చల్లని రాత్రి, అతనికి స్నానం చేయడం కూడా విధి అయిపోయింది. దగ్గర ఉన్న స్నేహితులను అడిగాడు, ఏం చేయాలి నేను? ఫజర్ నమాజ్ టైం. “లేదు లేదు నీకేంటి, తప్పకుండా నువ్వు స్నానం చేసి నమాజ్ చేయాల్సిందే” అని అన్నారు అతని స్నేహితులు. అల్లాహ్ కరుణించు గాక వారిని. ఆయన స్నానం చేశాడు కానీ అందువల్ల అతని ప్రాణం పోయింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి వద్దకు వచ్చిన తర్వాత, “మీరు మీ సోదరుని చంపేశారు. ధర్మజ్ఞానం లేనప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఎందుకు అడగలేదు? అతను అలాంటి సందర్భంలో కేవలం తయమ్ముమ్ చేస్తే సరిపోయేది కదా” అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు బోధ చేశారు.

అయితే చలి వల్ల గాని, లేక మన శరీరంలో వుదూ చేసే అవయవాలకు ఏదైనా గాయమై ఉంది, అందువల్ల కూడా మనకు నీళ్లు వాడడం, ఉపయోగించడం నష్టకరంగా, హానికరంగా, ప్రాణం పోయేటువంటి భయం, లేక రోగం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ పెరిగే భయం, ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? “వ ఇన్ కున్తుమ్ మర్దా.” మీరు ఒకవేళ అనారోగ్యానికి గురియై మీకు నీళ్లు దొరకకుంటే తయమ్ముమ్ చేయవచ్చును. చూడండి, గమనించండి, ఇన్ని సౌకర్యాలు అల్లాహ్ ఇచ్చిన తర్వాత అరే జాన్దేలేరే క్యా ముస్లిం థండీ అయినా క్యా నమాజ్ పడతా? సామాన్యంగా అనుకుంటూ ఉంటాం కదా మనం. ఏంటి ఈ ముతవల్లాలు, ఈ మౌల్వీ సాబులు వీళ్లకు ఏం పని పాటలు ఉండయి, కేవలం అల్లాహ్ అల్లాహ్ అంటూ నమాజులు చేసుకుంటూ ఉంటారు, మన లెక్కలో ఎక్కడ పని చేస్తారు? కానీ అదే ఈ తిండి కొరకు, కూడు కొరకు, పని గురించి ఇంతటి చల్లని వాతావరణంలో కూడా ఎవరైనా డ్యూటీ వదులుకుంటాడా? చల్లగా ఉంది ఈ రోజు డ్యూటీకి వెళ్లకూడదు అని. ఏమీ దొరకకుంటే కప్పుకునే బ్లాంకెట్ అయినా వేసుకొని డ్యూటీకి వెళ్తాడు కానీ నమాజ్ విషయం వచ్చేది ఉంటే, అల్లాహ్ యొక్క దయ అని నమాజు ఎగ్గొడతాడు. ఇంకా సౌదియాలో ఇంటి నుండి మనం మస్జిద్ కి వెళ్ళడానికి కిలోమీటర్లు నడిచిపోయే అవసరమే పడదు. అవునా కాదా? వెనకా, ముంగట, కుడి పక్కన, ఎడమ పక్కన, ఎటు చూసినా అల్లాహ్ యొక్క దయ వల్ల మస్జిద్లే మస్జిద్లు. చాలా దగ్గరలో. అయినా గానీ మనం చలి కాలంలో ఇలాంటి సాకులు చెప్పి నమాజులను వదిలేస్తే, మనం ఇంకెవరికో కాదు నష్టంలో పడేసేది. మనకు మనం నరకానికి దారి సులభం చేసుకుంటున్నాము. అందు గురించి సోదరులారా, అల్లాహ్ మనందరికీ భయపడే మరియు ఇలాంటి సౌకర్యాలు ఏదైతే అల్లాహ్ ఇచ్చాడో వాటిని ఉపయోగించుకొని అల్లాహ్ యొక్క ఆరాధన సరైన పద్ధతిలో చేసే భాగ్యం కలిగించు గాక.

అయితే ఒక విషయం ఇక్కడ గుర్తించాలి, అదేమిటి? ఎప్పుడైతే నీళ్లు దొరుకుతాయో అప్పుడు తయమ్ముమ్ చేయడం అనేది మానేసేయాలి. నీళ్లు వచ్చిన వెంటనే. చివరికి కొందరు ఆలిములు ఏమంటున్నారో తెలుసా? నీళ్ల గురించి అన్ని రకాల ప్రయత్నం నువ్వు చేశావు, నీళ్లు దొరకలేదు, తయమ్ముమ్ చేసుకుని నమాజ్ మొదలు పెట్టావు, నీళ్లు వచ్చాయి. నమాజ్ ను తెంపేసేయ్, వుదూ చేసుకొని నమాజ్ చెయ్. అర్థమైందా?

మరో విషయం ఇక్కడ, తయమ్ముమ్ ద్వారా కూడా ఒక్కటి కంటే ఎక్కువ నమాజులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు మీరు అసర్ లో తయమ్ముమ్ చేశారు. ఆ వుదూను, అంటే తయమ్ముమ్ తో ఏదైతే మీకు వుదూ అయిందో దాన్ని మీరు కాపాడుకున్నారు. మూత్రానికి వెళ్ళలేదు, ఇంకా వుదూ భంగమయ్యే ఏవైతే కారణాలు మనం ఇంతకు ముందు విన్నామో అలాంటివి ఏవీ సంభవించలేదు. అయితే మగ్రిబ్, ఇషా అన్నీ చేసుకుంటూ వచ్చినా గానీ కానీ నీళ్లు వచ్చేస్తే అరె నేను అప్పుడు తయమ్ముమ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ కంటే ముందు నీళ్లు వచ్చేసాయి, అసర్ టైంలో నీళ్లు లేవు. మగ్రిబ్ వరకు నీళ్లు వచ్చేసినాయి. నా అప్పటి వుదూ ఉంది కదా, దానితోనే నేను మగ్రిబ్ చేసుకుంటాను. తప్పు విషయం. నీళ్లు వచ్చేసాయి ఇప్పుడు తయమ్ముమ్ నీది చెల్లదు, తయమ్ముమ్ నీది నడవదు, అది expire అయిపోయినట్లు. అర్థమవుతుంది కదా. మళ్లీ కొత్తగా వుదూ చేసుకొని మీరు మగ్రిబ్ నమాజ్ అనేది చేయాలి. అంటే నీళ్లు వచ్చిన వెంటనే తయమ్ముమ్ సమాప్తం అయిపోతుంది. దాని యొక్క ఆదేశం అనేది ఇక ఉండదు. ఎందుకు? అల్లాహ్ ఏమంటున్నాడు?

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ
నీళ్లు పొందని సందర్భంలో మీరు తయమ్ముమ్ చేయండి.

నీళ్లు వచ్చిన తర్వాత? ఇక ఉండదు.

ఇంకో విషయం. స్నానం చేసే విషయంలో, అంటే స్నానం విధి అయింది, నీళ్లు లేవు. నమాజ్ టైం అయింది. ఏం చేసినాం మనం? తయమ్ముమ్ చేసుకొని నమాజ్ చేశాం. ఓకే? తర్వాత నీళ్లు వచ్చాయి. స్నానం చేయాలా చేయవద్దా? చేయాలి. ప్రశ్న అర్థమైందా? ఉదాహరణకు ఫజర్ నమాజే అనుకోండి. రాత్రి నైట్ ఫెయిల్ అయింది. నీళ్లు దొరకలేదు. లేక ఫజర్ నమాజ్ టైం గనక ఎక్ దమ్ మైనస్ డిగ్రీ వాతావరణం ఉండి, నీళ్లు వాడితే మనకు జ్వరం వచ్చేస్తుంది, నీళ్లు వాడేది ఉంటే మనకు ఇంకా ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. నీళ్లు వాడలేదు, తయమ్ముమ్ చేసుకున్నాము. పొద్దెక్కేసరికి మనకు ఆరోగ్యం బాగైపోయింది, ఇప్పుడు నీళ్లు వాడడంలో నష్టం లేదు. అప్పుడు స్నానం చేయాలా, చేయవద్దా? చేయాలి.

చాలా పెద్దగా ఉంది హదీస్ అని నేను ఇంతకు ముందు ఒక ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఏదైతే చెప్పానో, అందులో ఆ వ్యక్తి నువ్వు ఎందుకు మాతో నమాజ్ చేయలేదు అని ప్రవక్త గారు అడిగారు కదా, అతను ఏమన్నాడు? నా దగ్గర నీళ్లు లేవు, నేను జునుబీ అయిపోయాను, అశుద్ధావస్థకు గురయ్యాను. ప్రవక్త చెప్పారు, నీకు తయమ్ముమ్ సరిపోయేది. ఆ తర్వాత కొంతసేపటికి, అయితే ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు అప్పటికే పంపి ఉన్నారు కొందరిని నీళ్ల గురించి. పోండి మీరు నీళ్ల గురించి వెతకండి అని. ఆ హదీస్ అంతా పొడుగ్గా ఉన్నది అంటే అందులో ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారి గొప్ప మహిమ కూడా ఉన్నది. మరి ఎప్పుడైనా గుర్తు చేయండి చెప్తాను దాని గురించి. కానీ సంక్షిప్తం ఏంటంటే నీళ్లు దొరుకుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో తమ చేతులు పెడతారు, అల్లాహ్ బరకత్ ప్రసాదిస్తాడు, అందరూ తమ తమ దగ్గర ఉన్న పాత్రలన్నీ నింపుకుంటూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు చూడండి, ఏ విషయం ఎంత ముఖ్యమైనది, అవసరమైనది ఉంటుందో దాని విషయంలో అశ్రద్ధ వహించరు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ప్రయాణంలో ఉన్నారు, ఎందరో సహచరులు ఉన్నారు, ఎందరియో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ఆ వ్యక్తిని గుర్తు చేసి, అతన్ని పిలవండి, హా నీళ్లు తీసుకెళ్ళు, తీసుకెళ్లి నువ్వు స్నానం చెయ్యి అని ఆదేశించారు.

సహీహ్ బుఖారీలో ఆ హదీస్ ఉంది, 344 హదీస్ నెంబర్. అయితే విషయం ఏం తెలిసింది మనకు? స్నానం విధిగా ఉన్నప్పుడు నీళ్లు లేవు లేక ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉంటే నమాజ్ చేసుకున్నాము తయమ్ముమ్ తోని. కానీ తర్వాత ఆ నష్టం తొలిగిపోయింది లేదా నీళ్లు మనకు దొరికినాయి, అలాంటప్పుడు ఏం చేయాలి? స్నానం అనేది చేయాలి.

కొంచెం ఈ విషయాలు ఎక్కువ శాతం చలి కాలంలో, ఇంకా వేరే ప్రయాణంలో ఉన్న సందర్భంలో, వేరే సందర్భాల్లో కూడా మనకు అవసరం పడతాయి గనక కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. అయితే, మేజోళ్లపై మసాహ్ విషయం అనేది అల్లాహ్ యొక్క దయతో మనం వచ్చే నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాము. దీని గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే తప్పకుండా ఉలమాలతో, ధర్మవేత్తలతో మనం మంచి సంబంధాలు ఉంచుకొని అలాంటి ప్రశ్నలను మనం వారితో తెలుసుకోవాలి. షరీయత్ యొక్క సమాధానం, ధర్మపరమైన సమాధానం ఏముంటుందో తెలుసుకొని దాని ప్రకారంగా అల్లాహ్ యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.


ఇతరములు: