ఇస్లాంలో మస్జిదుల స్థానం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో , టెక్స్ట్ ]

ఇస్లాం లో మస్జిదుల స్థానం
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=gNBBOGOFaVM [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.


مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ]
ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.

మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.

ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.

ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.

మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?

فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)

ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.

అలాగే,

رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.

لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)

అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلاَئِكَةُ وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్ తమ’అ ఖౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, యత్లూన కితాబల్లాహ్, వ యతదారసూనహూ బైనహుమ్, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్ హుముల్ మలాఇకతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)

ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.

ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.(9:18)

అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.

మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.

ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.

ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ
“మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.”
ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.

అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا
“అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.”
అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు

ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.

అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,

 سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ
సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్
రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.

ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?

رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్.
ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.

ఇది మస్జిద్ అంటే.

అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.

మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.

కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.

ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42432

ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]

ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]
సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్,  హైదరాబాద్ -500059.

సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్ -500059.

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [80 పేజీలు]

ఈదుల్ అద్ హా (బక్రీద్) పండుగ – తెలుసుకోవలసిన విషయాలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ఖుత్బా అంశము: ఈదుల్ అద్హా (బక్రీద్)పండుగ –తెలుసుకోవలసిన విషయాలు                  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లిం లారా! ఒక గొప్ప దినము మనపై రాబోతున్నది. నిశ్చయంగా అది శుభకరమైనటువంటి ఖుర్బాని దినము. ఇది ఇస్లాం యొక్క గొప్ప విధి నెరవేర్చిన అనంతరం వస్తుంది. అనగా హజ్ తర్వాత వచ్చే పండుగ. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఈ విధంగా తెలియజేశారు: “అల్లాహ్ తఆలా దగ్గర అత్యంత ఘనత కలిగినటువంటి దినము – ఖుర్బానీ  (నహ్ర్) దినము“. అనగా; జిల్ హిజ్జా మాసం యొక్క పదవరోజు. ఆ తరువాత يَوْمُ الْقَرَّ “ఖర్ర్ దినము” (స్థిరపడి ఉండే రోజు) అనగా; జిల్ హిజ్జ మాసం యొక్క పదకొండవ  రోజు. ఈ రోజున హజ్ చేసే వారందరూ మినా ప్రదేశంలో ఆగుతారు.

1. ఈ ఖుర్బానీ పండుగ రోజుకు ఇతర దినాలపై ప్రాధాన్యతను ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే; హజ్ కు సంబంధించినటువంటి ఎక్కువ ఆచరణలు ఇదే రోజున పాటించబడతాయి, ఉదాహరణకు; హజ్ చేసేవారు ఆ రోజు జమ్రా ఉఖ్బా (పెద్దదాని)పై రాళ్లు కొట్టాలి, ఖుర్బానీ ఇవ్వాలి, శిరోముండన చేయాలి, తవాఫె ఇఫాదా చేయాలి, సయీ చేయాలి. మరియు హజ్ చేయనటువంటి వారు ఆ రోజున ఖుర్బానీ జంతువు బలి ఇస్తారు. ఈ ఆచరణలన్నీ అదే రోజు చేయబడతాయి. ఈ విధముగా ఆచరణలు అన్నీ ఏకం అయ్యే మరొక రోజు లేదు అందుకే ఆ రోజుకి ఇంత ప్రాధాన్యత లభించింది.

2. ఇస్లామీయ పండుగలకు వేరే ఇతర పండుగలపై ఇంత ప్రాధాన్యత లభించడానికి గల కారణం ఏమిటంటే; ఈ పండుగలు ఎంతో వివేకాన్ని మరియు గొప్ప లక్ష్యాలను తీసుకుని వస్తాయి. అందులో నుండి ముఖ్యంగా అల్లాహ్ యొక్క ఆచారాలను గౌరవించడం, మరియు విశ్వాసులకు సంతోషాన్ని కలుగ చేయడం. ఇస్లాం యొక్క అనుయాయులు ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విధి విధానాలు, సౌలభ్యాలు గురించి ప్రజలకు తెలియపరచాలి.

అరఫా దినము (తొమ్మిదవ జిల్ హిజ్జా), ఖుర్బానీ దినం (పదవ జిల్ హిజ్జా), ఆ తరువాత “తష్ రీఖ్” దినాలు ఇస్లామియా పండుగ దినములు తిని త్రాగేటువంటి దినాలు (అబూ దావూద్)

3. ఓ విశ్వాసులారా! ఆ రోజు ఒక విశ్వాసి అల్లాహ్‌ యొక్క సామీప్యం పొందాలంటే దాని కొరకు అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ ఇవ్వాలి. ఇది అల్లాహ్ యొక్క “ఖలీల్” స్నేహితులైనటువంటి ఇబ్రహీం మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సున్నత్ విధానము.

4. ఖుర్బానీ చేయడానికి కొన్ని మర్యాదలు మరికొన్ని పద్ధతులు ఉన్నాయి ఉదాహరణకు; జంతువుని ఖిబ్లా వైపు తిప్పి జుబహ్ చేయాలి, మరియు దానిపై అల్లాహ్ నామాన్ని పఠించాలి. ఈ విధంగా అనాలి:

اللهم هذا منك ولك، اللهم هذا عني وعن أهل بيتي، اللهم تقبل مني
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్నీ వ అన్ అహ్ల్ బైతీ, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు. ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము. ఓ అల్లాహ్! నా వైపు నుండి మరియు నా కుటుంబం వైపు నుండి దీనిని స్వీకరించు)

5. ఖుర్బానీ ఇచ్చే వారు స్తోమత ఉంటే స్వయంగా జంతువుని జుబహ్ చేయాలి. దాని విధానం – నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి;  రక్తం వేగంగా ప్రవహించే రెండు రక్త నరాలు కోయాలి, ఇంకా శ్వాస నాళం మరియు ఆహారనాళం కోయాలి.

6. ఎవరైనా తన ఖుర్బానీ జంతువును వధించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగిస్తే, దానిని వధించే వ్యక్తి అతని తరపున ఈ దువాను పఠించాలి: 

اللهم هذا منك ولك، اللهم هذا عن فلان ، اللهم تقبل منه
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్ ఫులాన్, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ హు
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్!  ఇది ఫలానా (పేరు పలకాలి) వ్యక్తి తరుపు నుండి దీనిని స్వీకరించు).

7. కత్తిని లేక చాకుని ఖుర్బానీ జంతువు నుండి దాచి ఉంచాలి. దాని ముందు పదును పెట్టరాదు, మరియు ఇతర జంతువుల ముందు దానిని జబహ్ చేయరాదు. ఇందులో మనం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సూక్తిని అనుసరించాలి: అల్లాహ్ తఆలా ప్రతి దానిపట్ల ఉన్నతంగా వ్యవహరించాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు దేనినైనా వధించ వలసి వచ్చినప్పుడు దానిని ఉన్నతంగా వధించండి మరియు తమ ఆయుధానికి బాగా పొద్దున పెట్టండి .ఎందుకంటే వధించబడే జంతువును బాధించరాదు. (ముస్లిం)

8. ఖుర్బానీ ఇచ్చేటువంటి సమయం నాలుగు రోజుల వరకు ఉంటుంది. పండుగ రోజు ఆ తర్వాత మూడు “తష్ రీఖ్” దినాలు. ఇందులో మొదటి రోజు ఖుర్బానీ ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే ఇది జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది రోజులలో ఉంది.

9. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు కొమ్ములు తిరిగిన తెల్లని రెండు పొట్టేళ్లను ఖుర్బానీగా ఇచ్చారు. మరియు ఎలాంటి జంతువుని ఖుర్బాని చేయకూడదో అది కూడా తెలియజేశారు. ఒంటి కన్ను కలిగిన దానిని ,రోగం ఉన్నట్లు స్పష్టంగా ఉన్న దానిని, కుంటిది, ఎముకల్లో సత్తువ లేని ముసలిది.(అహ్మద్)

10. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పండగ రోజున ఖుర్బానీ మాంసం తోనే భోజనాన్ని ప్రారంభించే వారు.

11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కాలంలో ప్రజలు ఖుర్బానీ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు, మరియు ఉన్నవాటిలో అన్నింటికంటే మంచి జీవాలను కొనుగోలు చేసేవారు, ఎందుకంటే ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉంటే అది అల్లాహ్ వద్ద అంతే ప్రియమైనదిగా పరిగణించబడుతుంది, మరియు దాని ద్వారా ఖుర్బానీ చేసే వ్యక్తికి కూడా అంతే ప్రతిఫలం లభిస్తుంది. ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు: “సాదారణంగా ఖుర్బానీ యొక్క పుణ్యఫలం దాని ఖరీదును బట్టి ఉంటుంది”. (అల్ ఫతావా)

12. అల్లాహ్ దాసులారా! ఖుర్బాని జీవం పై ఖర్చు పెట్టడంలో ఎలాంటి పరిమితి లేదు. దాని మాంసం తినవచ్చు, ప్రయాణంలో తీసుకు వెళ్లొచ్చు ,మరియు పేదలలో పంచి పెట్టవచ్చు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

 فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ
వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి” (సూరా అల్ హజ్ 22:36)

హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు:
(తినండి తినిపించండి మరియు దాచుకోండి) (ముస్లిం)

13. జంతువును జూబహ్ చేసిన తర్వాత, దానిలోని ఏ భాగాన్ని కానీ, మాంసాన్ని గానీ, చర్మాన్ని గానీ, మరేదైనా అమ్మడానికి అనుమతి లేదు.

14.  అవిశ్వాసుల హృదయాలు ఇస్లాం వైపు మొగ్గడానికి వారికి ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వచ్చు.

15. ఖుర్బానీ మాంసాన్ని కసాయి వానికి కూలీగా ఇవ్వరాదు. ఎందుకంటే ధర్మం దీనికి అంగీకరించలేదు. కనుక అతనికి కూలీగా డబ్బులు మాత్రమె ఇవ్వాలి.

16. ఓ అల్లాహ్ దాసులారా! ఈ గొప్ప పండుగ తర్వాత ఘనత కలిగినటువంటి దినాలు కూడా వస్తాయి. వాటిని “తష్రీఖ్” దినాలు అంటారు ఆ దినములలో అతి ఎక్కువగా” జిక్ర్ “స్మరణ చేయమని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు:

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ
(గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్‌ దినాలలో) అల్లాహ్‌ను స్మరించండి.) (సూరా అల్ బఖర 2:203)

ఈద్ రోజులలో చేయవలసిన ముఖ్యమైన ఆచరణ ఇక్కడ తెలపడం జరుగుతుంది: “తష్రీఖ్” యొక్క మూడు రోజులలో అన్ని సమయాలలో సంపూర్ణ తక్బీర్ పటించాలి. మరియు మూడవరోజు మగ్రిబ్ నమాజ్ వరకు తక్బీర్ చదువుతూ ఉండాలి. అలాగే  “తష్రీఖ్” యొక్క మూడవ రోజున అసర్ వరకు రోజువారీ ప్రార్థనలలో ఐదు పూటల ఈ విధంగా తక్బీర్ పటించాలి:

(అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లాల్లాహ్,  వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్)
ఇందులో అల్లాహు అక్బర్ రెండుసార్లు లేదా మూడుసార్లు పటించవచ్చు

17. తష్రీఖ్” దినాలు వాస్తవానికి తిని త్రాగే మరియు అల్లాహ్ స్మరించుకునే రోజులు. ఈ రోజులలో ఉపవాసం ఉండడం అనుమతించబడలేదు, ఎందుకంటే అవి పండుగ రోజులు.

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “తష్రీఖ్” దినాలు తిని త్రాగేటువంటి రోజులు”.
మరో హదీసులో ఉంది: “అల్లాహ్ ను స్మరించే రోజులు”.

18. ఈద్ గొప్ప ప్రయోజనాల్లో ఒకటి: ముస్లింల మధ్య సంబంధాన్ని నెలకొల్పడం, ఒకరినొకరు కలిసే సద్భావం కలిగి ఉండటం. హృదయాలలో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవడం, భయం మరియు పేదరికాన్ని తొలగించడం, మరియు ద్వేషం మరియు అసూయలను నివారించడం, మరియు హృదయాలలో రగులుతున్న అసూయ అనే అగ్నిని ఆర్పడం. ఈద్ ప్రార్థనను నిర్వహించడానికి ముస్లింలను ఒకే చోట సమీకరించగల ఇస్లాం యొక్క సామర్ధ్యం మనకు కనిపిస్తుంది. అంతేకాదు భక్తి ప్రాతిపదికన వారిని సత్యం పై స్థిరంగా వారి హృదయాలను మార్గనిర్దేశం చేస్తుందనడానికి సంకేతం.

నౌమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “విశ్వాసుల ఉదాహరణ కరుణపరంగా, ఐక్యత పరంగా, ప్రేమ పరంగా ఒక శరీరం లాంటిది. కనుక శరీరంలో ఏదైనా భాగంలో నొప్పి కలిగితే దాని ద్వారా జ్వరం వస్తుంది. అప్పుడు శరీరంలో ఉన్న అవయవాలన్ని ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి”. (ముస్లిం)

పండగ రోజున చేసేటువంటి మరొక అభిలషనీయమైన పని ఏమిటంటే; ఆ రోజున బంధుత్వాలను కలుపుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ తన దాసుడిపై దీనిని విధిగా చేశాడు. ముఖ్యంగా శుభ సందర్భాలలో కాబట్టి ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటారో అల్లాహ్ తఆల అతనికి దగ్గరవుతాడు, మరి ఎవరైతే బంధుత్వాన్ని తెంచుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ తన కారుణ్యం నుండి దూరం చేస్తాడు,

అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఎలా తెలియజేశారు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు: “నేను కరుణామయుడును నేనే బంధుత్వాన్ని పుట్టించాను. మరియు దాని పేరును నా పేరుతో జోడించాను. కాబట్టి ఎవరైతే నీతో సంబంధం పెట్టుకుంటాడో అతనితో నేను సంబంధం పెట్టుకుంటాను, మరియు ఎవరైతే త్రేగదెంపులు చేసుకుంటాడో అతనితో నేను త్రేగదెంపులు చేసుకుంటాను“. (ముస్లిం)

ఓ అల్లాహ్ దాసులారా! కనుక ఎవరైతే తమ బంధువులతో స్నేహితులతో పోట్లాట కారణంగా విడిపోయారో వారు మన్నింపుల వైఖరిని అవలంబించండి. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నాడు:

فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ
కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ( సూరా ఆష్ షూరా 42:40)

మరొకచోట ఇలా అంటున్నాడు:

إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ
విశ్వాసులు (ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. (సూరా అల్ హుజురాత్ 49:10)

19. ఓ అల్లాహ్ దాసులారా పండుగ శుభాకాంక్షలు తెలుపడం ఒక మంచి పని. ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియ చేస్తున్నారు:  పండుగ నమాజ్ తరువాత ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు (تقبل الله منا ومنكم، وأحاله الله عليك) తెలుపుకునే విధానం కొందరి సహాబాల ద్వారా మనకు తెలుస్తుంది. మరియు కొంత మంది ధర్మ పండితులు కూడా దీనిని సమ్మతించారు. (అల్ ఫతావా)

20. అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు వ్యతిరేకంగా చట్ట విరుద్ధమైన నిషేధించబడిన విషయాలకు పాల్పడితే దానికి బదులుగా అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుతుంది అని భయపడండి.

చివరిగా నేను, నా కోసం మరియు మీ కోసం పాప క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా అతను క్షమించేవాడు మరియు దయగలవాడు.

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ విశ్వాసి స్త్రీలారా! అల్లాహ్ విశ్వాస మాతృమూర్తులకు ఆజ్ఞాపిస్తూ ఖురాన్ ఈ విధంగా అంటున్నాడు:

وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّهَ وَرَسُولَهُ

మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి. జకాతు ఇస్తూ ఉండండి. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

అల్లాహ్‌ను తమ ప్రభువుగా, ఇస్లాంను తమ మతంగా మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రవక్తగా అంగీకరించే ఓ ఇస్లాం మహిళ లా, తీర్పు దినం వరకు వారి అడుగుజాడల్లో నడిచే విశ్వాసుల తల్లులకు మరియు విశ్వాసులైన మహిళలకు ఈ దైవిక ఉపదేశం సాధారణంగా అందరికీ వర్తిస్తుంది, కాబట్టి అల్లాహ్ కు మరియు ప్రవక్త విధేయతకు కట్టుబడి ఉండాలి.

మానవులు మరియు జిన్నాతులు యొక్క చెడు విధానాల పట్ల తస్మాత్ జాగ్రత్త వహించాలి. నగ్నత్వం మరియు అశ్లీల ఉపద్రవం యొక్క ప్రలోభాలలో పడకండి. అల్లాహ్ ఇలా అంటున్నాడు;

وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ 
పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

భద్రతను, క్షేమాన్ని కోరుకునే స్త్రీ తనను తాను అవిస్వాసుల కార్యకలాపాలలో అనుసరించకూడదు, ఎందుకంటే వారిని అనుసరించడం వలన ఇది హృదయం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు మనలో కూడా ఆ అవలక్షణాలు చోటు చేసుకుంటాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

وَاللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا

అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. (సూరా అన్ నిసా 4:27)

మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు! అల్లాహ్ మీ అందరినీ ఎల్ల వేళలా సుఖ సౌఖ్యాలతో ఉంచుగాక. అందరి పై తన శుభాల వర్షాన్ని కురిపించు గాక. అందరి ఆరాధనలు స్వీకరించుగాక. పాపాలను మన్నించుగాక. అల్లాహ్ అందరి ధర్మ సమ్మతమైన కోరికలు తీర్చుగాక. సదా చరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు గాక!

చివరగా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపుతూ ఉండండి, ఎవరైతే ఒకసారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలు కురిపిస్తాడు.

اللهم صلِّ وسلِّم وبارك على عبدك ورسولك نبينا محمد، وعلى آله وصحبه أجمعين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ