బిలాల్ (రధి అల్లాహు అన్హు) ఇచ్చే అజాన్

664. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

తహజ్జుద్ నమాజ్ చేస్తూ ఉండేవాళ్ళు (భోజనానికి) వచ్చేందుకు, నిద్రిస్తున్న వాళ్ళు మేల్కొనేందుకు వీలుగా బిలాల్ (రధి అల్లాహు అన్హు) అజాన్ ఇస్తుంటారు. అందువల్ల ఆయన అజాన్ విని ఎవరూ సహరీ భోజనం తినడం మానివేయనవసరం లేదు. ఆయన ఇచ్చే అజాన్ విని ఉషోదయమయిందని గాని, లేక తెల్లవారిపోయిందని గాని ఏ ఒక్కరూ భావించకూడదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెబుతూ తమ చేతివ్రేళ్ళతో సూచించారు. మొదటి వాటిని పైకి ఎత్తారు. తరువాత క్రిందికి దించారు. అంటే ఈ విధంగా (తెలుపు) వ్యాపించే వరకు అని అర్ధం.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 13 వ అధ్యాయం – అల్ అజాన్ ఖబ్లల్ ఫజ్ర్]

ఉపవాస ప్రకరణం : 8 వ అధ్యాయం – ఉపవాస వ్రతం, ఉషోదయం నుండి మొదలవుతుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ప్రళయదినాన ఆ పశువులు ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి

576. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రధి అల్లాహు అన్హు) కధనం :-

నేను (ఓసారి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తే సరిగ్గా అదే సమయంలో ఆయన “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి!” అంటూ లేక “తాను తప్ప వేరే ఆరాధ్యుడు లేనటువంటి శక్తి స్వరూపుని సాక్షి” అంటూ లేక మొత్తం మీద ఆయన ఏదో ఓ రకంగా ప్రమాణం చేస్తూ ఇలా అన్నారు. “ఒంటెలు, ఆవులు లేదా మేకలు కలిగి వున్న వ్యక్తి వాటి హక్కు (అంటే జకాత్) గనక నెరవేర్చకపోతే ప్రళయదినాన ఆ పశువులు బాగా పెరిగి బలసిపోయేలా చేసి తీసుకురాబడతాయి. తర్వాత అవి ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి. చివరి పశువు కూడా పొడిచి, తొక్కి వేసిన తరువాత తిరిగి మొదటి పశువు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ యాతన యావత్తు మానవులను గురించి (పరలోక) తీర్పు ముగిసే దాకా కొనసాగుతుంది.”

[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 43 వ అధ్యాయం – జకాతిల్ బఖర]

జకాత్ ప్రకరణం : 8 వ అధ్యాయం – జకాత్ చెల్లించని వారు కఠినాతి కఠిన శిక్ష చవి చూడవలసి వస్తుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం

390. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 37 వ అధ్యాయం – ఫజ్లిమన్ ఘదా ఇలల్ మస్జిది వరాహ]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 51 వ అధ్యాయం – నమాజు కోసం ముస్జిదుకు వెళ్తే పాపాలు క్షమించబడతాయి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు

1366. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కధనం :-

నేనొక దిండు (లేక తలగడ) కొన్నాను. దాని మీద బొమ్మలు వేసి ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుంచి వచ్చి దాన్ని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. ఇంట్లోకి ప్రవేశించలేదు. నేనాయన ముఖంలో ఆగ్రహ చిహ్నాలు చూసి ‘దైవప్రవక్తా! నేను అల్లాహ్ ముందు, ఆయన ప్రవక్త ముందు పశ్చాత్తాపపడుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నేను చేసిన తప్పేమిటో సెలవియ్యండి” అని అన్నాను.

దానికి ఆయన “ఈ దిండేమిటి?” అని అడిగారు. “ఈ దిండు మీరు ఆనుకొని కూర్చుంటారన్న ఉద్దేశ్యంతో కొన్నాను” అని చెప్పాను నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)

“బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు. ‘నీవు సృష్టించిన దీనికి ప్రాణం పొయ్యి అంటాడు అల్లాహ్ అతనితో (అతనా పని చేయలేడు)” అని అన్నారు. ఆ తరువాత “బొమ్మలు ఉండే ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు” అని చెప్పారు ఆయన.

[సహీహ్ బుఖారీ : 34 వ ప్రకరణం – అల్ బుయూ, 40 వ అధ్యాయం – అత్తిజారతి ఫీమా యుక్రహు లుబ్సుహూ లిర్రిజాలి వన్నిసా]

వస్త్రధారణ, అలంకరణల ప్రకరణం : 26 వ అధ్యాయం – కుక్క, (ప్రాణుల) చిత్రాలుండే ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

దైవాదేశాలకు విరుద్ధంగా లేనంత వరకూ పాలకుల ఆజ్ఞలను శిరసావహించడం (ప్రజల) విధి

1204. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరు నాకు విధేయుడయ్యాడో  అతను వాస్తవానికి అల్లాహ్ కి విధేయుడయ్యాడు – మరెవరు నాకు అవిధేయుడయ్యాడో అతను నిజానికి అల్లాహ్ కే అవిధేయుడయిపోయాడు. అలాగే ఎవరు నేను నియమించిన నాయకునికి విధేయత చూపాడో అతను నాకు విధేయత చూపినట్లే; మరెవరు నేను నియమించిన నాయకునికి అవిధేయుడయ్యాడో అతను స్వయంగా నాకు ఆవిధేయుడయి పోయాడన్నమాట.(*)

[సహీహ్ బుఖారీ : 93 వ ప్రకరణం – అహ్కామ్, 1 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (అతీవుల్లాహ వ అతీవుర్రసూల వ ఉలిల్ అమ్రి మిన్ కుమ్)]

(*) ఈ ప్రవచనంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అధికారి విధేయతను తన విధేయతతో పోల్చి అధికారుల వ్యవహారానికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. దీనిక్కారణం ఖురైషీయులకు వారి దగ్గర ఉండే అరబ్బులకు నాయకత్వపు హొదా గురించి అంతగా తెలియక పోవడమే. వారు తమ తెగ నాయకులకు తప్ప మరెవరికీ తలవొగ్గరు. ఇస్లామీ యుగం ప్రారంభ రోజుల్లో ఆ అరబ్బులకు తమపై నాయకుడ్ని నియమించడం నచ్చలేదు. దాంతో కొందరు నాయకునికి విధేయత చూపడానికి నిరాకరించారు. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాయకునికి విధేయత చూపడమంటే తనకు విధేయత చూపడమేనని చెప్పి అధికారి (నాయకుని) విధేయతకు అత్యంత ప్రాముఖ్యమిచ్చారు. ప్రజలు అధికారులకు విధేయత చూపడం నేర్చుకొని, సమాజంలో సంక్షోభం, అనైక్యతలు సృష్టించకూడదన్నదే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనంలోని ఆంతర్యం (సంకలనకర్త).

పదవుల ప్రకరణం : 8 వ అధ్యాయం – ధైవాదేశాలకు విరుద్ధంగా లేనంత వరకూ పాలకుల ఆజ్ఞలను శిరసావహించడం (ప్రజల) విధి.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

స్వర్గంలో అత్యధిక మంది పేదలు, నరకంలో అత్యధిక మంది స్త్రీలు

1743. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

నేను స్వర్గ ద్వారం దగ్గర నిలబడి చూశాను. స్వర్గంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది నిరుపేదలే ఉన్నారు.  ధనికులు (విచారణ కోసం ద్వారం ముందు) నిరోధించబడ్డారు. అయితే నరకానికి పోవలసిన ధనికుల్ని నరకంలోకి పంపమని ముందే ఆజ్ఞాపించడం జరిగింది. నేను నరక ద్వారం దగ్గర కూడా నిలబడి చూశాను. నరకంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది స్త్రీలే ఉన్నారు.

[సహీహ్ బుఖారీ : 67 వ ప్రకరణం – నికాహ్, 87 వ అధ్యాయం – హద్దసనా ముసద్దద్]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 26 వ అధ్యాయం – స్వర్గంలో అత్యధిక మంది పేదలు, నరకంలో అత్యధిక మంది స్త్రీలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అమరగతుడైన ఒక్క వీరయోధుడు (షహీద్) తప్ప స్వర్గంలో ప్రవేశించిన ఏ వ్యక్తి కూడా తిరిగి ఇహలోకానికి పోవడానికి ససేమిరా ఇష్టపడడు.

1232. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :-

అమరగతుడైన ఒక్క వీరయోధుడు (షహీద్) తప్ప స్వర్గంలో ప్రవేశించిన ఏ వ్యక్తి కూడా ప్రపంచ సంపదలన్నీ ఇవ్వబడతాయన్నా సరే, తిరిగి ఇహలోకానికి పోవడానికి ససేమిరా ఇష్టపడడు. అమరగతుడైన వీరయోధుడు అమరగతి (షహాదత్) కి సంబంధించిన గౌరవ ఔన్నత్యాలు చూసి ఉంటాడు గనుక, అతను మళ్ళీ ఇహలోకానికి వెళ్లి (దైవమార్గంలో) పదిసార్లు (అయినా) వీరమరణం పొందాలని కోరుకుంటాడు.

[సహీహ్ బుఖారీ : 56 వ ప్రకరణం – జిహాద్, 21 వ అధ్యాయం – తమన్నిల్ ముజాహిది అయర్జిఅ ఇలాద్దున్యా]

పదవుల ప్రకరణం : 29 వ అధ్యాయం – దైవమార్గంలో అమరగతి – దాని ఔన్నత్యం.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

స్త్రీ పిల్లవాడి పట్ల ఎంత దయామయురాలో, అల్లాహ్ తన దాసుల పాలిట అంతకంటే ఎంతో ఎక్కువ దయామయుడు

1751. హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి కొందరు ఖైదీలు వచ్చారు. వారిలో ఒక మహిళా ఖైదీ పాలిండ్లలో పాలు పొంగుతున్నాయి. ఆమె ఏ చంటి పిల్లవాడ్ని చూసినా గుండెలకు హత్తుకొని అతనికి పాలు పట్టేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ స్త్రీని చూసి మాతో “ఈ స్త్రీ తన పిల్లవాడ్ని అగ్నిలో విసిరి వేస్తుందంటారా?” అని అడిగారు. దానికి మేము “విసిరివేయదు, తనకు నిరోధక శక్తి ఉన్నంతవరకు ఆమె తన పిల్లవాడ్ని అగ్నిలో ఎంతమాత్రం విసిరి వేయదు” అని అన్నాము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఈ స్త్రీ పిల్లవాడి పట్ల ఎంత దయామయురాలో, అల్లాహ్ తన దాసుల పాలిట అంతకంటే ఎంతో ఎక్కువ దయామయుడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : వ ప్రకరణం – అదబ్, వ అధ్యాయం – రహ్మతిల్ వలది వ తఖ్బీలిహీ వ ముఆనఖతిహీ]

పశ్చాత్తాప ప్రకరణం : 4 వ అధ్యాయం – అల్లాహ్ ఆగ్రహం కన్నా అనుగ్రహమే అధికం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నా భయమల్లా మీరు ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకుపోతారేమోనన్నదే

1480. హజ్రత్ ఉఖ్బా బిన్ ఆమిర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉహుద్ అమరగతుల కోసం ఎనిమిది సంవత్సరాల తరువాత (జనాజా) నమాజ్ చేశారు. చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి అందరికీ వీడ్కోలు చెబుతున్న విధంగా ఈ నమాజు చేశారు. ఆ తరువాత మస్జిద్ లో వేదిక ఎక్కి ఇలా ఉద్బోధించారు –

“నేను సారధిగా, జట్టు నాయకుడిగా మీకు ముందుగా వెళ్తున్నాను. నేను మీకు సాక్షిని, పర్యవేక్షకుడిని. ఇక మీరు నన్ను కౌసర్ సరస్సు దగ్గర కలుసుకుంటారు. నేనిక్కడ నిలబడి కూడా దాన్ని (కౌసర్ సరస్సుని) చూడగలుగుతున్నాను. నేను వెళ్ళిన తరువాత మీరు మళ్ళీ బహుదైవారాధకులై పోతారేమోనన్న భయమిప్పుడు నాకు ఏమాత్రం లేదు. కాని నా భయమల్లా మీరు ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకుపోతారేమోనన్నదే.”

[సహీహ్ బుఖారీ : 64 వ ప్రకరణం – మగాజి, 17 వ అధ్యాయం – గజ్వతి ఉహుద్]

ఘనతా విశిష్ఠతల ప్రకరణం : 9 వ అధ్యాయం – కౌసర్ సరస్సు – దాని వైశిష్ట్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అయిదు రకాల అమరగతులు

1247. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“ఒక వ్యక్తి దారిన నడుస్తుంటే ఒక చోట దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం కన్పించింది. అతనా ముళ్ళకంపను తీసి దారి పక్కన దూరంగా పారేశాడు. అతడు చేసిన ఈ సత్కార్యాన్ని ప్రతిఫలంగా దేవుడు అతని పాపాలను క్షమించాడు.”
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అమరగతుల్లో (షుహదా) అయిదు రకాల వాళ్ళుంటారు.
(1) ప్లేగు వ్యాధి వల్ల చనిపోయిన వారు,
(2) ఉదరవ్యాధితో చనిపోయిన వారు,
(3) నీటిలో మునిగి చనిపోయినవారు,
(4) ఏదైనా బరువు క్రింద నలిగి చనిపోయిన వారు,
(5) దైవమార్గంలో పోరాడుతూ వధింప బడినవారు.”

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 32 వ అధ్యాయం – ఫజ్లిత్తహ్ జీరి ఇలజ్జుహ్రి]

పదవుల ప్రకరణం : 51 వ అధ్యాయం – అమరగతులు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth