దైవాదేశాలకు విరుద్ధంగా లేనంత వరకూ పాలకుల ఆజ్ఞలను శిరసావహించడం (ప్రజల) విధి

1204. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరు నాకు విధేయుడయ్యాడో  అతను వాస్తవానికి అల్లాహ్ కి విధేయుడయ్యాడు – మరెవరు నాకు అవిధేయుడయ్యాడో అతను నిజానికి అల్లాహ్ కే అవిధేయుడయిపోయాడు. అలాగే ఎవరు నేను నియమించిన నాయకునికి విధేయత చూపాడో అతను నాకు విధేయత చూపినట్లే; మరెవరు నేను నియమించిన నాయకునికి అవిధేయుడయ్యాడో అతను స్వయంగా నాకు ఆవిధేయుడయి పోయాడన్నమాట.(*)

[సహీహ్ బుఖారీ : 93 వ ప్రకరణం – అహ్కామ్, 1 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (అతీవుల్లాహ వ అతీవుర్రసూల వ ఉలిల్ అమ్రి మిన్ కుమ్)]

(*) ఈ ప్రవచనంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అధికారి విధేయతను తన విధేయతతో పోల్చి అధికారుల వ్యవహారానికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. దీనిక్కారణం ఖురైషీయులకు వారి దగ్గర ఉండే అరబ్బులకు నాయకత్వపు హొదా గురించి అంతగా తెలియక పోవడమే. వారు తమ తెగ నాయకులకు తప్ప మరెవరికీ తలవొగ్గరు. ఇస్లామీ యుగం ప్రారంభ రోజుల్లో ఆ అరబ్బులకు తమపై నాయకుడ్ని నియమించడం నచ్చలేదు. దాంతో కొందరు నాయకునికి విధేయత చూపడానికి నిరాకరించారు. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాయకునికి విధేయత చూపడమంటే తనకు విధేయత చూపడమేనని చెప్పి అధికారి (నాయకుని) విధేయతకు అత్యంత ప్రాముఖ్యమిచ్చారు. ప్రజలు అధికారులకు విధేయత చూపడం నేర్చుకొని, సమాజంలో సంక్షోభం, అనైక్యతలు సృష్టించకూడదన్నదే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనంలోని ఆంతర్యం (సంకలనకర్త).

పదవుల ప్రకరణం : 8 వ అధ్యాయం – ధైవాదేశాలకు విరుద్ధంగా లేనంత వరకూ పాలకుల ఆజ్ఞలను శిరసావహించడం (ప్రజల) విధి.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

%d bloggers like this: