1366. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-
“నేనొక దిండు (లేక తలగడ) కొన్నాను. దాని మీద బొమ్మలు వేసి ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుంచి వచ్చి దాన్ని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. ఇంట్లోకి ప్రవేశించలేదు. నేనాయన ముఖంలో ఆగ్రహ చిహ్నాలు చూసి ‘దైవప్రవక్తా! నేను దేవుని ముందు, ఆయన ప్రవక్త ముందు పశ్చాత్తాపపడుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నేను చేసిన తప్పేమిటో సెలవియ్యండి” అని అన్నాను. దానికి ఆయన “ఈ దిండేమిటి?” అని అడిగారు. “ఈ దిండు మీరు ఆనుకొని కూర్చుంటారన్న ఉద్దేశ్యంతో కొన్నాను” అని చెప్పాను నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు. ‘నీవు సృష్టించిన దీనికి ప్రాణం పొయ్యి అంటాడు అల్లాహ్ అతనితో (అతనా పని చేయలేడు)” అని అన్నారు. ఆ తరువాత “బొమ్మలు ఉండే ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు” అని చెప్పారు ఆయన.