117. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా సెలవిచ్చారు –
నరకం నుండి అందరికంటే చివర్లో బయటపడే, స్వర్గంలోనూ అందరికంటే చివర్లో ప్రవేశించే వ్యక్తిని గురించి నాకు బాగా తెలుసు. అతను నరకం నుండి పడుతూ లేస్తూ బయలుదేరుతాడు. అతనితో అల్లాహ్ ‘వెళ్ళు, (ఇక) స్వర్గంలో ప్రవేశించు’ అని అంటాడు. ఆ వ్యక్తి స్వర్గం దగ్గరికి వస్తాడు. చూస్తే స్వర్గం పూర్తిగా నిండిపోయి (జనంతో) క్రిక్కిరిసి ఉన్నట్లు కన్పిస్తుంది. దాంతో అతను వెనక్కి తిరిగొచ్చి “ప్రభూ! అది పూర్తిగా నిండిపోయి ఉంది (నాకక్కడ చోటే ఉన్నట్లు కన్పించడం లేదు)” అని అంటాడు.దానికి అల్లాహ్ “వెళ్ళు, స్వర్గంలో ప్రవేశించు. నేనక్కడ నీకు ప్రపంచమంత చోటిచ్చాను. ప్రపంచ మంతేమిటీ, దానికి పదింతలు విశాలమైన చోటిచ్చాను (వెళ్ళు)” అని అంటాడు.(అయితే ఆ వ్యక్తికి నమ్మకం కలగలేదు అందువల్ల) అతను “ప్రభూ! తమరు (సర్వలోకాల) చక్రవర్తి అయి ఉండి నాలాంటి వారితో పరిహాసమాడుతున్నారా? లేక నన్ను ఆట పట్టిస్తున్నారా?” అని అంటాడు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయం తెలియజేస్తూ ఫక్కున నవ్వారు. అప్పుడు ఆయన పల్లు కూడా స్పష్టంగా కనిపించాయి” అని అన్నారు. ఈ వ్యక్తి స్వర్గవాసులలో అందరికంటే అతి తక్కువ అంతస్తు కలవాడని అంటారు.