ఈదుల్ అద్ హా (బక్రీద్) పండుగ – తెలుసుకోవలసిన విషయాలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ఖుత్బా అంశము: ఈదుల్ అద్హా (బక్రీద్)పండుగ –తెలుసుకోవలసిన విషయాలు                  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లిం లారా! ఒక గొప్ప దినము మనపై రాబోతున్నది. నిశ్చయంగా అది శుభకరమైనటువంటి ఖుర్బాని దినము. ఇది ఇస్లాం యొక్క గొప్ప విధి నెరవేర్చిన అనంతరం వస్తుంది. అనగా హజ్ తర్వాత వచ్చే పండుగ. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఈ విధంగా తెలియజేశారు: “అల్లాహ్ తఆలా దగ్గర అత్యంత ఘనత కలిగినటువంటి దినము – ఖుర్బానీ  (నహ్ర్) దినము“. అనగా; జిల్ హిజ్జా మాసం యొక్క పదవరోజు. ఆ తరువాత يَوْمُ الْقَرَّ “ఖర్ర్ దినము” (స్థిరపడి ఉండే రోజు) అనగా; జిల్ హిజ్జ మాసం యొక్క పదకొండవ  రోజు. ఈ రోజున హజ్ చేసే వారందరూ మినా ప్రదేశంలో ఆగుతారు.

1. ఈ ఖుర్బానీ పండుగ రోజుకు ఇతర దినాలపై ప్రాధాన్యతను ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే; హజ్ కు సంబంధించినటువంటి ఎక్కువ ఆచరణలు ఇదే రోజున పాటించబడతాయి, ఉదాహరణకు; హజ్ చేసేవారు ఆ రోజు జమ్రా ఉఖ్బా (పెద్దదాని)పై రాళ్లు కొట్టాలి, ఖుర్బానీ ఇవ్వాలి, శిరోముండన చేయాలి, తవాఫె ఇఫాదా చేయాలి, సయీ చేయాలి. మరియు హజ్ చేయనటువంటి వారు ఆ రోజున ఖుర్బానీ జంతువు బలి ఇస్తారు. ఈ ఆచరణలన్నీ అదే రోజు చేయబడతాయి. ఈ విధముగా ఆచరణలు అన్నీ ఏకం అయ్యే మరొక రోజు లేదు అందుకే ఆ రోజుకి ఇంత ప్రాధాన్యత లభించింది.

2. ఇస్లామీయ పండుగలకు వేరే ఇతర పండుగలపై ఇంత ప్రాధాన్యత లభించడానికి గల కారణం ఏమిటంటే; ఈ పండుగలు ఎంతో వివేకాన్ని మరియు గొప్ప లక్ష్యాలను తీసుకుని వస్తాయి. అందులో నుండి ముఖ్యంగా అల్లాహ్ యొక్క ఆచారాలను గౌరవించడం, మరియు విశ్వాసులకు సంతోషాన్ని కలుగ చేయడం. ఇస్లాం యొక్క అనుయాయులు ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విధి విధానాలు, సౌలభ్యాలు గురించి ప్రజలకు తెలియపరచాలి.

అరఫా దినము (తొమ్మిదవ జిల్ హిజ్జా), ఖుర్బానీ దినం (పదవ జిల్ హిజ్జా), ఆ తరువాత “తష్ రీఖ్” దినాలు ఇస్లామియా పండుగ దినములు తిని త్రాగేటువంటి దినాలు (అబూ దావూద్)

3. ఓ విశ్వాసులారా! ఆ రోజు ఒక విశ్వాసి అల్లాహ్‌ యొక్క సామీప్యం పొందాలంటే దాని కొరకు అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ ఇవ్వాలి. ఇది అల్లాహ్ యొక్క “ఖలీల్” స్నేహితులైనటువంటి ఇబ్రహీం మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సున్నత్ విధానము.

4. ఖుర్బానీ చేయడానికి కొన్ని మర్యాదలు మరికొన్ని పద్ధతులు ఉన్నాయి ఉదాహరణకు; జంతువుని ఖిబ్లా వైపు తిప్పి జుబహ్ చేయాలి, మరియు దానిపై అల్లాహ్ నామాన్ని పఠించాలి. ఈ విధంగా అనాలి:

اللهم هذا منك ولك، اللهم هذا عني وعن أهل بيتي، اللهم تقبل مني
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్నీ వ అన్ అహ్ల్ బైతీ, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు. ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము. ఓ అల్లాహ్! నా వైపు నుండి మరియు నా కుటుంబం వైపు నుండి దీనిని స్వీకరించు)

5. ఖుర్బానీ ఇచ్చే వారు స్తోమత ఉంటే స్వయంగా జంతువుని జుబహ్ చేయాలి. దాని విధానం – నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి;  రక్తం వేగంగా ప్రవహించే రెండు రక్త నరాలు కోయాలి, ఇంకా శ్వాస నాళం మరియు ఆహారనాళం కోయాలి.

6. ఎవరైనా తన ఖుర్బానీ జంతువును వధించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగిస్తే, దానిని వధించే వ్యక్తి అతని తరపున ఈ దువాను పఠించాలి: 

اللهم هذا منك ولك، اللهم هذا عن فلان ، اللهم تقبل منه
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్ ఫులాన్, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ హు
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్!  ఇది ఫలానా (పేరు పలకాలి) వ్యక్తి తరుపు నుండి దీనిని స్వీకరించు).

7. కత్తిని లేక చాకుని ఖుర్బానీ జంతువు నుండి దాచి ఉంచాలి. దాని ముందు పదును పెట్టరాదు, మరియు ఇతర జంతువుల ముందు దానిని జబహ్ చేయరాదు. ఇందులో మనం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సూక్తిని అనుసరించాలి: అల్లాహ్ తఆలా ప్రతి దానిపట్ల ఉన్నతంగా వ్యవహరించాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు దేనినైనా వధించ వలసి వచ్చినప్పుడు దానిని ఉన్నతంగా వధించండి మరియు తమ ఆయుధానికి బాగా పొద్దున పెట్టండి .ఎందుకంటే వధించబడే జంతువును బాధించరాదు. (ముస్లిం)

8. ఖుర్బానీ ఇచ్చేటువంటి సమయం నాలుగు రోజుల వరకు ఉంటుంది. పండుగ రోజు ఆ తర్వాత మూడు “తష్ రీఖ్” దినాలు. ఇందులో మొదటి రోజు ఖుర్బానీ ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే ఇది జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది రోజులలో ఉంది.

9. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు కొమ్ములు తిరిగిన తెల్లని రెండు పొట్టేళ్లను ఖుర్బానీగా ఇచ్చారు. మరియు ఎలాంటి జంతువుని ఖుర్బాని చేయకూడదో అది కూడా తెలియజేశారు. ఒంటి కన్ను కలిగిన దానిని ,రోగం ఉన్నట్లు స్పష్టంగా ఉన్న దానిని, కుంటిది, ఎముకల్లో సత్తువ లేని ముసలిది.(అహ్మద్)

10. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పండగ రోజున ఖుర్బానీ మాంసం తోనే భోజనాన్ని ప్రారంభించే వారు.

11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కాలంలో ప్రజలు ఖుర్బానీ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు, మరియు ఉన్నవాటిలో అన్నింటికంటే మంచి జీవాలను కొనుగోలు చేసేవారు, ఎందుకంటే ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉంటే అది అల్లాహ్ వద్ద అంతే ప్రియమైనదిగా పరిగణించబడుతుంది, మరియు దాని ద్వారా ఖుర్బానీ చేసే వ్యక్తికి కూడా అంతే ప్రతిఫలం లభిస్తుంది. ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు: “సాదారణంగా ఖుర్బానీ యొక్క పుణ్యఫలం దాని ఖరీదును బట్టి ఉంటుంది”. (అల్ ఫతావా)

12. అల్లాహ్ దాసులారా! ఖుర్బాని జీవం పై ఖర్చు పెట్టడంలో ఎలాంటి పరిమితి లేదు. దాని మాంసం తినవచ్చు, ప్రయాణంలో తీసుకు వెళ్లొచ్చు ,మరియు పేదలలో పంచి పెట్టవచ్చు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

 فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ
వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి” (సూరా అల్ హజ్ 22:36)

హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు:
(తినండి తినిపించండి మరియు దాచుకోండి) (ముస్లిం)

13. జంతువును జూబహ్ చేసిన తర్వాత, దానిలోని ఏ భాగాన్ని కానీ, మాంసాన్ని గానీ, చర్మాన్ని గానీ, మరేదైనా అమ్మడానికి అనుమతి లేదు.

14.  అవిశ్వాసుల హృదయాలు ఇస్లాం వైపు మొగ్గడానికి వారికి ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వచ్చు.

15. ఖుర్బానీ మాంసాన్ని కసాయి వానికి కూలీగా ఇవ్వరాదు. ఎందుకంటే ధర్మం దీనికి అంగీకరించలేదు. కనుక అతనికి కూలీగా డబ్బులు మాత్రమె ఇవ్వాలి.

16. ఓ అల్లాహ్ దాసులారా! ఈ గొప్ప పండుగ తర్వాత ఘనత కలిగినటువంటి దినాలు కూడా వస్తాయి. వాటిని “తష్రీఖ్” దినాలు అంటారు ఆ దినములలో అతి ఎక్కువగా” జిక్ర్ “స్మరణ చేయమని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు:

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ
(గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్‌ దినాలలో) అల్లాహ్‌ను స్మరించండి.) (సూరా అల్ బఖర 2:203)

ఈద్ రోజులలో చేయవలసిన ముఖ్యమైన ఆచరణ ఇక్కడ తెలపడం జరుగుతుంది: “తష్రీఖ్” యొక్క మూడు రోజులలో అన్ని సమయాలలో సంపూర్ణ తక్బీర్ పటించాలి. మరియు మూడవరోజు మగ్రిబ్ నమాజ్ వరకు తక్బీర్ చదువుతూ ఉండాలి. అలాగే  “తష్రీఖ్” యొక్క మూడవ రోజున అసర్ వరకు రోజువారీ ప్రార్థనలలో ఐదు పూటల ఈ విధంగా తక్బీర్ పటించాలి:

(అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లాల్లాహ్,  వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్)
ఇందులో అల్లాహు అక్బర్ రెండుసార్లు లేదా మూడుసార్లు పటించవచ్చు

17. తష్రీఖ్” దినాలు వాస్తవానికి తిని త్రాగే మరియు అల్లాహ్ స్మరించుకునే రోజులు. ఈ రోజులలో ఉపవాసం ఉండడం అనుమతించబడలేదు, ఎందుకంటే అవి పండుగ రోజులు.

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “తష్రీఖ్” దినాలు తిని త్రాగేటువంటి రోజులు”.
మరో హదీసులో ఉంది: “అల్లాహ్ ను స్మరించే రోజులు”.

18. ఈద్ గొప్ప ప్రయోజనాల్లో ఒకటి: ముస్లింల మధ్య సంబంధాన్ని నెలకొల్పడం, ఒకరినొకరు కలిసే సద్భావం కలిగి ఉండటం. హృదయాలలో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవడం, భయం మరియు పేదరికాన్ని తొలగించడం, మరియు ద్వేషం మరియు అసూయలను నివారించడం, మరియు హృదయాలలో రగులుతున్న అసూయ అనే అగ్నిని ఆర్పడం. ఈద్ ప్రార్థనను నిర్వహించడానికి ముస్లింలను ఒకే చోట సమీకరించగల ఇస్లాం యొక్క సామర్ధ్యం మనకు కనిపిస్తుంది. అంతేకాదు భక్తి ప్రాతిపదికన వారిని సత్యం పై స్థిరంగా వారి హృదయాలను మార్గనిర్దేశం చేస్తుందనడానికి సంకేతం.

నౌమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “విశ్వాసుల ఉదాహరణ కరుణపరంగా, ఐక్యత పరంగా, ప్రేమ పరంగా ఒక శరీరం లాంటిది. కనుక శరీరంలో ఏదైనా భాగంలో నొప్పి కలిగితే దాని ద్వారా జ్వరం వస్తుంది. అప్పుడు శరీరంలో ఉన్న అవయవాలన్ని ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి”. (ముస్లిం)

పండగ రోజున చేసేటువంటి మరొక అభిలషనీయమైన పని ఏమిటంటే; ఆ రోజున బంధుత్వాలను కలుపుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ తన దాసుడిపై దీనిని విధిగా చేశాడు. ముఖ్యంగా శుభ సందర్భాలలో కాబట్టి ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటారో అల్లాహ్ తఆల అతనికి దగ్గరవుతాడు, మరి ఎవరైతే బంధుత్వాన్ని తెంచుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ తన కారుణ్యం నుండి దూరం చేస్తాడు,

అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఎలా తెలియజేశారు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు: “నేను కరుణామయుడును నేనే బంధుత్వాన్ని పుట్టించాను. మరియు దాని పేరును నా పేరుతో జోడించాను. కాబట్టి ఎవరైతే నీతో సంబంధం పెట్టుకుంటాడో అతనితో నేను సంబంధం పెట్టుకుంటాను, మరియు ఎవరైతే త్రేగదెంపులు చేసుకుంటాడో అతనితో నేను త్రేగదెంపులు చేసుకుంటాను“. (ముస్లిం)

ఓ అల్లాహ్ దాసులారా! కనుక ఎవరైతే తమ బంధువులతో స్నేహితులతో పోట్లాట కారణంగా విడిపోయారో వారు మన్నింపుల వైఖరిని అవలంబించండి. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నాడు:

فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ
కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ( సూరా ఆష్ షూరా 42:40)

మరొకచోట ఇలా అంటున్నాడు:

إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ
విశ్వాసులు (ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. (సూరా అల్ హుజురాత్ 49:10)

19. ఓ అల్లాహ్ దాసులారా పండుగ శుభాకాంక్షలు తెలుపడం ఒక మంచి పని. ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియ చేస్తున్నారు:  పండుగ నమాజ్ తరువాత ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు (تقبل الله منا ومنكم، وأحاله الله عليك) తెలుపుకునే విధానం కొందరి సహాబాల ద్వారా మనకు తెలుస్తుంది. మరియు కొంత మంది ధర్మ పండితులు కూడా దీనిని సమ్మతించారు. (అల్ ఫతావా)

20. అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు వ్యతిరేకంగా చట్ట విరుద్ధమైన నిషేధించబడిన విషయాలకు పాల్పడితే దానికి బదులుగా అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుతుంది అని భయపడండి.

చివరిగా నేను, నా కోసం మరియు మీ కోసం పాప క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా అతను క్షమించేవాడు మరియు దయగలవాడు.

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ విశ్వాసి స్త్రీలారా! అల్లాహ్ విశ్వాస మాతృమూర్తులకు ఆజ్ఞాపిస్తూ ఖురాన్ ఈ విధంగా అంటున్నాడు:

وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّهَ وَرَسُولَهُ

మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి. జకాతు ఇస్తూ ఉండండి. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

అల్లాహ్‌ను తమ ప్రభువుగా, ఇస్లాంను తమ మతంగా మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రవక్తగా అంగీకరించే ఓ ఇస్లాం మహిళ లా, తీర్పు దినం వరకు వారి అడుగుజాడల్లో నడిచే విశ్వాసుల తల్లులకు మరియు విశ్వాసులైన మహిళలకు ఈ దైవిక ఉపదేశం సాధారణంగా అందరికీ వర్తిస్తుంది, కాబట్టి అల్లాహ్ కు మరియు ప్రవక్త విధేయతకు కట్టుబడి ఉండాలి.

మానవులు మరియు జిన్నాతులు యొక్క చెడు విధానాల పట్ల తస్మాత్ జాగ్రత్త వహించాలి. నగ్నత్వం మరియు అశ్లీల ఉపద్రవం యొక్క ప్రలోభాలలో పడకండి. అల్లాహ్ ఇలా అంటున్నాడు;

وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ 
పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

భద్రతను, క్షేమాన్ని కోరుకునే స్త్రీ తనను తాను అవిస్వాసుల కార్యకలాపాలలో అనుసరించకూడదు, ఎందుకంటే వారిని అనుసరించడం వలన ఇది హృదయం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు మనలో కూడా ఆ అవలక్షణాలు చోటు చేసుకుంటాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

وَاللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا

అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. (సూరా అన్ నిసా 4:27)

మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు! అల్లాహ్ మీ అందరినీ ఎల్ల వేళలా సుఖ సౌఖ్యాలతో ఉంచుగాక. అందరి పై తన శుభాల వర్షాన్ని కురిపించు గాక. అందరి ఆరాధనలు స్వీకరించుగాక. పాపాలను మన్నించుగాక. అల్లాహ్ అందరి ధర్మ సమ్మతమైన కోరికలు తీర్చుగాక. సదా చరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు గాక!

చివరగా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపుతూ ఉండండి, ఎవరైతే ఒకసారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలు కురిపిస్తాడు.

اللهم صلِّ وسلِّم وبارك على عبدك ورسولك نبينا محمد، وعلى آله وصحبه أجمعين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ఖుర్బానీ ప్రాముఖ్యత మరియు ఆదేశాలు – సలీం జామి’ఈ [వీడియో]

ఖుర్బానీ ప్రాముఖ్యత మరియు ఆదేశాలు
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/p2ePhcq0_1s [45 నిముషాలు]

ఖుర్బానీ ఆదేశాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3FDVDGQYnF0UMyD7YjGNZm

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


ఖుర్బానీ చేసేవారు ఎలా ఉండాలి? [వీడియో]

బిస్మిల్లాహ్
ఖుర్బానీ చేసేవారు ఎలా ఉండాలి? – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[36 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఖుర్బానీ ఆదేశాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3FDVDGQYnF0UMyD7YjGNZm

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf


ఖుర్బాని ఆదేశాలు – Rulings of Animal Sacrifice on Eid al-Adha, Bakrid [ఆడియో]

బిస్మిల్లాహ్
ఖుర్బాని ఆదేశాలు – Rulings of Animal Sacrifice on Eid al-Adha, Bakrid
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఖుర్బానీ ఆదేశాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3FDVDGQYnF0UMyD7YjGNZm

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


ధర్మపరమైన నిషేధాలు – 23 : అల్లాహ్ యేతరుల కొరకు జంతు బలి చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[11:37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు – 23

23అల్లాహ్ యేతరుల కొరకు జంతు బలి చేయకు. అది వారి సన్నిధానం పొందుటకుగాని, లేదా వారితో భయం చెంది, లేదా వారేమైనా ఇస్తారని ఆశించి. ఉదాహరణకుః జిన్నాతుల నుండి ఏ హానీ కలగకూడదని లేదా మృతుల నుండి ఏదైనా లాభం కలగాలని వారి కొరకు బలి ఇచ్చుట([1]).

[قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي للهِ رَبِّ العَالَمِينَ ، لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ المُسْلِمِينَ] {الأنعام:163}

ఇలా అను: నా నమాజ్, నా బలి (ఖుర్బానీ), నా జీవనం, నా మరణం, సమస్తమూ సకలలోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది[. (అన్ఆమ్ 6: 163,164).


([1])         అల్లాహ్ యేతరుల కొరకు చేసే జంతు బలి రెండు రకాలుగా ఉంటుందిః

1-  సన్నిధానం పొందుటకు, గౌరవభావంతో, ఆరాధన ఉద్దేశంతో చేయుట. అందులో అతని నుండి ఎదైనా మేలు ఆశిస్తూ, లేదా అతని నుండి కీడు కలగవద్దన్న భయంతో చేయుట. ఇది పెద్ద షిర్క్. ఇస్లాం నుండి బహిష్కరణకు కారణం. తౌహీద్ కు వ్యతిరేకం. ఉదాహ- రణకుః ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత జంతు బలి ఇచ్చి, దానిని ఇంట్లో ఉంచుట, జిన్, షైతానుల కీడు నుండి రక్షణ ఉద్దేశంతో దాని రక్తాన్ని గోడలకు పూయుట.

2- ఎవరైనా అతిథి, బందువు వచ్చినప్పుడు అల్లాహ్ ప్రసన్నత ఉద్దేశంతో జంతువును కోయుట ఇది ధర్మసమ్మతం.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

అన్నపానీయాల ఆదేశాలు – 2 : జిబహ్ & వేట [వీడియో]

బిస్మిల్లాహ్

[17:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జిబహ్ చేసే పద్ధతి, దాని ఆదేశాలు

భూనివాస జంతువులు ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయ(కోయ)బడినప్పుడే అవి తినుటకు ధర్మసమ్మతం.

జిబహ్ అంటే:   గొంతు, ఆహారనాళం మరి కంఠనాళాలను కోయుట. గత్యంతరం లేని పరిస్థితిలో ఎక్కడి నుండైనా రక్తం ప్రవహించాలి.

ఎందుకనగా ఏ జంతువును, పక్షులను వశపరుచుకొని జిబహ్ చేయగలమో వాటిని ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయకుంటే వాటిని తినుట ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా జిబహ్ చేయబడనివి మృతుల్లో లెక్కించబడుతాయి.

జిబహ్ నిబంధనలు

1-జిబహ్ చేయు వ్యక్తి: బుద్ధిమంతుడు, ఆకాశ ధర్మాన్ని అవలంభించినవాడయి ఉండాలి. అంటే ముస్లిం లేదా యూదుడు మరియు క్రైస్తవుడు. కాని పిచ్చివాడు, త్రాగుబోతు మరియు జిబహ్ పద్ధతులు తెలియని బాలుడు జిబహ్ చేస్తే తినడం యోగ్యం కాదు. ఎందుకనగా వీరిలో బుద్ధీజ్ఞానాల కొరత వల్ల జిబహ్ ఉద్దేశ్యం పూర్తి కాదు. అలాగే అవిశ్వాసి, బహుదైవారాధకుడు, మజూసి (అగ్ని పూజారి), సమాధుల పూజారులు జిబహ్ చేసినది ధర్మసమ్మతం కాదు.

2-జిబహ్ చేసే ఆయుధం: రక్తాన్ని ప్రవహింపజేసే పదునైన మొనగల ఏ వస్తువుతో జిబహ్ చేసినా అది యోగ్యమే. అది ఇనుపదైనా, రాయి అయినా లేదా మరేదైనా సరే. అయితే అది దంతం, ఎముక, గోరు అయి ఉండకూడదు. వాటితో జిబహ్ చేసినవి యోగ్యం కావు.

3- గొంతు (శ్వాస పీల్చు మార్గం), ఆహారనాళం మరియు కంఠనాళాలను కోయాలి.

జిబహ్ కొరకు కచ్చితంగా ఈ అవయవాలను ప్రత్యేకించడంలోని మర్మం ఏమిటంటేః వివిధ నరాలు అక్కడే ఉంటాయి గనుక రక్త ప్రవాహం మంచి విధంగా జరుగుతుంది. తొందరగా ప్రాణం పోతుంది. జంతువుకు ఎక్కువ అవస్థ ఏర్పడదు. దాని మాంసం కూడా రుచిగా ఉంటుంది.

వేటాడినప్పుడు లేదా వేరే ఏదైనా సందర్భంలో పై తెలిపిన ప్రకారం జిబహ్ చేయడం అసాధ్యమైనప్పుడు బిస్మిల్లాహ్ అని పదునైన ఆయుధం దాని వైపు విసిరినప్పుడు అది దాని శరీరంలో తాకి వెంటనే చనిపోయినా, లేదా ప్రాణంగా ఉన్నప్పుడు దానిని వశపరుచుకొని జిబహ్ చేసినా అది ధర్మసమ్మతం అవుతుంది.

తినుటకు యోగ్యమైన జంతువులు ఊపిరాడక, గట్టి దెబ్బ తాకి, ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయి, పరస్పర కొమ్ములాట వల్ల లేదా ఏదైనా క్రూరమృగం దాడితో మరణిస్తే అవి నిషిద్ధం. అయితే అవి మరణించే ముందు కొంత ప్రాణం ఉన్నప్పుడు వశపరుచుకొని జిబహ్ చేయగలిగితే అవి ధర్మసమ్మతం అవుతాయి.

4- జిబహ్ చేయు వ్యక్తి జిబహ్ చేసేటప్పుడు బిస్మిల్లాహ్ అనాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనడం సున్నత్.

జిబహ్ కు సంబంధించిన ధర్మాలు

1- జంతువును పదును లేని ఆయుధంతో జిబహ్ చేయడం “మక్రూహ్”.

2- ఏ జంతువును జిబహ్ చేయనున్నామో దాని ముందు అది చూస్తుండగా కత్తికి పదును పెట్టడం “మక్రూహ్”.

3- జంతువును ఖిబ్లాకు వ్యెతిరేక దిశలో పెట్టి జిబహ్ చేయడం “మక్రూహ్”.

4- పూర్తిగా ప్రాణం పోక ముందే దాని మెడ విరుచుటగాని లేదా చర్మం తీయుటగాని “మక్రూహ్”.

మేక, ఆవులు ఎడమ వైపు పరుండబెట్టి జిబహ్ చేయడం సున్నత్. ఒంటెను నిలబెట్టి దాని ఎడమ చెయిని (ముందు కాళును) కట్టేసి జిబహ్ చేయుట సున్నత్. వల్లాహు అఅలమ్. 

వేట

అవసర నిమిత్తం వేటాడుట తప్ప కాలక్షేపం కోసం, మనోరంజన కోసం వేటాడుట యోగ్యం కాదు.

వేటాడుతూ వేటాడబడిన జంతువును పట్టుకున్నాక రెండు స్థితులుః

1- దానిని పట్టుకున్నప్పుడు దానిలో ప్రాణం ఉంటే తప్పక దానిని జిబహ్ చేయాలి.

2- పట్టుకున్నప్పడు అది చనిపోయి ఉండవచ్చు. లేదా ప్రాణం ఉండి కూడా లేనట్లుగానే ఏర్పడితే అది ధర్మసమ్మతమే.

జిబహ్ నిబంధనల మాదిరిగానే వేట నిబంధనలు ఉన్నాయిః

1- బుద్ధిజ్ఞానం గల ముస్లిం లేదా యూదుడు, క్రైస్తవుడై ఉండాలి. పిచ్చివాడు, త్రాగుబోతు, మజూసి, బహుదైవారాధకులు జిబహ్ చేసిన దానిని తినుట ముస్లింకు యోగ్యం కాదు.

2- వేటాయుధం పదునుగా ఉండాలి. రక్తం ప్రవహించాలి. గోరు, ఎముక, దంతాలు ఉపయోగించరాదు. పదునైన మొనగల వైపు నుండి జంతువు గాయమైతే అది ధర్మ సమ్మతం. దాని మొన వెనక భాగం నుండి దెబ్బ తగిలి చనిపోతే యోగ్యం కాదు. శిక్షణ ఇవ్వబడిన వేట కుక్క మరియు పక్షులు చంపిన జంతువులు కూడా యోగ్యమే. అయితే అవి వేట శిక్షణ ఇవ్వబడినవి అయి ఉండుట తప్పనిసరి.

వేట శిక్షణ అంటే దానిని వదిలినప్పుడు లేదా ‘పో’ అన్నప్పుడు పోవాలి. అది ఏదైనా జంతువును వేటాడిన తర్వాత తన యజమాని వచ్చే వరకు అతని కొరకు పట్టి ఉంచాలి. అది స్వయంగా తినకూడదు.

3-  ఆయుధాన్ని వేట ఉద్దేశ్యంతో విడవాలి. ఆయుధం చేతి నుండి జారిపడి ఏవైనా పశుపక్షాదులు చనిపోతే అవి ధర్మసమ్మతం కావు. అలాగే వేట కుక్క దానంతట అదే వెళ్ళి వేటాడి తీసుకువస్తే అదీ ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా వేటాడే మనిషి తనుద్దేశ్యంతో దానిని పంపలేదు గనక. ఎవరైనా ఒక జంతువు లేదా పక్షికి గురి పెట్టి బాణం వదిలాడు కాని అది మరో దానికి తగిలితే, లేదా గుంపులో ఉన్న వాటికి తగిలి కొన్ని చనిపోతే అవన్నియూ ధర్మసమ్మతమే.

4- వేట పశువు లేదా వేట పక్షి లేదా బాణం ఏదీ విడిసినా అల్లాహ్ పేరుతో విడవాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనుట సున్నత్.

గమనికః కుక్కను పెంచటం నిషిద్ధం. కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించిన ఉద్దేశ్యాలకు తప్ప. ఆయన సల్లల్లహు అలైహి వసల్లం తెలిపిన ప్రకారం ఈ మూడిట్లో ఏదైనా ఒకటై ఉండాలిః వేట కొరకు, లేదా పశుసంపద భద్రత కోసం, లేదా వ్యవసాయోత్పత్తుల, పైరుపంటల పరిరక్షణ కోసం.


ముందు పాఠాలు:

అన్నపానీయాల ఆదేశాలు -1 [వీడియో]

అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం) చేయుట షిర్క్ అక్బర్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట

10వ అధ్యాయం
అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం)
[Slaughtering for other than Allah]

అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

ఇలా అను: “నా నమాజ్, నా ఖుర్బాని (జంతుబలి), నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు.” (అన్ ఆమ్ 6: 162,163).

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ

“నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు.” (కౌసర్ 108: 2).

అలీ (రజియల్లాహు అన్హు)  కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు నాలుగు మాటలు నేర్పారు:

  • (1) అల్లాహ్ తప్ప ఇతరులకు జిబహ్ చేసిన వానిని అల్లాహ్ శపించాడు.
  • (2) తన తల్లిదండ్రుల్ని శపించిన, దూషించిన వానిని అల్లాహ్ శపించాడు.
  • (3) “ముహాదిన్ ” (బిద్ అతి, దురాచారం చేయు వాని)ని అల్లాహ్ శపించాడు.
  • (4) భూమిలో తమ స్థలాల (ఆస్తుల) గుర్తుల్ని మార్చిన వానిని అల్లాహ్ శపించాడు.

(ముస్లిం).

తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఈగ కారణంగా ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. మరొక వ్యక్తి నరకంలో చేరాడు“.

అది ఎలా? అని సహచరులు అడుగగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:

ఇద్దరు మనుషులు ఒక గ్రామం నుండి వెళ్తుండగా, అక్కడ ఆ గ్రామవాసుల ఒక విగ్రహం ఉండింది. అక్కడి నుండి దాటిన ప్రతి ఒక్కడు ఆ విగ్రహానికి ఏ కొంచమైనా బలి ఇవ్వనిదే దాటలేడు. (ఆ విగ్రహారాధకులు) ఒకనితో అన్నారు: ఏదైనా బలి ఇవ్వు. “నా వద్ద ఏమి లేదు” అని అతడన్నాడు. “దాటలేవు. కనీసం ఒక ఈగనైనా బలి ఇవ్వు”. అతడు ఒక ఈగను ఆ విగ్రహం పేరు మీద బలిచ్చాడు. వారు అతన్ని దాటనిచ్చారు. కాని అతడు నరకంలో చేరాడు. “నీవు కూడా ఏదైనా బలి ఇవ్వు” అని మరో వ్వక్తితో అన్నారు. “నేను అల్లాహ్ తప్ప ఇతరులకు ఏ కొంచెమూ బలి ఇవ్వను” అని అతడన్నాడు. వారు అతన్ని నరికేశారు. అతడు స్వర్గంలో ప్రవేశించాడు.” (అహ్మద్).

ముఖ్యాంశాలు:

  1. మొదటి ఆయతు యొక్క వ్యాఖ్యానం.
  2. రెండవ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
  3. శాపం ఆరంభం అల్లాయేతరులకు జిబహ్ చేసినవారితో అయింది.
  4. తల్లిదండ్రుల్ని దూషించిన, శపించినవానినీ శపించడమైనది. నీవు, ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని దూషించావంటే అది నీవు స్వయంగా నీ తల్లిదండ్రుల్ని దూషించినట్లే.
  5. “ముహాదిన్”ని శపించడమైనది. ఏ పాపంపై శిక్ష ఇహంలోనే అల్లాహ్ విధించాడో, ఒక వ్యక్తి ఆ పాపం చేసి ఆ శిక్ష నుండి తప్పించుకోడానికి ఇతరుల శరణు కోరుతాడు. అతన్ని కూడా “ముహాదిన్ ” అనబడుతుంది.
  6. భూమి గుర్తులను మార్చిన వానిని కూడా శపించబడినది. నీ భూమి, నీ పక్కవాని భూమి మధ్యలో ఉండే గుర్తుల్ని వెనుక, ముందు చేసి మార్చేయడం అని భావం.
  7. ఒక వ్యక్తిని ప్రత్యేకించి శపించడంలో, పాపాన్ని ప్రస్తావించి అది చేసిన వారిని శపించడంలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి.
  8. ఈగ కారణంగా ఒకతను నరకంలో మరొకతను స్వర్గంలో చేరిన హదీసు చాలా ముఖ్యమైనది.
  9. అతడు తన ప్రాణం కాపాడుకునే ఉద్దేశంతో ఒక ఈగను బలి ఇచ్చాడు. కాని నరకంలో చేరాడు.
  10. విశ్వాసుల వద్ద షిర్క్ ఎంత ఘోర పాపమో గమనించవచ్చు. తన ప్రాణాన్ని కోల్పోవడం సహించాడు. కాని షిర్క్ చేయడానికి ఒప్పుకోలేదు.
  11. నరకంలో చేరినవాడు విశ్వాసుడే. అతను మొదటి నుండే అవిశ్వాసి అయితే ఈగ కారణంగా నరకంలో చేరాడు అని అనబడదు.
  12. ఈ హదీసు మరో హదీసును బలపరుస్తుంది. అది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ప్రవచనం: “స్వర్గం మీ చెప్పు యొక్క పట్టీ  (గూడ) కంటే చేరువుగా ఉంది, నరకం కూడా అలాగే“. (బుఖారి).
  13. ముస్లింలు, ముస్లిమేతరులు అందరి వద్ద మనఃపూర్వకంగా ఉన్న ఆచరణ చాలా ప్రాముఖ్యత గలది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

జిబహ్ కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. పూర్తి చిత్తశుద్ధితో చేయాలి. నమాజు గురించి చెప్పబడినట్లే దీని గురించి ఖుర్ఆన్ లో స్పష్టంగా చెప్పబడింది. ఎన్నో చోట్ల దాని ప్రస్తావన నమాజుతో కలసి వచ్చింది. ఇక ఇది అల్లాహ్ యేతరుల కొరకు చేయుట షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్).

షిర్క్ అక్బర్ దేనినంటారో గుర్తుంచుకోండి: “ఆరాధనలోని ఏ ఒక భాగాన్ని అయినా అల్లాయేతరుల కొరకు చేయుట“. అయితే ఏ విశ్వాసం, మాట, కార్యాలు చేయాలని ఇస్లాం ధర్మం చెప్పిందో అది అల్లాహ్ కు చేస్తే అది తౌహీద్, ఇబాదత్, ఇఖ్లాసు. ఇతరల కొరకు చేస్తే షిర్క్, కుఫ్ర్ . ఈ షిర్క్ అక్బర్ యొక్క నియమాన్ని మీ మదిలో నాటుకొండి.

అదే విధంగా షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్) అంటేమిటో తెలుసుకోండి. “షిర్క్ అక్బర్ వరకు చేర్పించే ప్రతీ సంకల్పం, మాట, పని. అది స్వయం ఇబాదత్ కాకూడదు“. షిర్క్ అక్బర్, షిర్క్ అస్గర్ యొక్క ఈ రెండు నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే, దీనికి ముందు, తరువాత అధ్యాయాలన్నింటిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా సందేహమనిపించే విషయాల్లో ఇది మీకు స్పష్టమైన గీటురాయిగా ఉంటుంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)