అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం) చేయుట షిర్క్ అక్బర్ – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

10వ అధ్యాయం
అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం)
[Slaughtering for other than Allah]

అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

ఇలా అను: “నా నమాజ్, నా ఖుర్బాని (జంతుబలి), నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు.” (అన్ ఆమ్ 6: 162,163).

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ

“నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు.” (కౌసర్ 108: 2).

అలీ (రజియల్లాహు అన్హు)  కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు నాలుగు మాటలు నేర్పారు:

  • (1) అల్లాహ్ తప్ప ఇతరులకు జిబహ్ చేసిన వానిని అల్లాహ్ శపించాడు.
  • (2) తన తల్లిదండ్రుల్ని శపించిన, దూషించిన వానిని అల్లాహ్ శపించాడు.
  • (3) “ముహాదిన్ ” (బిద్ అతి, దురాచారం చేయు వాని)ని అల్లాహ్ శపించాడు.
  • (4) భూమిలో తమ స్థలాల (ఆస్తుల) గుర్తుల్ని మార్చిన వానిని అల్లాహ్ శపించాడు.

(ముస్లిం).

తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఈగ కారణంగా ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. మరొక వ్యక్తి నరకంలో చేరాడు“.

అది ఎలా? అని సహచరులు అడుగగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:

ఇద్దరు మనుషులు ఒక గ్రామం నుండి వెళ్తుండగా, అక్కడ ఆ గ్రామవాసుల ఒక విగ్రహం ఉండింది. అక్కడి నుండి దాటిన ప్రతి ఒక్కడు ఆ విగ్రహానికి ఏ కొంచమైనా బలి ఇవ్వనిదే దాటలేడు. (ఆ విగ్రహారాధకులు) ఒకనితో అన్నారు: ఏదైనా బలి ఇవ్వు. “నా వద్ద ఏమి లేదు” అని అతడన్నాడు. “దాటలేవు. కనీసం ఒక ఈగనైనా బలి ఇవ్వు”. అతడు ఒక ఈగను ఆ విగ్రహం పేరు మీద బలిచ్చాడు. వారు అతన్ని దాటనిచ్చారు. కాని అతడు నరకంలో చేరాడు. “నీవు కూడా ఏదైనా బలి ఇవ్వు” అని మరో వ్వక్తితో అన్నారు. “నేను అల్లాహ్ తప్ప ఇతరులకు ఏ కొంచెమూ బలి ఇవ్వను” అని అతడన్నాడు. వారు అతన్ని నరికేశారు. అతడు స్వర్గంలో ప్రవేశించాడు.”

(అహ్మద్).

ముఖ్యాంశాలు:

  1. మొదటి ఆయతు యొక్క వ్యాఖ్యానం.
  2. రెండవ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
  3. శాపం ఆరంభం అల్లాయేతరులకు జిబహ్ చేసినవారితో అయింది.
  4. తల్లిదండ్రుల్ని దూషించిన, శపించినవానినీ శపించడమైనది. నీవు, ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని దూషించావంటే అది నీవు స్వయంగా నీ తల్లిదండ్రుల్ని దూషించినట్లే.
  5. “ముహాదిన్”ని శపించడమైనది. ఏ పాపంపై శిక్ష ఇహంలోనే అల్లాహ్ విధించాడో, ఒక వ్యక్తి ఆ పాపం చేసి ఆ శిక్ష నుండి తప్పించుకోడానికి ఇతరుల శరణు కోరుతాడు. అతన్ని కూడా “ముహాదిన్ ” అనబడుతుంది.
  6. భూమి గుర్తులను మార్చిన వానిని కూడా శపించబడినది. నీ భూమి, నీ పక్కవాని భూమి మధ్యలో ఉండే గుర్తుల్ని వెనుక, ముందు చేసి మార్చేయడం అని భావం.
  7. ఒక వ్యక్తిని ప్రత్యేకించి శపించడంలో, పాపాన్ని ప్రస్తావించి అది చేసిన వారిని శపించడంలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి.
  8. ఈగ కారణంగా ఒకతను నరకంలో మరొకతను స్వర్గంలో చేరిన హదీసు చాలా ముఖ్యమైనది.
  9. అతడు తన ప్రాణం కాపాడుకునే ఉద్దేశంతో ఒక ఈగను బలి ఇచ్చాడు. కాని నరకంలో చేరాడు.
  10. విశ్వాసుల వద్ద షిర్క్ ఎంత ఘోర పాపమో గమనించవచ్చు. తన ప్రాణాన్ని కోల్పోవడం సహించాడు. కాని షిర్క్ చేయడానికి ఒప్పుకోలేదు.
  11. నరకంలో చేరినవాడు విశ్వాసుడే. అతను మొదటి నుండే అవిశ్వాసి అయితే ఈగ కారణంగా నరకంలో చేరాడు అని అనబడదు.
  12. ఈ హదీసు మరో హదీసును బలపరుస్తుంది. అది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ప్రవచనం: “స్వర్గం మీ చెప్పు యొక్క పట్టీ  (గూడ) కంటే చేరువుగా ఉంది, నరకం కూడా అలాగే“. (బుఖారి).
  13. ముస్లింలు, ముస్లిమేతరులు అందరి వద్ద మనఃపూర్వకంగా ఉన్న ఆచరణ చాలా ప్రాముఖ్యత గలది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

జిబహ్ కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. పూర్తి చిత్తశుద్ధితో చేయాలి. నమాజు గురించి చెప్పబడినట్లే దీని గురించి ఖుర్ఆన్ లో స్పష్టంగా చెప్పబడింది. ఎన్నో చోట్ల దాని ప్రస్తావన నమాజుతో కలసి వచ్చింది. ఇక ఇది అల్లాహ్ యేతరుల కొరకు చేయుట షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్).

షిర్క్ అక్బర్ దేనినంటారో గుర్తుంచుకోండి: “ఆరాధనలోని ఏ ఒక భాగాన్ని అయినా అల్లాయేతరుల కొరకు చేయుట“. అయితే ఏ విశ్వాసం, మాట, కార్యాలు చేయాలని ఇస్లాం ధర్మం చెప్పిందో అది అల్లాహ్ కు చేస్తే అది తౌహీద్, ఇబాదత్, ఇఖ్లాసు. ఇతరల కొరకు చేస్తే షిర్క్, కుఫ్ర్ . ఈ షిర్క్ అక్బర్ యొక్క నియమాన్ని మీ మదిలో నాటుకొండి.

అదే విధంగా షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్) అంటేమిటో తెలుసుకోండి. “షిర్క్ అక్బర్ వరకు చేర్పించే ప్రతీ సంకల్పం, మాట, పని. అది స్వయం ఇబాదత్ కాకూడదు“. షిర్క్ అక్బర్, షిర్క్ అస్గర్ యొక్క ఈ రెండు నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే, దీనికి ముందు, తరువాత అధ్యాయాలన్నింటిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా సందేహమనిపించే విషయాల్లో ఇది మీకు స్పష్టమైన గీటురాయిగా ఉంటుంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

%d bloggers like this: