بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
అనంత కరుణాప్రదాత మరియు అపార కృపాశీడైన అల్లాహ్ పేరుతో
అల్ హమ్ దు లిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్ లా నబియ్య బఅదహ్, వఅలా ఆలిహీ వసహబిహి, అమ్మా బాద్
(సకల స్తోత్రములు, కృతజ్ఞతలు ఏకైకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి, ఎవరి తరువాత అయితే మరే ప్రవక్తా రాడో, ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై అల్లాహ్ అనేక దీవెనలు కురిపించుగాక, ఇక ఆ తరువాత):
జకాతు (విధి దానము) చెల్లించుట గురించి ప్రోత్సహించడం మరియు జ్ఞాపకం చేయడమే ఈ సందేశం వ్రాయడానికి అసలు ప్రేరణ. ఎందుకంటే చాలా మంది ముస్లింలు దానిని నిర్లక్ష్యం చేసి, దానిని సరైన విధంగా చెల్లించుట లేదు. దాని ఘనత మరియు అది ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలో ఒకటిగా ఉండటం మొదలైన కారణాల వలన, దాని మీద ఇస్లాం ధర్మం నిలబడి ఉన్నది;
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
(بُنِيَ الإِسْلَامُ عَلَى خَمْسٍ : شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ وَصَوْمِ رَمَضَانَ وَحَجَ البَيْتِ))
“ఇస్లాం ఐదు విషయములపై నిర్మితమై ఉన్నది: అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమిచ్చుట, నమాజు స్థాపించుట, జకాత్ ఇచ్చుట, రమదాన్ ఉపవాసములు పాటించుట, అల్లాహ్ గృహము యొక్క హజ్ చేయుట.” ఈ హదీథు యొక్క ప్రామాణికత ఆమోదించబడింది.
ముస్లిములపై జకాతు విధి దానము విధించబడటం అనేది ఇస్లాం యొక్క అద్భుతమైన సుగుణాలలో ఒకటి, మరియు తన అనుచరుల అవసరాలను చూసుకోవటంలో ఇస్లాం ధర్మం యొక్క శ్రద్ధను ప్రతిబింబిస్తుంది; ఎందుకంటే జకాతు విధి దానము యొక్క ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మరియు ముస్లిం పేదలకు దాని అవసరం ఎంతో ఉన్నది.
[1] జకాతు ప్రయోజనాలలో ఒకటి: ధనవంతుల మరియు పేదల మధ్య ప్రేమానుబంధాలను స్థిరపరుచడం: ఎందుకంటే మనకు ఉపకారం చేసిన వారిని ప్రేమించటానికి, అభిమానించటానికి ప్రకృతి సహజంగా మన మనస్సులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి
[2] జకాతు ప్రయోజనాలలో మరొకటి: మనస్సును శుద్ధి చేయుట మరియు మనస్సును పిసినారితనం, ఇంకా అలాంటి ఇతర దుష్ట గుణాలకు దూరంగా ఉంచడం, దీని గురించి పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా పేర్కొనబడింది:
خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا …. [التوبة]
” (కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం తీసుకొని, దానితో వారిని పాపవిమోచనం చేయి మరియు వారిని …” [9:103]
[3] జకాతు ప్రయోజనాలలో మరొకటి: ముస్లింలో దాతృత్వం, ఉదారత, మరియు అక్కరగల వారిపై దయ చూపే స్వభావాన్ని పెంపొందించడం.
[4] జకాతు ప్రయోజనాలలో మరొకటి: అల్లాహ్ నుండి శుభాలు, సంపదలో వృద్ధి మరియు ప్రతిఫలం పొందడం. అల్లాహ్ ప్రకటన:
… وَمَا أَنفَقْتُم مِّن شَيْءٍ فَهُوَ يُخْلِفُةٌ، وَهُوَ خَيْرُ الرَّازِقِينَ ) [سبا]
“మరియు మీరు (ఆయన మార్గంలో) ఖర్చు పెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు. మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి .” [34:39]
ప్రామాణిక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అల్లాహ్ ఇలా అంటున్నాడు:
((يَا ابْنَ آدَمَ أَنفِقْ نُنفِقَ عَلَيْكَ…))
“ఓ ఆదమ్ కుమారుడా! ఖర్చు చేయి (దానం చేయి), మేము నీపై ఖర్చు చేస్తాము.”
ఇవే కాకుండా, లెక్కించలేనన్ని మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
మరియు జకాతు చెల్లించుటలో పిసినారితనం చూపే లేదా దానిని ఇవ్వటంలో నిర్లక్ష్యం వహించే వారి పట్ల కఠినమైన హెచ్చరిక కూడా ఉన్నది. అల్లాహ్ ప్రకటన:
… وَالَّذِينَ يَكْذِرُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ يَوْمَ يُحْمَى عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكْوَى بِهَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ هَذَا مَا كَنَرْتُمْ لِأَنفُسِكُمْ فَذُوقُوا مَا كُنتُمْ تَكْنِزُونَ ) [التوبة]
“మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో, వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు. ఆ దినమున దానిని (జకాతు చెల్లించని ధనాన్ని/వెండి, బంగారాలను) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదుటి మీద, ఇరు ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): “ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున ఇప్పుడు మీరు కూడబెట్టుకున్న దానిని చవి చూడండి” ” [9:34-35]
జకాతు విధి దానము చెల్లించబడని ప్రతిదీ ఒక నిధిగా పరిగణించబడుతుంది, దాని యజమాని ప్రళయదినాన దానితో శిక్షించబడతాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి తెలిపిన సహీహ్ హదీథు:
((مَا مِنْ صَاحِبِ ذَهَبٍ وَلَا فِضَّةٍ لَا يُؤَدِّى حَقَّهَا إِلَّا إِذَا كَانَ يَوْمُ القِيَامَةِ صُفِحَتْ لَهُ صَفَابِحُ مِنْ نَارٍ فَأُحْمِيَ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَيُكْوَى بِهَا جَنْبُهُ وَجَبِينُهُ وَظَهْرُهُ كُلَّمَا بَرَدَتْ أُعِيدَتْ لَهُ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ حَتَّى يُقْضَى بَيْنَ العِبَادِ فَيَرَى سَبِيلَهُ : إِمَّا إِلَى الْجَنَّةِ وَإِمَّا إِلَى النَّارِ))
“బంగారం మరియు వెండి యజమానులు ఎవరైతే దాని హక్కు ‘జకాతు’ చెల్లించరో, తీర్పు దినమున అవి అగ్ని పలకలుగా మార్చబడి, నరకాగ్నిలో బాగా వేడి చేయబడి, వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది. ఆనాటి ఒక్కో దినము యాభై వేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది, అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చెప్పే వరకు (ఇలా జరుగుతూ ఉంటుంది). ఆ తరువాత అతను తన మార్గం స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో చూసుకుంటాడు.”
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెలు, ఆవులు మరియు మేకలు / గొర్రెలు కలిగి ఉన్న ఆసామి ఎవరైనా వాటిపై జకాతు విధి దానాన్ని చెల్లించకపోతే, పునరుత్థాన దినమున వాటి ద్వారా అతడు శిక్షించబడతాడని తెలియజేసినారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
((مَنْ آتَاهُ اللَّهُ مَالًا فَلَمْ يُؤَدِّ زَكَاتَهُ مُثَلَ لَهُ شَجَاعًا أَقْرَعَ لَهُ زَبِيبَتَانِ يُطَوِّقُهُ يَوْمَ القِيَامَةِ ثُمَّ يَأْخُذُ بِلَهْزِمَتَيْهِ يَعْنِي شِدْقَيْهِ ثُمَّ يَقُولُ : أَنَا مَالُكَ أَنَا كَنْزُكَ))
“అల్లాహ్ ఎవరికైతే సంపద ప్రసాదించాడో మరియు దానిపై వారు జకాతు చెల్లించలేదో, తీర్పు దినమున అది రెండు బొడిపెలు కలిగిన బట్టతల పాము రూపంలో వారి మెడ చుట్టు చుట్టబడు తుంది, ఆ తరువాత అది వారి బుగ్గలపై కాటువేస్తుంది, మరియు ఇలా చెబుతుంది: ‘నేనే నీ సంపదను, నేనే నీ నిధిని”
ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ అల్లాహ్ వాక్కు పఠించారు:
وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ هُوَ خَيْرًا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَوْمَ الْقِيَامَةِ ۗ
“అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకదే (లోభమే) మేలైనదని భావించరాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడల చుట్టూ చుట్టబడుతుంది.” [3:180]
జకాతు విధి దానము నాలుగు రకాలుగా విభజించబడింది: (1) భూమి నుండి ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలు మరియు పండ్లుఫలాలు, (2) పశుసంపద, (3) బంగారం మరియు వెండి, మరియు (4) వ్యాపార లావాదేవీలు.
ఈ నాలుగు వర్గాలలో ప్రతి దానికీ ఒక నిర్దిష్ట నిసాబ్ (పరిమాణం) ఉంది. దాని కంటే తక్కువగా ఉన్నప్పుడు జకాతు దానం విధి కాదు.
ధాన్యాలు మరియు పండ్ల నిసాబ్: ఐదు వసఖ్ లు, ఒక వసఖ్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాతో అరవై సాలు (ఒక సా అంటే ఒక మనిషి నాలుగు దోసెళ్ళు నిండినంత). ఖర్జూరం, ద్రాక్ష, గోధుమలు, బియ్యం, యవము మరియు అలాంటి వాటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాతో మూడు వందల సాలు.
అందులో ఉష్ర్ (పది శాతం) విధిగావించబడింది, సాగు నీటి కొరకు ఖర్చు పెట్టే అవసరం లేకుండా (స్వాభావికంగా) వర్షం, నదులు, ప్రవహించే ఊటలు మొదలైనవాటి ద్వారా సాగు చేయబడిన ఖర్జూరం మరియు ఇతర పంటలపై ఇస్లామీయ నియమం ప్రకారం ‘ఉష్ర్ ‘ (పది శాతం) జకాతు దానము విధిగావించబడింది. ఒకవేళ నీటిని సవానీలు, నీటిని పైకి లేపే యంత్రాలు మరియు ఇలాంటి ఇతర ఖర్చుతో కూడిన పద్ధతుల ద్వారా పండిస్తే, దానిపై వాజిబ్ అయిన జకాతు పది శాతంలో సగం అంటే ఐదు శాతం మాత్రమే. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథుల ద్వారా స్పష్టం అవుతుంది.
సాయిమా (మేతమేసే) జంతువులైన ఒంటెలు, ఆవులు, గొర్రెల జకాతు పరిమాణం గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన సహీహ్ హదీథుల్లో స్పష్టమైన వివరణ ఉంది. దీని గురించి మరింతగా తెలుసు కోవాలనుకునే వారు పండితులను అడిగి తెలుసుకోవచ్చు. సంక్షిప్తత కోసం మేము దీన్ని ఇక్కడ పూర్తిగా ప్రస్తావించడం లేదు.
వెండి యొక్క నిసాబ్ వందకు నలభై మిస్ట్రాల్ (ఇది ఒక ఇస్లామీయ పరిమాణం), మరియు అది దాదాపు సౌదీ అరేబియా కరెన్సీలలో యాభై ఆరు రియాల్ (నేటి మార్కెటు రేటు ప్రకారం లెక్కించవలెను)
బంగారము యొక్క నిసాబ్ ఇరవై మిస్ ఖాల్ (ఒక ఇస్లామీయ పరిమాణం), మరియు సౌదీ గిన్నీలలో అది పదకొండు గిన్నీలు మరియు మూడు ఏడవ వంతుల గిన్నీ, మరియు గ్రాములలో తొంభై రెండు గ్రాములు, మరియు వాటిలో (బంగారం మరియు వెండి) లేదా వాటిలో ఒకదానిలో నిసాబ్ పరిమాణం కంటే ఎక్కువ కలిగి ఉన్నవారు, మరియు అది ఒక సంవత్సరం మొత్తం వారి వద్ద ఉంటే, దానిపై వారు నలభైవ భాగము అంటే 2.5% జకాతు విధి దానము చెల్లించ వలెను.
లాభం మూలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దానిని లెక్కించుట కొరకు కొత్త సంవత్సర ఆరంభం యొక్క అవసరం లేదు, అలాగే పశువుల ఉత్పత్తి కూడా దాని మూలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దాని మూలం నిసాబ్ చేరుకుంటే కొత్త సంవత్సరం అవసరం లేదు.
నేటి ప్రజలు ఉపయోగించే కరెన్సీ నోట్లకు బంగారం మరియు వెండి యొక్క హుకుం వర్తిస్తుంది, అవి దిర్హమ్, దీనార్, డాలర్ లేదా ఇతర పేర్లతో పిలవబడినా. వాటి విలువ వెండి లేదా బంగారం యొక్క నిసాబ్ కు చేరినప్పుడు మరియు వాటిపై వారి ఆధీనం ఒక సంవత్సరం గడిచినప్పుడు, వాటిపై జకాత్ విధిగా చెల్లించ వలెను.
మహిళల నగదు, బంగారం లేదా వెండి ఆభరణాలు, ముఖ్యంగా నిసాబ్ లెక్కకు చేరుకున్నప్పుడు మరియు సంవత్సర మంతా వారి వద్ద ఉన్నప్పుడు, వాటిపై జకాతు ఉంటుంది, అవి వినియోగం కోసం లేదా అప్పుగా ఉంచబడినప్పటికీ, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మామూలు హదీథు ప్రకారం:
((مَا مِنْ صَاحِبِ ذَهَبٍ أَوْ فِضَّةٍ لَا يُؤَدِّى زَكَاتَهَا إِلَّا إِذَا كَانَ القِيَامَةُ صُفِحَتْ لَهُ يَوْمَ صَفَابِحَ مِنْ نَارٍ…))
“బంగారం లేదా వెండి కలిగి ఉన్న వారు ఎవరైనా వాటిపై జకాతు చెల్లించక పోతే, తీర్పు దినమున అతని కోసం అగ్ని పలకలు తయారు చేయబడతాయి…” పైన పేర్కొన్న హదీథు చివరి వరకు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక స్త్రీ చేతిలో బంగారు గాజులు చూసినప్పుడు ఇలా అన్నారు:
((أَتُعْطِينَ زَكَاةَ هَذَا؟)) قَالَتْ : لَا ، قَالَ: ((أَيَسُرُّكِ أَنْ يُسَوِّرَكِ اللَّهُ بِهِمَا يَوْمَ القِيَامَةِ سِوَارَيْنِ مِنْ نَارٍ!)) فَأَلْقَتْهُمَا، وَقَالَتْ: ((هُمَا لِلَّهِ وَلِرَسُولِهِ))
“‘దీనిపై జకాతు చెల్లిస్తున్నావా?’ అని అడిగారు. ఆమె ‘లేదు’ అని చెప్పింది. ‘పరలోక దినాన అల్లాహ్ నీకు ఈ రెండింటిని నిప్పు గాజులుగా చేయడం నిన్ను సంతోషపరుస్తుందా?’ అని అడిగారు. ఆమె వాటిని విసిరేసి, ‘ఇవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు (దానం చేస్తున్నాను)’ అని చెప్పింది.” (దీనిని అబూ దావూద్ మరియు నసాయి సనద్ హసన్ లతో నమోదు చేసినారు.)
ఉమ్మె సల్మా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ఆమె బంగారు ఆభరణాలు ధరించేవారు. ఆమె వాటి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: ‘ఇది ధనసంపత్తి కింద వస్తుందా?’ దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు:
(( مَا بَلَغَ أَنْ يُزَكَّى فَرُكَ فَلَيْسَ بِكَنْزِ))
“ఏదైనా వస్తువు జకాతు ఇవ్వడానికి అర్హత పొందినప్పుడు దానిపై జకాతు ఇవ్వబడితే అది నిధి కాదు.” ఇలాంటి అనేక ఇతర హదీథులు కూడా ఉన్నాయి.
అయితే అమ్మకానికి సిద్ధం చేసిన వస్తువులు (వాణిజ్య వస్తువులు), అవి సంవత్సరాంతంలో లెక్కించబడతాయి మరియు వాటి విలువలో రుబ్ ఉల్ ఉమ్ (2.5%) చెల్లించబడుతుంది, అవి వాటి ధరతో సమానమైనా, ఎక్కువైనా, తక్కువైనా; సమురా ఉల్లేఖించిన ఈ హదీథు ప్రకారం:
(( كَانَ رَسُولُ اللَّهِ ﷺ يَأْمُرُنَا أَنْ تُخْرِجَ الصَّدَقَةَ مِنَ الَّذِي نُعِدُّهُ لِلْبَيْعِ))
“ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అమ్మకానికి ఉంచిన వస్తువుల నుండి సదకా (జకాతు విధి దానం) ఇవ్వమని మాకు ఆదేశించేవారు” దీనిని అబూ దావూద్ నమోదు చేసినారు.
అమ్మకానికి సిద్ధం చేసిన భూములు (రియల్ ఎస్టేట్లు), భవనాలు, కార్లు, నీటిని పైకి లేపే యంత్రాలు మరియు అమ్మకానికి సిద్ధం చేసిన ఇతర వస్తువులు ఇందులో చేరతాయి.
అమ్మకానికి కాకుండా అద్దెకు సిద్ధం చేసిన భవనాలపై, వాటి అద్దెపై సంవత్సర కాలం గడిస్తే జకాతు ఉంటుంది, కానీ వాటి మూలస్వరూపంపై జకాత్ ఉండదు; ఎందుకంటే అవి అమ్మకానికి సిద్ధం చేయబడలేదు. అలాగే, వ్యక్తిగత మరియు అద్దె కార్లపై కూడా జకాతు ఉండదు, అవి అమ్మకానికి సిద్ధం చేయబడకపోతే, వాటిని యజమాని ఉపయోగం కోసం కొనుగోలు చేశాడు.
ఒక టాక్సీ యజమాని వద్ద లేదా ఇతరుల వద్ద నిసాబ్ కు చేరుకున్న డబ్బు ఉంటే, అది ఒక సంవత్సరం గడిస్తే దానిపై జకాత్ విధి అవుతుంది, అది ఖర్చు కోసం, వివాహం కోసం, ఆస్తి కొనుగోలు కోసం, లేదా అప్పు తీర్చడానికి, లేదా ఇతర ఉద్దేశ్యాల కోసం సిద్ధం చేసినా సరే; ఇలాంటి వాటిపై జకాత్ విధి తప్పనిసరి అని ధర్మశాస్త్ర సాక్ష్యాలు సూచిస్తున్నాయి.
ముందుగా చెప్పినట్లుగా, ధర్మం జకాతును నిరోధించదని పండితుల సరిగా చెప్పినారు.
మరియు అదే విధంగా అనాథల మరియు మతి స్థిమితం లేని వారి డబ్బుపై కూడా జకాతు విధి అవుతుంది, ఇది నిసాబ్ కు చేరినప్పుడు మరియు సంవత్సరం గడిచినప్పుడు, వారి సంరక్షకులు వారి తరపున సంవత్సరం పూర్తయినప్పుడు దానిని జకాతు ఉద్దేశ్యంతో ఇవ్వటం తప్పనిసరి: సాధారణ సాక్ష్యాల ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రదియల్లాహు అన్హు ను యెమెన్ ప్రజల వద్దకు పంపినప్పుడు చెప్పిన హదీథులో ఇలా ఉంది:
((إِنَّ اللَّهَ افْتَرَضَ عَلَيْهِمْ صَدَقَةً فِي أَمْوَالِهِمْ تُؤْخَذُ مِنْ أَغْنِيَابِهِمْ وَتُرَدُّ فِي فُقَرَابِهِمْ))
“అల్లాహ్ వారి సంపదలపై దానము విధించినాడు; అది వారి సంపన్నుల నుండి తీసుకుని, వారి పేదవారికి తిరిగి ఇవ్వబడుతుంది.”
జకాతు విధి దానము అల్లాహ్ హక్కు, దానిని పక్షపాతంతో అర్హులైన వారికి కాకుండా ఇతరులకు ఇవ్వడం అనుమతించ బడలేదు, లేదా దానితో వ్యక్తిగత ప్రయోజనం పొందడం లేదా హాని నుండి తప్పించుకోవడం అనుమతించబడదు, లేదా దానితో తన సంపదను రక్షించడం లేదా తనపై నిందను తొలగించడం అనుమతించబడదు. ముస్లింలు తమ జకాతును అర్హులైన వారికి మాత్రమే చెల్లించాలి, ఇతర ఉద్దేశ్యాల కోసం కాదు, దానిని ఇష్టపూర్వకంగా, అల్లాహ్ కోసం నిష్కపటంగా, చిత్తశుద్ధితో దానం చేయాలి; తద్వారా తమ బాధ్యత నుండి విముక్తి పొందుతారు, మరియు గొప్ప ప్రతిఫలం మరియు దానికి బదులు పొందటానికి అర్హత పొందుతారు.
అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో జకాతు పొందేందుకు అర్హులైన ప్రజల గురించి స్పష్టంగా తెలియజేసినాడు, అల్లాహ్ ప్రకటన:
إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
“నిశ్చయంగా విధి దానాలు కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, (జకాతు) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షిస్తున్నాయో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో శ్రమించేవారి కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.” [9:60]
ఈ పవిత్ర ఆయతు ముగింపులో ఈ రెండు మహానామాలతో (సర్వజ్ఞుడు మరియు మహావివేకవంతుడు) అల్లాహ్ తన దాసులకు ఒక హెచ్చరికను అందిస్తున్నాడు. ఆయన తన దాసుల పరిస్థితి ఎరిగినవాడు -ఎవరు దానము తీసుకునేందుకు అర్హులో మరియు ఎవరు అర్హులు కారో బాగా ఎరిగినవాడు. ఆయన తన శాసనంలో మరియు నిర్ణయంలో మహావివేకవంతుడు, కాబట్టి ఆయన ప్రతిదానినీ వాటికి తగిన స్థలాల్లో మాత్రమే ఉంచుతాడు, అయినప్పటికీ కొంతమంది వ్యక్తులకు ఆయన విజ్ఞత యొక్క రహస్యాలు తెలియకపోవచ్చు; దాసులు ఆయన శాసనంపై నమ్మకాన్ని కలిగి ఉండటానికి మరియు ఆయన నిర్ణయానికి సమర్పించుకోవటానికి ఒక మార్గదర్శకము.
మరియు అల్లాహ్ మాకు మరియు ముస్లిములకు ఆయన ధర్మములో అవగాహన కల్పించమని, ఆయన పట్ల నిష్కపటతను, చిత్తశుద్ధిని కలిగించమని, ఆయన ప్రీతిప్రసన్నత కొరకు పనులు చేయుటలో ముందుకు సాగించమని మరియు ఆయన క్రోధానికి కారణమయ్యే వాటి నుండి రక్షించమని మేము వేడుకుంటున్నాము నిస్సందేహంగా ఆయన వినేవాడును మరియు మనకు అతి సమీపంగా ఉండేవాడు!
అల్లాహ్ తన దాసుడైన, తన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
గౌరవనీయులైన షేఖ్: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
ప్రధాన అధ్యక్షులు – శాస్త్రీయ పరిశోధన విభాగాల మరియు సందేశప్రచారము, మార్గదర్శకత్వము మరియు ఫత్వా విభాగములు.
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జకాతు విధిదానము మరియు రమదాను ఉపవాసాలపై రెండు సంక్షిప్త సందేశాలు
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ [డైరెక్ట్ PDF]
—
జకాత్ & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/

You must be logged in to post a comment.