150 కంఠస్తం చేయదగిన దైవ ప్రవక్త ﷺ హదీసులు [పుస్తకం]

మూలం : మౌలానా కె. అమీనుర్రహ్మాన్ మదనీ
భావానువాదం : ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్

క్రింది లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
150 కంఠస్తం చేయదగిన దైవ ప్రవక్త ﷺ హదీసులు
[డైరెక్ట్ PDF] [పాకెట్ సైజు]

జనం నోళ్లల్లో నానిపోయే చిన్న చిన్న హదీసులను ఏర్చికూర్చి రూపొందించిన చిరుపుస్తకం. ఎంతో వినసొంపుగా ఉండే ఈ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు పాఠకుల సంభాషణను సుసంపన్నం చేస్తాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలుకుల్లోని ఆ లాలిత్యం మన మాటల్లోనూ జాలువారాలని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదాల్లోని పదునుతో మన భావాల్లోను పటుత్వం రావాలని – ఆ దివ్య ప్రవచనాల తెలుగు లిపిని రంగురంగుల ఆకర్షణీయమైన నిండు వాల్ పేపర్స్ పై ఎంతో రమణీయంగా తీర్చిదిద్ది రూపొందించిన పుస్తకం.

ప్రకాశకులు

మరిన్ని ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలు | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/prophets-character
[PDF [27 పేజీలు]

ఖుత్బాయందలి ముఖ్యాంశాలు: 

  • (1) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాల గురించి ఖురాన్ మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం. 
  • (2) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి అనేక మంది సహాబాల సాక్ష్యం. 
  • (3) అత్యుత్తమ గుణగణాల నమూనాలు. 

ఇస్లామీయ సహోదరులారా!  నేటి జుమా ఖుత్బా యొక్క అంశం – “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలు”. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల్ని చర్చించే ముందు మనమందరం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అవడంతో పాటు దైవప్రవక్త లందరికీ నాయకులు (ఇమామ్). ప్రవక్త పాలనా పోషణలు స్వయంగా అల్లాహ్ చూస్తాడు. ఇలా అతణ్ణి, నిత్యం పరిశుద్ధం చేస్తూ గుణగణాల్లో, నైతికతలో అందరికన్నా ఉత్తముడిగా, ఆదర్శవంతునిగా తీర్చిదిద్దుతాడు. ప్రవక్త సంరక్షకుడు స్వయానా అల్లాహ్ కనుక దివ్య ఖురాన్లో రెండు విషయాలపై ఒట్టేసి మరీ ఆయన ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి సాక్ష్యమిచ్చాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“నూన్- కలము సాక్షిగా! వారు (దైవదూతలు) వ్రాసే సాక్షిగా! (ఓ ముహమ్మద్)! నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కాదు.  నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో వున్నావు”. (ఖలమ్ : 1-4) 

ప్రవక్త ఎల్లప్పుడూ దైవ వాణి (వహీ)ని అనుసరిస్తాడు. కనుక ఆ దైవవాణే వాస్తవానికి అతని నైతికత, గుణగణాలు అయివుంటాయి. అందుకే ఓ సారి ఆయెషా (రజి అల్లాహు అన్హతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల గురించి అడగ్గా ఆమె జవాబిస్తూ – ఆయన గుణగణాలు స్వయానా దివ్య ఖురానే అని అన్నారు. (ముస్నద్ అహ్మద్ – సహీఉల్ అర్నావూత్) 

అంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దివ్య ఖురానుకు ఆచరణా ప్రతిబింబము అన్నమాట. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల సాక్ష్యం కేవలం ఖురానులోనే కాదు, మునపటి ఆకాశ గ్రంథాలలో కూడా లభ్యమై వుంది. 

అతా బిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం: “నేనొక సారి అబ్దుల్లా బిన్ అమ్ర్  బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ను కలిసి ఆయనతో – తౌరాత్ లో వివరించబడ్డ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలను గూర్చి వివరించండి- అని అడిగాను. ఆయన జవాబిస్తూ – సరే, అల్లాహ్ సాక్షి! దివ్య ఖురానులో వివరించబడ్డ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొన్ని గుణగణాలే తౌరాత్ లోనూ వివరించబడ్డాయి. 

దివ్య ఖురాన్లో ఇలా వుంది: ‘ఓ ప్రవక్తా! మేము నిన్ను సాక్షిగా, శుభవార్తాహరుడిగా, భయపెట్టేవాడిగా చేసి పంపాము.’ తౌరాత్ లో కూడా ఈ గుణగణాలు వివరించబడ్డాయి. వీటితో పాటు తౌరాత్ లో ఇంకా ఆయన అరబ్బుల కోసం కోటగా వుంటారని, ఆయన నా(అల్లాహ్) దాసులు మరియు ప్రవక్త అని, ఆయన పేరు ‘ముతవక్కల్’ (అల్లాహ్ పై నమ్మకం వుంచేవాడు) అని నేను పెట్టాను – అని వుంది. ఇంకా ఆయన గుణగణాల్లో ఇవి కూడా వివరించబడ్డాయి – ఆయన దుర్గుణులు, కఠినులు కారు మరియు బజార్లలో గొంతెత్తి సంభాషించరు. చెడును చెడుతో సమాధానం ఇవ్వకుండా, దానిని ఉపేక్షించి క్షమిస్తారు అని వివరించారు. (బుఖారీ : 4838) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలను గూర్చి దివ్య ఖురాను మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం తర్వాత మరి కొందరి సాక్ష్యం కూడా వినండి! 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు (Prophet’s Miracles)
https://youtu.be/2su-OWOpcGo [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అనే అంశంపై ఈ ప్రసంగం సాగింది. ప్రవక్తలందరూ తమ ప్రవక్తృత్వానికి నిదర్శనంగా అల్లాహ్ యొక్క అనుమతితో కొన్ని మహిమలను చూపారని, వాటిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మహిమలు ఎన్నెన్నో ఉన్నాయని వక్త వివరించారు. అన్నింటికన్నా గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథమని, అది ప్రళయం వరకు సజీవంగా ఉండే మహిమ అని తెలిపారు. చంద్రుడిని రెండుగా చీల్చడం, హుదైబియా వద్ద తన వేళ్ళ నుండి నీటిని ప్రవహింపజేసి 1500 మంది సహచరుల దాహాన్ని తీర్చడం, కందకం యుద్ధం సమయంలో కొద్దిపాటి ఆహారాన్ని వెయ్యి మందికి పైగా సరిపోయేలా చేయడం, ఒక చెట్టు మరియు తోడేలు ఆయన ప్రవక్తృత్వాన్ని సాక్ష్యమివ్వడం వంటి సంఘటనలను వివరించారు. ప్రవక్తలు చూపిన మహిమలు వారు దైవ ప్రవక్తలని రుజువు చేయడానికే గానీ, వారు దేవుళ్ళమని ప్రకటించుకోవడానికి కాదని, నేటి కాలంలోని దొంగ బాబాలు చేసే కనుగట్టు విద్యలకు, ప్రవక్తల మహిమలకు తేడాను గ్రహించాలని ఉద్భోదించారు.

స్తోత్రాలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ప్రవక్తలను, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించడానికి, ధర్మ ప్రచారము చేయించడానికి వివిధ సందర్భాలలో, వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తలు ప్రజల ముందర దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ప్రజలు ఆ ప్రవక్తలతో కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఆ ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా కొన్ని మహిమలను, అద్భుతాలను చూపించాడు.

ఆ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేసి చూపించిన కొన్ని మహిమల గురించి, కొన్ని సూచనల గురించి మనము ఈ ప్రసంగంలో తెలుసుకుందాం.

మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన మహిమలు అనేకమైనవి ఉన్నాయి. ఆ మహిమలన్నింటిలో గొప్ప మహిమ, అన్నిటికంటే పెద్ద మహిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. ఇదేంటండీ? మహిమలంటే ఏదో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చెబుతారంటే, ఇదేదో పుస్తకం గురించి మీరు చెబుతున్నారేంటి అని మీరు ఆశ్చర్యపోతారేమో.

అయితే అభిమాన సోదరులారా, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి, అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథం అని ఎందుకు చెబుతున్నానంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మహిమలు అవి అప్పటికప్పుడే కనిపించాయి, ఆ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఈ ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి మహిమ అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలం నుండి ఇప్పటి వరకు కూడా అది అలాగే సజీవంగా ఉంది, ప్రళయం వరకు కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి మహిమలన్నింటిలో గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ గ్రంథము కంటే పూర్వము అనేక గ్రంథాలు ప్రపంచంలో వచ్చాయి. కానీ అవి ఏదీ కూడాను తన అసలు రూపంలో నిలబడలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథం అల్ హందులిల్లాహ్ అవతరించబడిన నాటి నుండి నేటి వరకు కూడా అది తన అసలు రూపంలోనే ఉంది, ప్రళయం వరకు కూడా అది అసలు రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రంథాలన్నింటిలో సురక్షితమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖుర్ఆన్ గ్రంథము మాత్రమే. ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీసుకుని ఉన్నాడు కాబట్టి అది సురక్షితమైన గ్రంథము. కాబట్టి అది గొప్ప మహిమ అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ ఎంత గొప్ప మహిమ అంటే, ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఈ ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము మీరు ఏదైనా రచించి తేగలరేమో తెచ్చి చూపించండి అని ఛాలెంజ్ చేశాడు. ఖుర్ఆన్ పూర్తి గ్రంథము. అలాంటి పూర్తి గ్రంథము మీరు రచించలేకపోతున్నారా? పోనీ ఖుర్ఆన్ లో ఉన్న అధ్యాయాలలో నుంచి ఒక పది అధ్యాయాలు రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్లీ ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఒక పది సూరాలు మీరు రాసి చూపించండి అన్నాడు. పది సూరాలు వీలుపడదా? ఒక్క సూరా అయినా సరే మీరు రాసి చూపించగలరా ఖుర్ఆన్ లాంటిది అని అడిగాడు. ఒక్క సూరా కూడా మీరు రాయలేరా? పోనీ ఒక్క ఆయతు, ఒక్క వాక్యము, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాల లాంటి ఒక్క వాక్యము మీరు, జిన్నాతులు అందరూ కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరి ఇలాంటి ఒక్క వాక్యము రాయగలరేమో రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఛాలెంజ్ చేశాడు.

అభిమాన సోదరులారా, ఈ ఛాలెంజ్ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది ప్రజలు ఖుర్ఆన్ లాంటి ఒక్క వాక్యము రాయలేకపోయారు. వారు ఎంత కష్టపడ్డా, రాత్రింబవళ్ళు ప్రయత్నించినా వారికి సాధ్యపడలేకపోయింది అభిమాన సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన సూచనలలో, మహిమలలో గొప్ప సూచన, గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని ఇందుకే చెప్పబడుచున్నది అభిమాన సోదరులారా.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ చూపించిన మరొక గొప్ప మహిమ, చంద్రుడు రెండు ముక్కలైపోవటం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో నివసిస్తున్న రోజుల్లో, మక్కాలోని పెద్దలు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, “నీవు దైవప్రవక్తవే అయితే ఒక సూచన చూపించు, ఒక మహిమ చూపించు” అని ప్రశ్నించారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేశారు, దుఆ చేశారు, “ఓ అల్లాహ్, మక్కా వాసులు నాతో సూచన అడుగుతున్నారు, మహిమ అడుగుతున్నారు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా చూపించాడు, “ఓ దైవప్రవక్తా, చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోవుచున్నాడు.”

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ప్రజలకు ఆ పెద్ద మహిమ చూపించారు, “చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోతున్నాడు” అని. మక్కా ప్రజలు కళ్ళారా చూశారు, చంద్రుడు రెండు ముక్కలైపోయి హిరా పర్వతం కుడి వైపున ఒక భాగము, హిరా పర్వతము ఎడమ వైపున మరొక భాగము, రెండు భాగాలుగా విడిపోయాడు. అభిమాన సోదరులారా, ఇంత పెద్ద అద్భుతము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. దీని ప్రస్తావన ఖుర్ఆన్ గ్రంథంలో సూరా ఖమర్ ఒకటవ వాక్యం నుండి ఐదవ వాక్యం వరకు మీకు లభిస్తుంది. అలాగే ముస్లిం గ్రంథంలో కూడా దీని ప్రస్తావన మీకు దొరుకుతుంది.

చంద్రుడు రెండు ముక్కలైపోవటం, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను తీసుకుని ఉమ్రా చేయటానికి మదీనా నుండి మక్కాకు వస్తూ ఉన్నారు. హుదైబియా అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వచ్చిన సహాబాల వద్ద ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. త్రాగటానికి కూడా నీళ్ళు లేవు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక చిన్న పాత్ర ఉంటే, ఆ పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఆ పాత్ర తీసుకుని అందులో ఉన్న నీళ్ళ నుండి వుజూ చేయటం ప్రారంభించారు. వెంటనే సహాబాలందరూ అక్కడ ప్రోగైపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “ఏంటండీ, మీరందరూ ఇక్కడికి వచ్చేశారు? ఏంటి విషయము?” అంటే అప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, మనము ఇంచుమించు 1500 మంది మనం ఉన్నాం ఇక్కడ. ఎవరి వద్ద కూడా నీళ్ళు లేవండి, త్రాగడానికి కూడా నీళ్ళు లేవండి. కేవలం మీ దగ్గర ఉన్న ఆ పాత్రలో నీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు కూడా మీరు వుజూ చేసేస్తున్నారు కదా, మనకు వుజూ చేసుకోవడానికి గానీ, త్రాగడానికి గానీ, వంట చేసుకోవడానికి గానీ మా దగ్గర అస్సలు నీళ్ళే లేవండి” అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించగా, అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ ను ప్రార్థించి, తమ చేతులను ఆ పాత్రలో పెట్టగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేళ్ళ మధ్య నుండి నీటి ప్రవాహం ఉబికింది. ఎన్ని నీళ్ళు వచ్చాయంటే అక్కడ ఉన్న 1500 మంది సహాబాలు అందరూ ఆ నీళ్ళతో వుజూ చేసుకున్నారు, వారి వద్ద ఉన్న పాత్రలన్నింటినీ నీళ్ళతో నింపుకున్నారు. అల్లాహు అక్బర్. ఇంత పెద్ద మహిమ అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చూపించాడు.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో పాటు ఒక ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఒక బద్దూ వ్యక్తి కనిపించాడు. ఒక పల్లెటూరు వాసి అని మనం మన భాషలో చెప్పుకుంటాం కదండీ. అలాంటి ఒక పల్లెటూరు వాసి కనిపించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని దగ్గరకు వెళ్లి, “అయ్యా, అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్తను అని నీవు సాక్ష్యం పలకవయ్యా” అని చెప్పారు. అంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నువ్వు సాక్ష్యం పలకవయ్యా అని ఆ పల్లెటూరు వాసితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తే, అతను ఏమన్నాడంటే, “నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే సాక్ష్య వచనం, కల్మా పఠించాలంటే, నేను కాకుండా ఎవరైనా ఈ కలిమాను సాక్ష్యం పలికే వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరి నుండైనా మీరు నా ముందర సాక్ష్యం పలికించి చూపిస్తారా?” అని అతను మళ్లీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు.

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరలోనే ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు వైపు సైగ చూపి, ఏమన్నారంటే, “చూడయ్యా, ఈ చెట్టు కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్త అని సాక్ష్యం పలుకుతుంది, చూపించనా?” అన్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ చెట్టుకి పురమాయించగా, ఆ చెట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
“అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని మూడు సార్లు సాక్ష్యం పలికి, అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ తన స్థానంలో వెళ్లి నిలబడిపోయింది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే అతను కూడా,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)

అని అతను కూడా సాక్ష్యం పలికాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక సూచన, మరొక మహిమ.

అభిమాన సోదరులారా, అలాగే మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ చూపించిన మరొక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కరువు ఏర్పడింది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆకలి దప్పులతో గడుపుతున్న రోజుల్లో మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మదీనాకు వెళ్లి హతమార్చాలని, ఆయనను అక్కడి నుంచి కూడా తరిమివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్కా వాసుల్ని మదీనా లోపలికి రానియ్యకుండా అడ్డుకోవటానికి కందకం తవ్వాలని నిర్ణయించారు.

ఆ కందకం త్రవ్వేటప్పుడు, కరువు వల్ల సమయానికి అన్నము, నీళ్ళు దొరకని కారణంగా ఆకలి దప్పికలతో ప్రవక్త వారు మరియు సహాబాలు అందరూ కష్టపడుతున్నారు, ఆ గుంత, ఆ కందకము తవ్వుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా బలహీనపడిపోయారు, సహాబాలు కూడా బలహీనపడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితిని చూసి ఒక సహాబీ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆవిడతో అన్నాడు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రోజుల నుండి అన్నం తినని కారణంగా బలహీనులైపోయారు. కాబట్టి, మన ఇంట్లో ఏమైనా ఉంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆహారం ఏర్పాటు చేద్దాము, ఏమైనా ఉందా చూడు” అంటే, ఆవిడ వెళ్లి వెతకగా ఒక ‘సా’ గింజలు కనిపించాయి. ఒక ‘సా’ అంటే ఇంచుమించు, రెండున్నర కేజీలు గింజలు కనిపించాయి.

అవి తీసుకొని వచ్చి ఆవిడ ఏమందంటే, “చూడండి, ఈ ధాన్యము రెండున్నర కేజీలు మాత్రమే ఉంది. దీనిని నేను పిండిగా మార్చేస్తాను. ఆ తర్వాత మన ఇంట్లో ఒక మేక పిల్ల ఉంది, దాన్ని జబా చేయండి, ఇన్షా అల్లాహ్ దానితో నేను కూర వండుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త వారితో ఒక కొద్ది మంది, ఐదు లేదా పది మంది వస్తే గనక ఇన్షా అల్లాహ్ వారందరికీ మనము ఈ పిండి ద్వారా, ఈ మాంసము ద్వారా ఆహారం ఏర్పాటు చేయగలము, భోజనం ఏర్పాటు చేయగలము. మీరు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఒక పది మందిని కూడా రమ్మని చెప్పండి, ఆహ్వానించండి” అని ఆ సహాబీ వాళ్ళ ఆవిడ చెప్పింది.

ఆ సహాబీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లి, పక్కకు పిలిచి, “ఓ దైవ ప్రవక్త, ఈరోజు మా ఇంట్లో మీకు ఆహారం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఒక పది మందిని తీసుకుని మా ఇంటికి ఆహారానికి, భోజనానికి రండి” అని ఆహ్వానించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అక్కడ కందకం తవ్వుతున్న సహాబాలు అందరినీ, “ఏవండీ, ఫలానా సహాబీ వారి ఇంటిలో మనకు ఈరోజు భోజన ఏర్పాటు ఉంది, కాబట్టి అందరూ నా వెంట రండి వెళ్దాం” అని చెప్పి అందరినీ తీసుకుని వచ్చేశారు. అల్లాహు అక్బర్. వారి సంఖ్య ఎంత ఉందో తెలుసా? అక్కడ కందకం తవ్వుతున్న వారి సంఖ్య వెయ్యి కంటే ఎక్కువగా ఉంది. అంత మందిని కూడా తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేశారు.

అది చూసి ఆ సహాబీ కంగారు పడిపోయారు. అదేంటండీ, నేను ఏదో పది మందిని తీసుకుని రమ్మంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకంగా వెయ్యి కంటే ఎక్కువ మందిని తీసుకుని వచ్చేస్తున్నారు. అంత మందికి నేను భోజన ఏర్పాటు ఎలా చేయగలను? నా దగ్గర ఉన్నది కొంచెమే కదా అని ఆయన కంగారు పడుతుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో అన్నారు, ఆ సహాబితో అన్నారు, “ఏమయ్యా, మీ ఇంటిలో పొయ్యి మీద ఉన్న ఆ పాత్రను అలాగే ఉంచమని చెప్పండి మీ ఆవిడతో. అలాగే, మీ ఆవిడ ఆ గింజల్ని పిండి లాగా రుబ్బుతోంది కదా, ఇప్పుడనే రొట్టెలు తయారు చేయవద్దు, అలాగే ఉంచమని చెప్పండి నేను వచ్చేవరకు కూడా” అని చెప్పి పంపించారు.

ఆ సహాబీ వెళ్లి వాళ్ళ ఆవిడతో, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మందిని తీసుకుని వస్తున్నారు, కాకపోతే ఆ పొయ్యి మీద ఉన్న పాత్రను దింపవద్దని చెప్పారు, రొట్టెలు ఇప్పుడనే వంట చేయవద్దని చెప్పారు, ఆయన వచ్చేవరకు ఆగాలంట” అని చెప్పారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేవరకు వాళ్ళ ఆవిడ ఆగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఇంట్లోకి ప్రవేశించి అల్లాహ్ పేరు తలచుకుని ‘బిస్మిల్లాహ్’ అని ఆ కూర వండుతున్న పాత్రలో వేలు పెట్టి ఇలా తిప్పారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ పిండి ఉందో అక్కడ కూడా వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ పిండిలో చెయ్యి పెట్టారు. ఆ తర్వాత ఆ సహాబీ వాళ్ళ భార్యతో ఏమన్నారంటే, “రొట్టెలు తయారు చేయడానికి నీకు ఒక్కరితోనే సరిపోదు కాబట్టి మరొక మహిళను కూడా పిలిపించుకో” అన్నారు. ఆవిడ పక్కింటి ఒక ఆవిడని కూడా పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పిండిని ఆ ఇద్దరు మహిళలు తీసుకుని రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సహాబీ ఆ పాత్రలో ఉన్న ఆ కూర కొంచెం కొంచెము తీసి ఆ అక్కడ ఉన్న సహాబాలు అందరికీ వడ్డిస్తున్నారు. ఆ సహాబీ చెబుతున్నారు, అక్కడ ఉన్న వెయ్యి మంది కూడా ఆ రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని ఆ మాంసము కూర ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని పూర్తి వెయ్యి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నారు, కడుపునిండా భుజించారు. అయినాగానీ పిండి అలాగే మిగిలిపోయింది, కూర కూడా ఆ పాత్ర నిండా అలాగే మిగిలి ఉంది. అల్లాహు అక్బర్.

అంటే పది మంది తినే ఆహారాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంతలో ఎంతటి శుభం కల్పించాడంటే, ఎంతటి బర్కత్ ఇచ్చాడంటే వెయ్యి కంటే ఎక్కువ మంది అల్లాహ్ దయవల్ల అక్కడ భోజనం చేశారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే ఒకసారి మదీనా ఇరుపక్కల కొంతమంది యూదులు ఉండేవారు ఆ రోజుల్లో. ఒక యూదుడు గొర్రెలు మేపటానికి గొర్రెలను తోలుకొని వెళితే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రెను పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే గొర్రెను కాపాడుకోవడానికి ఆ తోడేలును వెంబడించాడు, వెంబడించి వెంబడించి వెంబడించి చివరికి ఆ గొర్రెను ఆ తోడేలు నుండి కాపాడుకుని తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ తోడేలు కూర్చుని ఆ యూదునితో మాట్లాడుతా ఉంది. “ఏంటయ్యా, అల్లాహ్ నాకు ఇచ్చిన ఆహారాన్ని నా నోటి వద్ద నుండి నువ్వు లాక్కుని వెళ్ళిపోతున్నావే” అంది. అతను ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటండీ? జంతువు ఏకంగా మనిషితోనే మాట్లాడటం ప్రారంభించేసింది అని ఆ జంతువుతో అతను అడుగుతుంటే అప్పుడు ఆ తోడేలు ఆ వ్యక్తితో అంటూ ఉంది, “దీనికంటే ఒక మరొక్క గొప్ప విషయం నేను నీకు చెప్పనా? మదీనాలో ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. అతను జరిగిన విషయాలు కూడా చెబుతుంటాడు, అలాగే జరగబోయే విషయాలు కూడా చెబుతున్నాడు. నువ్వు వెళ్లి అతనితో కలుసు” అంది.

ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ యూదుడు గొర్రెలు ఇంటికి తోలుకొని వచ్చేసి, ఇండ్లల్లో ఆ గొర్రెలు వదిలేసి తిన్నగా మదీనాకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం, సంఘటన మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వినిపిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తోడేలు చెప్పింది నిజమే, నేనే ఆ ప్రవక్తను అని చెప్పగా, వెంటనే ఆ యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని సాక్ష్యం పలికి ముస్లిం అయిపోయాడు అభిమాన సోదరులారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక మహిమ. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని ఒక జంతువు కూడా సాక్ష్యమిచ్చింది.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరికొన్ని మహిమల్లో ఒక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలి నుండి చాలా మందికి స్వస్థత లభించింది. మనమంతా వినే ఉన్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసే సందర్భంలో సౌర్ గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవేశించారు. ఆ గుహను శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న రంధ్రాలన్నింటినీ బట్టతో కప్పేయగా ఒక రంధ్రం మిగిలిపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు తమ కాలుని ఆ రంధ్రం పైన పెట్టేసి ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి ప్రవేశించమని చెబితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపలికి ప్రవేశించారు, ఆ తర్వాత అబూబకర్, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి తొడ మీద తల పెట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కాలుకి కాటేసింది. విషం శరీరంలో ఎక్కుతూ ఉంటే బాధ భరించలేక అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కన్నీరు కారిస్తే, ఒక చుక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళ్ళు తెరిచి, “ఎందుకు ఏడుస్తున్నావు అబూబకర్?” అంటే అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కాలు చూపించి, “ఏదో విషపురుగు నాకు కాటేసింది” అని చెప్పగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని తీసి అక్కడ పూయగానే విషం మొత్తం తగ్గిపోయింది. చూశారా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మి నుండి విషము నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత కల్పించాడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి గారికి.

అలాగే ఖైబర్ ప్రదేశంలో కూడా అలీ రజియల్లాహు అన్హు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలవగా, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి చేరితే, అప్పటికే అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళలో సమస్య ఏర్పడి కళ్ళు బాగా ఎర్రబడిపోయాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఉమ్మిని తీసి అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళల్లో పూయగా, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారికి ఉన్న సమస్య తొలగిపోయింది. ఆయనకు కూడా స్వస్థత లభించింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత పెట్టాడు. ఇది కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరొక మహిమ.

ఇలాగే అభిమాన సోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి వారికి లభించక పూర్వమే మక్కాలో తిరుగుతూ ఉంటే, రాళ్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, చెట్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, గుట్టలు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మహిమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో అనేవారు, “నేను బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాను, నాకు ప్రవక్త పదవి లభించక పూర్వమే మక్కాలో ఫలానా రాయి నాకు సలాం చెబుతా ఉండింది, నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఉంది” అని దైవ ప్రవక్త చెప్పేవారు.

అలాగే పన్నెండు సంవత్సరాల వయసులో పినతండ్రి అబూ తాలిబ్ గారితో సిరియా దేశానికి వర్తకం కోసము ప్రయాణం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక క్రైస్తవ పండితుడు వచ్చి సాక్ష్యమిచ్చాడు ఏమంటే, “ఈ బాలుడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు వేలు చూపించి, ఏమన్నాడంటే, ఈ బాలుడు నడుచుకుని వస్తూ ఉంటే దారిలో కనిపించిన రాయి, దారిలో కనిపించిన చెట్టు వంగి ఇతనికి సలాము చెబుతా ఉంది. కాబట్టి ఇతను పెద్దవాడైన తర్వాత కారుణ్య మూర్తి, రహ్మతుల్లిల్ ఆలమీన్ అవుతాడు” అని ఆరోజే ఆయన సాక్ష్యం పలికాడు.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. చివరిగా ఒక విషయం ఏమిటంటే, మనం దృష్టి పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ప్రవక్తలు వారు దైవ సందేశహరులు అని ప్రపంచానికి రుజువు చూపించటానికి కొన్ని మహిమలు చూపించారు. ఆ మహిమలు చూపించి మేము కేవలం దైవ సందేశహరులము అని చెప్పుకున్నారు గానీ, మహిమలు చూపించి మేమే దేవుళ్ళము లేదా దేవునిలోని భాగము లేదా దేవుని అవతారము అని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకటించుకోలేదు. అయితే ఈ రోజుల్లో ఎవడైతే కొన్ని కిటుకులు, కొన్ని కనుగట్టులు చూపించి ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, నా వద్ద మహిమలు ఉన్నాయి, నేనే దేవుణ్ణి లేదంటే నేనే దేవుని స్వరూపాన్ని, లేదంటే నేనే దేవుని అవతారాన్ని అని ప్రకటిస్తుంటున్నాడంటే అతను అబద్ధం పలుకుతున్నాడు అని మనము గ్రహించాలి.

ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మహిమలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తలకు మాత్రమే ఇచ్చాడు గానీ, ఇలాంటి దొంగ బాబాలకు ఆయన ఇవ్వలేదు. ఇలా ఈ రోజుల్లో ఎవరైనా ప్రకటిస్తున్నాడంటే వాడు దొంగ బాబా అని మనం గుర్తించాలి అభిమాన సోదరులారా.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, మనము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాలను ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

ఆఖూలు ఖవ్ లీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16753

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్) – “అర్రహీఖుల్‌ మఖ్ తూమ్” పుస్తకం నుండి

బిస్మిల్లాహ్
మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – అంతిమ హజ్ – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/IrogXl0z-uY [42నిముషాలు]

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్)

దైవసందేశం అందించే కార్యం పరిపూర్తి అయింది. అల్లాహ్ ఏకత్వం, ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడన్న సత్యాన్ని ధృవీకరించడం మరియు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి దైవదౌత్యం పునాదులపై ఓ క్రొత్త సమాజ నిర్మాణ, రూపకల్పన అమల్లోనికి వచ్చేసింది. అంటే, ఇప్పుడు ఆ మహత్కార్యం పూర్తి అయిపోయింది కాబట్టి ఓ అదృశ్యవాణి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మనోఫలకంపై ఆయన ఈ ప్రపంచంలో జీవించి ఉండే కాలం దగ్గరపడుతుందనే సూచనలు ప్రస్ఫుటం చేయనారంభించింది. అందుకేనేమో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను హిజ్రీ శకం 10లో యమన్ కు గవర్నరుగా చేసి పంపిస్తూ ఆ పదవికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు తోడు హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)తో, “ఓ ముఆజ్! బహుశా నీవు నన్ను ఈ సంవత్సరం తరువాత మళ్ళీ కలుసుకోలేవు అని అనిపిస్తోంది! నా ఈ మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు నా సమాధిని మాత్రమే చూడగలవేమో!” అని చెప్పారు, హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు), దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ పలుకులు విన్నంతనే దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా రోదించడం కూడా జరిగింది.

అసలు యదార్థం ఏమిటంటే, అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ అదృశ్య వాణి ద్వారా ఇస్లామ్ ధర్మసందేశం వలన ఒనగూడిన సత్ఫలితాలేమిటో చూయించదలిచాడు. ఏ దైవసందేశ ప్రచారం కోసమైతే ఆయన అహర్నిశలు ఇరవై సంవత్సరాలకు పైన్నే కష్టాలను, కడగండ్లను అనుభవిస్తూ వచ్చారో దాని ఫలితం ఎంత మహోజ్వలంగా ఉందో కళ్ళారా చూసే భాగ్యాన్ని ప్రసాదించాడన్నమాట. ఇందుకు అల్లాహ్ ఓ సుముహూర్తాన్ని కూడా నిర్ణయించి, తద్వారా హజ్ సందర్భంలో మక్కా పరిసరాల్లో నివసించే అరబ్బు తెగల ప్రతినిధి వర్గాలను ఓ చోట సమావేశపరిచి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించిన ధార్మిక విషయాల జ్ఞానాన్ని వారు సముపార్జించడానికి, ఏ అమానతు భారమైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) భుజస్కంధాలపై వేయబడిందో దాన్ని ఇప్పుడు వీరు మోయవలసి ఉంటుందని చెప్పడానికి, దైవసందేశాన్ని అందించడం, ముస్లిం సమాజానికి మేలు చేకూర్చే హక్కును సజావుగా నిర్వర్తించడంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలాంటి లోటు రానివ్వకుండా ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారని వారి నోటే సాక్ష్యం ఇప్పించవలసి ఉంది. ఈ దైవ నిర్ణయం ప్రకారమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ చారిత్రాత్మకమైన ‘హజ్జె మబ్రూర్’ (దైవం మెచ్చిన హజ్) చేయవలసి ఉందని ప్రకటించగానే అరేబియా ద్వీపానికి చెందిన ముస్లిం జనసందోహం తండోపతండాలుగా వచ్చి ఆయన చుట్టూ చేరనారంభించింది. ప్రతి వ్యక్తీ, తాను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వెళ్ళి ఆయన నాయకత్వంలో హజ్ చేయాలని పరితపించిపోతున్నాడు.[1] జిల్-ఖాదా నెల ఇంకా నాల్గు రోజులకు ముగుస్తుందనగా శనివారం రోజున దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ కోసం బయలుదేరారు.[2]

[1]. ఇది సహీహ్ ముస్లిం గ్రంథంలో ఉన్న హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం. చూడండి, ప్రవక్త హజ్ అధ్యాయం – 1/394.

[2]. హాఫిజ్ ఇబ్నె హజర్ పరిశోధించి చెప్పిన విషయం ఇది. కొన్ని ఉల్లేఖనాల్లో జిల్ ఖాదా నెల ఇంకా అయిదు రోజులకు ముగుస్తుందనగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బయలుదేరారనే అని వచ్చిన వివరాలను ఆయన సరిదిద్దారు. చూడండి, ఫత్ హుల్ బారి – 8/104.

తలపై నూనె వేసి మర్ధించుకొని దువ్వుకున్నారు. ‘తహ్బంద్’ (లుంగీ) కట్టుకొని మేనిపై దుప్పటి కట్టుకున్నారు. ఖుర్బానీ పశువుల మెడలలో పట్టెడలు వేసి జొహ్ర్ నమాజు చేసి హజ్ కోసం బయలుదేరారు. అస్ర్ నమాజుకు ముందే ‘జుల్ హులైఫా’ వాదీ (లోయ)లోనికి చేరుకుని అక్కడాగి రెండు రకాతుల ‘అస్ర్’ నమాజు చేశారు. గుడారాలు వేసుకొని రాత్రంతా అక్కడనే గడిపారు. తెల్లవారిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబా (రదియల్లాహు అన్హుమ్) (అనుచరగణం) ను సంబోధిస్తూ, “రాత్రి నా ప్రభువు వద్ద నుండి వచ్చేవాడు ఒకడొచ్చి నాతో, ఈ శుభమైన లోయలో నమాజు చేయమని, హజ్ లో ‘ఉమ్రా’ కూడా ఉందని ప్రకటించు అని చెప్పి వెళ్ళాడు” అని తెలిపారు.[3]

[3] ఇది హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు ఉల్లేఖించినట్లు బుఖారీ గ్రంథంలో ఉంది. 1/207.

జొహ్ర్ నమాజుకు ముందే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఇహ్రామ్’ కోసం ‘గుస్ల్’ చేశారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శరీరం మీదా, తలపైనా తన చేతులతో ‘జరీరా’తో కలిపిన కస్తూరి సువాసన గల పదార్థాన్ని, దాని తళుకు, గుబాళింపు ఆయన తల పాపిటలో, గెడ్డంలో కానవచ్చేటట్లు పులిమారు. అయితే ఆ సువాసనా పదార్థాన్ని ఆయన కడిగివేయకుండా అలాగే ఉంచేసుకున్నారు. ఆ తరువాత తహ్బంద్ కట్టుకొని, శరీరం పై ఓ దుప్పటిని కట్టుకొని “లబ్బైక్’ వాక్యాలను బిగ్గరగా పలికారు. బయటకు వచ్చి తన ‘కస్వా’ అనే ఆడ ఒంటె పై ఎక్కి కూర్చున్నారు. అప్పుడు కూడా మరోసారి లబ్బైక్ పదాలను బిగ్గరగా పలికారు. అలా ఒంటెనెక్కి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మైదానం వైపునకు వెళ్ళి అక్కడ కూడా లబ్బైక్ వాక్యాల్ని అందరికీ వినబడేటట్లు పలికారు.

ఆ తరువాత పయనమై ఓ వారం తరువాత ప్రొద్దుగ్రుంకే సమయానికి మక్కా దాపుకు చేరుకున్నారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘జీతువా’లో మకాం వేశారు. రాత్రి అక్కడనే గడిపి ఫజ్ర్ నమాజు తరువాత ‘గుస్ల్’ (స్నానం) చేసి ఉదయాన్నే మక్కాలో ప్రవేశించారు. అది హిజ్రి శక సంవత్సరం 10, జిల్ హిజ్జా మాసం 4వ తేది, ఆదివారం రోజు. ప్రయాణ కాలంలో మొత్తం ఎనిమిది రాత్రిళ్ళు గడిచాయి- సరాసరి ప్రయాణానికి పట్టేకాలం అదే- నేరుగా మస్జిదె హరామ్ (కాబా మస్జిద్)కు చేరి ఆయన మొదట దైవగృహం కాబా తవాఫ్ చేశారు. ఆ తరువాత సఫా మర్వా కొండల నడుమ ‘సయీ’ చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ మరియు ఉమ్రాలు రెంటికి సంబంధించిన ఇహ్రామ్ ఒకేసారి కట్టుకోవడం ‘హదీ’ (ఖుర్బానీ) పశువులను వెంట తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇహ్రామ్ వస్త్రాలను మాత్రం తీసివేయక అలానే ఉంచేసుకున్నారు. తవాఫ్ మరియు సయీ రెంటిని ముగించుకొని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎగువ మక్కాలో హజూన్ అనే ప్రదేశంలో విడిది చేశారు. అయితే, హజ్ తవాఫ్ తప్ప మరే తవాఫ్ ఆయన చేయలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వచ్చిన ఏ సహాబాలైతే తమ వెంట ‘హదీ’ తీసుకురాలేకపోయారో, వారికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ ఇహ్రామ్ ను ఉమ్రా ఇహ్రామ్ గా మార్చుకొమ్మని, కాబా గృహం తవాఫ్ మరియు సఫా మర్వాల నడుమ ‘సయీ’ చేసిన తరువాత వాటిని తీసేసి పూర్తిగా ‘హలాల్ కమ్మని ఆదేశం ఇచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా ఇహ్రామ్ దుస్తులను తీసివేసి హలాల్ కానందున సహాబాలు కొంత ఇరుకునబడ్డారు. అది చూసిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో, “నాకు ఇప్పుడు తెలిసిన విషయం ముందే తెలిసి ఉంటే నేనసలు హదీ తెచ్చేవాడినే కాదు. మీతోపాటే హలాల్ అయి ఉండేవాణ్ణి” అని అనగా సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఆయన ఆదేశాలను శిరసావహించారు. అంటే ఎవరి వద్ద హదీ పశువు లేదో వారు హలాల్ అయిపోయారు. (హలాల్ కావడం అంటే, ఇహ్రామ్ కట్టుకున్న తరువాత కొన్ని ధర్మసమ్మతమైన విషయాలు ఇహ్రామ్ వదలనంతవరకు హరామ్ అవుతాయి. ఇహ్రామ్ వదిలిన తరువాత తిరిగి అవి ధర్మసమ్మతం అయిపోతాయి అని అర్థం.)

ఎనిమిది జిల్ హిజ్జా తేదీన – తర్వియా రోజున – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మినా’కు వెళ్ళారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిల్ హిజ్జా తొమ్మిదవ తేదీ ఉదయం వరకు విడిది చేశారు. జొహ్ర్,అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు (అయిదు పూటలు) అక్కడనే చేశారు. సూర్యోదయం అయిన వరకు ఆగి ‘అరఫా’కు బయలుదేరారు. అక్కడికి చేరేటప్పటికే ఆయన కోసం ‘వాదియె నిమ్రా’లో గుడారం సిద్ధపరచబడి ఉంది. పగలంతా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గుడారం లోనే ఉండిపోయారు. సూర్యుడు పడమటి దిక్కుకు వాలిన తరువాత ఆయన ఆదేశం మేరకు కస్వా పై కజావా కట్టబడింది. దాని పైనెక్కి ‘బత్న్’ లోయలోనికి అరుదెంచారు. అప్పుడు ఆయన చుట్టూ ఒక లక్షా ఇరవై నాల్గు వేలు లేదా లక్షా నలభై నాల్గు వేల మంది చేరారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి నడుమన నిలుచొని ఓ సమగ్రమైన ప్రసంగం చేస్తూ ఇలా సెలవిచ్చారు:

“ప్రజలారా! నా మాటలను ఆలకించండి! ఎందుకంటే ఈ సంవత్సరం తరువాత ఈ ప్రదేశంలో మీరు నన్ను ఇంకెన్నడూ కలుసుకోలేరు.[4]

ఈ గడుస్తున్న నెల మరియు ఈ నగరం యొక్క పవిత్రతలా, మీ ప్రాణం, మీ సంపద కూడా పరస్పరం ఒకరిపై ఒకరికి అంతే పవిత్రమైనది, నిషిద్ధమైనది. బాగా వినండి! అజ్ఞాన కాలంనాటి ప్రతిదీ నా కాళ్ళ క్రింద నలిపివేయబడింది. అజ్ఞానకాలంలో జరిగిన హత్యల రక్తపరిహారం కూడా అంతం చేయబడింది. మనలో మొట్టమొదటి వ్యక్తి రక్తపరిహారం దేన్నయితే నేను అంతమొందిస్తున్నానో అది రబీయా బిన్ హారిస్ కుమారునిది – ఈ పిల్లవాణ్ణి బనూ సఅద్ పాలు త్రాగడానికి వదలినప్పుడు హుజైల్ వంశానికి చెందినవారు అతణ్ణి హతమార్చారు – అజ్ఞాన కాలం నాటి వడ్డీని కూడా అంతం చేసేస్తున్నాను. మన వడ్డీలో మొదటి ఏ వడ్డీనైతే నేను అంతం చేస్తున్నానో అది అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారి వడ్డీ. ఇప్పుడు ఈ వడ్డీ అంతా లేనట్లే.

అయితే, స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి. ఎందుకంటే వారిని మీరు అల్లాహ్ అమానతుగా పొందినవారు. అల్లాహ్ వచనం ద్వారా మీ కోసం వారు ధర్మసమ్మతం అయినవారు. మీకు ఇష్టం కాని వారినెవరినీ వారు మీ పడకల పైకి రాకుండా ఉంచాలి. అది మీ హక్కు. వారే గనక అలా చేస్తే మీరు వారిని దండించవచ్చు. అయితే వారిని తీవ్రమైన దండనకు గురి చేయకూడదు. ప్రసిద్ధ రీతిలో వారికి తిండీ బట్టా అందించడం అనేది మీపై వారికి ఉన్న హక్కు.

ఇంకా, మీ కోసం దేన్నయితే వదిలి వెళుతున్నానో దాన్ని మీరు గనక దృఢంగా పట్టుకొని ఉంటే ఇక మీదట మీరు ఏమాత్రం మార్గాన్ని తప్పలేరు. అది అల్లాహ్ గ్రంథం.

ప్రజలారా! గుర్తుంచుకోండి! నా తరువాత మరే ప్రవక్త ఉండడు. అలాగే నా తరువాత మరే సమాజమూ లేదు. కాబట్టి మీరు మీ ప్రభువును ఆరాధించండి. అయిదు పూటలా నమాజు చేయండి. రమజాన్ మాసంలో రోజా వ్రతాన్ని పాటించండి. మనస్పూర్తిగా జకాత్ చెల్లించండి. మీ ప్రభువు గృహ (కాబా) హజ్ చేయండి మరియు మీ పాలకులను విధేయించండి. అలా చేస్తే మీ ప్రభువు యొక్క స్వర్గంలో ప్రవేశిస్తారు. [6]

ఇంకా, నా గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏమంటారు? దానికి సహాబా (రదియల్లాహు అన్హుమ్), “మీరు ధర్మాన్ని మాకు అందించారు, సందేశ ప్రచారం చేశారు. ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి దాని హక్కును నిర్వర్తించారు” అన్నారు. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తన చూపుడు వ్రేలిని ఆకాశం వైపునకు ఎత్తి దాన్ని ప్రజల వైపునకు వంచుతూ ‘ఓ అల్లాహ్ దీనికి నీవే సాక్షివి’ అని మూడు మార్లు పలికారు.[7]

[4] ఇబ్నె హిషామ్ -2/603
[5] సహీహ్ ముస్లిమ్ – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి హజ్ అధ్యాయం – 1/397.
[6] ఇబ్ను మాజా; ఇబ్ను అసాకర్; రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/263.

[7] సహీహ్ ముస్లిమ్ – 1/397

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పలుకుల్ని రబీయా బిన్ ఉమయ్యా బిన్ ఖల్ఫ్ ఉచ్ఛస్వరంతో ప్రజలకు వినిపించనారంభించారు.[8] ప్రసంగం పూర్తి చేసిన తరువాత అల్లాహ్ ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

అల్ యౌమ అక్-మల్తు లకుం దీనుకుమ్. వ అత్-మంతు అలైకుం నిఇమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా.”(5 : 3)

(ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. నాపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లామ్ ను మీ ధర్మంగా అంగీకరించాను.)

[8] ఇబ్నె హిషామ్ -2/605

[9]. బుఖారి, ఇబ్నె ఉమర్ గారి ఉల్లేఖనం. చూడండి, రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/265

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ ఆయత్ ను విన్నంతనే దుఃఖించనారంభించారు. మీరెందుకు రోదిస్తున్నారని అడుగగా, “పరిపూర్ణత తరువాత మిగిలేది లోపమే కదా!” అని బదులిచ్చారు ఆయన.[9]

ప్రసంగం తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ పలికి నమాజు కోసం ఇఖామత్ కూడా పలికారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జుహ్ర్ నమాజు చేయించారు. ఆ తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) మరోసారి ఇఖామత్ పలుకగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అస్ర్ నమాజు కూడా చేయించారు. ఈ రెండు నమాజుల మధ్యకాలంలో మరే నమాజు చేయలేదు. ఆ తరువాత వాహనమెక్కి తాము విడిది చేసిన చోటికి వెళ్ళిపోయారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). తన ఒంటె కస్వా పొట్టను బండరాళ్ళ వైపునకు మళ్ళించి కూర్చోబెట్టారు. ‘జబ్లే ముషాత్’ (కాలినడకన వెళ్ళేవారి మార్గంలో ఉన్న మట్టి తిన్నె) ను ముందు ఉండేటట్లు చూసి తన ముఖాన్ని కాబాకు అభిముఖంగా చేసి అక్కడనే ఉండిపోయారు. ప్రొద్దుగ్రుంకుతూ, బాగా ఎరుపెక్కి అస్తమించే వరకు వేచి చూశారు.

సూర్యబింబం పూర్తిగా మటుమాయమైపోగానే హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు)ను తన ఒంటె పై వెనుక కూర్చోబెట్టుకొని బయలుదేరి ‘ముజ్ దల్ఫా’కు వచ్చేశారు. ముజ్ దల్ఫాలో మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ఒకే అజాన్ మరియు రెండు ఇఖామత్ లతో చేశారు. ఆ రెండు నమాజుల మధ్యలో ఎలాంటి నఫిల్ నమాజు చేయలేదు. ఉషోదయం వరకు అలా మేనువాల్చారు. తెల్లవారుతూ ఉండగా అజాన్ కాగానే ఇఖామత్ చెప్పి ఫజ్ర్ నమాజ్ చేశారు. పిదప కస్వాపై ఎక్కి ‘మష్ అరిల్ హరామ్’కు వెళ్ళిపోయారు. అక్కడ ఖిబ్లా దిశగా (కాబాభి ముఖంగా) నిలబడి దుఆ చేశారు. ఆయన ఏకత్వం, ఔన్నత్యం గురించి ప్రస్తుతించారు. అలా ఇక్కడా బాగా తెల్లవారిపోయిన వరకు అలా నిలబడి అల్లాహ్ ను ప్రస్తుతిస్తూనే ఉండిపోయారు. సూర్యోదయం అయ్యే ముందు ‘మినా’కు బయలుదేరారు. ఈసారి హజ్రత్ ఫజ్ల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను తన వెనుకగా ఎక్కించుకోవడం జరిగింది. ‘బత్నే ముహస్సిర్’కు చేరగా తన వాహన వేగాన్ని కొంత పెంచి పరుగెత్తించారు.

జమ్రయె కుబ్రాకు వెళ్ళే మార్గాన్ని అనుసరించి అక్కడికి చేరుకున్నారు – ఆ కాలంలో అక్కడ ఓ చెట్టు ఉండేది. ‘జమ్రయె కుబ్రా’ ఆ చెట్టు పేరుతోనే గుర్తించబడేది. ఇదే కాకుండా జమ్రయె కుబ్రాను జమ్రయె అక్బా మరియు జమ్రయె ఊలాగా కూడా పిలుస్తారు – అక్కడికి చేరిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జమ్రయె కుబ్రా పై ఏడు గులకరాళ్ళను విసిరారు. ఒక్కో గులకరాయి విసురుతూ తక్బీర్ (అల్లాహు అక్బర్) అని పలికారు. అవి రెండు వ్రేళ్ళతో పట్టి విసరేటంత చిన్నవి. ఈ గులకరాళ్ళను ఆయన బత్నె వాదీలో నిలబడి విసిరారు.

ఆ తరువాత బలి స్థానానికి వెళ్ళి తన చేత్తో 63 ఒంటెల్ని జిబహ్ చేశారు. తక్కిన ఒంటెలను జిబహ్ చేయమని హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)కి అప్పగించారు. ఆయన మిగిలిపోయిన 37 ఒంటెల్ని జిబహ్ చేయడం జరిగింది. ఇలా ఖుర్బానీ ఇచ్చిన ఒంటెల సంఖ్య మొత్తం నూరు అయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)ను కూడా తన హదీ (ఖుర్బానీ)లో చేర్చుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం మేరకు ఆ ఖుర్బానీ ఒంటెల మాంసం నుండి ఒక్కో ముక్కను కోసి వండడం జరిగింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు) ఆ వండిన మాంసాన్ని కొంత భుజించి దాని పులుసును కూడా త్రాగారు.

ఖుర్బానీ అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటెనెక్కి మక్కాకు బయలుదేరారు. బైతుల్లాహ్ (కాబా గృహం) తవాఫ్ (ప్రదక్షిణ) చేశారు – దీన్ని తవాఫె ఇఫదః అంటారు – మక్కాలోనే జొహ్ర్ నమాజు చేశారు. పిదప (జమ్ జమ్ చెలమ) దగ్గర ఉన్న బనూ అబ్దుల్ ముత్తలిబ్ వారి దగ్గరకు వెళ్ళారు. వారు హాజీలకు జమ్ జమ్ నీరు త్రాగిస్తున్నారప్పుడు. వారిని చూసి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “బనూ అబ్దుల్ ముత్తలిబ్! మీరు నీళ్ళు తోడుతూనే ఉండండి. నీరు త్రాగించే ఈ కార్యంలో ప్రజలు మిమ్మల్ని మించిపోతారనే భయమే లేకపోతే నేను కూడా మీతోపాటే వచ్చి నీళ్ళు తోడేవాణ్ణి” అని సెలవిచ్చారు – అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి అనుచరగణం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను నీళ్ళు తోడుతూ చూసి ప్రతివాడు ముందుకెళ్ళి నీటిని తోడడానికి ప్రయత్నం చేసేవాడు. ఇలా హాజీలకు నీరు త్రాగించే హోదా, గౌరవం ఏదైతే బనూ అబ్దుల్ ముత్తలిబ్ కు దక్కిందో, ఆ వ్యవస్థ కాస్తా ఛిన్నాభిన్నమైపోయేది అని అర్థం – బనూ అబ్దుల్ ముత్తలిబ్ జమ్ జమ్ బావి నుండి ఓ బొక్కెన నీటిని తోడి ఇవ్వగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందులో నుండి తనవితీరా నీరు త్రాగారు.” [10]

ఆ రోజు యౌమున్నహ్ర్. అంటే జిల్ హిజ్జా పదవ తేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ రోజు ప్రొద్దెక్కిన తరువాత (చాష్త్ సమయం) ఓ ఖుత్బా (ప్రసంగం) ఇచ్చారు. ప్రసంగించేటప్పుడు ఆయన కంచర గాడిద (ఖచ్చర్) నెక్కి ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలను హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు), సహాబా (రదియల్లాహు అన్హుమ్) లకు వినబడేటట్లు బిగ్గరగా చెబుతున్నారు. సహాబా( (రదియల్లాహు అన్హుమ్)లు ఆ సమయాన కొందరు నిలబడి, మరికొందరు కూర్చుని వింటూ ఉన్నారు.” [11] ప్రవక్త శ్రీ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రోజు ప్రసంగం లోనూ, నిన్నటి ఎన్నో మాటలను వల్లించారు. సహీహ్ బుఖారి మరియు సహీహ్ ముస్లిమ్ గ్రంథాల్లో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం ఉంది. ఆయన (రదియల్లాహు అన్హు), యౌమున్నహ్ర్ (పదవ జిల్ హిజ్జా) నాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రసంగించారని చెప్పారు:

“కాలం పరిభ్రమిస్తూ, మళ్ళీ అల్లాహ్ భూమ్యాకాశాలు సృజించిన ఈ రోజుకు తిరిగివచ్చింది. సంవత్సరానికి పన్నెండు నెలలు. ఈ పన్నెండు నెలల్లో నాల్గు నెలలు హరామ్ నెలలు. మూడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వచ్చేవి. అంటే జిల్ ఖాదా, జిల్ హిజ్జా మరియు ముహర్రం. ఇంకొకటి రజబె ముజర్. అది జమాదిల్ ఉఖ్రా మరియు షాబాన్ నెలలకు నడుమన ఉన్న నెల.”

ఇంకా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఇది ఏ మాసం?” అని అడిగారు. మేము జవాబుగా, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కే బాగా తెలుసు” అన్నాం. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొంచెం సేపు మౌనం పాటించారు. మేము, ఈ నెలకు ఆయన మరేదైనా పేరు పెట్టనున్నారేమో అని అనుకున్నాం. కాని ఆ తరువాత ఆయన తిరిగి, “ఇది జిల్ హిజ్జా మాసం కాదా?” అని అడిగారు. “అవును. ఎందుకు కాదు” అన్నాం మేము. ఆయన మళ్ళీ, “ఇది ఏ నగరం?” అని ప్రశ్నించారు. మేము, “అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు బాగా తెలుసు.” అని సమాధానమివ్వగా, ఆయన మళ్ళీ మౌనం వహించారు. మేము, ఆ మౌనాన్ని చూసి ఈ నగరానికి. మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగా, తమ మౌనాన్ని వీడి, “ఇది బల్దహ్ (మక్కా) కాదా?” అని ప్రశ్నిం చారు. “ఔను. తప్పకుండా” అని సమాధానమిచ్చాం మేము.

“సరే, ఈ రోజు ఏ రోజు?” అని అడిగారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం).

“అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే బాగా తెలుసు” అన్నాం మేము.

మా సమాధానం విన్న ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తిరిగి మౌనం వహించారు. మౌనాన్ని చూసి, ఈ రోజుకు మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగానే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఈ రోజు యౌమున్నహ్ర్ (ఖుర్బానీ రోజు అంటే జిల్ హిజ్జా పదవ తారీకు) కాదా?” అని అడిగారు.

“ఔను. ఎందుకు కాదు” అని అన్నాం మేము. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు:

“సరే వినండి, మీ ఈ నగరం, మీ ఈ నెల మరియు మీ ఈ రోజు ఎలా నిషిద్ధం (హరాం) గావించబడిందో, అలానే మీ రక్తం, మీ సంపద, మీ మానం పరస్పరం ఒకరిపై ఒకరికి నిషిద్ధం గావించబడ్డాయి.

మీరు అతి త్వరలోనే మీ ప్రభువును చేరుకుంటారు. ఆయన మిమ్మల్ని మీ కర్మలను గురించి అడుగుతాడు. కాబట్టి చూడండి! నా తరువాత ఒకరి మెడలను మరొకరు నరుక్కునేలా ధర్మభ్రష్టులు కాకండి. నేను దైవసందేశాన్ని మీకు అందించి నా విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకున్నానా? చెప్పండి” అని అడిగారు.

సహాబాలందరూ ముక్తకంఠంతో ‘అవును’ అని పలికారు.

అప్పుడు ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఓ అల్లాహ్! నీవే సాక్షి! అంటూ, ఎవరైతే ఇక్కడ హాజరుగా ఉన్నారో (ఈ మాటలను) హాజరుగా లేనివారికి అందించాలి. ఎందుకంటే, ఎవరికైతే (ఈ మాటలు) అందించడం జరుగుతుందో ప్రస్తుతం కొందరు (హాజరుగా) వినేవారికంటే నా ఈ మాటల పరమార్థాన్ని తెలుసుకోగలరు.” [12]

మరో ఉల్లేఖనంలో ఈ ఖుత్బాలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చి నట్లుంది:

“ఏ నేరం చేసినవాడైనా తనకు తాను తప్ప మరొకరికి నేరంచేయడనే విషయాన్ని గుర్తించండి (అంటే ఆ నేరం చేసినందుకు మరొకరు కాకుండా స్వయంగా తానే ఆ నేరం క్రింద పట్టుబడతాడని అర్థం). గుర్తుంచుకోండి! ఏ నేరగాడు అయినా తన కుమారుని పైగాని లేదా ఏ కుమారుడైనా తన తండ్రి పైగాని నేరం చేయడు (అంటే, తండ్రి చేసిన నేరానికి కుమారుణ్ణిగాని, కుమారుడు చేసిన నేరానికి తండ్రినిగాని పట్టుకోవడం జరగదు అని). జ్ఞాపకముంచుకోండి! షైతాన్ ఇప్పుడు, మీ ఈ నగరంలో ఎవ్వరూ అతణ్ణి పూజించేవారు లేరు గనుక నిరాశకు లోనైపోయాడు. ఏ కర్మలనైతే మీరు తుచ్ఛమైనవిగా నీచమైనవిగా తలుస్తున్నారో ఆ కర్మలలోనే అతణ్ణి మీరు విధేయించడం జరుగుతుంది. వాటి ద్వారానే అతడు సంతుష్టుడవుతూ ఉంటాడు.” [13] (అంటే ఎలాంటి ప్రాధాన్యత లేని విషయాల్లో వారు అతణ్ణి అనుసరిస్తారు అని అర్థం.)

[10] ముస్లిమ్- అధ్యాయం , ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి హజ్ – 1/397 – 400.
[11] అబూ దావూద్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఖుత్బాల అధ్యాయం – 1/270.

[12] సహీహ్ బుఖారి- మినాలో చేసిన ఖుత్బా అధ్యాయం-1/234.
[13] తిర్మిజీ-2/38, 135; ఇబ్ను మాజా, కితాబుల్ హజ్ మిష్కాత్-1/234.

ఆ ప్రసంగం అయిన తరువాత ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) అయ్యామె తష్రీక్ (11, 12, 13 జిల్ హిజ్జా తేదీలు) లో మినాలోనే ఉండిపోయారు. ఈ మూడు రోజుల్లో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘హజ్ మనాసిక్’ను (హజ్ లో నిర్వర్తించవలసిన పనులను) కూడా ఆచరించారు. అదేకాకుండా ప్రజలకు ఇస్లాం ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలను గురించి బోధిస్తూ దైవాన్ని ప్రస్తుతించారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) నిర్వహించిన ఖుర్బానీ ఆచారాన్ని నెలకొల్పుతూ షిర్క్ కు సంబంధించిన గురుతులన్నింటినీ నామరూపాల్లేకుండా చెరిపివేశారు. ‘అయ్యామె తష్రీక్’లో ఓ రోజు ప్రసంగించారు కూడా. ‘సునన్ అబూ దావూద్’ గ్రంథంలో ఉటంకించిన ఓ ఉల్లేఖనంలో, హజ్రత్ సరాఅ బిన్తె నిభాన్ (రదియల్లాహు అన్హా) గారి కథనం ఇలా ఉంది:

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘రఊస్’[14] రోజున ఖుత్బానిస్తూ మాకు ఇలా బోధించారు: “ఈ దినం అయ్యామె తష్రీక్ లోని మధ్య రోజు” [15] అని అన్నారు.

నేటి ఖుత్బా కూడా నిన్నటి (యౌమున్నహ్ర్ ) ఖుత్బాలాంటిదే. ఇది నస్ర్ అధ్యాయం అవతరణ తరువాత ఇచ్చిన ఖుత్బా.

అయ్యామె తష్రీక్ అయిపోయిన తరువాత మరునాడు ‘యౌమున్నఫ్ర్’ అంటే 13 జిల్ హిజ్జా రోజున ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) మినా నుండి బయలు దేరారు. వాదియె అబ్తహాలో నివసించే ‘ఖైఫ్ బనీ కనానా’ వారి దగ్గర ఆగి సేద తీర్చుకున్నారు. మిగిలిన ఆ పగలు, రాత్రి కూడా అక్కడనే గడిపేశారు. అక్కడే జొహ్ర్, అస్ర్, మగ్రిబ్ , ఇషా నమాజులు చేశారు. అయితే ఇషా నమాజు తరువాత కొంచెం సేపు నిద్రించి లేచి మళ్ళీ బైతుల్లాహ్ కు బయలు దేరారు. అక్కడికి చేరి ‘తవాఫె విదా’ (కాబా గృహపు చివరి తవాఫ్) చేశారు.

ఇప్పుడిక హజ్ మనాసిక్ (హలో ఆచరించవలసిన ఆచారాలు) పూర్తి చేసుకొని తమ వాహనాన్ని మదీనా వైపునకు మరల్చి బయలుదేరారు. మదీనాకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునే ఉద్దేశ్యంతో కాకుండా, ఇప్పుడు అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలో తిరిగి ఓ క్రొత్త కృషికి నాంది పలకడానికే ఆ ప్రస్థానం. ” [16]

[16] హజ్జతుల్ విదా వివరాల కోసం ఈ గ్రంథాలను చూడండి: సహీ బుఖారి- కితాబుల్ మనాసిక్, సంపుటి 1, సంపుటి-2/631; సహీహ్ ముస్లిమ్ – బాబుల్ హజ్జతున్నబీ (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఫత్ హుల్ బారి – సంపుటం 3, షరహ్ కితాబుల్ మనాసిక్ మరియు సంపుటం-8/103 – 110; ఇబ్నె హిషామ్ 2/601 – 605; జాదుల్ ముఆద్ 1/196, 218 – 240

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం) – షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి [పుస్తకం]