దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలు | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/prophets-character
[PDF [27 పేజీలు]

ఖుత్బాయందలి ముఖ్యాంశాలు: 

  • (1) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాల గురించి ఖురాన్ మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం. 
  • (2) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి అనేక మంది సహాబాల సాక్ష్యం. 
  • (3) అత్యుత్తమ గుణగణాల నమూనాలు. 

ఇస్లామీయ సహోదరులారా!  నేటి జుమా ఖుత్బా యొక్క అంశం – “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలు”. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల్ని చర్చించే ముందు మనమందరం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అవడంతో పాటు దైవప్రవక్త లందరికీ నాయకులు (ఇమామ్). ప్రవక్త పాలనా పోషణలు స్వయంగా అల్లాహ్ చూస్తాడు. ఇలా అతణ్ణి, నిత్యం పరిశుద్ధం చేస్తూ గుణగణాల్లో, నైతికతలో అందరికన్నా ఉత్తముడిగా, ఆదర్శవంతునిగా తీర్చిదిద్దుతాడు. ప్రవక్త సంరక్షకుడు స్వయానా అల్లాహ్ కనుక దివ్య ఖురాన్లో రెండు విషయాలపై ఒట్టేసి మరీ ఆయన ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి సాక్ష్యమిచ్చాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“నూన్- కలము సాక్షిగా! వారు (దైవదూతలు) వ్రాసే సాక్షిగా! (ఓ ముహమ్మద్)! నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కాదు.  నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో వున్నావు”. (ఖలమ్ : 1-4) 

ప్రవక్త ఎల్లప్పుడూ దైవ వాణి (వహీ)ని అనుసరిస్తాడు. కనుక ఆ దైవవాణే వాస్తవానికి అతని నైతికత, గుణగణాలు అయివుంటాయి. అందుకే ఓ సారి ఆయెషా (రజి అల్లాహు అన్హతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల గురించి అడగ్గా ఆమె జవాబిస్తూ – ఆయన గుణగణాలు స్వయానా దివ్య ఖురానే అని అన్నారు. (ముస్నద్ అహ్మద్ – సహీఉల్ అర్నావూత్) 

అంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దివ్య ఖురానుకు ఆచరణా ప్రతిబింబము అన్నమాట. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల సాక్ష్యం కేవలం ఖురానులోనే కాదు, మునపటి ఆకాశ గ్రంథాలలో కూడా లభ్యమై వుంది. 

అతా బిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం: “నేనొక సారి అబ్దుల్లా బిన్ అమ్ర్  బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ను కలిసి ఆయనతో – తౌరాత్ లో వివరించబడ్డ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలను గూర్చి వివరించండి- అని అడిగాను. ఆయన జవాబిస్తూ – సరే, అల్లాహ్ సాక్షి! దివ్య ఖురానులో వివరించబడ్డ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొన్ని గుణగణాలే తౌరాత్ లోనూ వివరించబడ్డాయి. 

దివ్య ఖురాన్లో ఇలా వుంది: ‘ఓ ప్రవక్తా! మేము నిన్ను సాక్షిగా, శుభవార్తాహరుడిగా, భయపెట్టేవాడిగా చేసి పంపాము.’ తౌరాత్ లో కూడా ఈ గుణగణాలు వివరించబడ్డాయి. వీటితో పాటు తౌరాత్ లో ఇంకా ఆయన అరబ్బుల కోసం కోటగా వుంటారని, ఆయన నా(అల్లాహ్) దాసులు మరియు ప్రవక్త అని, ఆయన పేరు ‘ముతవక్కల్’ (అల్లాహ్ పై నమ్మకం వుంచేవాడు) అని నేను పెట్టాను – అని వుంది. ఇంకా ఆయన గుణగణాల్లో ఇవి కూడా వివరించబడ్డాయి – ఆయన దుర్గుణులు, కఠినులు కారు మరియు బజార్లలో గొంతెత్తి సంభాషించరు. చెడును చెడుతో సమాధానం ఇవ్వకుండా, దానిని ఉపేక్షించి క్షమిస్తారు అని వివరించారు. (బుఖారీ : 4838) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలను గూర్చి దివ్య ఖురాను మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం తర్వాత మరి కొందరి సాక్ష్యం కూడా వినండి! 

ఖదీజా (రజి అల్లాహు అన్ష) సాక్ష్యం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)పై మొదటి వహీ (దైవ వాణి) అవతరించినప్పుడు ఆయన ఎంతగానో గాబరాపడి త్వరత్వరగా ఇంటికి చేరుకొని-నాకైతే నా ప్రాణానికి కూడా ముప్పు వుందనిపిస్తోంది అని అనగానే ఖదీజా (రజి అల్లాహు అన్హ) (ఆయనకు ధైర్యం చెబుతూ) ఇలా అన్నారు – “అలా ఎప్పటికీ జరగదు – మీకు శుభవార్తె. అల్లాహ్ సాక్షి ! అల్లాహ్ మిమ్మల్ని అవమానం పాలు చేయడు, అల్లాహ్ సాక్షి! మీరు బంధుత్వ సంబంధాలు నెలకొల్పుతారు, సత్యం పలుకుతారు, ఇతరుల భారాన్ని మోస్తారు, అగత్యం కలవారికి సహాయపడతారు, ఆతిథ్యమిస్తారు మరియు సత్యవంతులకు తోడ్పడతారు.” (బుఖారీ, కితాబ్ బద్ యల్ వహీ, ముస్లిం : 16) 

అవిశ్వాస ఖురైషీయుల సాక్ష్యం 

దైవ దౌత్య బాధ్యత లభించడానికి పూర్వం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రజలలో ‘సాదిఖుల్ అమీన్” (సత్యసంధులు మరియు అమానతుదారులు) అని ప్రసిద్ధిగాంచి వున్నారు. అంటే – ప్రజలు ఆయనను – ఎల్లప్పుడూ సత్యం పలికే వారు మరియు అమానతులను కాపాడేవారు అని – స్వీకరించి వున్నారు. 

తదుపరి దైవ దౌత్య బాధ్యత ఇవ్వబడ్డాక, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)పై – ‘మీ దగ్గరి బంధువులను భయపెట్టు’ అన్న ఆయతు అవతరించాక, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సఫా కొండపైకెక్కి ఖురైషీయులను పిలిచారు. వాళ్ళు అక్కడికి చేరుకోగానే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి నుద్దేశించి ఇలా అడిగారు – “ఈ కొండ వెనుక వైపు నుండి ఒక అశ్విక దళం మీపై దండెత్తడానికి సిద్ధంగా వుందని నేనొకవేళ మీతో చెబితే దాన్ని మీరు నమ్ముతారా? దీనిపై వారంతా ముక్త కంఠంతో – “మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని సత్యం పలుకుతూనే చూశాము” – అని అన్నారు. (బుఖారీ : 4770) 

హుదైబియా ఒప్పందం తరుణంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రోమ్ చక్రవర్తి (హెరిక్లెస్) కి ఇస్లాం స్వీకరించమని ఆహ్వానిస్తూ లేఖ వ్రాశారు. ఆ సమయంలో అబూ సుఫ్యాన్ బిన్ హర్మ్ నాయకత్వంలో  ఖురైషీయుల ఒక సమూహము రోమ్ లో వుంది. హెరిక్లెస్ రాజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లేఖను చదవడానికి ముందుగా అబూ సుఫ్యాన్ మరియు ఆయన సమూహానికి చెందిన ఇతర వ్యక్తులను తన దర్బారుకు పిలిపించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి కొన్ని ప్రశ్నలు వేశాడు. అబూ సుఫ్యాన్ అప్పటి వరకు ముస్లిం కాకపోయినప్పటికీ ఎంతో నిజాయితీగా హెరిక్లిస్ రాజుకు జవాబిచ్చారు. 

అతను అడిగిన ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటంటే – దైవ దౌత్య ప్రకటనకు పూర్వం మీరెప్పుడైనా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అసత్యమాడినట్లు, ఆయనపై నింద మోపారా? అని. దీనికి అబూ సుఫ్యాన్ ‘లేదు’ అని జవాబిచ్చారు. తదుపరి అతను-ఆయన (దైవప్రవక్త) మీకు ఏ విషయాల గురించి ఆజ్ఞాపిస్తు న్నారు? అని అడిగాడు. అబూ సుఫ్యాన్ జవాబిస్తూ – ఆయన మమ్మల్ని ఒకే అల్లాహ్ ను ఆరాధించమని, ఆయనకు భాగస్వాములు కల్పించవద్దని, పూర్వీకుల (అజ్ఞానపు) మాటలను త్యజించమని ఆజ్ఞాపిస్తున్నారు. ఇంకా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు నమాజు చదవమని, సత్యం పలకమని, శీలాన్ని కాపాడుకోమని మరియు బంధుత్వ సంబంధాలు కాపాడుకోమని ఆజ్ఞాపి స్తున్నారు. 

అన్ని ప్రశ్నలకు జవాబులు విన్న తర్వాత వాటిని విశ్లేషిస్తూ హెరిక్లెస్ ఇలా వ్యాఖ్యానించాడు – “దైవ దౌత్య ప్రకటనకు పూర్వం అతను అసత్యమాడలేదు కనుక, ప్రజల విషయంలో అసత్యమాడని వారు అల్లాహ్ విషయంలో అసత్య మాడలేరు అన్న నమ్మకం నాకుంది. ఇక మీరు చెప్పినట్లు – ఆయన మీకు ఒకే అల్లాహ్ ను ఆరాధించమని, ఆయనకు భాగస్వాములు కల్పించవద్దని, ఇంకా మీకు నమాజ్ చదవమని, సత్యం పలకమని, శీలాన్ని కాపాడుకోమని మరియు బంధుత్వ సంబంధాలు కాపాడుకోమని ఆజ్ఞాపిస్తున్నారని మీరంటున్నారే – ఒకవేళ ఇదే కనుక సత్యం అయితే, అతి త్వరలోనే ఆయన తప్పకుండా ఈ రాచరికపు సింహాసనాన్ని అధిష్టించడం ఖాయం. అలాంటి వ్యక్తి త్వరలోనే రాబోతున్నాడని నాకు నమ్మకం వుండేది. కానీ, ఆయన మీలో అవతరిస్తారని నాకు తెలియదు. నేనొక వేళ ఆయనను చేరుకోగలిగితే దాని కోసం తప్పకుండా ప్రయత్నిస్తాను మరియు ఒకవేళ ఆయన్ను చేరుకొంటే ఆయన పాదాలు కడిగి శుభ్రం చేస్తాను”. (బుఖారీ: 7, ముస్లిం : 1773) 

ఇదే విధంగా సాయిబ్ అల్ మజ్రూమీ (రదియల్లాహు అన్హు) కథనం: నేనొక సారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి రాగా ప్రజలు నన్ను పొగుడుతూ  నా గురించి చర్చిండం మొదలు పెట్టారు. దీనికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట్లాడుతూ- ‘ఇతని గురించి మీ కన్నా నాకు బాగా తెలుసు’ అని అన్నారు. అప్పుడు నేను – “నా తల్లిదండ్రులు మీకు అర్పితమవుగాక! మీరు సత్యం పలికారు. మీరు (అజ్ఞాన కాలంలో) నాతో పాటు (వ్యాపారంలో) పాలు పంచుకునేవారు. మీరు చాలా మంచి భాగస్వామి. మీరు నన్ను వ్యతిరేకించే వారు కూడా కాదు, నాతో గొడవపడేవారు కూడా కాదు‘” అని అన్నారు. (అబూదావూద్ :4836, ఇబ్నెమాజ : 2287,సహీహ్ – అల్ బానీ) 

ఇమామ్ ఖత్తాబీ ఈ హదీసుపై వ్యాఖ్యానిస్తూ ఇలా వివరించారు: హదీసులో సాయిబ్ (రదియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క వ్యవహారాల్లో మెతక వైఖరి మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ సుగుణాలను ప్రస్తావించారు. (ముఆలిముస్సునన్) 

అబ్దుల్లా బిన్ సలామ్ (రదియల్లాహు అన్హు) సాక్ష్యం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్ చేసి మదీనా విచ్చేసి నప్పుడు అబ్దుల్లా బిన్ సలామ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన – (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలకు ఇలా బోధిస్తూ వున్నారు. “మీరు సలాం ను వ్యాపింపజేయండి, అన్నం తినిపించండి, బంధుత్వ సత్సంబంధాలు నెలకొల్పండి మరియు ప్రజలు నిద్రపోయే సమయంలో (రాత్రి) మీరు నమాజు చేయండి- ఇలా శాంతియుతంగా మీరు స్వర్గంలోకి ప్రవేశించగలుగుతారు”.  (తిర్మిజీ : 2485, ఇబ్నె మాజ : 1334, సహీహ్ – అల్ బానీ) 

అనస్ (రదియల్లాహు అన్హు) సాక్ష్యం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు 10 సం||లు సేవ చేసిన అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పుడూ కోపగించుకొనేవారు కాదు, పిచ్చిపిచ్చిగా మాట్లాడేవారు కాదు మరియు  శపించేవారు కూడా కాదు. ఎప్పుడైనా ఎవరినైనా కోప్పడాల్సి వస్తే కేవలం ఇలా అనేవారు – ఇతనికేమయ్యింది? ఇతని మొహానికి మన్నుతగల!” (బుఖారీ : 6031) 

అలాగే ఆయన ఇలా కూడా సెలవిచ్చారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరి కాన్నా ఉత్తమమైన గుణగణాలు కలిగి వున్నారు, ఒక రోజు నన్ను ఏదో పని నిమిత్తం పురమాయించగా నేను లోలోపల ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞను శిరసావహించి వెళ్ళడానికి నిశ్చయించుకొని, పైకి మాత్రం నేను వెళ్ళనని చెప్పేశాను. ఆ తర్వాత నేను వెళుతూ వుండగా దారిలో కొంత మంది పిల్లలు ఆడుతూ కనిపించారు. దీనితో నేను కూడా వారితో కలిసిపోయాను. అకస్మాత్తుగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడికి విచ్చేసి వెనుక వైపు నుండి నా మెడను పట్టుకున్నారు. నేను ఆయన వైపు తిరిగి చూస్తే ఆయన నవ్వుతూ – ప్రియమైన ఓ అనస్ ! నేను ఆజ్ఞాపించిన వద్దకు నీవు వెళ్ళావా? అని అడిగారు. నేను జవాబిస్తూ – ఇప్పుడే వెళుతున్నాను ఓ దైవ ప్రవక్తా! అని చెప్పి అక్కణ్ణుండి బయలుదేరాను. (ముస్లిం – కితాబుల్ ఫజాయెల్) 

అబ్దుల్లా బిన్ అమ్ర్  (రదియల్లాహు అన్హు) సాక్ష్యం 

అబ్దుల్లా బిన్ అమ్ర్  (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ్యర్థ సంభాషణ చేసేవారు కాదు, దాని కోసం ప్రయత్నించే వారు కూడా కాదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెవిచ్చేవారు మీలో సద్గుణాల రీత్యా ఉత్తముడెవరో అతనే అందరికన్నా శ్రేష్ఠుడు. (బుఖారీ: 6035, ముస్లిం: 2321) 

సఫియా బిస్త్ హై (రజి అల్లాహు అన్ష) సాక్ష్యం 

ఈమె దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియ సతీమణుల్లో ఒకరు మరియు విశ్వాసుల మాతృమూర్తి. తను ఇలా తెలియజేశారు: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా ఎక్కువ సద్గుణ సంపన్నుణ్ణి చూడలేదు. (హాఫిజ్ ఇబ్నె హజర్ ఫతహుల్ బారీ-6/575 నందు ఇలా పేర్కొన్నారు-తబ్రానీ తన ఔసత్ నందు దీనిని విశ్లేషించి హసన్ గా ఖరారు చేశారు) 

ఇలా, దివ్య ఖురాన్ మరియు తౌరాత్ సాక్ష్యాలతో పాటు మేము చర్చించిన సాక్ష్యులలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ప్రేమించే వారూ వున్నారు, ఆయనను ద్వేషించేవారూ వున్నారు, ఆయన ఇంటి వారూ వున్నారు మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సేవకులూ వున్నారు, 

ఇలా అందరూ – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నైతికత, గుణగణాల్లో అత్యున్నత స్థానంలో వున్నారని సాక్ష్యమిచ్చారు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సద్గుణాల్లోని కొన్ని అంశాలు 

(1) దాతృత్వము 

జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎప్పుడైనా ఏ వస్తువు గురించైనా అడిగితే ఆ ప్రశ్నించే వాడిని ఎప్పుడూ ‘కుదరదు’ అని అనలేదు (అంటే నిరాకరించలేదు). (బుఖారీ : 6034, ముస్లిం : 2311)

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఇస్లాం స్వీకరణ” అన్న షరతుపై ఏదడిగినా ఇచ్చేసేవారు. ఒకసారి ఓ వ్యక్తి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు రాగా అతనికి – రెండు కొండల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని నింపగలిగేటన్ని మేకలు ఇచ్చేశారు. తదుపరి ఆ వ్యక్తి తన బస్తీ వాసుల దగ్గరికొచ్చి ఇలా ప్రకటించాడు – ఓ నా బస్తీవాసులారా! మీరంతా ఇస్లాం స్వీకరించండి. ఎందుకంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బీదరికానికి ఏమాత్రం భయడకుండా దానం చేస్తారు. (ముస్లిం : 2312)

అలాగే ఆయన అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా కూడా ఉల్లేఖించారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఏ వస్తువు గురించైనా అడిగితే – ఆయన దానిని ఇచ్చేసే వారు లేదా మౌనం వహించేవారు, (అహ్మద్, ఇబ్నె హిబ్బాన్)

సహీహ్ ముస్లింలో ఇబ్నె షిహాబ్ అజొహరీ ద్వారా ఇలా ఉల్లేఖించబడింది: మక్కా విజయం తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులను వెంటపెట్టుకొని హునైన్ చేరుకున్నారు. అక్కడ అవిశ్వాసులతో జరిగిన యుద్ధం అనంతరం అల్లాహ్ తన ధర్మానికి మరియు ముస్లిములకు ఆధిపత్యాన్ని ప్రసాదించాడు. ఆ రోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సఫ్వాన్ బిన్ ఉమయ్యకు 100 పశువులు ఇచ్చారు. తదుపరి మరో వంద, ఆ తర్వాత మరో వంద ఇచ్చారు. ఇబ్నె షిహాబ్ కథనం: నాతో సయీద్ బిన్ అల్ ముసైబ్ – తనకు సఫ్వాన్ ఇలా చెప్పారని వివరించారు – అల్లాహ్ సాక్షి! దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను నేను అత్యధికంగా ద్వేషించే సమయంలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకింతగా ఇచ్చారు. తదుపరి ఇంకా, ఇంకా యిస్తూనే పోయారు. చివరికి ఆయన నాకు అందరికన్నా ప్రియులైపోయారు. (ముస్లిం : 2313)

సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం): ఓ సారి ఒక స్త్రీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు ఓ దుప్పటి తీసుకొచ్చి – ఓ దైవ ప్రవక్తా ! ఇది మీరు ధరించడానికి అని చెప్పింది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిని స్వీకరించి, ఆయనకు అవసరం ఉన్నందున వెంటనే దానిని తొడుక్కున్నారు. ఆ తర్వాత సహాబాలలో ఓ వ్యక్తి దైవప్రవక్త ఆ దుప్పటి ని ధరించి ఉండటం చూసి ఆయనతో ఓ దైవ ప్రవక్తా!  ఈ దుప్పటి చాలా బాగుంది. దీనిని మీరు నాకు తొడిగించరూ? అని అడిగాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘అలాగే’ అని చెప్పి దుప్పటిని అతనికిచ్చేశారు. తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడి నుంచి వెళ్ళిపోయాక, ఇతర సహాబాలు ఆ వ్యక్తిని దెప్పిపొడుస్తూ – నువ్వు చేసిందేమీ బాగా లేదు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఈ దుప్పటి అవసరం వుంది అన్న విషయం నీకు బాగా తెలుసు, అందుకే ఆయన దానిని స్వీకరించారన్న విషయం కూడా తెలుసు, అయినప్పటికీ నీవు ఆయన దగ్గర అడుక్కున్నావు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఏ వస్తువైనా అడిగితే ఆయన దానిని తన వద్ద వుంచుకోకుండా ఇచ్చేస్తారని నీకు తెలుసుగా! అని అన్నారు, దీనిపై ఆ సహచరుడు – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ దుప్పటిని ధరించి వుండడం చూసి నేను దీనిలో శుభాన్ని ఆశించాను. తద్వారా దీనిని నేను నా కఫన్ వస్త్రం లాగా ఉపయోగించుకోగలనేమో! అని వివరించాడు. (బుఖారీ : 6036) 

ఈ హదీసు ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కేవలం తన అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వస్తువులనే కాదు, తనకు అవసరమున్న వస్తువులను కూడా ఇతరులకు ఇచ్చేసేవారు. 

ఇదండీ! ప్రవక్తలకు నాయకుడైన (ఇమామ్) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సద్గుణం! ఇక మన పరిస్థితి ఎలా వుందంటే – మనకు అవసరమున్న వస్తువులు కాదు సరికదా మన అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వస్తువులను కూడా మనం ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా లేము! 

(2) వినయ విధేయత, అణకువలు

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మానవ సంతతిలో అందరికన్నా శ్రేష్ఠులు మరియు దైవ ప్రవక్తలకు నాయకులు కూడా. ఇంత పెద్ద హెూదాపై వున్నప్పటికీ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో మెత్తని మనస్కులు మరియు మృదుభాషి. 

తన సహాబాలతో కలిసి మెలిసి పోయేవారు. ఎల్లప్పుడూ వారికి దగ్గరగా వుండేవారు. సహాబాలు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)వద్దకు రావాలంటే, ఆపడానికి మధ్యలో ఎవరూ వుండేవారు కాదు. పైగా, ఏ వ్యక్తి అయినా, ఎప్పుడైనా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను నేరుగా కలుసుకోగలగే వాడు.

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఒకసారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర కూర్చుని వుండగా, అదే సమయంలో ఓ దైవ దూత ఆకాశం నుండి (వారి వద్దకు) రావడం చూసి ఇలా అన్నారు – ఈ దైవదూత, తాను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు (భూమి మీదకు) అవతరించలేదు. ఆ దైవ దూత వారి వద్ద కొచ్చి ఇలా పలికాడు – ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! మీరు ‘రాచరికపు ప్రవక్త’ కావాలని కోరుకుంటున్నారా? లేక ‘దాస్యపు ప్రవక్త’ కావాలని కోరుకుంటున్నారా? అని అడిగి రమ్మని అల్లాహ్ నన్ను పంపించాడు. దీనిపై జిబ్రయీల్ (అలైహిస్సలాం) స్పందిస్తూ – (ఓ దైవ ప్రకా!) మీ ప్రభువు కొరకు గౌరవ మర్యాదలను పాటించండి అని హితవు పలికారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – లేదు, నేను దాస్యపు ప్రవక్తగానే వుండాలను కుంటున్నాను అని అన్నారు. (అస్సహీహ లిల్ అల్బానీ: 1002, సహీహ్ అత్తర్ గీబ్ వత్తర్ హీబ్ : 3280) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రార్థించేవారు: -‘ఓ అల్లాహ్! నన్ను బీదవాని గానే బ్రతికించి వుంచు మరియు బీద స్థితిలోనే మృత్యువును ప్రసాదించు, ప్రళయం రోజు బీదవారితోనే నన్ను లేపు’. 

ఒకసారి ఆయెషా (రజి అల్లాహు అన్హ) – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఈ దుఆ పఠిస్తూ వుండడం చూసి – ఇలా ఎందుకు (ప్రార్థిస్తున్నారు)? అని అడిగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ- నిశ్చయంగా వాళ్ళు (బీదవారు) ధనవంతులకన్న 40 సం|| ముందుగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని వివరించారు. తదుపరి ఆయన – ఓ ఆయెషా బీదవారిని ఒట్టి చేతులతో ఎప్పుడూ తిరిగి పంపకు, కనీసం సగం ఖర్జూర పండైనా సరే ఇచ్చి పంపు. ఓ ఆయెషా! నువ్వు బీద వారిని ప్రేమిస్తూ వుండు, వారితో సన్నిహితంగా మెలుగు. ఇలా చేస్తే, ప్రళయం రోజు అల్లాహ్ కూడా నీకు తన సాన్నిహిత్యాన్ని ప్రసాదిస్తాడు. (తిర్మిజీ : 2352 – సహీహ్ లిల్ అల్ బానీ) 

వీటన్నింటి ద్వారా – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలా గౌరవ, మర్యాదలను పాటించేవారో మనకు తెలుస్తుంది. 

అందుకే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) పాటించిన గౌరవ మర్యాదలకు సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను మనమిప్పుడు పరిశీలిద్దాం ! 

సహల్ బిన్ హనీఫ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిస్సహాయ ముస్లిముల దగ్గరికి వచ్చేవారు, వారితో సంభాషించేవారు, వారిలో వ్యాధిగ్రస్తులైన వారిని పరామర్శించేవారు, ఎవరైనా మరణిస్తే జనాజా నమాజు చేసేవారు మరియు వారి అంత్యక్రియలకు కూడా హాజరయ్యేవారు. (అస్సహీహ లిల్ అల్ బానీ: : 2112)

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) పిల్లల మధ్యనుండి వెళ్ళితే వారికి సలాం చేసి ఇలా అనేవారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) కూడా ఇలాగే చేసేవారు. (బుఖారీ : 6247)

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్సారీలను కలుసుకోవడానికి వెళ్ళేవారు. వారి పిల్లలకు సలాం చేసేవారు, వారి తలపై చేతులను నిమిరేవారు, (సహీఉల్ జామ్ : 4947)

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: మదీనాకు  చెందిన బానిసరాళ్ళలో ఒకామె దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికొచ్చేది. ఆయన చేతులను పట్టుకొని తాను కోరిన చోటికి ఆయన – (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తీసుకెళ్ళేది (మరియు ఆయనతో సంభాషించేది). (బుఖారీ : 6072)

అలాగే ఆయన (అనస్ బిన్ మాలిక్) ఈ విధంగా కూడా తెలియజేశారు: మతిస్థిమితం సరిగ్గా లేని ఒక స్త్రీ ఓ సారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి, ఆయనతో – ఓ దైవ ప్రవక్తా! నాకు మీతో ఒక పని వుంది అని చెప్పింది. దీనిపై ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – ఓ ఫలానా స్త్రీ! చూడు! నేను నీ అవసరం తీర్చడానికి గాను, నన్ను ఏ వీధిలోకి తీసుకెళ్ళాలన్నా నిస్సంకోచంగా తీసుకెళ్ళు అని అన్నారు. తదుపరి ఆ స్త్రీతో పాటు బయలుదేరి వెళ్ళి ఆమె అవసరాన్ని తీర్చారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). (ముస్లిం : 2326) 

సునన్ అబూ దావూద్ లో పదాలు ఇలా వున్నాయి: 

ఓ ఉమ్మె ఫలానా! నువ్వు వీధిలోని ఏ మూల కూర్చోవాలన్నా కూర్చొని మాట్లాడు. తద్వారా నేను కూడా నీ దగ్గర కూర్చొని నీ మాటలు వినగలుగుతాను, తదుపరి ఆమె కూర్చొంది. ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా అక్కడే కూర్చొన్నారు. ఆపై ఆ స్త్రీ తన అవసరం గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలియజేసింది. (అబూ దావూద్ : 4818) 

కాస్త ఆలోచించండి! ఆ స్త్రీ మతి స్థిమితం సరిగ్గా లేదు. ఈ కారణంగా సమాజంలో ఆమెకు విలువేమీ లేదు. అయినప్పటికీ, తనకు అవసరం కలిగినప్పుడు నేరుగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చింది. పీ.ఏ గానీ, సెక్రెటరీను గానీ కలిసి అపాయింట్ మెంట్ తీసుకొని వచ్చే విధంగా రాలేదు. (అంటే వీటి అవసరం లేకుండా నేరుగా వచ్చేసింది). ఆ తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఆమెను గౌరవించి, మర్యాదగా ఓ ఉమ్మె ఫలానా! అని సంబోధించి, నిర్భయంగా, నిస్సంకోచంగా తన అవసరాన్ని ఆయన ముందుంచడానికి గాను ఏకాంతంలో ఆయనతో మాట్లాడడానికి అవకాశం కల్పించారు. 

ఇవండీ దైవప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వినయవిధేయతలు మరియు గౌరవ మర్యాదలు! 

మరి ఈ రోజు మన స్థితి ఎలావుందంటే – మనలో ఎవరైనా ఏదైనా సాధారణ సూదాలో కూర్చొని వున్నా సరే, అతను తనకు, తన అవసరం వున్న వారికి మధ్య సెక్రెటరీ వగైరా లాంటి మనుషులను నియమించి వుంచుతాడు. ఆ సెక్రటరీ ఆ అవసరం కలవారిని తన ‘సార్’ గారితో నేరుగా కలవనివ్వడు. గంటల కొద్దీ, కొన్నిసార్లు రోజుల కొద్దీ వేచి చూసిన తర్వాత కలవనిస్తాడు. ఇంకొన్ని సార్లైతే లంచం యిస్తే గానీ సార్ గారిని కలవనివ్వడు. అవసరం కలవారిని వదిలేయండి – ఆ సార్ దగ్గర పని చేసే ఉద్యోగులు సైతం ఆయన ముందు మాట్లాడడానికి భయపడుతూ వుంటారు. 

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాత:కాలపు (ఫజర్) నమాజు ముగించిన తర్వాత మదీనా సేవకులు కుండలలో నీటిని నింపి ఆయన వద్దకు తీసుకొచ్చేవారు. తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (శుభం కోసం) ఆ కుండలలోకి తన చేతులను ముంచేవారు. చలికాలంలో కొన్ని సార్లు నీళ్ళు చాలా చల్లగా వుండేవి. అయినప్పటికీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ కుండల్లో తన చేతిని ముంచేవారు. (ముస్లిం : 2324)

అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నేల మీద కూర్చొనేవారు, నేలపైనే కూర్చొని భుజించేవారు, మేకలను కట్టేసేవారు, యవల(జొ) రొట్టె భుజించే నిమిత్తం ఒక బానిస ఆహ్వానాన్ని సైతం స్వీకరించేవారు. (తబ్రానీ ఫీ మోజమిల్ కబీర్, సహీహ్ అల్ బానీ ఫీ అస్సహీహ : 2125) 

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: సహాబాలకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కన్నా ప్రియమైన వారెవ్వరూ లేరు. అయినప్పటికీ, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూసినప్పుడు వారు నిలబడేవారు కాదు. కారణం తనను చూసి ఇతరులు నిలబడడాన్ని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇష్ట పడరన్న విషయం వారిని తెలుసు. (తిర్మిజీ : 2754, సహీహ్- అల్లానీ) 

ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సద్గుణాలు ఇవి. తనను చూసి ఇతరులు నిలబడడం ఆయనకు అస్సలు ఇష్టముండేది కాదు. 

కానీ, నేడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించే వారిలోని ఏ అధికారి క్రిందనైనా పని చేసే ఉద్యోగులు లేదా అధ్యాపకుని ముందు విద్యార్థులు వారిని చూసి గనక నిలబడక పోతే ఆ “సారు” గారి ముఖం రంగు మారిపోతుంది. తదుపరి ఆ ఉద్యోగులకూ, విద్యార్థులకూ ఇక మూడినట్లే! అంటే, వారిష్టపడేదేమిటంటే – వారిని చూసి ఇతరులు నిలబడాలి మరియు సెల్యూట్ కొట్టాలి. ఎంతో మంది ప్రవర్తనను, ఇలా మార్చి వేసిన ఈ దుర్గుణం నాశనం గాను! మరి చూడబోతే – ఏ వ్యక్తిలోనయినా ఆవగింజంత గర్వమున్నా అతను స్వర్గంలోనికి ప్రహించలేడు అని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చి వున్నారు. 

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా విజయం నాడు మక్కాలోనికి ప్రవేశించేటప్పుడు ఆయనలోని వినయవిధేయతలు, అణకువ ఎంతగా బహిర్గతమయ్యాయంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన వాహనంపై ఎంతగా వంగి కూర్చున్నారంటే – ఆయన గడ్డం జీను (ఒంటె పై ఇద్దరు కూర్చుండుటకు అనుకూలమైన పల్లము)కు తగులుతూ వుంది. (ముస్తద్రక్ హాకిం – సహీహ్) 

అంటే ఆ రోజు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గర్వాతిశయంతో, విజయోత్సాహంతో కాకుండా, ఎంతో వినమ్రతతో, అణకువతో మక్కా లోనికి ప్రవేశించారు. 

(3) కనికరించే మనస్తత్వం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కారుణ్యమూర్తులు, మెత్తని మనస్కులు. ఇతరుల కోసం పరితపించే మనస్తత్వం ఆయనది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“(ఓ ప్రవక్తా!) అల్లాహ్ దయ వల్లనే నీవు వారి యెడల మృదుమనస్కుడ వయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్ళిపోయేవారు. కనుక నీవు వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు. వారి క్షమాపణ కోసం (దైవాన్ని) వేడుకో. కార్య నిర్వహణలో వారిని సంప్రదిస్తూ వుండు.” (ఆలి ఇమ్రాన్ : 159) 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సద్గుణాలకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలు హదీసు గ్రంథాల్లో నిక్షిప్తమై వున్నాయి.

మాలిక్ బిన్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) కథనం: సమవయస్కులైన మేము కొంత మంది యువకులం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి విచ్చేసి ఆయన వద్ద 20 రాత్రిళ్ళు గడిపాం. తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- మేము మా ఇంటి వారిని కలుసుకోవాలని కోరుకుంటున్నామేమో అని భావించి మా ఇంటి వారి గురించి మాతో అడిగారు. మేమంతా ఆయనకు చెప్పేశాము. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో మృదు మనస్కులు, కనికరించే వారు కావడంతో మాతో ఇలా అన్నారు: మీరంతా మీ ఇంటి వారి దగ్గరకు వెళ్ళిపోండి. (మీరు నేర్చుకున్నదంతా) వారిక్కూడా నేర్పించండి. నా ఆజ్ఞలను వారి దాకా చేరవేయండి. నన్నెలాగైతే నమాజు చేస్తూ చూసారో అలాగే మీరు కూడా నమాజు చేయండి. నమాజు సమయం కాగానే మీలో ఒక వ్యక్తి అజాన్ పలకాలి మరియు మీలో పెద్ద వయస్కుడు నమాజు చేయించాలి. (బుఖారీ : 6008, ముస్లిం : 674)

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఓసారి ఓ పల్లెటూరి వ్యక్తి మస్జిద్లోని ఒక మూలలోమూత్ర విసర్జన చేయడం ప్రారంభించ గానే జనాలు అతణ్ణి కొట్టడానికి అతనిపై ఎగబడ్డారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు – అతణ్ణి వదిలేయండి, ఒక బక్కెట్లో నీళ్ళు తెచ్చి అక్కడ కుమ్మరించండి. నిస్సందేహంగా మీ అందరినీ (విషయాలను) తేలిగ్గా చేసేవారుగా చేసి పంపడం జరిగింది. కఠినంగా చేసేవారుగా చేసి కాదు. (బుఖారీ: 6126)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. నేను నమాజు చేయడానికి నిలబడినప్పుడు నా సంకల్పం నమాజును పొడిగించి చదవాలని వుంటుంది. కానీ ఏదైనా పిల్లవాడి ఏడుపు వినగానే నేను నమాజును సంక్షిప్తం చేస్తాను. ఎందుకంటే ఆ పిల్లవాడి ఏడుపు మూలంగా అతని తల్లి ఎంతో వ్యాకుల పడుతుందని నాకు తెలుసు. (బుఖారీ: 709, ముస్లిం : 470) 

అబూ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఓ వ్యక్తి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికొచ్చి ఇలా విన్నవించుకున్నాడు – నేను తెల్లవారు జాము(ఫజర్) నమాజు కోసం ఆలస్యంగా వెళతాను, ఎందుకంటే ఫలానా ఇమాము మాకు నమాజ్ ను ఎంతో పొడుగ్గా చేసి చదివిస్తారు. ఇది విని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంత కోపంతో ఉద్బోధించారంటే అంత కోపంతో ఉద్బోధించడం నేనెప్పుడూ చూడలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు – ప్రజలారా! మీలో (ధర్మంపట్ల) ద్వేష భావం కలిగించేవారు కొందరున్నారు. అందుకే (చెబుతున్నా) మీలో ఎవరైతే నమాజు చదివిస్తారో వారు నమాజును సంక్షిప్తంగా (తేలిగ్గా చేసి) చదివించాలి. ఎందుకంటే నమాజు చదివే వారిలో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు మరియు అత్యవసర పనుల కోసం త్వరగా బయటికెళ్ళే వాళ్ళు వుంటారు. (బుఖారీ : 702, 6110, ముస్లిం: 466) 

గమనిక: నమాజును సంక్షిప్తంగా చేయడమంటే రుకూ, సజాలు త్వరత్వరగా చేయడం ఎంతమాత్రం కాదు. కేవలం ఖురాను పఠనాన్ని సంక్షిప్తం చేయాలి. రుకూ, సజ్దాలు మాత్రం ప్రశాంతంగా చేయాలి. (అనువాదకుడు) 

ముఆవియా బిన్ హర్మ్ సల్మీ (రదియల్లాహు అన్హు) కథనం: నేనొకసారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెనుక నమాజు చేస్తుండగా ఒక వ్యక్తి తుమ్మాడు. నేను ‘యరహముకల్లాహ్’ అని పలికాను, దీంతో జనాలు నా పైపు కోపంగా చూడడం మొదలు పెట్టారు. నేను – మా అమ్మకు నేను కనపడకుండా వుండగాక! మీ అందరికీ ఏమైందీ? ఎందుకలా నా వైపు చూస్తున్నారు? అని అన్నాను. తదుపరి వారంతా తమ తొడలపై కొడుతూ నన్ను నిశ్శబ్దంగా వుండమన్నారు. నేనది గ్రహించి మౌనంగా వుండిపోయాను. తదుపరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజు ముగించారు. నా తల్లిదండ్రులు ఆయనకు సమర్పితమవుగాక! ఆయనకు ముందూ, ఆయన తరువాత కూడా ఆయనలాగా బోధించే వ్యక్తిని నేను చూడలేదు. ఆయన నన్ను ఏమాత్రం కోపగించుకోలేదు, కొట్టలేదు, చెడుగా మాట్లాడలేదు. పైగా ఇలా హితోపదేశం చేసారు – నిస్సందేహంగా నమాజ్ ఎలాంటి ఆరాధన అంటే, దీనిలో ఇతరులతో సంభాషించడం సరైనది కాదు. దీనిలో కేవలం తస్బీహ్, తక్బీర్ మరియు దివ్య ఖురాను పఠనం లు వున్నాయి. (ముస్లిం:537) 

(4) క్షమాగుణం, సహనం 

ప్రియప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) క్షమాగుణాన్ని, సహనాన్ని ఎంత గానో కలిగి వుండేవారు. ఏ వ్యక్తి అయినా ఆయనకు కష్టం కలిగిస్తే దానికి ఆయన ఓర్పు వహించేవారు, కష్టం కలిగించిన వ్యక్తిని మన్నించేవారు. వీటి గురించిన ఎన్నో ఉదాహరణలు వున్నాయి. 

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:నేనొకసారి దైవప్రవక్త – (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో వున్నాను. ఆయన, అంచులు దృఢంగా వున్న ఒక నజ్రానీ దుప్పటి ధరించి వున్నారు. ఇంతలో ఓ పల్లెటూరు వ్యక్తి నేరుగా వచ్చి ఆయన దుప్పటిని పట్టుకొని గట్టిగా లాగాడు. దీనితో (దుప్పటి రాపిడి మూలంగా) ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మెడపై గుర్తులు ఏర్పడ్డాయి. తదుపరి అతను (ఆ పల్లెటూరి వ్యక్తి ) ఇలా అన్నాడు – ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! అల్లాహ్ మీకిచ్చిన సంపద నుండి నాక్కూడా ఇవ్వమని ఆజ్ఞాపించండి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (అతని నిర్వాకానికిగాను ఏమాత్రం కోపగించుకోకుండా) అతని వైపు ప్రేమతో చూసి నవ్వుతూ అతనికి సంపదనివ్వమని ఆజ్ఞాపించారు. (బుఖారీ : 3149, ముస్లిం : 1057) 

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను 8 సం||ల వయస్సు నుండి 10 సం||లు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధిలో ఆయనకు సేవ చేస్తూ గడిపాను. ఈ వ్యవధిలో నా చేత్తో ఏదైనా వస్తువు పాడయిపోయినా, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పుడూ నన్ను విసుక్కోలేదు. ఒకవేళ ఆయన ఇంట్లో వారెవరైనా నన్ను విసుక్కుంటున్నట్లు చూస్తే – అతణ్ణి వదిలేయి, ఏ విషయ నిర్ణయమైతే అయిపోయిందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ అయి తీరుతుంది అని అనేవారు. (ముసన్నిఫ్ అబ్దుర్ర హౌఖ్, అబూ నయీమ్ – అల్ హులియా, సహీహ్ – అల్ బానీ) 

జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకసారి మేమంతా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో కలిసి నజద్ వైపుకు యుద్ధానికి వెళ్ళాం. తదుపరి మేమంతా ముళ్ళ చెట్లు ఎక్కువగా వున్న ఒక ప్రదేశంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కలుసుకున్నాం . ఆపై, దైవ ప్రవక్త – (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక చెట్టు క్రింద తన వాహనం నుండి దిగి తన ఖడ్గాన్ని ఆ చెట్టు కొమ్మకు వ్రేలాడదీసి నిద్రపోయారు. సహాబాలు కూడా అటూ ఇటూ, ఎవరికెక్కడ నీడ దొరికితే అక్కడ విశ్రమించారు. 

ఆ తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకిలా తెలియజేశారు – నేను నిద్రపోతున్న సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి నా ఖడ్గాన్ని ఎత్తి పట్టుకున్నాడు. అకస్మాత్తుగా నేను మేల్కొని చూడగా అతనా ఖడ్గంతో నాపై దాడి చేయడానికి సిద్ధపడి, నాతో – (ఇప్పుడు) నా నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? అని అడిగాడు. అయినప్పటికీ నేనతనితో – (నా ప్రభువు) అల్లాహ్ యే రక్షిస్తాడు అని చెప్పాను. దీనితో అతను ఖడ్గాన్ని దాని ఒరలోకి పెట్టేశాడు. అదిగో చూడండి! అతనే ఆ వ్యక్తి. జాబిర్ (రజి అల్లాహు అహు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడిని ఏవిధంగానూ శిక్షించలేదు. అంటే అతడిని క్షమించేశారు. (బుఖారీ : 2910, 4139 – ముస్లిం : 843) 

ఆయెషా (రదియల్లాహు అన్హ) కథనం – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు ఓసారి కొంత మంది యూదులు వచ్చి ‘అస్సాము అలైకుం’ (మీకు మృత్యువు దాపురించుగాక!) అని పలికారు. నేను వారి మాటలను గ్రహించి వెంటనే – ‘అలైకుముస్సాము వల్లానత్’ (మీపై మరణం, మరణశాపం రెండూ అంతరించుగాక!) అని పలికాను. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో – ఓ ఆయెషా! కాస్త ఆగు (మృదుత్వాన్ని ప్రదర్శించు), ఎందుకంటే – అల్లాహ్ ఎల్లప్పుడూ మృదుత్వాన్నే ఇష్టపడతాడు అని హితవు పలికారు. తదుపరి ఆయెషా (రదియల్లాహు అన్హ) – ఓ దైవ ప్రవక్తా! వారేం పలికారో మీరు వినలేదా? అని అడిగారు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – నా జవాబు నువ్వు వినలేదా? నేను ‘వ అలైకుమ్’ (మీపై కూడా) అని పలికి వారి మాటలను వారికే తిరిగిచ్చేశాను అని అన్నారు. (బుఖారీ : 6256, ముస్లిం : 2165) 

ఈ హదీసుపై కాస్త దృష్టి సారించండి! 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యూదుల పరుష సంభాషణకు ఓర్పు వహించారు. వారి సంభాషణకు అనుగుణంగా అవసరమైనంతవరకే వారికి జవాబిచ్చారు. అంతకుమించి వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇదీ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహన గుణం మరియు మృదుత్వం. అంతేగాక ఆయెషా (రజి అల్లాహు అన్షకు వారి (యూదుల) విషయంలో మృదుత్వాన్ని ప్రదర్శిచమని ఆజ్ఞాపించారు. దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – యూదుల విషయంలోనే మృదుత్వాన్ని ప్రదర్శించాలన్న ఆజ్ఞ ఇవ్వబడితే, మరి తోటి ముస్లిం సోదరులు దీనికి ఎక్కువగా అర్హులు! 

(5) ప్రజలతో కలిసిపోవడం, చిరునవ్వుతో పలకరించడం 

జరీర్(రదియల్లాహు అన్హు) కథనం: నేను ఇస్లాం స్వీకరించిన నాటి నుండి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్నెప్పుడు కూడా వారి ఇంట్లోకి రావడానికి నిరాకరిచలేదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్నెప్పుడు చూసినా నవ్వుతూ వుండేవారు. (బుఖారీ : 3035, ముస్లిం : 2475)

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: ఏ వ్యక్తి అయినా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెవిలో ఎప్పుడైనా గుసగుసలాడుతుండగా, అతను దూరంగా జరగడానికి ముందే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (అతడి నుండి) దూరం జరగడాన్ని నేనెప్పుడూ చూడలేదు. అలాగే, ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) చేయి పట్టుకోగా ఆ వ్యక్తి వదలడానికి ముందే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తి చేయిని వదిలేయడం నేనెప్పుడూ చూడలేదు. (అబూ దావూద్ : 4794, హసన్ – అల్ బానీ) 

ప్రజలతో కలిసిపోవడానికి, వారితో సంభాషించడానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వైఖరి అవలంబించేవారు. తన ఇంటికి రావడానికి ఎవరినీ నిరాకరించేవారు కాదు. తన సహచరులకు దగ్గరగా  వుండేవారు, ఎల్లప్పుడూ వారిని పరామర్శిస్తూ వారిలో ఆత్మీయతానుభూతిని కలుగజేసేవారు. వారి కష్టాల్లో పాలుపంచుకొనేవారు. 

జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం: మా తండ్రి (అబ్దుల్లా బిన్ హరాం) గారు చనిపోయినప్పుడు ఆయనపై పెద్ద మొత్తంలో అప్పు వుంది. రుణ దాతలతో మాట్లాడి ఆ అప్పులో కొంత భాగం విడిచిపెట్టమని చెప్పండని నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విన్నవించుకున్నాను. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ఈ విషయంపై వారితో మాట్లాడగా, వారు ‘ససేమీరా’ అని అన్నారు. అంటే అప్పులో కొంత భాగం వదిలి పెట్టడానికి ఒప్పుకోలేదు). దీనితో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను ఖర్జూర తోటలోకి వెళ్లి వాటిని ఒక్కో రకం ఖర్జూరాలను వేర్వేరు కుప్పలుగా పేర్చు అని ఆజ్ఞాపించారు. నేను ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞను పాటిస్తూ అలాగే చేశాను. తదుపరి నేనాయనకు కబురు పంపగా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) విచ్చేసి, తోట మధ్యలో కూర్చొని నన్నిలా ఆజ్ఞాపించారు – ఇప్పుడు నువ్వు రుణదాతలలో ఒక్కొక్కరికి వారి అప్పుకు అనుగుణంగా ఖర్జూర ఫలాలను ఇవ్వడం ప్రారంభించు – ఇలా నేను వారొక్కొక్కరికీ ఖర్జూర ఫలాలను ఇస్తూ పోయాను. చివరికి అందరి అప్పు తీరి పోయింది, అయినప్పటికీ ఖర్జూర ఫలాలు ఏమాత్రం తగ్గకుండా మొదట వున్నట్లుగానే వున్నాయి. (అంటే దాంట్లో ఎవ్వరూ తీసుకోలేదా అన్నట్లు). (బుఖారీ : 2127, 2405)

బుఖారీ లోని మరో ఉల్లేఖనంలో ఇలా వుంది: 

జాబిర్ (రదియల్లాహు అన్హు) తండ్రి ఉహద్ రోజు అమరగతులయి నప్పుడు ఆయనపై రుణ భారం వుంది. రుణదాతలు అదేపనిగా తమ రుణాన్ని గూర్చి అడగసాగారు. జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం – నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి ఆయనతో – మీరు రుణదాతలతో మాట్లాడి వారి రుణానికి బదులుగా మా తోటలోని ఫలాలన్నీ తీసుకొని, మిగిలిన రుణాన్ని మన్నించి, మా తండ్రి గారిని క్షమించమని నచ్చజెప్పండని విన్నవించుకున్నాను. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో మాట్లాడగా వారు దీనిని తిరస్కరించారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు – రేపు ఉదయం నీ తోటలో నా కోసం వేచి చూస్తుండు. మరుసటి రోజు ప్రొద్దున్నే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తోటలోకి విచ్చేశారు. తోట చుట్టూ ఒకసారి తిరిగి దాని ఫలాలలో శుభం కోసం ప్రార్థించారు. జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం – ఆ తర్వాత నేను చెట్ల నుండి ఫలాలను కోసి రుణదాతలకు వారి రుణానికనుగుణంగా వాటిని పంచి పెట్టాను. ఆ తర్వాత కూడా ఎన్నో ఫలాలు మిగిలిపోయాయి. (బుఖారీ : 2395) 

(6) ఇంటి వారితో మంచిగా మెలగడం

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి బయట కూడా సామాన్య ప్రజానీకంతో సత్ప్రవర్తన కలిగి వుండేవారు, అలాగే ఇంటి లోపల తన ఇంటి వారితో కూడా మంచిగా మెలిగేవారు. వారి పట్ల ప్రేమ కనబరిచేవారు, వారి హక్కుల పట్ల శ్రద్ద వహించేవారు, ఇంటి పనుల్లో వారికి సహాయపడేవారు. 

ఆయెషా (రదియల్లాహు అన్హ)ను – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంట్లో ఏం చేస్తూ వుండేవారు? అని అడగ్గా ఆమె ఇలా తెలియజేశారు – ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ఇంటి వారి సేవ చేసేవారు. నమాజు వేళ కాగానే దాని కోసం లేచి నిలబడేవారు. (బుఖారీ : 6039) 

మరో ఉల్లేఖనంలో ఇలా వుంది – ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన (చిరిగిన) బట్టలను కుట్టుకొనేవారు, బూట్లకు అతుకు వేసుకునేవారు, ఇతరులు తమ ఇండ్లల్లో చేసే పనులన్నీ ఆయన చేసేవారు. (ఇబ్నె హిబ్బాన్ – సహీహ్) 

(7) బానిసల పట్ల సత్ప్రవర్తన

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు 10 సం||లు సేవ చేశాను. ఈ వ్యవధిలో ఆయన ఎప్పుడూ నన్ను ‘ఉఫ్’ అని కూడా అనలేదు. అదెందుకు చేశావ్? ఇదెందుకు చేయలేదు? అని కూడా అడగలేదు. (బుఖారీ : 6038, ముస్లిం : 2309) 

ఆయెషా (రజి అల్లాహు అన్హ) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎవరి పైన గూడా ఎప్పుడూ చేయి చేసుకోలేదు. స్త్రీలపై మరియు బానిసలపై కూడా చేయి చేసుకోలేదు. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేస్తున్నప్పటి పరిస్థితి వేరు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కష్టాన్ని కలిగించిన వారిపై కూడా పగ తీర్చుకోలేదు. అల్లాహ్ నిషేధించిన వాటిని త్యజించని తరుణంలో కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం తప్పకుండా పగ తీర్చుకొనేవారు. (ముస్లిం : 2328) 

(8) పిల్లల పట్ల ప్రేమ, వాత్సల్యము 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పిల్లల పట్ల ఎంతో దయామయులు, వారిని ఎంత గానో ప్రేమించేవారు, వారిని తన ఒళ్ళో కూర్చొబెట్టుకొనేవారు. 

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు కథనం: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కన్నా ఎక్కువగా ఎవరినీ కూడా పిల్లల పట్ల దయ చూపడం చూడలేదు. 

ఇంకా ఆయన ఇలా సెలవిచ్చారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమారులు ఇబ్రాహీం, మదీనాలోని ఒక వీధి (అనాలీ)లోని ఒక స్త్రీ వద్ద పాలు త్రాగుతుండేవారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనను కలుసుకొనే నిమిత్తం అక్కడికి వెళ్లేవారు. మేము కూడా ఆయనతోపాటు కలిసి వెళ్ళే వాళ్ళం. పాలు త్రాగించే స్త్రీ భర్త కమ్మరి పని చేసేవాడు కావడంతో వారి ఇంట్లో పొగ క్రమ్ముకొని వుండేది. అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతని వద్దకు వెళ్ళే వారు. పిల్ల వాణ్ణి ఎత్తుకొని ముద్దాడేవారు. తదుపరి అక్కణ్ణుంచి తిరిగి వచ్చేసేవారు. 

ఆయన (ఇబ్రాహీం) మరణిచినప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు – నిస్సందేహంగా ఇబ్రాహీం నా కుమారుడు మరియు పాలు త్రాగే వయస్సులోనే మృతి చెందాడు. ఇప్పుడతనికి స్వర్గంలో పాలు త్రాగించేవారు ఇద్దరు వున్నారు. వారిరువురూ అతని పాల వ్యవధిని పూర్తి చేస్తారు. (ముస్లిం : 2316) 

సహీహైన్ (బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలు) లోని మరో ఉల్లేఖనంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన కుమారులు ఇబ్రాహీం మరణించిన సందర్భంగా ఇలా పలికారని వుంది: కళ్ళలోంచి కన్నీళ్ళు పారుతున్నాయి, హృదయం విచారంతో నిండుకొంది, అయినప్పటికీ నా నోటి నుండి అల్లాహ్ యిష్టపడే మాటలే వస్తాయి. అల్లాహ్ సాక్షి! ఓ ఇబ్రాహీం! నీ వియోగం మాకు అత్యంత విచారాన్ని మిగిల్చింది. (బుఖారీ : 1303, ముస్లిం : 2315)

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓ సారి హసన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు) ను ముద్దాడారు. ఆ సమయంలో ఉఖూ బిన్ హాబిస్ (రదియల్లాహు అన్హు) అక్కడే కూర్చొని వున్నారు. ఇది చూసి ఆయన నాకు పది మంది సంతానం. కానీ నేనెప్పుడూ వారిని ముద్దాడలేదు అని అన్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన వైపునకు తిరిగి ఇతరులను కరుణించని వాడు, తను కూడా కరుణించబడడు’ అని హితవు పలికారు. (బుఖారీ : 5997, ముస్లిం : 2318) 

(9) హక్కుల చెల్లింపు

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ప్రజల హక్కులను నెరవేర్చేవారు. ఒకవేళ ఎవరి దగ్గర్నుండైనా ఏదైనా వస్తువు అప్పుగా తీసుకుంటే దానిని తీర్చేటప్పుడు దాని కన్నా శ్రేష్ఠమైన వస్తువును అతనికి ఇచ్చేవారు మరియు అతని కోసం ప్రార్ధించేవారు. ఒక్కోసారి ఎవరి వద్దనైనా ఏదైనా వస్తువును కొంటే, దాని పైకం చెల్లించేవారు, ఆ తర్వాత ఆ (కొన్న) వస్తువు కూడా అతనికే తిరిగి ఇచ్చేసేవారు. 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు – తను అప్పుగా ఇచ్చిన ఒక ఒంటె గురించి అడగడానికి వచ్చి కర్కశంగా సంభాషించాడు. సహాబాలు ఆగ్రహంతో ఆ వ్యక్తి వైపునకు మరలుతుండడం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో – అతణ్ణి వదిలేయండి, ఎందుకంటే హక్కుదారుడు (గట్టిగా) మాట్లాడవచ్చు. అని చెప్పి అతనికి అతనిచ్చిన ఒంటెలాంటి ఒంటె ఇచ్చి పంపండి అని పురమాయించారు. దీనిపై సహాబాలు – ఓ దైవ ప్రవక్తా! మాకు అలాంటి ఒంటె దొరకలేదు. దాని కన్నా శ్రేష్ఠమైన ఒంటె దొరికింది అని అన్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – అతనికి  అదే ఇచ్చివేయండి. ఎందుకంటే – చెల్లింపు విషయంలో ఉత్తమంగా వ్యవహరించేవారే మీలో శ్రేష్ఠులు అని హితవు పలికారు. (బుఖారీ : 2306, ముస్లిం : 1601)

అబ్దుల్లా బిన్ అబీ రబియా (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గర 40 వేలు అప్పు తీసుకున్నారు. తదుపరి ఆయన వద్దకు సొమ్ము వచ్చాక నా రుణాన్ని తీర్చేశారు మరియు ఇలా సెలవిచ్చారు- ‘నీ ఇంటి వారిలో, నీ సంపదలో అల్లాహ్ శుభాన్ని వుంచు గాక! నిస్సందేహంగా రుణానికి ప్రతి ఏమిటంటే – రుణ గ్రహీత రుణదాతకు కృతజ్ఞతలు తెలియజేయాలి మరియు అతని రుణాన్ని తిరిగి చెల్లించాలి.” (నసాయి : 4683, హసన్ – అల్ బానీ)

జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం: ఒకసారి నేను మక్కా నుండి మదీనాకు ఒంటపై తిరుగు ప్రయాణం చేస్తుండగా అది బాగా అలిసిపోయింది. అది చూసి నేను దానిని (అక్కడే) వదిలేద్దామనుకున్నాను. కానీ ఇంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా వెనుక నుండి విచ్చేసి, నా కొరకు ప్రార్థించి దానిపై కొట్టారు. వెంటనే అది అంత వరకూ నడవని విధంగా చకచకా నడవసాగింది. కాసేపటికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో – ఇప్పుడు నీ ఒంటె ఎలా వుంది? అని అడిగారు. నేనాయనతో – ఇది మునపటి కన్న ఇప్పుడు బాగుంది, మీ శుభ ప్రభావం దానిపై పడింది అని అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో – దీనిని నాకు అమ్మేయి అని అనగా, నేను – లేదండి, ఇది మీ కోసం (కానుక) అని బదులిచ్చాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో మళ్ళీ ఇలా అడిగారు – వద్దు, దీనిని నాకు అమ్మేయి. నేను మళ్ళీ – లేదండి, ఇది మీకు కానుక అని జవాబిచ్చాను. ఆయన మూడోసారి నాతో – వద్దు, దీనిని నాకు అమ్మేయి అని అడిగారు. దీనిపై నేను ఆయనతో – సరే మంచిది, నేనొక వ్యక్తికి కొన్ని దిర్హములు చెల్లించాల్సి వుంది. మీరు నా తరఫు నుండి ఆ పైకాన్ని ఆ వ్యక్తికి చెల్లించి ఈ ఒంటెను తీసుకోండి. కానీ నేను మదీనా వెళ్ళాకే ఈ ఒంటెను మీకప్పగిస్తాను అని విన్నవించుకున్నాను. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని పైకాన్ని నాకు చెల్లించారు.  

ముస్లిం లోని ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బిలాల్ (రదియల్లాహు అన్హు) కు ఇలా ఆజ్ఞాపించారు – ఇతనికి ఒక ఊఖియా (కొలత) బంగారమివ్వు, కొంచెం ఎక్కువగానే యివ్వు. తదనుగుణంగా ఆయన (బిలాల్) నాకు ఒక ఊఖియా మరియు మరో ఖిరాత్ (కొలత) ఇచ్చారు. తదుపరి నేను వెళ్లిపోయాక దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను తిరిగి పిలిపించి ఇలా సెలవిచ్చారు – (ఒంటె) పైకం కూడా నీదే, ఒంటె కూడా నీదే. మరో ఉల్లేఖనంలో ఇలా సెలవిచ్చారని వుంది – నీ ఒంటెను కూడా తీసుకో, దిర్హములను కూడా, రెండు కూడా నీవే. (బుఖారీ: 2018, ముస్లిం : 715) 

(10) హాస్యము మరియు మానసిక ఉల్లాసము 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అప్పుడప్పుడూ మనసును ఉత్సాహ పరిచే నిమిత్తం హాస్యమాడుతూ తమాషాగా మాట్లాడేవారు. 

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను – ఓ రెండు చెవుల వాడా! అని పిలిచారు. అంటే అయనతో ఇలా హాస్యమాడారు. (అబూ దావూద్ : 5002, తిర్మిజీ : 1992, సహీహ్ – అల్ బానీ) 

ఆయనే ఇలా ఉల్లేఖించారు. పల్లెటూరి వ్యక్తుల్లో ‘జాహిర్’ అనే ఒక వ్యక్తి వుండేవాడు. అతను పల్లెటూరి నుండి ఏదో ఒక వస్తువు తెచ్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కానుకగా ఇచ్చేవాడు. అతను తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనికి ఎంతో కొంత సామగ్రిని ఇచ్చి పంపుతూ ఇలా అంటుండేవారు – నిశ్చయంగా జాహిర్ మా పల్లెటూరి వాసి మరియు మేము అతని పట్టణవాసులం. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతణ్ణి ఎంతగానో ప్రేమించే వారు. మరి చూడబోతే అతను పొట్టివాడు మరియు అంత అందంగా కూడా వుండేవాడు కాదు. ఒకరోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని  వద్దకు విచ్చేశారు. ఆ సమయంలో అతను ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) సామగ్రిని అమ్ముతున్నాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి వెనుక నుంచి అతణ్ణి తన బాహువుల్లో తీసుకున్నారు. అతను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూడలేక పోయాడు. నన్ను వదిలి పెట్టండి, ఎవరు మీరు? అని అంటూ వెను తిరిగి చూడగా అతనికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కనిపించారు. ఆయన ఛాతీ ఇతని వీపుకు తగిలి వుండడం చూసి అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి విడిపించు కోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అడగడం ప్రారంభించారు – ఈ బానిసను ఎవరు కొంటారు? అతను జవాబిస్తూ- ఓ దైవ ప్రవక్తా! అలాగైతే మీరు నన్ను చాలా చౌకగా పొందగలరు! అన్నాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ- కానీ అల్లాహ్ దృష్టిలో నువ్వు చౌకవు కావు అని అన్నారు లేదా ఇలా జవాబిచ్చారు – కానీ అల్లాహ్ దృష్టిలో నువ్వు అత్యంత ఖరీదైన వాడవు. (అహ్మద్ – సహీహ్)

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: ఓ వ్యక్తి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో తనకొక వాహనాన్ని సమకూర్చమని విన్నవించుకున్నాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనితో – నేను నీకు ఆడ ఒంటె కన్న పిల్లనిస్తాను అని అన్నారు. దీనికా వ్యక్తి – ఆడ ఒంటె కనిన పిల్లతో నేనేం చేయగలను! అని అడిగాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మగ ఒంటెను కూడా ఆడ ఒంటె కంటుంది అని జవాబిచ్చారు. (అబూ దావూద్ : 4998, తిర్మిజీ : 1991, సహీహ్ అల్లానీ) 

ఇవన్నీ కూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సద్గుణాలకు సంబంధించిన కొన్ని అంశాలు, మనందరం కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉత్తమ నడవడికను అలవర్చుకొని, ఆయన పద్ధతులను, అత్యుత్తమ సద్గుణాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ వుండాలి. అల్లాహ్ మనందరికీ ఈ సద్బుద్ధిని ప్రసాదించుగాక! 

రెండవ ఖుత్బా

ముస్లిములందరిపై అనివార్యంగా వున్న విషయం ఏమిటంటే – వారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పరిశుద్ధ జీవితం వెలుగులో తమ విశ్వాసాలు, ఆచరణలను సరిదిద్దుకొంటూ తమ ప్రవర్తనను, వ్యవహారశైలిని దానికనుగుణంగా మార్చుకోవాలి. ఎందుకంటే – ప్రళయం రోజు మనిషి ఆచరణల తూకం వేయబడినప్పుడు, ఏకదైవారాధన (తౌహీద్) విశ్వాసం తర్వాత పళ్ళెంలో అధిక భారం తూకే వస్తువు అతని సత్ప్రవర్తనే. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: ప్రళయం రోజు త్రాసులో అన్నిటికన్నా భారంగా తూకేది మనిషి సత్ప్రవర్తనే. (అహ్మద్, ఇబ్నె హిబ్బాన్ – సహీహ్) 

అల్లాహ్ మనందరినీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి సద్గుణాలను అలవర్చుకొనే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!! 

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)  (మెయిన్ పేజీ)
https://teluguislam.net/muhammad/

%d bloggers like this: