తావీజులు, తాయత్తులు… !? – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

తావీజులు, తాయత్తులు… !?
https://youtu.be/W9VBuoPiFfk [15 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్)
నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.

ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.

మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.

ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.

కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ
(ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్)
“నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)

అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.

అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.

మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.

అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.

కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.

ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ تَعَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ
(మన్ త’అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక్)
ఎవరైతే తాయత్తు వేలాడదీసుకున్నాడో, అతను షిర్క్ చేశాడు.” (ముస్నద్ అహ్మద్)

ఇంకో హదీసులో ఉంది:

مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ
(మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి)
ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)

ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.

కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.

మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,

وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
(వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా)
అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.

అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24530

మంత్రించి ఊదటం, తావీజులు కట్టటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [4పేజీలు]

ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు – ధర్మపరమైన నిషేధాలు [వీడియో] [6 నిముషాలు]

దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

రుఖ్ యా (మంత్రాలు), తాయత్తుల ఆదేశాలు | ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ

8 వ అధ్యాయం
మంత్రాలు (రుఖ్ యా)
మరియు తాయత్తుల విషయంలో వచ్చిన ఆదేశాలు 
అల్ ఖౌలుస్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab.


باب ما جاء في الرقى والتمائم

8వ అధ్యాయం: రుఖ్ యా (మంత్రాలు), తాయత్తుల ఆదేశాలు

في الصحيح عن أبي بشير الأنصاري رضي الله عنه أنه كان مع رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ في بعض أسفاره، فأرسل رسولاً: أن لا يُبقين في رقبة بعير قلادة من وَتَر، أو قلادة إلاَّ قُطِعت.

అబూ బషీర్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఆయన ఓ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చాటింపు చేసే వ్యక్తిని ఈ వార్త ఇచ్చి పంపారు: “తమ ఒంటె మెడలో ఎవరూ కూడా తీగతో తయారైన పట్టా ఉంచకూడదు. ఒక వేళ ఉంటే తెంపేసెయ్యాలి”. (బుఖారీ 2843, ముస్లిం 2115).

وعن ابن مسعود رضي الله عنه قال: سمعت رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يقول: إن الرُّقى والتّمائم والتِّوَلَة شرك.

ఇబ్ను మస్ ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను. “మంత్రాలు, తాయత్తులు, తివల (భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయుట) షిర్క్“. (అబూ దావూద్ 3883). 

وعن عبد الله بن عُكيم مرفوعاً: من تعلّق شيئاً؛ وُكِل إليه.

అబ్దుల్లాహ్ బిన్ ఉకైం రజియల్లాహు అన్హు ప్రవక్తతో ఉల్లేఖించిన హదీసులో ఉంది: “ఎవరు ఏదైనా వస్తువు వేసుకుంటే అతన్ని దాని వైపునకే అప్పగించబడుతుంది“. (తిర్మిజి 2072).

తాయత్తు అంటే: దిష్టి తగలకుండా తమ సంతానానికి ధరింపజేయబడే వస్తువులు. ఇది ఖుర్ఆన్ నుండి ఉంటే కొందరు పూర్వ ధర్మవేత్తలు యోగ్యమని చెప్పారు. మరి కొందరు యోగ్యం కాదని, నివారించబడింది అని చెప్పారు. నివారించినవారిలో ఇబ్నె మస్ ఊద్ రజియల్లాహు అన్హు ఉన్నారు.

మంత్రాలను ‘అజాయిం’ అని అంటారు. దిష్టి తగిలినప్పుడు, విష పురుగులు కాటేసినప్పుడు మంత్రిచవచ్చును కాని షిర్క్ అర్థమునిచ్చే పదాలు ఉండకూదడు.

తివల అంటే: భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు చేయబడే ఇంద్రజాలం. 

وروى أحمد عن رُوَيْفع قال: قال لي رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يا رُوَيْفِع، لعل الحياة ستطول بك؛ فأخبر الناس: أن من عقد لحيته، أو تقلّد وَتَراً، أو استنجى برجيع دابة أو عظم؛ فإن محمداً بريء منه.

రువైఫిఅ యొక్క హదీసు ఇమాం అహ్మద్ ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా తెలిపారు: “ఓ రువైఫిఅ! బహుశా నీవు దీర్ఘకాలం బ్రతికి ఉంటావేమో, అయితే ప్రజలకు నీవు ఈ విషయం తెలుపు: గడ్డమును ముడి వేసేవారితో, లేక తీగలు మెడలో వేసుకునేవారితో, పశువుల పేడ, ఎముకలతో మలమూత్ర విసర్జన తర్వాత పరిశుద్ధ పరుచుకునేవారితో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎలాంటి సంబంధం లేదు”.

وعن سعيد بن جبير قال: “من قطع تَمِيمَة من إنسان؛ كان كعدل رقبة” رواه وكيع.

సఈద్ బిన్ జుబైర్ ఇలా చెప్పారు: ‘ఒక వ్యక్తి ధరించిన తాయత్తును తీసే వారికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభించును’. (ఇమాం వకీఅ ఉల్లేఖనం).

وله عن إبراهيم قال: “كانوا يكرهون التّمائم كلها؛ من القرآن وغير القرآن”.

ఇమాం వకీఅ ఇబ్రాహీం నఖ్ఈతో ఉల్లేఖించారు: “వారు (అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ శిష్యులు) అన్ని రకాల తాయుత్తులను అసహ్యించుకునేవారు (నిషిద్ధంగా భావించేవారు). అవి ఖుర్ఆన్ కు సంబంధించినవైనా, లేదా ఖుర్ ఆన్ కు సంబంధం లేనివైనా.”

1. మంత్రము (రుఖ్య), తాయత్తు యొక్క వివరణ తెలిసింది. 

2. తివల యొక్క భావం తెలిసింది. 

3. ఎలాంటి వ్యత్యాసం లేకుండా పైన పేర్కొన్న మూడూ విషయాలు కూడా షిర్క్ గా పరిగణింపబడుతాయి. (ఇందులో వివరణ ఉంది, క్రింద వస్తుంది).

4. దిష్టి తగిలినప్పుడు లేదా తగలకుండా లేదా విషపురుగు కాటేసినప్పుడు షిర్క్ పదాలు కాకుండా ఖుర్ఆన్, హదీసుతో రుజువైన దుఆలతో రుఖ్య చేయుట (మంత్రించుట) షిర్క్ కాదు. (అన్ని రకాల రోగాలకు రుఖ్య చేయవచ్చును).

5. ఖుర్ఆన్ ఆయతులతో వ్రాయబడిన తాయత్తు విషయములో పండితుల బేధాభిప్రాయం ఏర్పడినది. (వాస్తవమేమిటంటే అది కూడా యోగ్యం కాదు. ఎలా అనగా మంత్రం షిర్క్ అని తెలిపిన తరువాత యోగ్యమైనదేదో ప్రవక్త స్వయంగా తెలిపారు. కాని తాయత్తు విషయంలో అలా తెలుపలేదు. అందుకే ఇందులో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు మాటనే నిజమైనది). 

6. పశువులకు దిష్టి తగలకుండా తీగలు, ఇంకేవైనా వేయుట కూడా షిర్క్ కు సంబంధించినవే. 

7. అలాంటివి వేసినవారిని కఠినంగా హెచ్చరించబడింది. (فإن محمداً بريء منه)

8. ఒక వ్యక్తి మెడ నుండి తాయత్తు తీయుట ఎంత పుణ్యమో తెలిసింది.

9. ఇబ్రాహీం నఖ్ఈ మాట, పైన తెలిపిన మాటకు విరుద్ధం ఏమీ కాదు. ఎలా అనగా; ఈయన ఉద్దేశం అబుల్లాహ్ బిన్ మస్ ఊద్ శిష్యులు అని. 

తమాయిమ్ తమీమా యొక్క బహువాచనం, మన భాషలో తాయత్తు అని అంటాము, వాటి వైపే ప్రజల మనస్సు అంకితం అయిపోతుంది. దీని వివరణ దీనికంటే ముందు ఏడవ ధ్యాయంలో తెలిపిన మాదిరిగానే ఉంటుంది.

తాయత్తులు వేసుకొనుట షిర్క్ అని తెలిసింది. అయితే ఇందులో కొన్ని షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్). ఉదా: షైతాన్ తో లేక సృష్టిరాసులతో సహాయం కోరడం జరుగుతుంది,  అల్లాహ్ ఆధీనంలో మాత్రమే ఉన్నదాని గురించి ఇతరులతో అడగడం జరుగుతుంది, కనుక పెద్ద షిర్క్ లో పరిగణించబడుతుంది. ఈ విషయం మరీ వివరంగా తరువాత అధ్యాయాల్లో వస్తుంది.

తాయత్తుల్లో మరి కొన్ని నిషిద్ధం, ఎందుకనగా అవి షిర్క్ వైపునకు తీసుకెళ్తాయి. ఉదా: అర్ధం లేని పేర్లతో, పదాలతో ఉన్న తాయత్తులు.

ఇక ఏ తాయయత్తుల్లో ఖుర్ఆన్ ఆయతులు, లేదా హదీసులో వచ్చిన దుఆలుంటాయో, ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు గనక వాటిని విడనాడడమే ఉత్తమం. ఈ పద్ధతి నిషిద్ధమున్న వాటి ఉపయోగమునకు దారి తీస్తుంది. అపరిశుద్ధ స్థలాల్లో పోక తప్పదు గనక, వాటిని వేసుకున్నవాడు వాటి గౌరవ మర్యాదను పాటించలేడు. (ఇవి పాటించినవానికి సయితం అనుమతి లభించదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇవ్వలేదు).

మంత్రం విషయంలో ఉన్న వివరాన్ని కూడా తెలుసుకోవాలి. అది ఖుర్ఆన్, హదీసు నుండి ఉంటే మంత్రించేవాని గురించి అభిలషనీయమే. ఎందుకనగా ఇది కూడా ఒక ఉపకారం, పుణ్యం క్రింద లెక్కించబడుతుంది గనుక యోగ్యం కూడా. కాని మంత్రం చేయించుకునే వ్యక్తి స్వయంగా అడగక ఉండడమే మంచిది. మంత్రించడమైనా లేక ఇంకేదైనా అడగక ఉండడం మానవుని సంపూర్ణ నమ్మకం, బలమైన విశ్వాసం యొక్క నిదర్శన. అడగడంలో అతనికి లాభం మరియు అది యోగ్యం అయినప్పటికీ అడగక పోవడం మంచిది అనబడుతుంది. ఇందులోనే వాస్తవ తౌహీద్ యొక్క రహస్యం ఉంది. ఈ విషయాన్ని గమనించి ఆచరించేవారు చాలా అరుదు. మంత్రంలో అల్లాహ్ యేతరులతో స్వస్థత కోరి, వారితో దుఆ చేయబడితే అది పెద్ద షిర్క్. ఎందుకంటే: దుఆ, మొర అల్లాయేతరులతో చేయరాదు గనక. ఈ వివరాలన్నీ జాగ్రత్తగా తెలుసుకో! అందులో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను గమనించకుండా అన్నిటి గురించి ఒకే రకమైన తీర్పు చేయకు. జాగ్రత్తగా ఉండు! 


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)