8 వ అధ్యాయం
మంత్రాలు (రుఖ్ యా) మరియు తాయత్తుల విషయంలో వచ్చిన ఆదేశాలు
అల్ ఖౌలుస్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab.
అబూ బషీర్ అన్సారి (రదియల్లాహు అన్హు) కథనం; ఆయన ఓ ప్రయాణంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉండగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక చాటింపు చేసే వ్యక్తిని ఈ వార్త ఇచ్చి పంపారు: “తమ ఒంటె మెడలో ఎవరు కూడా తీగతో తయారైన పట్టా ఉంచకూడదు. ఒక వేళ ఉంటే తెంపాలి“. (బుఖారి, ముస్లిం). .
ఇబ్ను మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను ప్రవక్త ఈ చెప్పగా విన్నాను. “మంత్రము, తాయత్తులు, తివల (భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయుట) షిర్క్“. (అహ్మద్, అబూ దావూద్).
అబుల్లాహ్ బిన్ ఉకైం ఉల్లేఖనలో ఉంది: “ఎవరు ఏదైనా వస్తువు వేసుకుంటే అతన్ని దాని వైపునకే అప్పగించబడుతుంది“. (అహ్మద్ , తిర్మిజి).
తాయత్తు అంటే: దిష్టి తగలకుండా తమ సంతానానికి ధరింపజేయబడే వస్తువులు. ఇది ఖుర్ఆన్ నుండి ఉంటే కొందరు పూర్వ ధర్మవేత్తలు యోగ్యమని చెప్పారు. మరి కొందరు యోగ్యం కాదని నివారించబడింది అని చెప్పారు. నివారించినవారిలో ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఉన్నారు.
మంత్రాలను “అజాయిం ” అని అంటారు. దిష్టి తగిలినప్పుడు, విష పురుగులు కాటేసినప్పుడు మంత్రిచవచ్చును కాని షిర్క్ అర్థమునిచ్చే పదాలు ఉండకూదడు.
తివల అంటే: భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు చేయబడే ఇంద్రజాలం.
రువైఫిఅ యొక్క హదీసు అహ్మద్ ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీ ఆయనకి ఇలా తెలిపారు: “ఓ రువైఫిఅ ! నీవు దీర్ఘకాలం బ్రతుకవచ్చు. ఈ విషయం ప్రజలకు తెలియజేయి: గడ్డమును ముడి వేసేవారితో, లేక తీగలు మెడలో వేసుకునేవారితో, పశువుల పేడ, ఎముకలతో మలమూత్ర పరిశుద్ధి చేసేవారితో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఏలాంటి సంబంధం లేదు“.
సఈద్ బిన్ జుబైర్ ఇలా చెప్పారు: ‘ఒక వ్యక్తి ధరించిన తాయత్తును తీసే వారికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభించును‘.
వాకీఅ, ఇబ్రాహీం నఖఈతో ఉల్లేఖించారు: “వారు అన్ని రకాల తాయుత్తులను నిషిద్ధంగా భావించేవారు. అవి ఖుర్ఆన్ కు సంబంధించినవైనా, లేదా ఖుర్ ఆన్ కు సంబంధం లేనివైనా.”
ముఖ్యాంశాలు:
1. మంత్రము (రుఖ్య) , తాయత్తు యొక్క వివరణ తెలిసింది.
2. తివల యొక్క భావం తెలిసింది.
3. ఏలాంటి వ్యత్యాసం లేకుండా పైన పేర్కొన్న మూడూ విషయాలు కూడా షిర్క్ గా పరిగణింపబడుతాయి.
4. దిష్టి తగలకుండా, విషపురుగు కాటేసినప్పుడు షిర్క్ పదాలు లేకుండా మంత్రించుట షిర్క్ కాదు.
5. ఖుర్ఆన్ ఆయతులతో వ్రాయబడిన తాయత్తు విషయములో పండితుల బేధాభిప్రాయం ఏర్పడినది. (వాస్తవమేమిటంటే అది కూడా యోగ్యం కాదు. ఎలా అనగా మంత్రం షిర్క్ అని తెలిపిన తరువాత యోగ్యమైనదేదో ప్రవక్త స్వయంగా తెలిపారు. కాని తాయత్తు విషయంలో అలా తెలుపలేదు).
6. పశువులకు దిష్టి తగలకుండా తీగలు, ఇంకేవైనా వేయుట కూడా షిర్క్ కు సంబంధించినవే.
7. అలాంటివి వేసినవారిని కఠినంగా హెచ్చరించబడింది.
8. ఒక వ్యక్తి మెడ నుండి తాయత్తు తీయుట ఎంత పుణ్యమో తెలిసింది.
9. ఇబ్రాహీం నఖఈ మాట, పైన తెలిపిన మాటకు విరుద్ధం ఏమి కాదు. ఎలా అనగా; ఈయన ఉద్దేశం అబుల్లాహ్ బిన్ మస్ ఊద్ శిష్యులు అని.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
తాయత్తులు వేసుకొనుట షిర్క్ అని తెలిసింది. అయితే ఇందులో కొన్ని షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్). ఉదా: షైతాన్ తో లేక సృష్టిరాసులతో మొరపెట్టుకొనుట, అల్లాహ్ ఆధీనంలో ఉన్నదాని గురించి ఇతరులతో మొరపెట్టుకొనుట పెద్ద షిర్క్ లో పరిగణించబడుతుంది. ఈ విషయం మరీ వివరంగా తరువాత అధ్యాయాల్లో వస్తుంది. మరి కొన్ని నిషిద్ధమున్నవి. ఉదా: అర్ధం లేని పేర్లతో, పదాలతో. ఇవి షిర్క్ వైపునకు తీసుకెళ్తాయి.
ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు గనుక, ఖుర్ఆన్ మరియు హదీసులో వచ్చిన దుఆలు వ్రాయబడిన తాయత్తులు విడనాడడమే ఉత్తమం. ఈ పద్ధతి నిషిద్ధమున్న వాటి ఉపయోగమునకు దారి తీస్తుంది. అపరిశుద్ధ స్థలాల్లో పోక తప్పదు గనక, వాటిని వేసుకున్నవాడు దాని గౌరవ మర్యాదను పాటించలేడు. (ఇవి పాటించినవానికి సయితం అనుమతి లభించదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇవ్వలేదు).
మంత్రం విషయంలో ఉన్న వివరాన్ని కూడా తెలుసుకోవాలి. అది ఖుర్ఆన్, హదీసు నుండి ఉంటే మంత్రించేవాని గురించి అభిలషనీయమే. ఎందుకనగా ఇది కూడా ఒక ఉపకారం, పుణ్యం క్రింద లెక్కించబడుతుంది గనుక యోగ్యం కూడా. కాని మంత్రం చేయించుకునే వ్యక్తి స్వయంగా అడగక ఉండడమే మంచిది. మంత్రించడమైనా లేక ఇంకేదైనా అడగక ఉండడం మానవుని సంపూర్ణ నమ్మకం, బలమైన విశ్వాసం యొక్క నిదర్శన. అడగడంలో అతనికి లాభం మరియు అది యోగ్యం అయినప్పటికీ అడగక పోవడం మంచిది అనబడుతుంది. ఇందులోనే వాస్తవ తౌహీద్ యొక్క రహస్యం ఉంది. ఈ విషయాన్ని గమనించి ఆచరించేవారు చాలా అరుదు. మంత్రంలో అల్లాహ్ యేతరులతో స్వస్థత కోరి, వారితో దుఆ చేయబడుతే అది పెద్ద షిర్క్. ఎందుకంటే: దుఆ, మొర అల్లాయేతరులతో చేయరాదు గనక. ఈ వివరాలన్ని జాగ్రత్తగా తెలుసుకో! అందులో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను గమనించకుండా అన్నిటి గురించి ఒకే రకమైన తీర్పు చేయకు. జాగ్రత్తగా ఉండు!
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
You must be logged in to post a comment.