అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]

అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]
మూలం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్
తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల హఖ్ తెలుగు పబ్లికేషన్స్

[డౌన్లోడ్ PDF]

కరుణామయుడు కనికరించేవాడు అయిన అల్లాహ్ పేరుతో

మహాశయులారా !

ఇస్లాంలో దైవ గృహాన్ని మస్జిద్ అనంటారు. మస్జిద్ లో అల్లాహ్ ఆరాధన జరుగుతుంది. ఇతర ధార్మిక కార్యక్రమాలు కూడా మస్జిద్ లో జరుగుతాయి. మస్జిద్ ల అన్నింటి దిశ మక్కాలో ఉన్న అల్లాహ్ కేంద్ర ఆరాధనా స్థలమైన కాబా గృహం వైపుకు మరలి ఉంటుంది. ఏ విధంగానయితే ఒక ముస్లిం పై ప్రతి రోజూ అయిదు పూటల నమాజ్ విధిగా చేయబడిందో అదే విధంగా అది సవ్యంగా నెరవేరేందుకుగాను జమాఅత్ తో కలసి, అంటే సామూహికంగా నమాజ్ చేయమని కూడా ఆదేశించటం జరిగింది. సామూహికంగా చేసే నమాజ్ లో అపారమయిన, అసంఖ్యాకమైన ప్రాపంచిక, పరలోక శుభాలు ఇమిడి ఉన్నాయి.

అయితే ప్రతి సామూహిక నమాజ్ కోసం వేళకు చేసే ప్రకటననే ‘అజాన్‘ అంటారు. ఈ ‘అజాన్’లో యావత్తు ఇస్లామీయ బోధనల సారాంశం పొందుపరచబడి ఉంది. అందుకే అజాన్ ను ‘దావతితామ్మ‘ అన్నారు. అంటే అది పరిపూర్ణమైన పిలుపు అన్నమాట. ఈ పిలుపులో గొప్ప ఆకర్షణ ఉంది. అదెంతో ప్రభావవంతమైంది. వేళకు అయ్యే ‘అజాన్’ పనిలో వున్న వారిని, ఖాళీగా ఉన్న వారిని, నిద్రించేవారిని అందరినీ కదిలిస్తుంది. అజాన్ పిలుపు ద్వారా, అల్లాహ్ – దైవదాసుని వాస్తవం ప్రస్ఫుటం చెయ్యబడుతుంది. ఈ పిలుపులో ఇహపర సాఫల్యాల సందేశం ఉంది. ఈ పిలుపు దాసుడ్ని అతని స్వంత పనులన్నింటి నుండి, కోర్కెల నుండి వేరు చేసి అతన్ని అల్లాహ్ తో, అల్లాహ్ నామ స్మరణతో, అల్లాహ్ ఆరాధనతో సంబంధం ఏర్పరుస్తుంది. మహత్తరమైన ఈ పిలుపు దాసుని హృదయాంతరాళాల్లో ఓ విధమైన ప్రకంపనం పుట్టిస్తుంది. అల్లాహ్ ఆరాధనకై అతన్ని సమాయత్తం చేస్తుంది. అంతేకాదు, ఈ గొప్ప పిలుపు, అల్లాహ్ పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉన్న వారెవరో, బూటకపు ప్రేమ కలిగి ఉన్న వారెవరో కొద్ది సేపట్లోనే తేల్చి వేస్తుంది. సర్వోన్నతుడయిన అల్లాహ్ పట్ల, దైవ ప్రవక్త పట్ల, దైవ ధర్మం పట్ల నిజమయిన, నిష్కల్మషమైన ప్రేమ, విశ్వాసం ఉన్నవారు ఈ పిలుపు వినగానే అల్లాహ్ గృహం వైపుకు మరలి వస్తారు. మనో వాక్కాయ కర్మలచేత వారు ఈ పిలుపుకు బదులు ఇస్తారు. అంటే, వారు అల్లాహ్ ఆరాధనలో నిమగ్నులవుతారు.

అజాన్ పిలుపు విన్న తరువాత అల్లాహ్ గృహం వైపుకు మరలటం ముస్లిం పురుషులకు తప్పనిసరి అయిపోతుంది. ఇది శక్తిమంతుడయిన అల్లాహ్ యొక్క తిరుగులేని ఆదేశం. అజాన్ ఎవరి పిలుపు అనుకున్నారు ?! అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేరిట పంపబడే ఓ గొప్ప ట్రంకాల్, ఆ ట్రంకాల్ ను అందుకుని దానికి బదులు ఇవ్వటం దాసులు విధి. ‘ఒక విశ్వాసి అజాన్ పిలుపు ఇస్తే ఆ పదాలకు మీరు బదులు పలకండి’ అని మానవ మహోపకారి (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధించారు. ఉదాహరణకు, ముఅజ్జిన్ ‘అల్లాహు అక్బర్’ అనంటే మనమూ ఆ పదాన్ని పలకాలి. ఆ విధంగా చేస్తే మన ప్రక్కనున్న వారు కూడా దాన్ని అనుసరిస్తారు. ఆ వాతావరణం చూస్తుంటే దాసులు తన ప్రభువుతో సంభాషిస్తున్నారా! అన్నట్లే ఉంటుంది. అందుకే అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేర వచ్చిన ట్రంకాల్ అని అనటం ఎంతో సమంజసం.

అల్లాహ్ స్వయంగా తన దాసుడ్ని ‘అజాన్’ ద్వారా తన దర్బారుకు పిలుచుకున్నాడంటే ఎంత దయగలవాడాయన! ఆ పిలుపును, ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయన దర్బారుకు వెళ్ళిన దాసుడు ధన్యుడు. ఇక్కడ అతిధేయుడు అల్లాహ్ అయితే అతిథి దాసుడు. అడిగేవాడు దాసుడయితే ఇచ్చేవాడు అల్లాహ్. అతిథి అయిన దాసునికి అతిథేయుడు అయిన అల్లాహ్ ఇచ్చే వరాలకు, అనుగ్రహాలకు హద్దే లేదు.

అల్లాహ్ ఆరాధన కోసం దాసుడు మస్జిద్ లో అడుగు పెట్టగానే దైవ దూతలు అతని చుట్టూ అల్లుకుంటారు. నమాజ్ కోసం నిరీక్షించినంత వరకూ దూతలు అతని కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉంటారు. అల్లాహ్ కారుణ్యం అతనిపై కురవాలనీ, సుఖశాంతులు అతనికి ప్రాప్తం కావాలని వేడుకుంటారు. అతని పాపాల క్షమాభిక్షకై వేడుకుంటారు.

అల్లాహ్ చివరి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఏమని ప్రబోధించారంటే “దాసుడు అల్లాహ్ గృహం వైపుకు మరలి అతను వేసే ఒక్కో అడుక్కీ ఒక్కో పాపం చెరిపివేయబడుతుంది. అతని ఖాతాలో ఒక్కో అడుక్కి ఒక్కో సత్కార్యం రాయబడుతుంది. అతని స్థాయి, ఒక్కో మెట్టు అల్లాహ్ సాన్నిధ్యంలో పెంచబడుతుంది.”

ఇహ పరాలలో అజాన్ ఎన్ని శుభవార్తలనిస్తుందో ఆలోచించండి !

ఇక ధర్మంలో అజాన్ ఔన్నత్యం ఏమిటో చూద్దాం. దైవ ధర్మమయిన ఇస్లాం నిదర్శనాలలో ఓ గొప్ప నిదర్శనం అజాన్. ఇది సున్నతె ముఅక్కిద. అంటే దీని ప్రాముఖ్యం ధర్మంలో ‘ఫర్జ్’కు దరిదాపుల్లో ఉంది. ఒకవేళ ముస్లింలు సామూహికంగా ‘అజాన్’ వ్యవస్థను గనక బహిష్కరిస్తే, కాలపు ఖలీఫా వారికి వ్యతిరేకంగా కఠిన చర్య తీసుకోగలడు. అందుకు కారకులయిన వారిపై మరణ దండన కూడా విధించగలడు.

నమాజ్ కొరకు త్వరపడటం యొక్క ప్రాముఖ్యత – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుంచి దూరంగా ఉండండి. మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి.  అల్లాహ్ ఇతర ఆరాధనల కంటే ఎక్కువగా దీనికి ఎంతో ప్రాముఖ్యతను ప్రసాదించాడు. నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ దీనిని ఆకాశాలలో విధి గావించాడు ఇది చూడడానికి 5 నమాజులే కానీ పుణ్యఫలం పరంగా 50 నమాజుల పుణ్యఫలం లభిస్తుంది. నమాజ్ ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుంది, నమాజ్ కొరకు మస్జిద్ వైపు వెళ్లడం మరియు తిరిగి రావడం కూడా ఆరాధనలోని భాగమే, అదే విధంగా దీని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; ఈ నమాజు కొరకు పరిశుభ్రత పొందడం తప్పనిసరి.

ఓ విశ్వాసులారా! నమాజ్ యొక్క ఈ ప్రాధాన్యత దృష్ట్యా అల్లాహ్ దీని కొరకు త్వరపడమని ఆదేశిస్తున్నాడు, మరియు దీనికి సంబంధించి గొప్ప ప్రతిఫలాన్ని పెట్టాడు. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “పురుషుల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది మొదటి పంక్తి. అత్యంత హీనమైనది చివరి పంక్తి. స్త్రీల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది చివరి పంక్తి. అత్యంత హీనమైనది మొదటి పంక్తి”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు  తెలిస్తే, దానిని పొందటానికి వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం లేదని భావిస్తే, వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు. మరియు నమాజ్ కొరకు త్వరపడడం వల్ల లభించే పుణ్యఫలం ఎంతో తెలిస్తే వారు ఒకరిని మించి ఒకరు పోటీపడతారు. అదేవిధంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సామూహికంగా చేయడంలో ఎంత పుణ్యముందో ప్రజలకు తెలిస్తే వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చిన సరే వారు తప్పకుండా వస్తారు.” (బుఖారీ-ముస్లిం)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ హదీసులో(ما في النداء) దీని అర్థం అజాన్ ఇచ్చే వారికి లభించే అటువంటి పుణ్యఫలం మరియు “ یستهموا” దీని అర్థం లాటరీ వేయడం మరియు” تهجير ” దీని అర్థం త్వరపడటం మరియు” عتمة” దీని అర్థం ఇషా నమాజ్.

బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిస్సందేహంగా అల్లాహ్ తొలి పంక్తుల్లో ఉండేవారిపై కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు దైవదూతలు వారి పాప క్షమాపణ కొరకు దువా చేస్తారు”. (అబూ దావుద్)

ప్రవక్త వారి ఈ ఆదేశంలో దైవదూతలు వారి కొరకు దువాలు చేస్తారు. దీని యొక్క అర్థం ఏమిటంటే దైవదూతలు మొదటి పంక్తిలో ఉండే వారి కొరకు పుణ్యం మరియు క్షమాపణ యొక్క దువా చేస్తారు ఎందుకంటే అరబ్బీలో సలాహ్ అంటే దుఆ అని అర్థం కూడా వస్తుంది.

ఇర్బాజ్ బిన్ సారియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మొదటి పంక్తి వారి కొరకు మూడుసార్లు మరియు రెండవ పంక్తి వారి కొరకు ఒకసారి మగ్ ఫిరత్ (పాప క్షమాపణ) దుఆ చేసేవారు.(నసాయి)

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: తన సహచరులు వెనుక (పంక్తుల్లో) ఉండిపోవటం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మందలిస్తూ, “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ తర్వాత వచ్చిన వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటు తనానికి గురిచేస్తాడు” అని అన్నారు. (ముస్లిం)

ఆయిషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “ఎవరైతే మొదటి పంక్తులకు దూరంగా ఉంటారో అల్లాహ్ తఆల వారిని తన కారుణ్యానికి కూడా దూరంగా ఉంచుతాడు”.(అబూ దావుద్)

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన తౌబా (పశ్చాత్తాపం) చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

స్తోత్రం మరియు దరూద్ తరువాత

మీరు తెలుసుకోండి! అల్లాహ్ మీపై కనికరించు గాక! ఇస్లాంలో నమాజుకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, ఇంత గొప్ప ప్రాధాన్యత మరి యే ఇతర ఆరాధనకు లేదు. ఇస్లాం యొక్క ముఖ్య మూల స్తంభాలలో ఒకటి. ఇది లేకుండా ధర్మం స్థిరంగా ఉండలేదు.

ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఏమిటి నేను మీకు ధర్మం యొక్క అసలు మరియు దాని మూల స్తంభం మరియు దాని యొక్క శిఖరం గురించి తెలియజేయనా?” అప్పుడు నేను ఇలా అన్నాను, ఎందుకు కాదు మహా ప్రవక్తా! తెలియజేయండి. ప్రవక్త వారు ఇలా అన్నారు: “ధర్మం యొక్క అసలు ఇస్లాం, దాని మూల స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం అల్లాహ్ మార్గంలో పోరాడటం”. (తిర్మిజి)

దాసుడు మరియు అల్లాహ్ మధ్య ఇది సంభాషణకు ఒక సాధన, ఎందుకంటే నమాజులో అల్లాహ్ యొక్క పొగడ్త, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరుగుతుంది.  నమాజ్ ఆరాధన హృదయం, నాలుక మరియు శరీర అవయవాల పై ఆధారపడి ఉంది ఉదాహరణకు అల్లాహ్ యొక్క పొగడ్త, దువా చేయడం, ఖురాన్ పఠించడం, అల్లాహ్ ను స్తుతించడం, తక్బీర్ చెప్పడం, మరియు శరీర అవయవాలతో ఏకాగ్రచిత్తంతో ఆచరించడం మరియు రుకూ, సజ్దా చేయడం మరియు అందులో వినయ వినమ్రతలు కనబరుస్తూ తమ చూపుని కిందికి వాల్చుకొని అల్లాహ్ ముందు తలవంచి నిల్చోవడం.

إنَّ الصَّلَوَةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ
నిశ్చయంగా నమాజ్‌ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). (29:45)

షేఖ్ సాది (రహిమహుల్లాహ్) పై ఆయత్ యొక్క వివరణలో ఇలా తెలియజేస్తున్నారు:- నమాజ్ యొక్క ఒక లక్ష్యం దాని కంటే గొప్పది అనగా హృదయం మరియు నాలుక మరియు శరీరంతో అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఎందుకంటే అల్లాహ్ తన దాసులను దాని కొరకే పుట్టించాడు, దాసులవైపు నుంచి చేసేటువంటి ఆరాధనలలో అతి గొప్ప ఆరాధన నమాజ్. నమాజులో తప్ప మనిషి యొక్క శరీర అవయవాల ద్యారా ఇలాంటి ఆరాధన జరగదు. అందుకే అల్లాహ్ అంటున్నాడు (وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ) అల్లాహ్ స్మరణ అన్నింటి కంటే గొప్పది.

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై  అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు మరియు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

సామూహిక నమాజ్ విధి – వ్యాపారం మరియు ఇతర కార్య కలాపాల వలన నిర్లక్ష్యం వహించడం నిషేదం [ఖుత్బా]

ఖుత్బా అంశము : సామూహిక నమాజ్ విధి-వ్యాపారం మరియు ఇతర కార్య కలాపాల వలన నిర్లక్ష్యం వహించడం నిషేదం         

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటికంటే ఉత్తమమైనమాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తతమైన పద్దతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారి పద్దతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడినవి. బిద్అత్ కార్యకలాపాలు మరియు ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతికార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకములోకి  తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుంచి దూరంగా ఉండండి మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి. అల్లాహ్ తఆల ముస్లింలకు జమాత్ తో అనగా (సామూహికంగా) మస్జిద్లో నమాజ్ ఆచరించమని ఆజ్ఞాపించాడు. మరియు అకారణంగా నమాజ్ నుండి దూరంగా ఉండడాన్ని వారించాడు.  మరియు మస్జిదులో జమాతుతో నమాజ్  చదవడం గురించి అనేక హదీసులలో ఆజ్ఞాపించబడింది.

1. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఈ విధంగా ప్రవచించారు:

మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా సామూహికంగా చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించటానికి కారణమేమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతేకాదు, అతని వల్ల జరిగిన పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంతవరకూ దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, “అల్లాహ్! ఇతనిపై శాంతి కురిపించు. అల్లాహ్! ఇతణ్ణి కనికరించు” అని అంటూ ఉంటారు. మస్జిద్లో ప్రవేశిం చిన తర్వాత సామూహిక నమాజ్ కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంత సేపూ అతను నమాజ్లో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. (అంటే అతనికి అంత పుణ్యం లభిస్తుందన్నమాట).(బుఖారీ-ముస్లిం)

2. హజ్రత్ ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: రేపు (ప్రళయ దినాన) తానొక ముస్లింగా అల్లాహ్ ను కలవాలనుకునే వ్యక్తి ఈ నమాజుల కొరకు అజాన్ (ప్రకటన) ఇవ్వబడినప్పుడల్లా వాటిని పరిరక్షించుకోవాలి, (అంటే వాటిని తప్పకుండా – నెరవేర్చాలి.) ఎందుకంటే అల్లాహ్ మీ ప్రవక్త కొరకు మార్గదర్శక పద్ధతుల్ని నిర్ణయించాడు. నమాజులు కూడా ఆ మార్గదర్శక పద్ధతుల్లోనివే. ఒకవేళ మీరు కూడా ఈ వెనక ఉండేవాని మాదిరిగా ఇంట్లో నమాజ్ చేసుకుంటే మీరు మీ ప్రవక్త విధానాన్ని వదలి పెట్టినవారవుతారు. మీరు గనక మీ ప్రవక్త విధానాన్ని విడిచి పెట్టినట్లయితే తప్పకుండా భ్రష్ఠత్వానికి లోనవుతారు. ఎవరైతే ఉన్నతమైన రీతిలో వుజూ చేసి  మస్జిద్ వైపు బయలుదేరుతారో వారి ఒక అడుగు బదులుగా ఒక సత్కార్యం వారి పేరున రాయబడుతుంది మరియు వారి ఒక్క స్థానం ఉన్నతం చేయబడుతుంది మరియు ఒక పాపం మన్నించడం జరుగుతుంది. మా కాలంలో నేను గమనించేవాణ్ణి పేరెన్నికగన్న కపటులు మాత్రమే (సామూహిక నమాజ్లో పాల్గొనకుండా) వెనక ఉండిపోయేవారు. (వ్యాధి మొదలగు కారణాల చేత) నడవలేక పోతున్నవారిని ఇద్దరు మనుషుల సాయంతో తీసుకొని వచ్చి పంక్తిలో నిలబెట్టడం జరిగేది. (ముస్లిం)

నమాజుకు త్వరగా వెళ్ళుట (التبكير إلى الصلاة) [వీడియో | టెక్స్ట్]

అజాన్ కు ముందు లేదా కనీసం అజాన్ అయిన వెంటనే నమాజు కోసం  మస్జిద్ కు వెళ్ళే అలవాటు వేసుకోవడంలో ఎంత గొప్ప పుణ్యం ఉందో తెలుపుతుందీ మీకు ఈ వీడియో

నమాజుకు త్వరగా వెళ్ళుట (التبكير إلى الصلاة)
https://www.youtube.com/watch?v=UAVJmKoyW7A [2 నిమిషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్.

నమాజులో ఎల్లప్పుడూ ముందడుగు వేయుట, నమాజు కొరకు శీఘ్రపడుట, తొందరపడుట, నమాజ్ చేయటానికై మస్జిద్ కు వెళ్లడంలో అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయుట ఇది ఎంతో శుభకరమైన, ఎంతో గొప్ప పుణ్యం గల ఒక సత్కార్యం. ఈ రోజుల్లో చాలామంది ఈ సత్కార్యాన్ని ఎంతో మర్చిపోతున్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ వినండి. ప్రవక్త గారు చెప్పారు:

لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ 
లవ్ యాలమున్నాసు మాఫిన్నిదాయి వస్సఫ్ఫిల్ అవ్వల్.
ఒకవేళ ప్రజలకు అదాన్ ఇవ్వడంలో, మొదటి పంక్తిలో నిలబడడంలో ఎంత పుణ్యం ఉన్నదో తెలిసి ఉండేది ఉంటే,

ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا 
సుమ్మలమ్ యజిదూ ఇల్లా అయస్తహిమూ అలైహి లస్తహమూ.
ఈ సదవకాశాన్ని పొందడానికి, అంటే అదాన్ ఇవ్వడానికి మరియు మొదటి పంక్తిలో నిలబడడానికి వారికి కురా వేసుకోవడం, చీటీ వేయడం లాంటి అవసరం పడినా వారు వేసుకొని ఆ అవకాశాన్ని పొందే ప్రయత్నం చేసేవారు.

అలాగే,

وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ 
వలవ్ యాలమూన మాఫిత్తహ్జీర్ లస్తబఖూ ఇలైహ్.
ముందు ముందు వెళ్లడం, అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయడంలో ఎంత పుణ్యం ఉన్నదో వారికి తెలిసి ఉండేది ఉంటే దానికి త్వరపడేవారు, తొందరగా వెళ్లేవారు.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరొక హదీస్ కూడా వినండి. ఇప్పుడు విన్న హదీసులో ఘనత తెలిసింది. చాలా గొప్ప పుణ్యం ఉన్నది అని చెప్పారు. ఆ పుణ్యం ఎంతో అనేది వివరణ ఇవ్వడం లేదు. కానీ మరో హదీస్ చాలా భయంకరంగా ఉంది. ఎవరైతే వెనకనే ఉండిపోతా ఉంటారో వారి గురించి హెచ్చరిస్తూ చెప్పారు:

لَا يَزَالُ قَوْمٌ يَتَأَخَّرُونَ حَتَّى يُؤَخِّرَهُمُ اللَّهُ
లా యజాలు కౌమున్ యతఅఖ్ఖరూన్ హత్తా యుఅఖ్ఖిరహుముల్లాహ్.
కొందరు నమాజుల్లో మస్జిద్ కు వెళ్లడంలో మాటిమాటికీ వెనక ఉండే ప్రయత్నం చేస్తారు, చాలా దీర్ఘంగా వస్తూ ఉంటారు. చివరికి అల్లాహుతాలా వారిని వెనకనే ఉంచేస్తాడు. అన్ని రకాల శుభాలకు, అన్ని రకాల మేళ్లకు, అన్ని రకాల మంచితనాలకు వారు వెనకే ఉండిపోతారు.

అల్లాహుతాలా ప్రతీ సత్కార్యంలో మస్జిద్ కు వెళ్లడంలో ముందడుగు వేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు వెనక ఉండే వారిలో ఎవరైతే కలుస్తారో అలాంటి వారి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత [వీడియో & టెక్స్ట్]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత (فضل الذكر بعد الآذان)
https://www.youtube.com/watch?v=IUyKck4lvfI [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అజాన్ తర్వాత చెదివే ఈ రెండు దుఆల ఘనత చాలా గొప్పగా ఉంది
ప్రతి అజాన్ తర్వాత చదవండి, అనేకానేక పుణ్యాలు, లాభాలు పొందండి

ఈ వీడియో లో చెప్పబడిన దుఆలు ఇక్కడ నేర్చుకోవచ్చు: అజాన్ తర్వాత చేయు దుఆలు 

ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.

మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.

మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)

“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”

అని చదువుతారో,

غُفِرَ لَهُ ذَنْبُهُ
(గుఫిర లహూ దన్బుహూ)

వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.

ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.

ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతి త్తామ్మ, వస్సలాతిల్ ఖాయిమ, ఆతి ముహమ్మదన్ అల్ వసీలత వల్ ఫదీల, వబ్ అత్ హు మఖామమ్ మహ్మూదన్ అల్లదీ వ అత్తహ్)

“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”

అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=5568