వక్రబుద్ధి కలవారు ఎల్లప్పుడూ అస్పష్టమయిన సూక్తుల వెంటే పడతారు

1705. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ క్రింది సూక్తుల్ని పఠించారు:

“ఆయనే మీ (హృదయ ఫలకం) పై ఈ గ్రంధాన్ని అవతరింపజేసినవాడు. ఇందులో రెండు రకాల సూక్తులున్నాయి. ఒకటి ముహ్కమాత్ (స్పష్టమైనవి). ఇవి గ్రంథానికి పునాదులు వంటివి. రెండు : ముతషాబిహాత్ (అస్పష్టమైనవి). వక్రబుద్ధి కలవారు కలహాలు సృష్టించే ఉద్దేశ్యంతో ఎల్లప్పుడూ అస్పష్టమయిన సూక్తుల వెంటే పడతారు. వాటికి లేనిపోని అర్ధాలు ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. నిజానికి వాటి అసలు భావం ఆల్లాహ్ కి తప్ప మరెవరికీ తెలియదు. దీనికి భిన్నంగా విషయ పరిజ్ఞానంలో స్థిత ప్రజ్ఞులయినవారు ‘మేము వీటిని నమ్ముతున్నాము. ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే’ అని అంటారు. అసలు ఏ విషయం ద్వారానయినా బుద్దిమంతులే గుణపాఠం గ్రహించగలరు” (ఆలి ఇమ్రాన్ : 7)

ఆ తరువాత ఆయన ఈ విధంగా ప్రవచించారు : “మీరెప్పుడయినా దివ్య ఖుర్ఆన్ లోని ఈ అస్పష్టమయిన సూక్తుల వెంటబడి ఆరా తీయడానికి ఎవరైనా ప్రయత్నిచడం చూస్తే, అల్లాహ్ (ఖుర్ఆన్ లో) వారిని గురించే ప్రస్తావించాడని తెలుసుకొని వారికి దూరంగా ఉండండి”.

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – తఫ్సీర్, 3 వ సూరా – ఆలి ఇమ్రాన్, 1 వ అధ్యాయం – మిన్హు ఆయాతున్ ముహ్ కమాత్]

విద్యా విషయక ప్రకరణం : 1 వ అధ్యాయం – దివ్య ఖుర్ఆన్ లోని అస్పష్ట సూక్తుల వెంట పడకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లల విధివ్రాత గురించి

1703. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశ్నించటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ “వారు పెరిగి పెద్ద వాళ్ళయిన తరువాత ఎలాంటి  కర్మలు ఆచరిస్తారో అల్లాహ్ కే తెలుసు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయిజ్, 93 వ అధ్యాయం – మాఖీల ఫీ ఔలాదిల్ ముష్రికీన్]

విధివ్రాత ప్రకరణం : 6 వ అధ్యాయం – ప్రతి పిల్లవాడు ప్రకృతి ధర్మంపై పుడతాడు.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు

1366. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కధనం :-

నేనొక దిండు (లేక తలగడ) కొన్నాను. దాని మీద బొమ్మలు వేసి ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుంచి వచ్చి దాన్ని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. ఇంట్లోకి ప్రవేశించలేదు. నేనాయన ముఖంలో ఆగ్రహ చిహ్నాలు చూసి ‘దైవప్రవక్తా! నేను అల్లాహ్ ముందు, ఆయన ప్రవక్త ముందు పశ్చాత్తాపపడుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నేను చేసిన తప్పేమిటో సెలవియ్యండి” అని అన్నాను.

దానికి ఆయన “ఈ దిండేమిటి?” అని అడిగారు. “ఈ దిండు మీరు ఆనుకొని కూర్చుంటారన్న ఉద్దేశ్యంతో కొన్నాను” అని చెప్పాను నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)

“బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు. ‘నీవు సృష్టించిన దీనికి ప్రాణం పొయ్యి అంటాడు అల్లాహ్ అతనితో (అతనా పని చేయలేడు)” అని అన్నారు. ఆ తరువాత “బొమ్మలు ఉండే ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు” అని చెప్పారు ఆయన.

[సహీహ్ బుఖారీ : 34 వ ప్రకరణం – అల్ బుయూ, 40 వ అధ్యాయం – అత్తిజారతి ఫీమా యుక్రహు లుబ్సుహూ లిర్రిజాలి వన్నిసా]

వస్త్రధారణ, అలంకరణల ప్రకరణం : 26 వ అధ్యాయం – కుక్క, (ప్రాణుల) చిత్రాలుండే ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

నరకం నుండి బయట పడే చివరి మనిషి

117. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా సెలవిచ్చారు –

నరకం నుండి అందరికంటే చివర్లో బయటపడే, స్వర్గంలోనూ అందరికంటే చివర్లో ప్రవేశించే వ్యక్తిని గురించి నాకు బాగా తెలుసు. అతను నరకం నుండి పడుతూ లేస్తూ బయలుదేరుతాడు. అతనితో అల్లాహ్ ‘వెళ్ళు, (ఇక) స్వర్గంలో ప్రవేశించు’ అని అంటాడు. ఆ వ్యక్తి స్వర్గం దగ్గరికి వస్తాడు. చూస్తే స్వర్గం పూర్తిగా నిండిపోయి (జనంతో) క్రిక్కిరిసి ఉన్నట్లు కన్పిస్తుంది. దాంతో అతను వెనక్కి తిరిగొచ్చి “ప్రభూ! అది పూర్తిగా నిండిపోయి ఉంది (నాకక్కడ చోటే ఉన్నట్లు కన్పించడం లేదు)” అని అంటాడు.దానికి అల్లాహ్ “వెళ్ళు, స్వర్గంలో ప్రవేశించు. నేనక్కడ నీకు ప్రపంచమంత చోటిచ్చాను. ప్రపంచ మంతేమిటీ, దానికి పదింతలు విశాలమైన చోటిచ్చాను (వెళ్ళు)” అని అంటాడు.(అయితే ఆ వ్యక్తికి నమ్మకం కలగలేదు అందువల్ల) అతను “ప్రభూ! తమరు (సర్వలోకాల) చక్రవర్తి అయి ఉండి నాలాంటి వారితో పరిహాసమాడుతున్నారా? లేక నన్ను ఆట పట్టిస్తున్నారా?” అని అంటాడు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయం తెలియజేస్తూ ఫక్కున నవ్వారు. అప్పుడు ఆయన పల్లు కూడా స్పష్టంగా కనిపించాయి” అని అన్నారు. ఈ వ్యక్తి స్వర్గవాసులలో అందరికంటే అతి తక్కువ అంతస్తు కలవాడని అంటారు.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 51 వ అధ్యాయం – సిఫతుల్ జన్నతి వన్నార్]

విశ్వాస ప్రకరణం – 81 వ అధ్యాయం – నరకం నుండి బయట పడే చివరి మనిషి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

దైవాదేశాలకు విరుద్ధంగా లేనంత వరకూ పాలకుల ఆజ్ఞలను శిరసావహించడం (ప్రజల) విధి

1204. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరు నాకు విధేయుడయ్యాడో  అతను వాస్తవానికి అల్లాహ్ కి విధేయుడయ్యాడు – మరెవరు నాకు అవిధేయుడయ్యాడో అతను నిజానికి అల్లాహ్ కే అవిధేయుడయిపోయాడు. అలాగే ఎవరు నేను నియమించిన నాయకునికి విధేయత చూపాడో అతను నాకు విధేయత చూపినట్లే; మరెవరు నేను నియమించిన నాయకునికి అవిధేయుడయ్యాడో అతను స్వయంగా నాకు ఆవిధేయుడయి పోయాడన్నమాట.(*)

[సహీహ్ బుఖారీ : 93 వ ప్రకరణం – అహ్కామ్, 1 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (అతీవుల్లాహ వ అతీవుర్రసూల వ ఉలిల్ అమ్రి మిన్ కుమ్)]

(*) ఈ ప్రవచనంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అధికారి విధేయతను తన విధేయతతో పోల్చి అధికారుల వ్యవహారానికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. దీనిక్కారణం ఖురైషీయులకు వారి దగ్గర ఉండే అరబ్బులకు నాయకత్వపు హొదా గురించి అంతగా తెలియక పోవడమే. వారు తమ తెగ నాయకులకు తప్ప మరెవరికీ తలవొగ్గరు. ఇస్లామీ యుగం ప్రారంభ రోజుల్లో ఆ అరబ్బులకు తమపై నాయకుడ్ని నియమించడం నచ్చలేదు. దాంతో కొందరు నాయకునికి విధేయత చూపడానికి నిరాకరించారు. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాయకునికి విధేయత చూపడమంటే తనకు విధేయత చూపడమేనని చెప్పి అధికారి (నాయకుని) విధేయతకు అత్యంత ప్రాముఖ్యమిచ్చారు. ప్రజలు అధికారులకు విధేయత చూపడం నేర్చుకొని, సమాజంలో సంక్షోభం, అనైక్యతలు సృష్టించకూడదన్నదే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనంలోని ఆంతర్యం (సంకలనకర్త).

పదవుల ప్రకరణం : 8 వ అధ్యాయం – ధైవాదేశాలకు విరుద్ధంగా లేనంత వరకూ పాలకుల ఆజ్ఞలను శిరసావహించడం (ప్రజల) విధి.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

కపట విశ్వాసులకు ఫజ్ర్, ఇషా నమాజుల కంటే మరే నమాజు భారంగా ఉండదు

383. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-

కపట విశ్వాసులకు ఫజ్ర్, ఇషా నమాజుల కంటే మరే నమాజు భారంగా ఉండదు. అయ్యో! ఈ రెండు నమాజులకు  ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే వారీ నమాజుల్లో పాల్గొనడానికి మోకాళ్ళ మీద కుంటుకుంటూ రావలసి వచ్చినా సరే తప్పకుండా వస్తారు (కాని ఈ కపటుల కసలు నా మాటల మీద నమ్మకమే లేదాయే). ముఅజ్జిన్ కు ఇఖామత్ (పిలుపు) ఇవ్వమని చెప్పి, నమాజు చేయించడానికి (నా స్థానంలో) మరొకరిని నిలబడమని ఆజ్ఞాపించి నేను స్వయంగా అగ్నిజ్వాల తీసుకొని నమాజుకు ఇంకా రాని వారి ఇండ్లను తగలబెడదామని (ఎన్నోసార్లు) అనుకున్నాను.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 34 వ అధ్యాయం – ఫజ్లిల్ ఇషాయి ఫిల్ జమాఅత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 42 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

No Salaat (prayer) is more heavy (harder) for the hypocrites than
the Fajr and the ‘Ishaa prayers

ఆత్మహత్య చేసుకున్న వాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లింకే స్వర్గ ప్రవేశం

69. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం,

కొండ మీద నుండి పడి ఆత్మహత్య చేసుకున్న వాడు నరకానికి పోయి, మాటిమాటికి కొండ మీద నుండి త్రోయబడే ఘోర శిక్షను శాశ్వతంగా చవిచూస్తూ ఉంటాడు. విషం తిని ఆత్మహత్య చేసుకున్న వాడు నరకంలో విషంచేత పట్టుకొని తింటూ ఎల్లప్పుడు తనను తాను హతమార్చుకుంటూ ఉంటాడు. ఏదైనా ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో కూడా అదే ఆయుధం తీసుకొని కడుపులో పొడుచుకుంటూ, ఎల్లప్పుడు తీవ్ర యాతనలు అనుభవిస్తూ ఉంటాడు.

[సహీహ్ బుఖారీ : 76 వ ప్రకరణం – తిబ్, 56 వ అధ్యాయం]

విశ్వాస ప్రకరణం – 45 వ అధ్యాయం – ఆత్మహత్య చేసుకున్న వాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లింకే స్వర్గ ప్రవేశం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

స్వర్గంలో అత్యధిక మంది పేదలు, నరకంలో అత్యధిక మంది స్త్రీలు

1743. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

నేను స్వర్గ ద్వారం దగ్గర నిలబడి చూశాను. స్వర్గంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది నిరుపేదలే ఉన్నారు.  ధనికులు (విచారణ కోసం ద్వారం ముందు) నిరోధించబడ్డారు. అయితే నరకానికి పోవలసిన ధనికుల్ని నరకంలోకి పంపమని ముందే ఆజ్ఞాపించడం జరిగింది. నేను నరక ద్వారం దగ్గర కూడా నిలబడి చూశాను. నరకంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది స్త్రీలే ఉన్నారు.

[సహీహ్ బుఖారీ : 67 వ ప్రకరణం – నికాహ్, 87 వ అధ్యాయం – హద్దసనా ముసద్దద్]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 26 వ అధ్యాయం – స్వర్గంలో అత్యధిక మంది పేదలు, నరకంలో అత్యధిక మంది స్త్రీలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

పేదలు, అనాధలు, వితంతువుల్ని ఆదుకోవటం వలన పొందే పుణ్యం

1878. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :-

పేదలు, అనాధలు, వితంతువులు, ఏ ఆధారం లేని స్త్రీలకు సేవ చేస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉండేవాడు దైవమార్గంలో ధర్మపోరాటం చేసే వారి లాంటివాడు. లేదా పగలంతా ఉపవాసం పాటిస్తూ రాత్రిళ్ళు (దైవారాధనలో) గడిపే వారితో సమానుడవుతాడు.

[సహీహ్ బుఖారీ : 69 వ ప్రకరణం – నఫఖాత్, 1 వ అధ్యాయం – ఫజ్లిన్నఫఖతి అలల్ ఆహ్లి]

ప్రేమైక వచనాల ప్రకరణం : 2 వ అధ్యాయం – పేదలు, అనాధలు, వితంతువుల్ని ఆదుకోవాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అమరగతుడైన ఒక్క వీరయోధుడు (షహీద్) తప్ప స్వర్గంలో ప్రవేశించిన ఏ వ్యక్తి కూడా తిరిగి ఇహలోకానికి పోవడానికి ససేమిరా ఇష్టపడడు.

1232. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :-

అమరగతుడైన ఒక్క వీరయోధుడు (షహీద్) తప్ప స్వర్గంలో ప్రవేశించిన ఏ వ్యక్తి కూడా ప్రపంచ సంపదలన్నీ ఇవ్వబడతాయన్నా సరే, తిరిగి ఇహలోకానికి పోవడానికి ససేమిరా ఇష్టపడడు. అమరగతుడైన వీరయోధుడు అమరగతి (షహాదత్) కి సంబంధించిన గౌరవ ఔన్నత్యాలు చూసి ఉంటాడు గనుక, అతను మళ్ళీ ఇహలోకానికి వెళ్లి (దైవమార్గంలో) పదిసార్లు (అయినా) వీరమరణం పొందాలని కోరుకుంటాడు.

[సహీహ్ బుఖారీ : 56 వ ప్రకరణం – జిహాద్, 21 వ అధ్యాయం – తమన్నిల్ ముజాహిది అయర్జిఅ ఇలాద్దున్యా]

పదవుల ప్రకరణం : 29 వ అధ్యాయం – దైవమార్గంలో అమరగతి – దాని ఔన్నత్యం.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth