https://youtu.be/UEPobrbzkmg [37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది. మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు. ఎల్లప్పుడు తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు. తమ హోదాను, అధికారాన్ని పెంచుకో వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు. నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు. మృత్యువు ఆసన్నమైనప్పుడు, సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు. తీర్పుదినాన వారు తమ కళ్ళారా నరకాన్ని చూసుకుంటారు. అల్లాహ్ కు దూరమైనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు.
102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ
అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.
102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.
102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ
ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.
102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.
102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).
102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ
మీరు నరకాన్ని చూసి తీరుతారు.
102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ
అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!
102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
మరి ఆ రోజు (అల్లాహ్) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
Video Text (వీడియో టెక్స్ట్)
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ اَمَّا بَعْدُ
అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
అఊజుబిల్లాహిస్సమీయిల్ అలీమి మినష్షైతానిర్రజీమ్.
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.
أَلْهَاكُمُ التَّكَاثُرُ
అల్ హాకుముత్తకాసుర్
అల్ హాకుమ్ అంటే మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఏమరపాటుకు గురి చేసింది, అశ్రద్ధలో పడవేసింది. అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసి, దానికంటే తక్కువ ప్రాముఖ్యత గల విషయంలో పడ్డాడంటే అతడు దాని నుండి ఏమరుపాటులో పడి వేరే పనిలో బిజీ అయ్యాడు. التَّكَاثُرُ అత్తకాసుర్ – అధికంగా పొందాలన్న ఆశ. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. తఫ్సీర్‌లో, వ్యాఖ్యానంలో మరికొన్ని వివరాలు ఇన్షాఅల్లాహ్ మనం తెలుసుకుందాము.
حَتَّىٰ
హత్తా
ఆఖరికి, చివరికి మీరు
زُرْتُمُ
జుర్తుమ్
సందర్శిస్తారు, చేరుకుంటారు
الْمَقَابِرَ
అల్ మకాబిర్
సమాధులను. మీరు సమాధులకు చేరుకుంటారు, ఈ అధికంగా పొందాలన్నటువంటి ఆశలోనే ఉండిపోయి.
كَلَّا
కల్లా
ఎన్నటికీ కాదు. మీ కోరికలన్నీ నెరవేరి పూర్తి అవుతాయనుకుంటారు కానీ అలా కాదు.
سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.
ثُمَّ كَلَّا
సుమ్మ కల్లా
మరెన్నటికీ కాదు,
سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.
كَلَّا
కల్లా
అది కాదు,
لَوْ تَعْلَمُونَ
లౌ తఅలమూన
మీరు గనక తెలుసుకున్నట్లయితే
عِلْمَ الْيَقِينِ
ఇల్మల్ యకీన్
నిశ్చిత జ్ఞానంతో, పూర్తి నమ్మకమైన జ్ఞానంతో. అంటే ఏమిటి ఇక్కడ? మీకు గనక ఇల్మె యకీన్ ఉండేది ఉంటే, మీకు పూర్తి నమ్మకమైన జ్ఞానం ఉండేది ఉంటే ఈ ఏమరుపాటులో ఏదైతే ఉన్నారో ఒకరి కంటే ఒకరు ఎక్కువగా పొందాలన్న ఆశలో పడిపోయి, ఆ ఆశల్లో ఉండరు, ఏమరుపాటుకు గురి కారు.
لَتَرَوُنَّ الْجَحِيمَ
ల తరవున్నల్ జహీమ్
మీరు తప్పకుండా చూసి తీరుతారు (ల ఇక్కడ బలంగా, గట్టిగా తాకీదుగా చెప్పడానికి ఒక ప్రమాణంతో కూడినటువంటి పదం అని వ్యాఖ్యానకర్తలు చెబుతారు)
الْجَحِيمَ
అల్ జహీమ్
నరకాన్ని.
ثُمَّ
సుమ్మ
అవును మళ్ళీ
لَتَرَوُنَّهَا
ల తరవున్నహా
మీరు దానిని తప్పకుండా చూసి తీరుతారు. హా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో హా అలిఫ్, దాని ఉద్దేశ్యం ఆ నరకం గురించి చెప్పడం. ఎలా?
عَيْنَ الْيَقِينِ
ఐనల్ యకీన్
ఖచ్చితమైన మీ కళ్ళారా మీరు ఆ నరకాగ్నిని చూసి తీరుతారు, చూసి ఉంటారు.
ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మరి ఆ రోజు
ثُمَّ
సుమ్మ
మళ్ళీ
لَتُسْأَلُنَّ
ల తుస్ అలున్న
మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది
يَوْمَئِذٍ
యౌమ ఇజిన్
ఆ రోజున
عَنِ النَّعِيمِ
అనిన్నయీమ్
అనుగ్రహాల గురించి. మరి ఆ రోజు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మీకు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటి గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
సూరహ్ అత్-తకాసుర్ ఘనతలు మరియు ప్రాముఖ్యత
సోదర మహాశయులారా, సోదరీమణులారా, మీరు ఈ సూరా గురించి సర్వసామాన్యంగా ఘనతలు ఎక్కువగా విని ఉండరు. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారు అంటే గుర్తుంచుకోండి అది ఏ సహీ హదీసుతో రుజువైన మాట కాదు. ఎలాగైతే సర్వసామాన్యంగా మనం సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్ (قُلْ هُوَ اللَّهُ أَحَدٌ – ఖుల్ హువల్లాహు అహద్) ఇప్పుడు ఏదైతే హమ్నా బిన్తె షేఖ్ అబూ హయ్యాన్ తిలావత్ చేశారో సూరతుల్ ఇఖ్లాస్, అలాగే సూరత్ అల్-ఫలఖ్, వన్నాస్ ఇంకా కొన్ని వేరే సూరాల విషయంలో ఎన్నో సహీ హదీసులు వచ్చి ఉన్నాయి. సూరతుత్-తకాసుర్ యొక్క ఘనత విషయం అంటున్నాను నేను, ఘనత. ఘనతలో ఏ ఒక్క సహీ హదీస్ లేదు. కానీ ఏదైనా సూరాకు, ఏదైనా ఆయత్‌కు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘనత లేనందువల్ల దాని స్థానం పడిపోలేదు. ఎందుకంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు, మాట గనక అందులో తక్కువ స్థానం ఏమీ ఉండదు. ఒకదాని ఘనత ఏదైనా ఉంటే అది వేరే విషయం కానీ లేనందుకు అది ఏదైనా తక్కువ స్థానం అన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు, ఒక మాట. రెండో మాట, ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడనప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రాముఖ్యత గల మనందరికీ, విశ్వాసులకు, అవిశ్వాసులకు, పుణ్యాత్ములకు, పాపాత్ములకు అందరికీ బోధపడే గుణపాఠాలు ఉన్నాయి.
రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ఆధారంగా ఇన్షాఅల్లాహ్ ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాము. ఇందులో మీరు ఇప్పుడు చూసినట్లుగా మొట్టమొదటి ఆయత్‌ను శ్రద్ధ వహించండి: أَلْهَاكُمُ التَّكَاثُرُ – అల్ హాకుముత్తకాసుర్. అల్ హాకుమ్ అంటే సంక్షిప్తంగా చెప్పేశాను. అత్తకాసుర్ అంటే, సోదర మహాశయులారా శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా ఎవరైతే ధర్మ క్లాసులలో హాజరవుతున్నారో, ఎవరైతే దావా పనులు చేస్తున్నారో వారు కూడా వినాలి. ఇంకా ఎవరైతే పరలోకం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, సత్కార్యాలలో చాలా వెనక ఉన్నారో వారైతే తప్పనిసరిగా వినాలి. చాలా విషయాలు ఈ అత్తకాసుర్ పదంలో వస్తున్నాయి. తకాసుర్ అంటారు కసరత్ ఎక్కువ కావాలి, అధికంగా కావాలి. మరియు తకాసుర్ ఇది అరబీ గ్రామర్ ప్రకారంగా ఎలాంటి సేగా (format) లో ఉంది అంటే ఒకరు మరొకరితో పోటీపడి అతని కంటే ఎక్కువ నాకు కావాలి అన్నటువంటి ఆశతో అదే ధ్యేయంతో దానినే లక్ష్యంగా పెట్టుకొని అలాగే జీవించడం, పూర్తి ప్రయత్నం చేయడం.
ఇక ఇది ప్రపంచ రీత్యా చూసుకుంటే, ఎవరైతే పరలోకాన్ని త్యజించి, పరలోకం గురించి ఏ ప్రయత్నం చేయకుండా కేవలం ఇహలోక విషయాల్లోనే పూర్తిగా నిమగ్నులై ఒకరి కంటే ఒకరు ఎక్కువగా ఉండాలి, ముందుగా ఉండాలి అన్నటువంటి ఆశలో జీవితం గడుపుతూ దానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారో, సంతానం వాని కంటే నాకు ఎక్కువ కావాలని గాని, వాని కంటే ఎక్కువ పెద్ద బిజినెస్ నాది కావాలి అని, వాని కంటే ఎక్కువ పొలాలు, పంటలు నాకు కావాలి అని, ఈ లోకంలో వారి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు, హోదా అంతస్తులు నాకు కావాలి అని, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారో గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా పరలోకాన్ని మరిపింపజేస్తే, పరలోకం పట్ల అశ్రద్ధలో పడవేస్తే ఇది చాలా చాలా నష్టం.
చివరికి మనం చేసే అటువంటి నమాజులు, ఉండే అటువంటి ఉపవాసాలు, హాజరయ్యే అటువంటి ఈ ధర్మ విద్య, ధర్మ జ్ఞాన క్లాసులు, మనం ఏ దావా కార్యక్రమాలు పాటిస్తూ ఉంటామో వీటన్నిటి ద్వారా నేను ఫలానా వారి కంటే ఎక్కువ పేరు పొందాలి. ఇలాంటి దురుద్దేశాలు వచ్చేసాయి అంటే ఈ పుణ్య కార్యాలు చేస్తూ కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత, పరలోక సాఫల్యం పట్ల ఆశ కాకుండా ఇహలోకపు కొన్ని ప్రలోభాలలో, ఇహలోకపు ఆశలలో పడి నేను నా ఈ యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా, నా యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాని కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసే వరకు వదలను. నేను నా యొక్క ఈ ప్రయత్నంలో అతని కంటే ముందుగా ఉండాలి, నా పేరు రావాలి, ఇట్లాంటి దురుద్దేశాలు వచ్చేస్తే పుణ్య కార్యాలు కూడా నాశనం అవుతాయి, పరలోకంలో చాలా నష్టపోతాము.
అల్లాహ్ భీతి మరియు ప్రాపంచిక సంపద
అయితే ఈ సందర్భంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసును తెలుసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటి ఆ హదీస్? వాస్తవానికి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము గనక అల్లాహు తఆలా సూరతుల్ కసస్‌లో చెప్పినట్లు:
وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا
వలా తన్స నసీబక మినద్దున్యా
పరలోకానికై పూర్తి ప్రయత్నంలో ఉండండి, అక్కడి సాఫల్యం కొరకు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో ఏదైతే కొంత మనం సమయం గడిపేది ఉన్నది, కొద్ది రోజులు ఉండవలసి ఉంది, దాని అవసరాన్ని బట్టి మాత్రమే మీరు కొంచెం ప్రపంచం గురించి కూడా మర్చిపోకండి.
కానీ ఇక్కడ జీవించడానికి ఏ ఇల్లు, ఏ కూడు, ఏ గూడు, ఏ గుడ్డ, ఏ ధనము, ఏ డబ్బు అవసరం ఉన్నదో అది మనకు కేవలం ఒక సాధనంగా, చిన్నపాటి అవసరంగానే ఉండాలి కానీ దాని కొరకే మనం అంతా కూడా వెచ్చించాము, సర్వము దాని కొరకే త్యజించాము అంటే ఇది మన కొరకు చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మనం ఇహపరాలన్నీ కూడా కోల్పోతాము.
ఏంటి ఆ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు, స్నానం చేసి. సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలో రావడం ఎంత ఆనందంగా కనిపించిందంటే సహాబాలు అన్నారు ప్రవక్తతో:
نراك اليوم طيب النفس
నరాకల్ యౌమ తయ్యిబన్నఫ్స్
ఓ ప్రవక్తా, ఎంత మంచి మూడ్‌లో మీరు ఉన్నట్లు కనబడుతున్నారు, చాలా ఆనందంగా, మంచి మనస్సుతో ఉన్నట్లుగా మేము చూస్తున్నాము.
ప్రవక్త చెప్పారు:
أجل والحمد لله
అజల్, వల్ హందులిల్లాహ్
అవును, అల్లాహ్ యొక్క హమ్ద్, అల్లాహ్ యొక్క శుక్ర్, అల్లాహ్ కే స్తోత్రములు.
మళ్ళీ ప్రజలు కొంత సిరివంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, గమనించండి హదీసును:
لَا بَأْسَ بِالْغِنَى لِمَنِ اتَّقَى
లా బఅస బిల్ గినా లిమనిత్తకా
అల్లాహ్ యొక్క భయభీతి కలిగిన వానికి అల్లాహ్ సిరివంతం ప్రసాదించడం, సిరివంతం గురించి అతడు కొంచెం ప్రయత్నం చేయడం పాపం కాదు, చెడుది కాదు.
మంచిది అని అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గమనించండి. ఏమన్నారు? లా బఅస్. ఒకవేళ అల్లాహ్ తో భయభీతి, అల్లాహ్ యొక్క భయభీతితో డబ్బు సంపాదిస్తూ, డబ్బు కొంచెం జమా చేస్తూ, అవసరం ఉన్న ప్రకారంగా ఖర్చు చేస్తూ అతడు ధనవంతుడు అవుతున్నాడంటే ఇది చెడ్డ మాట ఏమీ కాదు.
మళ్ళీ చెప్పారు:
وَالصِّحَّةُ لِمَنِ اتَّقَى خَيْرٌ مِنَ الْغِنَى
వస్సిహతు లిమనిత్తకా ఖైరుమ్ మినల్ గినా
కానీ ఆరోగ్యం భయభీతి కలిగే వారికి, అల్లాహ్ యొక్క భయంతో జీవించే వారికి ఆరోగ్యం అన్నది వారి యొక్క ధనం కంటే ఎంతో మేలైనది.
గమనిస్తున్నారా?
وَطِيبُ النَّفْسِ مِنَ النَّعِيمِ
వతీబున్నఫ్సి మినన్నయీమ్
మరియు మనిషి మంచి మనస్సుతో ఉండడం ఇది కూడా అల్లాహ్ అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం.
ఇప్పుడు ఈ సూరా మనం చదువుతున్నామో దాని యొక్క చివరి ఆయత్‌కు కూడా ఈ హదీస్ వ్యాఖ్యానంగా గొప్ప దలీల్ ఉంటుంది మరియు మొదటి ఆయత్ ఏదైతే ఉందో దానికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుంది, దాని యొక్క వ్యాఖ్యానంలో. ఎందుకంటే హదీస్ యొక్క మూడు భాగాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాలు చెప్పారు కదా, భయభీతి కలిగే వారికి ధనం ఎలాంటి నష్టం లేదు లేదా చెడు కాదు. కానీ ఆరోగ్యం అన్నది భయభీతి గలవారికి వారి ధనాని కంటే చాలా ఉత్తమమైనది. ఈ రెండు విషయాలు మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది, అల్ హాకుముత్తకాసుర్.
అయితే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? మనిషి ఫలానా కంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుతున్నాడు, ఏదైనా ప్రపంచ విషయం. కానీ అక్కడ ఉద్దేశ్యం ఏమున్నది? అతని జీవితం ఎలా ఉన్నది? అల్లాహ్ యొక్క భయభీతితో గడుస్తున్నది. అతని యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఆ డబ్బు గాని, ధనం గాని, సంతానం గాని, ఇహలోకంలో ఇంకా ఏదైనా స్థానం సంపాదించి దాని ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడంలో, ప్రజలకు మేలు చేకూర్చడంలో మనం ముందుకు ఉండాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత తను కోరుతున్నాడు. అలాంటప్పుడు సోదర మహాశయులారా, ఇలాంటి ఈ ధనం, ఇలాంటి ఈ ఆరోగ్యం, ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు కోరడం తప్పు కాదు. ఒక రకంగా చూసుకుంటే అతని కొరకు పరలోకంలో ఇవి ఎంతో పెద్ద గొప్ప స్థానాన్ని తెచ్చిపెడతాయి మరియు అతడు ఈ విధంగా ఎంతో ముందుగా ఉంటాడు.
ఇంకా ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే:
حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
హత్తా జుర్తుముల్ మకాబిర్
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.
హత్తా జుర్తుముల్ మకాబిర్ అని చెప్పడం జరిగింది. ఈ జుర్తుముల్ మకాబిర్ అన్నటువంటి ఆయత్ ద్వారా బోధపడే విషయం ఏమిటి? గమనించండి, నేను వ్యాఖ్యానం చేస్తూ దానితో పాటే కొన్ని లాభాలు కూడా తెలియజేస్తున్నాను, మనకు వేరుగా లాభాలు చెప్పుకోవడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. జుర్తుముల్ మకాబిర్‌లో అఖీదాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నుండి చనిపోయేది ఉంది.
రెండవది, మనుషులను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే సర్వ మానవులకు నాచురల్ గా, స్వాభావికంగా ఇవ్వబడినటువంటి పద్ధతి. దీనికి భిన్నంగా ఎవరైనా కాల్చేస్తున్నారంటే, ఎవరైనా మమ్మీస్‌గా తయారు చేసి పెడుతున్నారంటే, ఇంకా ఎవరైనా ఏదైనా బాడీ ఫలానా వారికి డొనేట్ చేశారు, సైంటిఫిక్ రీసెర్చ్‌ల కొరకు, ఈ విధంగా ఏదైతే సమాధి పెట్టకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారో ఇది ప్రకృతి పద్ధతి కాదు, అల్లాహ్ మానవుల మేలు కొరకు తెలిపినటువంటి పద్ధతి కాదు. అల్లాహు తఆలా సర్వ మానవాళి కొరకు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే మొట్టమొదటి మానవుడు చనిపోయిన, అంటే మొట్టమొదటి మానవుడు ఎవరైతే చనిపోయారో ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుడు, ఒక కాకి ద్వారా నేర్పడం జరిగింది, సూరహ్ మాయిదాలో దాని ప్రస్తావన ఉంది. సూరత్ అబసాలో చదవండి మీరు:
ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
సుమ్మ అమాతహు ఫ అక్బరహ్
అల్లాహ్ యే మరణింపజేశాడు మరియు మిమ్మల్ని సమాధిలో పెట్టాడు.
సూరత్ తాహాలో చదివితే:
مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ
మిన్హా ఖలక్నాకుమ్ వఫీహా నుయీదుకుమ్ వమిన్హా నుఖ్రిజుకుమ్
ఇదే మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము, తిరిగి అందులోనే మిమ్మల్ని పంపిస్తాము, తిరిగి అక్కడి నుండే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము, లేపుతాము.
అయితే ఇదొక మాట, అఖీదాకు సంబంధించింది. మూడో మాట ఇందులో మనకు ఏం తెలుస్తుందంటే సమాధి అన్నది శాశ్వత స్థలం కాదు. అందుకొరకే ఉర్దూలో గాని, అరబీలో గాని లేదా తెలుగులో గాని అతడు తన చివరి గమ్యానికి చేరుకున్నాడు, ఎవరైనా చనిపోతే అంటారు కదా, ఈ మాట సరియైనది కాదు. మనిషి యొక్క చివరి మెట్టు, చివరి యొక్క అతని యొక్క స్థానం అది స్వర్గం లేదా నరకం. అల్లాహ్ మనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకం నుండి రక్షించుగాక.
ఈ ఆయతులో, హత్తా జుర్తుముల్ మకాబిర్, మరొక చాలా ముఖ్యమైన అఖీదాకు సంబంధించిన విషయం ఏమిటంటే ఈ ఆయతు ద్వారా సలఫె సాలెహీన్ యొక్క ఏకాభిప్రాయం, సమాధిలో విశ్వాసులకు, పుణ్యాత్ములకు అనుగ్రహాలు లభిస్తాయి మరియు అవిశ్వాసులకు, మునాఫికులకు, పాపాత్ములకు శిక్షలు లభిస్తాయి. ఇది ఏకీభవించబడిన విషయం. దీనిని చాలా కాలం వరకు తిరస్కరించే వారు ఎవరూ లేకుండిరి, కానీ తర్వాత కాలాల్లో కొందరు పుట్టారు. మరికొందరు ఏమంటారు, ముస్లింలని తమకు తాము అనుకునే అటువంటి తప్పుడు వర్గంలో, తప్పుడు మార్గంలో ఉన్నవారు కొందరు ఏమంటారు, హా, సమాధిలో శిక్ష జరుగుతుంది కానీ కేవలం ఆత్మకే జరుగుతుంది, శరీరానికి జరగదు. ఇలాంటి మాటలు చెప్పడం కూడా సహీ హదీసుతో రుజువు కావు. ఎందుకంటే అది అల్లాహ్ ఇష్టంపై ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అనుగ్రహాలు లభించడం మరియు శిక్షలు లభించడం అన్నది ఆత్మ, శరీరం రెండింటికీ కావచ్చు, శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ తమ రచనల్లో దీని గురించి చాలా వివరాలు తీసుకొచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హత్తా జుర్తుముల్ మకాబిర్, దీని గురించి కూడా కొన్ని హదీస్ ఉల్లేఖనాల ద్వారా సమాధి శిక్ష గురించి చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అందుకొరకు ఇది లేదు అని, కేవలం ఆత్మకు అని, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం ఇది సరియైన విషయం కాదు.
సోదర మహాశయులారా, ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుంది. మకాబిర్ అని అల్లాహు తఆలా చెప్పాడు. సర్వసామాన్యంగా మనం ఖబ్రిస్తాన్ అని ఏదైతే అంటామో దానిని చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లింల యొక్క సర్వసామాన్యంగా వ్యవహారం, వారందరి కొరకు ఏదైనా స్మశాన వాటిక అని అంటారు, ఖబ్రిస్తాన్ ఉంటుంది, అక్కడే అందరినీ సమాధి చేయాలి, దఫన్ చేయాలి. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా నా భూమిలో, నా యొక్క ఈ జగాలో, నేను పుట్టిన స్థలంలో ఇక్కడే అన్నటువంటి కొన్ని వసియతులు ఎవరైతే చేస్తారో, తర్వాత అక్కడ పెద్ద పెద్ద మజార్లు, దర్గాలు కట్టడానికి తప్పుడు మార్గాలు వెళ్తాయో ఇవన్నీ కూడా సరియైన విషయాలు కావు.
జుర్తుముల్ మకాబిర్ ద్వారా ధర్మపరమైన మరొక లాభం మనకు ఏం తెలుస్తుందంటే మనము ఇహలోకంలో బ్రతికి ఉన్నంత కాలం కబ్రిస్తాన్‌కు వెళ్లి, మన ఊరిలో, మన సిటీలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కబ్రిస్తాన్‌కు వెళ్లి దర్శనం చేస్తూ ఉండాలి, జియారత్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది, పరలోకం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇది తప్పనిసరి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తల్లి ఆమినా గారి యొక్క సమాధిని దర్శించారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు కూడా, فَزُورُوا الْقُبُورَ – ఫజూరుల్ కుబూర్, మీరు సమాధులను దర్శించండి, అల్లాహ్ దీని గురించి అనుమతి ఇచ్చి ఉన్నాడు.
పరలోక హెచ్చరిక మరియు అల్లాహ్ అనుగ్రహాలు
ఇక ఆ తర్వాత ఆయతులను కొంచెం శ్రద్ధ వహించండి. అల్లాహు తఆలా ఇందులో చాలా ముఖ్య విషయాలు చెబుతున్నాడు. మూడు, రెండు సార్లు ఒకే రకమైన పదాలు వచ్చాయి, మూడోసారి ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందో గమనించండి. కల్లా, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కల్లా అన్న పదం అవిశ్వాసులు లేదా తిరస్కారుల అభిప్రాయాలను కొట్టిపారేసి, మీరు అనుకున్నట్లు ఎంతమాత్రం జరగదు అని చెప్పడంతో పాటు, అసలు వాస్తవ విషయం ఇది అని చెప్పడానికి కూడా ఈ కల్లా అన్నటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది.
سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్
మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.
ఈ రెండు ఆయతులు ఒకే రకంగా ఎందుకున్నాయి, ఒకే భావం వచ్చింది కదా అని ఆలోచించకండి. ఇబ్ను అబ్బాస్ రదిఅల్లాహు తఆలా అన్హు తెలుపుతున్నారు, మొదటి ఆయతు ద్వారా అంటే మొదటి సౌఫ తఅలమూన్ ద్వారా చెప్పే ఉద్దేశ్యం, మనిషి చావు సమయంలో అతనికి తెలుస్తుంది, నేను ఈ లోకంలో, ఈ ప్రపంచం గురించి, ఇక్కడి హోదా అంతస్తుల గురించి, డబ్బు ధనాల గురించి, భార్యా పిల్లల గురించి, నా యొక్క వర్గం వారి గురించి, నా యొక్క కులం, గోత్రం వారి గురించి, నా యొక్క పార్టీ వారి గురించి ఎంత శ్రమించానో, ఇదంతా వృధా అయిపోతుంది కదా అని తొలిసారిగా అతనికి అతని మరణ సమయంలో తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే సమాధుల నుండి లేస్తారో, మైదానే మహషర్‌లో జమా అవుతారో అక్కడ కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండో ఆయతులో రెండోసారి తెలిసే విషయం చెప్పడం జరిగింది. మరియు మూడో ఆయత్ అంటే మన క్రమంలో ఆయత్ నెంబర్ ఐదు:
كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్
ఇక్కడ ఏదైతే తాలమూన అని వచ్చింది, కానీ ఎలా వచ్చింది? మీకు ఖచ్చిత జ్ఞానం కలుగుతుంది. దీని యొక్క వ్యాఖ్యానంతో మనకు తెలుస్తుంది, ప్రళయ దినాన అల్లాహు తఆలా నరకాన్ని తీసుకొస్తాడు. దాని తర్వాత ఆయతులో ఉంది కదా, మీరు నరకాన్ని చూసి తీరుతారు, అవును మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా. అయితే మనిషికి చనిపోయే సందర్భంలో, సమాధి నుండి లేసే సందర్భంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అతనికి. కానీ ఎప్పుడైతే ఇక అతడు కళ్ళారా నరకాన్ని చూస్తాడో, నరకం యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరెవరైతే నరకంలో పోవాలో వారు పోతారు. దానిని హక్కుల్ యకీన్ అంటారు.
ఎందుకంటే ఇక్కడ గమనించండి, యకీన్ అన్న పదం ఖురాన్‌లో మూడు రకాలుగా వచ్చింది. ఒకటి ఇల్మల్ యకీన్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయత్ నెంబర్ చివరిలో. మరియు ఐనుల్ యకీన్, ఆయత్ నెంబర్ ఏడులో చూస్తున్నట్లు. మరియు హక్కుల్ యకీన్ అని వేరే ఒకచోట వచ్చి ఉంది. ఇల్ముల్ యకీన్ అంటే మీకు ఖచ్చిత జ్ఞానం తెలవడం. ఎలా తెలుస్తుంది ఇది? చెప్పే వ్యక్తి ఎవరో, ఎంతటి సత్యవంతుడో దాని ప్రకారంగా మీరు అతని మాటను సత్యంగా నమ్ముతారు, కదా? రెండవది, దాని యొక్క సాక్ష్యాధారాలతో, దాని యొక్క సాక్ష్యాధారాలతో. ఇక ఎప్పుడైతే దానిని కళ్ళారా చూసుకుంటారో దానినే ఐనుల్ యకీన్ అంటారు, ఇక మీరు దానిని కళ్ళారా చూసుకున్నారు గనక తిరస్కరించలేరు. కానీ ఎప్పుడైతే అది మీ చేతికి అందుతుందో లేదా మీరు దానికి చేరుకుంటారో, దానిని అనుభవిస్తారో, అందులో ప్రవేశిస్తారో, దానిని ఉపయోగిస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా హక్కుల్ యకీన్, ఇక సంపూర్ణ నమ్మకం, ఏ మాత్రం అనుమానం లేకుండా సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, ఓ మానవులారా, మీరు పరలోకాన్ని మరిచి ఏదైతే ఇహలోక ధ్యానంలోనే పడిపోయారో, ఇది మిమ్మల్ని పరలోకం నుండి ఏమరుపాటుకు గురి చేసిందో తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా, ఖచ్చిత జ్ఞానంతో తెలుస్తుంది ఆ పరలోకం సత్యం అన్నది, ఖురాన్, హదీస్ సత్యం అన్నది మరియు మీరు నరకాన్ని చూసి తీరుతారు.
ఈ నరకం గురించి హదీసులో ఏమి వచ్చి ఉంది అంటే, ప్రళయ దినాన తీర్పు జరిగే సమయంలో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎంతమంది మానవులైతే ఒక పెద్ద మైదానంలో జమా అయి ఉంటారో, అల్లాహు తఆలా ఒక్కసారి నరకాగ్నిని వారికి దగ్గరగా చూపించడానికి డెబ్బై వేల సంకెళ్ళతో దానిని బంధించి వారి ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, గమనించండి. డెబ్బై వేల మంది దైవదూతలు, డెబ్బై వేల సంకెళ్ళు, ఒక్కొక్క సంకెళ్ళు ఎంత పెద్దగా అంటే డెబ్బై వేల మంది దైవదూతలు దాన్ని పట్టుకొని ఉంటారు. డెబ్బై వేలను డెబ్బై వేలతో ఇంటూ చేయాలి. గమనించండి, ఎంతమంది దైవదూతలు దానిని పట్టుకొని లాగుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రజలందరూ చూసి భయకంపితలు అయిపోతారు. సోదర మహాశయులారా, అలాంటి ఆ పరిస్థితి రాకముందే మనం దాని నుండి రక్షణకై ఇహలోకంలో అల్లాహ్ యొక్క ఆదేశాలను, ప్రవక్త యొక్క విధేయతను పాటించి జీవితం గడపాలి. ఆ తర్వాత:
ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మీరు ఆ రోజు తప్పకుండా మీకు ఇవ్వబడుతున్నటువంటి అనుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది.
వాస్తవానికి సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనందరినీ చాలా భయకంపితులు చేసే అటువంటి ఆయత్ ఇది కూడాను. ఎందుకంటే నిజంగా మనం చాలా ఏమరుపాటుకు గురి అయ్యే ఉన్నాము, ఇంకా ఈ ఏమరుపాటు, అశ్రద్ధకు గురి అయి అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎంత ఎక్కువ మంచి రీతిలో చెల్లించాలో చెల్లించడం లేదు. మనం ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ మనకు ప్రసాదించాడు, దాన్ని మనకు మనం ఒకసారి ఏదైనా లెక్కించుకునే ప్రయత్నం చేయడం, దాని గురించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించే ప్రయత్నం చేయడమే మర్చిపోతున్నాము.
ఒకవేళ మనం హదీసులో చూస్తే, సహీ ముస్లిం, హదీస్ నెంబర్ 2969 లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినాన అల్లాహు తఆలా మనిషిని అడుగుతాడు, నేను నీకు గౌరవం ప్రసాదించలేదా, నీకు నీ ఇంట్లో గాని, నీకు హోదా అంతస్తులు ఇవ్వలేదా, నీకు భార్యా పిల్లలు మరియు ఇంకా డబ్బు ధనం లాంటివి ఇవ్వలేదా, ప్రత్యేకంగా ఎవరికైతే ఈ లోకంలో ఇలాంటివి లభించాయో వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు ఒంటెలు ఇచ్చాను, ఇంకా గుర్రాలు ఇచ్చాను, నీవు నీకు ఎంత ప్రజలలో ప్రతిష్ట ఇచ్చాను అంటే నీవు ఆదేశిస్తే ప్రజలు నీ మాటను వినేవారు. అయితే అల్లాహ్ అడుగుతాడు, ఇవన్నీ నీకు ఇచ్చానా లేదా? అప్పుడు మనిషి అబద్ధం చెప్పలేకపోతాడు. అవును ఓ అల్లాహ్ ఇవన్నీ ప్రసాదించావు. అప్పుడు అల్లాహు తఆలా అంటాడు, నీవు నన్ను కలుసుకునేవాడివవు, పరలోకం అనేది ఉన్నది, నీవు నా వద్దకు రానున్నావు అన్నటువంటి విషయం నమ్మేవాడివా? కాఫిర్ అయ్యేది ఉంటే ఏమంటాడు? లేదు అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, అన్సాక కమా నసీతనీ, నీవు నన్ను ఎలా మరిచావో అలాగే నేను కూడా నిన్ను మర్చిపోతాను.
సోదర మహాశయులారా, సూరతున్నీసా మీరు కొంచెం శ్రద్ధగా చదవండి ఎప్పుడైనా అనువాదంతో. ఒకటి కంటే ఎక్కువ స్థానంలో మునాఫికుల గురించి చెప్పడం జరిగింది, వారు పరలోకాన్ని విశ్వసించే రీతిలో విశ్వసించరు అని. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా, ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. ఒక హదీస్ పై శ్రద్ధ వహిస్తే మీకు ఈ అంశం అర్థమైపోతుంది, సమయం కూడా కాబోతుంది గనక నేను సంక్షిప్తంగా చెప్పేస్తాను.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, గమనించండి, ముగ్గురు ఎలాంటి వారు? ప్రవక్త విషయం చెప్పే అవసరమే లేదు, ప్రవక్తల తర్వాత ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైన మనుషులు ఇద్దరు. అయితే సుమారు రెండు లేదా మూడు రోజుల నుండి తిండికి, తినడానికి ఏ తిండి లేక తిప్పల పడుతూ, కడుపులో కూడా ఎంతో పరిస్థితి మెలికలు పడుతూ అబూబకర్ ముందు వెళ్లారు, ఆ తర్వాత ఉమర్ వెళ్లారు, ప్రవక్తను కలుద్దామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వెళ్లారు, ముగ్గురూ బయటనే కలుసుకున్నారు. ఎటు వెళ్లారు, ఎటు వెళ్లారు అంటే కొందరు సిగ్గుతో చెప్పుకోలేకపోయారు కానీ ఏ విషయం మిమ్మల్ని బయటికి తీసిందో, నన్ను కూడా అదే విషయం బయటికి తీసింది అని ప్రవక్త చెప్పి అక్కడి నుండి ఒక అన్సారీ సహాబీ యొక్క తోటలోకి వెళ్తారు. అల్లాహు అక్బర్. పూర్తి హదీస్ అనువాదం చెప్పలేను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, అన్సారీ సహాబీ మంచి అప్పుడే నీళ్లు బయటి నుండి తీసుకొని వస్తారు, చల్లనివి, ప్రవక్త ముందు, అబూబకర్, ఉమర్ ముందు పెడతారు మరియు తోటలో నుండి తాజా కొన్ని ఖర్జూర్ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఈ రెండే విషయాలను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారుతాయి, సహాబాలు కూడా ఏడుస్తారు ఇద్దరూ. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెబుతారో తెలుసా? ఈ అనుగ్రహాల గురించి ప్రళయ దినాన మీతో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మూడు రోజులు తిండి లేక తిప్పల పడిన తర్వాత దొరికిన ఈ ఖర్జూర్ మరియు నీళ్లు. వీటి గురించి ఇలా చెప్పారు అంటే ఈ రోజుల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఏసీలు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్‌లు, మన ఇళ్లల్లో కొన్ని రోజుల వరకు తినేటువంటి సామాగ్రి, ఇంకా మనకు ఎన్నో జతల బట్టలు, ఇంకా ఏ ఏ అనుగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించుకోవలసి ఉంది, కానీ మనం ఎంత ఏమరుపాటుకు, అశ్రద్ధకు గురి అయి ఉన్నాము?
సోదర మహాశయులారా, నిజంగా చెప్పాలంటే మనం చాలా అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మరిచిపోయి ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేస్తారు:
نِعْمَتَانِ مَغْبُونٌ فِيهِمَا كَثِيرٌ مِنَ النَّاسِ
నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరుమ్ మినన్నాస్
(రెండు అనుగ్రహాలు ఉన్నాయి, ప్రజలు వాటి గురించి చాలా అశ్రద్ధగా ఉన్నారు).”
తిర్మిజీలోని మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, అల్లాహు తఆలా మనిషితో ప్రశ్నిస్తూ అంటాడు: “నేను నీకు చల్లని నీరు త్రాపించలేదా? నీవు వంటలో వేసుకోవడానికి నీకు ఉప్పు ఇవ్వలేదా?” ఇవి, ఇంకా ఇలాంటి ఎన్నో హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రళయ దినాన అల్లాహు తఆలా ఎన్నో రకాల అనుగ్రహాల గురించి, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల గురించి అడుగుతాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందుకు వచ్చారు, ఈ ఆయత్ గురించి ప్రశ్నించడానికి. ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో, సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్, ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖనం, తిర్మిజీలో కూడా ఉంది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రవక్తా, మా దగ్గర ఏమున్నది? ఈ ఖర్జూర్ ఉన్నది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇంతే కదా. అంటే వీటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుందా, మన పరిస్థితి ఎలా ఉంది, ఎల్లవేళల్లో మనం మన యొక్క ఆయుధాలు వెంట తీసుకొని వెళ్తున్నాము, ఎప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తారు అన్నటువంటి భయంలో జీవిస్తున్నాము, మనపై ఏమంత ఎక్కువ అనుగ్రహాలు అన్నటువంటి ప్రశ్న ప్రశ్నిస్తే ప్రవక్త ఏం చెప్పారు?
أَمَا إِنَّ ذَلِكَ سَيَكُونُ
అమా ఇన్న జాలిక సయకూన్
అల్లాహ్ చెప్పాడు ప్రశ్నిస్తానని, అల్లాహు తఆలా తప్పకుండా ప్రశ్నించి తీరుతాడు.
సోదర మహాశయులారా, ఈ ఇంకా మరికొన్ని హదీసులు ఇలాంటివి మనం చదవాలి, తెలుసుకోవాలి, ఇలాంటి ఈ సూరాల వ్యాఖ్యానంలో మనం అల్లాహ్ తో భయపడాలి, మనకు అల్లాహ్ యొక్క అనుగ్రహాల గురించి చిన్న బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, గుర్తొచ్చినన్నివి, గుర్తురానివి చాలా ఉన్నాయి, కానీ గుర్తు వచ్చినవి కొంచెం మనం అల్లాహ్ యొక్క ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మరియు కృతజ్ఞత ఎలా చెల్లించాలి? అల్లాహ్ ఆదేశాలను పాటించి, ఆ అనుగ్రహాలను అల్లాహ్ యొక్క విధేయతలో ఉపయోగించి. విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
—
ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/


You must be logged in to post a comment.