[4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
పూర్తి దరూద్ షరీఫ్:
“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”
చిన్న దరూద్ షరీఫ్ : అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ వ బారిక్ అలా ముహమ్మద్
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
“మీ ఇళ్ళను సమాధులు చేయకండి మరియు నా సమాధిని పండగ లేదా జాతర ప్రదేశం చేయకండి. నాపై దరూద్ పంపండి; మీరు ఎక్కడ ఉన్ననూ మీ దరూద్ నాకు చేరుతుంది.”
[సునన్ అబూ దావూద్ : 2042; అల్ అల్బానీ దీన్ని ధృవీకరించారు.]
అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
“నాపై దరూద్ ఎక్కువగా పంపండి, అల్లాహ్ నా సమాధి వద్ద ఒక దూతను నియమిస్తాడు. నా ఉమ్మత్ లోని వారు ఎవరైనా నాపై దరూద్ పంపినప్పుడు, ఆ దైవదూత నాతో ఇలా అంటారు: ‘ఓ ముహమ్మద్! ఫలానా వ్యక్తి మీపై, ఫలానా సమయంలో దరూద్ పంపాడు.”’
[అల్ దైలమీ – షేక్ అల్ అల్బానీ గారు అల్ సహీహా 1530 లో దీన్ని ‘హసన్ లీ ఘైరిహి’ అని అన్నారు]
అబ్దుల్లా ఇబ్న్ మసూద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
“అల్లాహ్ నియమించిన దైవదూతలు భూమి మీద తిరిగుతుంటారు. వారు నా ఉమ్మత్ వారు నాపై పంపిన సలాం (దరూద్)ను నాకు చేరవేస్తారు.”
[సునన్ అన్ నసాయి 1282, దీన్నీ అల్ అల్బానీ గారు సహీహ్ అని ధృవీకరించారు]
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
“నా పేరు విని కూడా నాపై దరూద్ (దుఆ) పంపని వాడి ముక్కు మట్టిలో కొట్టుకుపోగాక.”
[సునన్ అత్ తిర్మిజి (3545), షేక్ అల్ అల్బాని గారు దీన్ని ‘హసన్ సహీ’ అన్నారు]
అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
“అతని సమక్షంలో నా పేరు ఉచ్చరించబడిననూ, నాపై దరూద్ పంపని వాడు అందరిలోకెల్లా అత్యంత పిసినారి.”
[సునన్ అత్ తిర్మిజి (3546), షేక్ అల్ అల్బానీ గారు దీన్ని ‘సహీహ్’ అని ధృవీకరించారు]
అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
“ముఅజ్జిన్ (అజాన్ ఇచ్చేవాడు) పలికింది వినగానే దాన్ని పునరావృతం చేయండి, ఆ తరువాత నాపై దరూద్ పంపండి, నాపై దరూద్ పంపిన వారికి అల్లాహ్ తరఫున పది శుభాలు లభిస్తాయి; అల్లాహ్ తో నాకోసం వసీలా కోరండి, ఇది స్వర్గంలోని ఒక హోదా, ఇది అల్లాహ్ దాసుల్లో ఒకరికి మాత్రమే లభిస్తుంది, అది నేనే కావాలని నా ఆశ. నాకు వసీలా దొరకాలని కోరేవారికి నేను సిఫారసు చేస్తాను.”
[సహీహ్ ముస్లిం 384]
You must be logged in to post a comment.