ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి

589. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులతో మాట్లాడుతూ “ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి” అన్నారు.
అనుచరులు అది విని “మరి ఎవరి దగ్గరైనా దానం చేయడానికి ఏమీలేకపోతే ఎలా? అని అడిగారు.
“అప్పుడు ఆ వ్యక్తి కష్టపడి సంపాదించి తానూ అనుభవించాలి, దాన్ని (పేదలకు) దానం కూడా చేయాలి” అన్నారు ధైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“ఒకవేళ అలా చేసే శక్తి కూడా లేకపోతే? లేదా అలా కూడా చేయకపోతే?” అని మళ్ళీ అడిగారు అనుయాయులు.
“అప్పుడు ఎవరైనా అగత్యపరుడు ఏదైనా ఆపదలో చిక్కుకుంటే అతడ్ని ఆదుకోవాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“అది కూడా చేయలేకపోతేనో?” అడిగారు అనుయాయులు తిరిగి,
“(అదీ చేయలేకపోతే) మేలు చేయాలని లేక సత్కార్యాలు చేయాలని ఇతరులకు సలహా లివ్వాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“మరి అదీ చేయలేకపోతే” అడిగారు అనుయాయులు మళ్ళీ.
“(అలాంటి పరిస్థితిలో కనీసం) తాను స్వయంగా చెడుపనులు
చేయకుండా, ఇతరులకు చెడు తలపెట్టకుండా ఉండాలి. ఇది కూడా దానం క్రిందకే వస్తుంది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 33 వ అధ్యాయం – కుల్లు మారూఫిన్ సదఖాతున్]

జకాత్ ప్రకరణం : 16 వ అధ్యాయం – ప్రతి సత్కార్యం దానమే (సదఖాయే)
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు

309. హజ్రత్ ఉబైదుల్లా ఖూలానీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు) ని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారు. “మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమన్నారో తెలుసా? ‘కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు’ అని అన్నారాయన.”

[సహీహ్ బుఖారీ  : 8 వ ప్రకరణం – సలాత్, 65 వ అధ్యాయం – మన్ బనా మస్జిద్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 4 వ అధ్యాయం – మస్జిదుల నిర్మాణం పట్ల ప్రోత్సాహం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version: Whoever built a masjid, with the intention of seeking Allaah’s pleasure ..

చెట్లను నాటడం, సేద్యం చేయడం గొప్ప పుణ్యకార్యాలు

1001. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరైనా ముస్లిం ఏదైనా ఒక (పండ్ల) చెట్టు నాటి లేదా పొలంలో ఏదైనా పంట వేస్తే అందులో పక్షులుగాని, పశువులు గాని లేదా మనుషులు గాని (పండ్లు, పంట) తిన్న పక్షంలో అది అతని తరుఫున సదఖా (దానం) అవుతుంది, అతనికి దాని పుణ్యం లభిస్తుంది

[సహీహ్ బుఖారీ : వ ప్రకరణం – మజారా, వ అధ్యాయం – ఫజ్లిజ్జరయి వల్ గర్సి ఇజా ఉకిల మిన్హు]

లావాదేవీల ప్రకరణం – వ అధ్యాయం – చెట్లను నాటడం, సేద్యం చేయడం గొప్ప పుణ్యకార్యాలు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read the English version of this Hadeeth

(నా కోసం) డబ్బు ఖర్చు చేయండి, నేను కూడా మీ కోసం ఖర్చు చేస్తాను

580. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

అల్లాహ్ (నా కోసం) డబ్బు ఖర్చు చేయండి, నేను కూడా మీ కోసం ఖర్చు చేస్తాను” అని అన్నాడు.” అల్లాహ్ చేయి (సకల విధాల సిరిసంపదలతో) నిండుగా ఉంది. దాన్ని రేయింబవళ్ళు నిర్విరామంగా ఖర్చు చేసినా తరగదు.” ” అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన దగ్గర్నుంచి ఎంత ఖర్చు చేశాడో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇంత ఖర్చు చేసినా ఆయన చేతిలో ఉన్న నిధి నిక్షేపాలలో రవ్వంత కూడా తగ్గలేదు. ఆయన సింహాసనం నీళ్ళ మీద ఉంది. ఆయన చేతిలో త్రాసు (న్యాయం) ఉంది. ఆయన తలచుకుంటే ఎవరినైనా అధోగతి పాలు చేయగలడు. అలాగే ఆయన తలచుకుంటే ఎవరినైనా ఉచ్ఛ స్థాయికి తీసుకురాగలడు.

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్, 2 వ అధ్యాయం – ఖౌలిహీవకాన అర్షిహీ అలల్ మాయి]

జకాత్ ప్రకరణం : 11 వ అధ్యాయం – సత్కార్యాల్లో ధన వినియోగం – దాని ప్రతిఫలం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English version of this hadeeth : Spend (O man), and I shall spend on you