బంధువులకు దానం, తల్లిదండ్రులు, భార్యా పిల్లల కోసం ధనవ్యయం

586. హజ్రత్ అబూ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన కుటుంబసభ్యుల (శ్రేయస్సు) కోసం ధన వినియోగం చేస్తే, ఆ ధనం అతను చేసే దానమవుతుంది.

[సహీహ్ బుఖారీ : 69 వ ప్రకరణం – అన్నఫఖాత్, 15 వ అధ్యాయం – ఫజ్లిస్న దఖతి అలల్ ఆహ్లి]

జకాత్ ప్రకరణం – 14 వ అధ్యాయం – బంధువులకు దానం, తల్లిదండ్రులు, భార్యా పిల్లల కోసం ధనవ్యయం .మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

స్వర్గవాసులారా! ఇక నుండి మరణం ఉండదు. నరకవాసులారా! ఇక నుండి మరణం ఉండదు

1812. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-

స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తరువాత మరణాన్ని స్వర్గ నరకాల మధ్యకు తెచ్చి నిలబెట్టడం జరుగుతుంది. తరువాత దాన్ని కోసివేస్తారు. అప్పుడు ఒక ప్రకటనకర్త లేచి “స్వర్గవాసులారా! ఇక నుండి మరణం ఉండదు. నరకవాసులారా! ఇక నుండి మరణం ఉండదు” అని ప్రకటిస్తాడు. ఈ ప్రకటన వినగానే స్వర్గవాసుల ఆనందం అవధులు దాటుతుంది; నరకవాసులు దుఃఖంతో మరింత కృంగిపోతారు.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51 వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్]

స్వర్గ భాగ్యాల, స్వర్గవాసుల ప్రకరణం : 13 వ అధ్యాయం – స్వర్గానికి బలహీనులు, నరకానికి బలవంతులు పోతారు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అబద్ధం చెడ్డ విషయం, సత్యం మంచి విషయం

1675. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :-

నిజం మనిషిని పుణ్యకార్యాల వైపుకు తీసుకుని వెళుతుంది. పుణ్యకార్యాలు (అతడ్ని) స్వర్గానికి గొనిపోతాయి. ఎవరైనా ఎల్లప్పుడు నిజం చెబుతుంటే అది అతడ్ని ఎప్పుడో ఓ రోజు సిద్దీఖ్ (సత్యశీలుడి) గా మార్చివేస్తుంది. అబద్ధం మనిషిని పాపకార్యాల వైపుకు తీసుకుని వెళుతుంది. పాపకార్యాలు అతడ్ని నరకానికి చేర్చుతాయి. ఎవరైనా (ఎల్లప్పుడూ) అబద్ధమాడుతుంటే దానివల్ల అతడు ఎప్పుడో ఓ రోజు అల్లాహ్ దగ్గర అబద్దాలరాయుడిగా వ్రాయబడతాడు.

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 69 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఅలా (యాఅయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వకూనూ మాఅస్సాదిఖీన్)]

సామాజిక మర్యాదల ప్రకరణం – 29 వ అధ్యాయం – అబద్ధం చెడ్డ విషయం, సత్యం మంచి విషయం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

జ్ఞానులు అంతరించిన కారణంగా అల్లాహ్ జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు

1712. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

అల్లాహ్ (ధర్మజ్ఞానాన్ని) ప్రజల హృదయాల నుండి తీసివేయడం ద్వారా దాన్ని పైకెత్తుకోడు, జ్ఞానులు (అంటే ధర్మవేత్త్లలు) అంతరించిన కారణంగా ఆయన జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు. ఈ విధంగా చివరికి ప్రపంచంలో ఒక్క ధర్మవేత్త కూడా మిగిలి ఉండడు. అప్పుడు ప్రజలు అజ్ఞానుల్ని (మూర్ఖుల్ని) నాయకులుగా చేసుకుంటారు. ధార్మిక విషయాలను గురించి వారినే అడుగుతారు. వారు తమకు ధర్మజ్ఞానం లేకపోయినా ఫత్వాలు (తీర్పులు) ఇస్తారు. ఈ విధంగా వారు స్వయంగా దారి తప్పడమే గాకుండా ఇతరుల్ని కూడా దారి తప్పిస్తారు.

[సహీహ్ బుఖారీ : 3 వ ప్రకరణం – ఇల్మ్, 34 వ అధ్యాయం – కైఫ యుఖ్బుజుల్ ఇల్మ్]

విద్యా విషయక ప్రకరణం : 5 వ అధ్యాయం – ప్రళయం సమీపంలో జ్ఞానకాంతి పోయి అజ్ఞానాంధకారం వస్తుంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జ్ఞానం, ఆయన దైవభీతి పరాయణత

1518. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక పని చేసి (తమ అనుచరులకు) ఆ పని చేయమనో లేక చేయరాదనో సెలవిచ్చారు. అప్పుడు కొందరు ఆ విషయానికి సంబంధించి ఇవ్వబడిన సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదు. ఈ సంగతి తెలిసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో మొదట అల్లాహ్ ఔన్నత్యాన్ని స్థుతించి, తరువాత ఇలా అన్నారు – “జనానికి ఏమయింది, నేను స్వయంగా చేస్తున్న పనులను మానేస్తున్నారే? దైవసాక్షిగా చెబుతున్నాను. అల్లాహ్ గురించి నాకు మీ అందరికంటే బాగా తెలుసు. మీ అందరిలోకి అల్లాహ్ కి ఎక్కువగా భయపడేది కూడా నేనే”.

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 72 వ అధ్యాయం – మల్లమ్ యువాజిహిన్నాస యితాబ్]

ఘనతా విశిష్ఠతల ప్రకరణం : 35 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జ్ఞానం, ఆయన దైవభీతి పరాయణత. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఆహారంలో లోపం ఎత్తి చూపకూడదు

1336. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ ఏ ఆహారంలో కూడా లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు ఇష్టమయితే తినేవారు, ఇష్టం లేకపోతే మానేసేవారు. (అంతేగాని అందులో అది బాగా లేదు, ఇది బాగా లేదని లోపం ఎత్తి చూపేవారు కాదు).

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 23 వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం)]

పానీయాల ప్రకరణం : 35 వ అధ్యాయం – అన్నంలో లోపం ఎత్తి చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రది అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి.

(1) నా గాంభీర్యానికి శత్రువులు ఒకనెల ప్రయాణపు దూరం నుండే భయపడి పోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు.

(2) నా కోసం యావత్తు భూమండలం ప్రార్ధనా స్థలంగా, పరిశుద్ధ పరిచే వస్తువుగా చేయబడింది. అందువల్ల నా అనుచర సమాజంలోని ప్రతి వ్యక్తీ ఏ చోటున ఉంటే ఆ చోటునే వేళ అయినప్పుడు నమాజు చేసుకోవచ్చు.

(3) నా కోసం యుద్ధప్రాప్తి (మాలె గనీమత్) ను వాడుకోవడం ధర్మసమ్మతం చేయబడింది.

(4) ఇతర ధైవప్రవక్తలందరూ తమతమ జాతుల కోసం మాత్రమే ప్రత్యేకించబడగా, నేను యావత్తు మానవాళి కోసం ధైవప్రవక్తగా పంపబడ్డాను.

(5) నాకు (పరలోక తీర్పుదినాన సాధారణ) సిఫారసు (*) చేసే అధికారం ఇవ్వబడింది.

(*) ఇక్కడ సిఫారసు అంటే, హషర్ మైదానంలో మానవులంతా తీవ్ర ఆందోళనకు గురి అయినపుడు చేసే సాధారణ సిఫారసు అని అర్ధం. అప్పుడు ఇతర ప్రవక్తలందరూ ప్రజలను నిరాశపరుస్తారు. అయితే ఇతర సందర్భాలలో ప్రత్యేక సిఫారసు ప్రవక్తలు, సజ్జనులు కూడా చేస్తారు. లేదా ఇక్కడ సిఫారసు అంటే రద్దు కానటువంటి సిఫారసు కాని, అణుమాత్రం విశ్వాసమున్న వారికి సయితం ప్రయోజనం చేకూర్చే సిఫారసు గానీ అయి ఉంటుంది.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 56 వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి …. జు ఇలత్ లియల్ అర్జుకుల్లాహ మస్జిదన్ వ తహూర]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1 – సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం

1739. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) తిరగలి విసరి విసరి వ్యాధిగ్రస్తులయ్యారు. (అంటే ఆమె చేతులకు కాయలు కాశాయి). ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు కొందరు (యుద్ధ) ఖైదీలు వచ్చారు. అది తెలిసి హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికెళ్లారు. కాని ఆయన లేరు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) మాత్రమే వున్నారు. అందుచేత ఫాతిమా (రధి అల్లాహు అన్హ) ఆమెనే కలుసుకొని విషయం తెలియజేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఆయనకు ఫాతిమా (రధి అల్లాహు అన్హ) వచ్చి పోయిన సంగతి తెలియజేశారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము మా పడకలపై పడుకొని ఉన్నాము. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూసి లేవడానికి ప్రయత్నించాను. కాని ఆయన నన్ను అలాగే పడుకొని ఉండమని చెప్పి మా ఇద్దరి మధ్య కూర్చున్నారు. అప్పుడు ఆయన దివ్యపాదాల చల్లదనం నా గుండెలకు తాకింది. ఆయన ఇలా అన్నారు,

“(ఫాతిమా!) నీవు నన్నడిగిన దానికంటే ఎంతో మేలయినది నీకు చెప్పనా? నీవు పడుకోవటానికి పడక మీదికి చేరినపుడు 34 సార్లు అల్లాహు అక్బర్ అనీ, 33 సార్లు సుబ్ హానల్లాహ్ అనీ, 33 సార్లు అల్ హమ్దులిల్లాహ్ అనీ పఠిస్తూ ఉండు. ఈ స్మరణ నీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్ఠమైన సంపద.”

[సహీహ్ బుఖారీ :- 62 వ ప్రకరణం – ఫజాయిలి అస్ హాబిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం), 9 వ అధ్యాయం – మనాఖిబ్ అలీ బిన్ అబీతాలిబ్ అల్ ఖురషీ – రజి]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 19 వ అధ్యాయం – ఉదయం, రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2 . సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

కపట విశ్వాసులకు ఫజ్ర్, ఇషా నమాజుల కంటే మరే నమాజు భారంగా ఉండదు

383. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-

కపట విశ్వాసులకు ఫజ్ర్, ఇషా నమాజుల కంటే మరే నమాజు భారంగా ఉండదు. అయ్యో! ఈ రెండు నమాజులకు  ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే వారీ నమాజుల్లో పాల్గొనడానికి మోకాళ్ళ మీద కుంటుకుంటూ రావలసి వచ్చినా సరే తప్పకుండా వస్తారు (కాని ఈ కపటుల కసలు నా మాటల మీద నమ్మకమే లేదాయే). ముఅజ్జిన్ కు ఇఖామత్ (పిలుపు) ఇవ్వమని చెప్పి, నమాజు చేయించడానికి (నా స్థానంలో) మరొకరిని నిలబడమని ఆజ్ఞాపించి నేను స్వయంగా అగ్నిజ్వాల తీసుకొని నమాజుకు ఇంకా రాని వారి ఇండ్లను తగలబెడదామని (ఎన్నోసార్లు) అనుకున్నాను.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 34 వ అధ్యాయం – ఫజ్లిల్ ఇషాయి ఫిల్ జమాఅత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 42 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

No Salaat (prayer) is more heavy (harder) for the hypocrites than
the Fajr and the ‘Ishaa prayers

ఉపవాసము ఒక డాలు వంటిది

706. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-

ఉపవాసము ఒక డాలు వంటిది. (కాబట్టి) ఉపవాసి అశ్లీలమైన పలుకులు పలకడం గానీ, మూర్ఖుల్లా, అజ్ఞానుల్లా ప్రవర్తించడం గాని చేయకూడదు. ఎవరైనా అతనితో జగడానికి దిగితే లేదా దూషిస్తే అతనావ్యక్తితో తాను ఉపవాసం ఉన్నానని రెండుసార్లు చెప్పాలి

(ఆయన ఇంకా ఇలా అన్నారు):

నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యంగా చెబుతున్నాను, ఉపవాసి నోటి వాసన అల్లాహ్ దృష్టిలో కస్తూరి సువాసన కన్నా ఎంతో శ్రేష్ఠమైనది. అల్లాహ్ ఇలా అంటున్నాడు – ఉపవాసి నా (ప్రసన్నత) కోసం ఆహారపానీయాలు, లైంగిక వాంచలు త్యజిస్తున్నాడు. ఉపవాసం ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది. అందవల్ల స్వయంగా నేనే దాని పుణ్యఫలాన్ని (ఉపవాసికి) ప్రసాదిస్తాను. ఒక సత్కార్యానికి పదింతల పుణ్యం లభిస్తుంది

[సహీహ్ బుఖారీ : 30 వ ప్రకరణం – సౌమ్, 2 వ అధ్యాయం – ఫజ్లిస్సౌమ్]

ఉపవాస ప్రకరణం – 29 వ  ప్రకరణం – ఉపవాసకుడు నోరు పారేసుకోరాదు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

English Version : As-Siyaam (fasting) is Junnah (protection or shield or a screen or a shelter from the Hell-fire)