త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2] – కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్ [మరణానంతర జీవితం – పార్ట్ 24] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2]
కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్
[మరణానంతర జీవితం – పార్ట్ 24] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=qB4bqlE_8NE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన సత్కార్యాల త్రాసును బరువుగా చేసే పనుల గురించి వివరించబడింది. మూడవ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కోసం కోపాన్ని దిగమింగడం. ఇది ఒక వ్యక్తికి ప్రపంచం మరియు దానిలో ఉన్న సమస్తం కంటే మేలైన పుణ్యాన్ని అందిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. నాల్గవది, జనాజా నమాజ్‌లో పాల్గొని, ఖననం పూర్తయ్యే వరకు అంతిమయాత్రను అనుసరించడం. దీనికి ప్రతిఫలంగా రెండు మహా పర్వతాలంత పుణ్యం లభిస్తుంది. ఐదవది, రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్‌లో కనీసం పది ఖురాన్ ఆయతులను పఠించడం. ఇది ఒక వ్యక్తిని అశ్రద్ధ చేసేవారి జాబితా నుండి తొలగించి, అపారమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఈ కర్మలు చూడటానికి చిన్నవిగా అనిపించినా, వాటి ప్రతిఫలం చాలా గొప్పదని మరియు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయని బోధించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము. అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం. అల్లాహు అక్బర్.

ఈ రోజుల్లో మనలో ఎంతో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు. ధర్మ విషయంలో, అల్లాహ్ కొరకు కోపానికి రావడం, ఇది కూడా ఒక మంచి విషయం, సత్కార్యంలో లెక్కించబడుతుంది. కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం. అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు. మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు, ఎన్నో రకాల పాపానికి, ఎన్నో రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలపడమే కాకుండా, ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలపడం జరిగింది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. ఇబ్ను మాజా, ముస్నద్ అహ్మద్, అదబుల్ ముఫ్రద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2752.

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللَّهِ مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللَّهِ
(మా మిన్ జుర్‌అతిన్ అఅజము అజ్రన్ ఇందల్లాహ్ మిన్ జుర్‌అతి గైజిన్ కజమహా అబ్దున్ ఇబ్తిగాఅ వజ్‌హిల్లాహ్)
అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక.

గమనించండి ఇక్కడ విషయం. ఎలాంటి గుటక అల్లాహ్ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది? కోపాగ్ని గుటక. ఏదైతే మనిషి కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికై మింగేస్తాడో. అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం, కోపం ఉన్నా, ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన వద్ద ఉన్నా, దాని ద్వారా ఇతరులకు ఏ చెడుకు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఎంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది.

ఇలా కోపాన్ని దిగమింగి, ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ్ ప్రశంసించాడు. ఖురాన్‌లో అలాంటి వారిని ప్రశంసించాడు. చదవండి సూరె ఆలి ఇమ్రాన్. ఆయత్ నెంబర్ 134 మరియు 136.

الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
(అల్లజీన యున్ఫికూన ఫిస్సర్రాఇ వద్దర్రాఇ వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాస్, వల్లహు యుహిబ్బుల్ ముహ్సినీన్)
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” (3:134)

కలిమిలో నున్నా, బలిమిలో నున్నా, సిరివంతులైనా, పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు. మరియు తమ కోపాన్ని దిగమింగేవారు. ప్రజల్ని మన్నించేవారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, అల్లాహ్ ప్రేమిస్తాడు.

ఆ తర్వాత ఆయతులో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి, వారికి లభించే పుణ్యం ఎలాంటిదో 136వ ఆయతులో ప్రస్తావించాడు.

أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
(ఉలాఇక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్రబ్బిహిమ్ వ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, వనిఅమ అజ్రుల్ ఆమిలీన్)
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!.” (3:136)

అలాంటి వారికి తమ ప్రభువు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభువు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది, మన్నింపు లభిస్తుంది. మరియు స్వర్గాలు. ఎలాంటి స్వర్గవనాలు? వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో సదా కాలం ఉంటారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఎంత మేలు ఉంది.

ఈ విధంగా అల్లాహ్ త’ఆలా స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి, ప్రజల్ని మన్నించే వారి గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నాడు.

ఇంతటితో సరి కాకుండా, ఎవరైతే అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో, అల్లాహ్ త’ఆలా వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ హదీసును ఇమామ్ అబూ దావూద్, ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్ను మాజా, ఇమామ్ అహ్మద్ తమ హదీథ్ గ్రంథాల్లో ప్రస్తావించారు. మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దానిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2753.

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ دَعَاهُ اللَّهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللَّهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ
(మన్ కజమ గైజన్ వహువ ఖాదిరున్ అలా అన్ యున్ఫిజహు దఆహుల్లాహు అజ్జవజల్ల అలా రుఊసిల్ ఖలాయిఖి యౌమల్ ఖియామతి హత్తా యుఖయ్యిరహుల్లాహు మినల్ హూరిల్ ఈని మా షాఅ)

“ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు, కానీ కేవలం అల్లాహ్ సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు. అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహ్ త’ఆలా అతన్ని పిలిచి, హూరె ఈన్ (స్వర్గపు కన్య స్త్రీలలో, పవిత్ర స్త్రీలలో) తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడానికి అల్లాహ్ త’ఆలా అతనికి ఛాయిస్ (అధికారం) ఇస్తాడు.”

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇహలోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహ్ త’ఆలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి ఇస్తారు అంటే, ఈ విధంగా అతని యొక్క సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది.

దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి, పడవేసి, నాలుగు తిట్టి, దూషించి, అతన్ని కొట్టడమే ఇది శూరుడు, పెహల్వాన్ అన్న భావం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కూడా తెలియబరిచారు.

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ
(లైసష్షదీదు బిస్సురఅ, ఇన్నమష్షదీదుల్లజీ యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్)

“ఎదుటి వాడిని చిత్తు చేసే వాడే శూరుడు కాదు. అసలైన శూరుడు ఎవరంటే, తాను ఆగ్రహదోగ్రుడైనప్పుడు, కోపానికి గురి అయినప్పుడు తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు.”

ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీథ్ నెంబర్ 6114. మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది. హదీథ్ నెంబర్ 2950.

ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే, అందులో మూడవ విషయం కోపాన్ని దిగమింగడం. మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు చేసే విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో, ఈ శీర్షికలో, నాల్గవ విషయం… జనాజా నమాజ్ చేయడం మరియు జనజాల వెంట వెళ్ళడం.

సోదర సోదరీమణులారా, జనాజా వెంట వెళ్ళడం, జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది. మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఇలా ఉంది.

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا وَيُفْرَغَ مِنْهَا فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ
(మన్ తబిఅ జనాజతన్ హత్తా యుసల్లా అలైహా వ యుఫ్రగ మిన్హా ఫలహు కీరాతాన్, వమన్ తబిఅహా హత్తా యుసల్లా అలైహా ఫలహు కీరాతున్, వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లహువ అస్ఖలు ఫీ మీజానిహి మిన్ ఉహుద్)

“ఎవరైతే జనాజా వెంట వెళ్లి జనాజా నమాజ్ చేసి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు దాని వెంట ఉంటాడో, అతనికి రెండు కీరాతుల పుణ్యం. మరి ఎవరైతే కేవలం నమాజ్ చేసే వరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆ రెండు కీరాతులు ప్రళయ దినాన త్రాసులో ఉహుద్ పర్వతం కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది.”

గమనించారా? స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్రాసులో ఈ పుణ్యాలు ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో. ఇకనైనా మనం జనాజా నమాజ్‌లో పాల్గొందామా?

అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి? నా బంధువు కాదు కదా, నా తోటి పనిచేసేవాడు కాదు కదా, నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు. అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఏది ఉంటే, వారి జనాజాలోకి వెళ్తున్నారు. మరికొందరైతే అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనుక, అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను. అతనితోనే ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము? మనం ప్రళయ దినాన మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతురాలా పోగొట్టుకుంటున్నాము.

జనాజాకు సంబంధించిన మరొక హదీథ్ వినండి. అందులో ఉహుద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది. ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నెంబర్ 1325, మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది, హదీథ్ నెంబర్ 945.

مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ. قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ
(మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్లియ ఫలహు కీరాతున్, వమన్ షహిద హత్తా తుద్ఫన కాన లహు కీరాతాన్. కీల వమల్ కీరాతాన్? కాల మిస్లుల్ జబలైనల్ అజీమైన)

“ఎవరైతే కేవలం జనాజా నమాజ్ చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్, మరియు ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు. రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రెండు మహా పెద్ద పర్వతాలకు సమానం అని.”

పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలా? అంతకంటే మరీ పెద్దవియా? కావచ్చు. అది మనం ఎంత సంకల్ప శుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు.

ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు, ఏ శవం వెంటనైనా ఖబ్రిస్తాన్‌లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా? హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి గురించి ముస్లిం షరీఫ్‌లో ఉల్లేఖన ఉంది. జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే. కానీ ఖబ్రిస్తాన్ వరకు వెళ్లి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాతులు అన్న విషయం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌కు చాలా రోజుల వరకు తెలియలేదు. ఎప్పుడైతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖన ఆయన విన్నారో, రెండు కీరాతుల పుణ్యం అని, చాలా బాధపడ్డారు. మాటిమాటికి అనేవారు, అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని.

ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే, ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే, అరే ఆ తారీఖు లోపల నేను ఎందుకు అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం. ఇలాంటి పుణ్యాలు ఉహుద్ పర్వతానికి సమానమైన, అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా? కలుగుతుంది అంటే ఇన్ షా అల్లాహ్ ఇది విశ్వాసం యొక్క సూచన. అల్లాహ్ మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం…కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది.

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
(మన్ కరఅ అషర ఆయాతిన్ ఫీ లైలతిన్ కుతిబ లహు అల్ కిన్తార్, వల్ కిన్తార్ ఖైరుమ్ మినద్దున్యా వమా ఫీహా)

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ అన్నది ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది.

అల్లాహు అక్బర్. కేవలం ఒక బిల్డింగ్ లభించినది, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది, మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పది ఆయతులు ఎవరైతే పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది. ఈ హదీథ్ తబ్రానీ కబీర్‌లోనిది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు.

ఇక సునన్ అబీ దావూద్, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను ఖుజైమాలోని ఈ హదీసును శ్రద్ధగా వినండి. దీనిని షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 639.

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الْغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ الْقَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ الْمُقَنْطَرِينَ
(మన్ కామ బి అష్రి ఆయాతిన్ లమ్ యుక్తబ్ మినల్ గాఫిలీన్, వమన్ కామ బిమిఅతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్, వమన్ కామ బి అల్ఫి ఆయ కుతిబ మినల్ ముకన్తరీన్)

“ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో, వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు. మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో, నమాజ్ చేస్తూ, వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు. మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజ్ చేస్తారో, వారిని ముకన్తరీన్‌లో లిఖించబడుతుంది.”

ముకన్తరీన్ అంటే ఎవరు? ఎవరికైతే కిన్తార్ పుణ్యాలు లభిస్తాయో, ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది.

ఈ విధంగా మహాశయులారా, గమనించండి, చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్ షా అల్లాహ్ బరువు గలవిగా చేస్తాయి. ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (3) – ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా) | మరణానంతర జీవితం : పార్ట్ 44 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (3) – ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా)
[మరణానంతర జీవితం – పార్ట్ 44]
https://www.youtube.com/watch?v=gOF9pfhteUE [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికపరిచే పాప కార్యాల గురించి వివరించబడింది. ముఖ్యంగా, ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా) అనే పాపంపై దృష్టి సారించారు. అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల ప్రశంసలు, పేరు ప్రఖ్యాతుల కోసం చేసే సత్కార్యాలను అల్లాహ్ తిరస్కరిస్తాడని ఒక హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. దీని తీవ్రతను వివరిస్తూ, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక సుదీర్ఘ హదీథ్ ను ప్రస్తావించారు. దాని ప్రకారం, ప్రళయ దినాన అల్లాహ్ ముందు తీర్పు కోసం నిలబెట్టబడే తొలి ముగ్గురు: ఖురాన్ పారాయణం చేసినవాడు, ధనాన్ని దానం చేసినవాడు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడినవాడు. అయితే, వీరు తమ కార్యాలను ప్రజల మెప్పు కోసం చేసినందున, వారి సత్కార్యాలు నిరర్థకమై, నరకాగ్నికి గురవుతారు. ఈ హదీథ్ విని ముఆవియా (రదియల్లాహు అన్హు) తీవ్రంగా ప్రభావితమై, సూరహ్ హూద్ లోని ఆయతులను పఠించిన వృత్తాంతాన్ని కూడా వివరించారు. దానధర్మాలు, హజ్-ఉమ్రా, ఖుర్బానీ వంటి అనేక ఆచరణలలో ప్రదర్శనా ధోరణుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రసంగం ముగుస్తుంది.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన త్రాసును బరువుగా చేసే సత్కార్యాలు ఏమిటో ఈ శీర్షికలోని ఒక ముఖ్య విషయం, ఏ పాప కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అయి మీదికి లేసిపోతుందో, బరువుగా ఉండదో, అలాంటి పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.

మొదటి విషయం కుఫ్ర్, షిర్క్ మరియు ధర్మభ్రష్టత. వాటిలోని కొన్ని భాగాలను మనం తెలుసుకున్నాము. రెండవది చూపుగోలుతనం.

మీకు గుర్తుండాలి, త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి అని మనం తెలుసుకున్నాము. దానికి అపోజిట్, విరుద్ధమైన విషయం చూపుగోలుతనం. పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఏదైనా సత్కార్యం చేయడం. ఇది మన ఆ సత్కార్య సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది. ఈ విధంగా ఆ చేసిన సత్కార్యం పుణ్యాల త్రాసులో ఉండి బరువుగా ఉండేదానికి బదులుగా పాపంలో లెక్కించబడుతుంది, త్రాసు తేలికగా అయిపోతుంది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. అల్లాహ్ త’ఆలా తెలియజేశాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

أَنَا أَغْنَى الشُّرَكَاءِ عَنِ الشِّرْكِ
[అన అగ్నష్ షురకాఇ అనిష్ షిర్క్]
భాగస్వాములలో భాగస్వామ్యానికి అందరికంటే ఎక్కువ అతీతున్ని, నిరపేక్షాపరుడిని నేనే”

مَنْ عَمِلَ عَمَلاً أَشْرَكَ فِيهِ مَعِي غَيْرِي تَرَكْتُهُ وَشِرْكَهُ
[మన్ అమిల అమలన్ అష్రక ఫీహి మ’ఈ గైరీ, తరక్తుహు వ షిర్కహు]
ఎవరైతే ఏదైనా కార్యం సత్కార్యం చేస్తాడో, అందులో నాతో పాటు ఇతరులను భాగస్వామిగా చేస్తాడో, నేను అతడిని అతడి భాగస్వామిని అన్నిటిని వదిలేస్తాను, అలాంటి సత్కార్య అవసరం నాకు లేదు, దాని యొక్క సత్ఫలితం కూడా నేను అతనికి ప్రసాదించను.

ఎంత నష్టం గమనించండి. అల్లాహ్ సంతృష్టి కొరకు మనం ఆ కార్యం చేయకుండా, దాని యొక్క లాభం ఇహలోకంలో ఎవరితోనైనా పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తే ఎంత నష్టానికి మనం గురి అవుతున్నాము.

ఇంకా మహాశయులారా, ఈ హదీథ్ సహీ ముస్లిం షరీఫ్ లోనిది. కానీ ఇంతకంటే మరీ ఘోరమైన, ఇంతకంటే మరీ ఘోరమైన గతి, ఈ ప్రదర్శనా బుద్ధితో, చూపుగోలుతనంతో పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా సత్కార్యం చేశామంటే ఎలాంటి శిక్షను ఎదుర్కోవలసి వస్తుందో, ఎలాంటి నరకంలో పడవలసి వస్తుందో మీరు ఈ హదీథ్ ద్వారా వినే ప్రయత్నం చేసి అర్థం చేసుకోండి.

జామె తిర్మిజీలో వివరంగా ఈ హదీథ్ ఉంది. పోతే దీని యొక్క కొన్ని భాగాలు సంక్షిప్తంగా సహీ ముస్లిం షరీఫ్ లో కూడా ఉంది. జామె తిర్మిజీ హదీథ్ నెంబర్ 2382.

షుఫయ్యా అల్ అస్బహీ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం ప్రకారం, నేను మదీనా తయ్యిబా నగరానికి వచ్చాను. మస్జిద్-ఎ-నబవీలో ఒక వ్యక్తి చుట్టూనా చాలామంది పోగై ఉన్నారు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి అందరికీ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథులు వినిపిస్తున్నారు. నేను కూడా చోటు చేసుకొని అతనికి దగ్గరగా కూర్చున్నాను. హదీథులు వినిపించడం సమాప్తం అయ్యాక, ఒక్కొక్కరు ప్రజలందరూ కూడా లేచి పోయ్యాక, ఆయన ఒంటరిగా అయిన తర్వాత నేను ఆయనతో అడిగాను, నేను అల్లాహ్ యొక్క ప్రమాణం చేసి నిన్ను అడుగుతున్నాను, నీవు స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో విని, అర్థం చేసుకొని, గ్రహించి ఉన్న ఏదైనా హదీథ్ ఉంటే నాకు వినిపించండి అని.

అప్పుడు హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు, “సరే మంచిది, నేను స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో నా చెవులతో విన్న ఒక హదీథ్ ను, అర్థం చేసుకున్న హదీథ్ ను నీకు వినిపిస్తాను” అని అన్నారు. ఒక కేక వేశారు, స్పృహ తప్పి పడిపోయారు. కొంతసేపటి తర్వాత ఆయన, మరోసారి, “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో విన్న హదీథ్ ను, దానిని అర్థం చేసుకున్న హదీథ్ ను నీకు వినిపిస్తాను” అని అన్నారు. కేక వేశారు, మళ్లీ స్పృహ తప్పారు. మరి కొంత సేపటికి తర్వాత ఆయన మూడోసారి అలాగే అని, మూడోసారి కూడా స్పృహ తప్పారు.

ఇక ఆ తర్వాత అతను స్పృహ స్థితి నుండి బయటికి వచ్చి, ఏం చెప్పారు? “నేను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇంట్లో ఉండగా, అప్పుడు నేను తప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంకా ఎవరూ లేరు, నేను ఈ హదీథ్ ను విన్నాను” అని మళ్లీ ఒక కేక వేశారు, స్పృహ తప్పిపోయారు. ఇక నేను ఒకవేళ ఆయన్ని ఆనుకొని పట్టుకోకుంటే పడిపోయేవారు. కొంతసేపటి వరకు నేను అలాగే అతన్ని పట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత ఆయన మేల్కొన్నారు. ఆ తర్వాత చెప్పారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు అని.

ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ప్రజల మధ్యలోకి వస్తాడు, వారి యొక్క తీర్పు చేయడానికి. అప్పుడు ఇహలోకంలో ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎవరెవరు ఎలా వచ్చారో అక్కడ ఎన్నో సంఘాలు, వారు తమ యొక్క మోకాళ్ళ మీద ఆ మహా మైదానంలో వచ్చి అల్లాహ్ యొక్క తీర్పు గురించి వేచిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సందర్భంలో అల్లాహ్ త’ఆలా తొలిసారిగా ప్రజలందరి మధ్యలో నుండి ఒక వ్యక్తిని పిలుస్తాడు. అతడు ఎవడు? ఖురాన్ కంఠస్థం చేసిన వ్యక్తి, ఖురాన్ పారాయణం చేసే వ్యక్తి మరియు ఖురాన్ పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వ్యక్తి.

అల్లాహ్ త’ఆలా ఆయన్ని పిలిచి, “నేను నీకు ఖురాన్ యొక్క విద్య ప్రసాదించాను కదా? నీవు దీనిని నమ్ముతావా? నా యొక్క ఈ అనుగ్రహాన్ని తిరస్కరిస్తావా?” అప్పుడు అతను అంటాడు, “లేదు ఓ అల్లాహ్, నేను తిరస్కరించను. నీవు నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించావు, నేను ఒప్పుకుంటాను.” అప్పుడు అల్లాహ్ అడుగుతాడు, “నా ఈ అనుగ్రహానికి బదులుగా నీవు ఎలాంటి కృతజ్ఞత తెలిపావు?” అప్పుడు అతను అంటాడు, “ఓ అల్లాహ్, నేను నీ కొరకే ఈ ఖురాన్ పారాయణం చేశాను. ప్రజలను ఈ ఖురాన్ వైపునకు ఆహ్వానించేవాణ్ణి, ప్రజలకు ఖురాన్ చదవడం నేర్పేవాణ్ణి.”

అప్పుడు అల్లాహ్ ఏమంటాడు? “నీవు అబద్ధం పలుకుతున్నావు, అసత్యం మాట్లాడుతున్నావు.” అప్పుడు దైవదూతలు కూడా అంటారు అతనితో, “నీవు అసత్యం పలుకుతున్నావు” అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, “ఖురాన్ పారాయణం చేయడం, ప్రజలకు ఇది నేర్పడం, దీని యొక్క ఉద్దేశం నీది ఏమంటే ప్రజలు నిన్ను ఓ ఖారీ సాబ్, ఓ ఖారీ సాబ్ అని నీ పేరు ప్రఖ్యాతుల గురించి, ఇహలోకంలో గొప్ప పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో నీవు చదివేవానివి. అల్లాహ్ ప్రసన్నత కొరకు కాదు.” ఓ అల్లాహ్, నీ కరుణా కటాక్షాలతో మమ్మల్ని ఇలాంటి వారిలో కలపకుండా కేవలం నీ సంతృష్టి కొరకు చదివే సద్భాగ్యుల్లో మమ్మల్ని కూడా చేర్చు ఓ అల్లాహ్.

“నీ ఉద్దేశం ఏముండే? నీవు ఇహలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఖురాన్ చదివావు, ఖురాన్ పఠించావు, దానిని ఇతరులకు నేర్పావు. ప్రజలు నిన్ను చాలా మెచ్చుకున్నారు, అక్కడే నీ ఫలితం అయిపోయింది.”

ఆ తర్వాత, రెండో వ్యక్తిని అల్లాహ్ త’ఆలా పిలుస్తాడు ప్రజలందరి మధ్యలో నుండి. అతడు ఎవడు? అల్లాహ్ అతనికి చాలా డబ్బు, ధనం ప్రసాదించి ఉంటాడు. అల్లాహ్ అతని యొక్క అనుగ్రహాలను గుర్తు చేసి, “నీవు ఈ నా ఈ అనుగ్రహాలకు బదులుగా ఏమి ఆచరించావు? ఎలా కృతజ్ఞత తెలిపావు?” అని ప్రశ్నిస్తే, “ఓ అల్లాహ్, నీవు నాకు ఇచ్చిన ఈ అనుగ్రహాలన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయితే వీటిని నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను” అని అంటాడు. అప్పుడు అల్లాహ్ వైపు నుండి ఏం సమాధానం వస్తుంది? మళ్ళీ ఏం జరుగుతుంది? ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము ఆ విషయాలు విందాము.

డబ్బు ధనాలు కలిగి ఉన్న వ్యక్తి ఒప్పుకుంటాడు. “నీవు నేను ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా ఎలా ఆచరించావు? ఏం చేశావు? ఏ కృతజ్ఞత తెలిపావు?” అని అంటే, “ఓ అల్లాహ్, నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను, బంధుత్వాలను పెంచుకునే ప్రయత్నం చేశాను, నీకు ఇష్టమైన మార్గాల్లో నా ఈ ధనాన్ని వెచ్చించాను.” అప్పుడు అల్లాహ్ త’ఆలా సమాధానం ఇస్తూ, “నీవు పేరు ప్రఖ్యాతుల గురించి, అరే ఇతను చాలా ఉదార మనసు మరియు ఎంతో మంచి బుద్ధి గలవాడు, ధనాన్ని ఖర్చు పెట్టేవాడు అని పేరు ప్రఖ్యాతుల గురించి నీవు ఖర్చు పెట్టావు. ఇహలోకంలో ప్రజలు కూడా నిన్ను మెచ్చుకున్నారు.” ఈ విధంగా అతనికి ఏ పుణ్యము, ఏ సత్ఫలితము ప్రసాదించడు.

మూడో వ్యక్తిని కూడా అల్లాహ్ త’ఆలా అందరి మధ్యలో నుండి తీసుకువస్తాడు. అల్లాహ్ అతనికి శక్తి, గొప్ప మేధ, బుద్ధి ప్రసాదించి ఉంటాడు. అతను అల్లాహ్ మార్గంలో పోరాడుతూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. “నేను నీకు ఇచ్చిన ఈ శక్తి సామర్థ్యాలను నీవు ఒప్పుకుంటున్నావా?” అంటే, “అవును ఓ అల్లాహ్, నేను ఒప్పుకుంటున్నాను.” “నీవు ఏం కృతజ్ఞత చెల్లించావు?” అని అంటే, “ఓ అల్లాహ్, నేను నీ మార్గంలో పోరాడాను” అని అతను సమాధానం ఇస్తాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు, “నీవు అబద్ధం పలుకుతున్నావు.” దైవదూతలు కూడా అతనితో అంటారు, “నీవు అబద్ధం పలుకుతున్నావు. ఇహలోకంలో నీవు ఒక గొప్ప ధైర్యవంతునివి, చాలా గొప్పగా పోరాడే వానివి అని పేరు ప్రఖ్యాతుల గురించి ఇలా పోరాడావు.” అప్పుడు అల్లాహ్ త’ఆలా అతని యొక్క ఏ సత్కార్యాన్ని స్వీకరించడు. “నీవు అబద్ధం పలుకుతున్నావు” అని అంటాడు.

అబూ హురైరా చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా యొక్క మోకాళ్ళను ఇలా తట్టి, కొట్టి, “అబూ హురైరా, నీకు తెలుసా? అల్లాహ్ యొక్క సృష్టిలో తొలిసారిగా ఈ ముగ్గురిని ప్రశ్నించి, వారు అల్లాహ్ సంతృష్టి కొరకు ఆ సత్కార్యాలు చేయలేదు, పేరు ప్రఖ్యాతుల గురించే సత్కార్యాలు చేశారు గనుక వారి ఆ సత్కార్యాలని వృధా చేసి, ఎలాంటి సత్ఫలితం లేకుండా చేసి, నరకాగ్నిని ఈ ముగ్గురి ద్వారా మరింత ఎక్కువగా దహించడం జరుగుతుంది.”

అల్లాహ్ మనందరినీ కూడా నరక శిక్ష నుండి కాపాడు గాక. ఎప్పుడూ ఏ సత్కార్యం చేసినా గాని అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయకూడదు. అల్లాహ్ సంతృష్టి కాకుండా ఫలానా వారు, ఫలానా వారు నన్ను మెచ్చుకోవాలి, ఇహలోక పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా చేయడం, ఇది మహా ఘోర పాపం. దీనివల్ల మన త్రాసు అనేది బరువుగా కాకుండా తేలికగా అయిపోతుంది అన్న విషయం ఈ హదీథ్ ల ద్వారా మనకు తెలిసింది.

ఈ షుఫయ్యా రహిమహుల్లాహ్ ఎవరైతే అబూ హురైరా రదియల్లాహు అన్హు ద్వారా ఈ హదీథ్ ను విన్నారో, ఆయన హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క బాడీగార్డ్ లలో ఒకరు. ఒక సందర్భంలో ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు ఎవరో వచ్చారు. అప్పుడు షుఫయ్యా రదియల్లాహు అన్హు ఈ హదీథ్ ను కంప్లీట్ గా, సంపూర్ణంగా ఆ సందర్భంలో వినిపించారు. ఆ హదీథ్ ను విని హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు ఏం చెప్పారు?

“ఖురాన్ ను చదివేవారు, చదివించేవారు, ధనభండారాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడేవారు, వీరి యొక్క పరిస్థితి ఇలా ఉన్నది. వీరి ద్వారా నరకాగ్నిని దహించి వేయడం జరుగుతుంది అంటే, మరి మన పరిస్థితి ఏమవుతుందో కదా?” అని బాధపడుతూ ఉన్నారు. బాధ పడుతూ పడుతూ హజ్రత్ ముఆవియా రదియల్లాహు అన్హు కూడా స్పృహ తప్పిపోయారు. చాలా సేపటి తర్వాత ఎప్పుడైతే ఆయన మేల్కొన్నారో, ఖురాన్ యొక్క ఈ ఆయతులు పఠించారు.

ఖురాన్ సూరహ్ హూద్ యొక్క ఆయత్ నెంబర్ 15, 16 పఠించారు.

مَنۡ كَانَ يُرِيۡدُ الۡحَيٰوةَ الدُّنۡيَا وَزِيۡنَتَهَا نُوَفِّ اِلَيۡهِمۡ اَعۡمَالَهُمۡ فِيۡهَا وَهُمۡ فِيۡهَا لَا يُبۡخَسُوۡنَ
ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు. (11:15)

اُولٰٓئِكَ الَّذِيۡنَ لَيۡسَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ اِلَّا النَّارُ ‌ۖ وَحَبِطَ مَا صَنَعُوۡا فِيۡهَا وَبَاطِلٌ مَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ
అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి. (11:16)

అల్లాహు అక్బర్, గమనించారా? ఎంత గొప్ప ఘోర విషయం. ప్రళయ దినాన వారికి అగ్ని తప్ప, నరకాగ్ని తప్ప ఇంకా వేరే ఏదీ లభించదు. ఇహలోకంలో వారు చేసినదంతా కూడా వృధా అయిపోతుంది. ఇక ముందుకు వారు ఏదైతే చేస్తూ ఉంటారో అదంతా కూడా వృధా అవుతుంది. పరలోకాన వారికి ఎలాంటి లాభం దాని ద్వారా చేకూర్చదు.

అందుగురించే మహాశయులారా, అల్లాహ్ తో భయపడాలి. మనం ఏ సత్కార్యం చేసినా గాని కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయాలి మరియు ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల గురించి కాకుండా మనం అల్లాహ్ యొక్క అభీష్టాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసు బరువు కాకుండా దాని యొక్క బరువు తగ్గిపోయి తేలికగా అయి మనకు స్వర్గంలో కాకుండా నరకంలో పోయేటువంటి పరిస్థితి రావడానికి ఒక ముఖ్య కారణం ఈ లోకంలో మనం చేసే సత్కార్యాలు కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం కాకుండా ఇతరుల ప్రశంసలు అందుకోవడానికి, ఫలానా ఫలానా వారు మనల్ని మెచ్చుకోవాలని, ఇలా మనం చేస్తే మన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అని చేయడం మహా భయంకరం.

ఈ రోజుల్లో అనేకమంది దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? ఏదైనా ఇలాంటి దానధర్మాలు చేస్తే రాయి మీద వారి పేరు రాయబడి చాలా కాలం వరకు అక్కడ పెట్టడం జరుగుతుంది, ఈ విధంగా వారిని గుర్తించడం జరుగుతుంది అని. మరికొందరు ఏదైనా మరో సత్కార్యం చేస్తారు మరియు దాని యొక్క ఫోటోలు తీసి ఫేస్ బుక్ లలో, వాట్సాప్ లలో, సోషల్ మీడియాలలో వేసి నేను ఇలా చేశాను అని చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఎంతోమంది హజ్ కు వెళ్తూ ఉంటారు, ఉమ్రాకు వెళ్తూ ఉంటారు. హజ్, ఉమ్రాల యొక్క ఎన్నో సందర్భాలలో ఫోటోలు తీసి ఫేస్ బుక్ లలో వేయడం, వాట్సాప్ గ్రూప్ లలో పంపడం. అలాగే మరికొందరు ఖుర్బానీ సందర్భాలలో మంచి మంచి జంతువులు కొని ప్రజల్లో వారి యొక్క పేరు రావాలి అని, దాని యొక్క ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వేయడం, రమదాన్ మాసాల్లో ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి వారి యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి వాటి యొక్క ఫోటోలు తీసి గ్రూపులలో పంపడం.

అందరూ ఇలా చేసేవారు నవూజు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, ఇలాంటి దుష్కార్యానికి పాల్పడుతున్నారు అని నేను చెప్పడం లేదు. కానీ అనేక మంది యొక్క ఉద్దేశాలు ఇంచుమించు ఇలాగా ఉంటున్నాయి. ఎవరైనా ఏదైనా కారణంగా ఒక నిరూపణ ఉండడానికి ఏదైనా చేస్తూ ఉంటే వారి యొక్క మన: సంకల్పాన్ని, వారి హృదయాంతరంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అల్లాహ్ యే బాగవుగా గుర్తెరుగుతాడు. కానీ ఈ రోజుల్లో సామాన్యంగా మీరు ఎవరిని అడిగినా గాని, “అరే, ఏంటి దీన్ని మీరు ఎందుకు ఫోటోలు తీసి వేశారు?” అంటే, “మన ఫ్రెండ్స్ చూస్తారు కదా, మంచి కామెంట్స్ ఇస్తారు కదా.” అయితే ఈ విధంగా మన యొక్క మన సంకల్పంలో అల్లాహ్ యొక్క అభీష్టం, అల్లాహ్ యొక్క సంతృష్టి తగ్గిపోవడం వల్ల మన యొక్క ఈ సత్కార్యాల సత్ఫలితాలు కూడా తగ్గిపోతున్నాయి. చివరికి మన యొక్క త్రాసులు బరువుగా కాకుండా తేలికగా అయిపోతున్నాయి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ ఇలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉంచుగాక. మన యొక్క త్రాసును తేలికగా చేసే మరికొన్ని పాపాల గురించి ఇన్షా అల్లాహ్ ఈ విధంగానే మనం తెలుసుకుంటూ ఉంటాము. మీరు ఈ కార్యక్రమాలను చూస్తూ ఉండండి. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42019

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (4) – మరణానంతర జీవితం : పార్ట్ 45 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు [4] – [మరణానంతర జీవితం – పార్ట్ 45]
https://www.youtube.com/watch?v=nMRENiqwyCw [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినాన మంచి పనుల త్రాసును తేలికగా చేసే వివిధ పాప కార్యాల గురించి వివరిస్తున్నారు. (3) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట కంటే ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, (4) అల్లాహ్ క్షమించడని ఇతరుల గురించి ప్రమాణం చేయడం, (5) అసర్ నమాజ్‌ను వదులుకోవడం, (6) ఏకాంతంలో అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడటం మరియు (7) సరైన కారణం లేకుండా కుక్కను పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ చర్యలు కొండలంత పుణ్యాలను కూడా నాశనం చేసి, వాటిని దుమ్ము ధూళి వలె మార్చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటపై, ఆయన ఆదేశంపై ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం.

మహాశయులారా! ఇది కూడా మహా ఘోరమైన పాపం. దీనివల్ల మన పుణ్యాలన్నీ కూడా, సత్కార్యాల సత్ఫలితాలన్నీ కూడా నశించిపోయి, మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. సూరె హుజరాత్ ఆయత్ నెంబర్ ఒకటిలో అల్లాహు త’ఆలా విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏమిటంటే,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లాహి వ రసూలిహి)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి.  (49:1)

మనం విశ్వాసులం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలి. కానీ వారి కంటే ముందుగా, ఆదేశం లభించక ముందే తన మన ఇష్టానుసారం ఏదైనా చేయడానికి, ఆదేశం వచ్చిన తర్వాత దాన్ని అనుసరించకుండా మన అభిప్రాయాలను మనం అనుసరించడానికి ఏమాత్రం అనుమతి మనకు లేదు.

ఆ తర్వాత సూరె హుజరాత్‌లోని ఆయత్ నెంబర్ రెండును గమనించండి. అందులో ఇవ్వబడిన హెచ్చరిక ద్వారా భయ కంపితులై, అలాంటి చేష్టలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్‌ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్‌హరూ లహూ బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లి బఅదిన్ అన్ తహ్‌బత అఅమాలుకుమ్ వ అన్తుమ్ లా తష్ఉరూరున్)
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు..” (49:2)

ఓ విశ్వాసులారా! ప్రవక్త మాట కంటే, ప్రవక్త స్వరం కంటే మీ స్వరం అనేది ఎత్తుగా ఉండకూడదు. మరియు మీరు పరస్పరం ఎలానైతే ఒకరు మరొకరిని పిలుచుకుంటారో అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రవర్తించకండి. చివరికి మీరు, మీరు చేసే ఈ దుష్కార్యం వల్ల, మీరు ప్రవక్త స్వరంపై మీ స్వరాన్ని ఎత్తడం వల్ల, పరస్పరం మీరు ఎలా పిలుచుకుంటారో అలా ప్రవక్తను పిలవడం ద్వారా మీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అది మీకు తెలియకుండానే జరగవచ్చు. అంటే మీ పాపాల, మీ ఈ పాపం వల్ల మీ సత్కార్యాలు నశించిపోతున్నాయి అన్న విషయం మీకు తెలియకుండానే ఇదంతా జరగవచ్చు. అల్లాహు అక్బర్. ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ప్రవక్త స్వరంపై మన స్వరాన్ని ఎత్తడం, ప్రవక్త మాటపై మన మాటను పెంచడం, పరస్పరం పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవడం, దీనివల్ల మనకు తెలియకుండానే మన సత్కార్యాలు వృధా అవుతున్నాయి అంటే, ఇక ఎవరైతే తెలిసి తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని విడనాడుతున్నారో, ప్రవక్త ఆదేశం ఒకటి ఉంది అంటే, తనకిష్టమైన నాయకుడు, తనకిష్టమైన ఇమామ్, తనకిష్టమైన పీర్, తనకిష్టమైన మౌల్వీ సాబ్, వారి యొక్క ఫత్వాలు ఇంకో రకంగా ఉంటే ప్రవక్తను వదిలేసి వారినే అనుసరిస్తున్నారో, వారి యొక్క సత్కార్యాలు వృధా కావా? అలాంటి వారు భయపడే అవసరం లేదా?

ఈ రోజుల్లో మనలోని ఎంతో మంది సోదరులు, ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మరోవైపు మన తాత ముత్తాతల విధానం, మన యొక్క దురాచారాలు, మన యొక్క గ్రామ చట్టాలు ఈ విధంగా ఉంటాయి. ప్రవక్తను వదిలేసి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఏ నష్టంలో పడరు అని ఏదైనా మన దగ్గర జమానత్ ఉందా? అందు గురించి మనం ఈ ఆయతులు చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో, అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం. అల్లాహు అక్బర్. ఒకసారి ఈ హదీసును గ్రహించండి. హజ్రత్ జుందుబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు,

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ لِفُلَانٍ
(ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు లి ఫులాన్)
నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు, మన్నించడు.

అప్పుడు అల్లాహు త’ఆలాకు చాలా కోపం వచ్చింది. అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలానా వ్యక్తిని నా అతనికి నా క్షమాపణ లభించదు అని, నా వైపు నుండి అతన్ని కరుణించడం జరగదు అని ప్రమాణాలు చేసేటువంటి అధికారం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని క్షమించాను మరియు ఇలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేసాను. అల్లాహు అక్బర్. గమనించారా? ఎంత భయంకరమైన విషయమో.

అయితే మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను, మన్నింపు క్షమాపణలను మనం మన చేతిలో, మన అధికారంలో తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, “సోదరా! ఇలాంటి తప్పు చేసే వారిని అల్లాహ్ క్షమించడు అని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసే వారిని అల్లాహ్ శపిస్తాడని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ నరకంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ స్వర్గంలో పంపడం లేదు అని చెప్పడం జరిగింది.” ఇలాంటి బోధన మనం చేయాలి. కానీ, “నువ్వు ఈ తప్పు చేస్తున్నావా? నిన్ను అల్లాహ్ క్షమించనే క్షమించడు. అల్లాహ్ నీకు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకునే అధికారమే, అటువంటి భాగ్యమే ప్రసాదించడు.” ఇట్లాంటి ఆదేశాలు మనం జారీ చేయకూడదు. ఒకరిని అల్లాహ్ యొక్క క్షమాపణ పట్ల నిరాశకు గురి చేయకూడదు.

ఒకవేళ ఇదే ప్రమాణాలు చేసుకుంటూ, నిన్ను ఎన్నటికీ అల్లాహ్ క్షమించడు అని అంటే, అల్లాహ్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతనికి అతను ఆగ్రహానికి గురై, ఇలాంటి వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేస్తాడు. అల్లాహు అక్బర్. అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! త్రాసును తేలికగా చేసే పాపాల్లో, అసర్ నమాజ్‌ను వదులుకోవడం. అల్లాహు అక్బర్. అసర్ నమాజ్. అల్లాహ్ రేయింబవళ్ళలో, రాత్రి పగళ్ళలో ఐదు వేలల నమాజ్ మనపై విధిగావించాడు. ఐదు నమాజుల్లో ఒకటి మధ్యలో ఉన్న నమాజ్ అసర్ నమాజ్. ఎవరైతే అసర్ నమాజ్ వదిలేస్తారో వారి యొక్క సత్కార్యాలు వృధా అయిపోతాయి. శ్రద్ధ వహించండి ఈ హదీసుపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్‌ను విడనాడతారో వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి.

ఈ అసర్ నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే,

حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ
(హాఫిజూ అలస్సలవాతి వస్సలాతిల్ వుస్తా)
“నమాజులను, ప్రత్యేకించి మధ్య నమాజును కాపాడండి.” (2:238)

అని అల్లాహు త’ఆలా ఖురాన్లో ఆదేశం ఇచ్చాడు. మీరు అన్ని నమాజులను పాబందీగా చేస్తూ ఉండండి. కానీ మధ్యలో ఉన్న నమాజు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇందులో మధ్యలోని నమాజ్ అంటే అసర్ నమాజ్ అని ఎన్నో హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది.

అబూ ములైహ్ రహిమహుల్లాహ్ చెప్పారు, మేము ఒక సందర్భంలో, ఒక యుద్ధంలో ఉన్నాము. గమనించండి, యుద్ధంలో ఉన్నప్పుడు ఎంత మనిషి బిజీగా ఉంటాడో, అటువైపు శత్రువుల నుండి శత్రువుల బాణాలు, ఆయుధాలు మన మీదికి వచ్చి పడే, మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం క్షణం ఉంటుంది. అబూ ములైహ్ అంటున్నారు, మేము ఒక యుద్ధంలో హజ్రత్ బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు వెంట ఉన్నాము. అసర్ నమాజ్ సమయం ప్రవేశించింది. అప్పుడు బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, అసర్ నమాజ్ మీరు చేసుకోండి. ఇందులో ఆలస్యం చేయకండి. ఎందుకంటే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్ విడినాడారో, ఎవరైతే అసర్ నమాజ్ వదిలేశారో వారి యొక్క సర్వ సత్కార్యాలు వృధా అయిపోయాయి.

దీని గురించి మనల్ని భయకంపితులుగా చేసే హదీస్ కూడా ఉంది. సహీహ్ బుఖారీలోని హదీస్. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الَّذِي تَفُوتُهُ صَلَاةُ الْعَصْرِ كَأَنَّمَا وُتِرَ أَهْلَهُ وَمَالَهُ
(అల్లజీ తఫూతుహూ సలాతుల్ అస్ర్ క అన్నమా వుతిర అహ్లహూ వ మాలహూ)
ఎవరి అసర్ నమాజ్ తప్పిపోయినదో, ఎవరైతే అసర్ నమాజ్ చేయలేకపోయారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క సొమ్ము, ధనము, ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయినటువంటి వాడు.

ఎప్పుడైనా ఈ బాధ మనకు కలిగిందా ఒకసారి ఆలోచించండి. అటు నమాజ్ టైం అయింది, ఇటువైపున కొడుకుకు చాలా జ్వరం వచ్చింది అంటే, మనం నమాజ్‌ను వదులుకొని కొడుకును ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటాము. ఇక ఎవరి ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయారో అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అసర్ నమాజ్ కూడా తప్పిపోయినప్పుడు అంత బాధ మనకు కలిగిందా? ఎంత బాధనైతే మన ఆస్తిపాస్తులు, మన ఆలు పిల్లలు అందరూ నశించిపోయినప్పుడు కలుగుతుందో, అలాంటి బాధ ఏదైనా ఒక్క నమాజ్ మిస్ అయినప్పుడు మనకు కలిగిందా? అందు గురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర సత్కార్యాలన్నిటినీ కూడా వృధా చేసుకోకుండా నమాజ్ కాపాడుకుంటూ మనం ఇతర సత్కార్యాలను కూడా కాపాడుకోవాలి.

మన త్రాసు బరువును తగ్గించేసి, తేలికగా చేసే పాపాల్లో మరో భయంకరమైన పాపం, ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడటం లేదు కదా అని భావించుకుంటూ ఉన్నప్పుడు, అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడడం. దీనివల్ల కూడా మన ఇతర సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఈ రోజుల్లో ఎంతమంది మన, మనలోని ఎంతమంది పరిస్థితి ఇలా గురై ఉంది. ఒక్కసారి ఈ హదీసును మీరు చాలా శ్రద్ధగా వినండి. దీనిని అర్థం చేసుకొని ఇందులో చూపబడిన నష్టాలకు దూరంగా ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

హజ్రత్ సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీస్, దీనిని మనం మన ఈ చెవులతోనే కాకుండా, హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని ఉంటే, ఈ హదీస్ మనలోని నిద్రలో ఉన్న వారిని నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. అశ్రద్ధలో ఉన్నవారి యొక్క అశ్రద్ధతనాన్ని దూరం చేసేస్తుంది. అంతటి భయంకరమైన హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

لَأَعْلَمَنَّ أَقْوَامًا مِنْ أُمَّتِي يَأْتُونَ يَوْمَ الْقِيَامَةِ بِحَسَنَاتٍ أَمْثَالِ جِبَالِ تِهَامَةَ بِيضًا فَيَجْعَلُهَا اللَّهُ عَزَّ وَجَلَّ هَبَاءً مَنْثُورًا
(ల అ’లమన్న అఖ్‍వామన్ మిన్ ఉమ్మతీ య’తూన యౌమల్ ఖియామతి బి హసనాతిన్ అమ్సాల జిబాలి తిహామా బైదా ఫ యజ్అలుహల్లాహు అజ్జవజల్ల హబాఅన్ మన్సూరా)

నేను నా అనుచర సంఘంలోని కొందరిని గుర్తుపడతాను. వారు నాకు తెలుసు. వారు తిహామా నగరంలోని పర్వతాల మాదిరిగా సత్కార్యాలను తీసుకొని ప్రళయ దినాన హాజరవుతారు. (అరబ్బులో తిహామా కొండలు చాలా ఫేమస్. అలాంటి కొండల మాదిరిగా పుణ్యాలు చేసుకొని వస్తారు ప్రళయ దినాన.) కానీ అల్లాహు త’ఆలా వాటిని దుమ్ము ధూళి వలె చేసేస్తాడు.

ఈ భయంకరమైన విషయం విని సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు, “ప్రవక్తా, వారు ఎలాంటి వారు? వారి గుణం ఏమిటి? వారి గురించి ఏదైనా స్పష్టంగా తెలపండి. మాకు తెలియకుండానే మేము అలాంటి వారిలో కలిసిపోకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడతాము” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “వారు మీ సోదరులే, మీ వంశం వారే. వారు రాత్రి వేళల్లో నిలబడి తహజ్జుద్ నమాజ్‌లు చేసే అటువంటి వారు. మీరు ఎలా తహజ్జుద్ నమాజ్ చేస్తున్నారో అలా వారు కూడా తహజ్జుద్ నమాజ్ చేసేవారు. కానీ ఒంటరిగా ఉండి అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం దొరికితే, వాటికి దూరంగా ఉండడానికి బదులుగా ఆ నిషిద్ధ కార్యాలకు పాల్పడేవారు.”

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్, ఒక హాస్టల్లో ఉన్నవారు కూడా, ఒకచోట పనిచేసేవాళ్ళు కూడా, హెడ్ ఫోన్స్ చెవులలో పెట్టుకున్నారు, పై నుండి దుప్పటి కప్పుకున్నారు. లోపలి నుండి స్మార్ట్ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ, ఇష్టమైన చిత్రాలు చూసుకుంటూ, పాప కార్యాలు చూసుకుంటూ, పక్కన ఎవరూ కూడా వినడం లేదు, పక్కన ఉన్నవారు ఎవరూ చూడడం లేదు. ఈ విధంగా సామాన్యంగా ఈరోజు జరుగుతున్న ఇటువంటి పాపాలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిలో ఒంటరి తనాల్లో కలుసుకోవడం, ఎవరు చూడడం లేదు కదా అని ప్రత్యేక కోడ్ వర్డ్లలో వారితోని మాట్లాడుకోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో దుష్కార్యాలు ఈనాటి సమాజంలో ప్రబలిపోతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం బయటికి వచ్చినా, దానిని ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, అల్లాహు అక్బర్. మహాశయులారా, అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇంతటి భయంకరమైన హదీస్ ఇది. చూడడానికి నమాజ్‌లు చేస్తూ ఉండడం, వేరే సత్కార్యాలు చేస్తూ ఉండడం, ఒక మంచివాడుగా ప్రజల్లో పేరు పొందడం, కానీ ఒంటరిగా ఉండి పాపాలు చేసే అవకాశం వస్తే, ఏమాత్రం జంకకుండా, వెనుక ఉండకుండా, అల్లాహ్‍తో భయపడకుండా అలాంటి నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ఇది మన సత్కార్యాలన్నిటినీ వృధా చేసేస్తుంది.

మహాశయులారా, మన సత్కార్యాలను వృధా చేసి మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఏడవది, కుక్కను పెంచడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎందరో ముస్లింల ఇళ్లల్లో కూడా పెట్టీ అని, ఇంకా ఏదేదో పేర్లతో, రకరకాల, ఎంతో అందమైన ముద్దుగా ఉన్నటువంటి పేర్లతో కుక్కలను పిలుచుకుంటూ, పెంచుకుంటూ, వారిని తమ ఒడిలో తమ పిల్లల మాదిరిగా ఉంచుకుంటూ ఇలా వారిని పోషిస్తున్నారు.

ఈ రోజుల్లో ఎంతో మంది తమ సొంత పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లుగా కుక్కను పెంచుకుంటున్నారు. ఎంతో ముద్దు ముద్దు పేర్లతో వారిని పిలుచుకుంటూ, వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ విధంగా మహాశయులారా, ముందే పుణ్యాలు, సత్కార్యాలు చాలా తక్కువగా మనకు ఉన్నాయి అంటే, ఇలాంటి పాప కార్యాల వల్ల మరింత మనం ప్రళయ దినాన నష్టపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنِ اتَّخَذَ كَلْبًا، إِلَّا كَلْبَ زَرْعٍ أَوْ غَنَمٍ أَوْ صَيْدٍ، يَنْقُصُ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيرَاطٌ
(మనిత్తఖద కల్బన్ ఇల్లా కల్బ జర్ఇన్ అవ్ గనమిన్ అవ్ సైదిన్ యన్ఖుసు మిన్ అజ్రిహీ కుల్ల యౌమిన్ ఖీరాత్)
ఎవరైతే కుక్కను పెంచుతారో, వారి యొక్క పుణ్యాల్లో ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి.

ఒక ఖీరాత్ పుణ్యాలు అంటే ఎంతో తెలుసా? జనాజా నమాజ్‌కు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకున్నాము. ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతానికి సమానం. రెండు ఖీరాత్‌లు అంటే రెండు ఉహుద్ పర్వతాలు లేదా రెండు పెద్ద పర్వతాలకు సమానం.

ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యం తగ్గుతూ ఉంటుంది ఎవరైతే కుక్కను పెంచుతూ ఉంటారో. కానీ ఇందులో కేవలం మూడు రకాల కుక్కలను పెంచే అనుమతి ఉంది. ఆ కుక్కలు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంటి ఆవరణలో ఉండకుండా బయట ఉంచే ప్రయత్నం చేయాలి. ఎలాంటి మూడు కుక్కలు? ఒకటి, మనం మన తోట రక్షణ కొరకు పెంచే కుక్క, అది తోటలోనే ఉండాలి, ఇంటి వద్ద ఉండకూడదు. మరొకటి, మేకల రక్షణ కొరకు మనం పెంచే కుక్క, అది మేకల వద్దనే ఉండాలి, మన ఇంట్లోనికి రానివ్వకూడదు. మూడవది, كَلْبَ صَيْدٍ (కల్బ సైదిన్) వేటాడడానికి, వేరే కొన్ని జంతువులను వేటాడడానికి వేట యొక్క శిక్షణ ఇవ్వబడిన కుక్కలు. సామాన్య కుక్కలు కూడా కాదు. వేట యొక్క శిక్షణ వారికి ఇవ్వబడాలి. అలాంటి కుక్కలు, అవి కూడా ఇంట్లోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి.

ఈ మూడు రకాల కుక్కలు పెంచడానికి అనుమతి ఉంది. ఈ మూడు ఉద్దేశాలు కాకుండా ఇంకా ఎవరైనా కుక్కను పెంచుతున్నారు అంటే ప్రతి రోజూ వారి యొక్క సత్కార్యాలలో నుండి ఒక ఖీరాత్ సత్కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎంత నష్టానికి గురి అయిపోతామో గమనించండి.

మరికొన్ని పాప కార్యాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41887

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన
[మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=bqcAR6CBK80
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

السلام عليكم ورحمة الله وبركاته
الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد

మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?

మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/