త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2] – కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్ [మరణానంతర జీవితం – పార్ట్ 24] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2]
కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్
[మరణానంతర జీవితం – పార్ట్ 24] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=qB4bqlE_8NE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన సత్కార్యాల త్రాసును బరువుగా చేసే పనుల గురించి వివరించబడింది. మూడవ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కోసం కోపాన్ని దిగమింగడం. ఇది ఒక వ్యక్తికి ప్రపంచం మరియు దానిలో ఉన్న సమస్తం కంటే మేలైన పుణ్యాన్ని అందిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. నాల్గవది, జనాజా నమాజ్‌లో పాల్గొని, ఖననం పూర్తయ్యే వరకు అంతిమయాత్రను అనుసరించడం. దీనికి ప్రతిఫలంగా రెండు మహా పర్వతాలంత పుణ్యం లభిస్తుంది. ఐదవది, రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్‌లో కనీసం పది ఖురాన్ ఆయతులను పఠించడం. ఇది ఒక వ్యక్తిని అశ్రద్ధ చేసేవారి జాబితా నుండి తొలగించి, అపారమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఈ కర్మలు చూడటానికి చిన్నవిగా అనిపించినా, వాటి ప్రతిఫలం చాలా గొప్పదని మరియు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయని బోధించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము. అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం. అల్లాహు అక్బర్.

ఈ రోజుల్లో మనలో ఎంతో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు. ధర్మ విషయంలో, అల్లాహ్ కొరకు కోపానికి రావడం, ఇది కూడా ఒక మంచి విషయం, సత్కార్యంలో లెక్కించబడుతుంది. కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం. అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు. మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు, ఎన్నో రకాల పాపానికి, ఎన్నో రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలపడమే కాకుండా, ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలపడం జరిగింది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. ఇబ్ను మాజా, ముస్నద్ అహ్మద్, అదబుల్ ముఫ్రద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2752.

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللَّهِ مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللَّهِ
(మా మిన్ జుర్‌అతిన్ అఅజము అజ్రన్ ఇందల్లాహ్ మిన్ జుర్‌అతి గైజిన్ కజమహా అబ్దున్ ఇబ్తిగాఅ వజ్‌హిల్లాహ్)
అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక.

గమనించండి ఇక్కడ విషయం. ఎలాంటి గుటక అల్లాహ్ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది? కోపాగ్ని గుటక. ఏదైతే మనిషి కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికై మింగేస్తాడో. అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం, కోపం ఉన్నా, ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన వద్ద ఉన్నా, దాని ద్వారా ఇతరులకు ఏ చెడుకు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఎంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది.

ఇలా కోపాన్ని దిగమింగి, ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ్ ప్రశంసించాడు. ఖురాన్‌లో అలాంటి వారిని ప్రశంసించాడు. చదవండి సూరె ఆలి ఇమ్రాన్. ఆయత్ నెంబర్ 134 మరియు 136.

الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
(అల్లజీన యున్ఫికూన ఫిస్సర్రాఇ వద్దర్రాఇ వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాస్, వల్లహు యుహిబ్బుల్ ముహ్సినీన్)
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” (3:134)

కలిమిలో నున్నా, బలిమిలో నున్నా, సిరివంతులైనా, పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు. మరియు తమ కోపాన్ని దిగమింగేవారు. ప్రజల్ని మన్నించేవారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, అల్లాహ్ ప్రేమిస్తాడు.

ఆ తర్వాత ఆయతులో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి, వారికి లభించే పుణ్యం ఎలాంటిదో 136వ ఆయతులో ప్రస్తావించాడు.

أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
(ఉలాఇక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్రబ్బిహిమ్ వ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, వనిఅమ అజ్రుల్ ఆమిలీన్)
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!.” (3:136)

అలాంటి వారికి తమ ప్రభువు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభువు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది, మన్నింపు లభిస్తుంది. మరియు స్వర్గాలు. ఎలాంటి స్వర్గవనాలు? వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో సదా కాలం ఉంటారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఎంత మేలు ఉంది.

ఈ విధంగా అల్లాహ్ త’ఆలా స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి, ప్రజల్ని మన్నించే వారి గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నాడు.

ఇంతటితో సరి కాకుండా, ఎవరైతే అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో, అల్లాహ్ త’ఆలా వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ హదీసును ఇమామ్ అబూ దావూద్, ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్ను మాజా, ఇమామ్ అహ్మద్ తమ హదీథ్ గ్రంథాల్లో ప్రస్తావించారు. మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దానిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2753.

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ دَعَاهُ اللَّهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللَّهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ
(మన్ కజమ గైజన్ వహువ ఖాదిరున్ అలా అన్ యున్ఫిజహు దఆహుల్లాహు అజ్జవజల్ల అలా రుఊసిల్ ఖలాయిఖి యౌమల్ ఖియామతి హత్తా యుఖయ్యిరహుల్లాహు మినల్ హూరిల్ ఈని మా షాఅ)

“ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు, కానీ కేవలం అల్లాహ్ సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు. అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహ్ త’ఆలా అతన్ని పిలిచి, హూరె ఈన్ (స్వర్గపు కన్య స్త్రీలలో, పవిత్ర స్త్రీలలో) తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడానికి అల్లాహ్ త’ఆలా అతనికి ఛాయిస్ (అధికారం) ఇస్తాడు.”

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇహలోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహ్ త’ఆలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి ఇస్తారు అంటే, ఈ విధంగా అతని యొక్క సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది.

దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి, పడవేసి, నాలుగు తిట్టి, దూషించి, అతన్ని కొట్టడమే ఇది శూరుడు, పెహల్వాన్ అన్న భావం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కూడా తెలియబరిచారు.

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ
(లైసష్షదీదు బిస్సురఅ, ఇన్నమష్షదీదుల్లజీ యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్)

“ఎదుటి వాడిని చిత్తు చేసే వాడే శూరుడు కాదు. అసలైన శూరుడు ఎవరంటే, తాను ఆగ్రహదోగ్రుడైనప్పుడు, కోపానికి గురి అయినప్పుడు తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు.”

ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీథ్ నెంబర్ 6114. మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది. హదీథ్ నెంబర్ 2950.

ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే, అందులో మూడవ విషయం కోపాన్ని దిగమింగడం. మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు చేసే విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో, ఈ శీర్షికలో, నాల్గవ విషయం… జనాజా నమాజ్ చేయడం మరియు జనజాల వెంట వెళ్ళడం.

సోదర సోదరీమణులారా, జనాజా వెంట వెళ్ళడం, జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది. మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఇలా ఉంది.

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا وَيُفْرَغَ مِنْهَا فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ
(మన్ తబిఅ జనాజతన్ హత్తా యుసల్లా అలైహా వ యుఫ్రగ మిన్హా ఫలహు కీరాతాన్, వమన్ తబిఅహా హత్తా యుసల్లా అలైహా ఫలహు కీరాతున్, వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లహువ అస్ఖలు ఫీ మీజానిహి మిన్ ఉహుద్)

“ఎవరైతే జనాజా వెంట వెళ్లి జనాజా నమాజ్ చేసి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు దాని వెంట ఉంటాడో, అతనికి రెండు కీరాతుల పుణ్యం. మరి ఎవరైతే కేవలం నమాజ్ చేసే వరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆ రెండు కీరాతులు ప్రళయ దినాన త్రాసులో ఉహుద్ పర్వతం కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది.”

గమనించారా? స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్రాసులో ఈ పుణ్యాలు ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో. ఇకనైనా మనం జనాజా నమాజ్‌లో పాల్గొందామా?

అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి? నా బంధువు కాదు కదా, నా తోటి పనిచేసేవాడు కాదు కదా, నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు. అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఏది ఉంటే, వారి జనాజాలోకి వెళ్తున్నారు. మరికొందరైతే అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనుక, అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను. అతనితోనే ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము? మనం ప్రళయ దినాన మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతురాలా పోగొట్టుకుంటున్నాము.

జనాజాకు సంబంధించిన మరొక హదీథ్ వినండి. అందులో ఉహుద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది. ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నెంబర్ 1325, మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది, హదీథ్ నెంబర్ 945.

مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ. قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ
(మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్లియ ఫలహు కీరాతున్, వమన్ షహిద హత్తా తుద్ఫన కాన లహు కీరాతాన్. కీల వమల్ కీరాతాన్? కాల మిస్లుల్ జబలైనల్ అజీమైన)

“ఎవరైతే కేవలం జనాజా నమాజ్ చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్, మరియు ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు. రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రెండు మహా పెద్ద పర్వతాలకు సమానం అని.”

పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలా? అంతకంటే మరీ పెద్దవియా? కావచ్చు. అది మనం ఎంత సంకల్ప శుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు.

ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు, ఏ శవం వెంటనైనా ఖబ్రిస్తాన్‌లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా? హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి గురించి ముస్లిం షరీఫ్‌లో ఉల్లేఖన ఉంది. జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే. కానీ ఖబ్రిస్తాన్ వరకు వెళ్లి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాతులు అన్న విషయం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌కు చాలా రోజుల వరకు తెలియలేదు. ఎప్పుడైతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖన ఆయన విన్నారో, రెండు కీరాతుల పుణ్యం అని, చాలా బాధపడ్డారు. మాటిమాటికి అనేవారు, అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని.

ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే, ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే, అరే ఆ తారీఖు లోపల నేను ఎందుకు అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం. ఇలాంటి పుణ్యాలు ఉహుద్ పర్వతానికి సమానమైన, అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా? కలుగుతుంది అంటే ఇన్ షా అల్లాహ్ ఇది విశ్వాసం యొక్క సూచన. అల్లాహ్ మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం…కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది.

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
(మన్ కరఅ అషర ఆయాతిన్ ఫీ లైలతిన్ కుతిబ లహు అల్ కిన్తార్, వల్ కిన్తార్ ఖైరుమ్ మినద్దున్యా వమా ఫీహా)

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ అన్నది ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది.

అల్లాహు అక్బర్. కేవలం ఒక బిల్డింగ్ లభించినది, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది, మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పది ఆయతులు ఎవరైతే పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది. ఈ హదీథ్ తబ్రానీ కబీర్‌లోనిది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు.

ఇక సునన్ అబీ దావూద్, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను ఖుజైమాలోని ఈ హదీసును శ్రద్ధగా వినండి. దీనిని షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 639.

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الْغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ الْقَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ الْمُقَنْطَرِينَ
(మన్ కామ బి అష్రి ఆయాతిన్ లమ్ యుక్తబ్ మినల్ గాఫిలీన్, వమన్ కామ బిమిఅతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్, వమన్ కామ బి అల్ఫి ఆయ కుతిబ మినల్ ముకన్తరీన్)

“ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో, వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు. మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో, నమాజ్ చేస్తూ, వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు. మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజ్ చేస్తారో, వారిని ముకన్తరీన్‌లో లిఖించబడుతుంది.”

ముకన్తరీన్ అంటే ఎవరు? ఎవరికైతే కిన్తార్ పుణ్యాలు లభిస్తాయో, ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది.

ఈ విధంగా మహాశయులారా, గమనించండి, చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్ షా అల్లాహ్ బరువు గలవిగా చేస్తాయి. ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]