ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు
https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు]
వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగం ముస్లిం సమాజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కుల గురించి వివరిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ను స్తుతించడంతో ప్రసంగం మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి లేదా ప్రాంతానికి మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడ్డారని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. ఇందులో ప్రధానంగా ఐదు హక్కుల గురించి చర్చించబడింది: 1) ప్రవక్తను విశ్వసించడం, ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత; 2) ప్రవక్తను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం మరియు ఆయన సమక్షంలో స్వరాలు పెంచరాదని సహాబీల ఉదాహరణలతో వివరించబడింది; 3) ప్రవక్తను తల్లిదండ్రులు, సంతానం, మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, జైద్ రజియల్లాహు అన్హు వంటి సహాబీల ఉదాహరణలతో నొక్కి చెప్పబడింది; 4) జీవితంలోని ప్రతి రంగంలో ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవడం; 5) ప్రవక్త ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు విధేయత చూపడం. ఈ హక్కులను నెరవేర్చడం ద్వారానే ఇహపరలోకాలలో సాఫల్యం లభిస్తుందని ఈ ప్రసంగం బోధిస్తుంది.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
(నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక,ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).
ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు
ఈనాటి ప్రసంగంలో మనం ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు ఏమిటి అనే విషయాన్ని ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్, హదీస్ గ్రంథాల వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ఉదాహరణల ద్వారా కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక జాతి వారికి ప్రవక్త కాదు, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు.
ఖుర్ఆన్ గ్రంథం ఏడవ అధ్యాయము 158 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఅనిల్లజీ లహు ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఓ మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)
దాని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. మీ అందరి వైపున పంపబడిన ప్రవక్త అంటే అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవదౌత్యము వర్తిస్తుంది. అంటే నా మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ప్రపంచానికి, మానవులందరి వైపుకు ప్రవక్తగా పంపబడి ఉన్నారు, ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇక రండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత, విశ్వాసి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున ఏమేమి బాధ్యతలు వస్తాయి, ఏమి హక్కులు అతని మీద ఉంటాయి, ఆ హక్కులు ఏమిటి, వాటిని అతను ఏ విధంగా చెల్లించుకోవాలి అనేది మనం చూద్దాం.
ప్రథమ హక్కు: విశ్వసించడం
ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ఖుర్ఆన్ గ్రంథం సూరా తగాబున్ ఎనిమిదవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ
(ఫ ఆమినూ బిల్లాహి వ రసూలిహి)
కనుక మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. (64:8)
అనగా, మీరు అల్లాహ్‌ను విశ్వసించండి మరియు దైవ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి కొంతమంది విశ్వసించారు. చూడకుండా చాలామంది విశ్వసించారు. అయితే ఒక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి శుభవార్త వినిపిస్తే చూడకుండా ఆయనను విశ్వసించిన వారికి ఏడుసార్లు శుభవార్త వినిపించి ఉన్నారు.
طوبى لمن رآني وآمن بي، وطوبى سبع مرات لمن لم يرني وآمن بي
(తూబా లిమన్ రఆనీ వ ఆమన బీ, వ తూబా సబ అ మర్రాతిన్ లిమన్ లమ్ యరనీ వ ఆమన బీ.)
ఇది ప్రామాణికమైన హదీసు. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించాడో అతనికి ఒక్కసారి శుభవార్త, మరియు ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారో వారికి ఏడుసార్లు శుభవార్త అని ఆ ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మనము చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద పుట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడకుండా విశ్వసించాము కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ఏడుసార్లు శుభవార్త ఇన్ షా అల్లాహ్ అది మనకు దక్కుతుంది.
అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అతని ముందర జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అన్న విషయాన్ని అతను తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే ప్రవక్త వారిని విశ్వసించకుండా తిరస్కారిగా అలాగే ఉండిపోతాడో, అతను నరకానికి చేరుకుంటాడు, నరకవాసి అయిపోతాడు అని కూడా హెచ్చరించబడి ఉంది. ముస్లిం గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించి ఉన్నారు,
والذي نفس محمد بيده، لا يسمع بي أحد من هذه الأمة يهودي ولا نصراني، ثم يموت ولم يؤمن بالذي أرسلت به، إلا كان من أصحاب النار
(వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బి యదిహి, లా యస్మవు బీ అహదున్ మిన్ హాజిహిల్ ఉమ్మతి యహూదియ్యున్ వలా నస్రానియ్యున్, సుమ్మ యమూతు వలమ్ యుఅమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్నార్).
దీని భావం ఏమిటంటే, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణము ఉందో ఆ మహా శక్తిశాలి అయిన ప్రభువు సాక్షిగా నా ఈ అనుచర సమాజంలో అతను యూదుడు గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా గాని, అతని ముందర నా ప్రస్తావన జరిగింది, అతను నా గురించి విన్నాడు. నా గురించి విని కూడా అతను నన్ను మరియు నా ద్వారా పంపబడిన శాసనాన్ని, ధర్మాన్ని విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులలో చేరిపోతాడు. చూశారా? ప్రవక్త వారి గురించి విని, తెలుసుకొని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని గురించి విని తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులకు చేరిపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే అతని ముందర ఎప్పుడైతే ప్రవక్త వారి గురించి మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మం గురించి ప్రస్తావించబడుతుందో అతను వెంటనే అర్థం చేసుకొని మనసారా ప్రవక్త వారిని విశ్వసించాలి, ప్రవక్త వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని అతను స్వీకరించాలి.
ఏ విషయం మమ్మల్ని అడ్డుపడుతూ ఉంది ప్రవక్త వారిని మరియు ప్రవక్త తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించడానికి అంటే చాలామంది కేవలము భయం కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి నేడు ప్రజలతో గాని, అధికారులతో గాని మనము భయపడి వెనకడుగు వేస్తే రేపు మరణానంతరము మమ్మల్ని వారు వచ్చి రక్షిస్తారా? మాకు అలాంటి గడ్డు పరిస్థితులు కూడా లేవు ప్రపంచంలో. మనము అల్హమ్దులిల్లాహ్ స్వతంత్రులము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూడండి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజలు బానిసలుగా కూడా ఉన్నారు. బానిసలుగా ఉండి, పేదలుగా ఉండి కూడా వారు గడ్డు పరిస్థితులలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని ప్రవక్త వారి సమక్షంలో హాజరయ్యి ప్రవక్త వారిని విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. తత్కారణంగా ప్రజలు, అధికారులు, పెద్దలు వారిని హింసించారు, వారిని విమర్శించారు, వారిని హేళన చేశారు, రకరకాలుగా చిత్రహింసలు చేసినప్పటికినీ వారు మాత్రము విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసులుగా చరిత్రలో నిలిచిపోయారు మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద కూడా గౌరవమైన స్థానం పొందారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని చూడండి. ఈయన ఒక యజమాని వద్ద బానిసగా ఉండేవారు. యజమాని పేరు ఉమయ్య బహుశా నాకు గుర్తు రావట్లేదు. ఉమయ్య బిన్ ఖల్ఫ్. అతను ఏం చేసేవాడంటే, బిలాల్ రజియల్లాహు అన్హు వారు ముస్లింలు అయిపోయారు, విశ్వాసి అయిపోయారు అన్న విషయాన్ని విని తెలుసుకొని, బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఈ అరబ్బు దేశంలో ఎడారిలో ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ వేడికి ఇసుక ఎంతగా కాలిపోతూ ఉంటుంది, అలాంటి మండుతున్న ఇసుక మీద అర్ధనగ్నంగా ఆయనను పడుకోబెట్టేవాడు, ఆ తర్వాత ఛాతి మీద పెద్ద పెద్ద రాళ్లు పెట్టేసేవాడు. పైన రాయి కాలుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, కింద ఇసుక కూడా కాలుతూ ఉంటుంది, అలాంటి స్థితిలో ఆయన అల్లాడిపోతూ ఉంటే నీవు విశ్వాసాన్ని వదిలేయి, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అవన్నీ భరించి కూడా ఆయన బానిస అయి ఉండి కూడా చిత్రహింసలు భరిస్తూ కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపించిన సత్య ప్రవక్త అని చాటి చెప్పారు. ఆ తర్వాత అతను అన్నము పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఆకలిదప్పికలతో అలాగే ఉంచేశాడు, చెరసాలలో బంధించాడు, మెడలో తాడు కట్టేసి పోకిరి పిల్లవారికి, కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని పశువులాగా ఈడ్చుకుంటూ తిరిగేవారు. తత్కారణంగా ఆయన శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అన్ని రకాలుగా ఆయనను హింసించినా అలాంటి గడ్డు పరిస్థితుల్లో బానిసగా అయ్యి ఉండి కూడా ఆయన విశ్వాసం పొందారు, ప్రవక్త వారిని మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించి వచ్చిన సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తత్కారణంగా ఆయన గొప్ప విశ్వాసిగా చరిత్రలో మిగిలిపోయారు, అల్లాహ్ వద్ద కూడా వారికి గొప్ప ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనకు
الحمد لله ثم الحمد لله
(అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్),
బానిసత్వం లేదు. అల్లాహ్ దయవల్ల మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బెదరవలసిన అవసరము లేదు, భయపడవలసిన వెనకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించండి. తద్వారానే ఇహపరాలా సాఫల్యము మనకు దక్కుతుంది.
రెండవ హక్కు: గౌరవించడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఇది మొదటి హక్కు. ఇక రెండవ హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు, సహాబాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో బిగ్గరగా మాట్లాడకండి, శబ్దము పెంచకండి అని తాకీదు చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ గ్రంథము 24వ అధ్యాయము 63వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
لَا تَجْعَلُوا دُعَاءَ الرَّسُولِ بَيْنَكُمْ كَدُعَاءِ بَعْضِكُمْ بَعْضًا
(లా తజ్అలూ దుఆ అర్రసూలి బైనకుమ్ క దుఆఇ బఅదికుమ్ బఅదా)
ఓ విశ్వాసులారా! మీలో మీరు ఒకరినొకరు పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవకండి. (24:63)
దాని అర్థం ఏమిటంటే, మీరు దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మనం పరస్పరం ఒకరినొకరిని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం అలాంటిది కాదు. ప్రవక్త వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా, సగౌరవంగా, అణకువతో మాట్లాడండి అని ఆ వాక్యంలో బోధించబడి ఉంది.
అలాగే ఖుర్ఆన్ గ్రంథం 49వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్హరూ లహు బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్)
ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త స్వరం కన్నా బిగ్గరగా చేయకండి, మీలో మీరు ఒకరితో మరొకరు బిగ్గరగా మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడకండి. (49:2)
దీని అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు, జాగ్రత్త సుమా. చూశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవించాలంటే ప్రవక్త వారి సమక్షంలో బిగ్గరగా శబ్దాన్ని పెంచి, హెచ్చించి మాట్లాడరాదు, పలకరాదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయనను గౌరవించకుండా బిగ్గరగా మాట్లాడినట్లయితే, శబ్దాన్ని పెంచినట్లయితే, అది ఒక రకంగా ప్రవక్త వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది, తత్కారణంగా మనిషి యొక్క కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలన్నీ వృధా అయిపోయే ప్రమాదం ఉంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బనూ తమీమ్ అనే తెగకు చెందిన ఒక బిడారము, కొంతమంది సమూహము వచ్చారు. బనూ తమీమ్‌కు చెందిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోకి వచ్చినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవప్రవక్త, కాకా బిన్ మాబద్ అనే వ్యక్తిని ఈ సమూహానికి మీరు నాయకునిగా నియమించండి అన్నారు. అయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన జోక్యం చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవప్రవక్త, అక్రా బిన్ హాబిస్ ని ఈ సమూహానికి, ఈ తెగ వారికి నాయకునిగా నియమించండి అని ఆయన సలహా ఇచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు మరో వ్యక్తి గురించి ప్రస్తావించారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది కదండీ, వారిద్దరూ కూడా నేను చెప్పిన వ్యక్తే మంచిది, నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరంటూ ఉంటే, లేదండి నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఆ తర్వాత మాట మాట పెరిగి వారు పెద్దగా శబ్దాలు చేయడం, హెచ్చుగా మాట్లాడటం ప్రారంభించేశారు. అలా జరిగినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త వారి కంఠస్వరం వద్ద హెచ్చించకండి అని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడో, మీరు జాగ్రత్త పడకపోతే మీ సత్కార్యాలు, మీ పుణ్యాలు వృధా అయిపోతాయని ఆ వాక్యం చివరలో తెలియజేసి ఉన్నాడు కదా, అది విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఎంతగా మారిపోయారంటే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ఎంత మెల్లగా మాట్లాడేవారంటే, ఎంత చిన్నగా మాట్లాడేవారంటే, దగ్గరలో కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఏమి చెప్పారో వినలేక రెండవసారి మళ్ళీ అడిగేవారు. అయ్యో మీరు ఏం చెప్పారో సరిగా వినిపించలేదండి, చెప్పండి ఏంటో అని రెండవసారి మళ్ళీ అడగవలసి వచ్చేది. అంత నెమ్మదిగా, అంత చిన్నగా ఆయన మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ వాక్యము అవతరింపజేయబడిన తర్వాత.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇది రెండవ హక్కు. దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు, ఆయన స్వరం కొంచెం పెద్దది. మామూలుగా కొంతమందికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొంతు కొంచెం పెద్దది ఇస్తాడు, వారు మామూలుగా మాట్లాడినా గాని శబ్దం కొంచెం హెచ్చుగా వస్తుంది. ఆ ప్రకారంగా సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి స్వరము కూడా, కంఠము కూడా కొంచెం పెద్దది. ఆయన మామూలుగా మాట్లాడినా శబ్దం కొంచెం పెద్దగా, హెచ్చుగా వచ్చేది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి, ఆ వాక్యం అవతరింపజేయబడిన తర్వాత, ఆయన సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి సమావేశంలో రావడం, హాజరవ్వడమే మానేశారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన రావడమే మానేశారు. కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటండీ సాబిత్ బిన్ ఖైస్ కనిపించడం లేదు అని సహాబాలతో అడిగారు. అప్పుడు సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు ఏం చెప్పారంటే, ఓ దైవప్రవక్త, నేను ఆయన పొరుగులోనే ఉంటాను. కాబట్టి మీరు అనుమతి ఇస్తే నేను వెళ్లి చూస్తాను, ఆయన ఎందుకు మీ మధ్య రావట్లేదు ఇక్కడ, ఎందుకు పాల్గొనట్లేదు మీ సమావేశంలో, నేను వెళ్లి తెలుసుకొని వస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త వారు సరే అని పంపించారు. ఆ తర్వాత సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్లి చూస్తే, ఆయన తల పట్టుకొని కూర్చొని ఉన్నారు, దిగులుగా ఉన్నారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఏమండీ ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ మధ్య మీరు ప్రవక్త వారి సమావేశంలో హాజరు కాలేదు, ఎందుకండీ అలా, మిమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర బిగ్గరగా, పెద్ద శబ్దంతో మాట్లాడకండి, అలా మాట్లాడితే మీ కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పాడు కాబట్టి, నా శబ్దం పెద్దది, నా కంఠం హెచ్చుగా ఉంటుంది కాబట్టి, నేను చేసుకున్న కర్మలన్నీ, సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, నేను నరకవాసి అయిపోయానేమోనని నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను దిగులుగా ఉన్నాను, అక్కడ రాలేకపోతున్నాను అని చెప్పారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు అదంతా విని, తిరిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అదంతా తెలియజేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని, వెంటనే ఆ సహాబీకి శుభవార్త తెలియజేశారు, సాద్ రజియల్లాహు అన్హు వారి ద్వారా. మీరు వెళ్ళండి, ఆయనకు తెలియజేయండి, ఆయన నరకవాసులలోని వ్యక్తి కాదు, ఆయన స్వర్గవాసులలోని వ్యక్తి అని శుభవార్త తెలియజేశారు.
ఈ ఉల్లేఖనం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించే విధానము సహాబాల వద్ద ఎంతగా ఉందో, వారు ఎంతగా ప్రవక్త వారిని గౌరవించేవారో, మరియు ప్రవక్త వారిని అగౌరవపరచడాన్ని ఎంతగా వారు భయపడేవారో చూడండి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే, ఎవరెవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారో, అలాంటి వారి కోసము శుభవార్త ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏడవ అధ్యాయము 157 వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
(ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు వత్తబవూన్నూరల్లజీ ఉన్జిల మఅహు ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్)
కనుక ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను గౌరవించి, ఆయనకు సహాయం చేసి, ఆయనతోపాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. (7:157)
దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. ప్రవక్త వారిని విశ్వసించి, ప్రవక్త వారిని అనుసరించి, ప్రవక్త వారిని గౌరవించేవారు సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేసి ఉన్నాడు చూశారా.
అలాగే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించేవారో, ఒక అవిశ్వాసి అలనాటి అవిశ్వాసి, ఆయన పేరు ఉర్వా బిన్ మసూద్ సఖఫీ. తర్వాత, అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారని ధర్మ పండితులు తెలియజేసి ఉన్నారు. ఉర్వా బిన్ మసూద్ సఖఫీ, ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. సులహ్ హుదైబియా, హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ప్రవక్త వారితో మాట్లాడటానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో సహాబాలు ఏ విధంగా అణకువతో ఉన్నారో, ప్రవక్త వారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో కళ్లారా చూశాడు. కళ్లారా చూసి, తర్వాత మళ్ళీ మక్కాలో ఉన్న అవిశ్వాసుల వద్దకు వెళ్లి, అక్కడ చూసిన దృశ్యాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారో చూడండి: “ఓ నా జాతి ప్రజలారా, నేను పెద్ద పెద్ద రాజుల దర్బారులలోకి కూడా వెళ్ళాను. నేను రోమ్ చక్రవర్తి మరియు అలాగే ఈరాన్ చక్రవర్తి వారి దర్బారులలోకి కూడా నేను వెళ్ళాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, పెద్ద పెద్ద రాజులను కూడా అతని దర్బారులో ఉన్న మంత్రులు అంతగా గౌరవించరు, ఎంతగా అయితే ప్రవక్త వారి శిష్యులు ప్రవక్త వారిని గౌరవిస్తున్నారో. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త వారి నోటి నుండి ఉమ్మి కూడా ఒకవేళ బయటికి వచ్చేస్తే, శిష్యులు ఆ ఉమ్మిని తీసుకొని శరీరానికి పూసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఉజూ చేస్తే, ఆయన ఉజూ చేసిన నీటిని శిష్యులు తీసుకోవాలని పోటీ పడుతూ ఉన్నారు. ఆయన కేవలం సైగ చేస్తే చాలు, వెంటనే ఆ పని చేసి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా నేను గౌరవించబడటము, పెద్ద పెద్ద రాజులని సైతము నేను చూడలేదు. అంతగా ప్రవక్త వారి శిష్యులు ప్రవక్తను గౌరవిస్తున్నారు” అని తెలియజేశాడు.
చూశారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఏ విధంగా గౌరవించారు? అలాగే మనము కూడా ప్రవక్త వారిని గౌరవించాలి. ప్రవక్త వారు మన మధ్య లేరు కదా, మరి ఏ విధంగా మనము గౌరవించాలి అంటే, ప్రవక్త వారి ఆదేశాలు మన మధ్య ఉన్నాయి. ప్రవక్త వారి ఆదేశాలు, హదీసుల రూపంలో, ఉల్లేఖనాల రూపంలో మన మధ్య ఉన్నాయి. ఆ హదీసులు చదవబడేటప్పుడు, వినిపించేటప్పుడు మనము గౌరవంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. అలాగే, ప్రవక్త వారి ఆదేశాలను అదే గౌరవంతో మనము ఆచరించాలి.
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించడం, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కు. అయితే, గౌరవించాలి, ప్రతి ముస్లిం యొక్క హక్కు అని తెలుసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్తను గౌరవించడం అనే పదాన్ని తీసుకొని, ప్రవక్త వారి విషయంలో హద్దు మీరిపోవడం సరికాదు. గౌరవంలో చాలామంది హద్దు మీరిపోతూ ఉంటారు. అంటే, ప్రవక్తను ప్రవక్త స్థానంలో కాకుండా, తీసుకెళ్లి దైవ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీనిని గులు అని అంటారు. అల్లాహ్ సుబ్ హాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు, ప్రవక్త వారు వారించి ఉన్నారు. మనం చూచినట్లయితే, బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:
لا تطروني كما أطرت النصارى ابن مريم، فإنما أنا عبد فقولوا عبد الله ورسوله
(లా తత్రూనీ కమా అతరతిన్నసారా ఇబ్న మర్యమ. ఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.)
చూశారా, మర్యం కుమారుడు ఈసా, ఏసుక్రీస్తు అంటారు కదండీ, ಮರ್ಯಮ್ ಕುಮಾರడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే హద్దు మీరిపోయారో, మీరు, అనగా ముస్లింలకు ఆదేశిస్తున్నారు, మీరు నా విషయంలో ఆ విధంగా హద్దు మీరకండి. నేను అల్లాహ్ దాసుడిని మరియు అల్లాహ్ ప్రవక్తని. నాకు ఉన్న స్థానంలో మాత్రమే నన్ను మీరు ఉంచి గౌరవించండి, నాకు లేని స్థానము నాకు కల్పించే ప్రయత్నం చేయకండి అని ప్రవక్త వారు వారించారు.
చూశారా, కాబట్టి ప్రవక్త వారిని గౌరవిస్తున్నాము అని చెబుతూ చాలామంది ప్రవక్త వారికి ఉన్న స్థానం కంటే ఎక్కువ స్థానము ఇచ్చేటట్టుగా అల్లాహ్ స్థానంలోకి తీసుకుని వెళ్లి నిలబెట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, అలా చేయడం సరికాదు.
అలాగే, దీనికి విరుద్ధమైన విషయం. చాలామంది మూర్ఖులు అనలో, పాపిష్టులు అనలో, ఇంకేమనాలో తెలియదు, ప్రవక్త వారిని కించపరుస్తూ ఉంటారు. అల్లాహ్ మమ్మల్ని ఏమంటున్నాడు, ప్రవక్త వారిని గౌరవించాలి అంటున్నాడు. కానీ నేడు మనం చూస్తున్నాం, ముస్లింలు మనము అని చెప్పుకునే చాలామంది మూర్ఖులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి మీడియా ముందర వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నాడు. స్వయంగా నేను ముస్లిం అని కూడా మళ్లీ ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఎంతటి మూర్ఖత్వం అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా చెప్పుకున్న తర్వాతే ఒక వ్యక్తి ముస్లిం అవుతున్నాడు. అలాంటి వ్యక్తి, ప్రవక్త వారిని విశ్వసించిన తర్వాతే ముస్లిం అవుతున్న వ్యక్తి, ప్రవక్త వారిని కించపరచటం, అగౌరవపరచటం ఏమిటండి ఇది?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే కించపరుస్తారో, అగౌరవపరుస్తారో, ప్రపంచంలో కూడా శిక్షించబడతాడు, పరలోకంలో కూడా వారు శిక్షించబడతారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథము సూరా తౌబా 61వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త. కర్మలు వృధా అయిపోతాయి, నష్టపోతారు ప్రపంచంలో కూడా శిక్షించబడతారు, పరలోకంలోనూ మరియు ప్రపంచంలోనూ. కాబట్టి ప్రవక్త వారిని అగౌరవపరచటం పెద్ద నేరం, అలాంటి నేరానికి పాల్పడరాదు, జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.
మూడవ హక్కు: ప్రేమించడం
ముస్లిం సముదాయం మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులలో నుంచి రెండు హక్కుల గురించి తెలుసుకున్నాం అండి. విశ్వసించడం ప్రథమ హక్కు, ప్రవక్త వారిని గౌరవించడం రెండవ హక్కు. ఇక మూడవ హక్కు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, ప్రేమించాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ثلاث من كن فيه وجد حلاوة الإيمان
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్.)
మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, అతను ఈమాన్ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు.
ఆ మూడు విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం:
أن يكون الله ورسوله أحب إليه مما سواهما
(అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా.)
అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అభిమానించాలి, ప్రేమించాలి.
అందరికంటే ఎక్కువ అంటే, తనకంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రపంచంలో ఉన్న వారందరి కంటే, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలని దాని అర్థం.
దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఉల్లేఖనంలో ఈ విధంగా తెలియజేశారు:
لا يؤمن أحدكم حتى أكون أحب إليه من ولده ووالده والناس أجمعين
(లా యూమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మయీన్.)
మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకు అయితే అతను నన్ను తన సంతానము కంటే, తన తల్లిదండ్రుల కంటే, మానవులందరి కంటే ఎక్కువగా నన్ను అభిమానించడో అన్నారు. అంటే, తల్లిదండ్రుల కంటే, భార్యాబిడ్డల కంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించినప్పుడే వ్యక్తి విశ్వాసి అవుతాడు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారి గురించి ఉదాహరణ చాలా ప్రచారం చెంది ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యి,
يا رسول الله، لأنت أحب إلي من كل شيء إلا من نفسي
(యా రసూలల్లాహ్, లఅంత అహబ్బు ఇలయ్య మిన్ కుల్లి శైఇన్ ఇల్లా మిన్ నఫ్సీ)
అన్నారు. ఓ దైవప్రవక్త, మీరు నాకు అందరికంటే ఎక్కువగా ఇష్టులు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే ఎక్కువ ప్రియమైనది అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
لا، والذي نفسي بيده، حتى أكون أحب إليك من نفسك
(లా వల్లజీ నఫ్సీ బియదిహి, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్.)
లేదు లేదు ఓ ఉమర్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీవు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలవు అన్నారు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించారు. ఆ తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణము కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను అని తెలియజేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
الآن يا عمر
(అల్ ఆన యా ఉమర్.)
ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అని తెలియజేశారు.
చూశారా, కాబట్టి ప్రతి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించాలి. ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించినప్పుడే అతను సంపూర్ణ విశ్వాసి కాగలడు, లేని యెడల అతని విశ్వాసము సంపూర్ణము కాజాలదు అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం.
జైద్ రజియల్లాహు అన్హు వారి గురించి మనము చూచినట్లయితే, జైద్ రజియల్లాహు అన్హు వారిని ఆయన పసితనంలోనే దుండగులు దొంగలించారు. మన మొరటు భాషలో చెప్పాలంటే ఆయనను కిడ్నాప్ చేసేశారు. ఆయనను దొంగలు పట్టుకెళ్లి వేరే ప్రదేశాలలో అమ్మేశారు. ఆ తర్వాత నుండి ఆయన బానిస అయిపోయారు. ఆ తర్వాత చేతులు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయనను కొన్నారు, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేశారు, ఆ తర్వాత మరో వ్యక్తి మరో వ్యక్తిని అమ్మేశారు. ఆ ప్రకారంగా అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతులు మారుతూ మారుతూ మారుతూ మక్కాలో ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి వద్దకు వచ్చారు. ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు జైద్ వారిని కొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చి, ఓ దైవప్రవక్త, ఈయనతో మీరు సేవలు చేయించుకోండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైద్ రజియల్లాహు త’ఆలా అన్హు వారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు, ఒకరోజు అనుకోకుండా ఆయన కాబతుల్లాలో తిరుగుతూ ఉంటే, వారి తల్లిదండ్రులు కూడా హజ్ చేయడానికి వచ్చి కాబతుల్లా వద్ద ప్రదక్షిణలు, తవాఫ్ చేస్తూ ఉన్నారు. వెంటనే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చూసి గుర్తుపట్టి, జైద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి, “నేను పసితనంలో తప్పిపోయిన మీ అబ్బాయిని” అని తెలియజేశారు. మీ అబ్బాయిని అని ఎప్పుడైతే తెలియజేశారో, కుటుంబ సభ్యులు వెంటనే జైద్ రజియల్లాహు అన్హు వారిని పట్టుకొని, చిన్ననాటి రోజుల్లో తప్పిపోయిన బిడ్డ దొరికాడు అని వారు చాలా సంతోషించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త, మా అబ్బాయి పసితనంలో తప్పిపోయాడు, ఇప్పుడు అనుకొని ఊహించని రీతిలో ఇక్కడ బానిసగా ఉన్నాడు, మీరు అనుమతి ఇస్తే మా అబ్బాయిని మేము మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అడిగినప్పుడు, ప్రవక్త వారు అన్నారు, మీరు సంతోషంగా తీసుకువెళ్ళవచ్చు, అయితే నిబంధన ఏమిటంటే, మీరు ఒకసారి జైద్ తో మాట్లాడండి, సంప్రదించి చూడండి. జైద్ వారు మీతో పాటు రావడానికి ఆయన సిద్ధమైతేనే మీరు తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పారు.
ఆ తర్వాత, జైద్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లి, చూడండి దైవప్రవక్త వారు మీ ఇష్టం మీద వదిలేశారు, ఇక మాకు అనుమతి దొరికినట్లే, కాబట్టి పదండి మేము మా ఇంటికి వెళ్లిపోదాము అని అంటే, జైద్ రజియల్లాహు అన్హు వారు లేదు నేను రాను, నేను ప్రవక్త వద్దనే ఉండిపోతాను అని తేల్చి చెప్పేశారు.
ఏంటండీ, ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఆలోచించాలి. ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చేశారు, జైద్ రజియల్లాహు అన్హు వారికి ఇక బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది, స్వతంత్రుడిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి హాయిగా జీవించుకోవచ్చు. కానీ స్వతంత్రుడిగా వెళ్లి కుటుంబ సభ్యులతో హాయిగా జీవించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, ప్రవక్త వారి వద్ద బానిసగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంటే, ప్రవక్త వారిని ఆయన ఎంతగా అభిమానించేవారో, ఎంతగా ప్రేమించేవారో చూడండి. అలాగే, ప్రవక్త ఆయనతో ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ప్రవక్త వారిని అంతగా అభిమానిస్తున్నారు చూడండి.
కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా అభిమానించేవారో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
అలాగే మిత్రులారా, మరొక ఉదాహరణ మనము చూచినట్లయితే, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త వారు ఆయనను చూసి ఏమండీ, ఏంటో మీరు కంగారుగా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన అంటున్నారు, ఓ దైవప్రవక్త, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే, వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటాను, కాబట్టి నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ మస్జిద్ లోకి వస్తాను. మీరు మస్జిద్ లో ఏదో ఒక చోట సహాబాలతో సమావేశమై ఉంటారు లేదంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా మీరు నన్ను కనిపిస్తారు. మిమ్మల్ని చూడగానే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అయితే ఈరోజు నాకు ఒక ఆలోచన తట్టింది, ఆ ఆలోచన కారణంగా నేను అయోమయంలో పడిపోయాను, నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది. అదేమిటంటే, మరణించిన తర్వాత పరలోకంలో మీరేమో ప్రవక్త కాబట్టి స్వర్గంలోని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు, నేను ఒక సాధారణమైన వ్యక్తి కాబట్టి, అల్లాహ్ దయవల్ల నేను కూడా స్వర్గానికి వచ్చేసినా, నేను స్వర్గంలోనే మామూలు స్థానాలలో ఉంటాను. అక్కడ కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఎలా చూడగలను, అక్కడ చూడలేనేమోనని నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఓ దైవప్రవక్త అన్నారు.
చూశారా, ఎంతటి తపన ఉందో ఆయనలో ప్రవక్త వారిని చూడాలనే తపన, ప్రవక్త వారిని చూసి మనశ్శాంతి పొందాలన్న అభిమానం చూశారా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు అవతరింపజేశాడు.
وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا
(వమయ్ యుతిఇల్లాహ వర్రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిమ్ మినన్నబియ్యీన వస్సిద్దీఖీన వష్షుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీఖా)
ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపుతారో వారు, అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులతో పాటు ఉంటారు. వారు ఎంత మంచి స్నేహితులు! (4:69)
ఖుర్ఆన్ గ్రంథం నాలుగవ అధ్యాయము 69 వ వాక్యము.
దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో, వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోను, సత్యసంధులతోను, షహీదులతోను, సద్వర్తనులతోను ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.
ఎవరైతే అల్లాహ్‌ను మరియు ప్రవక్త వారిని విశ్వసించి, అభిమానించి, ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ప్రవక్తలతో పాటు ఉంటారట, సిద్దీఖీన్లతో పాటు సత్యసంధులతో పాటు ఉంటారట, షహీద్ వీరమరణం పొందిన వారితో పాటు ఉంటారట. ఎంతటి గౌరవం చూశారా?
سبحان الله ثم سبحان الله
(సుబ్ హానల్లాహ్ సుమ్మా సుబ్ హానల్లాహ్).
అయితే మిత్రులారా, ఒకే మాట చెప్పి ఇన్ షా అల్లాహ్ ఒక విషయం వైపు మీ దృష్టిని నేను తీసుకువెళ్లాలనుకుంటున్నాను.. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి
متى الساعة؟
(మతస్సాఅ)
ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వైపు చూసి
ماذا أعددت لها؟
(మాజా ఆదత్త లహా)
అని తిరిగి ప్రశ్నించారు. ప్రళయం గురించి నీవు అడుగుతున్నావు సరే, కానీ ఆ ప్రళయం కోసము నీవు ఏమి సిద్ధం చేసుకున్నావు అన్నారు.
అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ దైవప్రవక్త, నేను పెద్దగా నమాజులు ఏమి చదువుకోలేదు, నేను పెద్దగా ఉపవాసాలు ఏమి ఉండలేదు, చెప్పుకోదగ్గ పెద్ద పుణ్యకార్యం నేను ఏమి చేసుకోలేదు. నా మీద ఉన్న బాధ్యత మాత్రం నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను, పెద్దగా చెప్పుకోదగ్గ పుణ్యకార్యము నేను ఏదీ చేయలేదు. కాకపోతే నేను నా గుండెల నిండా మీ అభిమానం ఉంచుకొని ఉన్నాను అన్నారు.
ఆయన ఏమంటున్నాడండి, నా గుండెల నిండా నేను మీ అభిమానాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే వెంటనే ప్రవక్త వారు తెలియజేశారు,
أنت مع من أحببت
(అంత మఅ మన్ అహబబ్త.)
నీవు ఎవరినైతే అభిమానిస్తున్నావో, రేపు వారితో పాటే పరలోకంలో ఉంటావు అని చెప్పారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి పూర్తి అభిమానిస్తున్నాడు కాబట్టి, ప్రవక్త వారు తెలియజేసిన శుభవార్త ప్రకారము ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరిలో స్వర్గంలో ఉంటాడు. అయితే, ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలము మేము, ముస్లింలము మేము అని ప్రకటించుకునే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీ గుండెల్లో ఎవరి అభిమానం ఎక్కువగా ఉంది? అల్లాహ్ అభిమానం ఎక్కువగా ఉందా? ప్రవక్త అభిమానం ఎక్కువగా ఉందా? లేక చింపిరి చింపిరి బట్టలు వేసుకున్న మహిళలతో నృత్యాలు చేసే, ఎగిరే, చిందేసే నాటక నటీనటుల అభిమానము ఉందా ఆలోచించండి. ఒకవేళ మీరు అందరి కంటే ఎక్కువగా అల్లాహ్‌ను అభిమానిస్తున్నారు, ప్రవక్త వారిని అభిమానిస్తున్నారు అంటే, అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషకరమైన విషయం. అలా కాకుండా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎక్కువగా నటీనటులను, వేరే వేరే వ్యక్తులను అభిమానిస్తున్నారు అంటే రేపు మీరు ఎవరితో పాటు ఉంటారు పరలోకంలో ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారం ఆలోచించండి.
లేదండి, మేము ప్రవక్త వారిని ఎక్కువగా అభిమానిస్తున్నాం అండి అని చాలామంది నోటితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నోటితో మాట్లాడితే సరిపోదు. మీ మాట్లాడే తీరు, మీ డ్రెస్ కోడ్, మీరు ధరించే దుస్తులు, మీ హెయిర్ స్టైల్, మీ వెంట్రుకలు, అలాగే మీ బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ హెయిర్ స్టైల్, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యవహార శైలి ఇవన్నీ మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ముస్లింలు అంటున్న వారు, వారి బట్టలను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధంగా వారు దుస్తులు ధరిస్తున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారంగా వారు వెంట్రుకలు ఉంచుతున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము వ్యవహార శైలిగా నడుచుకుంటున్నారా? అక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరిని మనం ఫాలో చేస్తున్నాం, ఎవరిని మనం అభిమానిస్తున్నాం, ఎవరి ఫోటోలు కాపీలలో, నోట్ బుక్కులలో, ఇంట్లోని గోడల మీద అతిక్కించుకుంటున్నాం, అక్కడ మనకు తెలిసిపోతుంది మన అభిమానులు ఎవరో, మనం ఎవరిని అభిమానిస్తున్నాము అనేది.
కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభిమానిస్తున్నారో వారితోనే రేపు ఉంటారు.
నాలుగవ హక్కు: ఆదర్శంగా తీసుకోవడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం, విశ్వసించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం, మూడు హక్కుల గురించి తెలుసుకున్నాం కదండీ. ఇక మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శమూర్తిగా, రోల్ మోడల్ గా, ఆదర్శనీయుడిగా తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, అలాగే విశ్వాసంలో, ప్రతి విషయంలో ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఖుర్ఆన్ గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا
(లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా)
వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తలో మీ కొరకు – అంటే అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని ఆశించేవారికీ, అల్లాహ్‌ను అధికంగా స్మరించే వారికీ – ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. (33:21)
అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శము ఉంది అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన తండ్రిగా ఉంటాడు లేదా కుమారునిగా ఉంటాడు లేదా వృత్తిపరంగా ఒక బోధకునిగా, ఒక టీచర్‌గా ఉంటాడు లేదా ఒక డాక్టర్‌గా ఉంటాడు, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శనీయులు, ఒక కుమారునిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక భర్తగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక గురువుగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక వ్యాపారిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక డాక్టర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక బోధకునిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక లీడర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక పొరుగువానిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, అలాగే ఒక సైన్యాధిపతిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. మనిషి జీవితంలోని ప్రతి రంగంలో కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. కాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించుకుంటున్నాం? మన జీవన వ్యవహారాలు, మన జీవన శైలి ఎలా ఉంది, మన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించాలి, ఇది ముస్లింల సముదాయం మీద ఉన్న మరొక హక్కు.
ఐదవ హక్కు: విధేయత చూపడం
ఇక సమయం ఎక్కువైపోతుంది కాబట్టి, క్లుప్తంగా ఇన్ షా అల్లాహ్ చెబుతూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను.
ప్రవక్త వారి తరఫున ముస్లిం సముదాయం మీద ఉన్న ముఖ్యమైన, ముఖ్యమైన, ముఖ్యమైన హక్కు, బాధ్యత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అనుసరించటం, విధేయత చూపటం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులకైతే మమ్మల్ని చేయమని ఆదేశించారో, ఆ పనులను చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులైతే చేయవద్దు అని వారించారో, ఆ పనులు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి భక్తి కార్యానికి, ప్రతి మంచి కార్యానికి చేయమని ఆదేశించి ఉన్నారు. అలాగే, ప్రతి పాపానికి మరియు ప్రతి తప్పు కార్యానికి దూరంగా ఉండండి అని వారించి ఉన్నారు. ప్రవక్త వారు వారించిన విషయాలకు దూరంగా ఉండాలి, ప్రవక్త వారు బోధించిన, చేయమని చెప్పిన విషయాలను మనము చేయాలి. దీనినే ఇతాఅత్, ఇత్తెబా అని అరబీలో అంటారు, విధేయత అని తెలుగులో అంటారు, అనుసరించటం అని అంటారు.
ఖుర్ఆన్ గ్రంథం సూరా మాయిదా 92 వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు,
وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ
(వ అతీవుల్లాహ వ అతీవుర్రసూల్)
అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు కూడా విధేయత చూపండి. (5:92)
అల్లాహ్‌కు విధేయత చూపండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా విధేయత చూపండి, అనుసరించండి. ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనము విధేయత చూపాలి, అనుసరించాలంటే ఒక రెండు ఉదాహరణలు చెప్పిఇన్ షా అల్లాహ్ మాటను ముగించి ముందుకు కొనసాగిస్తాను.
ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చాడు. ఆయన బంగారపు ఉంగరము ధరించి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, ఆ ఉంగరము తీసేసి పక్కన పడేశారు. పురుషులు బంగారము ధరించడము ఇస్లాం నియమాల నిబంధనల ప్రకారము అది వ్యతిరేకం. పురుషులు బంగారము ధరించరాదు, ఇది ఇస్లాం మనకు బోధించే విషయం. ఆ వ్యక్తి బంగారము ధరించి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఆ బంగారపు ఉంగరము తీసి పక్కన పడేసి, మీరు నరకము యొక్క అగ్నిని ముట్టుకోవటము, చేతిలో పట్టుకోవటము ఇష్టపడతారా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతర శిష్యులు ఆ వ్యక్తిని పిలిచి, చూడండి, ఆ బంగారము ధరించవద్దు అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, ఆ బంగారము మీరు ధరించవద్దు, కానీ అది అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, అది మీరు తీసుకువెళ్ళండి, వేరే పనుల కోసం ఉపయోగించుకోండి అన్నారు. అయితే, ఆయన ఏమన్నారో తెలుసా,
لا والله، لا آخذه أبداً، وقد طرحه رسول الله صلى الله عليه وسلم
(లా వల్లాహి, లా ఆఖుజుహు అబదా, వఖద్ తరహహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.)
అల్లాహ్ సాక్షిగా, అలా నేను చేయనంటే చేయను. ఏ పరికరాన్ని అయితే ప్రవక్త వారు తొలగించి పక్కన పడేశారో, దాన్ని నేను ముట్టుకోనంటే ముట్టుకోను అని చెప్పారు.
అలాగే మనం చూచినట్లయితే, అలీ రజియల్లాహు అన్హు వారు ఒకసారి పట్టు వస్త్రాలు ధరించి వెళ్తూ ఉన్నారు, ప్రవక్త వారి కంటపడ్డారు. ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న విషయాన్ని చూసి, ప్రవక్త వారికి ఆ విషయం నచ్చలేదు. ప్రవక్త వారికి నచ్చలేదన్న విషయం ఆయన ముఖ కవళికల ద్వారా కనపడింది. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు గుర్తుపట్టి, ఇంటికి వచ్చేసి ఆ వస్త్రాలు తీసి, చించేసి మహిళలకు ఇచ్చేశారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ నిబంధనల ప్రకారము పట్టు వస్త్రాలు పురుషులకు యోగ్యమైనవి కావు. పట్టు వస్త్రాలు మహిళలకే ప్రత్యేకం. పురుషులు పట్టు వస్త్రాలు ధరించరాదు, ఇది ఇస్లామీయ నిబంధన. అయితే అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించారు కాబట్టి, ప్రవక్త వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ విషయాన్ని గ్రహించి, ఆ పట్టు వస్త్రాలు ఇంటికి వెళ్లి చించేసి, మహిళల చేతికి ఇచ్చేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బట్టలతో ఏమైనా చేసుకోండి అని.
చూశారా, ప్రవక్త వారు ఇష్టపడలేదు, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ దుస్తులను తొలగించేశారు. చూశారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విధేయత చూపాలి. ఏ విషయాలనైతే ప్రవక్త వారు మమ్మల్ని వారించారో వాటికి దూరంగా ఉండాలి.
అలాగే, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులలో మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్లి చేరవేయాలి. ఆ పని ప్రవక్తలు చేశారు. ప్రవక్త, మీకు నేను చివరి ప్రవక్తని, నా తర్వాత ప్రవక్తలు రారు. ఇక దీని ప్రచారం యొక్క బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వెళ్ళిన తర్వాత సహాబాలు ఆ బాధ్యత నెరవేర్చారు. ఆ తర్వాత వారు కూడా బాధ్యత నెరవేర్చారు. మనము కూడా ఆ బాధ్యత నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను అభిమానించాలి. ఎవరిని కూడా కించపరచరాదు, దూషించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠించాలి, ఇది కూడా మన మీద ఉన్న బాధ్యత మరియు హక్కు. దరూద్ శుభాలు అనే ప్రసంగము
إِنْ شَاءَ ٱللَّٰهُ
(ఇన్ షా అల్లాహ్)
వినండి, అక్కడ దరూద్ గురించి, అది ఎంత విశిష్టమైన కార్యమో తెలపజడం జరిగింది. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితులతో మనము కూడా అభిమానం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత్రువులతో మనము కూడా శత్రుత్వాన్ని వ్యక్తపరచాలి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులు. క్లుప్తంగా మీ ముందర ఉంచడం జరిగింది. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక,ఆమీన్.
وَ جَزَاكُمُ اللّٰهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్).
وَعَلَيْكُمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ అలైకుమ్ అస్సలామ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).
—
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7
- అనుచర సమాజం (ఉమ్మత్)పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హక్కులు | జాదుల్ ఖతీబ్ [PDF]
- ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుసరణ విధి ఎందుకు, ఎలా? & ఏమిటి లాభం? [వీడియో]
- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపటం తప్పనిసరి – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధేయతే పరమావధి – అల్లామ అబ్దుల్లా బిన్ బాజ్ (రహమతుల్లా అలై) (పుస్తకం)

You must be logged in to post a comment.