స్వీకారయోగ్యం కాని విశ్వాసం, ప్రళయకాల చిహ్నం

97. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

“సూర్యుడు పడమర నుంచి ఉదయించనంతవరకు ప్రళయం సంభవించదు. సూర్యుడు పడమర నుంచి ఉదయించగానే ప్రజలు ఆ వింత చూసి అందరూ (ఇస్లాం ధర్మాన్ని) విశ్వసిస్తారు. కాని అప్పుడు విశ్వసించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆ తరువాత ఆయన దివ్యఖుర్ఆన్ లోని ఈ సూక్తిని పఠించారు :

“ఇకవారు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వారి ముందు దైవదూతల ప్రత్యక్షం కావాలని చూస్తున్నారా? లేక నీ ప్రభువు స్వయంగా వారి దగ్గరకు దిగి రావాలనా? లేక నీ ప్రభువు సూచనల్లో కొన్ని బహిర్గతమయ్యే సమయం కోసం ఎదురుచూస్తున్నారా? నీ ప్రభువు సూచనల్లో కొన్ని ప్రత్యేక సూచనలు బహిర్గతమయ్యే రోజు అసలు సత్యాన్నే విశ్వసించని వాడు వాటిని (కళ్ళారా చూసి) విశ్వసించినా దాని వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే (గతంలో) విశ్వసించి ఎలాంటి సత్కార్యం చేయని వాడికి సయితం అతని విశ్వాసం ఆ రోజు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు.”

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్, 6 వ అధ్యాయం – సూరతుల్ అన్ ఆమ్ – 9 వ అంశం హలుమ్మ షుహదా అకుమ్]

విశ్వాస ప్రకరణం – 70 వ అధ్యాయం – స్వీకారయోగ్యం కాని విశ్వాసం, ప్రళయకాల చిహ్నం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?

82. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు,

“ఒక్కోసారి షైతాన్ మీలో ఒకరి దగ్గరకు వచ్చి, దీన్నెవరు సృష్టించారు, దాన్నెవరు సృష్టించారు? అని అడుగుతాడు. చివరికి నీ ప్రభువుని ఎవరు సృష్టించారని కూడా దుష్టాలోచనలు కలిగిస్తాడు. అందువల్ల ఇలాంటి దుష్టాలోచనలు మనసులో రేకెత్తినప్పుడు (వెంటనే) మీరు (వాటి కీడు నుంచి) అల్లాహ్ శరణుకోరండి. మీరు స్వయంగా ఇలాంటి పైశాచిక ఆలోచనలకు మనస్సులో తావీయకండి.”

[సహీహ్ బుఖారీ : 59 వ ప్రకరణం – బదాయిల్ ఖల్ఖ్, 11 వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస్ వ జునూదిహీ]

విశ్వాస ప్రకరణం – 58 వ అధ్యాయం – మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నీరు, పాలు, తదితర పదార్ధాల పంపిణీ కుడివైపు నుండి ఆరంభించాలి

1318. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన మంచినీళ్ళు అడిగితే మేము ఒక మేక నుండి పాలు పితికి అందులో కొంచెం బావినీళ్ళు కలిపి ఆయనకు ఇచ్చాము. ఆ సమయంలో హజ్రత్ అబూబకర్ (రధి అల్లాహు అన్హు) ఆయనకు ఎడమ వైపున, హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ముందు వైపున, ఒక పల్లెవాసి కుడి వైపున కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పాలలో కొంత త్రాగి వదిలి పెట్టిన తరువాత “దాన్ని అబూబకర్ (రధి అల్లాహు అన్హు) కు ఇచ్చేయండి” అని హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) అన్నారు . కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పాలగిన్నెను (తన కుడివైపున కూర్చున్న) గ్రామీణవ్యక్తికి ఇచ్చారు. తరువాత ఆయన ఇలా అన్నారు : “మొదట కుడివైపున్న వాడికి .., మొదట కుడివైపున్న వాడికి ఇవ్వాలి గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ కుడివైపు నుండి ప్రారంభించాలి”.

మరి హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) మూడుసార్లు ఇలా పలికారు. “కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం, కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం, కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 4 వ అధ్యాయం – మనిస్ తస్ఖా]

పానీయాల ప్రకరణం : 17 వ అధ్యాయం – నీరు, పాలు, తదితర పదార్ధాల పంపిణీ కుడివైపు నుండి ఆరంభించాలి.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం

882. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

మూడు మస్జిద్ ల దర్శనం కోసం తప్ప మరే పుణ్యస్థల దర్శనం కోసమూ ప్రయాణం చేయకూడదు.
(1) మస్జిదుల్ హరాం (మక్కాలోని కాబా మస్జిద్)
(2) మస్జిదె నబవి (మదీనాలోని ప్రవక్త మస్జిద్)
(3) బైతుల్ మఖ్దిస్ లోని మస్జిదె అఖ్సా

[సహీహ్ బుఖారీ : 20 వ ప్రకరణం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్ మక్కా వ మదీనా – 1 వ అధ్యాయం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్]

హజ్ ప్రకరణం – 95 వ అధ్యాయం – మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నా (ఉమ్మత్) లో ఒక వర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది

1250. హజ్రత్ ముఆవియా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

నా అనుచర సమాజం (ఉమ్మత్) లో ఒకవర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది. ఎవరైనా వారిని అవమాన పరచదలిచినా లేదా వ్యతిరేకించ దలచినా వారా వర్గం (ముస్లింల) కు ఎలాంటి హాని కలిగించలేరు. ఆ విధంగా చివరికి ప్రళయం వచ్చినా అప్పుడు కూడా ఆ వర్గం వారు దైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగానే ఉంటారు.

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 28 వ అధ్యాయం – హద్దసనీ ముహమ్మదుబ్నుల్ ముసన్నా]

పదవుల ప్రకరణం : 53 వ అధ్యాయం – నా అనుచర సమాజంలో ఒక వర్గం ఎల్లప్పుడూ ధర్మంపై స్థిరంగా ఉంటుంది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు

1708. హజ్రత్ ఉమ్మె సలమ (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు :-

ఖుర్బానీ కొరకు పశువు ఉండి ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు.

[సహీహ్ ముస్లింలోని అజాహీ ప్రకరణం]

313 వ అధ్యాయం : ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు. హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

అరఫా రోజు పాటించబడే ఉపవాసం ఘనత

1251. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు.

[సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]

ముఖ్యాంశాలు:-

జుల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచిపెట్టేస్తుంది.

227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత
హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

నోట్: సఊది అరేబియా కాలమానం ప్రకారం అరఫా రోజు 25/10/2012. ఇండియా లో 26/10/2012 ఉండవచ్చు. కాబట్టి 25 మరియు 26 తారీఖు లలో ఉపవాసం ఉండి ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా చూసుకోండి. బారకల్లః ఫీకుం.

జిల్ హిజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత

ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు

హజ్ నెల ప్రారంభ మైనది, మొదటి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఈ పది రోజులలో చేసిన మంచి పనులకు అల్లాహ్ ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడు.

1250. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-

జిల్ హిజ్జా మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ దేవుని దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహపడుతూ, “ధైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా? అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధనప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్టుడే)” అని చెప్పారు.    [బుఖారీ]

[సహీహ్ బుఖారీలోని పండుగ ప్రకరణం]

ముఖ్యాంశాలు :

జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజుల్లో హజ్ యాత్రికులు ప్రత్యేక ఆరాధనా కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. కాని హజ్ చేయలేక  పోతున్నవారు ఆ పుణ్యానికి నోచుకోలేరు. అందుకని అలాంటివారు తమ స్వంత ప్రదేశాల్లోనే ఉండి నఫీల్ ఉపవాసాలు ఇతర ఆరాధనా  కార్యకలాపాలు చేసుకొని వీలైనంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోగలగాలన్నా ఉద్దేశ్యంతో జిల్ హిజ్జా మాసపు తొలి పది రోజుల్లో చేయబడే సత్కార్యాలు దేవునికి అత్యంత ప్రియమైనవని ప్రకటించడం జరిగింది. ఇస్లాం లో ‘జిహాద్’ కు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధనపడుతున్నది.

హదీసు కిరణాలు (RiyadusSaliheen) రెండవ సంపుటం
సంకలనం: ఇమాం నవవి (రహిమహుల్లః )

సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు

1049. హజ్రత్ ఆమిర్ (రహ్మతుల్లా అలై) కధనం :-

హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రధి అల్లాహు అన్హు) వేదిక ఎక్కి ఇలా అనడం నేను విన్నాను – “మా నాన్నగారు నాకొక కానుక ఇచ్చారు. అయితే (నా తల్లి) హజ్రత్ ఉమ్రా బిన్తె రావాహ (రధి అల్లాహు అన్హ) దీనిపై తన అభిప్రాయం వెలిబుచ్చుతూ “మీరీ కానుక ఇవ్వడం పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ని సాక్షిగా నిలబెట్టనంతవరకు నేను సంతోషించలేను” అని అన్నారు. అందువల్ల మా నాన్నగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్లి “ధైవప్రవక్తా! నేను ఉమ్రా బిన్తె రావాహా (రధి అల్లాహు అన్హ) కడుపున పుట్టిన నా కొడుక్కు ఒక కానుక ఇస్తే దానికి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టాలని అన్నది ఆమె” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “మరి నీవు నీ కొడుకులందరికీ ఇలాగే కానుకలిచ్చావా?” అని అడిగారు. దానికి మా నాన్న లేదన్నారు. అప్పుడు దైవప్రవక్త “దేవునికి భయపడి, నీ కొడుకుల మధ్య న్యాయాన్ని పాటించు” అని బోధించారు. దాంతో మా నాన్నగారు (ఇంటికి) తిరిగొచ్చి తానిచ్చిన కానుకను నా దగ్గరనుండి వాపసు తీసుకున్నారు”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 13 వ అధ్యాయం – లా షహాద ఫిల్ హిబా]

హిబా (స్వయం సమర్పణ) ప్రకరణం : 3 వ అధ్యాయం – సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?

429. హజ్రత్ మస్రూఖ్ (రహ్మతుల్లా అలై) కధనం :-

నేను (ఓసారి) హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ని “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?” అని అడిగాను. దానికామె “ఆయనకు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం” అని సమాధానమిచ్చారు.

“మరి రాత్రివేళ ఆయన (తహజ్జుద్ నమాజు చేయడానికి) ఎప్పుడు లేస్తారు? అని అడిగాను మళ్ళీ. అందుకామె “కోడికూత వినగానే లేస్తారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 7వ అధ్యాయం – మన్ నామ ఇన్ద స్సహార్]

ప్రయాణీకుల నమాజు ప్రకరణం – 17 వ అధ్యాయం – ఇషా నమాజులో పఠించవలసిన రకాతుల సంఖ్య
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్