ఇస్లామీయ సోదరులారా!
లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కే వుందని ప్రతి ముస్లిం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అతనికి తప్ప మరెవరికీ ఈ అధికారం లేదు. ఏ ‘వలీ‘ దగ్గరా లేదు, ఏ ‘బుజుర్గ్‘ దగ్గరా లేదు. ఏ ‘పీర్‘, ‘ముర్షద్‘ దగ్గరా లేదు. ఏ ప్రవక్త దగ్గరా లేదు. చివరికి ప్రవక్తలలో శ్రేష్ఠులు, ఆదమ్ సంతతికి నాయకులు మరియు ప్రవక్తల ఇమామ్ అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు కూడా. ఇతరులకు లాభనష్టాలు చేకూర్చడం అటుంచి, స్వయానా తమకు కలిగే లాభనష్టాలపై సయితం వారు అధికారం కలిగిలేరు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
قُل لَّآ أَمْلِكُ لِنَفْسِى نَفْعًۭا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ ٱلْغَيْبَ لَٱسْتَكْثَرْتُ مِنَ ٱلْخَيْرِ وَمَا مَسَّنِىَ ٱلسُّوٓءُ ۚ إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌۭ وَبَشِيرٌۭ لِّقَوْمٍۢ يُؤْمِنُونَ
“ప్రవక్తా! వారితో ఇలా అను: నాకు సంబంధించిన లాభనష్టాలపై నాకు ఏ అధికారమూ లేదు. అల్లాహ్ కోరింది మాత్రమే అవుతుంది. నాకే గనక అగోచర విషయ జ్ఞానం వున్నట్లయితే, నేను ఎన్నో ప్రయోజనాలను నా కొరకు పొంది ఉండేవాణ్ణి. నాకు ఎన్నటికీ ఏ నష్టమూ వాటిల్లేది కాదు. నేను నా మాటను నమ్మేవారి కొరకు కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే, శుభవార్త వినిపించేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ 7:188)
ఈ ఆయతుపై దృష్టి సారిస్తే తెలిసేదేమిటంటే –
స్వయానా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు కలిగే లాభనష్టాలపై అధికారం కలిగి లేకపోతే – మరి ఆయన కన్నా తక్కువ స్థాయి గల వలీ గానీ, బుజుర్గ్ గానీ, పీర్ గానీ- ఎవరి సమాధులనయితే ప్రజలు గట్టిగా నమ్మి సందర్శిస్తుంటారో- ఈ అధికారాన్ని ఎలా కలిగి వుంటారు? తమకు ప్రయోజనం చేకూర్చే మరియు నష్టాన్ని కలిగించే వారుగా ప్రజలు తలపోసే వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ لَيَقُولُنَّ ٱللَّهُ ۚ قُلْ أَفَرَءَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ إِنْ أَرَادَنِىَ ٱللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَـٰشِفَـٰتُ ضُرِّهِۦٓ أَوْ أَرَادَنِى بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَـٰتُ رَحْمَتِهِۦ ۚ قُلْ حَسْبِىَ ٱللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ ٱلْمُتَوَكِّلُونَ
“వారిని ఇలా అడుగు: ఒకవేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకొనే ఆరాధ్యులు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్ నాపై కనికరం చూపగోరితే, వారు ఆయన కారుణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయం ఏమిటి? కనుక వారితో ఇలా అను, నాకు అల్లాహ్ ఒక్కడే చాలు, నమ్ముకునేవారు ఆయననే నమ్ముకుంటారు.” (జుమర్ 39 : 38)
ఈ ఆయత్ లో అల్లాహ్ ఇలా ఛాలెంజ్ చేస్తున్నాడు: దైవేతరులెవరి దగ్గరైనా లాభనష్టాల అధికారం గనక వుంటే – అల్లాహ్ నష్టం కలిగించదలచిన వాడిని, తను, ఆ నష్టం కలగకుండా కాపాడ మనండి మరియు అల్లాహ్ ప్రయోజనం చేకూర్చదలచిన వాడికి ఆ ప్రయోజనం కలగకుండా ఆపమనండి. అంటే – వారలా చేయలేరు. మరి వారలా చేయలేరంటే – దాని అర్థం వారికి లాభనష్టాల అధికారం లేదు అని.
అలాగే, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
مَّا يَفْتَحِ ٱللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍۢ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُۥ مِنۢ بَعْدِهِۦ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ
“అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్య ద్వారాన్ని తెరచినా, దానిని అడ్డుకొనే వాడెవ్వడూలేదు. ఆయన మూసివేసిన దానిని అల్లాహ్ తరువాత మళ్ళీ తెరిచేవాడూ ఎవ్వడూ లేడు. ఆయన శక్తిమంతుడు, వివేచన కలవాడు.” (ఫాతిర్ 35: 2)
అందుకే, అల్లాహ్- తనను తప్ప ఇతరులను వేడుకోవడం నుండి వారించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَلَا تَدْعُ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًۭا مِّنَ ٱلظَّـٰلِمِينَ وَإِن يَمْسَسْكَ ٱللَّهُ بِضُرٍّۢ فَلَا كَاشِفَ لَهُۥٓ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍۢ فَلَا رَآدَّ لِفَضْلِهِۦ ۚ يُصِيبُ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ ۚ وَهُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ
“అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గానీ లాభాన్ని గానీ కలిగించలేని ఏ శక్తినీ వేడుకోకు. ఒకవేళ అలా చేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురిచేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు. ఇంకా, ఆయన గనక నీ విషయంలో ఏదైనా మేలు చెయ్యాలని సంకల్పిస్తే, ఆయన అనుగ్రహాన్ని మళ్ళించేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన క్షమించేవాడూ, కరుణించేవాడూను.” (యూనుస్ 10: 106 -107)
ఈ ఆయతులలో అల్లాహ్ – దైవేతరులెవరికీ లాభనష్టాల అధికారం లేదు, వారిని వేడుకోవడాన్ని వారిస్తూ, ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! ఒకవేళ నీవు గనక ఇలా చేస్తే (అల్లాహ్ శరణు) నీవు కూడా దుర్మార్గులలో కలసి పోతావు – అని సెలవియ్యడంతోపాటు, తన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆయన నష్టం కలిగించదలిస్తే దాన్ని ఆపగలిగే వాడెవడూ లేడు మరియు ఒకవేళ తన కృపతో ఆయన దేన్నయినా ప్రసాదిస్తే ఆయన అనుగ్రహాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేరు అని సెలవిచ్చాడు. దీనితో – రుజువయ్యిందేమిటంటే – ఈ అధికారాలు కేవలం అల్లాహ్ కే వున్నాయి.
కాస్త ఆలోచించండి!
మరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ తప్ప మరెవ్వరూ నష్టం కలిగించలేనప్పుడు, సాధారణ ముస్లిములకు అల్లాహ్ తప్ప మరెవరు నష్టం కలిగించగలరు? అందుకే, దైవేతరులెవరైనా సరే, వారితో లాభనష్టాలను ఆశించకూడదు. ఎందుకంటే – దైవేతరుల గురించి -తన సంకల్పంతో, అధికారంతో ఎవరికైనా తను కోరుకున్న నష్టం కలిగించగలడు – అని భావించడం పెద్ద షిర్క్ (షిర్కె అక్బర్).
అందుకే ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఇలా సెలవిచ్చి వున్నారు:
وَحَآجَّهُۥ قَوْمُهُۥ ۚ قَالَ أَتُحَـٰٓجُّوٓنِّى فِى ٱللَّهِ وَقَدْ هَدَىٰنِ ۚ وَلَآ أَخَافُ مَا تُشْرِكُونَ بِهِۦٓ إِلَّآ أَن يَشَآءَ رَبِّى شَيْـًۭٔا ۗ وَسِعَ رَبِّى كُلَّ شَىْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ وَكَيْفَ أَخَافُ مَآ أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِٱللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِۦ عَلَيْكُمْ سُلْطَـٰنًۭا ۚ فَأَىُّ ٱلْفَرِيقَيْنِ أَحَقُّ بِٱلْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
“(అల్లాహ్ కు వ్యతిరేకంగా) మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను. అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరుగుతుంది. నా ప్రభువు జ్ఞానం ప్రతి దానినీ ఆవరించి వున్నది. మీరు స్పృహలోకి రారా? నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి?వాటి విషయంలో అల్లాహ్ మీపై ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనప్పటికీ వాటిని మీరు ఆయన తోపాటు దైవత్వంలో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు.” (అన్ఆమ్ 6: 80-81)
ఈ ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే –
పీర్లు, ఫకీర్లు, ‘బుజుర్గ్’ లో ఎవరిని గురించి కూడా (వారేదో చేసేస్తారని) భయాందోళనలకు గురి కాకూడదు. అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏ మాత్రం నష్టం కలిగించలేరు. ఇలాంటి భయాందోళనలు కేవలం అల్లాహ్ పట్ల కలిగి వుండాలి. కారణం – తన సంకల్పానికి అనుగుణంగా ఎవరికైనా నష్టం కలిగించే శక్తి సామర్థ్యాలు కేవలం ఆయనకే ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అల్లాహ్ సంకల్పించకుంటే ప్రపంచంలోని ఏ వలీ, బుజుర్గ్, పీర్ లేదా సజ్జాదా నషీన్ అయినా ఏ మాత్రం నష్టం కలిగించలేడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
قُل لَّن يُصِيبَنَآ إِلَّا مَا كَتَبَ ٱللَّهُ لَنَا هُوَ مَوْلَىٰنَا ۚ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ
“వారితో ఇలా అను: అల్లాహ్ మాకొరకు వ్రాసి వుంచింది తప్ప మాకు ఏదీ (చెడుగానీ, మంచిగానీ) ఏ మాత్రం కలుగదు. అల్లాహ్ యే మా సంరక్షకుడు. విశ్వసించేవారు ఆయననే నమ్ముకోవాలి.” (తౌబా 9: 51)
అలాగే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“యావత్ మానవజాతి ఏకమై నీకేదైనా ప్రయోజనం చేకూర్చాలన్నా ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసిపెట్టి వున్నంత వరకే ప్రయోజనం చేకూర్చ గలదు. అలాగే, యావత్తు మానవజాతి ఏకమై నీకేదైనా కీడు కలిగించాలనుకొన్నా – అది కూడా, ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసి పెట్టినంతవరకే కీడు తలపెట్టగలదు అని దృఢంగా విశ్వసించు.” (తిర్మిజి : 2516, సహీ ఉల్ జామె : 7957)
—
ఈ పోస్ట్ క్రింది ఖుత్బా పుస్తకం నుండి తీసుకోబడింది.
సఫర్ నెల మరియు దుశ్శకునాలు (ఖుత్బా)
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్