షుక్ర్ (కృతజ్ఞతా భావం): దాని శుభాలు | ఖుత్ బాతే నబవీ ﷺ

وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِى لَشَدِيدٌۭ

“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి! (అల్ ఇబ్రాహీమ్ 14: 7)

ప్రియ సోదరులారా..!

అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావం: దాని శుభాల గురించి ఈ రోజు ఖుత్బాలో తెలుసుకుందాం. మనం నోటితో, ఆచరణతో అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండటం తప్పనిసరి. నోటితో అల్ హమ్దులిల్లాహ్ పలకటం, ఆ అనుగ్రహాన్ని ఆచరణతో కాపాడుకోవటం, గుర్తించటం. దీనినే షుక్ర్ (కృతజ్ఞత) అంటారు. కృతజ్ఞతలు తెలుపుకునే వారికి అల్లాహ్ సమృద్ధిని, శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఖుత్బాలో పఠించిన వాక్యం అర్థం అదే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి! (అల్ ఇబ్రాహీమ్ 14 : 07)

ఈ ఆయత్ హజ్రత్ మూసా (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సంబంధించినది. మూసా (అలైహిస్సలాం) తమజాతి వారితో ఇలా అన్నారు:

“ఓ ప్రజలారా! అల్లాహ్ మీకు ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. ఇప్పుడు మీ ప్రభువు ఇలా ప్రకటించాడు: ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే అల్లాహ్ మరింత సమృద్ధిని, శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. కాని ఒకవేళ మీరు అనుగ్రహాల పట్ల ఏమరుపాటుగా ఉంటే, అశ్రద్ధ చేస్తే మరి అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉంది: “నా శిక్ష కూడా చాలా వ్యధాభరితంగా ఉంటుంది”。

స్పష్టంగా బోధపడేదేమిటంటే అనుగ్రహాలను అల్లాహ్ తిరిగి తీసేసుకుంటాడు. శిక్షలకు గురి చేస్తాడు. ఉదాహరణకు: ఎవరయితే ఆరోగ్యాన్ని, స్వస్థతను కాపాడుకుంటాడో, శ్రద్ధ వహిస్తారో కీడు వ్యాధులు కలిగించే వాటినుండి దూరంగా ఉంటారో అలాంటి వారికి అల్లాహ్ మరింత స్వస్థతను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని శక్తిని ప్రసాదిస్తాడు. ఇక మరెవరయితే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోరో అలాంటి వారిని అల్లాహ్ రోగాల పాలు చేస్తాడు. రోగాలు, వ్యాధులు అల్లాహ్ శిక్షలు. అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలన్ని అలాగే కృతజ్ఞతాభావంతో మోకరిల్లితే అల్లాహ్ సంతోషించి మరిన్ని శుభాలను కురిపిస్తాడు. ఇక, అల్లాహ్ చేసిన మేళ్లను మరచి విర్రవీగితే అల్లాహ్ శిక్ష కొరడాను ఝులిపిస్తాడు. అల్లాహ్ అనుగ్రహాలు కోకొల్లలు లెక్కకు మించినవి. ఇస్లామ్, విశ్వాసం, ఆరోగ్యం, ఖుర్ఆన్ ఇలా లెక్కలేని అనుగ్రహాలను ప్రసాదిస్తాడు అల్లాహ్, వాటికి ఎవరయితే విలువిచ్చి శ్రద్ధ వహిస్తారో, అల్లాహ్ ఆదేశాలను శిరసావహిస్తారో వారే ధన్యజీవులు. అలాంటి వారినే అల్లాహ్ ప్రేమిస్తాడు. గౌరవాన్ని కీర్తి ప్రతిష్ఠలను, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఇక తిరస్కరించేవారికి అహంకారులకు కఠిన శిక్షకు గురిచేస్తాడు.

మహాశయులారా..!

ఇస్రాయీల్ సంతతి లోని ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఒక విషయం గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ సహచరులకు వినిపించారు. వారిలో ఇద్దరు దైవానుగ్రహాలను గౌరవించలేదు, కాపాడుకోలేదు. అందుకే అల్లాహ్ వారినుండి అనుగ్రహాలను వెనక్కి తీసుకున్నాడు. ఒక వ్యక్తి మాత్రం అల్లాహ్ అనుగ్రహాలను గౌరవించి కృతజ్ఞతలు చాటుకున్నాడు. అందుకే అల్లాహ్ ఆ ధన్యజీవికి మరింత అనుగ్రహాలు, అభివృద్ధి ప్రసాదించాడు. దైవ చట్టం సంప్రదాయం నేడు ఆచరణలో ఉంది ఉంటే ఈ చట్టం ప్రకారమే. ఈ సూత్రం ప్రకారమే మానవుడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు లేదా అధఃపాతాళానికి తొక్కబడతాడు.

దైవానుగ్రహాలను గౌరవించి కృతజ్ఞతలు చాటుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికి ప్రసాదించుగాక, ఏమరుపాటు నుండి, అజాగ్రత్త నుండి అల్లాహ్ కాపాడు గాక. ఆమీన్.

ఇపుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభనోటి నుండి జాలువారిన బనీ ఇస్రాయీలు చెందిన ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారు ఇలా తెలుపారు. నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిస్తుండగా విన్నాను.

“నిస్సందేహంగా బనీ ఇస్రాయీల్లో ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. మొదటి వానికి కుష్టు వ్యాధి ఉండేది. రెండవ వానికి బట్టతల ఉండేది. మూడవ వాడు అంధుడు. అల్లాహ్ వారిని పరీక్షించదలచి వారి వద్దకు ఒక దూతను పంపాడు.

ఆ దూత మొదట కుష్టు రోగి వద్దకు వచ్చి నీకు అత్యంత ప్రియమైన వస్తువు ఏది? అని అడిగాడు. “నాకు మంచి రంగు, మంచి చర్మం కావాలి. ఎందుకంటే ప్రజలంతా నన్ను ఈ స్థితిలో చూసి అసహ్యించుకొంటున్నారు” అని అతను తన కోరికను వెలిబుచ్చాడు. అతనిపై దూత చేయి త్రిప్పగానే అతని వ్యాధి దూరమై పోయింది. అతని రంగు, చర్మం అందంగా అయిపోయింది. ఆ దైవదూత ‘నీవు ఎలాంటి సంపదను ఇష్టపడతావ’ని ప్రశ్నించాడు. ‘ఒంటె లేదా ఆవు’ అని అతను జవాబిచ్చాడు. అతనికి సూడి ఒంటెను ఇవ్వటం జరిగింది. దూత ఇలా అన్నాడు. “అల్లాహ్ మీ కొరకు ఇందులో శుభాన్ని, సమృద్ధిని ఇస్తాడు”

ఆ తరువాత దైవదూత తలవెంట్రుకలు మొలవని వ్యక్తి దగ్గరకు వస్తాడు. ‘నీకు చాలా ఇష్టమైన వస్తువేది? ‘ అని ప్రశ్నిస్తాడు. ఈ లోపం దూరమై నాకు దట్టమైన అందమైన వెంట్రుకలు రావాలి? ‘ అని అతను అంటాడు. దైవదూత అతని తలపై చేతిని తిప్పాడు. అతని లోపం దూరమై అందమైన వెంట్రుకలు వస్తాయి. “నీవు ఎలాంటి సంపదను ఇష్టపడతావని ఆ దూత అతన్ని ప్రశ్నిస్తాడు.’ ‘ఆవులు’ అని అతను జవాబిస్తాడు. దైవదూత అతనికి సూడి ఆవును ఇచ్చి అల్లాహ్ ఇందులో నీకు శుభాన్ని ఇస్తాడని చేప్తాడు.

ఆ తరువాత గ్రుడ్డివాని వద్దకు వస్తాడు: నీకు అమితంగా ఇష్టపడే వస్తువేదని అడుగుతాడు. దానికి అతను, నేను చూడడానికి అల్లాహ్ నాకు కంటిచూపు ఇవ్వాల’ని అంటాడు. దైవదూత అతని కంటిపై చేతితో నిమురుతాడు. అతని లోపం దూరమైపోయి అతనికి కంటి చూపు వస్తుంది. నీవు ఎలాంటి సంపదను ఇష్టపడతావని దైవదూత ప్రశ్నిస్తాడు. అతను ‘మేకలు’ అన్నాడు దైవదూత అతనికి సూడి మేకలు ఇచ్చాడు.

ఆ తరువాత ఆ ముగ్గురి పశువులు ఈనాయి. కుష్ఠు రోగికి ఇచ్చిన ఒంటెలతో అతని లోయ అంతా నిండిపోయింది. అదే విధంగా బట్టతల వ్యక్తికిచ్చిన ఆవులతో అతని లోయ నిండిపోయింది. గ్రుడ్డి వానికిచ్చిన మేకలతో అతని లోయ నిండిపోయింది.

మళ్ళీ ఆ దైవదూత మొదట వచ్చిన రూపంలో మరో సారి కుష్ఠు రోగి వద్దకు వస్తాడు. నేను చాలా ఆపదలో ఉన్నాను. ప్రయాణ సామగ్రి అంతా అయిపోయింది. అల్లాహ్ తప్ప మరెవరూ నా అవసరం తీర్చరు అని సెలవిచ్చాడు. కాని నేను నీకు మంచి రంగును, చర్మాన్ని, ధనాన్ని ప్రసాదించిన ఆ అల్లాహ్ పేరుతో ఒక ఒంటెను అడుగుతున్నాను. ఒంటె ద్వారా నేను నా ప్రయాణాన్ని పూర్తి చేస్తాను. ఆ వ్యక్తి దైవదూతతో ఇలా అంటాడు: “నాకు మరెన్నో బాధ్యతలు, హక్కులూ ఉన్నాయి”。దానికి దైవదూత ఇలా అంటాడు: నాకు తెలుసు ఒకప్పుడు నీకు కుష్ఠ వ్యాధి ఉండేది కదా? దాని వల్ల ప్రజలందరు నిన్ను చీదరించుకునేవారు నీవు ఒక నిరుపేదగా, అవసరం కలవాడిగా ఉండేవాడివి. మళ్ళీ అల్లాహ్ వాటిని దూరంచేసి నీకు ఇవన్నీ ప్రసాదించాడు” అని గుర్తు చేస్తాడు. దానికి ఆ వ్యక్తి “ఈ ఆస్తిపాస్తులన్నీ మా తాతముత్తాతల నుండి వచ్చినవి”అని అంటాడు. “ఒకవేళ నీవు చెప్పేది అబద్ధమయితే అల్లాహ్ నిన్ను పూర్వపు స్థితికే చేరుస్తాడు”అని చెప్పి మళ్ళీ ఆ దైవదూత తన మొదటి రూపంలో బట్టతల వ్యక్తి వద్దకు వస్తాడు. వచ్చి కుష్ఠు రోగి వద్ద ఏమి ఆశించాడో అదే ఆశిస్తాడు. కుష్ఠు రోగి చెప్పిన విధంగానే బట్టతల వ్యక్తి కూడా అంటాడు. దైవదూత ఇలా అంటాడు: ఒకవేళ నీవు అబద్ధాలకోరువైతే అల్లాహ్ నీన్ను నీ మొదటి స్థితికి మారుస్తాడు. ఆ దైవదూత మళ్ళీ గ్రుడ్డి వ్యక్తి వద్దకు వస్తాడు. బట్టతల వానితో, కుష్ఠు రోగితో అడిగిన విషయాలనే అడుగుతాడు. కాని ఆ గ్రుడ్డివాడు వారిద్దరికంటే భిన్నంగా సమాధానమిస్తాడు. “నిజానికి నేను ఒకప్పుడు గ్రుడ్డివాణ్ణి అల్లాహ్ తన దయతో నాకు కంటి చూపును ప్రసాదించాడు. వాస్తవానికి నేను ఒక అవసరం గల నిరుపేదగా ఉండేవాణ్ణి” అల్లాహ్ నాకు ధనం ఇచ్చి ధనవంతుణ్ణి చేసాడు. నీకు అవసరం ఉన్న మేకలను సంతోషంగా తీసుకువెళ్ళు. అల్లాహ్ పేరుతో (వాస్తాతో) నీవు అడగావు కాబట్టి నీకు ఇష్టమున్న వాటిని తీసుకెళ్ళు. నేను నిన్ను ఎట్టి పరిస్థితిల్లోనూ ఆపను.” దైవదూత ఇలా అంటాడు: “నీ ధనాన్ని నీవు నీ దగ్గరే ఉంచుకో. ఇది పరీక్ష మాత్రమే. ఈ పరీక్షలో నీవు నెగ్గావు అల్లాహ్ నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. నీ మిగతా ఇద్దరు మిత్రుల పట్ల అప్రసన్నుడయ్యాడు.”

ప్రియసోదరులారా..!

మీరు ఏదైతే విన్నారో ఇది ఒక కథ కాదు. ఓ యదార్థ సంఘటన. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోటి నుండి జాలువారిన ఓ అక్షర సత్యమాల. అల్లాహ్ ప్రతి వస్తువును లెక్కిస్తుంటాడు. గమనిస్తూ ఉంటాడు. అల్లాహ్ మానవులను ఆపదల్లో నెట్టేస్తాడు. దానర్థం ఆయన మానవులను కష్టపెట్టాలని కోరుకోడు. వారిని పరీక్షించటమే ఆయన ధ్యేయం. వాస్తవంగా ఎవరు అల్లాహ్ పట్ల కృతజ్ఞతాభావంతో ప్రవర్తిస్తున్నారో, ఎవరు దైవానుగ్రహాలను మరచిపోయి, గర్వంతో వ్యవహరిస్తారో వారిని అల్లాహ్ పరీక్షిస్తాడు. అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా సెలవిచ్చాడు:

وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِى لَشَدِيدٌۭ

ఒకవేళ మీరు గనక మేము చేసిన మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమయిందన్న సంగతిని మరువకండి” (అల్ ఇబ్రాహీమ్ 14: 07)

జరిగింది కూడా అదే.

మొదటి ఇద్దరు వ్యక్తులు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతఘ్నతా భావాన్ని ప్రదర్శించారు. దానికి పర్యవసానంగా అల్లాహ్ వారికి ప్రసాదించిన అనుగ్రహాలను తీసుకోవటమేకాక, వారిని వారి వారి మొదటి పరిస్థితుల్లోనే మరల్చాడు. అల్లాహ్ శిక్షకు వారిద్దరు గురయ్యారు.

వాస్తవానికి జీవన్మరణాలను పరీక్ష నిమిత్తమే అల్లాహ్ సృష్టించాడు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

ٱلَّذِى خَلَقَ ٱلْمَوْتَ وَٱلْحَيَوٰةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًۭا ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْغَفُورُ

మీలో మంచి పనులు చేసేవారెవరో చావు బతుకులను సృష్టించాడు. ఆయన పరీక్షించే నిమిత్తం. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను. (అల్ ముల్క్ 67 : 2)

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది :
ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్

%d bloggers like this: