హజ్రత్ అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర – షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర
షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ
https://youtu.be/pOXV3-6CJEg [20 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రది అల్లాహు తాలా అన్హు) యొక్క సంక్షిప్త జీవిత చరిత్రను వివరిస్తారు. ప్రవక్త సహచరుల జీవితాలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యతను నొక్కిచెప్పడంతో ప్రసంగం ప్రారంభమవుతుంది. అబూబక్ర్ (రది అల్లాహు తాలా అన్హు) ఇస్లాం కోసం చేసిన సేవలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయనకున్న సాన్నిహిత్యం, ఆయన స్థిరత్వం, విశ్వాసం మరియు ఆయన గొప్పతనాన్ని వివరించే వివిధ సంఘటనలు ఇందులో చర్చించబడ్డాయి. ముఖ్యంగా, వలస ప్రయాణంలో గుహలో ప్రవక్తతో పాటు ఉండటం, తన సంపదనంతా ఇస్లాం కోసం ఖర్చు చేయడం, మరియు ప్రవక్త మరణం తర్వాత సమాజాన్ని ఏకతాటిపై నిలపడంలో ఆయన పోషించిన పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఖలీఫాగా ఆయన సాధించిన విజయాలు, మతభ్రష్టులతో పోరాడటం మరియు ఖురాన్‌ను సంకలనం చేయించడం వంటి చారిత్రాత్మక విజయాలను కూడా వక్త వివరించారు.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

نَحْمَدُهُ وَنُصَلّي عَلى رَسُولِهِ الكريم، أما بعد!
నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి సంక్షిప్త జీవిత చరిత్ర. ఇది జుమా ఖుత్బా. షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ హఫిజహుల్లాహ్ జామిఅ అల్-గనాంలో ఇచ్చారు, అక్టోబర్ 31, 2025న.

ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వలన విశ్వాసం పెరుగుతుంది మరియు నమ్మకం బలపడుతుంది. వారు ఉత్తమ తరానికి చెందిన వారు. ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులందరి గొప్ప పనులను, వారి జీవిత చరిత్రను ప్రస్తావించడం సున్నత్.”

ఈ రోజు జుమా ఖుత్బాలో మేము ప్రస్తావిస్తాము ఒక వ్యక్తి జీవిత చరిత్రను. ఆయన సాధారణ వ్యక్తి కారు. గొప్ప మహానుభావుడు. ఇస్లాంలో ఆయనది గొప్ప ప్రభావం ఉంది. తమ ధర్మానికి మరియు ప్రవక్తకు సహాయం చేయడంలో ఒక్క క్షణం కూడా వెనకాడలేదు.

మొదటి ధర్మబద్ధమైన ఖలీఫా, గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, కష్ట సుఖాల్లో ఆయన మిత్రుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత బాధ్యతలు మోసినవారు. స్థిరత్వం, నిలకడతో మరియు నమ్మకంతో ధర్మాన్ని రక్షించినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఈ ఉమ్మత్‌లో, సమాజంలో అత్యుత్తములు. జాతి మొత్తం ఆయన గొప్పతనాన్ని, గౌరవాన్ని, స్థాయిని అంగీకరించింది. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఖలీఫా అయిన హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ , అబ్దుల్లా బిన్ ఉస్మాన్ బిన్ ఆమిర్ అల్-ఖురషీ. హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్, ఆయన పేరు అబ్దుల్లాహ్. తండ్రి పేరు ఉస్మాన్, తాత పేరు ఆమిర్ అల్-ఖురషీ రదియల్లాహు తాలా అన్హు.

అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు మక్కాలో ఏనుగుల సంఘటన తర్వాత రెండు సంవత్సరాలు ఆరు నెలలకు జన్మించారు. ప్రజలు ప్రవక్తను విడిచిపెట్టినప్పుడు, నిస్సహాయకునిగా వదిలినప్పుడు ఆయన ప్రవక్తకు సహాయం అందజేశారు. ప్రజలు ప్రవక్తను విశ్వసించనప్పుడు, ఆయన విశ్వసించారు. ప్రజలు ప్రవక్తను తిరస్కరించినప్పుడు, ఆయన సత్య ప్రవక్త అని ధ్రువీకరించారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను ‘అస్-సిద్దీఖ్’ (సత్యవాది) అని వర్ణించారు (బిరుదునిచ్చారు).

సహీహ్ బుఖారీలో (3675) ఒక సంఘటన గమనించండి, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఘనతను గ్రహించండి.

أنَّ رسولَ اللَّهِ صلَّى اللَّهُ علَيهِ وسلَّمَ صعِدَ أُحدًا وأبو بَكْرٍ وعمرُ وعثمانُ فرجفَ بِهِم فقالَ رسولُ اللَّهِ صلَّى اللَّهُ علَيهِ وسلَّمَ: اثبت أُحُدُ فإنَّما عليكَ نبيٌّ وصدِّيقٌ وشَهيدانِ

ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ (రదియల్లాహు అన్హుమ్) లతో కలిసి ఉహుద్ పర్వతంపైకి ఎక్కారు. పర్వతం ప్రకంపించింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ఓ ఉహుద్! స్థిరంగా ఉండు. నీపై ఒక ప్రవక్త, ఒక సిద్దీఖ్ మరియు ఇద్దరు షహీద్‌లు (అమరవీరులు) ఉన్నారు.” (బుఖారీ 3675).

ఇస్లాం స్వీకరించిన మొదటి వ్యక్తి అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు. సహాబాలలో అల్లాహ్ వైపు పిలిచిన మొదటి వ్యక్తి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు (అంటే ప్రవక్త తర్వాత అని భావం). ఆయన ద్వారా హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ జుబైర్, హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్, తల్హా బిన్ ఉబైదుల్లా, సాద్ బిన్ అబీ వక్కాస్ (రదియల్లాహు తాలా అన్హుమ్) వంటి చాలా మంది గొప్ప సహచరులు ఇస్లాం స్వీకరించారు. గమనించండి, వీరందరూ కూడా అషర-ఎ-ముబష్షరాలో పరిగణించబడతారు.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు తన సంపాదనంతా ఇస్లాం సేవలో ఖర్చు చేశారు. హజ్రత్ బిలాల్, హజ్రత్ ఆమిర్ బిన్ ఫుహైరా మరియు ఇతర పీడితులను బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హును ప్రేమించేవారు మరియు ఆయన గొప్పతనం గురించి ప్రజలకు చెప్పేవారు. హజ్రత్ అమర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్తను అడిగారు, “ప్రజలలో మీకు అత్యంత ప్రియమైన వారు ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆయిషా రదియల్లాహు తాలా అన్హా.” హజ్రత్ అమర్ అంటున్నారు, “నేను మళ్ళీ అడిగాను, పురుషులలో ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆమె యొక్క తండ్రి” (అంటే హజ్రత్ ఆయిషా యొక్క తండ్రి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు). (సహీహ్ బుఖారీ, 4358).

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సంపదను తమ సొంత సంపద వలే ఉపయోగించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా చెప్పారు:

«إِنَّ أَمَنَّ النَّاسِ عَلَيَّ فِي صُحْبَتِهِ وَمَالِهِ أَبُو بَكْرٍ، وَلَوْ كُنْتُ مُتَّخِذًا خَلِيلًا مِنْ أُمَّتِي لاَتَّخَذْتُ أَبَا بَكْرٍ، وَلَكِنْ أُخُوَّةُ الإِسْلاَمِ وَمَوَدَّتُهُ، لاَ يَبْقَيَنَّ فِي المَسْجِدِ بَابٌ إِلَّا سُدَّ، إِلَّا بَابُ أَبِي بَكْرٍ»

“నా సహచర్యంలో మరియు సంపదలో నాపై అత్యంత మేలు చేసిన వ్యక్తి అబూబక్ర్. నా ఉమ్మత్‌లో ఒక స్నేహితుడిని (ఖలీల్) చేసుకోవాలని వస్తే, నేను అబూబక్ర్‌ను చేసుకునేవాడిని. కానీ ఇస్లాం సౌభ్రాతృత్వం మరియు స్నేహం మనకు మధ్య ఉంది. హజ్రత్ అబూబక్ర్ తలుపు తప్ప మస్జిదులోని అన్ని తలుపులు మూసివేయబడాలి.” (సహీహ్ బుఖారీ 466, సహీహ్ ముస్లిం 2382).

ఈ హదీసు యొక్క సంక్షిప్త భావం ఏమిటో తెలుసా? ఇప్పుడు మీరు విన్న హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు?

إِنَّ أَمَنَّ النَّاسِ عَلَىَّ فِي صُحْبَتِهِ وَمَالِهِ
(ఇన్న అమన్నన్ నాసి అలయ్య ఫీ సుహబతిహీ వ మాలిహీ)

తన సహచర్యం ప్రకారంగా మరియు తన ధనంతో నాకు మేలు చేకూర్చిన వారిలో అత్యంత ఎక్కువ, ‘అమన్’ – హజ్రత్ అబూబక్ర్. ఇక ప్రాణ స్నేహితుడిగా ఎవరినైనా చేసుకుని ఉంటే, (ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే హదీసులో చెప్పారు, ‘అల్లాహ్ నన్ను ఖలీల్‌గా చేసుకున్నాడు’) ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్‌గా చేసుకుంటే, అబూబక్ర్‌ని చేసుకునేవానిని. అంటే గమనించండి, సర్వ సహాబాలలో అబూబక్ర్ యొక్క ఘనత తెలుస్తుంది కదా దీనివల్ల. మరియు అబూబక్ర్ తప్ప ఇతరుల తలుపులు అన్నీ కూడా మూయబడాలి అంటే ఏమిటి? మస్జిద్-ఎ-నబవీ ప్రథమంగా కట్టబడిన ఆ కాలంలో, మస్జిద్-ఎ-నబవీకి పక్కనే ఎందరో వేరే సహాబాల ఇళ్లు కూడా ఉండినవి. అయితే, ఆ మస్జిద్ యొక్క మెయిన్, ముఖ ద్వారం, ముఖ్యమైనది ఏదైతే ఉంటుందో అది కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో నుండి డైరెక్ట్ మస్జిద్‌లో వచ్చే విధంగా తలుపులు తెరుచుకొని ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్ తప్ప ఇతరుల ద్వారాలు మూయబడాలి అని ఆదేశించారు.

ఇంకా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు ఘనతలో, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన మాట వినండి. (సహీహ్ బుఖారీ 3685, సహీహ్ ముస్లిం 2389). అయితే ఇక్కడ శ్రద్ధగా గమనించండి, సహీహ్ బుఖారీ, ముస్లింలో వచ్చినటువంటి ఈ హదీస్, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు, హజ్రత్ అబూబక్ర్ మరియు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారిని ఎంత గొప్పగా కీర్తిస్తున్నారు. ఈ రోజుల్లో కొందరు మేము హజ్రత్ అలీని ప్రేమిస్తాము అన్నటువంటి సాకుతో, అబూబక్ర్, ఉమర్ రదియల్లాహు తాలా అన్హుమాను ఏదైతే దూషిస్తారో, వారు ఈ లోకంలో అతి చెడ్డవారు మరియు హజ్రత్ అలీని కూడా దూషించినట్లే. ఎందుకంటే స్వయంగా అలీ రదియల్లాహు తాలా అన్హు వారిని ప్రేమిస్తున్నారు, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.

హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు:

إِنِّي كُنْتُ كَثِيرًا أَسْمَعُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «ذَهَبْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ، وَدَخَلْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ، وَخَرَجْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ»

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా ఇలా చెప్పడం నేను విన్నాను: ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ వెళ్ళాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ ప్రవేశించాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ బయలుదేరాము.'” (బుఖారీ 3685, ముస్లిం 2389).

(ఇక్కడ ‘కున్తు అస్మ’ఉ’ అనేది నిరంతరంగా వినేవాడిని అని సూచిస్తుంది). ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో పనుల్లో “నేను, అబూబక్ర్, ఉమర్” అని మాటిమాటికి ప్రస్తావించేవారు. అల్లాహు అక్బర్. ఏం తెలిసింది దీని ద్వారా? సహాబాలు కూడా అబూబక్ర్‌లను, ఉమర్ హజరత్‌లను చాలా ప్రేమించే, గౌరవించేవారు.

అల్లాహ్ దాసులారా, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సత్కార్యాలలో మరియు మంచి పనులలో ముందుండేవారు. ఈ విషయంలో ఆయనకు ఎవరూ పోటీ చేయలేకపోయారు.

ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ఒక సందర్భంలో ఇలా అన్నారు, “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానం చేయమని ఆజ్ఞాపించారు. అప్పుడు నా దగ్గర కొంత సంపద ఉంది. నేను అనుకున్నాను, ‘ఈ రోజు నేను అబూబక్ర్‌ను అధిగమిస్తాను.’ ఒకవేళ నేను ఎప్పుడైనా ఆయనను అధిగమించగలిగితే… నేను నా సంపదలో సగం తెచ్చాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చారు?’ నేను చెప్పాను, ‘అంతే మిగిల్చాను’ (అంటే సగం). అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హు తన దగ్గర ఉన్నదంతా తెచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చావు?’ ఆయన చెప్పారు, ‘వారికి అల్లాహ్‌ను మరియు అల్లాహ్ సందేశహరులైనటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మిగిల్చి వచ్చాను.’ హజ్రత్ ఉమర్ అంటున్నారు, అప్పుడు నేను చెప్పాను, ‘«لَا أُسَابِقُكَ إِلَى شَيْءٍ أَبَدً» నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఎన్నటికీ అధిగమించలేను.’” (అబూ దావూద్, 1678, షేఖ్ అల్బానీ దీనిని హసన్ అని అన్నారు).

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సహచర్యంలో అత్యున్నత శిఖరాన్ని మరియు అత్యున్నత స్థాయిని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చాలా కఠినమైన సమయాల్లో సహవాసం గడిపారు. ఆ విషయంలో ఆయనను ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వలస వెళ్ళారు మరియు గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు దాక్కున్నారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:

إِلَّا تَنْصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا

మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్‌ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు.” (తౌబా 9:40).

ఈ ఆయతులో గమనించండి “సానియస్ నైన్” అన్న పదాన్ని, అంటే ఇద్దరిలో రెండో వ్యక్తి! ఎవరు ఆయన? ఆయనే అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు. ఇది ఆయనకు ఎంత గొప్ప బిరుదు, ఘనత! ఆలోచించండి. ఇద్దరిలో రెండో వ్యక్తి! ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమించారు, భయం, కష్టం మరియు ఇబ్బందులను ఆయనతో పంచుకున్నారు. హునైన్ యుద్ధంలో ఆయనతో పాటు ఉన్నారు, తబూక్‌కు ఆయనతో పాటు ప్రయాణించారు, ఆయనతో పాటు హజ్ చేశారు, ఆయన బ్రతికి ఉండగానే ఆయన ఆదేశమేరకు ఆయనకు బదులుగా నమాజ్ ఇమామత్‌ చేయించారు. మరియు ఆయన తర్వాత ఖిలాఫత్ భారాన్ని మోశారు.

అల్లాహ్ దాసులారా, అస్-సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు అన్ని సద్గుణాల సంపన్నులు. ఆయన ఎక్కువ ఉపవాసాలు ఉండేవారు (సవ్వామ్), రాత్రుల్లో ఎక్కువ ఆరాధన, నమాజ్ చేసేవారు (ఖవ్వామ్), ప్రజలకు చాలా మేలు చేసేవారు (ముహ్సిన్), అల్లాహ్ వైపు తిరిగి పశ్చాత్తాపపడేవారు, మృదు మనస్కుడు (అవ్వాహ్) [1]. ఆయన చాలా ఎక్కువగా ఏడ్చేవారు (బక్కా).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు ఉపవాసం ఉన్నారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు జనాజాలో (అంత్యక్రియలకు) హాజరయ్యారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు పేదవాడికి తినిపించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు రోగిని పరామర్శించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَا اجْتَمَعْنَ فِي امْرِئٍ إِلاَّ دَخَلَ الْجَنَّةَ
(మజ్తమ’న ఫిమ్రిఇన్ ఇల్లా దఖలల్ జన్నహ్)
ఈ పనులన్నీ ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే, అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. (సహీహ్ ముస్లిం 1028).

అల్లాహ్, అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు పట్ల సంతోషించు గాక. మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇవ్వు గాక. నిశ్చయంగా ఆయన అన్ని విషయాలపై శక్తిమంతుడు.

أعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ: وَسَيُجَنَّبُهَا الْأَتْقَى (17) الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّى (18) وَمَا لِأَحَدٍ عِنْدَهُ مِنْ نِعْمَةٍ تُجْزَى (19) إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَى (20) وَلَسَوْفَ يَرْضَى (21)

దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు, (ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు). మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన (కూడా) తప్పకుండా సంతోషిస్తాడు. (లైల్ 92:17-21).

ఈ ఆయతులు అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గౌరవం, మర్యాద, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఘనతను చాటుతూ అల్లాహ్ అవతరింపజేశాడు.

الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمدٍ وعلى آله وصحبه أجمعين أما بعد

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

ఓ ముస్లిములారా, చరిత్రలో నమోదు చేయబడిన గొప్ప సంఘటనలలో ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు యొక్క స్థిరత్వం, నిలకడ. ప్రవక్త మరణ వార్త సహాబాలకు చాలా తీవ్రమైనదిగా, బాధాకరమైనదిగా ఉండినది. ఆ సందర్భంలో హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వచ్చి ప్రజలను ఓదార్చారు, ఆ తర్వాత నిలబడి అల్లాహ్‌ను స్తుతించారు మరియు ప్రశంసించారు. ఆ తర్వాత చెప్పారు, “ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజిస్తున్నారో, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు. ఎవరైతే అల్లాహ్‌ను పూజిస్తున్నారో, నిశ్చయంగా అల్లాహ్ జీవించి ఉన్నాడు, ఎన్నటికీ మరణించడు.” ఆపై హజ్రత్ అబూబక్ర్ ఈ ఆయత్ పఠించారు:

وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ أَفَإِنْ مَاتَ أَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلَى أَعْقَابِكُمْ وَمَنْ يَنْقَلِبْ عَلَى عَقِبَيْهِ فَلَنْ يَضُرَّ اللَّهَ شَيْئًا وَسَيَجْزِي اللَّهُ الشَّاكِرِينَ

“ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు (ఇస్లాం నుంచి) వెనుతిరిగిపోతారా? వెనుతిరిగి- పోయేవాడు అల్లాహ్‌కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్‌ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3:144).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు సహచరులందరూ అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హును వారిని ఖలీఫాగా నియమించడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఎందుకంటే వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయన సాన్నిహిత్యం, ఆయన గొప్పతనం మరియు ఇస్లాంలో ఆయన ముందున్న స్థానం గురించి తెలుసు. ఆయన ఖిలాఫత్ ఇస్లాంకు మరియు ముస్లింలకు చాలా మంచిది.

ఆయన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. ఉసామా రదియల్లాహు తాలా అన్హు సైన్యాన్ని పంపారు. సైన్యాలను సమీకరించారు, విజయాలు సాధించారు, మతభ్రష్టులు (ముర్తద్దీన్‌ల)తో పోరాడారు మరియు జకాత్ నిరాకరించిన వారితో యుద్ధం చేశారు. ఖురాన్ ప్రతులను జమా చేయించారు.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు హిజ్రీ 13వ సంవత్సరంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసుకు సమానంగా, 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఖిలాఫత్ రెండు సంవత్సరాలు మరియు కొన్ని నెలలు కొనసాగింది. అల్లాహ్ ఆయన పట్ల సంతోషించు గాక మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇచ్చుగాక.

చివరగా, ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల, ఆయన ధర్మబద్ధమైన ఖలీఫాల పట్ల ప్రేమను మనం మన పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. ఇది ధర్మంలో భాగం మరియు వారు ఆదర్శప్రాయులు.

كَانَ السَّلَفُ يُعَلِّمُونَ أَوْلَادَهُمْ حُبَّ أَبِي بَكْرٍ وَعُمَرَ كَمَا يُعَلِّمُونَ السُّورَةَ مِنَ الْقُرْآنِ

“సలఫె సాలిహీన్ తమ పిల్లలకు అబూబకర్ మరియు ఉమర్‌ల పట్ల ప్రేమను ఖురాన్ సూరాను నేర్పినట్లే నేర్పేవారు.” (మువత్తా మాలిక్ 1/255. షర్హు ఉసూలి ఏతిఖాది అహ్లిస్సున్నహ్ వల్ జమాఅహ్ 2325. 7/1313).

అల్లాహ్ మనకు మరియు మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల ప్రేమను ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[1] ‘అవ్వాహ్’ అన్న పదంలో ఈ క్రింది భావాలన్నీ ఇమిడి ఉన్నాయి:

ఎక్కువగా ప్రార్థించేవాడు/ప్రార్థనల్లో మునిగిపోయేవాడు: అల్లాహ్‌ను చాలా ఎక్కువగా స్మరించేవాడు, వినయంతో, దీనంగా ఆయనను ప్రార్థించేవాడు.

ఆయన దయను కోరేవాడు: అల్లాహ్‌ దయ కోసం తీవ్రంగా కోరుకునేవాడు.

పశ్చాత్తాపపడేవాడు: తన పాపాల పట్ల తీవ్రంగా పశ్చాత్తాపపడి, అల్లాహ్‌ను క్షమాపణ వేడుకునేవాడు.

దీనంగా, వినయంగా ఉండేవాడు: అల్లాహ్‌ పట్ల అమితమైన భయం, గౌరవం కలిగి, వినయంగా ప్రవర్తించేవాడు.

మంచివాడు/దయాగుణం కలవాడు: ఇతరుల పట్ల దయ, కరుణ కలిగి, వారికి సహాయం చేసేవాడు.

నిట్టూర్చేవాడు: అల్లాహ్‌ పట్ల తన ప్రేమ, భయం లేదా ఇతరుల పట్ల తన కరుణ వల్ల దీర్ఘంగా నిట్టూర్చేవాడు.

[2] ఖురాన్ సంకలన చరిత్రలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉన్నప్పుడు ఖురాన్ వివిధ పద్ధతులలో వ్రాయబడింది. ఖురాన్ వచనాలు (ఆయత్‌లు) మరియు సూరాలు రాసిన కొన్ని వస్తువులు:

తోలు పత్రాలు (چرم): జంతువుల తోలుపై రాసినవి.
ఎముకలు (كتف): ఒంటె వంటి జంతువుల భుజం ఎముకలు లేదా ఇతర ఎముకలు.
తాటి ఆకులు (سعف النخيل): తాటి చెట్టు ఆకులపై రాసినవి.
రాతి పలకలు (حجارة): సన్నని, చదునైన రాళ్లపై రాసినవి.
కలప పలకలు (ألواح خشبية): చెక్క పలకలపై రాసినవి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత, యమామా యుద్ధంలో చాలా మంది ఖురాన్ హాఫిజ్‌లు (ఖురాన్‌ను కంఠస్థం చేసినవారు) మరణించారు. అప్పుడు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) అబూబకర్ అస్-సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు)కు ఖురాన్‌ను ఒకే గ్రంథంగా సంకలనం చేయాలని సూచించారు. అబూబకర్ (రదియల్లాహు అన్హు) జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)ను ఈ పనికి నియమించారు. జైద్, తన బృందంతో కలిసి, పైన పేర్కొన్న వివిధ వస్తువులపై వ్రాయబడిన ఖురాన్ వచనాలను సేకరించి, వాటిని జాగ్రత్తగా పరిశీలించి, కనీసం ఇద్దరు సాక్షులతో ధృవీకరించిన తర్వాత, వాటిని ఒక క్రమంలో సంకలనం చేశారు. ఈ సంకలన పత్రాలను “సుహుఫ్” (పత్రాలు/పేజీలు) అని పిలిచేవారు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42537

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క హక్కు – ఆయన్ను ప్రేమించడం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]        

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లింలారా! అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ యొక్క భయం మీ మనసులలో ప్రతి సమయంలో జనింప చేయండి. అల్లాహ్ కు విధేయత చూపండి. అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పట్ల ప్రేమ, వారిని గౌరవించడం మనిషి  విశ్వాసానికి నిబంధన మరియు ధర్మం యొక్క ముఖ్యమైన పునాది

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పట్ల ప్రేమ  తప్పనిసరి.  దీనికి గల ఆధారాలు అనేకం ఉన్నాయి. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:- 

قُلْ إِن كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్‌ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్‌ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్‌ అవిధేయులకు సన్మార్గం చూపడు. (సూరా అత్ తౌబా 9:24)

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క హక్కు: ఆయన  సహాబాలను గౌరవించడం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లింలారా! అల్లాహ్ కు భయపడండి. మరియు ప్రతిక్షణం అల్లాహ్ యొక్క దైవభీతి మనసులో ఉంచండి. ఆయనకు విధేయత చూపండి. మరియు అవిధేయత నుండి జాగ్రత్త వహించండి.

మరియు మీరు ఈ విషయాన్ని గ్రహించండి. అహ్లే సున్నత్ వల్ జమాఅత్ యొక్క ప్రాథమిక హక్కులలో ఒకటి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సహచరులను గౌరవించడం. మరియు వారిని అనుసరించటం, వారికి విధేయత చూపటం,  వారి హక్కులను తెలుసుకొని వాటిపై అమలు చేయడం,  వారిని విశ్వసించడం, వారి కొరకు అల్లాహ్ ను క్షమాభిక్ష కోరడం, వారి యొక్క అంతర్గత విభేదాల గురించి మౌనం వహించటం, వారి శత్రువులతో శత్రుత్వం వహించటం, మరియు సహబాలలో ఎవరి గురించి అయినా తప్పటి ఆరోపణలు చరిత్రలో లిఖించబడినా, లేదా ఎవరైనా తప్పుడు రాతలు రాసినా, లేదా కవులు వారి గురించి తప్పుగా కవిత్వాలలో రాసిన వాటిపై అఇష్టత చూపాలి. ఎందుకంటే వారి స్థానాన్ని బట్టి వారిని గౌరవించాలి.  వారి గురించి చెడు ప్రస్తావన చేయరాదు,  వారి ఏ పనిలో తప్పులు వెతకరాదు, వారి గురించి మంచి ప్రస్తావన చేయాలి. వారి పుణ్య కార్యాల గురించి ప్రస్తావించాలి తప్ప వారి తప్పు ఒప్పుల విషయం గురించి మౌనం వహించాలి.

ఇస్లాం ధర్మ అత్యుత్తమ పండితులు ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) గారు ఇలా తెలియజేస్తున్నారు: అహ్లే సున్నత్ వల్ జమాఅత్ యొక్క ప్రాథమిక సూత్రాలలో  ఇది కూడా ఉంది. అది ఏమిటంటే వారి హృదయం మరియు నాలుక సహబాల పట్ల ఎంతో ఉత్తమంగా, పరిశుభ్రంగా ఉంటాయి. ఈ విషయం గురించి అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు:

وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ

వారి తరువాత వచ్చినవారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగినవాడవు, కనికరించేవాడవు.” (59:10)

సహాబాలు – వారి గొప్పతనం, వారి గురించి మనకు ఉండ వలసిన అఖీదా (విశ్వాసము) [ఆడియో & టెక్స్ట్]

సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్‌) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్‌ చేసినవారని, షరీయత్‌ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్‌). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]


వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

భాగం 01: సహాబా అంటే ఎవరు? (2:06నిముషాలు)

భాగం 02: సహాబా యొక్క ప్రాముఖ్యత  (1:11నిముషాలు)

భాగం 03: ఇస్లాంలో సహాబాల గొప్పతనం (1:43నిముషాలు)

భాగం 04: తౌరాతు మరియు ఇంజీలు గ్రంధాలలో సహాబాల ప్రస్థావన (3:28నిముషాలు)

భాగం 05: సహాబాల గురించి ప్రవక్త గారు ఏమి చెప్పారు? (1:48 నిముషాలు)

భాగం 06: మన మీద సహాబాల హక్కులు ఏమిటి? (2:05 నిముషాలు)

భాగం 07: సహాబాల గురించి ఖురాన్ ఏమి చెబుతుంది? (0:49నిముషాలు)

భాగం 08: సహాబాల స్వర్ణయుగపు రోజులు (1:31నిముషాలు)

భాగం 09: సలఫ్ సాలిహీన్ దృష్టిలో సహాబాల గొప్పతనం (3:21 నిముషాలు)

భాగం 10: సహాబాలను ప్రేమించడం విశ్వాసంలో ఒక భాగం (2:04నిముషాలు)

భాగం 11: ఇమాం అహ్మద్ సహాబాల గురుంచి ఏమి చెప్పారు? (1:09నిముషాలు)

పూర్తి ఆడియో క్రింద వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి 

సహాబా : పూర్తి ఆడియో (21:21నిముషాలు)

ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.

అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?

“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు

ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,

أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا
(అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా)
సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.

وَأَعْمَقُهَا عِلْمًا
(వ అ’మఖుహా ‘ఇల్మా)
చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.

وَأَقَلُّهَا تَكَلُّفًا
(వ అఖల్లుహా తకల్లుఫా)
చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.

وَأَقْوَمُهَا هَدْيًا
(వ అఖ్వముహా హద్యా)
సన్మార్గంపై, సన్మాగంపైన అందరికంటే ఎక్కువగా ఉత్తమంగా నడిచేవారు.

وَأَحْسَنُهَا حَالًا
(వ అహ్సనుహా హాలా)
అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.

اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ
(ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి)
అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు

గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.

సూరతుల్ ఫతహ్ లో:

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)

గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.

అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,

تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ

ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?

وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:

لَا تَسُبُّوا أَصْحَابِي
(లా తసుబ్బూ అస్ హాబీ)
నా సహాబాలను మీరు దూషించకండి.

అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?

“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.”
మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.

గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?

మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.

ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.

సూరతుల్ అహ్జాబ్, ఆయత్ నంబర్ 58లో అల్లాహు తాలా తెలిపాడు:

وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا

ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.

అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:

خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ
(ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్)
అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.

అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.

మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.

అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.

అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?

అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.

సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي
(అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ)
నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.

ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”

فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ
(ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్)
ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు

وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ
(వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా)
ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.

గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?

మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:

مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
(మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్)
ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.

ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”

ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.

ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది

ఇతరములు:

సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం
https://youtu.be/dZZa0Z0Oh8Y (3 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క అత్యుత్తమ గుణమైన సిగ్గు, బిడియం (హయా) గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వద్ద దేవదూతలు కూడా సిగ్గుపడతారని తెలిపిన ఒక సంఘటనను పేర్కొన్నారు. అబూబక్ర్ (రజియల్లాహు అన్హు), ఉమర్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు సాధారణ స్థితిలో ఉన్న ప్రవక్త, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) రాకతో తమ వస్త్రాలను సరిచేసుకుని కూర్చోవడం ఆయన పట్ల గల గౌరవాన్ని, ఆయన సిగ్గు యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఇస్లాం స్వీకరించిన నాటి నుండి తన కుడి చేతిని మర్మాంగాలకు తాకించలేదని ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) స్వయంగా చెప్పిన విషయం ఆయన పవిత్రతకు నిదర్శనం. ఆయన అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారని, చివరికి హంతకుల చేతిలో హత్యకు గురయ్యే సమయంలో కూడా ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నమై ఉన్నారని వివరించబడింది.

సోదర సోదరీమణులారా! ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉత్తమ గుణం, బిడియం, సిగ్గు, లజ్జ దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందరికంటే ఎక్కువ హయా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గలవారని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారు.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఒక మెత్తకు ఇలా ఆనుకొని, తన ఈ మోకాళ్ళను ఇలా నిలబెట్టి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ లుంగీ లేదా వస్త్రం అయితే ధరించి ఉన్నారో అది ఇంచుమించు మోకాళ్ళకు దగ్గరగా వచ్చి పిక్క కనబడుతూ ఉన్నది. ఈ స్థితిలో కూర్చుండి ఉన్నారు. కొంతసేపట్లో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుండి ఉన్నారు, అబూబకర్ రావడానికి అనుమతి ఇచ్చారు. అబూబకర్ వచ్చి ఒక పక్కన కూర్చున్నారు.

మరికొంత సేపటికి హజరత్ ఉమర్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుని ఉన్నారు, హజరత్ ఉమర్ అనుమతి కోరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. హజరత్ ఉమర్ లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు, ప్రవక్త అలాగే ఉన్నారు. మరికొంత సమయం గడిచిన తర్వాత హజరత్ ఉస్మాన్ వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వస్త్రాన్ని మరింత కిందికి దించుతూ, ఒక సరియైన రీతిలో కూర్చుండి, ఉస్మాన్ కు రావడానికి అనుమతి ఇచ్చారు.వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఇంట్లో ఈ విషయాన్ని గమనించిన భార్య, అబూబకర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, ఉమర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, కానీ ఉస్మాన్ ఎప్పుడైతే వచ్చి అనుమతి కోరాడో మీరు మీ వస్త్రాన్ని సరిచేసుకుంటూ, మరి కిందికి దించుకుంటూ, మీ కూర్చుండే స్థితిని మార్చి, మరి మీరు అనుమతించారు, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఏ ఉస్మాన్ తోనైతే దేవదూతలు సిగ్గు పడుతున్నారో ఆ ఉస్మాన్ తో నేను సిగ్గుపడనా?

అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు సహాబాలలో అందరికంటే ఎక్కువగా సిగ్గు, బిడియం గలవారు. మరియు స్వయంగా ఆయన ఒక సందర్భంలో తెలిపారు, “ఎప్పటి నుండి అయితే నేను నా ఈ కుడి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చెయ్యి వేసి శపథం చేశానో, ఇస్లాం స్వీకరించానో, బయఅత్ చేశానో, అప్పటినుండి నేను ఈ కుడి చెయ్యిని నా మర్మాంగానికి తాకనివ్వలేదు”

హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిలో ఎన్నో రకాల ఉత్తమ గుణాలు ఉండినవి. ఆయన ఖుర్ఆన్ యొక్క పారాయణం చాలా అధికంగా చేసేవారు. చాలా అధికంగా చేసేవారు. మరియు చివరి సమయంలో, ఏ సమయంలోనైతే దుండగులు ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, ఆ సమయంలో కూడా ఆయన ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉన్నారు, అదే స్థితిలో ఆ దుష్టులు, దుర్మార్గులు వచ్చి ఆయన్ని హతమార్చారు.


ఇతరములు: