హిజ్రత్ (షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట) ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది [వీడియో & టెక్స్ట్]

హిజ్రత్ (షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట) ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

https://youtu.be/GWB2_SlYVsw [14 నిముషాలు]

ముస్లిం ఉమ్మత్ పై హిజ్రత్ (వలస) అనేది ప్రళయం వరకు విధిగా ఉంది. షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశం నుండి ఇస్లాం ఉన్న ప్రదేశానికి వెళ్లడమే హిజ్రత్. తౌహీద్ (ఏకదైవారాధన) పై స్థిరంగా ఉండటం, కేవలం అల్లాహ్ ను ఆరాధించడం కష్టంగా లేదా అసాధ్యంగా ఉన్నప్పుడు, మరియు దాని కారణంగా హింసించబడుతున్నప్పుడు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. ఇది దేశం నుండి దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కూడా కావచ్చు. అయితే, స్వేచ్ఛగా ఇస్లాంను ఆచరించగలిగే మరియు ఇస్లాం గురించి ప్రచారం చేయగలిగే అవకాశం ఉన్న చోట హిజ్రత్ అవసరం లేదు. శక్తి ఉండి కూడా, ప్రపంచ ప్రయోజనాల కోసం హిజ్రత్ చేయని వారికి ఖుర్ఆన్ లో కఠినమైన హెచ్చరిక ఉంది. కానీ నిజంగా బలహీనులకు, మార్గం తెలియని వారికి మినహాయింపు ఉంది. హిజ్రత్ చేయని వాడు పాపాత్ముడు అవుతాడు కానీ అవిశ్వాసి కాడు. పశ్చాత్తాప ద్వారం మూసుకుపోయే వరకు (సూర్యుడు పడమర నుండి ఉదయించే వరకు) హిజ్రత్ కొనసాగుతుంది, కానీ వ్యక్తిగత పశ్చాత్తాపం మరణ ఘడియ రాకముందే చేయాలి.

మదీనా ప్రస్థానం (హిజ్రత్) | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

1) హిజ్రత్ అర్థం 
2) హిజ్రత్ విశిష్టత
3) దివ్య ఖుర్ఆన్ మరియు హదీసు వెలుగులో హిజ్రత్ ఆదేశం ప్రళయం వరకు ఉంది
4) మదీనాకు హిజ్రత్ : కారణాలు, వృత్తాంతాలు. 

మొదటి ఖుత్బా 

ధార్మిక సహోదరులారా! 

హిజ్రీ శకపు నూతన సంవత్సరపు ఆరంభాన్ని పురస్కరించుకొని, నేటి ప్రసంగంలో, ఎంతో ప్రాచుర్యం పొందిన “మదీనా ప్రస్థానం (హిజ్రత్)” వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించడం సబబుగా అనిపిస్తోంది. ఎందుకంటే – ఈ సంఘటన ద్వారానే ఇస్లామీ శకం ఆరంభమైనది. కానీ, దీని వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు హిజ్రత్ అంటే ఏమిటి? దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులలో దీని గూర్చి వివరించబడ్డ విశిష్ఠతలు ఏమిటి? వీటిని గూర్చి తెలుసు కుందాం రండి. 

హిజ్రత్ అంటే – ‘అల్ హిజ్రహ్’ హిజర్ నుండి వచ్చింది. దీని అర్థం  ‘వదలిపెట్టడం‘ అని. 

అరబ్బులు ఇలా అనేవారు: “ఫలానా జాతి ఒక ప్రదేశాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్ళిపోయింది.” ముహాజిర్ సహబాలు కూడా మక్కా పట్టణాన్ని వదిలి మదీనాకు ప్రస్థానం గావించారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ
మరియు పడక గదులలో వారిని వదిలిపెట్టండి” (నిసా : 34) 

‘అల్ హిజ్రత్’ ను మెజారిటీ ఉలమాలు ధార్మికంగా ఇలా నిర్వచించారు: 
“అవిశ్వాస భూభాగం (దారుల్ కుఫ్ర్) నుండి ఇస్లామీయ భూభాగం (దారుల్ ఇస్లామ్) వైపు మరలిరావడం”. 

అయితే, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) దీని గురించి ఇలా వివరించారు: 
“షరీయత్తు పరంగా ‘హిజ్రత్’ అంటే – అల్లాహ్ వారించిన ప్రతి కార్యాన్నీ విడిచిపెట్టడం.” 

బహుశా, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఈ నిర్వచనాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హదీసు నుండి గ్రహించి వుండవచ్చు. 

అల్లాహ్ వారించిన కార్యాలను విడిచిపెట్టేవాడు ముహాజిర్” (బుఖారీ: 1/35, అల్ ఫతహ్) 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే- ‘హిజ్రత్’ అన్న పదం – బాహ్యము మరియు అంతరంగం – ఈ రెండు రకాల హిజ్రత్ లకు కూడా వర్తిస్తుంది. 

అంతరంగ హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి షైతాను మరియు స్వయంగా అతని మనస్సు ఎంతో ఆకర్షకంగా మలచి అతని ముందు ప్రవేశపెట్టే కార్యాలను త్యజించడం. ఇక, బాహ్య హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి తన ధర్మాన్ని అవిశ్వాసం మరియు ఉపద్రవాల బారి నుండి కాపాడుకొనే నిమిత్తం ఇస్లామీయ బోధనలపై శాంతియుతంగా ఆచరించుకోగలిగే ప్రదేశానికి మరలి వెళ్ళడం.” (ఫత్హుల్ బారి  : 1/54) 

ఇమామ్ అలాజ్ బిన్ అబ్దుస్సలామ్ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు: 

హిజ్రత్ రెండు రకాలు. స్వదేశాన్ని విడిచిపెట్టడం మరియు పాపాలను, దౌర్జన్యాన్ని త్యజించడం. వీటిలో, రెండవ హిజ్రత్ ఉత్తమమైనది. ఎందుకంటే – దీని ద్వారా ఆ కరుణామయుడు (అల్లాహ్) సంతృప్తి చెందడమేకాక, మనస్సు మరియు షైతానుల దుష్ప్రరణ కూడా తగ్గుతుంది.”

హిజ్రత్ విశిష్టతలు 

హిజ్రీ క్యాలెండర్ ఆవశ్యకత | Importance of Hijri Calendar [వీడియో]

హిజ్రీ క్యాలెండర్ ఆవశ్యకత | Importance of Hijri Calendar [వీడియో]
https://youtu.be/yooNUIwiSMs [21 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రస్తుతం మనం క్రొత్త హిజ్రీ సంవత్సరం లోకి ప్రవేశించాము (హిజ్రీ 1444). ముహర్రం మాసం హిజ్రీ క్యాలెండరు లోని మొదటి నెల. హిజ్రత్ అంటే వలస పోవడం. మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేయడం పురస్కరించుకొని ఈ హిజ్రీ క్యాలెండరు తయారు అయింది

ఈ వీడియో లో :

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కాలంలో ఏ విధం అయిన క్యాలెండరు వాడేవారు.
  2. హిజ్రీ కేలండర్ ఎప్పుడు మొదలైంది, ఏ ఖలీఫా కాలంలో హిజ్రీ క్యాలండర్ నిర్ణయించారు.
  3. మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేయడం పురస్కరించుకొని ఈ హిజ్రీ క్యాలెండరు ఎందుకు తయారు అయింది?
  4. హిజ్రీ క్యాలెండరు విశిష్టత
  5. షరియత్ లో హిజ్రీ కేలండర్ ఆవశ్యకత
  6. ఇంకా ఎన్నో మంచి విషయాలు షేఖ్ గారు వివరించారు

తప్పకుండ వినండి, మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యండి, ఇన్ షా అల్లాహ్

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

హిజ్రత్ (వలస) ప్రయాణం ప్రాముఖ్యత (Hijrah) [ఆడియో]

బిస్మిల్లాహ్
హిజ్రత్ (వలస) ప్రయాణం ప్రాముఖ్యత (Hijrah) – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[29 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇతర లింకులు:

సీరత్ పాఠాలు 6: మదీనాకు హిజ్రత్ (వలస), బద్ర్ యుద్ధం [వీడియో]

బిస్మిల్లాహ్

[21:14 నిముషాలు]

హిజ్రత్ మదీనా, బద్ర్ యుద్ధం

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

 ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [21:14 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీన నుండి వచ్చి మజిలి చేసిన కొందరితో కలిసి వారిని అల్లాహ్ వైపు పిలిచారు. వారు ఆయన మాటలను శ్రద్ధగా విని, ఆయన్ను విశ్వసించి, అనుసరిస్తామని వారు ఏకీభవించారు. అయితే “ఒక ప్రవక్త రానున్నాడు, అతని ఆగమన కాలం సమీపించిందని” వారు ఇంతకు ముందే యూదులతో వినేవారు. ఎప్పుడైతే ప్రవక్త వారికి ఇస్లాం బోధ చేశారో, యూదులు చెప్పే మాట గుర్తొచ్చి, ఆ ప్రవక్త ఈయనే అని తెలుసుకొని, ఈయన్ని విశ్వసించడంలో యూదులు మనకంటే ముందంజ వేయకూడదని వారు పరస్పరం అనుకొని తొందరగా విశ్వసించారు. వారు ఆరుగురు. ఆ తరువాత సంవత్సరం పన్నెండు మంది ప్రవక్తతో కలసి ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్చుకున్నారు. వారు తిరిగి మదీన వెళ్ళేటప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్అబ్ బిన్ ఉమైర్ (రదియల్లాహు అన్హు)ను వారితో పంపారు. అతను వారికి ఖుర్ఆన్ నేర్పాలని మరియు ఇస్లాం ధర్మాదేశాలు బోధించాలని. అతను అక్కడి సమాజంపై మంచి ప్రభావం వేయగలిగారు. అంటే మదీనవాసులు అతని ప్రచారం పట్ల ఆకర్షితులయ్యే విధంగా అతను అక్కడ ఉండి ఇస్లాం బోధించగలిగారు. ఒక సంవంత్సరం తర్వాత అతను మక్కా వచ్చేటప్పుడు తన వెంట 72 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు వచ్చారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిశారు. అల్లాహ్ ధర్మ సహాయానికి ఎల్లవేళల్లో సిద్ధమేనని వారు శపథం చేసి తిరిగి మదీన వెళ్ళిపోయారు.

కొత్త ప్రచారం కేంద్రం

మదీన పట్టణం ఇస్లాం మరియు ముస్లింలకు మంచి ఆశ్రయం, శాంతి స్థానంగా అయ్యింది. అక్కడికి మక్కా పీడిత ముస్లిముల హిజ్రత్[1] మొదలయ్యింది. ముస్లిములను హిజ్రత్ చేయనివ్వకూడదని ఖురైషు గట్టి పట్టు పట్టారు. హిజ్రత్ చేయబూనిన కొందరు ముస్లిములు నానా రకాల హింసా దౌర్జన్యాలకు గురయ్యారు. అందుకు ముస్లిములు రహస్యంగా హిజ్రత్ చేసేవారు. అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తతో అనుమతి కోరినప్పుడల్లా “తొందరపడకు, బహుశా అల్లాహ్ నీకొక ప్రయాణమిత్రుడు నొసంగవచ్చును” అని చెప్పేవారు. చివరికి చాలా మంది ముస్లిములు హిజ్రత్ చేశారు.

[1] హిజ్రత్ అంటే వలసపోవుట. అంటే తన స్వగ్రామంలో ఇస్లాం ధర్మ ప్రకారం జీవితం గడపడం కష్టతరమైతే, దాన్ని వదిలి వేరే ప్రాంతానికి ప్రయాణమగుట.

ముస్లిములు ఈ విధంగా హిజ్రత్ చేసి, మదీనలో వెళ్ళి స్థానం ఏర్పరుచుకుంటున్న విషయాన్ని చూసి ఖురైషులకు పిచ్చెక్కి పోయింది. అంతే కాదు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతిష్ట, ఆయన ప్రచారం దినదినానికి వృద్ధి చెందుతున్నది చూసి వారు భయం చెందారు. అందుకని వారందరూ కలసి సమాలోచన చేసి ప్రవక్తను హతమార్చాలని ఏకీభవించారు. అబూ జహల్ ఇలా చెప్పాడు: “మనం ప్రతి తెగ నుండి శక్తివంతుడైన ఒక యువకునికి కరవాలం ఇవ్వాలి. వారందరూ ముహమ్మదును ముట్టడించి, అందరు ఒకేసారి దాడి చేసి సంహరించాలి. అప్పుడు అతని హత్యానేరం అన్ని తెగలపై పడుతుంది. బనీ హాషిం అందరితో పగతీర్చుకొనుటకు సాహసించలేరు” అని పథకం వేశారు. వారి ఈ పథకం, దురాలోచన గురించి అల్లాహ్ ప్రవక్తకు తెలియ జేశాడు. అల్లాహ్ అనుమతిని అనుసరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)తో హిజ్రత్ కొరకు సిద్ధమయ్యారు. అలీ (రదియల్లాహు అన్హు)ను పిలిచి, “ఈ రాత్రి నీవు నా పడకపై నిద్రించు, (నీకు ఏ నష్టమూ కలగదు). చూసే వారికి నేనే నిద్రిస్తున్నానన్న భ్రమ కలుగుతుంది” అని చెప్పారు.

అవిశ్వాసులు తమ పథకం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటిని చుట్టుముట్టారు. అలీ (రదియల్లాహు అన్హు)ను నిద్రిస్తున్నది చూసి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అని భ్రమపడ్డారు. ఆయన బైటికి వచ్చిన వెంటనే ఒకే దాడిలో హత్య చేయాలని ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు. వారు ముట్టడించి కాపుకాస్తున్న వేళ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మధ్య నుండి వెళ్ళారు. వారి తలలపై మన్ను విసురుతూ అక్కడి నుండి వెళ్ళారు. అల్లాహ్ వారి చూపులను పట్టుకున్నాడు. ప్రవక్త వారి ముందు నుండి దాటింది వారు గ్రహించలేక పోయారు. అక్కడి నుండి ప్రవక్త అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) వద్దకెళ్ళి, ఇద్దరూ కలసి సుమారు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న సౌర్ గుహలో దాగి పోయారు. అటు ఖురైషు శక్తిశాలి యువకులు తెల్లారే వరకు నిరీక్షిస్తునే ఉండిపోయారు. తెల్లారిన తర్వాత ప్రవక్త పడక నుండి అలీ (రదియల్లాహు అన్హు) లేచి, వీరి చేతిలో చిక్కాడు. ప్రవక్త గురించి అడిగారు. అలీ (రదియల్లాహు అన్హు) ఏమీ చెప్ప లేదు. అతన్ని పట్టి లాగారు, కొట్టారు, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది.

అప్పుడు ఖురైషులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను వెతకడానికి అన్ని దిక్కులా అన్వేషీలను పంపారు. ఆయన్ని జీవనిర్జీవ ఏ స్థితిలో పట్టు కొచ్చినా, అతనికి 100 ఒంటెల బహుమానం అని ప్రకటించారు. కొందరు అన్వేషీలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన మిత్రుడు ఉన్న గుహ వద్దకు చేరుకున్నారు. వారిలో ఏ ఒక్కడైనా వంగి తన పాదాల్ని చూసుకున్నా, వారిద్దర్ని చూసేవాడు. అందుకు అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) (ప్రవక్త పట్ల) కంగారు పడ్డారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి ఇలా ధైర్యం చెప్పారు: “అబూ బక్ర్! ఏ ఇద్దరికి తోడుగా మూడోవాడు అల్లాహ్ ఉన్నాడో వారి గురించి నీకు రందేమిటి. దిగులు పడకు అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు“. వాస్తవంగా వారు ఆ ఇద్దరిని చూడలేదు కూడా.

మూడు రోజుల వరకు అదే గుహలో ఉండి, మదీనాకు బయలుదేరారు. దూర ప్రయాణం, మండే ఎండలో ప్రయాణం సాగుతూ రెండవ రోజు సాయంకాలం ఒక గుడారం నుండి వెళ్ళుచుండగా అక్కడ ఉమ్మె మఅబద్ పేరుగల స్త్రీ ఉండెను. నీ వద్ద తిను త్రాగటకు ఏమైనా ఉందా అని ఆమెతో అడిగారు. నా వద్ద ఏమీ లేదు. ఆ మూలన బలహీన మేక ఉంది. మందతో పాటు నడవలేకపోతుంది. దానిలో పేరుకు మాత్రం పాలు కూడా లేవు అని చెప్పింది. పిదప ఆమె అనుమతి మేరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ మేక వద్దకు వెళ్ళి దాని పొదుగును చెయితో తాకగానే అందులో పాలు వచ్చేశాయి. పెద్ద పాత్ర నిండ పాలు పితికారు. ఉమ్మె మఅబద్ మరీ ఆశ్చర్యంగా ఒక వైపు నిలుచుండి బిత్తర పోయింది. ఆ పాలు అందరూ కడుపు నిండా త్రాగారు. మరో సారి పాత్ర నిండా పితికి, ఉమ్మె మఅబద్ వద్ద వదిలి, ప్రయాణమయ్యారు.

మదీనవాసులు ప్రతీ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎదురు చూస్తూ మదీన బైటికి వచ్చేవారు. ప్రవక్త మదీనా చేరుకునే రోజు సంతోషంతో, స్వాగతం పలుకుతూ వచ్చారు. మదీన ప్రవేశంలో ఉన్న ఖుబాలో మజిలి చేశారు. అక్కడ నాలుగు రోజులున్నారు. మస్జిద్ ఖుబా పునాది పెట్టారు. ఇది ఇస్లాంలో మొట్టిమొదటి మస్జిద్. ఐదవ రోజు మదీన వైపు బయలుదేరారు. అన్సారులో అనేక మంది ప్రవక్త ఆతిథ్య భాగ్యం తనకే దక్కాలని చాలా ప్రయత్నం చేసేవారు. అందుకని ప్రవక్త ఒంటె కళ్ళాన్ని పట్టుకునేవారు. అయితే ప్రవక్త వారికి ధన్యావాదాలు తెలుపుతూ, వదలండి! దానికి అల్లాహ్ ఆజ్ఞ అయిన చోటనే కూర్చుంటుంది అని చెప్పే వారు. అది అల్లాహ్ ఆజ్ఞ అయిన చోట కూర్చుంది. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దిగలేదు. మళ్ళీ లేచీ కొంత దూరం నడిచింది. తిరిగి వచ్చి మొదటి ప్రాంతంలోనే కూర్చుంది. అప్పుడు ప్రవక్త దిగారు. అదే ప్రస్తుతం మస్జిదె నబవి ఉన్న చోటు. ప్రవక్త అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) వద్ద ఆతిథ్యం స్వీకరించారు.

అటు అలీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త వెళ్ళాక మూడు రోజులు మక్కాలో ఉండి, ఆ మధ్యలో ప్రవక్త వద్ద ఉన్న అమానతులు హక్కుదారులకు చెల్లించి మదీనకూ బయలు దేరాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుబాలో ఉండగా అక్కడికి వచ్చి కలుసుకున్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో

ఒంటె కూర్చున్న స్థలాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని యజమానుల నుండి ఖరీదు చేసి అక్కడ మస్జిద్ నిర్మించారు. ముహాజిరీన్ మరియు అన్సారుల [2] మధ్య సోదర బాంధవ్యం ఏర్పరిచారు. ఒక్కో ముహాజిరును ఒక్కో అన్సారుతో కలిపి ఇతడు నీ సోదరుడు తన సొమ్ము లో కూడా నీ భాగమని తెలిపారు. ముహాజిరులు అన్సారులు కలసి పని చేసుకోవడం మొదలెట్టారు. వారి మధ్య సోదర బాంధవ్యం మరీ గట్టిపడింది.

[2]మదీనకు వలస వచ్చిన వారిని ముహాజిరీన్ అంటారు. వారి సహాయం చేసిన మదీన వాసులను అన్సార్ అంటారు.

మదీనాలో ఇస్లాం విస్తృతం కావడం మొదలయింది. కొందరు యూదులు ఇస్లాం స్వీకరించారు. వారిలో ఒకరు అబ్దుల్లాహ్ బిన్ సలాం (రదియల్లాహు అన్హు). ఇతను వారిలో ఒక పెద్ద పండితుడు. మరియు వారి పెద్ద నాయకుల్లో ఒకరు.

ముస్లిములు మక్కా నగరాన్ని వదలి వెళ్ళినప్పటికీ వారికి వ్యతిరేకంగా ముష్రికుల విరోధం, పోరాటం సమాప్తం కాలేదు. ఖురైషులకు మదీన యూదులతో ముందు నుండే సంబంధం ఉండెను. అయితే వారు దాన్ని ఉపయోగించి ముస్లిముల మధ్యగల ఐక్యతను భంగం కలిగించాలని, తృప్తిగా ఉండనివ్వకుండా మనోవ్యధకు గురి చేయాలని యూదులను ప్రేరేపించేవారు. అంతే కాదు, వారు స్వయంగా ముస్లిములను బెదిరిస్తూ, అంతమొందిస్తామని హెచ్చరించేవారు. ఈ విధంగా ముస్లిములకు ముప్పు ఇరువైపులా చుట్టుముట్టింది. అంటే మదీన లోపల ఉన్నవారితో మరియు బైటి నుండి ఖురైషులతో. సమస్య ఎంత గంభీరమైనదంటే సహాబాలు ఆయుధాలు తమ వెంట ఉంచుకొని రాత్రిళ్ళు గడిపేవారు. ఈ భయాందోళన సందర్భంలోనే అల్లాహ్ యుద్ధానికి అనుమతించాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గస్తీ దళాల్ని తయారు చేసి పంప సాగారు. వారు చుట్టు ప్రక్కల్లో శత్రువులపై దృష్టి ఉంచేవారు. ఒక్కోసారి వారి వ్యాపార బృందాలను అడ్డుకునేవారు. వీటి ఉద్దేశం: ముస్లిములు అశక్తులు కారు అని తెలియజేయుటకు, వారిపై ఒత్తిడి చేయుటకు, ఇలా వారు సంధికి దిగి వచ్చి, ముస్లిములు స్వేచ్ఛగా ఇస్లాంపై ఆచరిస్తూ, దాని ప్రచారం చేసుకోవడంలో వారు అడ్డు పడకూడదని. అలాగే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టుప్రక్కలో ఉన్న తెగలవారితో ఒప్పందం, ఒడంబడికలు కుదుర్చుకున్నారు.

బద్ర్ యుద్ధం

ముస్లిములు మక్కాలో ఉన్నప్పుడు ముష్రికులు వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి చివరికి తమ స్వస్థలాన్ని వదలి వలస వెళ్ళే స్థితికి తీసుకొచ్చారు (అన్న విషయం తెలిసినదే). అందువల్ల వారు తమ జన్మస్థలాన్ని, తమ ధనాన్ని మరియు తమవారిని వదలి మదీనా వచ్చారు. అప్పుడు ముష్రికులు వారి ధనాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదు ఇటు మదీనా వాసులపై దొంగ దాడులు చేస్తూ తృప్తిగా ఉండకుండా చేయసాగారు.

అందుకే ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సీరియా నుండి వస్తున్న ఖురైషు వాణిజ్య బృందాన్ని అడ్డుకొని, వారిని అదుపులో మరియు భయంలో ఉంచాలని నిశ్చయించి, 313 మంది సహాబాలతో కలసి వెళ్ళారు. అప్పుడు వారి వద్ద రెండు గుర్రాలు, 70 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. ఖురైషు బృందంలో 1000 ఒంటెలున్నాయి. 40 మంది ఉన్నారు. అబూ సుఫ్యాన్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు. కాని మస్లిములు అడ్డుకునే విషయాన్ని అబూ సుఫ్యాన్ గ్రహించి, ఈ వార్త మక్కా పంపుతూ, వారితో సహాయం కోరాడు. అంతే కాదు, అతడు తన బృందంతో ప్రధాన రహదారిని వదిలేసి వేరే దొడ్డిదారి గుండా వెళ్ళిపోయాడు. ముస్లిములు వారిని పట్టుకోలేక పోయారు. అటు వార్త తెలిసిన మక్కా ఖురైషులు, 1000 యుద్ధవీరులతో పెద్ద సైన్యం తయారు చేసుకొని బయలుదేరారు. వీరు దారిలో ఉండగానే అబూ సుఫ్యాన్ రాయబారి వచ్చి, వాణిజ్య బృందం ముస్లిముల నుండి తప్పించుకొని, క్షేమంగా చేరుకోనుంది. మీరు తిరిగి మక్కా వచ్చేసెయ్యండి అని చెప్పాడు. కాని అబూ జహల్ నిరాకరించాడు. తిరిగి మక్కా పోవడానికి ఒప్పుకోలేదు. ప్రయాణం ముందుకు సాగిస్తూ బద్ర్ వైపు వెళ్ళాడు.

ఖురైషు సైన్యం బయలుదేరిన విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలిసిన తర్వాత తమ సహచరులతో సమాలోచన చేశారు. అందరూ అవిశ్వాసులతో పోరాడుటకు సిద్ధమేనని ఏకీభవించారు. రెండవ హిజ్ర శకం, రమజాను మాసములోని ఒక రోజు రెండు సైన్యాలు పోరాటానికి దిగాయి. ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ముస్లింలు విజయం పొందారు. వీరిలో 14 మంది సహాబాలు షహీదు (అమరవీరు) లయ్యారు. ముష్రికుల్లో 70 మంది వధించబడగా, మరో 70 మంది ఖైదీలయ్యారు.

ఈ యుద్ధ సందర్భంలోనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూతురు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) సతీమణి రుఖయ్యా (రదియల్లాహు అన్హా) మరణించారు. అందుకే ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఈ యుద్ధం లో పాల్గొన లేకపోయాడు. ప్రవక్త ఆదేశం మేరకు అతను తన అనారోగ్యంగా ఉన్న భార్య సేవలో మదీనలోనే ఉండిపోయాడు. ఈ యుద్ధం తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ రెండవ కూతురు ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) వివాహం ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో చేశారు. అందుకే అతను జిన్నూరైన్ అన్న బిరుదు పొందాడు. అంటే రెండు కాంతులు గలవాడు అని.

బద్ర్ యుద్ధంలో ముస్లిములు అల్లాహ్ సహాయంతో విజయం సాధించి, ముష్రికు ఖైదీలతో మరియు విజయధనంతో సంతోషంగా తిరిగి మదీన వచ్చారు. ఖైదీల్లో కొందరు పరిహారం చెల్లించి విడుదలయ్యారు. మరి కొందరు ఏ పరిహారం లేకుండానే విడుదలయ్యారు. ఇంకొందరి పరిహారం; ముస్లిం పిల్లవాళ్ళకు చదువు నేర్పడం నిర్ణయమయింది. వారు ఇలా విడుదలయ్యారు.

ఈ యుద్ధంలో ముష్రికుల పేరుగాంచిన నాయకులు, ఇస్లాం బద్దశత్రువులు హతమయ్యారు. వారిలో అబూ జహల్, ఉమయ్య బిన్ ఖల్ఫ్, ఉత్బా బిన్ రబీఆ మరియు షైబా బిన్ రబీఆ వైగారాలు.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత [ఆడియో & టెక్స్ట్]

అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత
https://youtu.be/F_XuR9WXUr8 [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సహచరుడు, ఇస్లాం మొదటి ఖలీఫా అయిన హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలు వివరించబడ్డాయి. ఇస్లాంకు ముందు ఆయన స్వచ్ఛమైన, నిజాయితీ గల జీవితం, ప్రవక్త గారి పిలుపును అందుకుని క్షణం కూడా సంకోచించకుండా ఇస్లాం స్వీకరించిన తీరు, ప్రవక్త గారి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, విశ్వాసం గురించి చర్చించబడింది. మేరాజ్ సంఘటన తర్వాత ప్రవక్తను సత్యవంతునిగా ధృవీకరించడం ద్వారా “సిద్దీఖ్” అనే బిరుదును ఎలా పొందారో వివరించబడింది. ఇస్లాం కోసం బానిసలను విడిపించడం, హిజ్రత్ (వలస) ప్రయాణంలో ప్రవక్త గారికి తోడుగా నిలవడం, థౌర్ గుహలో ఆయన చేసిన త్యాగం, ప్రవక్త గారి మరణానంతరం ముస్లిం సమాజాన్ని ఎలా ధైర్యంగా నిలబెట్టారో వంటి అనేక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఇందులో ప్రస్తావించబడ్డాయి.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అద అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుల గురించి తెలుసుకొని ఉన్నాము.

ఈరోజు మనం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము.

హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించాక రెండున్నర సంవత్సరాలకు ఇహలోకంలోకి వచ్చారు. ఆయన తన చిన్నతనం నుండే ఎంతో నిజాయితీగా, సత్యవంతునిగా మరియు ఎంతో అందరికీ ఇష్టమయ్యే మృదువైన, ఉత్తమమైన నడవడికను అవలంబించుకొని జీవితం గడుపుకుంటూ వచ్చారు. ఆయన జీవిత చరిత్రను మనం చూస్తే, ఇస్లాం కంటే ముందు అజ్ఞాన కాలంలో ఆయన తన యవ్వనంలో గానీ, ఇస్లాం స్వీకరించక ముందు గానీ ఏ ఒక్క రోజు కూడా మత్తుపానీయాలకు సమీపించలేదు, దగ్గరికి వెళ్ళలేదు. ఏ చెడు అలవాట్లకు, సామాన్యంగా ఏదైతే కొన్ని సమాజాల్లో యువకులు కొన్ని చెడు గుణాల్లో పడిపోతారో, అలాంటి ఏ చెడు గుణానికి దగ్గర కాలేదు.

ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం గురించి ప్రచారం ప్రారంభం చేయక ముందు నుండే అతను ప్రవక్త గారికి ఒక దగ్గరి స్నేహితునిగా, ఒక మంచి స్నేహితునిగా ఉన్నారు. ఆయనకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే నేను ప్రవక్తను, అల్లాహ్ నన్ను సర్వ మానవాళి వైపునకు సందేశహరునిగా, ప్రవక్తగా చేసి పంపాడో, నా పిలుపు ఏమిటంటే, అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు మరియు నేను ఆయన ప్రవక్తను, నీవు ఈ విషయాన్ని స్వీకరిస్తావా అని అంటే, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు క్షణం పాటు గురించి కూడా సంకోచించక, ఎలాంటి సందేహంలో పడక, ఏ ప్రశ్న ప్రవక్త ముందు చేయక వెంటనే స్వీకరించారు. కొందరు తడబడాయిస్తారు, కొందరు ఆలోచిస్తారు, మరికొందరు ఎదురు ప్రశ్నలు వేస్తారు కానీ హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు అలాంటి ఏ సంకోచంలో పడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే నమ్ముకున్నారు.

ఇంకా మనం ఆయన జీవితం గురించి తెలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలు ముందుకు రానున్నాయి, కానీ ఒక సందర్భంలో ఎప్పుడైతే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హుతో, ఏమిటి నీవు నీ స్నేహితుడు అంటే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, నీ స్నేహితుడు చెప్పిన ప్రతి మాటను ఒప్పుకుంటున్నావు అని హేళనగా కొందరు అవిశ్వాసులు అడిగినప్పుడు, అవును, ఆయన అమీన్ మరియు సాదిఖ్ అని మీరు కూడా నమ్మేవారు కదా! ఆయన ప్రపంచంలో ఎవరితోనీ కూడా తన స్వయ అవసరానికి అయినా ఏ ఒక్క రోజు గానీ ఏ ఒక్కసారి గానీ అబద్ధం పలకలేదు. అలాంటి వ్యక్తి సృష్టికర్త అయిన అల్లాహ్ పై ఎలా అబద్ధాన్ని, ఎలా అబద్ధాన్ని మోపుతారు? ఒక అభాండను అల్లాహ్ వైపునకు ఎలా అంకితం చేస్తారు? చేయలేరు. అందుగురించి ఆయన చెప్పిన ప్రతి మాటను నేను నమ్ముతాను. అల్లాహ్ ఈ విషయం నాకు తెలిపాడు అని ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారో అందులో నేను ఏ మాత్రం సంకోచించను. సోదర మహాశయులారా, సోదరీమణులారా, విశ్వాసం అంటే ఇలా దృఢంగా ఉండాలి. మనం కూడా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క జీవితం ద్వారా మంచి ఉత్తమమైన గుణపాఠాలు నేర్చుకోవాలి.

హజ్రత్ అబూబకర్, ఈ బిరుదుతోనే ఆయన చాలా ప్రఖ్యాతి గాంచారు. అబ్దుల్ అతీఖ్ అని ఇంకా అబ్దుల్ కాబా అని వేరే ఎన్నో రకాల పేర్ల గురించి మనకు చరిత్రలో తెలుస్తుంది. కానీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి అబ్దుల్లాహ్ అన్న పేరును పెట్టారు, అల్లాహ్ యొక్క దాసుడు అని, కానీ అబ్దుల్లాహ్ అన్న పేరుతో ఆయన ఫేమస్ కాలేదు. అబూబకర్ అన్న పేరుతో మరియు మరొక బిరుదు “సిద్దీఖ్”.

దీని గురించి కూడా ఎన్నో ఉల్లేఖనాలు ఉన్నాయి. ఖురాన్ ఒక ఆయతు ద్వారా కూడా ఎందరో ఖురాన్ వ్యాఖ్యానకర్తలు ఈ విషయం తెలిపారు.

وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ ۙ أُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
(వల్లజీ జా అబిస్సిద్ఖి వసద్దఖ బిహీ ఉలాఇక హుముల్ ముత్తఖూన్)
సత్యాన్ని తీసుకువచ్చినవాడూ, దాన్ని సత్యమని ధృవీకరించిన వాడూ – అలాంటి వారే దైవభీతి గలవారు. (39:33)

ఇందులో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యపరిచిన వారు, వారే భయభక్తులు కలిగి ఉన్నవారు, వారే ముత్తఖీన్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే తెలుపుతున్నాడో, సద్దఖ నుండి సిద్దీఖ్ వస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యపరిచిన వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ గనుక ఆయనకు సిద్దీఖ్ అన్న బిరుదు పడింది. అంతేకాదు దీని గురించి ఒక ప్రఖ్యాతిగాంచిన సంఘటన ఏమిటంటే ఎప్పుడైతే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం మేరాజ్ కు వెళ్లి వచ్చారో ఆ తర్వాత మేరాజ్ యొక్క సంఘటన ప్రజలకు తెలియపరిచారు. అప్పుడు విశ్వాసులు ఆ విషయాన్ని నమ్మారు. కానీ అవిశ్వాసులు హేళన చేశారు. మేము ఇక్కడి నుండి మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వెళ్ళాలంటే నెల పడుతుంది కనీసం, నీవు ఒకే రాత్రి రాత్రిలోని కొంత భాగములో బైతుల్ మఖ్దిస్ వెళ్లి మళ్ళీ అక్కడ నుండి ఏడు ఆకాశాల వరకు వెళ్ళావు, ఏమిటి మమ్మల్ని పిచ్చి వాళ్ళుగా అనుకుంటున్నావా అని ఎగతాళి చేశారు. కానీ ఆ సమయంలో అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలుపుతున్న సందర్భంలో అబూబకర్ లేరు. ఒక అవిశ్వాసి అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు వెళ్లి, ఏమిటి ఎవరైనా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు ఒక రాత్రిలో వెళ్లి వచ్చాను అని అంటే నమ్ముతావా? అంటే అబూబకర్ సిద్దీఖ్ చెప్పారు, లేదు. సామాన్యంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఎన్ని రోజుల ప్రయాణం పడుతుంది మనకు తెలుసు కదా. ఎవరైనా ఇలా చెప్పేది ఉంటే ఎలా నమ్మాలి? అతడు సంతోషపడి వెంటనే చెప్పాడు, అయితే మరి నీ స్నేహితుడు నీ మిత్రుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెబుతున్నాడు కదా, రాత్రి కొంత భాగంలోనే బైతుల్ మఖ్దిస్ కి వెళ్ళాడంట, అక్కడి నుండి ఏడు ఆకాశాలకు వెళ్లి స్వర్గ నరకాలను కూడా దర్శనం చేసి వచ్చారంట. వెంటనే అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలిపారు, ఒకవేళ ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే అది నూటికి నూరు పాళ్ళు నిజం, అందులో అబద్ధానికి అసత్యానికి ఏ ఆస్కారం లేదు. అల్లాహు అక్బర్! గమనించండి. అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు సరే నేను ముహమ్మద్ ను తెలుసుకుంటాను సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ తర్వాత నిజమో లేదో చెబుతాను ఇవన్నీ ఇలా చెప్పలేదు విషయాలు, ఏమన్నారు? అతని ముంగట అప్పుడే అప్పటికప్పుడే చెప్పారు, ఒకవేళ ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గనుక చెప్పేది ఉంటే ఆ మాట నిజము, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుగురించి ఆయనకు సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు పడింది అని కూడా చెప్పడం జరిగింది.

అంతేకాకుండా సహీ బుఖారీలో కూడా ఒక హదీస్ వచ్చి ఉంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్, ఉమర్, ఉస్మాన్ నలుగురు ఉహద్ పర్వతంపై ఉన్నారు. అప్పుడు ఉహద్ పర్వతం అందులో ప్రకంపన వచ్చింది, ఊగ సాగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ కాలుతో ఒకసారి ఇలా కొట్టి, ఉస్బుత్ ఉహుద్ (ఓ ఉహుద్, స్థిరంగా ఉండు), ఉహుద్ కదలకు, నిలకడగా ఉండు, ఇప్పుడు నీపై ఒక నబీ, ఒక సిద్దీఖ్ మరియు ఇద్దరు షహీదులు ఉన్నారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అంటే ప్రవక్త అంటే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సిద్దీఖ్ అంటే హజ్రత్ అబూబకర్ మరియు ఇద్దరు షహీదులు అంటే హజ్రత్ ఉమర్ మరియు ఉస్మాన్.

సోదర సోదరీమణులారా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇస్లాం కంటే ముందు తమ జీవితంలో ఏ ఒక్కసారి కూడా షిర్క్ కార్యకలాపాలకు పాల్పడలేదు. ఆయనకు యవ్వనంలో చేరుకున్నప్పటి నుండే వ్యవసాయం ఇంకా పెద్దలతో ఉండడం మరియు హుందాతనంగా జీవించడం ఆరంభించారు. ఆయన యవ్వనంలో చేరిన తర్వాత ప్రజలలో ఒక చాలా మంచి వ్యక్తిగా, ఏదైనా ముఖ్య విషయాల్లో అతనితో సలహా తీసుకోవాలి అని ప్రజలు కోరేవారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు మౌనం వహించలేదు. నాకు ఇస్లాం లాంటి ఒక అనుగ్రహం లభించింది కదా ఇక దీనిపై నేను స్థిరంగా ఉంటాను అని తనకు తాను ఆలోచించుకొని కేవలం జీవితం గడపలేదు. ఇస్లాం స్వీకరించిన వెంటనే ఇస్లాం యొక్క ప్రచారం కూడా మొదలు పెట్టారు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఏ పది మంది గురించి ఇహలోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వీరు తప్పకుండా స్వర్గంలో చేరుతారు అని అందులో మొట్టమొదటి వ్యక్తి అబూబకర్, ఆ తర్వాత మిగతా తొమ్మిది మందిలో అధిక శాతం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క బోధనతో, హజ్రత్ అబూబకర్ యొక్క ప్రోత్సాహంతో ఇస్లాం స్వీకరించారు. ఉదాహరణకు హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ తల్హా, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఇంకా వేరే కొంతమంది. అంతేకాదు, హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు వ్యాపారం చేస్తూ ఉండేవారు. అల్లాహు త’ఆలా ఆ వ్యాపారం ద్వారా అతనికి చాలా శుభం కలుగజేశాడు. ఆయన ఎంతో మంచి విధంగా ధనం సంపాదించారు, హలాల్, ధర్మసమ్మత మార్గం నుండి. కానీ ధనం అంటే ఇష్టపడి దాని ప్రేమలో, వ్యామోహంలో చిక్కుకునే వారు కాదు. సాధ్యమైనంత వరకు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతూ ఉండేవారు.

ఇక ఈ ఉత్తమ గుణం అయితే ఇస్లాం తర్వాత ఎలా మారింది? సమాజంలో ఎవరైతే కొందరు బానిసలు, బానిసరాండ్లు, మరికొందరు బలహీనులు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, వారు ఇస్లాం స్వీకరించిన కారణంగా వారి యొక్క యజమానులు వారిని బాధిస్తూ ఉండేవారు. అయితే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారిని వారి యొక్క యజమానుల నుండి కొని తన స్వయ డబ్బుతో వారిని అల్లాహ్ మార్గంలో విడుదల చేసేవారు. ఇస్లాంపై ఇక మీరు స్వేచ్ఛగా జీవితం గడపండి అని. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు స్వయంగా తాను తన డబ్బుతో ఏ ఏ బానిసలను కొని బానిస నుండి విముక్తి కలిగించారో వారిలో ఆమిర్ ఇబ్ను ఫుహైరా, ఉమ్ము ఉబైస్, జున్నైరా, నహదియా మరియు ఆమె కూతురు, హజ్రత్ బిలాల్ రదియల్లాహు త’ఆలా అన్హు చాలా ప్రఖ్యాతిగాంచిన వారు తెలిసిన విషయమే మరియు బనీ మొఅమ్మల్ కు సంబంధించిన ఒక బానిసరాలు.

అంతేకాకుండా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రజలకు ఇస్లాం బోధించడంలో స్వయంగా ఒక్కొక్కసారి ఆయనపై ఎన్నో ఆపదలు వచ్చేవి. ఎందుకంటే ప్రవక్త జీవిత చరిత్ర చదివిన వారికి విషయం తెలుసు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వయంగా మరియు వారిని విశ్వసించిన వారిపై అవిశ్వాసులు హత్యా, దౌర్జన్యాలు చేసేవారు మరియు ఎన్నో రకాలుగా వారిని బాధించేవారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక దుర్మార్గుడు వచ్చి తన యొక్క దుప్పటిని తీసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెడలో వేసి ఇంత గట్టిగా లాగాడంటే దాని మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవూదుబిల్లా ఇక ఆయనకు ప్రాణం పోయినట్లు ఏర్పడింది. అప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వచ్చి ఆ దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విడిపించి, “అతఖ్ తులూన రజులన్ అన్ యఖూల రబ్బి యల్లాహ్” (నా ప్రభువు కేవలం అల్లాహ్ అని అన్నందుకు ఒక వ్యక్తిని చంపుతారా?) అని, ఏమిటి నా ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని అన్నంత మాత్రాన మీరు ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి పుణ్యాత్ముని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు అని వారిని హెచ్చరించారు. అప్పుడు ఆ దుర్మార్గులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వదిలి అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారిని కొట్టడం మొదలు పెట్టారు. చివరికి ఆయన స్పృహ తప్పిపోయారు. అతని యొక్క తల్లి ఉమ్ము ఖుహాఫా వచ్చి తన కొడుకును వెంట తీసుకొని వెళ్ళింది. ఇంట్లోకి తీసుకెళ్లాక కొంత క్షణం, కొంత సమయం గడిచింది. స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన వెంటనే తల్లి తీసుకొచ్చి నీళ్లు ఇస్తుంది, నాన్న ఈ నీళ్లు త్రాగి కొంచెం ఓదార్పు వహించి నీవు విశ్రాంతి తీసుకో. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు చెబుతారు, లేదు లేదు, ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితి ఏముందో ఒకసారి నాకు తెలపండి. తల్లి అంటుంది, నాన్న నువ్వు కొంచెం మేలుకున్నాక, విశ్రాంతి తీసుకొని నీ శరీరంలోని ఈ అవస్థలు కొంచెం దూరమయ్యాక వెళ్లి నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాచారాన్ని తెలుసుకుంటూ. కానీ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒప్పుకోలేదు. ఉమ్మె జమీల్ ను పిలవండి అని తల్లికి చెప్పారు. ఎవరు? హజ్రత్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క సోదరి. అప్పటికి ఆమె ఇస్లాం స్వీకరించింది కానీ స్వయంగా ఉమర్ కు తెలియదు. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి వద్దకు ఉమ్మె జమీల్ వచ్చింది. అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమ్మె జమీల్ చెవిలో ఒక మాట మాట్లాడారు, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్షేమ విషయాలు తెలుసుకున్నారు. ఆయన బాగున్నారు, స్వస్థతగా ఉన్నారు అని తెలిసినప్పుడు అప్పుడు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారికి నెమ్మది, ఎంతో ఆనందం ఏర్పడింది. అయినా శరీరంలో స్వయంగా నడిచి వెళ్లే అటువంటి శక్తి లేదు, కానీ అమ్మ యొక్క సహాయంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. ప్రవక్తను చూసుకున్న తర్వాత ఆయన శరీరంలోని అవస్థలన్నీ దూరమైనట్లు ఆయనకు ఏర్పడ్డాయి. అల్లాహు అక్బర్. ఇలాంటి ప్రేమ వెలిబుచ్చేవారు. ఇలాంటి విశ్వాసం వారిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల. అల్లాహ్ ను విశ్వసించిన తర్వాత అల్లాహ్ ఆరాధనపై నిలకడగా ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను విశ్వసించి, ప్రవక్త బాటను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఈ విధంగా వారు జీవితం గడిపారు. ఈ రోజుల్లో మన పరిస్థితి ఏముందో ఒకసారి గమనించండి. అబూబకర్ ఎవరు అబూబకర్? అల్లాహు అక్బర్! అబూబకర్, ఆయనను ప్రశంసిస్తూ ఖురాన్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పేరు చెప్పకుండా ఆయన ఉత్తమ గుణగణాలను ప్రస్తావిస్తూ ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు.

ఏ ఒక్క క్షణం పాటు కూడా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విడని వారు. అల్లాహ్ ధర్మం కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సైగను చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మం కొరకు ఏం అవసరం ఉంది అని చెప్పక ముందే గ్రహించి తన ఆస్తిని, తన సంతానాన్ని, తనకు తానును అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త గురించి త్యాగం చేసేవారు.

ఎప్పుడైతే మక్కా నుండి మదీనా వలస పోవడానికి అనుమతి వచ్చిందో, ఎందరో ముస్లింలు మదీనా వైపునకు వలస పో సాగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎన్నో సార్లు నాకు కూడా అనుమతి ఇస్తున్నారా మదీనా వెళ్ళడానికి అని అంటే, ప్రవక్త చెప్పేవారు, లేదు, ఓపిక వహించు, అల్లాహు త’ఆలా నీకు ఏదైనా మంచి స్నేహితం ప్రసాదించవచ్చు. అంటే నీ ఈ వలస ప్రయాణంలో నీకు ఎవరైనా మంచి తోడు లభించవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ వైపు నుండి వారికి అనుమతి లభించిన తర్వాత అబూబకర్ కు తెలిపారు, మన ఇద్దరము కలిసి వలస ప్రయాణానికి వెళ్తాము. మంచి రెండు వాహనాలను, ఒంటెలను సిద్ధపరిచి ఉంచు. అప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు రెండు ఒంటెలను మంచిగా సిద్ధపరిచి ఉంచారు. అబూబకర్ ఉద్దేశం ఈ రెండు ఒంటెలు స్వయంగా తమ ఖర్చుతో ఆయన తయారు చేసి ఉంచారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒప్పుకోలేదు. ప్రవక్త ఉపయోగించడానికి ఏ ఒంటెను తీసుకోవాలనుకున్నారో దాని యొక్క ఖరీదు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హుకు చెల్లించారు. అంతే కాదు, ఈ వలస ప్రయాణంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, అల్లాహు అక్బర్! ఎన్నో మహిమలు జరుగుతాయి. ప్రతిసారి హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క ఘనత మరియు ఆయన యొక్క విశిష్టత ఇంకా స్పష్టమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటి నుండి కదిలి వెళ్లారో, అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు వచ్చారు. ఒంటెలపై ప్రయాణం చేస్తూ ఘారె థౌర్ లోకి వెళ్లి అక్కడ శరణు తీసుకున్నారు. ఆ సందర్భంలో ముందు స్వయంగా అబూబకర్ ఆ ఘార్ లోపలికి వెళ్లారు, ఆ గుహ లోపలికి వెళ్లారు. ఘార్ అంటే గుహ, థౌర్ అక్కడ దాని యొక్క పర్వతం పేరు అందులోని ఒక గుహ. ఆ గుహలో ముందు అబూబకర్ వెళ్లారు ఎందుకు? అక్కడ ఏదైనా పురుగు పూసి, ఏదైనా విషకాటు వేసే అటువంటి విషపురుగులు ఉండకూడదు, ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా అవస్థ కలగకూడదు అని. అక్కడంతా పరిశుభ్ర చేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి పిలిచారు. మరియు ఆ సందర్భంలో ఒకచోట రంధ్రాన్ని చూస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రపోతున్నారు. ఆయనకు ఎలాంటి బాధ కలగకూడదు అని, ఏదైనా ఆ రంధ్రంలో నుండి విషపురుగు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వయంగా ఆయనను గానీ కాటు వేయకూడదు అన్న భయంతో తన ఒక కాలును, తన యొక్క పాదాన్ని ఆ రంధ్రానికి ఆనించి ఉంచారు. కొంతసేపటికి ఏదో విషపురుగు కాటేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా బాధ కలుగుతుంది, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల అబూబకర్ తోడపై ఉంది. నేను కదిలానంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిద్ర చెడిపోతుంది, ఆయన మేలుకుంటారేమో అన్న భయంతో కదలకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అల్లాహు అక్బర్! ఎంతటి గొప్ప త్యాగం ఒకసారి గ్రహించండి మీరు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క లుఆబ్ ముబారక్ అంటే లాలాజలాన్ని ఆ విషకాటు, విషపురుగు కాటేసిన చోట పెడతారు, అప్పటికప్పుడే నయమైపోతుంది. ప్రయాణంలో వెళుతున్నప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒకసారి ప్రవక్తకు ముందు, ఒకసారి ప్రవక్త వెనక, ఒకసారి ప్రవక్త కుడి వైపున, మరొకసారి ప్రవక్త ఎడమ వైపున ఈ విధంగా ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో అడిగారు, అబూబకర్ ఇలా వెనక, ముందు, కుడి, ఎడమ ఈ విధంగా ఎందుకు మీరు మారుస్తున్నారు స్థలం వెళుతూ వెళుతూ? అప్పుడు అబూబకర్ చెప్పారు, నాకు ఎప్పుడైతే భయం ఏర్పడుతుందో, శంకిస్తానో, ఇటు నుంచి ముందు నుండి ఎవరైనా శత్రువులు ఎదురవుతారా ఆ సందర్భంలో మీకు ఏ హాని కలగకుండా, మీపై ఎలాంటి బాణం రాకుండా నేను ముందుకు వెళ్తాను. నాకు ఎప్పుడైతే ఏదైనా వెళుతూ వెళుతూ ప్రాంతంలో ఇటువైపున ఏదైనా రాళ్ల వెనక ఎవరైనా దాగి ఉండవచ్చును, ఎవరైనా ఏదైనా అక్కడ నుండి బాణం విసురుతారా, ఏదైనా శత్రువు అక్కడ నుండి ఏదైనా దాడి చేస్తాడా అని భయం కలిగినప్పుడు నేను కుడి వైపున వస్తాను, ఎడమ వైపున భయం కలిగినప్పుడు ఎడమ వైపు వెళ్తాను, వెనక వైపు భయం కలిగినప్పుడు వెనక వెళ్తాను. ఈ విధంగా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాపాడడానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ హాని కలగకుండా ఉండడానికి ఇంతగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట ఈ వలస ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ అవసరం పడుతుందో అని తన వద్ద ఉన్న డబ్బు ధనం మొత్తం వెంట తీసుకొని వెళ్లారు. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ వారి ఇంటి వారి గురించి వదిలి వెళ్లారు. అల్లాహు అక్బర్! సోదర సోదరీమణులారా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు మొట్టమొదటిసారిగా పురుషులలో ఇస్లాం స్వీకరించిన వ్యక్తి యొక్క ఈ అమూల్యమైన గాధను మనం వింటూ ఉన్నాము. అల్లాహ్ యొక్క దయతో ఈయన యొక్క జీవితంలోని మరెన్నో మంచి విషయాలు మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క వివిధ సందర్భాలలో వివిధ రకాల ధైర్య సాహసాలు, ఇస్లాం ప్రాప్తి కొరకు, వ్యాపించడానికి ఆయన చేసినటువంటి కృషి ఇంత అంత కాదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రతి సమయంలో సులభతరమైన స్థితి గానీ, కష్టతరమైన పరిస్థితి గానీ అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అండదండగా ఉన్నారు. బద్ర్ యుద్ధం సంఘటన, దాని యొక్క వివరాలు ఎవరికీ తెలియవు? తెలియని వారు చదవండి, తెలుసుకోండి. కేవలం 313 వరకు ఇటువైపు నుండి ముస్లింలు మరియు అటువైపు నుండి అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని ఈ భూమి మీద నుండి నశింపజేయాలి అన్నటువంటి ఒక తప్పుడు ఉద్దేశ్యాన్ని తీసుకుని వెయ్యి కంటే ఎక్కువ మంది వస్తారు. ధర్మాధర్మాల మధ్య, సత్యాసత్యాల మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో రెండు చేతులు ఎత్తి అల్లాహ్ తో దుఆ చేస్తున్నారు, దుఆ చేస్తున్నారు. ఓ అల్లాహ్ నీ ధర్మాన్ని కాపాడడానికి, నీ ధర్మంపై స్థిరంగా ఉండడానికి, నీ ధర్మం నలువైపులా వ్యాపించడానికి ఈ కొంతమంది తమ ప్రాణాలు తమ చేతిలో తీసుకుని ఏదైతే వచ్చారో, నీవు వారిని స్వీకరించు, నీ ధర్మాన్ని కాపాడు, నీ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే వచ్చారో వారి నుండి మమ్మల్ని, నీ ధర్మాన్ని అన్నిటిని కాపాడేవారు నువ్వే. దుఆ చేస్తూ ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. చేతులు ఎత్తి దుఆ ఎక్కువ సేపు చేయడం మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భుజాల మీద ఉన్నటువంటి ఆ దుప్పటి కింద జారిపడిపోతుంది. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ విషయం చూసి, ఆ సంఘటన చూసి వచ్చి ఆ దుప్పటి కింది నుండి తీసి ప్రవక్త భుజాల మీద వేస్తూ, ప్రవక్తా ఇక సరిపుచ్చుకోండి, ఆపేయండి, అల్లాహు త’ఆలా తప్పకుండా మీ విన్నపాన్ని ఆమోదిస్తాడు, మీరు చేస్తున్న ఇంతటి ఈ దుఆలను తప్పకుండా స్వీకరిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తి ఇవ్వను సాగారు. ఆ తర్వాత ఉహద్ యుద్ధం గానీ, ఆ తర్వాత కందక యుద్ధం గానీ, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే వరకు ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో, ప్రతి యుద్ధంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోడుగా వెంట వెంటనే ఉన్నారు.

చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయాక సహాబాల పరిస్థితి ఏమైంది? అలాంటి సందర్భంలో కూడా హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెక్కుచెదరకుండా, కదలకుండా ఎంతో ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో, నిలకడగా ఉన్నారు. ఆ సంఘటన మీరు బహుశా విని ఉండవచ్చును.

ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకాన్ని వీడిపోయారో, మలకుల్ మౌత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారి ఆత్మను తీసుకున్నారో, కేవలం ఈ భౌతిక కాయం హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారి యొక్క ఇంట్లో మంచముపై ఉన్నది. ఈ విషయం వెంటనే మదీనాలో ఉన్నటువంటి ముస్లింలందరికీ తెలిసిపోయింది. అందరూ చాలా బాధతో రోధిస్తూ మస్జిద్-ఎ-నబవీలో సమూహం అవుతారు. కానీ ఎంతో ధైర్యవంతుడు, ఎంతో శూరుడు, యుద్ధ మైదానాలలో ఎందరినో చిత్తు చేసినటువంటి ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన కూడా ప్రవక్త మరణించారు అన్న విషయాన్ని భరించలేకపోతున్నారు. ఏమన్నారు? ప్రవక్త మరణించలేదు. మూసా అలైహిస్సలాం ఎలాగైతే కొద్ది రోజుల గురించి వేటికి వెళ్లారో అల్లాహ్ తోనే కలుసుకోవడానికి, మళ్లీ తిరిగి వచ్చారో అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్లారు, చనిపోలేదు. ఎవరైనా ముహమ్మద్ చనిపోయారు అని అనేది ఉంటే నేను అతనిని నా ఈ తల్వారితో నరికేస్తాను అన్నటువంటి నినాదం కూడా మొదలు పెట్టారు. ఆ సమయంలో అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు కొంత దూరంలో ఉన్నారు. ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణ వార్త తెలిసిన వెంటనే వచ్చేస్తారు. ముందు తమ కూతురు ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి యొక్క శుభ భౌతిక కాయం ఉన్న ఆ గదిలో వస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దుప్పటి కప్పి ఉంటుంది. ముఖము పై నుండి దుప్పటి తీస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నొసటి మీద చుంబిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు అంటారు, కేవలం అల్లాహ్ మాత్రమే ఎలాంటి మరణం లేనివాడు, ఎల్లకాలం శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు రెండు మరణాలు లేవు, ఒకే ఒక మరణం ఏదైతే ఉండెనో అది వచ్చేసింది, మీరు చనిపోయారు. అప్పటికీ ముస్లింల యొక్క ఈ పరిస్థితి, వారి యొక్క బాధ, మరోవైపున హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క నినాదం, హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇవన్నీ చూస్తారు. వెళ్లి ఉమర్ ను కూర్చోమని చెప్తారు, కానీ ఆ బాధలో అతను అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి మాటను పట్టించుకోలేకపోతారు. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు అలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాబాలను ఎలా ఓదార్చాలి, ఉమర్ ఏదైతే తప్పుడు ఆలోచనలో ఉన్నాడో ప్రవక్త మరణ బాధ కలిగి అతడు ఏ ఆవేశంలో ఉన్నాడో, అతనిని ఎలా ఓదార్చాలి, అతడి యొక్క తప్పు ఆలోచనను ఎలా సరిచేయాలి? అల్లాహు అక్బర్! అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ అబూబకర్ మీద కలిగింది. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎవరితోనూ గొడవపడలేదు, ఉమర్ ఏంటి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని ఆ సందర్భంలో ఏమీ చెప్పలేదు. వెంటనే మస్జిద్-ఎ-నబవీలో మెంబర్ పై ఎక్కారు. అల్లాహ్ యొక్క హమ్ద్-ఒ-సనా, ప్రశంసలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ తర్వాత అంటే ఖుత్బ-ఎ-మస్నూనా అని ఏదైతే అంటామో మనం సామాన్యంగా, ఆ తర్వాత

مَنْ كَانَ يَعْبُدُ مُحَمَّدًا فَإِنَّ مُحَمَّدًا قَدْ مَاتَ، وَمَنْ كَانَ يَعْبُدُ اللَّهَ فَإِنَّ اللَّهَ حَىٌّ لاَ يَمُوتُ
ఎవరైతే ముహమ్మద్ ను పూజించేవారో, ముహమ్మద్ చనిపోయారు అన్న విషయం వారు తెలుసుకోవాలి. మరి ఎవరైతే అల్లాహ్ ను పూజిస్తున్నారో, అల్లాహ్ ను ఆరాధిస్తున్నారో అల్లాహ్ శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు, ఎన్నటికీ అతనికి మరణం రాదు.

ఆ తర్వాత ఖురాన్ యొక్క ఆయత్ చదివి వినిపిస్తారు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు.

وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوْلٌۚ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ ۗ اَفَا۟ىِٕنْ مَّاتَ اَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلٰٓى اَعْقَابِكُمْ ۗ وَمَنْ يَّنْقَلِبْ عَلٰى عَقِبَيْهِ فَلَنْ يَّضُرَّ اللّٰهَ شَيْـًٔا ۗوَسَيَجْزِى اللّٰهُ الشّٰكِرِيْنَ

(వమా ముహమ్మదున్ ఇల్లా రసూలున్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహిర్ రుసుల్, అఫఇమ్మాత అవ్ ఖుతిలన్ ఖలబ్తుమ్ అలా అ’అఖాబికుమ్, వమన్ యన్ఖలిబ్ అలా అఖిబైహి ఫలన్ యదుర్రల్లాహ షైఆ, వసయజ్ జిల్లహుష్ షాకిరీన్)
ముహమ్మద్ కేవలం ఒక ప్రవక్త మాత్రమే. ఆయనకు పూర్వం కూడా ఎందరో ప్రవక్తలు గడిచిపోయారు. ఒకవేళ ఆయన మరణించినా, లేదా చంపబడినా మీరు మీ మడమల మీద వెనుతిరిగి పోతారా ఏమిటి? అలా వెనుతిరిగి పోయినవాడు అల్లాహ్ కు ఎలాంటి నష్టాన్నీ కలిగించలేడు. కృతజ్ఞత చూపే వారికి అల్లాహ్ త్వరలోనే ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. (3:144)

ఈ ఆయత్ వినగానే హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అంటారు, నా కాళ్లు నా వశంలో లేవు, నేను కింద పడిపోయాను. అవును, నేను ఈ ఆయత్ ఖురాన్ లో చదివి ఉన్నాను కానీ బహుశా అప్పుడు నేను దీని యొక్క అర్ధాన్ని, దీని యొక్క భావాన్ని ఇంత గంభీరంగా తీసుకోలేదు అని అతను ఒప్పుకున్నారు. సహాబాలందరూ ఈ ఆయత్ అప్పుడే విన్నట్లుగా వారందరూ రోధిస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు అన్న విషయం వారు ధృవీకరించుకున్నారు. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క ఈ సమయస్ఫూర్తి, ఈ ధైర్యం, ఈ సాహసం, అల్లాహ్ యొక్క సహాయం ఆయనతో ఉండడం మూలంగా ముస్లిం ఉమ్మత్ అంతా ఐకమత్యంతో నిలబడగలిగింది.

ఆ తర్వాత ప్రవక్త తర్వాత మొదటి ఖలీఫాగా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు నియమితులయ్యారు. నియమితులైన తర్వాత ఆయన ముందు ఎన్నో ఫిత్నాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. మక్కా, మదీనా మరియు తాయిఫ్ ఈ మూడు ప్రాంతాలు తప్ప దాదాపు అరేబియా ద్వీపకల్పంలో ఉన్నటువంటి అనేక తెగల వారు ఇస్లాం నుండి మళ్ళీ తిరిగి తమ పాత ధర్మం వైపునకు వెళ్ళిపోయారు. కొందరు జకాత్ ఇవ్వడానికి తిరస్కరించారు. మరికొందరు తమను తాము ప్రవక్తగా ప్రకటించుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ముస్లింల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి సమయంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోక ముందు ఉసామా బిన్ జైద్ యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఒక సైన్యాన్ని సిద్ధపరిచారో, ఆ సైన్యాన్ని పంపడానికే తీర్మానం తీసుకుంటారు. ఎందరో సహాబాలు అన్నారు, అబూబకర్, మదీనాలో మన సంఖ్య తక్కువగా ఉంది, ముస్లిం సైన్యాన్ని బయటికి పంపకండి, మనపై ఎవరైనా దాడి చేస్తారేమో. కానీ అబూబకర్ అన్నారు, లేదు, ప్రవక్త ఏదైతే తీర్మానం తీసుకున్నారో, దాన్ని నేను పూర్తి చేసి తీరుతాను. ఆ సైన్యాన్ని పంపారు. ఆ తర్వాత జకాత్ ఇవ్వని వారితో కూడా నేను యుద్ధం చేస్తాను అన్నారు. ప్రవక్తకు జకాత్ రూపంలో ఏది ఇచ్చేవారో, దానిలో ఒక చిన్న మేకపిల్లను కూడా ఎవరైనా ఇవ్వడానికి తిరస్కరిస్తే నేను అతనితో యుద్ధం చేస్తాను అన్నారు. అల్లాహు అక్బర్! ఎంతటి ధైర్యం. రెండు సంవత్సరాలు, కొన్ని నెలల కాలంలోనే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు అల్లాహ్ యొక్క దయతో, అల్లాహ్ యొక్క సహాయంతో ఇస్లాంను మళ్ళీ తిరిగి అరేబియా ద్వీపకల్పంలో స్థాపించారు. ఎవరైతే ఇస్లాంను వీడి వెళ్లారో వారిని మళ్ళీ ఇస్లాం వైపునకు తీసుకువచ్చారు.

ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి పక్కనే ఆయనకు కూడా చోటు లభించింది. సోదర సోదరీమణులారా, అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ఆయన జీవితం నుండి మనం గుణపాఠం నేర్చుకోవాలి. ప్రవక్తపై విశ్వాసం, అల్లాహ్ పై విశ్వాసం ఎలా ఉండాలి, ఇస్లాం ధర్మం కోసం ఎలాంటి త్యాగాలు చేయాలి, ఎలాంటి కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి, ఎలాంటి సాహసంతో ఇస్లాం కొరకు మనం సేవ చేయాలి అన్నటువంటి విషయాలు ఆయన జీవితం నుండి నేర్చుకోవాలి. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల యొక్క జీవిత చరిత్రలను చదివి, విని, వారి యొక్క మార్గాన్ని అవలంబించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహుమ్మ సల్లీ వసల్లిమ్ అలా నబియ్యినా ముహమ్మద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

హజ్రత్ అలీ (రది అల్లాహు అన్హు) యొక్క ధైర్య సాహసం సంఘటన [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ అలీ (రది అల్లాహు అన్హు) యొక్క ధైర్య సాహసం సంఘటన
https://youtu.be/nnPa43Zc9MM (7 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు గారి మధ్య ఉన్న లోతైన బంధం, ముఖ్యంగా హిజ్రత్ (వలస) సందర్భంలో జరిగిన ఒక చారిత్రాత్మక సంఘటన గురించి వివరించబడింది. అవిశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయడానికి ఆయన ఇంటిని చుట్టుముట్టినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పడకపై హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హును పడుకోబెట్టి, అల్లాహ్ ఆదేశానుసారం సురక్షితంగా బయటకు వెళ్లారు. హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రాణాలకు తెగించి చూపిన ధైర్యం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయనకున్న దృఢ విశ్వాసం మరియు అల్లాహ్ తన ప్రవక్తను ఎలా అద్భుతరీతిలో కాపాడాడో ఈ సంఘటన వివరిస్తుంది. సూరా యాసీన్ లోని ఒక ఆయత్ పఠిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్ల ముందే వెళ్లినా, అల్లాహ్ వారి చూపును నిరోధించడం వల్ల శత్రువులు ఆయనను చూడలేకపోయారు.

అబూ తాలిబ్ అంత ధనవంతులు కారు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యవ్వనంలో అడుగుపెట్టిన వెంటనే, ఆయన ఒకరిపై భారంగా ఉండకుండా స్వయంగా తన కాళ్లపై నిలబడాలన్న ఉద్దేశంతో వ్యాపారం మొదలుపెట్టారు. అందుకై ప్రయాణం కూడా చేశారు. సిరియా ఇంకా వేరే దేశాలలో. అంతేకాకుండా అబూ తాలిబ్ సంతానంలోని ఒక కుమారుడైనటువంటి అలీ, అతన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఒడిలోకి తీసుకొని, ఆయన ఖర్చులు స్వయంగా తాను భరిస్తూ ఆయనను పోషించసాగారు.

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంలోని ఎన్నో ఉత్తమ గుణాలు హజ్రత్ అలీలో కూడా అబ్బాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిక్షణలో మంచి విధంగా హజ్రత్ అలీ శిక్షణ పొందుతూ, ఇంచుమించు 22, 23 సంవత్సరాల వయసులో ఉండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మదీనా వలస పోవాలని ఆదేశం ఇవ్వబడినది.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? ఏ రాత్రి హిజ్రత్ చేయాలని, వలస పోవాలని అనుకున్నారో, ఆ రాత్రి తన పడకపై హజ్రత్ అలీని పడుకోబెట్టారు. అల్లాహు అక్బర్. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రోజు ఏ సమయంలోనైనా తమ ఇంటి నుండి బయలుదేరి వేరే ఏదో ప్రాంతానికి వలసపోతారని అటు అవిశ్వాసులకు తెలిసింది. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇంటిని ముట్టడించారు. చుట్టుగా ఎలా గుమిగూడారో తెలుసా? వారు ప్రత్యేకంగా ద్వారము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటి నుండి ఏ ద్వారం నుండి బయలుదేరుతారో, ఆ ద్వారంలో రెండు వరుసలుగా కొంతమంది నిలబడ్డారు. అస్తగ్ఫిరుల్లాహ్. ఏ ఉద్దేశంతో నిలబడ్డారు? న’ఊదు బిల్లాహ్ సుమ్మ న’ఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరుతారో, అందరూ ఒకేసారి, ఒకే దెబ్బ మీద వారిని హత్య చేసినట్లుగా, వారి యొక్క పరిహారం ఏ ఒక్కరిపై కాకుండా అందరిపై పడితే, ప్రవక్త ముహమ్మద్ వారి వంశం వారు, ఫ్యామిలీ వారు ఎవరూ కూడా పరిహారం కొరకు ఎవరినీ మందలించలేరు, అడగలేరు. అలాంటి దురుద్దేశాలతో వారు ఇంటిని ముట్టడించి వేచి చూస్తూ ఉన్నారు.

ఆ సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ అలీకి ధైర్యం ఇచ్చారు, బోధ చేశారు, తన తమ పడక మీద పడుకోవాలని చెప్పారు. హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త వారి మాటను అలాగే ఆచరించారు.

ఒక్కసారి ఆలోచించండి. హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క విశ్వాసం, ఆయన యొక్క దృఢ నమ్మకం, ఆయన యొక్క ధైర్యం. ఏ పడక మీద పడుకుంటున్నారు? శత్రువులంతా వేచి చూస్తున్నారు మరియు బయటికి వెళ్తేనే అందరి యొక్క తలవార్ల కింద వచ్చేసి ముక్కలైపోయేటువంటి సమయం. కానీ దానికి ఒప్పుకొని ఎంత ధైర్యంగా ఉన్నారో గమనించండి. కానీ మరోవైపున ఎంత గొప్ప మహిమ జరిగింది. అల్లాహు అక్బర్.

ఇక్కడే మనకు ఒక విషయం తెలుస్తుంది. ప్రపంచం వారందరూ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని పన్నాగలు పన్నినా, అటు సృష్టికర్త వారి కుట్రలన్నిటినీ కూడా నాశనం చేయడానికి, వారి పన్నాగాలన్నిటినీ కూడా వృథా చేయడానికి ఒకే ఒక్కడు సరిపోతాడు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయటికి వెళ్లారు. తమ చేతిలో కింది నుండి మట్టి ఎత్తారు. అల్లాహ్ పేరుతో వారి ముఖాల మీద చల్లారు. మరియు

وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ
(వ జ’అల్నా మిమ్ బైని అయ్దీహిమ్ సద్దవ్ వ మిన్ ఖల్ఫిహిమ్ సద్దన్ ఫ అగ్ షైనాహుమ్ ఫహుమ్ లా యుబ్సిరూన్)
మేము వారి ముందు ఒక అడ్డును, వారి వెనుక మరో అడ్డును పెట్టాము. ఆ విధంగా మేము వారిని కప్పివేశాము. తత్కారణంగా వారు చూడలేరు. (36:9)

సూరా యాసీన్ లోని ఒక ఆయత్ ఇది. చదువుకుంటూ వారి మధ్యలో నుండే, రెండు వరుసలు ఏవైతే ఉన్నాయో, ఆ రెండు వరుసల మధ్యలో నుండే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాటారు. కానీ, అల్లాహు అక్బర్, ఈ కంటిలో చూపు ప్రసాదించింది ఎవరు? ఆ సృష్టికర్త. ఆ సృష్టికర్తయే ఆ శత్రువుల చూపులన్నిటినీ ఆపేసుకున్నాడు, తన ప్రవక్తను దాటించుకున్నాడు. అల్లాహు అక్బర్.

ప్రవక్త కేవలం ఒక పిడికెడు మట్టి తీసి వారిపై చల్లి ఈ ఆయత్ చదువుకుంటూ వెళ్లిపోయారు. వారు ఏమీ చూడలేకపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో దూరం వెళ్లిపోయిన తర్వాత, వీరు అక్కడే ఉన్నారు. అటు నుంచి ఒక వ్యక్తి దాటుతూ, “మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?” అని అడిగాడు. వారన్నారు, “మేము ముహమ్మద్ కొరకు వేచి చూస్తున్నాము.” అయితే ఆ మనిషి చెప్పాడు, “ఇంతకుముందే నేను చూశాను ముహమ్మద్ ను అటువైపున వెళ్తున్నది.” వారందరూ ఆశ్చర్యపడ్డారు. చూసుకున్నారు కళ్లను ఒకసారి, “ఏమైంది? మేము కళ్లు తెరిచి, కళ్లు మూయకుండా మేము చూస్తూనే ఉన్నాము కదా దారిని. మా కళ్ల ముందు నుండి ఎలా వెళ్లిపోయాడు?”

చూసుకునేసరికి వారి కళ్ల మీద నుండి దుమ్ము శుభ్రం చేసుకుంటూ, చేతిలో ఉన్న పిట్ట ఎలా జారిపోతుందో ఆ విధంగా వారికి అనిపించింది. కానీ, ఏదో ఒక రకంగా ఇంట్లో తొంగి చూశారు. చూసేసరికి, పడక మీద మనిషి పడుకున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది. అయితే అప్పుడు వారికి అనిపించింది, “వాడెవడో మమ్మల్ని పిచ్చోడ్ని చేయడానికి అలా చెప్పాడు, ముహమ్మద్ లోపలే పడుకొని ఉన్నాడు కదా,” అని వారు మరింత తృప్తి చెందారు.

మరికొంత సమయం గడిసింది. లోపలి నుండి బయటికి రావట్లేదు. అయితే బలిమిగా తలుపు తీసి మేల్కొలిపే ప్రయత్నం చేశారు. చూసేసరికి, వారి పాదాల కింది నుండి భూమి కదిలిపోయినట్లు ఏర్పడింది. పడకలో ఉన్నవారు ముహమ్మద్ కాదు, అలీ. గద్దించి, బెదిరించి, కొట్టి ప్రశ్నించారు. అలీ చెప్పారు, “నాకేమి తెలుసు? ఎటు వెళ్లారో, ఎక్కడికి వెళ్లారో.” చాలా బెదిరించారు, కొట్టారు కూడా. కానీ అలీ రదియల్లాహు త’ఆలా అన్హుకు స్వయంగా తెలియదు ఎటువైపున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్లారు అన్న విషయం.

ఇది హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క ధైర్యసాహసం యొక్క సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వలస వెళ్లే సందర్భంలో.