షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 1 – నసీరుద్దీన్ జామిఈ  [వీడియో | టెక్స్ట్]

షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 1
https://youtu.be/dYx8j7WAV9k [43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు

أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ
అస్అలుల్లాహల్ కరీమ్, రబ్బల్ అర్షిల్ అజీం అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్
(పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ ను అర్థిస్తున్నాను: ఇహపరలోకాల్లో నిన్ను వలీ* గా చేసుకొనుగాక మరియు నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక)

وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة
(వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్ వ ఇజబ్తులియ సబర్ వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్)
(ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం (పొరపాటు) జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉంది)

[*] వలీ అంటే అల్లాహ్ యొక్క సన్నిహితుడు, అతడికి అల్లాహ్ సన్మార్గం చూపుతాడు, సద్భాగ్యం ప్రసాదిస్తాడు, అతనికి సహాయసహకారాలు అందిస్తాడు.

ఈ ప్రసంగంలో, ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్) రచించిన “అల్-ఖవాయిద్ అల్-అర్బా” (నాలుగు నియమాలు) అనే పుస్తకం యొక్క పరిచయం మరియు ప్రారంభ దుఆల గురించి వివరించబడింది. ఇస్లాం యొక్క పునాది అయిన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ప్రాముఖ్యతతో ప్రసంగం ప్రారంభమవుతుంది. తౌహీద్‌ను షిర్క్ నుండి వేరు చేయడానికి ఇమామ్ ఈ పుస్తకాన్ని రచించారని, మరియు పాఠకుల కోసం దుఆతో ప్రారంభించడం ఆయన పద్ధతి అని వక్త పేర్కొన్నారు. మూడు ముఖ్యమైన దుఆలు వివరించబడ్డాయి: 1) అల్లాహ్ ఇహపరలోకాలలో తన వలీ (మిత్రుడు)గా చేసుకోవాలని కోరడం. 2) ఎక్కడ ఉన్నా ముబారక్ (శుభవంతుడు)గా చేయమని ప్రార్థించడం. 3) అనుగ్రహం పొందినప్పుడు కృతజ్ఞత (షుక్ర్), పరీక్షకు గురైనప్పుడు సహనం (సబ్ర్), మరియు పాపం చేసినప్పుడు క్షమాపణ (ఇస్తిగ్ఫార్) కోరే వారిలో చేర్చమని వేడుకోవడం. ఈ మూడు గుణాలు సౌభాగ్యానికి మరియు సాఫల్యానికి ప్రతీకలని వక్త నొక్కిచెప్పారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

ప్రియ వీక్షకులారా, అల్హందులిల్లాహి హందన్ కసీరా. ఇస్లాం ధర్మానికి పునాది అయినటువంటి కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్, దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు ఉన్నాయి. అయితే 1115వ హిజ్రీ శకంలో జన్మించినటువంటి ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్, ఆయన ఈ సౌదీ అరబ్‌లోని రియాద్ క్యాపిటల్ సిటీకి దగ్గర దిర్ఇయ్యాలో జన్మించారు. ఆయన ధర్మ విద్య నేర్చుకున్న తర్వాత ధర్మ ప్రచారం మొదలుపెట్టిన సందర్భంలో ఇక్కడ ఈ అరబ్ ప్రాంతంలో, వారి చుట్టుపక్కల్లో అనేక మంది ముస్లింలు చాలా స్పష్టమైన షిర్క్ చేస్తుంటే చూశారు. వారు చేస్తున్న ఆ షిర్క్ పనులు, వాటిని వారు షిర్క్ అని భావించడం లేదు. ఈ రోజుల్లో అనేక మంది ముస్లింలలో ఉన్నటువంటి మహా భయంకరమైన అజ్ఞానం అనండి, పొరపాటు అనండి, అశ్రద్ధ అనండి, వారు ఏ షిర్క్‌లో ఉన్నారో దానిని షిర్క్ అని భావించడం లేదు. అయితే ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వారి ముందు వారు చేస్తున్న ఆ పనులన్నిటినీ కూడా షిర్క్ అని స్పష్టపరిచారు. దానికై ఎన్నో సంవత్సరాలు చాలా కృషి చేశారు. ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయితే ఈ దావా ప్రచారంలో ఆయన కేవలం చెప్పడం ద్వారానే కాదు, ప్రజల వద్ద ఆధారాలు స్పష్టంగా ఉండాలి, ఇంకా ముందు తరాల వారికి కూడా తెలియాలి అని కొన్ని చిన్న చిన్న రచనలు, పుస్తకాలు కూడా రచించారు. ఉసూల్ ఎ సలాసా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా, కష్ఫుష్ షుబహాత్ ఇంకా ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి పుస్తకం అల్-ఖవాయిద్ ఉల్-అర్బా. నాలుగు నియమాలు. నాలుగు మూల పునాది లాంటి విషయాలు. దేనికి సంబంధించినవి? ఈ నాలుగు నియమాలు వీటిని మనం తెలుసుకున్నామంటే తౌహీద్‌లో షిర్క్ కలుషితం కాకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త పడగలుగుతాము.

అయితే ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారి అలవాటు ఏమిటంటే, ఆయన ఎక్కడ బోధ చేసినా గాని, ఏ పుస్తకాలు రచించినా గాని సర్వసామాన్యంగా పాఠకులకు, విద్యార్థులకు ముందు దీవిస్తారు, దుఆలు ఇస్తారు, ఆశీర్వదిస్తారు. అల్లాహ్‌తో వీరి గురించి ఎన్నో మేళ్ళను కోరుతారు. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ పద్ధతి ఇది.

అయితే రండి, ఏ ఆలస్యం లేకుండా మనం ఈ పుస్తకం చదవబోతున్నాము. మధ్యమధ్యలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చూపిస్తాను కూడా. అయితే అసలు నాలుగు నియమాలు చెప్పేకి ముందు ఒక నాలుగు రకాల మంచి దుఆలు ఇస్తారు, ఆ తర్వాత తౌహీద్‌కు సంబంధించిన ఒక మూల విషయం తెలియజేస్తారు, ఆ తర్వాత ఆ నాలుగు నియమాలు చెప్పడం మొదలుపెడతారు. అయితే ఇది చాలా చిన్న పుస్తకం. మనం ఆ విషయాలను కొంచెం వివరంగా తెలుసుకుంటాము. మంచిగా అర్థం కావడానికి, మన సమాజంలో ఉన్నటువంటి షిర్క్‌ను మనం కూడా ఉత్తమ రీతిలో ఖండిస్తూ ప్రజలను ఈ షిర్క్ నుండి దూరం ఉంచడానికి.

సోదర మహాశయులారా,

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో.

ద్వారా పుస్తకం ప్రారంభిస్తున్నారు. మనకు తెలిసిన విషయమే ఖురాన్ గ్రంథం యొక్క ప్రారంభం కూడా బిస్మిల్లాహ్ నుండే అవుతుంది. ఏ పని అయినా మనం బిస్మిల్లాహ్, అల్లాహ్‌ యొక్క శుభ నామంతో మొదలుపెట్టాలి. అప్పుడే అందులో మనకు చాలా శుభాలు కలుగుతాయి. అల్లాహ్‌, ఇది మన అందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ యొక్క అసలైన పేరు. ఆ తర్వాత రెండు పేర్ల ప్రస్తావన వచ్చింది, అర్-రహ్మాన్, అర్-రహీమ్. ఇందులో అల్లాహ్‌ యొక్క విశాలమైన కారుణ్యం, ప్రజలపై ఎడతెగకుండా కురుస్తున్నటువంటి కారుణ్యం గురించి చెప్పడం జరిగింది.

సోదర మహాశయులారా, సోదరీమణులారా దీని ద్వారా మనం గమనించాలి ఒక విషయం. అదేమిటంటే అల్లాహ్‌ త’ఆలా యొక్క పేర్లు, అల్లాహ్‌ యొక్క శుభ నామములు వాటిని సమయ సందర్భంలో దృష్టి పెట్టుకొని, ఎక్కడ ఎలాంటి పేరు ఉపయోగించాలి, ప్రత్యేకంగా దుఆ చేస్తున్నప్పుడు మనం అల్లాహ్‌తో ఏ విషయం కోరుతున్నాము, అడుగుతున్నాము, అర్ధిస్తున్నాము, దానికి తగిన అలాంటి భావం గల అల్లాహ్‌ యొక్క పేర్లు ఉపయోగించడం ద్వారా మనం చాలా లాభం పొందగలుగుతాము మరియు అలాంటి దుఆలు త్వరగా స్వీకరించబడతాయి కూడా.

ఇక ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ చెబుతున్నారు,

أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ
అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక్ ఫిద్దున్యా వల్ ఆఖిరహ్.
పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్‌ను అర్ధిస్తున్నాను, ఇహపరలోకాల్లో అల్లాహ్‌ నిన్ను వలీగా చేసుకొనుగాక.

సోదర మహాశయులారా, ఇక్కడ మీరు చూశారు, ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్‌ త’ఆలా నిన్ను ఇహపరలోకాలలో వలీగా చేసుకొనుగాక. మొదటి దుఆ ఇది. ఆ తర్వాత మరో రెండు దుఆలు కూడా ఉన్నాయి. ఈ దుఆ ప్రస్తావించేకి ముందు, అస్అలుల్లాహ్ అల్-కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్. అల్లాహ్‌ యొక్క రెండు పేర్లు, అల్లాహ్‌ యొక్క సృష్టిలో అత్యంత మహా పెద్దగా ఉన్నటువంటి ఆ సృష్టికి నీవు ప్రభువు అన్నటువంటి ఆ సృష్టి ప్రస్తావన ఇక్కడ చేశారు.

అల్-కరీమ్, అల్లాహ్‌ యొక్క పేరు. గత రమదాన్‌లో అల్హందులిల్లాహ్ అల్లాహ్‌ యొక్క శుభ నామముల గురించి దర్స్ ఇవ్వడం జరిగింది. నా YouTube ఛానల్‌లో మీరు చూడవచ్చు, అల్లాహ్‌ యొక్క ఎన్నో పేర్ల గురించి వివరం అక్కడ ఇవ్వడం జరిగింది. అల్-కరీమ్, ఎక్కువగా కరం చేసేవాడు, దాతృత్వ గుణం గలవాడు, ఎక్కువగా ప్రసాదించేవాడు. పరమదాత అని ఇక్కడ అనువాదం చేయడం జరిగింది. ధర్మవేత్తలు అంటారు అల్లాహ్‌ యొక్క ఈ పేరు అల్-కరీమ్‌లో మరెన్నో ఉత్తమ పేర్లు వచ్చేస్తాయి. ఎన్నో ఉత్తమ పేర్ల భావాలు ఇందులో వచ్చేస్తాయి.

ఆ తర్వాత రబ్. రబ్ అంటే మనం తెలుగులో సర్వసామాన్యంగా ప్రభువు అని అనువదిస్తాము. అయితే ఇమామ్ తబరీ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, రబ్ అన్న ఈ పదం యొక్క భావంలో సృష్టించడం, పోషించడం, ఈ విశ్వ వ్యవస్థను నడిపించడం ఈ మూడు భావాలు తప్పనిసరిగా వస్తాయి. ఎవరిలోనైతే ఈ మూడు రకాల శక్తి, సామర్థ్యాలు, గుణాలు ఉన్నాయో, అలాంటివాడే రబ్ కాగలుగుతాడు. అతను ఎవరు? అల్లాహ్‌.

ఆ తర్వాత ఇక్కడ గమనించాల్సిన విషయం, అల్-అర్షిల్ అజీమ్. రబ్, ఎవరికి రబ్? సర్వమానవులకు రబ్. సర్వ జిన్నాతులకు రబ్. సర్వలోకాలకు రబ్ అల్లాహ్‌ మాత్రమే. కానీ ఇక్కడ దుఆ చేస్తూ అల్-అర్షిల్ అజీమ్ అని చెప్పడం జరిగింది. ధర్మవేత్తలు అంటారు, షేక్ అబ్దుర్రజాక్ అల్-బద్ర్ హఫిదహుల్లాహ్, షేక్ అబ్దుల్ ముహ్సిన్ అల్-ఖాసిమ్ మస్జిద్-ఎ-నబవీ యొక్క ఇమామ్ ఇంకా వేరే ఎందరో పెద్ద పెద్ద పండితులు అరబీలో ఈ పుస్తకాన్ని వివరించారు. వారు ఇక్కడ ఒక మాట ఏం చెబుతున్నారు? సర్వసృష్టిలో అల్లాహ్‌ యొక్క అర్ష్ చాలా పెద్దది, బ్రహ్మాండమైనది. అయితే అల్లాహ్‌ యొక్క గొప్ప తౌహీద్ విషయంలో ముందు కొన్ని ముఖ్య బోధనలు వస్తున్నాయి, అందుకు అల్లాహ్‌ యొక్క సృష్టిలో అత్యంత బ్రహ్మాండమైన, పెద్ద సృష్టికి నీవు ప్రభువు అని ఇక్కడ అర్ధించడం జరుగుతుంది.

ఖురాన్‌లో అర్ష్ యొక్క గుణంలో దానితోపాటు అల్-అర్షిల్ కరీమ్, అల్-అర్షిల్ అజీమ్, అల్-అర్షిల్ మజీద్ అన్నటువంటి ప్రస్తావన వచ్చి ఉంది. అయితే అర్ష్ ఎంత పెద్దగా ఉన్నది ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క హదీసులో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా మీరు విని ఉన్నారు, ఖురాన్ వ్యాఖ్యానాలలో, అలాగే ప్రత్యేకంగా ఆయతుల్ కుర్సీ యొక్క వ్యాఖ్యానంలో కూడా ఈ మొత్తం భూమ్యాకాశాలు, విశ్వం ఇదంతా ఒక చిన్న ఉంగరం మాదిరిగా కుర్సీ ముందు, ఆ కుర్సీ ఈ బ్రహ్మాండమైన విశ్వం లాంటిగా మనం భావిస్తే, దాని ముందు ఈ భూమ్యాకాశాలన్నీ కూడా కలిసి ఒక చిన్న ఉంగరం మాదిరిగా. అలాగే కుర్సీ, అర్ష్ ముందు ఎంత చిన్నదంటే అర్ష్‌ను మనం ఒక పెద్ద ఎడారిగా భావిస్తే అందులో కుర్సీ ఒక చిన్న ఉంగరం మాదిరిగా. అర్థమైందా? గమనించారా మీరు?

ఈ భూమ్యాకాశాలన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక చిన్న ఉంగరం మాదిరిగా. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉదాహరణ ఇస్తారంటే ఒక పెద్ద ఎడారి ఉంది, దాని మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న ఉంగరం పడి ఉన్నది. అల్లాహ్‌ యొక్క అర్ష్ ఎడారి మాదిరిగా అయితే కుర్సీ ఆ ఉంగరం లాంటిది. కుర్సీ ఆ ఎడారి లాంటిదైతే ఈ భూమ్యాకాశాలు మొత్తం విశ్వం ఆ ఉంగరం లాంటిది. అంటే ఈ మొత్తం భూమ్యాకాశాల కంటే చాలా చాలా చాలా ఎన్నో రెట్లు పెద్దగా కుర్సీ. మరియు కుర్సీ కంటే ఎన్నో రెట్లు పెద్దగా అల్లాహ్‌ యొక్క అర్ష్.

అల్లాహ్‌ రబ్బుల్ ఆలమీన్ అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు, సింహాసనంపై అల్లాహ్‌ త’ఆలా ఇస్తివా అయి ఉన్నాడు. ఇక్కడ సలఫె సాలిహీన్ యొక్క మన్హజ్, వారి యొక్క విధానం ఏమిటంటే మనం అల్లాహ్‌ యొక్క అర్ష్‌ను విశ్వసించాలి, అర్ష్‌ అంటే ప్రభుత్వం, ఏదో కేవలం శక్తి అని నమ్మకూడదు. అల్లాహ్‌ యొక్క సృష్టి అది. అత్యంత పెద్ద సృష్టి. అల్లాహ్‌ త’ఆలా దానిపై ఇస్తివా అయి ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? ఎటువైపులా ఉన్నాడు? ఈ వివరాల్లోకి మనం వెళ్ళకూడదు. అర్థమైంది కదా?

అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్. ఆ తర్వాత ఏం దుఆ చేస్తున్నారు? అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్‌ త’ఆలా నిన్ను ఇహలోకంలో, పరలోకంలో వలీగా చేసుకొనుగాక.

సోదర మహాశయులారా, ఇది చాలా గొప్ప దుఆ. అల్లాహ్‌ మనల్ని వలీగా చేసుకోవడం, మనం అల్లాహ్‌కు వలీగా అయిపోవడం, అల్లాహ్‌ మన కొరకు వలీ అవ్వడం ఇది మహా గొప్ప అదృష్టం. ఎవరైతే అల్లాహ్‌కు వలీ అవుతారో, మరి ఎవరికైతే అల్లాహ్‌ వలీ అవుతాడో, అలాంటి వారికి ఏ బాధ, ఏ చింత ఉండదు. ఖురాన్‌లో అనేక సందర్భాల్లో అల్లాహ్‌ త’ఆలా తెలియజేశాడు,

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్జనూన్.
నిశ్చయంగా అల్లాహ్‌ స్నేహితులకు భయముగానీ, దుఃఖంగానీ ఉండదు.(10:62).

జరిగిపోయిన భూతకాలం గురించి గాని, రాబోతున్న భవిష్యత్తు గురించి గాని ఎలాంటి భయము, ఎలాంటి చింత ఉండదు. ఎవరికి? అల్లాహ్‌ యొక్క వలీలకు. అంతేకాదు, ఎవరైతే అల్లాహ్‌ యొక్క వలీ అవుతారో అలాంటివారు మార్గభ్రష్టత్వంలో పడే, షిర్క్‌లో పడేటువంటి ప్రమాదం ఉండదు. అవును, సూరత్ ఆయతుల్ కుర్సీ వెంటనే ఆయత్ ఏదైతే ఉన్నదో ఒకసారి దాని తర్వాత ఆయతులు గమనించండి. ఆయతుల్ కుర్సీ తర్వాత లా ఇక్రహ ఫిద్దీన్, ఆ తర్వాత

اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ
అల్లాహు వలియ్యుల్లజీన ఆమనూ యుఖ్రిజుహుమ్ మినజ్జులుమాతి ఇలన్నూర్.
విశ్వసించినవారి వలీ గా స్వయంగా అల్లాహ్‌ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. (2:257).

అల్లాహ్‌ త’ఆలా విశ్వాసులకు వలీ. అల్లాహ్‌ తమ ఔలియాలను జులుమాత్‌ల నుండి వెలికితీసి నూర్ వైపునకు తీసుకొస్తాడు. జులుమాత్, అంధకారాలు, చీకట్లు. ఎలాంటివి? షిర్క్ యొక్క అంధకారం, బిదాత్ యొక్క అంధకారం, పాపాల అంధకారం నుండి బయటికి తీసి అల్లాహ్‌ త’ఆలా తౌహీద్ యొక్క వెలుతురులో, సున్నత్ యొక్క కాంతిలో మరియు పుణ్యాల యొక్క ప్రకాశవంతమైన మార్గంలో వేస్తాడు. గమనించారా?

మరియు ఈ గొప్ప అదృష్టాన్ని ఎలా పొందగలుగుతాము మనం? ఒకరు దుఆ ఇస్తారు. కానీ ఆ దుఆకు తగ్గట్టు మన ప్రయత్నం కూడా ఉండాలి కదా? నా కొడుకు పాస్ కావాలని దుఆ చేయండి. సరే మంచిది, చేస్తాము. కానీ కొడుకు అక్కడ ప్రిపరేషన్ కూడా మంచిగా చేయాలి కదా? నా కొడుకు ఆరోగ్యం బాగలేదు, మీరు అల్లాహ్‌ ఆరోగ్యం ప్రసాదించాలని దుఆ చేయండి. సరే మనం చేస్తాము. కానీ మందులు వాడడం గాని, డాక్టర్ వద్దకు తీసుకువెళ్లడం గాని ఇలాంటి ప్రయత్నాలు కూడా జరగాలి కదా? అలాగే మనం అల్లాహ్‌ యొక్క వలీ కావాలంటే ఏం చేయాలి?

సూరత్ ఫుస్సిలత్‌లో అల్లాహ్‌ త’ఆలా ఇచ్చినటువంటి శుభవార్త, ఆ శుభవార్త ఎవరికి ఇవ్వబడినది? ఆ పనులు మనం చేయాలి. అలాగే అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్జనూన్ అనే ఆయత్ తర్వాత సూర యూనుస్‌లో వెంటనే అల్లాహ్‌ ఏమంటున్నాడు? ఎవరు వారు ఔలియా? అల్లజీన ఆమనూ వకాను యత్తఖూన్. (10:63). ఎవరైతే విశ్వసిస్తారో, తౌహీద్‌ను అవలంబిస్తారో, భయభీతి మార్గాన్ని అవలంబిస్తారో. ఇక ఫుస్సిలత్‌లో చూస్తే ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహ్. “అల్లాహ్‌ యే మా ప్రభువు” అని పలికి, ఆ తరువాత దానికే కట్టుబడి ఉన్నవారిపై (41:30). ఎవరైతే మా యొక్క ప్రభువు అల్లాహ్‌ అని అన్నారో, సుమ్మస్తఖామూ. ఆ తౌహీద్ పై, ఆ విశ్వాసంపై, సత్కార్యాలపై స్థిరంగా ఉన్నారు. షిర్క్, బిదాత్‌లు, పాపకార్యాల యొక్క ఎలాంటి తుఫానీ గాలులు వచ్చినా గాని వారు ఏమాత్రం అటు ఇటు వంగకుండా, ఆ పాపాల్లో పడకుండా, తౌహీద్ పై, పుణ్యాలపై, సున్నత్ పై స్థిరంగా ఉండాలి. అల్లాహ్‌ త’ఆలా అల్లా తఖాఫూ వలా తహ్జనూ అని శుభవార్తలు ఇచ్చాడు. ఆ శుభవార్తలోనే ఒకటి ఏముంది? ఆ తర్వాత ఆయత్‌లో

نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
నహ్ను ఔలియా ఉకుమ్ ఫిల్ హయాతిద్దున్యా వ ఫిల్ ఆఖిరహ్.
ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూవచ్చాము. పరలోకంలో కూడా ఉంటాము. (41:31).

మేము మీ ఇహలోక జీవితంలో కూడా మీకు ఔలియా. వ ఫిల్ ఆఖిరహ్, పరలోకంలో కూడా. చూశారా దుఆ? ఏమి ఇచ్చారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్? అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్‌ నిన్ను ఇహలోకంలో, పరలోకంలో వలీగా చేసుకొనుగాక.

ఇక సోదర మహాశయులారా, ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటే ఎన్నో ఆయతులు, హదీసుల ఆధారంగా ఇవ్వవచ్చు. కానీ సమయం చాలా ఎక్కువగా అవుతుంది. కేవలం సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీసు వినిపించి, ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏం చెబుతున్నారో అది మనం విందాము, మరొక దుఆ ఏదైతే ఇచ్చారో అది కూడా మనం తెలుసుకుందాం. సహీ బుఖారీలో హదీసు ఏమిటి?

ఎవరైతే అల్లాహ్‌ యొక్క వలీలతో శత్రుత్వం వహిస్తారో, నేను స్వయంగా వారితో యుద్ధానికి సిద్ధమవుతాను” అని అల్లాహ్‌ చెప్పినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూస్తున్నారా? ఎవరైతే అల్లాహ్‌కు వలీలుగా అవుతారో, వారు అల్లాహ్‌కు ఎంత ప్రియులు అవుతారు మరియు అల్లాహ్‌ వారి వైపు నుండి ఎలా పోరాడుతాడో. కానీ అల్లాహ్‌ యొక్క ఈ వలీ కావడానికి ఏంటి? అదే హదీసులో చెప్పడం జరిగింది. అదే హదీసులో చెప్పడం జరిగింది.

అల్లాహ్‌ ఏ విషయాలైతే మనపై విధిగావించాడో వాటిని మనం తూచా తప్పకుండా, పాబందీగా పాటిస్తూ ఉండాలి. ఇక అల్లాహ్‌ విధించిన వాటిలో అత్యుత్తమమైనది, అత్యున్నత స్థానంలో, మొట్టమొదటి స్థానంలో తౌహీద్. కదా? వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహ్. సూర బఖరా ఆయత్ నెంబర్ 187 కూడా చూడవచ్చు మనం.

ఆ తర్వాత అల్లాహ్‌ త’ఆలా విధిగావించిన విషయాలు పాటించిన తర్వాత నఫిల్ విషయాలు ఎక్కువగా పాటిస్తూ ఉండడం. ఇక్కడ నఫిల్ అంటే ఎంతో మంది కేవలం నమాజులు అనుకుంటారు, కాదు. నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు, హుకూకుల్లాహ్, అల్లాహ్‌ మరియు దాసులకు మధ్య సంబంధించిన విషయాల్లో, హుకూకుల్ ఇబాద్ మరియు మన యొక్క సంబంధాలు దాసులతో ఏమైతే ఉంటాయో అన్నిటిలో కూడా కొన్ని విధులు ఉన్నాయి, మరి కొన్ని నఫిల్‌లు ఉన్నాయి. ఆ నఫిల్‌లు కూడా అధికంగా చేస్తూ ఉండాలి. అప్పుడు అల్లాహ్‌ యొక్క వలీ కావడానికి మనం చాలా దగ్గరగా అవుతాము.

లేదా అంటే ఈ రోజుల్లో ఎందరో చనిపోయిన వారిని, ఎందరో సమాధులను ఔలియాల యొక్క సమాధులు అని, చనిపోయిన వారిని మాత్రమే వలీగా భావిస్తారు. అయితే ఇక్కడ ఒక నియమం తెలుసుకోండి. ఎవరైతే ఇహలోకంలో వలీ అవ్వడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయలేదో, చనిపోయిన తర్వాత వారు వలీ కాజాలరు.

సోదర మహాశయులారా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా పుస్తకం మనం ప్రారంభించాము. ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏదైతే దుఆ ఇచ్చారో, అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. ఈ దుఆ ఒకటి ముందు మనం తెలుసుకున్నాము.

సోదర మహాశయులారా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా పుస్తకం మనం ప్రారంభించాము. ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏదైతే దుఆ ఇచ్చారో, అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. ఈ దుఆ ఒకటి ముందు మనం తెలుసుకున్నాము.

وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَ مَا كُنْتَ
(వ అన్ యజ్అలక ముబారకన్ అయ్న మా కున్త్)
నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.

ఇది చాలా గొప్ప విషయం. ముబారక్, కేవలం పేరు పెట్టుకుంటే ముబారక్ కాజాలరు.

సోదర మహాశయులారా, ఇది కూడా చాలా మంచి దుఆ, చాలా గొప్ప దుఆ. మరియు ప్రవక్తల గురించి అల్లాహ్‌ త’ఆలా తెలిపినటువంటి ఇది ఒక గొప్ప శుభవార్త. ఈసా అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్రలో మీరు విని ఉన్నారు,

وَجَعَلَنِي مُبَارَكًا أَيْنَ مَا كُنتُ وَأَوْصَانِي بِالصَّلَاةِ وَالزَّكَاةِ مَا دُمْتُ حَيًّا
వ జఅలనీ ముబారకన్ అయ్న మా కున్తు వ అవ్సానీ బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్యా.
నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. (19:31).

అల్లాహ్‌ త’ఆలా నన్ను ఎక్కడ ఉన్నా గాని ముబారక్, శుభవంతుడిగా చేశాడు అని ఈసా అలైహిస్సలాం చెప్పారు. ఇమామ్ హసన్ అల్-బస్రీ రహిమహుల్లాహ్ చెబుతున్నారు, అల్లాహ్‌ త’ఆలా నిన్ను ముబారక్ చేయుగాక, నిన్ను శుభవంతుడిగా చేయుగాక అంటే నీవు ధర్మంపై స్థిరంగా ఉండి ఇతరులకు మంచిని ఆదేశిస్తూ, ఇతరులను చెడు నుండి ఖండిస్తూ ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్‌ నీకు ప్రసాదించుగాక. ఇంత గొప్ప విషయం చూస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో బర్కత్, శుభాలు రావాలంటే ఎలా వస్తాయి? స్వయంగా మనం ఆ బర్కత్, శుభాలు వచ్చేటువంటి విషయాలను పాటించడం మరియు మన చుట్టుపక్కల్లో ఎవరైతే దీనికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, వారికి కూడా ప్రేమగా బోధ చేస్తూ ఆ చెడుల నుండి దూరం చేస్తూ వారు కూడా శుభవంతులుగా అవ్వడానికి ప్రయత్నం చేయడం. ఒకసారి మీరు క్రింది ఈ ఆయత్‌ను గమనించండి, అల్లాహ్‌ త’ఆలా చెబుతున్నాడు:

وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَىٰ آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِم بَرَكَاتٍ مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ
వలవ్ అన్న అహలల్ ఖురా ఆమనూ వత్తఖవ్ ల ఫతహ్నా అలైహిమ్ బరకాతిమ్ మినస్సమాఇ వల్ అర్ద్.
ఈ బస్తీలో నివసించే వాళ్ళేగనక విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల (ద్వారాల)ను తెరచేవాళ్ళం (7:96)

గమనిస్తున్నారా? బరకాత్ ఎలా వస్తాయి? ముబారక్ మనిషి ఎలా కాగలుగుతాడు? దానికి కొరకు ఉత్తమ మార్గం అల్లాహ్‌ త’ఆలా స్వయంగా తెలియజేశాడు. ఆ మార్గాలను మనం అవలంబించాలి, వాటిపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

ఇక రండి ఆ తర్వాత మూడవ దుఆ, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఏంటి మూడవ దుఆ? చెబుతున్నారు,

وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر
(వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్ వ ఇజబ్తులియ సబర్ వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్)
ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం (పొరపాటు) జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక.

మూడు విషయాల ప్రస్తావన ఇక్కడ ఉంది. ఇది మూడవ దుఆ. గమనిస్తున్నారా ఎంత మంచి ఉత్తమమైన దుఆ ఉంది ఇక్కడ? ఏముంది?

వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్. అల్లాహ్‌ వైపు నుండి మనకు ఏది ప్రసాదించబడినా, దానికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. సోదర మహాశయులారా, ఇది చాలా గొప్ప అనుగ్రహం. కానీ మనలో చాలామంది ఏమనుకుంటారు? నాకేమున్నది? తిండికి మూడు పూటలు సరిగ్గా తిండి దొరుకుతలేదు. నాకు జాబ్ లేదు. నాకు ఉద్యోగం లేదు. నా పిల్లలు మంచిగా నా యొక్క అడుగుజాడల్లో లేరు. ఈ విధంగా మనం ఓ నాలుగు విషయాలు ఏదో మనకు నచ్చినవి లేవు, ఇక మనకు ఏ మేలూ లేదు అని అనుకుంటాము. తప్పు విషయం. మనం బ్రతికి ఉండడం ఇది అల్లాహ్‌ యొక్క చాలా గొప్ప వరం. మనం ఆరోగ్యంగా ఉండి ఈ శ్వాస పీల్చుకుంటూ ఉన్నాము, చూస్తున్నాము, వింటున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, ఇవన్నీ గొప్ప వరాలు కావా? ఇంకా ఇస్లాం యొక్క భాగ్యం మనకు కలిగింది అంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ గొప్ప వరం ఏమున్నది? మనం ఉన్న విషయాలను గనక ఒకవేళ ఆలోచిస్తే, వ ఇన్ తఉద్దూ ని’మతల్లాహి లా తుహ్సూహా. మీరు అల్లాహ్‌ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. (16:18). వమా బికూమ్ మిన్ ని’మతిన్ ఫమినల్లాహ్. మీ వద్ద ఉన్న ప్రతి అనుగ్రహం అల్లాహ్‌ తరఫు నుంచే వచ్చినది. (16:53). అయితే మనం మనలో కృతజ్ఞత భావాన్ని పెంచాలి. ఎందుకంటే కృతజ్ఞత ద్వారా అనుగ్రహాలు పెరుగుతాయి. ల ఇన్ షకర్తుమ్ ల అజీదన్నకుమ్. అల్లాహ్‌ వాగ్దానంగా చెబుతున్నాడు, ఒకవేళ మీరు కృతజ్ఞత చూపిస్తే నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను. (14:7). మీరు గనక కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ల అజీదన్నకుమ్. ఇంకా అధికంగా నేను మీకు ప్రసాదిస్తాను, మీ యొక్క అనుగ్రహాలను ఇంకా పెంచుతూ పోతాను. అందుకొరకే మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి.

కృతజ్ఞత ఎలా చెల్లించాలి? కేవలం థాంక్స్ అంటే సరిపోతుందా? కాదు. ముందు విషయం, మనసా వాచా అన్ని అనుగ్రహాలు కేవలం అల్లాహ్‌ వైపు నుండే అన్నటువంటి భావన, నమ్మకం, నాలుకతో వాటి ప్రస్తావన ఉండాలి. అయ్యో ఆ గొట్ట కాడికి పోతేనే అయ్యా, మాకు దొరికిండు, మాకు లభించినది అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఫలానా బాబా దగ్గరికి పోతేనే మాకు ఈ ఆరోగ్యం వచ్చింది అని అనుకుంటారు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. సంతానం ఇవ్వడం గాని, ఆరోగ్యాలు ఇవ్వడం గాని కేవలం ఒకే ఒక్కడు అల్లాహ్‌ మాత్రమే ఇచ్చేవాడు. వేరే ఎవరి శక్తిలో లేదు. ఈ అనుగ్రహాలను మనం అల్లాహ్‌ వైపునకు కాకుండా వేరే వారి వైపునకు అంకితం చేస్తే ఇది షిర్క్‌లో చేరిపోతుంది. కృతజ్ఞతకు వ్యతిరేకం ఇది.

ఇక కృతజ్ఞత నోటితో ఉంటుంది, ఆచరణతో కూడా ఉంటుంది. అల్లాహ్‌ ఏం చెప్పాడు? ఇ’మలూ ఆల దావూద షుక్రా. “ఓ దావూదు సంతతివారలారా! కృతజ్ఞతాపూర్వకంగా పనులు చేయండి.” (34:13). ఓ దావూదు సంతతివారలారా, మీరు ఇ’మలూ, అమల్ చేయండి షుక్ర్‌ను ఆచరణ రూపంలో చెల్లించండి, కృతజ్ఞత ఆచరణ పరంగా చెల్లించండి. కృతజ్ఞత ఆచరణ రూపంలో ఎలానండి? ఇలా అంటే ఏ ఏ అనుగ్రహం అల్లాహ్‌ వైపు నుండి మనకు లభించినదో దానిని కేవలం అల్లాహ్‌ యొక్క ప్రసన్నతలో, ఆయన యొక్క విధేయతలోనే ఆ అనుగ్రహాన్ని మనం ఉపయోగించాలి. చెవు, అల్లాహ్‌ ఎందుకు ఇచ్చాడు? కళ్ళు, అల్లాహ్‌ ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు చేతులు, అల్లాహ్‌ ఎందుకు ఇచ్చాడు? అల్లాహ్‌ ఏ దేని కొరకైతే అవి ఇచ్చాడో వాటి ఆ ఉద్దేశంలోనే వాటిని ఉపయోగించాలి. నేను ఉదాహరణగా ఇవి చెప్పాను. ప్రతి అనుగ్రహం. ఎవరైతే ఈ షుక్రియా, కృతజ్ఞత భావం కలిగి, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారో, అల్లాహ్‌ వారికి అనుగ్రహాలు పెంచడంతో పాటు వారి యొక్క పుణ్యాలు చాలా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అల్లాహ్‌ షకూర్. ఎవరైతే షుక్రియా అదా చేస్తారో, కృతజ్ఞత చెల్లిస్తారో, వారిని ఆదరణిస్తాడు, వారికి ఎంతో గౌరవం ప్రసాదిస్తాడు. షకూర్, అల్లాహ్‌ యొక్క దాసులు. అల్లాహ్‌ త’ఆలా తమ ప్రవక్తల్లో కొందరిని అబ్దన్ షకూరా, ఇతడు నా దాసుడు, కృతజ్ఞత చెల్లించేవాడు అని ప్రశంసించాడు. ఇంకా ఈ కృతజ్ఞత చెల్లిస్తూ ఉండడం ద్వారా అల్లాహ్‌ యొక్క ప్రియమైన, తక్కువ దాసులు ఎవరైతే ఉంటారో, వారిలో మనం చేరిపోతాము.

హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి గురించి వస్తుంది. ఒక సందర్భంలో ఆయన, ఓ అల్లాహ్‌ నీ యొక్క తక్కువ దాసులలో నన్ను చేర్చుకో అని దుఆ చేశారట. పక్కన ఎవరో విన్నవారు, ఏంటి ఇలా దుఆ చేస్తున్నారు మీరు అంటే, ఖురాన్‌లో అల్లాహ్‌ ఏమంటున్నాడు? వ ఖలీలుమ్ మిన్ ఇబాదియష్ షకూర్. నా యొక్క కృతజ్ఞత చెల్లించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. (34:13). అల్లాహ్‌ త’ఆలా ఆ కృతజ్ఞత చెల్లించేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

రెండవది ఏమిటి? ఇజబ్తులియ సబర్. ఉబ్తులియ. ఏదైనా బలా, ఆపద, కష్టం, పరీక్ష వచ్చింది, ఓపిక సహనం వహించాలి. సోదర

మహాశయులారా, షుక్ర్, సబ్ర్ ఇవి రెండు ఎంత పెద్ద అనుగ్రహాలో ఒకసారి ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసు ఉంది, ఇన్న అమ్ రల్ ము’మిని అజబ్. విశ్వాసుని యొక్క విషయమే చాలా వింతగా ఉంది. మరియు ఈ విశ్వాసునికి తప్ప ఇంకా వేరే ఎవరికీ లేదు. అతడు అన్ని స్థితుల్లో కూడా మేలు, ఖైర్, మంచినే పొందుతాడు. అల్లాహ్‌ అతనికి ఏదైనా అనుగ్రహించాడు, అసాబతుస్సర్రా, షకర్. అతను కృతజ్ఞత చెల్లిస్తాడు, ఫకాన ఖైరల్లహ్. అదే అతని కొరకు మేలు అవుతుంది. వ ఇజా అసాబతుద్దర్రా. ఒకవేళ అతనికి ఏదైనా కీడు, ఏదైనా నష్టం వాటిల్లింది, సబర్. అతను సహనం వహిస్తాడు, ఫకాన ఖైరల్లహ్. అతనికి మేలు జరుగుతుంది. ఈ మేలు విశ్వాసునికి తప్ప ఇంకా వేరే ఎవరికీ లేదు అని చెప్పారు.

సబ్ర్ అన్నది, సహనం అన్నది పుణ్య కార్యాలు చేస్తూ పాటించాలి. ఇది చాలా అవసరం. ఉదాహరణకు తౌహీద్ పై ఉండడం, ఇది గొప్ప పుణ్య కార్యం. నమాజు చేయడం, ఉపవాసాలు పాటించడం, ఇందులో కూడా సహనం అవసరం ఉంటుంది. పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం అవసరం ఉంటుంది. అవును, ఎలా? మనకు ఒక పాప కార్యం చాలా ఇష్టంగా ఉంటుంది, అది అల్లాహ్‌కు ఇష్టం లేదు. దాన్ని మనం వదులుకోవాలి. ఉదాహరణకు ఈ రోజుల్లో మన చేతుల్లో మొబైల్ ఉంటుంది. పాటలు వినడం గాని, ఏదైనా ఫిలిములు చూడడం గాని, నగ్న చిత్రాలు చూడడం గాని, ఎన్నెన్నో అనవసరమైన వీడియోలు వస్తూ ఉంటాయి, చూసుకుంటూ వెళ్తారు, టైం పాస్ చేసుకుంటూ ఉన్నాము అని అనుకుంటారు, కానీ అది వారి యొక్క టైం ఫెయిల్ అవుతుంది. వారి యొక్క కర్మ పత్రాల్లో పాపాలు రాయబడుతున్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించాం. ఈ విధంగా పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం, ఓపిక చాలా అవసరం ఉంటుంది.

మూడవ విషయం, సబ్ర్, సహనం అన్నది అల్లాహ్‌ వైపు నుండి ఏవైనా ఆపదలు వచ్చేసాయి. అంటే అనారోగ్యానికి గురయ్యారా? పరీక్షలో ఫెయిల్ అయ్యారా? సంతానం ఏదైనా మీకు చాలా ఇబ్బందిలో పడవేస్తున్నారా? మీ యొక్క పంట పొలాలు గిట్ల ఏవైనా నష్టంలో పడ్డాయా? మీ యొక్క వ్యాపారం ఏదైనా మునిగిపోయిందా? అందులో ఏదైనా లాస్ వచ్చేసిందా? మీ యొక్క జాబ్ పోయిందా? ఏ ఆపద అయినా గాని, ఏ కష్టమైనా గాని తూఫానీ గాలి వచ్చింది, ఇల్లు పడిపోయింది. ఇలాంటి ఏ ఆపద అయినా గాని సహనం వహించాలి. సహనం అస్సబ్రు ఇంద సద్మతిల్ ఊలా. సహనం అన్నది కష్టం, ఆపద యొక్క ప్రారంభంలో నుండే మొదలవ్వాలి. రోజులు గడిచిన తర్వాత ఇక చేసేది ఏమీ లేక సరే మంచిది ఇక సహనం చేద్దాం, ఓపిక వహిద్దాం, ఇది సహనం అనబడదు. ఈ సహనం వల్ల కూడా అల్లాహ్‌ రబ్బుల్ ఆలమీన్ వద్ద స్థానాలు చాలా పెరుగుతాయి. ఇన్నమా యు వఫ్ఫస్సాబిరూన అజ్ రహూమ్ బిగైరి హిసాబ్. నిశ్చయంగా సహనం పాటించేవారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. (39:10).

ఇక మూడవది ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్. ఏదైనా పాపం జరిగితే ఇస్తిగ్ఫార్ చేయాలి, అల్లాహ్‌తో క్షమాపణ కోరుకోవాలి. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, షుక్ర్, సబ్ర్, ఇస్తిగ్ఫార్. ప్రవక్తల యొక్క ఉత్తమ గుణాలు, పుణ్యాత్ముల యొక్క ఉత్తమ గుణాలు. ఇది మనం పాటించాలి. సూర ఆలి ఇమ్రాన్‌లో చూడండి అల్లాహ్‌ త’ఆలా ఏమంటున్నాడు?

وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ
వల్లజీన ఇజా ఫఅలూ ఫాహిషతన్ అవ్ జలమూ అన్ఫుసహుమ్ జకరుల్లా ఫస్తగ్ఫరూ లి జునూబిహిమ్.
మరియు వారు ఏదేని నీచ కార్యానికి పాల్పడినపుడు గానీ, తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నపుడు గానీ వెంటనే అల్లాహ్‌ను స్మరించి తమ పాపాల క్షమాపణ కొరకు వేడుకుంటారు. (3:135).

వారి నుండి ఏదైనా పొరపాటు జరిగింది, అశ్లీల కార్యం జరిగింది, ఏదైనా వారు తమపై అన్యాయం చేసుకున్నారు అంటే వెంటనే అల్లాహ్‌ను గుర్తు చేసుకొని అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటారు. ఈ ఉత్తమ గుణం రావాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి పాపం చేయని వారు. అయినా ఒక్కొక్క సమావేశంలో వంద వంద సార్లు ఇస్తిగ్ఫార్ చేసేవారు. అంతే కాదు సహీ ముస్లిం, సహీ బుఖారీ లోని హదీసు, యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా తూబూ ఇలల్లాహి వస్తగ్ఫిరూ. అల్లాహ్‌ వైపునకు మరలండి, పాపాల నుండి క్షమాపణ కోరుకోండి. నేను అల్లాహ్‌తో 70 సార్ల కంటే ఎక్కువగా, (మరో ఉల్లేఖనంలో) 100 సార్ల కంటే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటూ ఉంటాను. ప్రవక్తకు అవసరమే లేదు కదా? ఎందుకంటే ఆయన పాప రహితుడు, రసూలుల్లాహ్. అయినా గాని అంత క్షమాపణ కోరుతున్నారంటే మనకు ఈ అవసరం ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకొరకే అల్లాహ్‌ త’ఆలా పుణ్యాత్ముల యొక్క గుణం సూర నిసాలో ఏం తెలిపాడు? వారి నుండి ఏదైనా పొరపాటు జరిగింది అంటే వెంటనే క్షమాపణ కోరుకుంటారు. ఇన్నమత్తవ్బతు అలల్లాహి లిల్లజీన య’మలూ నస్సూఅ బిజహాలతిన్. ఏదో పొరపాటున, అశ్రద్ధగా, తెలియనందువల్ల. బిజహాలతిన్, పొరపాటు జరిగింది. వెంటనే ఫస్తగ్ఫరూ, వెంటనే వారు అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటారు. అందుకు ఇక ఎవరైతే పొరపాట్లపై పొరపాట్లు, పాపాలపై పాపాలు చేసుకుంటూ పోతారో, అలాంటి వారిని నేను క్షమించను వ లైసతిత్తవ్బతు అని అల్లాహ్‌ త’ఆలా హెచ్చరిస్తున్నాడు.

అందుకొరకే షుక్ర్‌తో జీవితం గడపండి. ఆపద వస్తే సహనం వహించండి. మరియు ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఎప్పుడు జరిగినా గాని, ఎంత పెద్దది జరిగినా గాని వెంటనే అల్లాహ్‌ వైపునకు మరలి క్షమాపణ కోరుతూ ఉండండి.

ఆ తర్వాత ఏమంటున్నారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్?

ఫఇన్న హా ఉలాఇస్సలాస ఉన్వానుస్సఆదహ్
వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.

ఈ మూడు మనిషి యొక్క సౌభాగ్యానికి, అదృష్టానికి గొప్ప చిహ్నం, గొప్ప గుర్తు. అల్లాహు అక్బర్. అందుకొరకు మనం కూడా భాగ్యవంతుల్లో చేరాలి, మనం కూడా అదృష్టవంతుల్లో చేరాలి అంటే తప్పకుండా ఏం చేయాలి? షుక్ర్, సబ్ర్ మరియు ఇస్తిగ్ఫార్.

అయితే సోదర మహాశయులారా, ఇన్షాఅల్లాహ్ ఈ పాఠాలు ఇంకా ముందుకి మనం వింటూ ఉంటాము. మరియు ఇలాంటి పుస్తకాలు తప్పకుండా మీరు చదువుతూ ఉండండి. అల్లాహ్‌ యొక్క దయ గలిగితే ఈరోజే లేకుంటే రేపటి వరకు దీని యొక్క PDF కూడా మీకు పంపించడం జరుగుతుంది. అంతే కాదు అల్లాహ్‌ యొక్క దయ గలిగితే ఒక షార్ట్ వీడియో, మూలం, మతన్ అని ఏదైతే అంటారో ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారిది, అది కూడా మీకు పంపించే ప్రయత్నం ఇన్షాఅల్లాహ్ చేస్తాను. అయితే ఈనాటి పాఠంలోని మతన్, మూలం ఏమిటి?

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో.

أَسْأَلُ اللهَ الْكَرِيمَ رَبَّ الْعَرْشِ الْعَظِيمِ أَنْ يَتَوَلَّاكَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ
(అస్అలుల్లా హల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్)
పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్‌ను అర్ధిస్తున్నాను, ఇహపరలోకాల్లో అల్లాహ్‌ త’ఆలా నిన్ను వలీగా చేసుకొనుగాక.

وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَ مَا كُنْتَ
(వ అన్ యజ్అలక ముబారకన్ అయ్న మా కున్త్)
నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.

وَأَنْ يَجْعَلَكَ مِمَّنْ إِذَا أُعْطِيَ شَكَرَ، وَإِذَا ابْتُلِيَ صَبَرَ، وَإِذَا أَذْنَبَ اسْتَغْفَرَ
(వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్, వ ఇజబ్తులియ సబర్, వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్, ఫఇన్న హా ఉలాఇస్సలాస ఉన్వానుస్సఆదహ్)
ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.

అర్థమైంది కదా? అల్లాహ్‌తో నేను అర్ధిస్తున్నాను. ఆ అల్లాహ్‌ యే పరమదాత మరియు మహోన్నత సింహాసనానికి ప్రభువు. ఏమని అర్ధిస్తున్నారు? నిన్ను ఇహపరలోకాల్లో వలీగా చేసుకొనుగాక. నీవు ఎక్కడా ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేసుకొనుగాక. ఇంకా ఏదైనా నీతో, ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.

ఇక ఈ దుఆల యొక్క వివరణ నేను మీకు ఇచ్చాను ఈనాటి క్లాస్‌లో. ఇక రేపటి క్లాస్‌లో హనీఫియత్, మిల్లతి ఇబ్రాహీమీ అంటే ఏమిటి అది తెలుసుకుందాము. ఆ తర్వాత అల్లాహ్‌ యొక్క దయతో ఆ నియమాలు ఏమిటో అవి కూడా ఇన్షాఅల్లాహ్ ఇంకా ముందు క్లాసులో తెలుసుకుంటూ ఉందాము.

జజాకుముల్లాహు ఖైరా, వాఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41603

అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు [వీడియో | టెక్స్ట్]

అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు
https://www.youtube.com/watch?v=pcIMF4mR90E [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క విధిరాత (ఖద్ర్) పట్ల అసంతృప్తి మరియు కోపాన్ని ప్రదర్శించడం తౌహీద్ (ఏకేశ్వరోపాసన)కు విరుద్ధమని, అది అవిశ్వాసం (కుఫ్ర్) వైపు నడిపించే ప్రమాదం ఉందని వివరిస్తారు. కష్టాలు మరియు ఆపదలు ఎదురైనప్పుడు, సహనం వహించడం, నాలుకను మరియు అవయవాలను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. అల్లాహ్ తాను ప్రేమించిన వారిని పరీక్షిస్తాడని, గొప్ప బహుమతి గొప్ప పరీక్షతోనే వస్తుందని ఒక హదీసును ఉటంకిస్తారు. విధిరాత పట్ల సంతృప్తిగా ఉన్నవారికి అల్లాహ్ యొక్క ప్రసన్నత లభిస్తుందని, కోపగించుకున్న వారికి ఆయన ఆగ్రహం కలుగుతుందని ఆయన ముగిస్తారు.

అల్లాహ్ రాసిన విధిరాత (ఖద్ర్) పట్ల అయిష్టత, అసహ్యత మరియు కోపం ప్రదర్శించరాదు. అల్లాహ్ రాసినటువంటి ఖద్ర్, ఖదా. దాని పట్ల ఎప్పుడూ కూడా అయిష్టత, అసహ్యత, కోపం ప్రదర్శించరాదు. ఈ పాపంలోనైతే మనలో చాలా మంది పడిపోతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

అల్లాహ్ నిర్ణయించిన దాని ప్రకారం ఏమైనా ఆపదలు వస్తే అయిష్టత, కోపం ప్రదర్శించుట ఇది సంపూర్ణ తౌహీద్‌కు విరుద్ధం. ఒక్కోసారి ఇదే స్థితిలో మనిషి ఏదైనా కుఫ్ర్ మాటలు, అవిశ్వాస పలుకులు పలికితే, లేదా కుఫ్ర్, అవిశ్వాసానికి సంబంధించిన ఏదైనా పని చేస్తే, ఈ చేష్ట అతని తౌహీద్ పునాదులను కదిలించి అతడు కుఫ్ర్‌లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? నాకే అల్లాహ్ ఇట్లా రాయాల్నా? నా మీదనే ఈ ఆపద రాసి రావాల్సి ఉండేనా? అయ్యో నా పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడే నా భర్త చనిపోవాల్నా? ఏంటిది అల్లాహ్ యొక్క ఈ అన్యాయం? ఇలాంటి మాటలు ప్రజలు అంటూ ఉన్నారు ఈ రోజుల్లో. కొన్ని ప్రాంతాల్లోనైతే ఓ అల్లాహ్, నా భర్తే దొరికిండా నీకు తీసుకోవడానికి? ఇంకా ఎవరూ లేకుండినా? ఇట్లాంటి మాటలు కూడా కొందరు అన్నారు. ఇది చాలా పాపం, చాలా పాపం. మనల్ని తౌహీద్ నుండి, ఇస్లాం నుండి వైదొలగడానికి, ఇస్లాం నుండి దూరమైపోవడానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

విధిరాతను అసహ్యించుకోకూడదు. తఖ్దీర్‌ను అయిష్టతతో లేదా ఏదైనా మన ద్వారా ఒక అసహ్యం ఏర్పడింది అన్నట్లుగా మనం ప్రదర్శించకూడదు. అల్లాహు త’ఆలా అందరి తఖ్దీర్ ముందే రాసి పెట్టాడు గనక, అతడు అలీమ్ మరియు హకీమ్. సర్వజ్ఞాని మరియు సర్వ వివేకవంతుడు. అల్లాహు త’ఆలా వివేకవంతుడు గనకనే అదృష్టాన్ని, తఖ్దీర్‌ని రాసిపెట్టాడు.

మనపై ఇహలోక పరంగా మనకు ఏదైనా ఆపద వచ్చింది. రోగ రూపంలో గానీ, లేదా మనకు సంబంధించిన దగ్గరి వారు చనిపోయే రూపంలో గానీ, ఇంకా ఏ రూపంలో ఏ ఆపద వచ్చిపడ్డా, విధిగా పాటించవలసిన విషయాలు ఏమిటంటే:

  1. నెంబర్ ఒకటి, కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా తనకు తాను సహనం వహించాలి.
  2. రెండవ విషయం, కోపం, అయిష్టత వ్యక్తపరచకుండా నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అల్లాహ్‌కు ఇష్టం లేని ఏ మాట నాలుక నుండి వెళ్లనివ్వకూడదు.
  3. మూడవది, తన శరీర అవయవాలను కూడా అదుపులో ఉంచుకోవాలి. చెంపలు బాదుకోవడం, దుస్తులు చించుకోవడం, చింపేయడం, వెంట్రుకలు పీక్కోవడం, తలపై దుమ్మెత్తి పోసుకోవడం, ఇంకా ఇలాంటి ఏ పనులు కూడా చేయరాదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజిలోని సహీ హదీస్, 2396. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

عَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ قَالَ: (إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلَاءِ وَإِنَّ اللهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلَاهُمْ فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అనస్ (రజియ ల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు సంతోషంగా మసలుకుంటారో వారికి అల్లాహ్ సంతృష్టి లభిస్తుంది. ఎవరు అయిష్టత, కోపానికి గురి అవుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి గురి అవుతాడు”. (తిర్మిజి/ ఫిస్సబ్రి వల్ బలా/ 2396).

إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلاَءِ
(ఇన్న ఇ’జమల్ జజా’ఇ మ’అ ఇ’జమిల్ బలా’ఇ)
పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది.

గొప్ప పుణ్యం కావాలా? చాలా బ్రహ్మాండమైన పెద్ద సత్ఫలితం కావాలా నీకు? అయితే అంతే పెద్ద పరీక్షలు వస్తాయని కూడా నీవు నమ్ము.

మళ్ళీ తర్వాత ప్రవక్త ఏం చెప్పారో చూడండి:

وَإِنَّ اللَّهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلاَهُمْ
(వ ఇన్నల్లాహ ఇజా అహబ్బ ఖౌమన్ ఇబ్తలాహుమ్)
మరియు నిశ్చయంగా అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో, వారిని పరీక్షకు గురిచేస్తాడు.

ఎల్లవేళలలో ఈ విషయాన్ని మదిలో ఫ్రెష్‌గా నాటుకుని ఉండే భాగ్యం ప్రసాదించు గాక. వేరే ఎల్లవేళలలో ఈ మదిలో ఈ విషయం ఉండదు గనక, ఏ చిన్న ఆపద వచ్చినా గానీ మనం తొందరగా కోపానికి గురవుతాం. ఇది నాకు ఆపద వచ్చిందంటే పళ్ళు కొరకడం, వెంట్రుకలు పీక్కోవడం, బట్టలు చింపుకోవడం, అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

ప్రవక్త ఏమంటున్నారో చూడండి, అల్లాహ్ ఎవరినైనా ప్రేమించాడంటే వారిని పరీక్షకు గురిచేస్తాడు. ఆ పరీక్షలో:

فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ
(ఫమన్ రదియ ఫలహుర్-రిదా, వ మన్ సఖిత ఫలహుస్-సఖత్)
ఎవరైతే సంతోషంగా ఉంటారో, అతనికి (అల్లాహ్ యొక్క) సంతృప్తి లభిస్తుంది, మరియు ఎవరైతే కోపానికి గురవుతాడో, అతనికి (అల్లాహ్ యొక్క) ఆగ్రహం కలుగుతుంది.

ఫలహుర్-రిదా. ఎవరైతే సంతోషంగా మసులుకుంటారో, అతనికి అల్లాహ్ యొక్క సంతృప్తి లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. అల్లాహ్ నీ పట్ల సంతృప్తి చెంది ఉండాలి, నిన్ను చూసి సంతోషపడాలి, అంటే ఏం చేయాలి? ఏ పెద్ద కష్టం వచ్చినా గానీ మూడు రకాలు ఏవైతే చూపించబడ్డాయో, ఆ మూడు పద్ధతులను అవలంబించాలి మరియు అన్ని రకాల చెడులకు దూరం ఉండాలి.

కానీ ముసీబత్, కష్టం, ఆపద వచ్చినప్పుడు వమన్ సఖిత ఫలహుస్-సఖత్, ఒకవేళ కోపానికి గురి అయ్యాడంటే అతడు కూడా అల్లాహ్ ఆగ్రహానికి గురైపోతాడు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరినీ క్షమించు గాక. ఏదైనా ఆపద వచ్చినప్పుడు తఖ్దీర్‌పై సంతోషంగా ఉండి, అల్లాహ్ మనకు అన్ని రకాల మేళ్లు చేసే భాగ్యం ప్రసాదించు గాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41278

తఖ్దీర్ (విధి వ్రాత):
https://teluguislam.net/qadr-taqdeer-vidhi-rata/

ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]
https://teluguislam.net/2011/03/23/prohibitions-in-sharia-telugu-islam/

అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర – ఖురాన్ కథామాలిక

అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర
https://youtu.be/t27mDKl4w3E
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

 وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِن ضُرٍّ

మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించే వాడవు” అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. (ఖుర్ ఆన్  21: 83, 84)

కొందరు  దైవదూతలు అల్లాహ్ సృష్టి లోని కొన్ని ప్రాణుల గురించి మాట్లాడు కోసాగారు. విధేయత చూపి అల్లాహ్ ప్రసన్నతను పొందిన వారి గురించి వారు చర్చించుకోసాగారు. అలాగే అహంభావంతో విర్రవీగి అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి సంభాషిస్తుండగా ఒక దైవదూత, “ప్రస్తుతం భూమిపై ఉన్న వారిలో అత్యుత్తముడు అయ్యూబ్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగినవాడు. గొప్ప సహనశీలి. ఎల్లప్పుడూ అపార కరుణా మయుడైన విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు. అల్లాహ్ ను ఆరాధించే వారికి ఆయన గొప్ప ఆదర్శం. అందుకు ప్రతిఫలంగా అల్లాహ్ ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అపార సంపదలు ఇచ్చాడు. అయ్యూబ్ ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు. స్వార్థం ఆయనలో లేనేలేదు. ఆయన కుటుంబం, ఆయన సేవకులు, అవసరార్థులు, బీదలు అందరూ ఆయన సంపదలో భాగం పొందుతున్నారు. ఆయన బీదలకు అన్నం పెడతారు. వారికి దుస్తులు ఇస్తారు. బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం వారిని కొంటారు. తన నుంచి దానధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. ఆయన చాలా ఉదార స్వభావి, చాలా మంచి వాడు” అంటూ ప్రశంసించారు.

ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి. మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి [వీడియో & టెక్స్ట్]

ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి
బులూగుల్ మరాం | హదీస్ 1237
https://youtu.be/ScQ39BtR9Fg [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1237. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు`;

“ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరిలా చేసినపుడు) అల్లాహ్ యొక్క ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.” (బుఖారి , ముస్లిం)

అల్లాహ్ ను విశ్వసించే వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపంచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానయినా ఎదుటి వారిని మించిపోవాలన్న పేరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు అల్లాహ్ పట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదలపట్ల దయ, జాలి ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ల మంచీచెబ్బరల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతనొక దయాశీలిగా, సత్పౌరునిగా ఉంటాడు

ఈ ప్రసంగంలో, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక ముఖ్యమైన హదీద్ వివరించబడింది. ప్రాపంచిక విషయాలలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడటం ద్వారా అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదే సమయంలో, ధార్మిక విషయాలలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారిలా పుణ్యకార్యాలలో పురోగమించడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ సూత్రం అసూయ, అసంతృప్తి వంటి సామాజిక రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుందని వక్త నొక్కి చెప్పారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి అసంతృప్తికి లోనవ్వకుండా, పేదవారిని, అవసరమైన వారిని చూసి మనకున్నదానిపై సంతృప్తి చెంది, అల్లాహ్ పట్ల కృతజ్ఞతతో జీవించాలని ఆయన ఉద్భోదించారు. ఈ రెండు గుణాలు (కృతజ్ఞత మరియు సహనం) ఉన్నవారిని అల్లాహ్ తన ప్రత్యేక దాసుల జాబితాలో చేర్చుతాడని కూడా వివరించారు.

వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం,

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
(వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం)
హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

انْظُرُوا إِلَى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ
(ఉన్ జురూ ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్)
మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి.

وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ
(వలా తన్ జురూ ఇలా మన్ హువ ఫౌఖకుమ్)
మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారి వైపు చూడకండి.

فَهُوَ أَجْدَرُ أَنْ لَا تَزْدَرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ
(ఫహువ అజ్ దరు అల్ లా తజ్ దరూ ని’మతల్లాహి అలైకుమ్)
మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఏంటి దీని భావం? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. ఎల్లప్పుడూ, మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి. మీరు ప్రాపంచిక సిరిసంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి, అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడకండి. గమనిస్తున్నారు కదా? హదీద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపు చూడండి. ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపుకు చూడకండి. మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఇక ఒకవేళ మీరు హదీద్ లోని అరబీ పదాలు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా అంటే చూడండి ఇక్కడ, ఉన్ జురూ – మీరు చూడండి. ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్ – మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపున. వలా తన్ జురూ – చూడకండి. ఇలా మన్ హువ ఫౌఖకుమ్ – ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో. ఫహువ అజ్ దరు – ఇదే ఉత్తమ విధానం, ఉత్తమ మార్గం. ఫహువ అజ్ దరు, అది మీ కొరకు ఎంతో మేలు, ఉత్తమ మార్గం. దేని కొరకు? అల్ లా తజ్ దరూ – మీరు చిన్నచూపుతో చూడకుండా, మీరు తమకు తాము అల్పంగా భావించకుండా, దేనిని? ని’మతల్లాహి అలైకుమ్ – మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని.

సోదర మహాశయులారా, సభ్యతా, సంస్కారాలు, మర్యాదలు వీటికి సంబంధించి హదీద్ లు మనం తెలుసుకుంటున్నాము. ఇందులో ఈ హదీద్ కూడా ఎంత ముఖ్యమైనది ఈనాటి మన సమాజంలో ఒకసారి అర్థం చేసుకోండి. హదీద్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చిన బోధనలని గనక మనం గ్రహించామంటే, పరస్పరం ఎంతో ప్రేమగా, ఒకరు మరొకరితో ఎంతో మంచి రీతిలో కలిసిమెలిసి ఉండవచ్చును. ఈ రోజుల్లో అసూయ, ఈర్ష్య, జిగస్సు, పరస్పరం కపటం, ద్వేషం లాంటి ఈ సామాజిక రోగాలు ఏవైతే పెరిగిపోతున్నాయో, ఇలాంటి హదీథులను చదవకపోవడం వల్ల.

ఈ హదీద్ లో మీకు మూడు విషయాలు తెలుస్తున్నాయి కదా. ఆ మూడు విషయాలు ఏంటి? ఈ హదీద్ ద్వారా మనకు కలిగిన లాభాలు, ప్రయోజనాలు ఏంటి? చివర్లో సంక్షిప్తంగా తెలుసుకుందాము. అయితే రండి.

ఒక హదీద్ లో వస్తుంది, ఈ భావాన్ని మీరు మరో హదీస్ ఆధారంగా మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

رَحِمَ اللَّهُ عَبْدًا
(రహిమల్లాహు అబ్దన్)
అల్లాహ్ ఆ దాసున్ని కరుణించు గాక! చూడండి.

ఇంతకుముందు చదివిన హదీస్ లో ఒక ఆదేశం ఉంది. ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇందు ఈ లాభం, ఇలా తెలపబడింది. కానీ ఆ హదీద్ ను విడమరిచి చెప్పేటువంటి మరికొన్ని హదీద్ లలో ఘనతలు, లాభాలు ఎలా ఉన్నాయో గమనించండి. అక్కడ ఏముంది? రహిమల్లాహ్, అల్లాహ్ కరుణించు గాక! ఈ గుణం గనక నేను, మీరు అవలంబించుకున్నామంటే అల్లాహ్ యొక్క కరుణ మనపై కురుస్తుంది. ఏంటి? రహిమల్లాహు అబ్దన్, అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించు గాక!

نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ
(నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు)
ప్రాపంచిక రీత్యా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి వైపున చూస్తాడు.

فَحَمِدَ اللَّهَ وَشَكَرَهُ
(ఫ హమిదల్లాహ వ షకరహ్)
ఓ అల్లాహ్! అతనికంటే నేను ఎంతో మేలు ఉన్నాను. నేను ఎంతో బాగున్నాను. అతనికంటే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను. నీకే సర్వ స్తోత్రములు! నీకే అన్ని రకాల పొగడ్తలు! నీకే అన్ని రకాల కృతజ్ఞతలు!

وَفِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు)
మరి ఎవరైతే ధర్మపరంగా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అతన్ని చూస్తాడు.

فَجَدَّ وَاجْتَهَدَ
(ఫ జద్ద వజ్తహద్)
ఆ తర్వాత అతను చాలా చాలా అలాంటి పుణ్యాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా త్యాగం, ప్రయాస, ప్రయత్నం, కష్టపడతాడు, స్ట్రగుల్ చేస్తాడు దేనికొరకు? ధర్మ కార్యాల్లో, పుణ్య విషయాల్లో అలాంటి వారి స్థానానికి చేరుకోవడానికి, వారికంటే ఇంకా ముందుకు ఉండడానికి.

అమర్ బిన్ షు’ఐబ్ ఉల్లేఖించిన ఒక హదీద్ లో ఇలా కూడా వస్తుంది:

خَصْلَتَانِ
(ఖస్లతాని)
రెండు ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ రెండు గుణాలు ఎవరిలో ఉంటాయో, అల్లాహ్ వారిని

شَاكِرًا صَابِرًا
(షాకిరన్ సాబిరా)
కృతజ్ఞత చెల్లించే వారిలో, ఓపిక సహనాలు వహించే వారిలో అతన్ని కూడా లిఖింపజేస్తాడు. షుక్ర్ చేసేవారు, సబ్ర్ చేసేవారు, కృతజ్ఞత చెల్లించేవారు, సహనాలు పాటించేవారు పుణ్యదాసులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారి జాబితాలో అల్లాహ్ త’ఆలా ఇతన్ని కూడా చేర్చుతాడు. ఎ

వరిని? ఎవరిలోనైతే ఈ రెండు గుణాలు ఉంటాయో. ఏంటి ఆ రెండు గుణాలు?

مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ فَحَمِدَ اللَّهَ عَلَى مَا فَضَّلَهُ بِهِ
(మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు ఫ హమిదల్లాహ అలా మా ఫద్దలహు బిహ్)
ఎవరైతే ప్రాపంచిక విషయాలలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి, అల్లాహ్ అతనికంటే ఎక్కువగా అతనికి ఏదైతే అనుగ్రహించాడో దానిని చూసి అల్లాహ్ యొక్క స్తోత్రం పఠిస్తాడు.

وَمَنْ نَظَرَ فِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ فَاقْتَدَى بِهِ
(వ మన్ నజర ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు ఫక్ తదా బిహ్)
మరియు ధర్మ విషయాల్లో తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి వారి లాంటి ఆ సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాడు.

وَأَمَّا مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ అమ్మా మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ ఫౌఖహు)
కానీ ఎవరైతే దీనికి భిన్నంగా, ప్రపంచ రీత్యా తనకంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూస్తాడో,

وَآسَفَ عَلَى مَا فَاتَهُ
(వ ఆసఫ అలా మా ఫాతహు)
అతని వద్ద ఉన్న దానిని చూసి, అయ్యో నాకు ఇది దొరకపాయె, నాకు ఇది ఇవ్వకపాయె, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నాడో, ఇట్లా బాధపడుతూ ఉంటాడు.

فَإِنَّهُ لَا يُكْتَبُ شَاكِرًا وَلَا صَابِرًا
(ఫ ఇన్నహు లా యుక్తబు షాకిరన్ వలా సాబిరా)
ఇలాంటి వ్యక్తి, షాకిరీన్, సాబిరీన్ లో, కృతజ్ఞత చెల్లించే, సహనాలు పాటించే వారి జాబితాలో లిఖించబడడు.

అందుకొరకే మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఏమనేవారో తెలుసా? నీవు ప్రపంచ రీత్యా నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకు. దీనివల్ల నీలో ఒక న్యూనతాభావం, అయ్యో నాకు లేకపాయె ఇంత గొప్ప స్థితి, నాకు లేకపాయె ఇంత గొప్ప సంపద, నాకు లేకపాయె ఇలాంటి అందం, నాకు లేకపాయె ఇలాంటి… ఈ బాధ అనేది అతనిలో అతన్ని కుమిలిపోయే విధంగా చేస్తుంది.

అందుకొరకు ఏమి చేయాలి? బీదవాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వారిని చూడాలి. వారి వద్ద ధర్మం ఎక్కువ ఉండి, ప్రపంచ పరంగా ఏమంత ఎక్కువ లేకున్నా గానీ, వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనివల్ల అల్లాహ్ వారికంటే మంచి స్థితిలో మనల్ని ఉంచాడు అని అల్లాహ్ యొక్క కృతజ్ఞతాభావం కలుగుతుంది.

ఈ సందర్భంలో ఈనాటి టెక్నాలజీ కాలంలో, మరొక ఈ హదీద్ ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బోధన ఏమిటంటే, ఇక ఏం పనిపాట లేదు కదా అని కొందరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో, చాట్… షేర్ చాట్, ఏమేమో సోషల్ మీడియాలో ఏం చూస్తారండీ? మన అవ్వలు, మన అక్కలు అందరూ, ఆ… వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టాలంట, అవంతా చూపిస్తున్నారు. కిచెన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా చూపిస్తున్నారు. ఆ… నెలకు ఒకసారి జీతం దొరికినప్పుడు, ఆమె భర్త ఎంతగానో మంచి బట్టలు ఆమెకు కొనిస్తాడో, అవన్నీ వాళ్ళు వ్లోగ్ లు అంట, ఇంకా ఏమేమో యూట్యూబ్ లలో అంతా కచరా పెడుతున్నారు కదా పెట్టేవాళ్ళు. ఈ పని పాట లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు.

తర్వాత, ఏమండీ ఈసారి నెల జీతం దొరికిన తర్వాత ఇంట్లో ఫలానా తెచ్చుకుందామా? అని మెల్లగా మొదలవుతాయి మాటలు. ఇక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఈ విధంగా శక్తి సామర్థ్యము లేకున్నా పర్లేదండీ, ఫలానా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారట లోన్, ఫలానా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంట.

ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి? అలాంటి ఛానెల్ లను చూడకూడదు. ఏ ఛానెల్ ద్వారా అయితే, అయ్యో మన వద్ద ఇది లేకపాయే, ఇది ఉంటే ఎంత బాగుండు అని మనం కుమిలిపోతామో, అలాంటి ఛానెల్ లు చూసుకుంటూ మన ఇల్లులు పాడు చేసుకోవద్దు.

ప్రపంచ రీత్యా, ఈ విషయమైనా గానీ, హోదా, అంతస్తు, విద్య, ఇంకా అందచందాలు, సిరిసంపదలు, సౌకర్యాలు, ఏ విషయంలోనైనా ప్రపంచ రీత్యా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని, వారి యొక్క ఛానెల్ లను, వారి యొక్క ప్రోగ్రాంలను చూసుకుంటూ ఉండి, అయ్యో నాకు లేకపాయె, నాకు లేకపాయె అన్నటువంటి బాధల్లో ఉండకూడదు.

ఈ ప్రపంచ రీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి, అల్హందులిల్లాహ్ ఓ అల్లాహ్ నీ యొక్క ఎంత అనుగ్రహం! కొందరైతే ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను. అయ్యో ఫలానా సిటీలో నేను వెళ్ళినప్పుడేదో చూశాను, పైపులలో ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు. నాకైతే దానికంటే మంచిగా కనీసం కిరాయి ఇల్లు అయినా గానీ ఉంది కదా ఓ అల్లాహ్! ఇలాంటి కృతజ్ఞతాభావంలో జీవితం గడపాలి.

కానీ ధర్మపర విషయానికి వస్తే, ధర్మ విషయాలలో, మంచి కార్యాలలో, పుణ్య విషయాలలో మనకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నారో వారిని చూసి, అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19057

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1