దైవ గ్రంధాల పై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము: దైవ గ్రంధాల పై విశ్వాసం  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ

వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. (అల్ నిసా :131)

కనుక అల్లాహ్ తో భయపడండి, ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుండి దూరంగా ఉండండి.

తెలుసుకోండి! ఇస్లాం ధర్మంలో దైవ గ్రంథాలపై విశ్వాసం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఇది విశ్వాస మూల స్థంభాలలో మూడవది. అల్లాహ్ తన దాసులపై కనుకరిస్తూ వారి సన్మార్గమునకై ప్రవక్త ద్వారా ఒక గ్రంథాన్ని కూడా పంపించాడు, కారణం ఇహపరాల సాఫల్యం.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము. (అల్ హదీద్ 57:25)

నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటిపై విశ్వాసం తేవడం విధిగా చేశాడు.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[قُولُوٓاْ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡنَا وَمَآ أُنزِلَ إِلَىٰٓ إِبۡرَٰهِ‍ۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَآ أُوتِيَ ٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ]

(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి: ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరిమధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.” (అల్ బఖర 2:136)

ఒకటి : అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలు నిజమైనవి అని విశ్వాసం ఉంచాలి. ఉదాహరణకు అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు.

 [ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ]

తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు (అల్ బఖర: 285)

గ్రంథ అవతరణ వహీ ద్వారా జరిగింది. వాస్తవంగా అల్లాహ్ తఆలా ఆకాశం నుండి భూమి పైకి వహీ తీసుకురావడానికి దైవదూతలను నియమించాడు. ఆ దూత పేరు జిబ్రయిల్ (అలైహిస్సలాం). ఈయన ప్రవక్తకు తన ప్రత్యేక గ్రంథాన్ని వెల్లడించాడు.

రెండో విషయం: ఏ గ్రంథాల గురించే అయితే మనకు తెలుసో వాటిని విశ్వసించడం. అవి ఆరు ఉన్నాయి. ఇబ్రహీం మరియు మూసా సహీఫాలు. తౌరాత్ మూసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం, ఇంజీల్ ఈసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం. జబూర్ దావూద్ (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం మరియు ఖుర్ఆన్  మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అవతరింప చేయడం జరిగింది.  కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే మూసా సహీఫాలు మరియు తౌరాత్ ఒక్కటే అయితే ఈ విధంగా ఐదు పేర్లు అవుతాయి. మరియు అదే విధంగా ఏ గ్రంధాల గురించైతే మనకు తెలియదో వాటిపై కూడా మనం పరిపూర్ణంగా విశ్వాసం తీసుకురావాలి.

మూడో విషయం: దైవ ప్రవక్తలపై ఏ గ్రంథాలు అయితే అవతరించాయో వాటిపై మాత్రమే విశ్వాసముంచాలి. ఏ గ్రంధాలలోనైతే మార్పు చేర్పులు జరిగాయో వాటి పై విశ్వాసం ఉంచరాదు. ఉదాహరణకు మూసా ప్రవక్తపై అవతరింప చేయబడిన తౌరాత్ ను విశ్వసించాలి మరియు ఈసా ప్రవక్త పై అవతరించబడిన ఇంజీల్ గ్రంథం పై విశ్వాసం ఉంచాలి. ఇవి అసలు గ్రంథాలు. కానీ ఇప్పుడు ఏ గ్రంధాలైతే యూదులు చేతుల్లో మరియు క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయో అవి మార్పులకు లోనయ్యాయి. గ్రంథాలకు అవే పేర్లు పెట్టినప్పటికీ వారు తమ పూర్వీకులు చెప్పినటువంటి విషయాలను అందులో చేర్చారు మరియు ఇవే అసలు గ్రంథాలని ప్రకటించారు. మరియు సంవత్సరాల తరబడి  ప్రజలు ఆ కల్పిత కథనాలను పాటించుకుంటూ వారు మార్గభష్టత్వానికి లోనయ్యారు మరియు ప్రజలను కూడా మార్గభష్టత్వానికి లోను చేశారు. కనుక గతించిన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంథాలు మార్పు చేర్పులకు లోనవడం వలన అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపచేయబడినటువంటి దివ్య ఖుర్ఆన్ యొక్క రక్షణ బాధ్యతను స్వయంగా అల్లాహ్ నే తీసుకున్నాడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

ఈ వాక్యంలో జిక్ర్ అనగా ఖురాన్ అనే భావం

నాల్గొవ విషయం: ఏ విషయాలు అయితే ఆ గ్రంథాల ద్వారా వెల్లడించబడ్డాయో వాటిని సత్యమని నమ్మడం. ఉదాహరణకు ఖుర్ఆన్  మరియు ఖుర్ఆన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు, వాటిలో మార్పు చేర్పులకు గురికాకుండా ఉన్నటువంటి సంఘటనలు. అదేవిధంగా ఖుర్ఆన్ తెలియచేయనటువంటి విషయాలను మేము ధ్రువీకరించము మరియు తిరస్కరించం, ఎందుకంటే మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో ఇలా వచ్చింది – ఏదైతే గ్రంథ ప్రజలు మీకు తెలియ పరుస్తారో దానిని మీరు సత్యం లేక అసత్యం అని అనకండి,  ఈ విధంగా అనండి – “మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసం తెచ్చాము“. ఎందుకంటే ఒకవేళ వారి మాట సత్యం అయితే ధ్రువీకరించినట్లు అవుతుంది మరియు అసత్యం అయితే దానిని తిరస్కరించినట్లు అవుతుంది (అబూ దావూద్-3644)

ఐదొవ విషయం: ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ఆదేశాలు ఏవైతే రద్దు కాలేదో వాటిపై ఆచరించడం. ఉదాహరణకు: అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمۡ وَيَهۡدِيَكُمۡ سُنَنَ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ وَيَتُوبَ عَلَيۡكُمۡۗ]

అల్లాహ్‌ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు (అల్ నిసా :26)

మరోచోట ఇలా తెలియజేస్తున్నాడు.

 [أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَى ٱللَّهُۖ فَبِهُدَىٰهُمُ ٱقۡتَدِهۡۗ]

అల్లాహ్‌ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు (అల్ అన్ ఆమ్ :90)

ఆ ఆదేశాలలో ఖిసాస్ (ప్రతీకారం) కు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. అల్లాహ్ తఆలా తౌరాత్ గురించి ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశాడు.

وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ

(మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.) (అల్ మాయిదా : 45)

మరియు ఈ ఆజ్ఞ మన షరీఅత్ (చట్టం)లో కూడా భాగమై ఉంది. దీనిపై ఆచరించడం కూడా జరుగుతుంది అని విశ్వసించాలి. మన ధర్మం దీనికి విరుద్ధం కాదు మరియు ఈ ఆజ్ఞ రద్దు చేయబడలేదు.

ఆరవ విషయం: ఈ గ్రంథాలు మానవులందరినీ ఒకే ధర్మం వైపునకు ఆహ్వానిస్తాయి అని విశ్వసించడం. దీనినే తౌహీద్ అంటారు. తౌహీద్  మూడు రకాలు. 1. తౌహీదె ఉలూహియత్  2. తౌహీదె రుబూబియత్ 3. తౌహీదె అస్మా వసిఫాత్.

ఏడవ విషయం: ఖురాన్ గ్రంథం పూర్వ గ్రంథాలను ధ్రువీకరిస్తుంది. మరియు వాటిపై ఆధిపత్యం కలిగినటువంటిది. మరియు పూర్వ గ్రంథాలను పరిరక్షిస్తుంది. పూర్వ గ్రంథాలన్నీ కూడా ఈ దివ్య ఖురాన్ ద్వారానే రద్దు చేయబడ్డాయి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ]

ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. (అల్ మాయిదా :48)

ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు : “ఖురాన్ లో ఇలానే ఉంది, అల్లాహ్ మరియు అంతిమ దినం గురించి పూర్వ గ్రంథాలలో వచ్చిన వార్తలు ధృవీకరించబడ్డాయి మరియు మరింత వివరంగా  పేర్కొనబడ్డాయి. ఈ విషయాలపై. స్పష్టమైన రుజువులు మరియు వాదనలు సమర్పించబడ్డాయి. అదేవిధంగా, ప్రవక్తలందరి ప్రవక్త పదవులు మరియు సందేశహరుల సందేశం అంగీకరించబడింది. మరియు అదే విధంగా ప్రవక్తల ద్వారా పంపబడిన అన్ని చట్టాలను అంగీకరించడం జరిగింది, మరియు వివిధ ఆధారాల ద్వారా మరియు స్పష్టమైన రుజువుల ద్వారా ప్రవక్తలను మరియు గ్రంథాలను తిరస్కరించిన వారితో చర్చలు వాదన చేయటం. అదేవిధంగా అల్లాహ్ వారికి విధించిన శిక్షలను గురించి మరియు గ్రంథాలను అనుసరించే వారికి అల్లాహ్ చేసే సహాయాన్ని గురించి మరియు గ్రంథవహులు మునుపటి గ్రంధాలలో  జరిపిన మార్పుల గురించి  మరియు వక్రీకరణల గురించి  అల్లాహ్ ప్రస్తావించాడు. గ్రంథాలలో వారు చేసిన పనులను, అలాగే వారు దాచిన అల్లాహ్ ఆజ్ఞలను కూడా పేర్కొన్నాడు. మరియు ప్రతి ప్రవక్త తీసుకువచ్చిన షరీఅత్ చట్టం గురించి తెలియజేయడం జరిగింది. మరియు అలానే పవిత్ర ఖుర్ఆన్ గురించి తెలియపరచడం జరిగింది. అందువల్ల, పవిత్ర ఖురాన్ అనేక విధాలుగా మునుపటి గ్రంథాల కంటే ఆధిక్యతను  ప్రాధాన్యత పొందింది. ఈ ఖుర్ఆన్ గ్రంథాల ప్రామాణికతకు సాక్షి మరియు ఈ గ్రంథాలలోని వక్రీకరణల అబద్ధానికి సాక్షి.” (మజ్ మూఅల్ ఫతావా17/44)

ఆయన ఇంకా ఇలా తెలియజేశారు “ఖుర్ఆన్ విషయానికొస్తే, ఇది స్వతంత్ర గ్రంథం. దానిని విశ్వసించిన వారికి మరే ఇతర గ్రంథం అవసరం లేదు. ఈ ఖుర్ఆన్ మునుపటి అన్ని గ్రంధాల లక్షణాల కలయిక మరియు ఇతర గ్రంథాలలో ఉన్న అనేక లక్షణాలను కలిగి ఉంది. అందుకే ఈ గ్రంధం మునుపటి గ్రంధాలన్నింటిని ధృవీకరిస్తుంది మరియు అన్నింటికంటే శ్రేష్ఠమైనది. ఇది మునుపటి పుస్తకాలలోని సత్యాన్ని రుజువు చేస్తుంది మరియు వాటిలోని తిరోగమనాలను తిరస్కరిస్తుంది. మరియు అల్లాహ్ ఏ ఆజ్ఞలను రద్దు చేశాడో, ఇది వాటిని రద్దు చేస్తుంది, కాబట్టి ఈ ధర్మం సత్యాన్ని రుజువు చేస్తుంది, ఇది మునుపటి గ్రంథాలలో బలమైన భాగం, మరియు ఈ గ్రంధాలు మారిన మతాన్ని చెల్లుబాటు చేయవు, ఈ గ్రంథాలలో రద్దు చేయబడిన విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి“. (మజ్ మూఅల్ ఫతావా 19/184-185)

[1] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మొదటిది:- కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎవరిని సాటి కల్పించకూడదు, వారు ఎవరైనా సరే, విగ్రహం అయినా, మనుషులైనా ప్రవక్తలైనా, రాళ్ళు అయినా, ఇక వేరే ఇతర ఏ వస్తువులైనా సరే సాటి కల్పించరాదు. దీన్నిబట్టి అర్థం అవుతున్నటువంటి విషయం దైవ ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే, వాళ్ళు కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించేవారు.

[2] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో రెండవది:- విశ్వాస ప్రాథమిక విషయాలపై విశ్వాసం ఉంచడం. అవేమిటంటే అల్లాహ్ పై, దైవదూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై,  ప్రళయ దినంపై, విధిరాత మంచి చెడు అవడంపై విశ్వాసం ఉంచాలి.

[3] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మూడవది:- ప్రత్యేక ఆరాధనలను కేవలం అల్లాహ్ కొరకు విధిగా చేయడం. ఉదాహరణకు నమాజ్, జకాత్, రోజా మొదలైనవి. కానీ ప్రవక్తల రాకడ ప్రకారంగా ఆరాధనలు నిర్వహించబడే విధానములు విభిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు తౌరాత్ గ్రంథం కూడా నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది మరియు ఇంజీల్ గ్రంథం కూడా నమాజ్ నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది. అదే విధంగా ఖురాన్ గ్రంథం కూడా నమాజ్ గురించి ఆజ్ఞాపిస్తుంది. కానీ నమాజ్ విధానము, నమాజ్ ఆచరించే సమయము ఈ మూడు మతాలలో వేరువేరుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాసం యొక్క ఆజ్ఞ కూడా అంతే.

షరియత్ యొక్క వివరణాత్మక తీర్పులకు సంబంధించినంతవరకు, సాధారణ పరంగా అన్ని గ్రంధాలు ఈ విషయాన్ని అంగీకరిస్తాయి, అయితే కొన్నిసార్లు అవి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు అతని ఆధిపత్యానికి అనుగుణంగా ఉంటాయి  ఎందుకంటే అల్లాహ్ కు తన దాసులకు ఏది మేలో తెలుసు కాబట్టి ఆయన దానికి తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అల్లాహ్  ఇలా అంటున్నాడు :

[وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُۗ مَا كَانَ لَهُمُ ٱلۡخِيَرَةُۚ]

(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)(అల్ ఖసస్ :68)

మరోచోట ఇలా అంటున్నాడు:

[لِكُلّٖ جَعَلۡنَا مِنكُمۡ شِرۡعَةٗ وَمِنۡهَاجٗاۚ]

(మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము.)(అల్ మాయిదా:48)

ఉదాహరణకు అల్లాహ్ తఆలా వేటినైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ కొరకు హలాల్ అనగా ధర్మ సమ్మతం చేశాడో వాటిలో కొన్నింటిని తన జ్ఞానము మరియు వివేకంతో బనీ ఇస్రాయీల సమాజంపై వాటిని నిషిద్ధం చేశాడు. అవి వారి కంటే ముందు ధర్మసమ్మతం గావించబడినవి.

 అల్లాహ్ ఇలా అంటున్నాడు:

[فَبِظُلۡمٖ مِّنَ ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبَٰتٍ أُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَن سَبِيلِ ٱللَّهِ كَثِيرٗ]

యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ (అల్ నిసా:160)

[4] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో నాల్గవది:- న్యాయం యొక్క ఆజ్ఞ. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِۖ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము  ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! (అల్ హదీద్ :25)

[5] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఐదొవది:- ఐదు విషయాలను తప్పక కాపాడుకోవాలి అనే ఆజ్ఞాపించబడింది. అవి ఏమిటంటే ధర్మం, విశ్వాసం, ధనము, గౌరవము మరియు ప్రాణం.

[6] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఆరవది:- మంచి నైతికత గురించి ఆజ్ఞాపించడం జరిగింది మరియు చెడు నడవడిక నుండి వారించడం జరిగింది. ఉదాహరణకు: గ్రంథాలన్నీటిలో తల్లిదండ్రులకు విధేయత చూపాలని మరియు బంధువులతో బాంధవ్యాలు కలుపుకోవాలని,  అతిధులకు గౌరవ మర్యాదలు చేయాలని, నిరుపేదలను ఆదుకోవాలని అనేటువంటి ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. అదే విధంగా చెడును వారించడం ఉదాహరణకు: దౌర్జన్యం, తిరుగుబాటు, తల్లిదండ్రుల అవిధేయత, ఒకరి గౌరవ మర్యాదలతో ఆడుకోవడం, అబద్ధం, దొంగతనం, చాడీలు చెప్పడం, గీబత్  మొదలైనవి.

దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి కొన్ని లాభదాయకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు – ఆకాశం నుంచి అవతరింప చేయబడిన గ్రంథాలలో గొప్ప గ్రంధాలు రెండు ఉన్నాయి. అవి తౌరాత్ మరియు ఖుర్ఆన్. దివ్య ఖురాన్ లో అనేకచోట్ల ఈ రెండు గ్రంథాల ప్రస్తావన ఒకేసారి వచ్చింది. ఎందుకంటే ఈ రెండు గ్రంథాలు ఉన్నతమైనవి మరియు ఈ రెండు గ్రంథాల లో ఉన్నటువంటి చట్టము పరిపూర్ణం గావించబడినది.

ఓ అల్లాహ్ దాసులారా! నిశ్చయంగా ఖుర్ఆన్ అన్ని గ్రంథాల కంటే ఎంతో ఉన్నతమైనది. అందుకే అల్లాహ్ ఈ ఖురాన్ కు పూర్వ గ్రంథాలన్నీటిపై ఆధిక్యతను ప్రసాదించాడు. ఈ గ్రంథంలో ఇతర గ్రంథాలలో లేని అద్భుతాలు మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో మేలైన విషయాలు ఉన్నాయి.

ఖురాన్ అనగా ఇది అల్లాహ్ యొక్క వాక్యము. దీని ద్వారా అల్లాహ్ మాట్లాడాడు. అల్లాహ్ మాట్లాడినటువంటి వాక్యాలను జిబ్రాయిల్ దూత ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి వరకు చేరవేయబడ్డాయి తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఆ వాక్యాలను తన అనుచరులు వరకు చేర్చారు. వారు  ఖుర్ఆన్ ను తమ హృదయాలలో భద్రపరుచుకున్నారు. వాటిని ఆకులపై లేక కాగితాలపై లిఖించి భద్రపరిచారు. ఆ తర్వాత మూడవ ఖలీఫా ఉస్మాన్ (రదియల్లాహు అన్హు ) గారి పరిపాలనలో ఒక పుస్తక రూపంలో సంకలనం చేశారు. ఆ తర్వాత దాని నుంచి అనేక  కాపీలను చేసి ప్రచురించడం జరిగింది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

[1] ఈ ఖుర్ఆన్ అవతరణకు గల ఒక వివేకం ఏమిటంటే: ఆ ఖుర్ఆన్ యొక్క వాక్యాల పై యోచన చేసి బుద్ధిమంతులు ఉపదేశం పొందాలి అని మరియు వారిలో దైవభీతి జనించాలని. అల్లాహ్ ఇలా అంటున్నాడు :

[كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٞ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ]

ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము. (సాద్ : 29)

ఒకచోట ఇలా సెలవిస్తున్నాడు:

 [وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ قُرۡءَانًا عَرَبِيّٗا وَصَرَّفۡنَا فِيهِ مِنَ ٱلۡوَعِيدِ لَعَلَّهُمۡ يَتَّقُونَ أَوۡ يُحۡدِثُ لَهُمۡ ذِكۡرٗا]

ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్‌ఆన్‌గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. (తహా :113)

[2] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: దైవభీతిపరులకు ప్రతిఫలం ప్రసాదించుటకు మరియు తిరస్కారుల కొరకు శిక్ష ఉందని హెచ్చరించుటకు.

ఇలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

[ فَإِنَّمَا يَسَّرۡنَٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلۡمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوۡمٗا لُّدّٗا]

నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీ దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము. (మర్యమ్ :97)

[3] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: ధర్మ ఆదేశాలను ప్రజలకు తెలియజేయడానికి అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلذِّكۡرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيۡهِمۡ وَلَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ]

(అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము (అల్ నహ్ల్ :44)

మరొకచోట ఇలా అంటున్నాడు.

 [وَمَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِي ٱخۡتَلَفُواْ فِيهِ]

వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. (అల్ నహ్ల్ :64)

[4] మరోక వివేకవంతమైన విషయమేమిటంటే: విశ్వాసులు తమ విశ్వాసంపై స్థిరంగా ఉండాలని.

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు

[قُلۡ نَزَّلَهُۥ رُوحُ ٱلۡقُدُسِ مِن رَّبِّكَ بِٱلۡحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُواْ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ]

ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్‌) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు.” (అల్ నహ్ల్ :64)

[5] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే : ప్రజల మధ్య ఖుర్ఆన్ ద్వారా తీర్పు జరగాలని.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 [إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِتَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُۚ]

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము.) (అల్ నిసా : 105)

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించుగాక . అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యానికై  అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

 [إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారిగా చేయి. ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఆమీన్

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

దైవ గ్రంధాలపై విశ్వాసం (మెయిన్ పేజీ ):
https://teluguislam.net/belief-in-books/

ధర్మ సమ్మతమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ధర్మ సమ్మతమైన వసీలా [వీడియో]
https://youtu.be/aOiweVwQqFA [14 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్‌కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్‌కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్‌తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ
(అల్ హందులిల్లాహి వహ్ దహు)
అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు)
ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:

وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ
(వబ్తగూ ఇలైహిల్ వసీల)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)

ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.

అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.

అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.

ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.

ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)

మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.

ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.

ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.

మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:

فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ
(ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక)
అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)

ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.

నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:

أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
(అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్)
నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)

అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.

అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:

قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي
(ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ)
“నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)

అభిమాన సోదరులారా, ఇది ఐదవది.

ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.

దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.

కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.

  • మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
  • రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
  • మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
  • నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
  • ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
  • ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.

ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

సూరతుల్ కహఫ్ తఫ్సీర్: 18 – 22 వ భాగాలు: ఆయతులు 60 – 82 : మూసా & ఖిజరు యొక్క వృత్తాంతము [వీడియో]

బిస్మిల్లాహ్

18వ భాగం: (ఆయతులు 60 – 82) – పూర్తి వృత్తాంతము సంక్షిప్తంగా

[43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

19వ భాగం: (ఆయతులు 60 – 62)

20వ భాగం: (ఆయతులు 63 – 70)

21వ భాగం: (ఆయతులు 71 – 78)

22వ భాగం: (ఆయతులు 79 – 82)

సూరా అల్ కహఫ్ (ఆయతులు 60 – 82)

18:60 وَإِذْ قَالَ مُوسَىٰ لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّىٰ أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا
“ఏళ్ళ తరబడి నడవవలసి వచ్చినా సరే, రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంతవరకూ నేను నడుస్తూనే ఉంటాను” అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు (జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి).

18:61 فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا
తీరా వారిద్దరు సాగర సంగమానికి చేరుకున్నాక, అక్కడ తమ చేపను మరచి పోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది.

18:62 فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبًا
వారుభయులూ ముందుకు సాగిపోయిన తరువాత మూసా తన (వెంటనున్న) యువకుణ్ణి ఉద్దేశించి, “మా ఉదయ భోజనం తీసుకురా. నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాస పడాల్సి వచ్చింది” అన్నాడు.

18:63 قَالَ أَرَأَيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ وَمَا أَنسَانِيهُ إِلَّا الشَّيْطَانُ أَنْ أَذْكُرَهُ ۚ وَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ عَجَبًا
దానికతను, “చూశారా (ఎంత పనయిందో)! మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచేపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా షైతానే నన్ను మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది” అని వివరించాడు.

18:64 قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبْغِ ۚ فَارْتَدَّا عَلَىٰ آثَارِهِمَا قَصَصًا
“(అరె!) మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా!” అని మూసా అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాదచిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు.

18:65 فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا
అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము.

18:66 قَالَ لَهُ مُوسَىٰ هَلْ أَتَّبِعُكَ عَلَىٰ أَن تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا
మూసా అతనితో, “మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి, నేను మీ వెంట ఉండవచ్చా?” అని అభ్యర్థించాడు.

18:67 قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
దానికతను, “మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం ఓపిక పట్టలేరు.

18:68 وَكَيْفَ تَصْبِرُ عَلَىٰ مَا لَمْ تُحِطْ بِهِ خُبْرًا
“అయినా మీరు మీ జ్ఞానపరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది?” అన్నాడు.

18:69 قَالَ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ صَابِرًا وَلَا أَعْصِي لَكَ أَمْرًا
“అల్లాహ్‌ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను” అని (మూసా) సమాధానమిచ్చాడు.

18:70 قَالَ فَإِنِ اتَّبَعْتَنِي فَلَا تَسْأَلْنِي عَن شَيْءٍ حَتَّىٰ أُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا
“సరే! నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే (బాగా గుర్తుంచుకోండి!) ఏ విషయం గురించైనాసరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంతవరకూ నన్నేమీ అడగకూడదు” అన్నాడతను.

18:71 فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا
వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరినీ ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు.

18:72 قَالَ أَلَمْ أَقُلْ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
“మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా!?” అని (ఖిజరు) అన్నాడు.

18:73 قَالَ لَا تُؤَاخِذْنِي بِمَا نَسِيتُ وَلَا تُرْهِقْنِي مِنْ أَمْرِي عُسْرًا
“నా మరుపుపై నన్ను పట్టుకోకండి. నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి” అని మూసా విన్నవించుకున్నాడు.

18:74 فَانطَلَقَا حَتَّىٰ إِذَا لَقِيَا غُلَامًا فَقَتَلَهُ قَالَ أَقَتَلْتَ نَفْسًا زَكِيَّةً بِغَيْرِ نَفْسٍ لَّقَدْ جِئْتَ شَيْئًا نُّكْرًا
ఆ తరువాత వారుభయులూ ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతనా అబ్బాయిని చంపేశాడు. “మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణినీ హతమార్చి ఉండలేదుకదా! నిశ్చయంగా మీరు అత్యంత ఘోరకృత్యానికి పాల్పడ్డారు” అని మూసా చెప్పాడు.

18:75 قَالَ أَلَمْ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
“నా వెంట ఉంటూ మీరు ఏ మాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా?” అని ఆయన అన్నాడు.

18:76 قَالَ إِن سَأَلْتُكَ عَن شَيْءٍ بَعْدَهَا فَلَا تُصَاحِبْنِي ۖ قَدْ بَلَغْتَ مِن لَّدُنِّي عُذْرًا
“ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనయినా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది” అని మూసా ప్రాధేయపడ్డాడు.

18:77 فَانطَلَقَا حَتَّىٰ إِذَا أَتَيَا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَمَا أَهْلَهَا فَأَبَوْا أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارًا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُ ۖ قَالَ لَوْ شِئْتَ لَاتَّخَذْتَ عَلَيْهِ أَجْرًا
వారిద్దరూ అక్కణ్ణుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యమివ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను (యధాతథంగా) నిలబెట్టాడు. “మీరు గనక తలచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా!” అని మూసా అన్నాడు.

18:78 قَالَ هَٰذَا فِرَاقُ بَيْنِي وَبَيْنِكَ ۚ سَأُنَبِّئُكَ بِتَأْوِيلِ مَا لَمْ تَسْتَطِع عَّلَيْهِ صَبْرًا
దానికతను ఈ విధంగా సమాధానమిచ్చాడు: “ఇక మీకూ- నాకూ మధ్య చీలిక ఏర్పడినట్లే (మన సావాసం చెల్లిపోయింది). మీరు సహించలేకపోయిన ఆ మూడు విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను (వినండి)….”

18:79 أَمَّا السَّفِينَةُ فَكَانَتْ لِمَسَاكِينَ يَعْمَلُونَ فِي الْبَحْرِ فَأَرَدتُّ أَنْ أَعِيبَهَا وَكَانَ وَرَاءَهُم مَّلِكٌ يَأْخُذُ كُلَّ سَفِينَةٍ غَصْبًا
“ఆ పడవ సంగతి – అది సముద్రంలో పనిచేసుకునే కొందరు నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పర చాలనుకున్నాను. ఎందుకంటే, ఇంకాస్త ముందుకుపోతే కనిపించిన ప్రతి (మంచి) పడవనూ బలవంతంగా వశపరచుకునే రాజు ఒకడున్నాడు.

18:80 وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا
“ఇకపోతే ఆ అబ్బాయి సంగతి; అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది.

18:81 فَأَرَدْنَا أَن يُبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًا مِّنْهُ زَكَاةً وَأَقْرَبَ رُحْمًا
“అందుకే వారికి వారి ప్రభువు – అతనికి బదులుగా – అతనికన్నా సౌశీల్యవంతుడైన, దయార్ద్రతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము.

18:82 وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنزٌ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَن يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِع عَّلَيْهِ صَبْرًا
“ఇక గోడ సంగతంటారా, ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాధ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాధలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. అంతేగాని నా అంతట నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనుక దాగివున్న వాస్తవికత ఇదే!”


సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf