అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర – ఖురాన్ కథామాలిక

అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర
https://youtu.be/t27mDKl4w3E
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

 وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِن ضُرٍّ

మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించే వాడవు” అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. (ఖుర్ ఆన్  21: 83, 84)

కొందరు  దైవదూతలు అల్లాహ్ సృష్టి లోని కొన్ని ప్రాణుల గురించి మాట్లాడు కోసాగారు. విధేయత చూపి అల్లాహ్ ప్రసన్నతను పొందిన వారి గురించి వారు చర్చించుకోసాగారు. అలాగే అహంభావంతో విర్రవీగి అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి సంభాషిస్తుండగా ఒక దైవదూత, “ప్రస్తుతం భూమిపై ఉన్న వారిలో అత్యుత్తముడు అయ్యూబ్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగినవాడు. గొప్ప సహనశీలి. ఎల్లప్పుడూ అపార కరుణా మయుడైన విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు. అల్లాహ్ ను ఆరాధించే వారికి ఆయన గొప్ప ఆదర్శం. అందుకు ప్రతిఫలంగా అల్లాహ్ ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అపార సంపదలు ఇచ్చాడు. అయ్యూబ్ ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు. స్వార్థం ఆయనలో లేనేలేదు. ఆయన కుటుంబం, ఆయన సేవకులు, అవసరార్థులు, బీదలు అందరూ ఆయన సంపదలో భాగం పొందుతున్నారు. ఆయన బీదలకు అన్నం పెడతారు. వారికి దుస్తులు ఇస్తారు. బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం వారిని కొంటారు. తన నుంచి దానధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. ఆయన చాలా ఉదార స్వభావి, చాలా మంచి వాడు” అంటూ ప్రశంసించారు.

ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
https://youtu.be/aog37XDhX8c [33 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్రను వివరిస్తారు. ఆదం (అలైహిస్సలాం) మరియు వారి కుమారులైన ఖాబిల్ మరియు హాబిల్ కథను పునశ్చరణ చేస్తూ, హాబిల్ హత్య తర్వాత ఖాబిల్ తన తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడని గుర్తుచేస్తారు. ఆదం (అలైహిస్సలాం) తర్వాత, ఆయన కుమారుడు షీస్ (అలైహిస్సలాం) ప్రవక్తగా నియమించబడ్డారు. షైతాన్ ఖాబిల్ యొక్క మార్గభ్రష్టులైన సంతానం వద్దకు మానవ రూపంలో వచ్చి, వారిని సంగీతం (ఫ్లూట్) ద్వారా మభ్యపెట్టి, అశ్లీలత మరియు వ్యభిచారంలోకి నెట్టాడు. ఈ పాపం పెరిగిపోయినప్పుడు, అల్లాహ్ ఇద్రీస్ (అలైహిస్సలాం)ను ప్రవక్తగా పంపారు. ఆయన పాపులను హెచ్చరించి, మానవ చరిత్రలో మొదటిసారిగా దైవ మార్గంలో యుద్ధం (జిహాద్) చేశారు. ఇద్రీస్ (అలైహిస్సలాం) మొట్టమొదటిగా కలం ఉపయోగించిన మరియు బట్టలు కుట్టిన వ్యక్తి అని చెప్పబడింది. ఖురాన్ మరియు హదీసులలో ఆయన ఉన్నత స్థానం గురించి ప్రస్తావించబడింది, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ యాత్రలో ఆయనను నాలుగవ ఆకాశంలో కలిశారు. ఈ కథ నుండి, షైతాన్ యొక్క కుతంత్రాలు, సంగీతం యొక్క చెడు ప్రభావం, మరియు పరాయి స్త్రీ పురుషులు ఏకాంతంగా ఉండటం యొక్క నిషేధం వంటి పాఠాలు నేర్చుకోవాలని వక్త ఉద్బోధిస్తారు.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వ లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَسْلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

ఈనాటి ప్రసంగంలో మనం ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. అయితే, మాట ప్రారంభించడానికి ముందు ఒక విషయం వైపుకు మీ దృష్టి మరలించాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఇంతకుముందు జరిగిన ప్రసంగంలో మనం ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి పుట్టుక గురించి, ఆయన భూమండలం మీద దిగడం గురించి, భూమి మీద ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారు ఇద్దరూ జంటగా నివసించటము, వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించటము, ఈ విషయాలన్నీ వివరంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విన్నాం.

ఆ ప్రసంగంలో నేను ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ ఒకచోట ఏమన్నానంటే, ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 మంది సంతానాన్ని కల్పిస్తే వారిలో ఇద్దరు ప్రముఖులు, ఒకరు ఖాబిల్, మరొకరు హాబిల్. వారిద్దరి మధ్య పెళ్ళి విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ఖాబిల్ అన్యాయంగా హాబిల్ ని హతమార్చేశాడు. హతమార్చిన తర్వాత, హత్య చేసేసిన తర్వాత అతను తల్లిదండ్రుల వద్ద నుండి దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు అన్న విషయము నేను ప్రస్తావించాను.

అది మనము ఇప్పుడు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రసంగంలో ఇన్ షా అల్లాహ్, ఆ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి స్థిరపడిపోయిన ఖాబిల్ గురించి చర్చ వస్తుంది కాబట్టి.

ఖాబిల్ హంతకుడు. నేరం చేశాడు. తన సోదరుడిని హతమార్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్ద నేరస్తుడుగా, అవమానంగా ఉండటానికి ఇష్టపడక అక్కడి నుండి అతను దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు.

చరిత్రకారులు, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, ఆదం అలైహిస్సలాం మరియు ఆదం అలైహిస్సలాం వారి సంతానము పర్వతాలకు సమీపంలో నివసించేవారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ సృష్టి ప్రారంభంలో, మానవ చరిత్ర ప్రారంభంలో మానవులను ఆ విధంగా జీవించడానికి సౌకర్యం కల్పించగా, వారు పర్వతాలకు సమీపంలో జీవించసాగారు, నివసించసాగారు.

అయితే, ఈ ఖాబిల్ నేరం చేసిన తర్వాత, హత్య చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని విడిచేసి దూరంగా మైదానంలో వెళ్ళి స్థిరపడిపోయాడు. అంటే కొండ పర్వతాలకు సమీపంలో ఉండకుండా మైదానంలో వెళ్ళి అతను అక్కడ స్థిరపడిపోయాడు. అతని జీవితం అక్కడ సాగుతూనే ఉంది. అక్కడ అతనికి సంతానము కలిగింది. ఆ సంతానోత్పత్తిలో అక్కడ ఆ రకంగా పూర్తి ఒక జాతి సృష్టించబడింది.

ఇటు ఆదం అలైహిస్సలాం వారు జీవించినంత కాలం వారి సంతానానికి తండ్రిగాను, ఒక ప్రవక్తగా, బోధకునిగాను సత్ప్రవర్తన నేర్పించి, మంచి గుణాలు నేర్పించి, దైవ భక్తి మరియు దైవ నియమాలు నేర్పించి, ఆ తర్వాత ఆయన మరణించారు. ఆదం అలైహిస్సలాం వారు మరణించిన ఒక సంవత్సరానికి హవ్వా అలైహిస్సలాం వారు కూడా మరణించారు. ఈ విధంగా ఒక సంవత్సర వ్యవధిలోనే ఆది దంపతులు ఇద్దరూ మరణించారు.

అయితే, ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డలకు దైవ నియమాలు నేర్పించే బాధ్యత షీస్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఆదం అలైహిస్సలాం వారి కుమారులలోనే ఒక కుమారుడు షీస్ అలైహిస్సలాం.

షీస్ అలైహిస్సలాం వారికి హవ్వా అలైహిస్సలాం ఆ పేరు ఎందుకు నిర్ణయించారంటే, ఎప్పుడైతే హాబిల్ హతమార్చబడ్డాడో, ఒక బిడ్డను కోల్పోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వెంటనే హవ్వా అలైహిస్సలాం వారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. అప్పుడు ఆమె, “నా ఒక బిడ్డ మరణించిన తర్వాత అల్లాహ్ నన్ను ఒక కానుకగా మరొక కుమారుడిని ఇచ్చాడు కాబట్టి ఇతను నాకు అల్లాహ్ తరపు నుంచి ఇవ్వబడిన కానుక” అంటూ, అల్లాహ్ కానుక అనే అర్థం వచ్చేటట్టుగా షీస్ అని ఆయనకు పేరు పెట్టారు, నామకరణం చేశారు.

అంటే ప్రతి బిడ్డ అల్లాహ్ కానుకే, కానీ ఆ సందర్భంలో ఎప్పుడైతే ఒక కుమారుడిని కోల్పోయారో, మరొక కుమారుడిని అల్లాహ్ వెంటనే ప్రసాదించాడు కాబట్టి, ఆ విధంగా ఆమె తలచి అతనికి షీస్ అని నామకరణం చేశారు. ఆ విధంగా ఆయన పేరు షీస్ అని పడింది.

ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ప్రవక్త పదవిని ఇచ్చాడు. ఆదం అలైహిస్సలాం కూడా మరణించే ముందే షీస్ వారిని దైవ నియమాలు ఎలా బోధించాలన్న విషయాలు వివరించారు. ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం షీస్ అలైహిస్సలాం ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తానికి దైవ వాక్యాలు వినిపించేవారు, దైవ విషయాలు, దైవ నియమాలు బోధించేవారు.

ఇదిలా ఉండగా, ఇప్పుడు షైతాను తన పని ప్రారంభించాడు. అతనేం చేశాడంటే, అతను దూరం నుంచి గమనించాడు. ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తం అటు అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. వారిలో ప్రవక్త ఉన్నారు, బోధకులు ఉన్నారు, దైవ నియమాలు నేర్పిస్తున్నారు. వారందరూ భక్తి శ్రద్ధలతో జీవించుకుంటున్నారు. కానీ ఈ ఖాబిల్ మాత్రము దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు. అతని సంతానము అతని సంతానము కూడా అక్కడనే పెరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి ఒక జాతి అటువైపు స్థిరపడిపోయింది. అటు ఆ జాతి కూడా పెరుగుతూ ఉంది. ఇటు ఆదం అలైహిస్సలాం వారి సంతానము కూడా పెరుగుతూ ఉంది.

అప్పుడు షైతాను, ఇక్కడ ప్రవక్తలు లేరు, ఖాబిల్ నివసిస్తున్న చోట, ఖాబిల్ జాతి నివసిస్తున్న చోట బోధకులు లేరు అని గమనించాడు. అప్పుడు అతను ఒక మానవ అవతారం ఎత్తి మనుషుల మధ్యకి ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళిపోయాడు. ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళి చూస్తే, వారిలో అసభ్యత, అశ్లీలత, దురాచారాలు చాలా ఎక్కువగా చూశాడు. అప్పుడు అతను అనుకున్నాడు, “నాకు సరైన ప్రదేశం ఇది, నాకు కావలసిన స్థలము ఇదే” అని అతనికి తోచింది.

ఆ తర్వాత అతను అక్కడే స్థిరపడిపోయి, ఆ తర్వాత అతను ఏం చేశాడంటే, ఒక ఫ్లూట్ తయారు చేశాడు. ఇక్కడి నుంచి గమనించండి, ఎలా షైతాన్ మానవులను నెమ్మదిగా తప్పు దోవకి నెట్టుతాడో. ఒకేసారి సడన్‌గా ఒక పెద్ద నేరంలోకి నెట్టేయడు. నెమ్మదిగా, క్రమంగా, క్రమంగా వారిని నెట్టుకుంటూ నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద పాపంలోకి, ఊబిలోకి నెట్టేస్తాడు. అలా ఎలా చేస్తాడో గమనించండి ఒకసారి.

ఒక ఫ్లూట్ తయారు చేశాడండి. ఒక ఫ్లూట్ తయారు చేసిన తర్వాత, ప్రతి రోజూ సాయంత్రం ఆ రోజుల్లో కరెంటు, అలాగే టీవీలు, ఇతర విషయాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి సాయంకాలము కూర్చొని ఏదైనా కథ చెప్తున్నాడంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. లేదు ఏదైనా ఒక విన్యాసము చేసి చూపిస్తున్నాడు అంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. అలా జరిగేది. మన చిన్ననాటి రోజుల్లో కూడా మనం ఇలాంటి కొన్ని విషయాలు చూశాం.

అదే విధంగా ఆ రోజుల్లో అతను ఏం చేసేవాడంటే, ఫ్లూట్ తయారు చేసి సాయంత్రం పూట ఆ ఫ్లూట్ వాయించేవాడు. ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ మంత్రముగ్ధులయ్యి అతని వద్ద వచ్చి గుమిగూడేవారు. ఒక రోజు కొంతమంది వచ్చారు. తర్వాత రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతూ పోయింది, పెరుగుతూ పోయింది.

అది గమనించిన షైతాను వారికి ఒక పండగ రోజు కూడా నిర్ణయం చేశాడు తన తరపు నుంచే. చూడండి. ఆ పండగ రోజు అయితే మరీ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడేవారు. అప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా వారి కలయిక జరిగేది. అప్పుడు అతను బాగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారు ఉర్రూతలూగిపోయేవారు.

అయితే, ఇది ఇలా జరుగుతూ ఉండగా, అటు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో నుంచి ఒక వ్యక్తి ఒక రోజు అనుకోకుండా ఇటువైపు వచ్చేసాడు.వచ్చి చూస్తే ఇక్కడ నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు అనేటివి ఏమీ లేవు. విచ్చలవిడితనం ఎక్కువ ఉంది. అశ్లీలత ఎక్కువ ఉంది. ఆడ మగ కలయికలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికీ ఎలాంటి కట్టుబాట్లు లేవు, నిబంధనలు లేవు, సిగ్గు, లజ్జ, మానం అనే బంధనాలే లేవు. అదంతా అతను చూశాడు. అక్కడ ఉన్న మహిళల్ని, అమ్మాయిల్ని కళ్ళారా చూశాడు. వారి అందానికి ఇతను కూడా ఒక మైకంలోకి దిగిపోయాడు.

తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఒక రోజు వచ్చాడు, ఇక్కడ జరుగుతున్న విషయాలు, ఆ ఫ్లూట్ వాయించడము, ప్రజలందరూ అక్కడ గుమిగూడటము, వారందరూ కేరింతలు పెట్టడము, ఇదంతా గమనించి అతను వారి అందానికి ప్రభావితుడయ్యి వెళ్ళిపోయి తన స్నేహితులకు ఆయన్ని తెలియజేశాడు. చూడండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఈ విషయాలను గమనించాడు, వెళ్ళి తన స్నేహితులకు చెప్పగా వారిలో కూడా కోరిక పుట్టింది. ప్రతి వ్యక్తితో షైతాన్ ఉన్నాడు కదా లోపల, చెడు ఆలోచనలు కలిగించడానికి.

వారిలో కూడా కోరిక పుట్టగా, వారు కూడా రహస్యంగా ఎవరికీ తెలియకుండా వారు కూడా ఒక రోజు వచ్చారు. వారు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాలను చూసి, ఆ మహిళల అందానికి వారు కూడా ప్రభావితులయ్యారు. ఆ విధంగా ముందు ఒక వ్యక్తి, ఆ తర్వాత అతని స్నేహితులు, వారి స్నేహితుల స్నేహితులు, ఈ విధంగా అటు అటవీ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నివసిస్తున్న వారు కూడా కొద్దిమంది కొద్దిమంది రావడం ప్రారంభించారు. ఆ విధంగా వారు కూడా ఇటువైపు వచ్చి వీరితో పాటు కలిసిపోవడం ప్రారంభించారు.

ఈ విధంగా వారి రాకపోకలు ఏర్పడ్డాయి. అటు కొత్త కొత్త మహిళలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాల తర్వాత అక్రమ సంబంధాలకు దారి తీశాయి. ఆ తర్వాత, ఆ అక్రమ సంబంధాల వద్దనే షైతాను వారిని వదిలిపెట్టలేదు. వ్యభిచారం అనే ఊబిలోకి పూర్తిగా నెట్టేశాడు. వ్యభిచారం విచ్చలవిడితనం ప్రారంభమైపోయింది. కొద్ది మంది అయితే ప్రతి రోజూ రావటము, వెళ్ళటం ఎందుకండి, ఇక్కడే స్థిరపడిపోతే పోదు కదా అని ఎవరిలో అయితే భక్తి లోపం ఉందో, బలహీనత ఉందో వారైతే ఆ ప్రదేశాన్నే త్యజించేసి ఏకంగా వచ్చి ఇక్కడే మైదానంలో స్థిరపడిపోయారు.

ఆ విధంగా షైతాన్ ఒక్క ఫ్లూట్ సాధనంతో ప్రజల్లో వ్యభిచారాన్ని ప్రారంభం చేశాడు. అందుకోసమే ఒక్క విషయం గమనించండి. ధార్మిక పండితులు ఒక మాట తెలియజేశారు అదేమిటంటే “అల్-గినావు మిఫ్తాహుజ్జినా” అనగా సంగీతము వ్యభిచారానికి తాళం చెవి లాంటిది. ఇక్కడ ప్రజల మధ్య, ఇతర పురుషుల, మహిళల మధ్య అక్రమ సంబంధం ఎలా ఏర్పడింది? ఏ విషయం వారికి ఆకర్షితులు చేసింది? మ్యూజిక్, ఫ్లూట్ శబ్దం. దానినే మనము మ్యూజిక్ అనొచ్చు, సంగీతము అనొచ్చు. కదండీ. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇన్నష్షైతాన యజ్రీ ఫిల్ ఇన్సాని మజ్రద్దమ్.” షైతాన్ మనిషి నరనరాలలో నడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనిషి ఆ సంగీతాన్ని వింటాడో, మ్యూజిక్ వింటాడో, అతనిలో ఉన్న షైతాను నాట్యం చేస్తాడు. అప్పుడు మనిషి కూడా ఉర్రూతలూగిపోతాడు, అతని ఆలోచనలు కూడా చెల్లాచెదురైపోతూ ఉంటాయి. కాబట్టి సంగీతం అల్లాహ్ కు ఇష్టం లేదు. షైతానుకు ప్రియమైనది, ఇష్టమైనది. కాబట్టి అదే పరికరాన్ని అతను తయారు చేశాడు, దాన్నే సాధనంగా మార్చుకొని ప్రజల్లో అతను లేని ఒక చెడ్డ అలవాటుని సృష్టించేశాడు.

షీస్ అలైహిస్సలాం ఆ రోజుల్లో ప్రవక్తగా ఉంటున్నప్పుడు వారు జాతి వారికి చాలా రకాలుగా వారిని హెచ్చరించారు, దైవ విషయాలు తెలియజేసినప్పటికిని వారు షీస్ అలైహిస్సలాం వారి మాటను గ్రహించలేకపోయారు. షీస్ అలైహిస్సలాం వారి మాటను పడచెవిన పెట్టేశారు. చివరకు ఏమైందంటే, షీస్ అలైహిస్సలాం వారి మరణం సంభవించింది. షీస్ అలైహిస్సలాం వారి మరణానంతరం దైవ భీతితో జీవిస్తున్న వారి సంఖ్య రాను రాను క్షీణిస్తూ పోయింది. వ్యభిచారానికి, అశ్లీలానికి ప్రభావితులైన వారి సంఖ్య రాను రాను పెరుగుతూ పోయింది. అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరొక ప్రవక్తను, మరొక బోధకుడిని పుట్టించాడు. ఆయన పేరే ఇద్రీస్ అలైహిస్సలాం.

ఇద్రీస్ అలైహిస్సలాం ఈజిప్ట్ (మసర్) దేశంలో జన్మించారని కొంతమంది చరిత్రకారులు తెలియజేశారు. మరి కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే, లేదండీ, ఆయన బాబుల్, బాబిలోనియా నగరంలో జన్మించారు, ఆ తర్వాత వలస ప్రయాణం చేసి ఆయన మసర్, ఈజిప్ట్ కి చేరుకున్నారు అని తెలియజేశారు. ఏది ఏమైనాకి, ఏది ఏమైనప్పటికీ ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఈజిప్ట్ దేశంలో, మసర్ దేశంలో నివసించారన్న విషయాన్ని చరిత్రకారులు తెలియజేశారు.

ఇద్రీస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త పదవి ఇవ్వగా, ఇద్రీస్ అలైహిస్సలాం ఎవరైతే వ్యభిచారంలో ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని దైవ శిక్షల నుండి హెచ్చరించారు. దైవ నియమాలను తెలియజేశారు. పద్ధతి, సిగ్గు, లజ్జ, సంస్కారం అనే విషయాలు వారికి వివరించి తెలియజేశారు.

దైవ నియమాలకు ఎలా కట్టుబడి, ఎలా సౌశీల్యవంతులుగా జీవించుకోవాలన్న విషయాన్ని వారు వివరించి మరీ తెలియజేయగా చాలా తక్కువ మంది మాత్రమే తప్పును గ్రహించి, పశ్చాత్తాపపడి, తప్పును, నేరాన్ని ఒప్పుకొని అల్లాహ్ సమక్షంలో క్షమాభిక్ష వేడుకొని మళ్ళీ భక్తి వైపు వచ్చేశారు. కానీ అధిక శాతం ప్రజలు మాత్రము తమ తప్పుని అంగీకరించలేదు, తమ తప్పుని వారు అంగీకరించటం అంగీకరించకపోవడమే కాకుండా దానిని విడనాడలేదు, దానిని ఒక సాధారణమైన విషయంగా భావిస్తూ అలాగే జీవితం కొనసాగించడం ప్రారంభం చేశారు.

చాలా సంవత్సరాల వరకు ఇద్రీస్ అలైహిస్సలాం వారికి దైవ వాక్యాలు వినిపిస్తూ పోయారు, బోధిస్తూ పోయారు, తెలియజేస్తూ పోయారు కానీ ఫలితం లేకపోయేసరికి అల్లాహ్ ఆజ్ఞతో ఇద్రీస్ అలైహిస్సలాం తమ వద్ద ఉన్న విశ్వాసులను, దైవ భీతిపరులను, భక్తులను తీసుకొని, దైవ నియమాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి మీద యుద్ధం ప్రకటించారు.

మానవ చరిత్రలో, ఈ భూమండలం మీద అందరికంటే ముందు యుద్ధం ప్రారంభించిన ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ యుద్ధంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు, దైవ భీతిపరులకు సహాయం చేశాడు. అధర్మంగా, అన్యాయంగా, అసభ్యంగా జీవిస్తున్న వారు ఓడిపోయారు. వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

మిత్రులారా, యుద్ధం చేసిన తర్వాత, పాపిష్ఠులు దైవ భక్తుల చేత శిక్షించబడిన తర్వాత ఇద్రీస్ అలైహిస్సలాం మళ్ళీ ప్రజలకు దైవ భీతి, నియమాలు నేర్పించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ విధంగా ప్రపంచంలో కొద్దిమంది దైవ భీతిపరులు మళ్ళీ దైవ భక్తిగా జీవిస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా వారికి మరిన్ని విషయాలు నేర్పించాడు.

మనం చూసినట్లయితే, ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి కలం పరిచయం చేయించాడు. ఈ భూమండలం మీద, మానవ చరిత్రలో అందరికంటే ముందు కలం సృష్టించింది, ఉపయోగించింది ఇద్రీస్ అలైహిస్సలాం వారు అని చరిత్రకారులు తెలియజేశారు. అలాగే, బట్టలు కుట్టటము కూడా ఈ భూమండలం మీద అందరికంటే ముందు ఇద్రీస్ అలైహిస్సలాం వారే ప్రారంభించారు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ విధంగా ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఉన్నంతవరకు జనులకు, మానవులకు అనేక విషయాలు నేర్పించారు, తెలియజేశారు, దైవ వాక్యాలు కూడా వినిపించుకుంటూ జీవితం ముందుకు కొనసాగించారు.

ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ లో రెండు చోట్ల వచ్చి ఉంది. ఒకటి సూరా అంబియా, 21వ అధ్యాయం, 85వ వాక్యంలో అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తల పేర్లను ప్రస్తావిస్తూ ఇద్రీస్ అలైహిస్సలాం వారి పేరు కూడా ప్రస్తావించాడు. పేరు ప్రస్తావన మాత్రమే అక్కడ జరిగింది. అయితే, రెండవ చోట ఖురాన్ లోని సూరా మర్యం, 19వ అధ్యాయం, 56, 57 వాక్యాలలో ఇద్రీస్ అలైహిస్సలాం వారి గురించి ప్రస్తావిస్తూ,

وَاذْكُرْ فِي الْكِتَابِ إِدْرِيسَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا وَرَفَعْنَاهُ مَكَانًا عَلِيًّا
(వజ్కుర్ ఫిల్ కితాబి ఇద్రీస ఇన్నహూ కాన సిద్దీఖన్ నబియ్యన్, వ రఫఅనాహు మకానన్ అలియ్యా)

ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితిపరుడైన ప్రవక్తే. మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము.” (19:56-57)

అని తెలియజేశాడు. .ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండవ వాక్యంలో “వ రఫఅనాహు మకానన్ అలియ్యా” (మేము అతన్ని ఉన్నత స్థానానికి లేపాము) అని తెలియజేశాడు కదా, దాన్ని వివరిస్తూ కొంతమంది ఉల్లేఖకులు ఏమని తెలియజేశారంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి కీర్తిని పెంచాడు అని తెలియజేశారు.

మరి కొన్ని ఉల్లేఖనాలలో ఏమని తెలపబడింది అంటే, ఇద్రీస్ అలైహిస్సలాం వారు మరణం సమీపించినప్పుడు, ఆయన మరణ సమయం సమీపించిందన్న విషయాన్ని తెలుసుకొని, ఒక దైవదూత వీపు ఎక్కి ఆకాశాల పైకి వెళ్ళిపోయారు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం దాటుకుంటూ నాలుగవ ఆకాశంలోకి చేరుకుంటే అటువైపు నుంచి ప్రాణం తీసే దూత కూడా వస్తూ ఎదురయ్యాడు. అతను ఆ దూతతో అడిగాడు, “ఏమండీ, నేను ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు తీయటానికి వస్తున్నాను. నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీయండి అని పురమాయించాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఆయన భూమండలం మీద కదా నివసిస్తున్నాడు, అల్లాహ్ ఏంటి నాకు నాలుగవ ఆకాశం మీద ఆయన ప్రాణము తీయమని చెప్తున్నాడు అని నేను ఆశ్చర్యపోతూ వస్తున్నాను. ఇది ఎలా ఇది ఎలా సంభవిస్తుందండి? ఇది అసంభవం కదా, ఆయన భూమి మీద నివసిస్తున్నాడు, నాలుగో ఆకాశం మీద నేను ఆయన ప్రాణాలు ఎలా తీయగలను?” అని ఆ దూతతో అడిగితే అప్పుడు ఆ దూత అన్నాడు, “లేదండీ, అనుకోకుండా ఇద్రీస్ అలైహిస్సలాం వారు నేను ఆకాశాల పైకి వెళ్ళిపోతాను అంటూ నా వీపు మీద ఎక్కి వచ్చేసారు, చూడండి” అని చెప్పగా అప్పుడు ఆ దూత ఆయన ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీశాడు అని కొన్ని ఉల్లేఖనాల్లో తెలపబడింది. అయితే చూస్తే ఈ ఉల్లేఖనాలన్నీ బలహీనమైనవి.కాబట్టి ఈ బలహీనమైన ఉల్లేఖనాలను మనము ఆధారంగా తీసుకోలేము. కాకపోతే ఈ బలహీనమైన విషయాలు ఎవరైనా ఎక్కడైనా బోధించవచ్చు, అది బలహీనమైన మాట అన్న విషయము మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆ విషయాన్ని వివరించాను.

ఏది ఏమైనప్పటికిని, ఇద్రీస్ అలైహిస్సలాం వారి ఆయుష్షు పూర్తి అయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు సహజ మరణమే ప్రసాదించాడు. ఆయన సహజంగానే మరణించారు.

అయితే, ఒక ప్రామాణికమైన ఉల్లేఖనం మనకు దొరుకుతుంది. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర చేసిన ఉల్లేఖనము. ఆ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశాల వైపు వెళ్ళినప్పుడు, మొదటి ఆకాశం మీద ఆదం అలైహిస్సలాం వారితో కలిశారు. రెండవ ఆకాశం మీద ఈసా అలైహిస్సలాం వారితో కలిశారు. మూడవ ఆకాశం మీద యూసుఫ్ అలైహిస్సలాం వారితో కలిశారు. నాలుగవ ఆకాశం మీద ఇద్రీస్ అలైహిస్సలాం తో ఆయన కలిశారు. ఇది మాత్రం ప్రామాణికమైన హదీసులలో తెలపబడి ఉంది.

ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తలను ఆకాశాల మీద ఉంచి ఉన్నాడో, వారిలో ఇద్రీస్ అలైహిస్సలాం నాలుగవ ఆకాశం మీద ఉన్నారన్న విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర నుండి వచ్చిన తర్వాత తెలియజేశారు. కాబట్టి ఇద్రీస్ అలైహిస్సలాం ఎంతో కీర్తి పొందిన, ఉన్నతమైన, గొప్ప ప్రవక్త అన్న విషయము మనము ఈ వాక్యము ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా తెలుసుకున్నాము.

ఇక్కడ మరొక విషయం నేను చర్చించి నా మాటను ముగిస్తాను, అదేమిటంటే ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవితంలో, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి కలం ప్రవేశపెట్టినా, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి బట్టలు కుట్టి ప్రజలకు తొడిగించినా, ఇద్రీస్ అలైహిస్సలాం దైవ మార్గంలో మొదటిసారి యుద్ధము చేసినా ఆ యుద్ధంలో ఆయన పొందిన మాలె గనీమత్ (యుద్ధంలో లభించిన సొత్తు) ఆ రోజుల్లో మాత్రం అది ధర్మసమ్మతము కాదు.

ఏ ప్రవక్త జీవితంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాలె గనీమత్ ని ధర్మసమ్మతము చేయలేదు. కేవలం అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మాత్రమే మాలె గనీమత్ ని ధర్మసమ్మతం చేశాడు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇతర ప్రవక్తల మీద నాకు కొన్ని విషయాల ద్వారా ఆధిక్యత ప్రసాదించబడింది, అందులో ఒక విషయం ఏమిటంటే, వ ఉహిల్లత్ లి అల్ గనాయిమ్ (నా కొరకు మాలె గనీమత్ ధర్మసమ్మతం చేయబడింది)” అని తెలిపారు.

మరి ఆ రోజుల్లో వారికి యుద్ధము తర్వాత దొరికిన సొమ్ముని వారు ఏం చేసేవారో అని ప్రశ్న కూడా రావచ్చు. దాన్ని కొన్ని ఉల్లేఖనాల ద్వారా చరిత్రకారులు ముఖ్యంగా ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో యుద్ధం ముగిసిన తర్వాత దొరికిన సొమ్ము అది ఒకచోట తీసుకొని వెళ్లి ఉంచితే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ సొమ్ము మొత్తాన్ని కాల్చేసేది. ఆ సొమ్ము ఎవరికీ ధర్మసమ్మతము కాదు అని ఆ రోజుల్లో నియమ నిబంధనలు ఉండేవి అని తెలపబడింది.

అయితే మిత్రులారా, ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం గ్రహించాల్సిన కొన్ని పాఠాలు ఏమిటి?

మొదటి పాఠం ఏమిటంటే, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు. మానవులకు షైతాను ఎప్పటికీ స్నేహితుడు కాజాలడు. అయితే కొంతమంది మాత్రము అతన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. వారు ఎవరంటే, ఎవరైతే దైవ భీతికి దూరమైపోతున్నారో వారు మాత్రమే షైతాన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. మరి షైతాన్ కోరుకుంటుంది ఏమిటి? షైతాను మానవులను ఎలాగైనా సరే తప్పులు చేయించి వారికి శిక్షార్హులుగా మార్చేసి నరకానికి తీసుకెళ్ళి నెట్టేయాలన్నది షైతాన్ యొక్క ప్రయత్నం.

రెండవ విషయం ఏమిటంటే, సంగీతం, మ్యూజిక్ ఇది అల్లాహ్ కు నచ్చిన విషయము కాదు. అల్లాహ్ ఇష్టపడడు. షైతానుకు నచ్చిన విషయము. కాబట్టి ఇస్లాం ధర్మం ప్రకారంగా మ్యూజిక్ నిషేధం, అధర్మమైనది. అల్లాహ్ కు నచ్చనిది. ఎవరైతే మ్యూజిక్ కి ఇష్టపడతారో వారిలో అధిక శాతం ప్రజలు, పురుషులైనా సరే, మహిళలైనా సరే, అక్రమ సంబంధానికి పాల్పడి ఉంటారు. గమనించి చూసుకోండి. అనేక సర్వేలు ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.

కాబట్టి షైతాన్ మానవులలో సిగ్గు, లజ్జ, మానం అనేది దూరమైపోయి, అసభ్యత, అశ్లీలత పెరిగిపోవాలని కోరుకుంటాడు కాబట్టి మ్యూజిక్ ని ఆసరాగా చేసుకొని అతను ప్రజల్ని వ్యభిచారంలోకి నెట్టేస్తాడు. వ్యభిచారం నిషేధం, వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. ఈ మ్యూజిక్ వ్యభిచారం దరిదాపులకు తీసుకువెళ్తున్న ఒక సాధనం కాబట్టి వ్యభిచారానికి దూరంగా ఉండమని మనకు తెలపబడింది, మరియు వ్యభిచారానికి దగ్గరగా తీసుకుని వెళ్ళే విషయాలకు కూడా దూరంగా ఉండండి అని మనకు తెలపబడింది. “వలా తక్రబుజ్జినా” (వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి) అని కూడా చెప్పబడింది.

అలాగే, మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, ఒక పరాయి పురుషుడు, ఒక పరాయి స్త్రీ ఏకంగా ఒకచోట ఉండరాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఇద్దరు, పరాయి పురుషుడు, పరాయి మహిళ ఒకచోట ఉంటే అక్కడ మూడవ వాడు షైతాన్ ప్రవేశిస్తాడు. అతని మదిలో కూడా చెడు భావన, ఈమె మదిలో కూడా చెడు ఆలోచనలు రేకెత్తిస్తాడు. కాబట్టి అలా ఒకచోట ఉండటం ధర్మసమ్మతము కాదు.

దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రోజు మస్జిద్ బయట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణితో మాట్లాడుతూ ఉన్నారు. అంతలోనే ఓ ఇద్దరు సహాబీలు, సహచరులు అటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరిని పిలిచారు. పిలిచి, “ఏమండీ, నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఈవిడ నా సతీమణి” అని తెలియజేశారు. అది విని వారికి ఆశ్చర్యం కలిగింది, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరేంటి మాకు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు? మేము మీ మీద అనుమానం చేస్తామని మీకు అనిపిస్తూ ఉందా? మేము మీ మీద ఎందుకు అనుమానం చేస్తామండి?” అన్నారు.

దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “షైతాను ప్రతి మనిషి శరీరంలో నర నరాల్లో ప్రవహిస్తూ ఉంటాడు కాబట్టి, ఒకవేళ అతను మీలో ఏమైనా ఇలాంటి అనుమానం రేకెత్తిస్తాడేమోనన్న కారణంగా నేను ఆ అనుమానం మీలో రాకుడదని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను” అని తెలియజేశారు.

అంటే, మనిషి నరనరాల్లో షైతాను ప్రవహిస్తూ ఉంటాడు, కోరికలను రెచ్చగొడతాడు, అనుమానాలు పుట్టిస్తూ ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకాంతంలో అక్కడ ఒక మహిళతో మాట్లాడుతున్నారు కదా అన్న భావన వాటిలో కలిగిస్తాడు. కాబట్టి వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “ఈమె పరాయి మహిళ కాదు, ఈమె నా సతీమణి” అని వివరించారు.

ఇక చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రవక్తల జీవితాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ, ఆ ప్రవక్తల జీవితాల ద్వారా మనకు బోధపడే విషయాలను కూడా మనము నేర్చుకుంటూ, మన విశ్వాసాన్ని పెంచుకుంటూ, అల్లాహ్ మీద పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.

వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=31097

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో | టెక్స్ట్]

దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/4EZatwSP2Lo [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి మనం తెలుసుకోబోతున్నాం. దైవ ప్రవక్తలు అంటే ఎవరు, వారి సంఖ్య, ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన 25 మంది ప్రవక్తల పేర్లు, మరియు వారిలో ఐదుగురు ముఖ్యమైన ప్రవక్తల (ఉలుల్ అజ్మ్) గురించి చర్చించబడింది. ప్రవక్తలందరూ అల్లాహ్ చేత ఎన్నుకోబడిన మానవులని, వారు దైవత్వాన్ని పంచుకోరని స్పష్టం చేయబడింది. చివరి ప్రవక్త అయిన ముహమ్మమ్ సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ మానవాళికి మార్గదర్శకుడని, నేటి ప్రజలు ఆయనను అనుసరించాలని ఉద్బోధించబడింది. ప్రవక్తలకు ఇవ్వబడిన మహిమలు (అద్భుతాలు) వారి సొంత శక్తి కాదని, అవి అల్లాహ్ యొక్క శక్తి ద్వారా ప్రదర్శించబడ్డాయని కూడా వివరించబడింది.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
“సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (1:2)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ
దైవప్రవక్తలలో అత్యంత శ్రేష్ఠుడు, దైవసందేశహరులలో అత్యుత్తముడైన మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన అనుచరులందరిపై శాంతి శుభాలు వర్షించుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
“మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

ఆ హదీస్ పదేపదే మనం వింటూ వస్తున్నాము చూడండి, జిబ్రీల్ అలైహిస్సలాం వారు, దైవదూత, మానవ ఆకారంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, విశ్వాసం (ఈమాన్) అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, ఆకాశ గ్రంథాలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధి వ్రాతలను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని తెలియజేసినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, మీరు నిజం చెప్పారు అని ధ్రువీకరించారు.

ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆ ఆరు విషయాలలో నుంచి ఒక విషయం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం కలిగి ఉండటం.. కాబట్టి ఈ ప్రసంగంలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలు దైవ ప్రవక్తల పట్ల తెలుసుకుందాం.

ముందుగా, దైవ ప్రవక్తలు అంటే ఎవరు? అది తెలుసుకుందాం. దైవ ప్రవక్తలు అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచంలో మానవులు ఎప్పుడెప్పుడైతే మార్గభ్రష్టత్వానికి గురయ్యారో, ఆ సందర్భములో మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, మానవులలో నుంచే ఒక భక్తుడిని ఎన్నుకున్నాడు. ఆ భక్తుని వద్దకు దూతల ద్వారా దైవ వాక్యాలు పంపించగా, ఆ దైవ వాక్యాలు దూతల ద్వారా పొందిన ఆ ఎన్నుకోబడిన దైవభక్తులు ప్రజలకు ఆ దైవ వాక్యాలు బోధించారు, వినిపించారు. అల్లాహ్ వైపుకి, అల్లాహ్ మార్గం వైపుకి ప్రజలను ఆహ్వానించారు. ఆ తర్వాత, ఏ విధంగా అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలో ఆచరించి చూపించారు. అలా చేసిన వారిని, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించి, అల్లాహ్ మార్గంలో ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపించిన ఆ అల్లాహ్ తరఫున ఎన్నుకోబడిన భక్తులను దైవ ప్రవక్తలు అంటారు, బోధకులు అంటారు, నబీ, రసూల్ అని అరబీలో కూడా అంటారు.

అయితే, ఈ ప్రపంచంలో ఎంతమంది దైవ ప్రవక్తలు వచ్చారు అంటే, ఈ ప్రపంచంలో ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం వద్ద నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నాటికి ఇంచుమించు 1,24,000 మంది దైవ ప్రవక్తలు వేరేవేరే యుగాలలో, ప్రపంచంలోని భూమండలంలోని వేరేవేరే ప్రదేశాలలో అవసరాన్నికి తగ్గట్టుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిస్తూ వచ్చాడు. మొదటి దైవ ప్రవక్త పేరు ఆదం అలైహిస్సలాం. అంతిమ దైవ ప్రవక్త పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

ఇక, ఖుర్‌ఆన్ గ్రంథంలో ఎంతమంది దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉంది అని మనం చూసినట్లయితే, ధార్మిక పండితులు లెక్కించి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఖుర్‌ఆన్ గ్రంథంలో 25 దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉన్నది. ఎవరు వారు అంటే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయీల్ అలైహిస్సలాం, ఇస్ హాఖ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, ధుల్ కిఫ్ల్ అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, ఇలియాస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం, అల్ యస అలైహిస్సలాం, జకరియ్యా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మొత్తం 25 దైవ ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్ గ్రంథంలో వచ్చి ఉంది. వారి పేర్లన్నీ మీ ముందర నేను ఇప్పుడు వినిపించటం జరిగింది.

ఇక ఈ 1,24,000 ప్రవక్తలలో నుంచి 25 ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్‌లో వచ్చింది కదా, వారందరిలో నుంచి ఐదుగురు దైవ ప్రవక్తలకు, ప్రవక్తలందరి మీద ఒక గౌరవ స్థానం ఇవ్వబడింది. వారిని అరబీ భాషలో “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని బిరుదు ఇవ్వబడింది ప్రత్యేకంగా. తెలుగు భాషలో దానికి అనువాదము సహనమూర్తులు అని, వజ్ర సంకల్పము గల ప్రవక్తలు అని అనువాదం చేసి ఉన్నారు. వజ్ర సంకల్పము గల దైవ ప్రవక్తలు అన్న బిరుదు పొందిన ప్రవక్తలు ఎంతమంది అంటే ఐదు మంది ఉన్నారు. ఆ ఐదు మంది ఎవరంటే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ఐదు మందిని “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని తెలియజేయడం జరిగింది.

ఇక, మనము ఏ ప్రవక్తను అనుసరించాలి? నేడు ప్రపంచంలో ఉన్నవారు, ప్రజలందరూ ఏ ప్రవక్తను అనుసరించాలి అంటే, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ప్రపంచంలో పుట్టిన వారము కాబట్టి, నేడు మన మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే బాధ్యత వేయబడి ఉన్నది. మనమంతా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులు అని అంటారు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనము ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త. ఇక ప్రళయం వరకు మరొక ప్రవక్త ఎవరూ రాజాలరు. ఆయనే చివరి ప్రవక్త. ఎవరైనా నేను ప్రవక్తను అని ఇప్పుడు గానీ, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత గానీ ఎవరైనా ప్రకటన చేస్తే, అతను అబద్ధం పలుకుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ప్రళయం వరకు ప్రవక్తలు రారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఖుర్‌ఆన్‌లో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, ఇంకా అల్లాహ్ తరఫు నుంచి ప్రవక్తలు రారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి ప్రవక్త కాదండి, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే ముందు వచ్చిన ప్రవక్తలు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి, ఒక ప్రదేశానికి మాత్రమే ప్రవక్తలుగా పంపించబడేవారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ప్రపంచానికి ప్రవక్తగా చేసి పంపించాడు కాబట్టి, భూమండలంలో ఏ మూలన నివసిస్తున్న వారైనా సరే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించాలి.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వ ప్రవక్తల నాయకుడిగా చేసి ఉన్నాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శాసనము ఇచ్చి ఉన్నాడు. ఆ శాసనాన్ని మనము అనుసరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము ప్రవక్తగా అభిమానించాలి, ఆయనను గౌరవించాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, అంటే ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకోవాలి. ఏ విషయాలు అయితే ఆయన చేయమని మనకు తెలియజేశారో, అవన్నీ మనము పుణ్యకార్యాలు, సత్కార్యాలు అని తెలుసుకొని వాటిని అమలు పరచాలి. ఏ విషయాల నుండి అయితే ఆయన వారించాడో, ఆగిపోమని తెలియజేశారో, ఆ విషయాల జోలికి వెళ్ళకుండా మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే, ఆయన ఏ విషయాల గురించి అయితే వారించారో అవన్నీ దుష్కార్యాలు, పాపాలు కాబట్టి వాటికి మనము దూరంగా ఉండాలి.

ఇక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వము కొంతమంది ప్రవక్తలు వచ్చారు కదా. ఆ ప్రవక్తల గురించి మన విశ్వాసం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వైఖరి కలిగి ఉండాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, చాలా చక్కగా మరియు జాగ్రత్తగా ఆలోచించండి.

ప్రవక్తలందరూ కూడా మానవులు అని మనము విశ్వసించాలి. అలాగే, ప్రవక్తలందరూ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తరఫున ఎన్నుకోబడిన వారు అని వారందరినీ మనము గౌరవించాలి. అలాగే ప్రవక్తలందరి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతల ద్వారా వాక్యాలు పంపించగా, వారు ఆ వాక్యాలు ప్రజలకు తూచా తప్పకుండా పూర్తిగా వివరించారు. వారు ఆ బాధ్యతలో రవ్వంత కూడా జాప్యము చేయలేదు, పూర్తిగా ఆ కార్యాన్ని వారు నిర్వహించారు అని మనము విశ్వసించాలి.

అలాగే ప్రవక్తలందరూ కూడా మానవులలోనే ఉత్తములు, పుణ్యాత్ములు, సజ్జనులు అని కూడా మనము గౌరవించాలి. అలాగే, ధర్మ ప్రచారపు మార్గంలో ప్రవక్తలు బాధలు ఎదుర్కొన్నారు, విమర్శలు ఎదుర్కొన్నారు, హింసలు భరించారు, చివరికి ప్రాణత్యాగాలు కూడా కొంతమంది ప్రవక్తలు చేశారు. అవన్నీ మనకు చరిత్రలో తెలుపబడి ఉన్నాయి కాబట్టి, వారందరూ గొప్ప దైవభీతిపరులు, భక్తులు మరియు అల్లాహ్ వారికి అప్పగించిన కార్యము కోసము అవమానాలు భరించిన వారు, బాధలు భరించిన వారు, ప్రాణత్యాగాలు చేసిన వారు అని వారి భక్తి గురించి మనము తెలుసుకోవాలి, అలాగే వారిని భక్తులు అని మనం వారిని గౌరవించాలి.

ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు. ప్రవక్తలను కించపరచటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అనుమతి లేదు. ప్రవక్తలందరినీ గౌరవించాలి, ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు.

మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, చివర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్వం వచ్చిన ప్రవక్తలందరి శాసనాలు మన్సూఖ్ చేయబడ్డాయి, అనగా రద్దు చేయబడ్డాయి. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనం మాత్రమే అమలుపరుచుకోవటానికి అనుమతి ఇవ్వబడి ఉంది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకొని విశ్వసించాలి మిత్రులారా.

ఇక చివరిలో, ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చి ఉన్నాడు, ఆ మహిమల గురించి తెలుసుకొని మాటను ముగిద్దాం. చూడండి, ప్రవక్తలలో కొన్ని ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సందర్భానుసారంగా కొన్ని మహిమలు ఇచ్చాడు. ఉదాహరణకు, మూసా అలైహిస్సలాం వారి కాలంలో అలనాటి ప్రజలు మూసా అలైహిస్సలాం వారితో మహిమలు అడిగినప్పుడు, ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు కొన్ని మహిమలు ఇచ్చాడు. అందులో ఒక మహిమ ఏమిటంటే చేతికర్ర. అది కింద పడవేస్తే పెద్ద సర్పంలాగా మారిపోతుంది, మళ్లీ ముట్టుకుంటే అది మామూలు కర్రగా మారిపోతుంది. అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ఒక మహిమ.

అలాగే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మహిమలు ఇచ్చారు. ఆయన పుట్టుకతో గుడ్డివారిగా ఉన్న వారిని స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే, పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్న వారికి కంటి చూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చేసేవాడు. కఠినమైన వ్యాధిగ్రస్తులను కూడా ఆయన స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే వారందరికీ స్వస్థత లభించేది. అంటే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా మహిమలు ఇచ్చాడు. ఆయన అల్లాహ్ తో దుఆ చేయగా చంద్రుడు రెండు ముక్కలయ్యాడు. ఆయన వేళ్ళ మధ్య నుండి నీళ్లు ప్రవహించాయి. ఇలా అవన్నీ ఇన్ షా అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అన్న ప్రసంగంలో మనం వింటే వివరాలు తెలుస్తాయి. కాకపోతే, ఈ మహిమల గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మహిమలు ప్రవక్తల సొంత శక్తులు కానే కావు. వారు అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన శక్తితో అవన్నీ ప్రజల ముందర చేసి చూపించాడు.

ప్రవక్తలు దేవుళ్ళు కారు, దేవునిలో భాగస్థులు కారు, దేవునికి సరిసమానులు కూడా కారు. అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు. ప్రవక్తలు అల్లాహ్ లో భాగము కాదు, అల్లాహ్ కుమారులు కాదు మరియు అల్లాహ్ కు సరిసమానులు కాదు. వారు మానవులు, మానవులలోనే ఉత్తములు, అల్లాహ్ ద్వారా ఎన్నుకోబడిన వారు.

ప్రవక్తలను ప్రతి ప్రవక్తను వారి వారి సమాజం వారు అనుసరించాల్సిన బాధ్యత ఉండేది. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, రండి అల్లాహ్ వైపు, రండి అల్లాహ్ ను విశ్వసించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించండి. అల్లాహ్ మరియు ప్రవక్త చూపించిన మార్గం, ఇస్లాం మార్గంలో వచ్చి చేరండి. మీకు అందరికీ ఇదే నా ఆహ్వానం.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనలందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

وَجَزَاكُمُ اللهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్)
“అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక.”

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
“మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30611

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets/

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి” – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి”
https://youtu.be/D1oAzBvsApU [32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో వక్త, బనీ ఇస్రాయీల్ ప్రవక్తలలో ఒకరైన ఉజైర్ (అలైహిస్సలాం) గారి అద్భుతమైన జీవిత చరిత్రను వివరించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మరణం ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఎలా బ్రతికించారో, ఆ సమయంలో జరిగిన చారిత్రక పరిణామాలు (బాబిలోనియా రాజు నెబుకద్ నెజర్ ద్వారా జెరూసలేం నాశనం, తౌరాత్ గ్రంథం దహనం, యూదుల బానిసత్వం మరియు విడుదల) గురించి చర్చించారు. ఉజైర్ (అలైహిస్సలాం) నాశనమైన నగరాన్ని చూసి ఆశ్చర్యపోవడం, అల్లాహ్ ఆయనను 100 సంవత్సరాలు మృతునిగా ఉంచి తిరిగి లేపడం, ఆయన ఆహారం చెడిపోకుండా ఉండటం మరియు గాడిద ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోవడం వంటి దృష్టాంతాలను ఖురాన్ వాక్యాల (సూర బఖరా 2:259) ద్వారా వివరించారు. అలాగే, యూదులు ఉజైర్ (అలైహిస్సలాం) ను దైవ కుమారుడిగా భావించి చేసిన మార్గభ్రష్టత్వాన్ని ఖండిస్తూ (సూర తౌబా 9:30), మరణానంతర జీవితం, పునరుత్థానం, మరియు అల్లాహ్ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని ఈ ప్రసంగం ద్వారా బోధించారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనము ఒక ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణం ఇచ్చి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించాడు. ఎవరండీ ఆయన? ఆశ్చర్యకరంగా ఉంది కదా వింటూ ఉంటే. ఆయన మరెవరో కాదు ఆయనే ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారు.

ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో రెండు సూరాలలో వచ్చి ఉంది. ఒకటి సూర బఖరా రెండవ సూరా, రెండవది సూర తౌబా తొమ్మిదవ సూరా. ఈ రెండు సూరాలలో ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్తలలో ఒక ప్రవక్త.

ఆయన బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడే సరికి, బనీ ఇస్రాయీల్ ప్రజల్లోని అధిక శాతం ప్రజలు కనుమరుగైపోయారు లేదా బానిసత్వానికి గురైపోయారు. అల్-ఖుద్స్ నగరంలో, పాలస్తీనా దేశంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బనీ ఇస్రాయీల్ వారు మిగిలి ఉన్నారు. అంతే కాదండీ, వారు నివసిస్తున్న పట్టణము కూడా నేలమట్టం అయిపోయింది. వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ కూడా నేలమట్టం అయిపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, దాన్ని తెలుసుకోవడానికి బనీ ఇస్రాయీల్ వారి క్లుప్తమైన చరిత్ర మనము దృష్టిలో ఉంచుకోవాలి.

సులైమాన్ అలైహిస్సలాం వారి మరణానంతరం పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. సులైమాన్ అలైహిస్సలాం వారి సంతానంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయం కలిగింది. వారు ఎంతో పటిష్టంగా ఉన్న వారి సామ్రాజ్యాన్ని రెండు ముక్కలు చేసుకున్నారు. ఒక తమ్ముడు సగ భాగాన్ని, మరో తమ్ముడు సగ భాగాన్ని పంచుకొని, ఒక భాగానికి ‘ఇస్రాయీల్ రాజ్యం‘ అని పేరు పెట్టుకున్నారు, దానికి సామరియా రాజధాని అయ్యింది. మరో భాగానికి ‘యహూదా రాజ్యం’ అని పేరు పెట్టుకున్నారు, దానికి యెరూషలేము రాజధాని అయ్యింది.

అయితే ఆ తర్వాత ఇస్రాయీల్ లో ఉన్న బనీ ఇస్రాయీల్ ప్రజలు తొందరగా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు, ‘బాల్‘ అనే విగ్రహాన్ని ఆరాధించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడికి ప్రవక్తల్ని పంపించాడు. హిజ్కీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఇలియాస్ అలైహిస్సలాం వారు వచ్చారు, అల్-యస అలైహిస్సలాం వారు వచ్చారు. ప్రవక్తలు వచ్చి వారికి చక్కదిద్దేటట్టు ప్రయత్నం చేసినా, దైవ వాక్యాలు బోధించినా, అల్లాహ్ వైపు పిలిచినా, వారు మాత్రము పాపాలను వదలలేదు, విగ్రహారాధనను కూడా వదలలేదు, మార్గభ్రష్టులుగానే మిగిలిపోయారు.

చివరికి ఏమైందంటే, పక్కనే ఉంటున్న ఆషూరీయులు వచ్చి ఇస్రాయీల్ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయి ఉన్న ఆ రెండు రాజ్యాలలో నుంచి ఒక రాజ్యము ఆషూరీయుల చేతికి వెళ్ళిపోయింది.

అయితే ఆశూరీయులు మిగిలిన రెండవ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినా వారి పప్పులు ఉడకలేదు. ఎందుకంటే ఇక్కడ దైవభీతి మిగిలి ఉండింది కాబట్టి. కానీ కొద్ది రోజులు గడిచాక ఇక్కడ పరిస్థితులు కూడా మళ్ళీ మారిపోయాయి. ఇక్కడ ప్రజలు కూడా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు, పాపాల్లో మునిగిపోయారు. అలాంటప్పుడు ఇరాక్ దేశము నుండి, బాబిలోనియా నుండి నెబుకద్ నెజరు (అరబ్బీలో ‘బుఖ్తె నసర్‘) అనే రాజు సైన్యాన్ని తీసుకొని వచ్చి యహూదా దేశం మీద, రాజ్యం మీద దాడి చేశాడు. యుద్ధం ప్రకటించి బనీ ఇస్రాయీల్ వారిని ఊచకోత కోశాడు. అలాగే బనీ ఇస్రాయీల్ వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు, వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ ని కూడా నేలమట్టం చేసేశాడు. వారు ఎంతో గౌరవంగా చదువుకునే, ఆచరించుకునే పవిత్రమైన గ్రంథం తౌరాత్ ని కూడా అతను కాల్చేశాడు.

బనీ ఇస్రాయీల్ ప్రజల్ని అయితే ముందు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా హతమార్చాడు. తర్వాత ఎవరెవరైతే పనికొస్తారు అని అతను భావించాడో వారిని బానిసలుగా ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరితో అయితే నాకు అవసరం లేదులే వీళ్ళతో అని అనుకున్నాడో, అలాంటి వారిని మాత్రము అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మిత్రులారా! ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు, ముందు ఇస్రాయీల్ సామ్రాజ్యాన్ని ఆషూరీయుల చేతికి అప్పగించాల్సి వచ్చింది, యహూదా సామ్రాజ్యాన్ని నెబుకద్ నెజరు రాజుకి అప్పగించాల్సి వచ్చింది

ఆ ప్రకారంగా వారి రెండు రాజ్యాలు కూడా రెండు వేరు వేరు శత్రువులు లాక్కున్నారు. అలాగే జయించి వశపరచుకున్నారు. మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు పరాభవానికి గురి అయ్యి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు. ఎంతో కొంతమంది మాత్రమే అక్కడ మిగిలిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో, పట్టణము కూల్చబడి ఉంది, పుణ్యక్షేత్రము కూల్చబడి ఉంది, ప్రజలు కూడా చెల్లాచెదురైపోయి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు, ఎంతో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అలాంటి స్థితిలో ఉజైర్ అలైహిస్సలాం వారు వచ్చారు.

ఆయన మామూలుగా పొలం వద్ద పని కోసము గాడిద మీద కూర్చొని బయలుదేరి వెళ్లారు. వెళ్లి అక్కడ పొలం పనులన్నీ ముగించుకొని కొన్ని ద్రాక్ష పండ్లు, అలాగే అత్తి పండ్లు తీసుకొని మళ్ళీ అదే గాడిద మీద కూర్చొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. వస్తూ వస్తూ ఒకచోట లోయలోకి ప్రవేశించి కాసేపు నీడలో సేద తీరుదాము అని ఒక గోడ నీడలో లేదా ఒక చెట్టు నీడలో ఆయన కూర్చోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన వద్ద ఉన్న గాడిదను ఒకచోట కట్టేశారు.

తర్వాత నీడలో కూర్చొని ఆయన వద్ద ఉన్న ద్రాక్ష పండ్లను ముందుగా ఒక పాత్రలో పిండారు. ఆ ద్రాక్ష రసంలో కొన్ని రొట్టె ముక్కలు నాన్చడానికి ఉంచారు. ఆ రొట్టెలు నానే వరకు ఆయన గోడను లేదా చెట్టుని అలా వీపుతో ఆనుకొని, కంటి ముందర కనిపిస్తున్న దృశ్యాలను చూడసాగారు. ముందర పాడుబడిపోయిన పట్టణము, కూల్చబడిన పట్టణము, కూల్చబడిన పుణ్యక్షేత్రము అవి దర్శనమిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే, ఊహించని రీతిలో, అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే:

أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا
[అన్నా యుహ్ యీ హాజిహిల్లాహు బాద మౌతిహా]
దీని చావు తర్వాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు? (ఖుర్ఆన్, 2:259)

అంటే ఈ నగరం మొత్తం పాడుబడిపోయింది కదా, మళ్ళీ ప్రజల జీవనంతో ఈ నగరం కళకళలాడాలంటే ఇది సాధ్యమవుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తపరిచారు. అనుమానం వ్యక్తపరచలేదు, ఇది ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉజైర్ అలైహిస్సలాం వారు గొప్ప దైవభీతిపరులు, గ్రంథ జ్ఞానము కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అల్లాహ్ తో ఇది సాధ్యమేనా అని అనుమానము, సందేహము ఎప్పుడూ వ్యక్తపరచరు. అల్లాహ్ శక్తి మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆశ్చర్యం వ్యక్తపరిచారు – ఇది ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఇప్పట్లో ఇది అయ్యే పనేనా? అనేటట్టుగా ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆయన ఏ స్థితిలో అయితే నీడలో అలా వీపు ఆంచుకొని కూర్చొని ఉన్నారో, అదే స్థితిలో ఆయనకు మరణం ఇచ్చేశాడు. ఎన్ని సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు అంటే, వంద సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు.

فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ
[ఫ అమాతహుల్లాహు మిఅత ఆమిన్]
“అల్లాహ్ అతన్ని నూరేళ్ళ వరకు మరణ స్థితిలో ఉంచాడు.” (ఖుర్ఆన్, 2:259)

ఖురాన్ లో నూరేళ్ళ వరకు ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అదే స్థితిలో ఉంచాడు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.

అయితే 100 సంవత్సరాలు ఆయన అదే స్థితిలో ఉన్నారు కదా, మరి ఈ 100 సంవత్సరాలలో ఏమి జరిగిందంటే చాలా ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఏమి జరిగిందంటే, నెబుకద్ నెజరు బనీ ఇస్రాయీల్ వారి మీద దాడి చేసి, పుణ్యక్షేత్రం కూల్చేసి, గ్రంథము కాల్చేసి, బనీ ఇస్రాయీల్ వారిని పురుషుల్ని అలాగే మహిళల్ని బానిసలుగా మార్చి ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి పట్టుకెళ్లిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే…

పక్కనే ఉన్న పార్షియా దేశం (ఇరాన్ దేశం అని మనం అంటున్నాం కదా), ఆ పార్షియా దేశానికి చెందిన రాజు ఇరాక్ దేశం మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసి ఇరాక్ దేశాన్ని జయించేశాడు. ఇరాక్ దేశము ఇప్పుడు పార్షియా దేశ రాజు చేతికి వచ్చేసింది. ఆ పార్షియా దేశము (అనగా ఇరాన్ దేశపు రాజు) ఇరాక్ దేశాన్ని కూడా జయించిన తర్వాత, అక్కడ బానిసలుగా నివసిస్తున్న యూదులను స్వతంత్రులుగా చేసేసి, “మీరు మీ సొంతూరికి, అనగా పాలస్తీనా దేశానికి, అల్-ఖుద్స్ నగరానికి తిరిగి వెళ్లిపోండి” అని అనుమతి ఇచ్చేశాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 50-60 సంవత్సరాల తర్వాత ఆ రాజు ద్వారా బనీ ఇస్రాయీల్ ప్రజలకి మళ్ళీ బానిసత్వం నుండి స్వతంత్రం లభించింది. అప్పుడు వారందరూ కూడా స్వతంత్రులై బాబిలోనియా పట్టణాన్ని వదిలేసి, మళ్ళీ పాలస్తీనాలో ఉన్న అల్-ఖుద్స్ నగరానికి పయనమయ్యారు. అయితే ఈ 50-60 సంవత్సరాలలో వారు భాష మర్చిపోయారు, సంప్రదాయాలు మర్చిపోయారు, ధర్మ ఆదేశాలు కూడా చాలా శాతము మర్చిపోయారు. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ మళ్ళీ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగా కూల్చివేయబడిన ఆ పట్టణము, నగరము మళ్ళీ ప్రజల నివాసంతో కళకళలాడటం ప్రారంభించింది. ఇలా వంద సంవత్సరాల లోపు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్న తర్వాత, అప్పుడు రెండవసారి మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉజైర్ అలైహిస్సలాం వారికి మళ్ళీ బ్రతికించాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఆయన మరణించే సమయానికి ఆయన వయస్సు 40 సంవత్సరాలు ఉండింది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించబడుతున్నప్పుడు కూడా ఆయన 40 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా, అదే శక్తితో, అదే శరీరంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మళ్ళీ బ్రతికించాడు.

దూత వచ్చాడు. దూత వచ్చి ఆయనను లేపి:

قَالَ كَمْ لَبِثْتَ
[ఖాల కమ్ లబిస్త]
“నీవు ఎంత కాలం ఈ స్థితిలో ఉన్నావు?” అని అడిగాడు. (ఖుర్ఆన్, 2:259)

ఉజైర్ అలైహిస్సలాం వారు లేచి ముందు అటూ ఇటూ చూశారు. చూస్తే గాడిద కనిపించట్లేదు. గాడిద బంధించిన చోట పాడుబడిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. 100 సంవత్సరాలు గడిచిన విషయం ఆయనకు తెలియదు. ఈ 100 సంవత్సరాలలో గాడిద చనిపోయింది, ఎముకలు కూడా పాడుబడిపోయాయి, కొన్ని పాడుబడిన ఎముకలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉంచబడిన ద్రాక్ష రసంలో ఉంచబడిన రొట్టె ముక్కలు, అవి మాత్రము తాజాగా అలాగే ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఆహారాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడే కొద్దిసేపు ఏమో నేను అలా పడుకొని లేచానేమో అనిపిస్తూ ఉంది. గాడిదను చూస్తూ ఉంటే అసలు గాడిద కనిపించట్లేదు. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నారంటే:

لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ
[లబిస్తు యౌమన్ ఔ బాద యౌమ్]
“ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను” అని చెప్పారు. (ఖుర్ఆన్, 2:259)

ఆహారాన్ని చూసి ఆయన ఆ విధంగా అనుమానించారు. అయితే దూత వచ్చి:

بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ
[బల్ లబిస్త మిఅత ఆమ్]
“కాదు, నీవు ఈ స్థితిలో వంద సంవత్సరాలు ఉన్నావయ్యా” (ఖుర్ఆన్, 2:259)

అని చెప్పి, “చూడండి మీ గాడిద మరణించి ఎముకలు ఎముకలైపోయింది. మీ కళ్ళ ముందరే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని మళ్ళీ బ్రతికిస్తాడు చూడండి” అని చెప్పగానే, అల్లాహ్ నామంతో పిలవగానే ముందు ఎముకలు తయారయ్యాయి. ఎముకలు జోడించబడ్డాయి. ఆ ఎముకల మీద మాంసము జోడించబడింది. ఆ తర్వాత దానికి ప్రాణము వేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఉజైర్ అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే ఎముకలుగా మారిపోయిన ఆ గాడిద మళ్ళీ జీవించింది. అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు అదంతా కళ్ళారా చూసి వెంటనే ఈ విధంగా పలికారు:

قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
[ఖాల ఆలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్]
“అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని ఉజైర్ అన్నారు. (ఖుర్ఆన్, 2:259)

ఈ ప్రస్తావన మొత్తము ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము 259వ వాక్యంలో వివరంగా తెలుపబడి ఉంది.

సరే, 100 సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికారు, పట్టణం ప్రజలతో కళకళలాడుతూ ఉంది, పట్టణం పూర్తిగా మళ్ళీ నిర్మించబడి ఉంది, పుణ్యక్షేత్రము కూడా మళ్ళీ నిర్మించబడి ఉంది. గాడిద మీద కూర్చొని ఆయన పట్టణానికి వెళ్లారు.

పట్టణానికి వెళ్ళినప్పుడు చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన మరణించేటప్పుడు ఆయన ఇంటిలో ఒక సేవకురాలు ఉండేది, అప్పుడు ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన 100 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారంటే ఆవిడ వయస్సు ఎంత అయి ఉంటుందండి? 20 + 100, కలిపితే 120 సంవత్సరాలకు చేరుకొని ఉంది. ఆవిడ పూర్తిగా ముసలావిడగా మారిపోయి, వృద్ధాప్యానికి గురయ్యి, కంటిచూపు దూరమైపోయింది, కాళ్ళు కూడా పడిపోయి ఉన్నాయి. ఆవిడ ఒక మంచానికే పరిమితమైపోయి ఉంది.

ఆవిడ వద్దకు ముందు ఉజైర్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. వెళ్లి “అమ్మా నేను ఉజైర్ ని” అంటే, ‘ఉజైర్’ అన్న పేరు వినగానే ఆవిడ బోరున ఏడ్చేసింది. “ఎన్నో సంవత్సరాల క్రితము మా యజమాని ఉండేవారు” అని ఏడుస్తూ ఉంటే, “అమ్మా నేనే మీ యజమాని ఉజైర్ ని” అని చెప్పారు. అప్పుడు ఆ మహిళ, “అరె! 100 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు నా యజమాని అంటున్నారు, ఎలాగండి నేను నమ్మేది? ఉజైర్ గొప్ప భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా ఆమోదించేవాడు. మీరు ఉజైర్ అయితే, నాకు కంటిచూపు మళ్ళీ రావాలని, అలాగే చచ్చుబడిపోయిన నా కాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా మారాలని దుఆ చేయండి” అని కోరారు.

ఉజైర్ అలైహిస్సలాం వారు దుఆ చేశారు. దుఆ చేయగా ఆవిడకు కంటిచూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరిగి ఇచ్చేశాడు, ఆవిడ కాళ్ళు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ నయం చేసేశాడు. అప్పుడు ఆవిడ లేచి, ఉజైర్ అలైహిస్సలాం వారిని చూసి, చెయ్యి పట్టుకొని, “నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈయనే ఉజైర్ అలైహిస్సలాం” అని సాక్ష్యం ఇచ్చారు.

తర్వాత “రండయ్యా మీ ఇంటిని చూపిస్తాను, మీ కుటుంబీకుల్ని చూపిస్తాను” అని ఉజైర్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని ఉజైర్ అలైహిస్సలాం వారి ఇంటికి వెళితే, అప్పుడు కుటుంబ సభ్యులలో ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారులు ఉన్నారు. వారి వయస్సు కూడా 100 దాటిపోతూ ఉంది. ఉజైర్ అలైహిస్సలాం వారిని ఇంటి బయట నిలబెట్టి, ఆవిడ ఇంటిలోనికి ప్రవేశించి ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారుల వద్దకు వెళ్లి, “మీ నాన్నగారు వచ్చారు” అంటే వారందరూ షాక్ అయ్యారు. అవాక్కయిపోయారు. “అదేమిటి 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కనుమరుగైపోయిన మా తండ్రి ఇప్పుడు తిరిగి వచ్చారా ఇంటికి?” అని వారు షాక్ అయిపోతూ ఉంటే, “అవునండీ, చూడండి నాకు కంటిచూపు ఉండేది కాదు, నాకు కాళ్ళు కూడా చచ్చుబడిపోయి ఉండేవి. కానీ ఆయన వచ్చి ప్రార్థన చేయగా నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కంటిచూపు ఇచ్చాడు, కాళ్ళను నయం చేశాడు. నేను మళ్ళీ ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. చూడండి బయట ఉన్నారు” అని చెప్పగానే, వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించగా, ముందుగా కుమారులు ఆశ్చర్యపడ్డారు.

సందేహం వ్యక్తపరుస్తూ ఒక కుమారుడు ఏమన్నాడంటే, “చూడండి మా నాన్నగారికి భుజం పక్కన మచ్చ లాంటి ఒక గుర్తు ఉండేది, అది ఉందేమో చూడండి” అన్నారు. ఉజైర్ అలైహిస్సలాం వారు బట్టలు కొంచెం పక్కకు జరిపి చూపియగా, అక్కడ నిజంగానే ఆ మచ్చ లాంటి గుర్తు కనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులు ఉజైర్ అలైహిస్సలాం వారిని “ఈయనే మా తండ్రి” అని గ్రహించారు.

అయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఉజైర్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 సంవత్సరాల వ్యక్తి లాగే సిద్ధం చేశాడు. వారి కుమారులు మాత్రము 100 సంవత్సరాలు చేరుకున్న వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలా సంఘటన జరిగిన తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు మళ్ళీ నగరంలోకి వచ్చారు, నగర ప్రజల్ని ప్రోగు చేశారు. ప్రోగు చేసి “ఎవరెవరికి తౌరాత్ గ్రంథంలోని వాక్యాలు కంఠస్థమై ఉన్నాయో, ఎన్ని కంఠస్థమై ఉంటే వారు వచ్చి నాకు వినిపించండి” అని పిలుపునిచ్చారు. ఎవరెవరికి ఎన్ని వాక్యాలు కంఠస్థం చేయబడి ఉన్నాయో వారందరూ వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారికి వారు కంఠస్థం చేసిన ఆ తౌరాత్ గ్రంథంలోని దైవ వాక్యాలు వినిపించారు.

అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు ఒక చెట్టు నీడలో కూర్చొని, ఇతర వ్యక్తుల నోట విన్న వాక్యాలు, ఆయన స్వయంగా కంఠస్థం చేసిన వాక్యాలు అన్నీ కూడా మళ్ళీ రచించారు. ఆ ప్రకారంగా మళ్ళీ తౌరాత్ గ్రంథం (నెబుకద్ నెజరు రాజు దాన్ని కాల్చేసి వెళ్లిపోయాడని చెప్పాము కదా), ఆ కాలిపోయి కనుమరుగైపోయిన తౌరాత్ గ్రంథంలోని వాక్యాలను, ఎవరెవరు ఎంత కంఠస్థం చేసి ఉన్నారో అన్ని వాక్యాలు మళ్ళీ తిరిగి ఉజైర్ అలైహిస్సలాం వారు రచించారు. రచించి ప్రజలకు గ్రంథము ఇవ్వడంతో పాటు ఆ గ్రంథంలోని వాక్యాలు, వాటి సారాంశము ప్రజలకు బోధించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు అంటే, చరిత్రలో ప్రామాణికమైన ఆధారాలు మనకు ఎక్కడా దొరకలేదు. ఆయన మాత్రము మరణించారు. ఎప్పుడు మరణించారు? ఎన్ని సంవత్సరాల వయసులో మరణించారు? ఏ విధంగా ఆయన మరణం సంభవించింది? అన్న వివరాలు మాత్రము ప్రామాణికమైన ఆధారాలలో మనకు ఎక్కడా దొరకలేదు. అయితే ఆయన సమాధి మాత్రము ‘డమస్కస్’ నగరంలో నేటికీ ఉంది అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ఉజైర్ అలైహిస్సలాం వారు జీవించినన్ని రోజులు ప్రజలు ఆయనను ఒక బోధకునిగా గౌరవించారు. ఆయన మరణించిన తర్వాత… ఆయన 100 సంవత్సరాలు మరణించి మళ్ళీ జీవించారన్న ఒక అభిప్రాయం ఉండేది, ఆయన దుఆతో ప్రజల సమస్యలు తీరాయని మరొక అభిప్రాయం ఉండేది, అలాగే ఆయన గ్రంథాన్ని రచించి ప్రజలకు వినిపించారు, ఇచ్చారు అనే మరో అభిప్రాయం ఉండింది. ఇలా అనేక అభిప్రాయాల కారణంగా ఉజైర్ అలైహిస్సలాం వారి గౌరవంలో బనీ ఇస్రాయీల్ ప్రజలు హద్దు మీరిపోయారు. ఆ గౌరవంలో, అభిమానంలో ఏకంగా ఉజైర్ అలైహిస్సలాం వారిని “దైవ కుమారుడు” అని చెప్పటం ప్రారంభించారు. తర్వాత అదే వారి విశ్వాసంగా మారిపోయింది, “ఉజైర్ దైవ కుమారుడు” అని నమ్మటం ప్రారంభించారు. వారి ఈ నమ్మకం సరికాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం, 30వ వాక్యంలో స్పష్టంగా ఖండించి ఉన్నాడు.

وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులు అంటున్నారు. “మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకులలోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారో చూడండి. (ఖుర్ఆన్, 9:30)

అంటే ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు నమ్ముతున్న నమ్మకాన్ని ఖండిస్తూ, ఇది నిజము కాదు, వారు కల్పించుకున్న కల్పితాలు మాత్రమే, వారి నోటి మాటలు మాత్రమే అని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

ఉజైర్ అలైహిస్సలాం వారి గురించి ఒక హదీసులో పరోక్షంగా ప్రస్తావన వచ్చి ఉంది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక హదీసు ఉందండి. ఆ హదీసు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

‘పూర్వము ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన వెళుతూ ఉంటే ఒకచోట కూర్చున్నప్పుడు, ఆయనకు ఒక చీమ కరిచింది. చీమ కరిచినప్పుడు ఆయన కోపగించుకొని, కోపంతో చీమ పుట్టను త్రవ్వేసి, ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశారు.వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ప్రవక్త వద్దకు వహీ (దైవవాణి) పంపించాడు. ‘నీకు హాని కలిగించింది, నీకు కుట్టింది ఒక చీమ కదా. నీకు కోపం ఉంటే ఒక చీమను చంపుకోవాలి. కానీ, పూర్తి పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేయటము, కాల్చేయటం ఏమిటి?’ అని ఒక ఉల్లేఖనంలో ఉంది.

మరో ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: ‘నీకు ఒక్క చీమ కుట్టిందన్న సాకుతో, నీవు ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశావు. వాస్తవానికి ఆ సమూహము అల్లాహ్ ను స్మరించేది (తస్బీహ్ చేసేది). అల్లాహ్ ను స్మరించే ఒక సమూహాన్ని ఒక్క చీమ కుట్టిన కారణంగా నీవు దహనం చేశావేమిటి?’ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆక్షేపించాడు.’

మరి ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది అంటే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు హసన్ బస్రీ రహిమహుల్లా వారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఉజైర్ అలైహిస్సలాం ఏ కాలానికి చెందిన వారు అంటే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, సులైమాన్ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం వీరిద్దరి మధ్యలో వచ్చిన ప్రవక్త. అలాగే మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారు అంటే, ఉజైర్ అలైహిస్సలాం వారు ప్రవక్త కాదు, ఆయన గొప్ప భక్తుడు, గ్రంథ జ్ఞాని అని అంటున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఇది ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర. ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము గ్రహించాల్సిన పాఠాలు ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని మాటను ముగిస్తాను.

1. అల్లాహ్ మృతులను తిరిగి బ్రతికించగలడు:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మృతులను మళ్ళీ బ్రతికించేవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్న విషయం ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు 100 సంవత్సరాల కోసము మరణించి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అల్లాహ్ ఆజ్ఞతో జీవించబడ్డారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. చూసారా? మొదటిసారి ప్రాణం పోసిన ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయనకు 100 సంవత్సరాల కోసం మరణం ఇచ్చి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు బ్రతికించి ప్రాణం పోసి నిలబెట్టాడు. కాబట్టి మానవులను మళ్ళీ పుట్టించగల శక్తి అల్లాహ్ కు ఉంది అని ఈ ఉజైర్ అలైహిస్సలాం వారి ద్వారా మనకు స్పష్టం చేయబడింది.

ఖురాన్ గ్రంథం 36వ అధ్యాయం, 78-79 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ * قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ

“కుళ్లి కృశించి పోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు (మానవుడు) సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు, “వాటిని తొలిసారి సృష్టించినవాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.” (ఖుర్ఆన్, 36:78-79)

తొలిసారి పుట్టించిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మలిసారి కూడా పుట్టించగలుగుతాడు, ఆయనకు అలా చేయటం చాలా సులభం అని తెలుపబడటం జరిగింది. ఖురాన్ లో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో, “నీవు మరణించిన వారిని మళ్ళీ ఎలా బ్రతికిస్తావు?” అని అడిగినప్పుడు, పక్షుల్ని తీసుకొని వాటి ఎముకల్ని అటూ ఇటూ పడవేయ్యండి, తర్వాత అల్లాహ్ పేరుతో పిలవండి, అవి మళ్ళీ బ్రతికి వస్తాయి అని చెప్పగా, ఆయన అలాగే చేశారు. అల్లాహ్ పేరుతో పిలవగానే ఎముకలుగా మార్చబడిన ఆ పక్షులు మళ్ళీ పక్షుల్లాగా జీవించి ఎగురుకుంటూ ఆయన వద్దకు వచ్చాయి.

అలాగే హిజ్కీల్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 35 వేల మంది లోయలో మరణించారు. ప్రవక్త కళ్ళ ముందరే మళ్ళీ వారు బ్రతికించబడ్డారు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 70 మంది బనీ ఇస్రాయీల్ తెగకు చెందిన నాయకులు పర్వతం మీద మరణించారు. తర్వాత మూసా అలైహిస్సలాం దుఆతో వాళ్ళు మళ్ళీ బ్రతికించబడ్డారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారు, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడతారు అన్న కొన్ని ఉదాహరణలు తెలియజేసి ఉన్నాడు. అలాగే గుహవాసులు, ‘అస్ హాబుల్ కహఫ్’ అని మనం అంటూ ఉంటాం. వారిని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందు మరణం ప్రసాదించి, తర్వాత మళ్ళీ జీవించేలాగా చేశాడు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేసి ఉన్నాడు.

ఆ ఉదాహరణల ద్వారా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు అని స్పష్టంగా, ఉదహరించి మరీ నిజమైన ఆధారాలతో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విశ్వాసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు, మళ్ళీ బ్రతికించగలుగుతాడు అని నమ్మాలి, విశ్వసించాలి.

2. సమాజ సంస్కరణ బాధ్యత:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మరొక విషయం, సమాజ సంస్కరణకు కృషి చేయాలి. ఉజైర్ అలైహిస్సలాం వారు రెండవసారి లేపబడినప్పుడు, ప్రజల వద్దకు వెళ్లి దైవ వాక్యాలు రచించి, ప్రజలకు అందజేయడంతో పాటు బోధించారు. సమాజాన్ని సంస్కరించారు, ప్రజలను సంస్కరించారు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేయాలి. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజమైన మనకు “ఉత్తమ సమాజం” అని బిరుదు ఇస్తూ, “మీరు మంచిని బోధిస్తారు, చెడును నిర్మూలిస్తారు” అని బాధ్యత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజ సంస్కరణ కోసము కృషి చేయాలన్న విషయం ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి.

3. మరణానంతర జీవితం:

మరణానంతరం జీవితం ఉంది అన్న విషయం కూడా ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు మరణించారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. అదే విధంగా పుట్టిన తర్వాత మరణించిన ప్రతి మనిషిని పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బ్రతికిస్తాడు. అక్కడ లెక్కింపు ఉంటుంది, చేసిన కర్మలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ లెక్క తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరణానంతర జీవితం ఉంది అని స్పష్టపరచడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ప్రజలకు కొన్ని ఉదాహరణలు ప్రపంచంలోనే చూపించి ఉన్నాడు. మరణించిన వాడు మరణించాడు, ఇక మట్టిలో కలిసిపోయాడు అంతే, ఆ తర్వాత మళ్ళీ జీవితం అనేది లేదు అని భ్రమించే వారికి, చూడండి మరణించిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ లేపుతాడు అని ఇక్కడ కొంతమందిని లేపి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రకారంగా మరణానంతర మరొక జీవితం ఉంది అన్న విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రతి విశ్వాసి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

4. సృష్టి యావత్తు అల్లాహ్ ను స్తుతిస్తుంది:

అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి. చీమల గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమన్నారంటే, “అవి అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. అల్లాహ్ ను స్తుతించే చీమలని మీరు దహనం చేసేసారు ఏమిటి?” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ ఆ ప్రవక్తను నిలదీశాడు అంటే, చీమలు సైతం అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. ఉత్తమ జీవులైన మానవులు మరీ ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి, అల్లాహ్ ను స్మరిస్తూ ఉండాలి.

ఖురాన్ గ్రంథం 62వ అధ్యాయం, 1వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు:

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
[యుసబ్బిహు లిల్లాహి మాఫిస్ సమావాతి వమా ఫిల్ అర్జ్]
“భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి.” (ఖుర్ఆన్, 62:1)

భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ ను స్తుతిస్తూ ఉంది, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంది, అల్లాహ్ ను స్మరిస్తూ ఉంది. కాబట్టి మానవులు కూడా అల్లాహ్ ను స్తుతిస్తూ, అల్లాహ్ ను స్మరిస్తూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఎవరైతే అల్లాహ్ ను స్తుతిస్తారో వారు ఇహపర సాఫల్యాలు మరియు అనుగ్రహాలు పొందుతారన్న విషయం కూడా తెలియజేయడం జరిగింది.

5. అగ్నితో శిక్షించే అధికారం:

చివర్లో ఒక విషయం ఏమిటంటే, అగ్నితో శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన (పూర్వం ఒక ప్రవక్త) చీమ కుట్టింది అని చీమలను కాల్చేశాడు. కాల్చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఎందుకు వారిని కాల్చింది? కుట్టింది ఒక చీమే కదా. ఆ ఒక చీమని కావాలంటే మీరు చంపుకోవాలి గాని, మొత్తం చీమలను దహనం చేశారు ఏమిటి?” అని నిలదీశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారు అంటే:

“నిశ్చయంగా, అగ్నితో శిక్షించే అధికారం అగ్నిని సృష్టించిన ప్రభువు (అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా) కు మాత్రమే ఉంది” అన్నారు. (అబూ దావూద్). మరొక ఉల్లేఖనంలో, “అగ్నితో శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదు అల్లాహ్ కు తప్ప” అన్నారు (బుఖారీ). అంటే అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ అగ్నితో శిక్షించే అధికారం లేదు.

ఇవి ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనకు బోధపడిన కొన్ని విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మిమ్మల్ని అందరినీ అన్న విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

2:259 أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఉజైర్ (అలైహిస్సలాం)
(వందేళ్ళు నిద్రపోయిన మనిషి)
(500-400 క్రీ.పూ.)

ఉజైర్ (అలైహిస్సలాం) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళకళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మపైకి కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, విసనకర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లతెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దాని పై కూర్చుని వెళ్ళిపోయారు.

దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారితప్పి తనను ఎటో తీసుకు పోవడాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనల నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుపడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థిపంజరాలు చెల్లాచెదరుగా పడఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందర వందరగా పడి ఉన్నాయని గ్రహించారు.

ఆయన గాడిదపై నుంచి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు అనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.

అలా రోజులు గడచపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలసపోయాయి. ఉజైర్ (అలైహిస్సలాం) నిద్రలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా తరాలు గడచిపోయాయి. జాతులు అంతరించాయి. కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి.

అల్లాహ్ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించక పోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశ హరులైన ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అంద జేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం. అందుకుగాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవదూతలు వచ్చేవారు. స్వర్గనరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతరం జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.

ఉజైర్ (అలైహిస్సలాం) తన దీర్ఘనిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయ్యింది. ఆయన నిద్ర పోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్తో దైవదూత, “ఎంతకాలం నిద్రపోయానని భావిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉజైర్ (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను” అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, “కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగునీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు.. అల్లాహ్ మహత్యాన్ని చూడు..మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బతికిస్తాడో అర్థం చేసుకో.. దీన్ని నీ ప్రభువు తరపు నుంచి నిదర్శ నంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో” అన్నాడు.

ఉజైర్ (అలైహిస్సలాం) చూస్తుండగానే గాడిద అస్థిపంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా, “అల్లాహ్ ఏమైనా చేయగల శక్తి కలిగినవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.

ఉజైరు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమె కళ్ళు కనబడడం లేదు. కాని ఆమె జ్ఞాపకశక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్నపిల్ల. ఆయన ఆమెతో, “ఇది ఉజైర్ ఇల్లేనా” అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ, “అవును” అంది. ఆమె దుఃఖంతో, “ఉజైర్ ఇల్లు వదలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు” అంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెతో, “నేనే ఉజైర్. అల్లాహ్ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్ర పోయాను. అల్లాహ్ నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు” అన్నారు.

ఈ మాటలు విని ఆ వృద్ధమహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాస్సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత, “ఉజైర్ (అలైహిస్సలాం) చాలా ధర్మాత్ముడు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్అ యితే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటిచూపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు” అని అడిగింది.

ఉజైర్ (అలైహిస్సలాం) అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించాడు. ఆ వృద్ధమహిళకు ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటిచూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్ పిల్లలు, మనుమలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్ని చూసి ఆయన తమకు తాతగారని వారు నమ్మలేకపోయారు. “ఇది నిజమా!” అని గుసగుసలాడు కోసాగారు. ప్రస్తుతం ముసలివాడై పోయిన ఉజైర్ కొడుకు ఒకరు “నా తండ్రికి భుజంపై ఒక పుట్టుమచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టుమచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టుమచ్చ చూపించండి” అని ప్రశ్నించాడు. ఉజైర్ తన భుజంపై ఉన్న పుట్టుమచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, “జెరుసలేమ్ను బుఖ్స్సర్ ఆక్రమించుకుని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి” అనడిగాడు. ఉజైర్ తౌరాత్ మొత్తం పఠించి వినిపించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు. నిజంగా ఉజైర్ (అలైహిస్సలాం) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.

ఆ పిదప యూదులు, “అల్లాహ్ ఉజైర్ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్లాహ్ కుమారుడై ఉండాలి” అనడం ప్రారంభించారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 9:30, 2:259)

9:30 وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్‌ అల్లాహ్‌ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్‌ (ఏసు క్రీస్తు) అల్లాహ్‌ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్‌ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?

సాధారణంగా మనిషి కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్ తిరిగి రావడం అల్లాహ్ చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17430

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకరియ్యా (అలైహిస్సలాం) జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం ఇక్కడ వినండి :
జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర
: https://youtu.be/DftBKf6r4MA

జకరియ్యా (అలైహిస్సలాం) జీవిత పాఠాలు – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర (Seerah of Zakariyyah & Yahya alaihimassalam) [వీడియో]

బిస్మిల్లాహ్
జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర (Seerah of Zakariyyah & Yahya alaihimassalam) త్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త షమ్ వీల్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర & జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం

ప్రవక్త షమ్ వీల్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రెండవ భాగం

ప్రవక్త షమ్ వీల్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్

పోయిన వారం మనం ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర విన్నాము, ఈ క్రింది వీడియోలో వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్”

ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర (Yusha’ bin Nun) [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర ( Yusha’ bin Nun – Joshua) – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలుత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7