త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

الأصول الثلاثة– تلغو
ఈ పుస్తక రచయిత: ఇమాం ముహమ్మద్ తమీమీ రహిమహుల్లాహ్
అనువాదకర్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [ 28పేజీలు]

యూట్యూబ్ ప్లే లిస్ట్: (23 వీడియోలు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3sKIkLUrdBOs1lCFaW2b0U

విషయసూచిక

1వ పాఠం – నాలుగు విషయాల జ్ఞానం విధి

అల్లాహ్ నిన్ను కరుణించుగాక! 4 విషయాలు నేర్చుకొనుట మనపై విధి అని తెలుసుకో! (1) ఇల్మ్, (2) అమల్, (3) దఅవత్, (4) సబ్ర్ .

  1. ఇల్మ్ (విద్య, జ్ఞానం); అంటే అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు ఇస్లాం ధర్మం గురించి (ఖుర్ఆన్, హదీసుల) ఆధారాలతో తెలుసుకొనుట.
  2. అమల్ (తెలుసుకున్న జ్ఞానం ప్రకారం ఆచరించుట).
  3. దఅవత్ (ఇతరులను ఇస్లాం వైపునకు ఆహ్వానించుట).
  4. సబ్ర్ (ఏ కష్టం, ఆపద ఎదురైనా ఓపిక, సహనాలు వహించుట).

వీటన్నిటికి దలీల్ (ఆధారం) ఇది:

وَالْعَصْـرِ (1) إِنَّ الْإِنسَانَ لَفِي خُسـْرٍ (2) إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ (3)

కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు. (సూర అస్ర్ 103).

ఈ సూర గురించి ఇమాం షాఫిఈ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:

لو مَا أَنزَلَ اللهُ حُجَّةً على خَلقهِ إلا هَذهِ السُّورةَ لكَفَتهُم
అల్లాహ్ మానవులపై ప్రమాణంగా కేవలం ఈ ఒక్క సూరాను అవతరింపజేసినా, ఇది వారి కొరకు సరిపోయేది

ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్ చెప్పారు: వాచ, కర్మ (మాట మరియు ఆచరణ) కంటే ముందు జ్ఞానం తప్పనిసరి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

فَاعْلَمْ أَ نَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ واسْتَغْفِرْ لِذَنبِكَ

కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో, నీ పొరపాట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు“. (ముహమ్మద్ 47:19).

ఈ ఆయతులో వాచ,కర్మ కంటే ముందు జ్ఞానం ప్రస్తావన ఉంది.

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు : క్లుప్త వివరణ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
తన ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు
https://youtu.be/vuLWSYjuoOg [40: 47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో మూడు ప్రాథమిక సూత్రాల గురించి వివరించబడింది, ఇవి సమాధిలో ప్రతి వ్యక్తిని అడగబడే మూడు ప్రశ్నలు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? మొదటి సూత్రం, ‘నీ ప్రభువు అల్లాహ్’, ఆయన సృష్టికర్త, పోషకుడు మరియు ఏకైక ఆరాధ్యుడు అని వివరిస్తుంది. రెండవ సూత్రం, ‘నీ ధర్మం ఇస్లాం’, ఇది అల్లాహ్ కు తౌహీద్ తో లొంగిపోవడం, విధేయత చూపడం మరియు షిర్క్ నుండి దూరంగా ఉండటం అని నిర్వచిస్తుంది. ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహ్సాన్ గురించి కూడా క్లుప్తంగా చెప్పబడింది. మూడవ సూత్రం, ‘నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’, ఆయన వంశం, జీవితం, ప్రవక్త పదవి, మక్కా మరియు మదీనాలోని ఆయన దَదావా మరియు ఆయన మరణం గురించి వివరిస్తుంది. ఈ సమాధానాలు కేవలం మాటలతో కాకుండా, ఆచరణ రూపంలో మన జీవితంలో ప్రతిబింబించినప్పుడే సమాధిలో చెప్పగలమని వక్త నొక్కిచెప్పారు.

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సర్వ స్తోత్రములు కేవలం మనందరి సృష్టికర్త అయిన, అలాగే మన పోషకుడైన ఈ సర్వ విశ్వాన్ని నిర్వహిస్తున్న, నడుపుతున్న, మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ కు మాత్రమే చెల్లుతాయి, శోభిస్తాయి.

లెక్కలేనన్ని దరూదో సలాం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అనేకానేక కరుణ శాంతులు చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురియుగాక.

ఈ రోజు నా యొక్క అంశం ఉసూలు సలాస, త్రి సూత్రాలు. త్రి సూత్రాలు అని ఈ అంశం ఏదైతే ఇక్కడ నిర్ణయించడం జరిగిందో దాని గురించి ఒక చిన్న వివరణ మీకు ఇచ్చి డైరెక్ట్ నా అంశంలో నేను ప్రవేశిస్తాను. నేను కూడా ఇది ఒక ప్రసంగం కాదు, క్లాసులు గనుక, తరగతులు గనుక, నిదానంగా మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా, వివరంగా ఆధారాలతో, మంచి విధంగా బోధించే సద్భాగ్యం నాకు ప్రసాదించుగాక. వింటున్న మంచి విషయాలను గ్రహించి, వింటున్న మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించే మరియు ఇతరులకు మనం ఆహ్వానించే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

త్రీ సూత్రములు, మూడు సూత్రాలు అని అంటే ఏమిటి అవి? నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు? ఈ మూడు ప్రశ్నలు అనండి, ఇదే మూడు సూత్రాలు, మూడు ప్రశ్నలుగా మనతో సమాధిలో ప్రశ్నించబడనున్నాయి.

అయితే, ఎప్పుడైతే సమాధిలో ఈ ప్రశ్నలు మన ముందుకు వస్తాయో, అప్పుడు అక్కడ మనం వీటి యొక్క సమాధానం తయారు చేసుకోవాలంటే ఏ మాత్రం వీలుపడదు. అందుకే అల్లాహ్ యొక్క గొప్ప దయ, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు ఆ ప్రశ్నలు ఇక్కడే తయారు చేసుకునే అటువంటి అవకాశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. మరియు ఆ ప్రశ్నలకు నిజమైన సమాధానం ఏమిటో అది కూడా అల్లాహు త’ఆలా మనకు తెలియజేశాడు.

సునన్ అబీ దావూద్, హదీస్ నెంబర్ 4753. ఇందులో ఈ హదీస్ వచ్చి ఉంది. చాలా పొడవైన హదీస్. కానీ ఈ మూడు ప్రశ్నల యొక్క ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. ఎప్పుడైతే మనిషిని తీసుకువెళ్లి అతని బంధుమిత్రులందరూ కూడా సమాధిలో పెడతారో మరియు అక్కడ నుండి తిరిగి వస్తారో, ఆ తర్వాత అక్కడికి ఇద్దరు దూతలు వస్తారు, ఫయుజ్లిసానిహి, ఆ దూతలు అతన్ని కూర్చోబెడతారు. ఫయఖూలాని లహు, అతనితో ప్రశ్నిస్తారు.

مَنْ رَبُّكَ؟
(మన్ రబ్బుక?)
“నీ ప్రభువు ఎవరు?”

مَا دِينُكَ؟
(మా దీనుక్?)
“నీ ధర్మం ఏది?”

مَا هَذَا الرَّجُلُ الَّذِي بُعِثَ فِيكُمْ؟
(మా హాజర్ రజులుల్లదీ బుఇస ఫీకుమ్?)
“మీ వద్దకు పంపబడిన ఈ వ్యక్తి ఎవరు?”

విశ్వాసుడయైతే ఉంటే కరెక్ట్ సమాధానం ఇస్తాడు. నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు మా వైపునకు మా మార్గదర్శకత్వం కొరకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని.

అయితే సోదర మహాశయులారా, ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో వీటినే మూడు సూత్రాలుగా చెప్పడం జరిగింది. మరియు ఇహలోకంలో మనం ఈ మూడు ప్రశ్నల యొక్క, మూడు సూత్రాల యొక్క వివరణ, జవాబులు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ఆచరించడం, జీవించడం చాలా అవసరం.

అయితే సోదర మహాశయులారా, ఈ అంశంపై త్రీ సూత్రాలు అల్-ఉసూలుల్ సలాస అని ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఒక చాలా చక్కని చిన్నటి పుస్తకం రాశారు. దాని యొక్క వివరణ తెలుగులో అల్ హందులిల్లాహ్ మా యూట్యూబ్ ఛానల్ పై కూడా ఉంది, జీడీకే నసీర్. ఇంకా వేరే కొందరు ఛానెల్ వారు కూడా తమ యొక్క ఛానెల్ లో కూడా వేసి ఉన్నారు. పూర్తి వివరణ అక్కడ వినవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఇక్కడ నాకు కేవలం 35-40 నిమిషాల సమయం మాత్రమే ఉంది గనుక, ఇందులో కొన్ని ముఖ్య విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.

సోదర మహాశయులారా, త్రీ సూత్రాలు అని ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇందులో మొదటి సూత్రం మన్ రబ్బుక్, నీ ప్రభువు ఎవరు? మనకు ఇప్పుడు జవాబు తెలిసింది గనుక మనం చాలా సులభంగా ఒక్క మాటలో చెప్పేస్తున్నాము. నా యొక్క ప్రభువు అల్లాహ్ అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం ఆచరణ రూపంలో ఇహలోకంలో సిద్ధపరచుకొని లేకుంటే, చనిపోయిన తర్వాత మన సమాధిలో ఈ సమాధానం మనం చెప్పలేము. ఏదో మూడు ప్రశ్నల సమాధానాలు తెలిసిపోయాయి కదా, మన్ రబ్బుకా అంటే అల్లాహ్ అనాలి, మా దీనుక్ నీ ధర్మం ఏమిటి అంటే ఇస్లాం అనాలి, నీ ప్రవక్త ఎవరు అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాలి, మూడే పదాలు ఉన్నాయి కదా? అల్లాహ్, ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత సులభం? చెప్పుకోవడానికి మూడే మూడు పదాలలో చాలా సులభమైన ఆన్సర్. ఇహలోకంలో ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వింటే వచ్చేస్తుంది కావచ్చు. కానీ దీని ప్రకారంగా మన జీవితం గడవకపోతే, దీని ప్రకారంగా మన ఆచరణ లేకుంటే సమాధిలో మన నోటితో ఈ ఆన్సర్, జవాబు చెప్పడం కుదరదు. ఇది చాలా బాధాకర విషయం. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా దాని యొక్క జవాబు వివరణగా ఏమిటి, ఎలా దాన్ని మనం సిద్ధపరచాలి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

మన్ రబ్బుక్ అని ఎప్పుడైతే అనడం జరుగుతుందో, నీ ప్రభువు ఎవరు? మన సమాధానం అల్లాహ్ అనే ఉండాలి. కరెక్టే. కానీ ఎవరు అల్లాహ్? అల్లాహ్ ఎవరు అంటే, ఆయనే నన్ను ఈ సర్వ విశ్వాన్ని సృష్టించినవాడు. ఇక్కడ గమనించండి, రబ్ అన్న పదం ఉంది. సర్వసామాన్యంగా మన తెలుగు పుస్తకాల్లో అనువాదంలో పోషకుడు అని మనం తర్జుమా, అనువాదం చేస్తాము. కానీ ఇందులో చాలా వివరణతో కూడిన విషయాలు ఉన్నాయి. రబ్ అన్న పదానికి ఒక్క పోషకుడు అన్న పదం సరిపోదు. అయితే మన యొక్క రబ్ ఎవరు? ఎవరైతే నన్ను మరియు ఈ విశ్వంలో ఉన్న సర్వ సృష్టిని పుట్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి అందరి యొక్క వ్యవహారాలను నడుపుతున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే.

ఇక్కడ శ్రద్ధ వహించండి నా మాటపై, ప్రతి బుద్ధిమంతునికి వెంటనే మనసులో వచ్చే విషయం ఏంటి? ఎవరైతే నీకు ఉపకారం చేస్తున్నాడో, నీ పట్ల మేలు చేస్తున్నాడో అతనికి నీవు కృతజ్ఞతాభావంతో మెలుగుతావు. ఏ అల్లాహ్ అయితే సృష్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి మన వ్యవహారాలన్నిటినీ నడుపుతున్నాడో అంతకంటే మేలు చేసేవాడు, అంతకంటే గొప్ప మనకు ఉపకారాలు చేసేవాడు ఇంకెవరు ఉంటారు? ఎవరూ ఉండరు. అందుకొరకే వహువ మ’బూదీ లైసలీ మ’బూదున్ సివా. ఆ అల్లాహ్ తప్ప నా ఆరాధ్యుడు ఇంకా వేరే ఎవరూ కాజాలడు. అర్థమైందా విషయం? దీనికి దలీల్, ఖురాన్ మీరు తెరిస్తేనే, ఓపెన్ చేస్తేనే బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ తర్వాత ఏముంది?

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్)
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,1:2)

గమనించండి. అల్ హందు, సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు ఎవరికీ? లిల్లాహి, కేవలం అల్లాహ్ కొరకు. ఎందుకు? రబ్బిల్ ఆలమీన్. ఆ అల్లాహ్ యే ఈ సర్వ లోకాలకు ప్రభువు.

రబ్ అన్న ఇక్కడ పదానికి ప్రభువు అని మనం ఏదైతే చేశామో తెలుగులో, ఇంతకుముందు నేను చెప్పినట్లు, పుట్టించువాడు, పోషించువాడు మరియు జీవన్ మరణాలు ప్రసాదించేవాడు, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు, ఇవన్నీ భావాలు ప్రభువు అన్న యొక్క అర్థంలో వచ్చేస్తాయి. ఇక్కడ గమనించండి, అల్లాహ్ తప్ప ప్రతీదీ కూడా ఆలం, ప్రపంచం, లోకం. మరియు ఈ లోకంలో ఒకడిని నేను. అందుకని కేవలం అల్లాహ్ యే నా ప్రభువు, ఆ అల్లాహ్ యే నా యొక్క నిజమైన ఆరాధ్యుడు.

అల్లాహ్ యే నా ప్రభువు అని మనం ఎలా గుర్తుపట్టాలి? చాలా సులభమైన విషయం. రాత్రి పగళ్లు, సూర్య చంద్రులు మరియు భూమి ఆకాశాలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు చెప్పకనే చెబుతుంది, మనందరి ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని. ఉదాహరణకు చదవండి సూరత్ ఫుస్సిలత్, దాని యొక్క మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నెంబర్ 37.

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి. (41:37)

అల్లాహ్ యొక్క సూచనలలో, అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, ఆయన ఏకైక ఆరాధ్యుడు అన్నదానికి ఎన్నో సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇవి కూడా. ఏంటి? రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు. మీరు సూర్యునికి సాష్టాంగం చేయకండి, సజ్దా చేయకండి. చంద్రునికి సజ్దా చేయకండి. వీటన్నిటినీ సృష్టించిన నిజ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయనకే మీరు సజ్దా చేయండి. నిజంగా, వాస్తవంగా మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించే వారైతే.

ఇక ఎవరైతే మేము సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము, మీరు మేము అందరము ఆరాధించేది కేవలం ఒక్క దేవున్నే అన్నటువంటి మాటలు పలుకులు ఎవరైతే పలుకుతారో, వారితోని అడగండి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారు సూర్యుణ్ణి పుట్టించారా? చంద్రుణ్ణి పుట్టించారా? ఈ రాత్రి పగలును పుట్టించారా? అలాగే అల్లాహు త’ఆలా సూరతుల్ అ’రాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 54 లో తెలిపాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు.  (7:54)

నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయనే భూమ్యాకాశాలను కేవలం ఆరు రోజుల్లో పుట్టించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం చూస్తూ పోతే ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఖురాన్ ఆరంభంలో, సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ బఖర, అందులోని మూడో రుకూ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, సూరే బఖర, ఆయత్ నెంబర్ 21, 22 లో మొట్టమొదటి ఆదేశం అల్లాహ్ ఏదైతే ఇచ్చాడో, ఖురాన్ ప్రారంభంలో మొట్టమొదటి ఆదేశం ఇదే ఆదేశం ఇచ్చాడు. ఏంటి? మీరందరూ మీ నిజ ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అంతేకాదు, ప్రతి బుద్ధిమంతునికి అర్థమయ్యే విధంగా ఎంతో సులభంగా ఆ అల్లాహ్ యొక్క గుణగణాలను, ఆయనే ఆరాధనకు ఏకైక అర్హుడు అన్నటువంటి కొన్ని నిదర్శనాలు కూడా అక్కడ చూపాడు. ఒకసారి ఆ ఆయతులు విని ఇంకా ముందుకు వెళ్దాము మనం.

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. (2:21)

ఓ ప్రజలారా! గమనించండి. మీరు ఏదైతే శ్రద్ధగా ఈ పాఠం వింటున్నారో కదా, ఆయత్ నెంబర్లు ఏదైతే చెబుతున్నానో, రాస్తున్నారో కదా, మీరు మీ ముస్లిమేతర సోదరులకు, ఎవరైతే స్త్రీలు వింటున్నారో మీరు ముస్లిమేతర స్త్రీలకు ఈ ఆయతులు తిలావత్ కూడా చేసి వినిపించండి. వాటి యొక్క భావాన్ని కూడా వారికి వివరించి చెప్పండి. ప్రత్యేకంగా ఈ రెండు ఆయతులు మీరు యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది, తౌహీద్ యొక్క దావత్ ఇవ్వడానికి.

మొట్టమొదటి విషయం ఇక్కడ గమనించండి, ఈ ఒక్క మొదటి పదంలోనే యా అయ్యుహన్నాస్ మనకు ఖురాన్ యొక్క సత్యం, ఖురాన్ ప్రజలందరికీ అన్న విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఓ ప్రజలారా! అంటే ఈ ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు, అరబ్బులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎక్కడ ఎవరు జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు వచ్చింది. ఏమంటున్నాడు అల్లాహ్? ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి. ఎవరు ప్రభువు? అల్లదీ ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో, వల్ లదీన మిన్ ఖబ్లికుమ్, మీకంటే ముందు గడిచిన వారిని సృష్టించాడో, ల’అల్లకుమ్ తత్తఖూన్, ఈ విధంగా మీరు భయభీతి కలిగిన వారిలో చేరగలుగుతారు. ఈ విధంగా మీరు తమకు తాము నరకం నుండి రక్షించుకోగలుగుతారు. ఇక ఆ నిజ ప్రభువు యొక్క ఒక గుణం చెప్పడం జరిగింది, ఆయన మిమ్మల్ని మీకంటే పూర్వీకులను పుట్టించాడు అని. ఇంకా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మరికొన్ని విషయాలు కూడా అల్లాహ్ తెలిపాడు. ఏమని తెలిపాడు?

الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి. (2:22)

ఆ అల్లాహ్ యే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు మరియు ఆకాశం నుండి ధారాపాతంగా మీ కొరకు వర్షాన్ని కురిపించాడు. ఈ వర్షం ద్వారా, ఈ నీటి ద్వారా భూమి నుండి మీ కొరకు మంచి మంచి పంటలు, ఫలాలు పండించాడు. ఇలాంటి అల్లాహ్ ను, అల్లాహ్ యొక్క ఈ గొప్ప సూచనలను మీరు తెలుసుకొన్న తర్వాత ఈ విధంగా అల్లాహ్ కు పాటు వేరే భాగస్వాములను ఏమాత్రం కల్పించకండి.

అల్లాహ్ యొక్క పరిచయం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. ఎలాంటి ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఏ ఒక పెద్ద వివరణ, దీని గురించో పెద్ద ఫిలాసఫర్ లాంటి వారు లేదా పెద్ద తత్వవేత్తలు డిగ్రీలు సంపాదించడం ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఎంతో సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ఇవన్నిటిని సృష్టించిన సృష్టికర్తయే మనందరి ఆరాధనలకు నిజమైన ఆరాధ్యుడు.

ఇక ఆరాధనలో సోదరులారా ఎన్నో విషయాలు వస్తాయి. ఇస్లాం, ఈమాన్, ఇహసాన్, దుఆ, భయభీతి, ఆశ, భరోసా, నమ్మకం, అలాగే భయపడడం, ఇంకా మనం కష్టంలో ఉన్నప్పుడు కేవలం అతనితో మాత్రమే సహాయం కోరడం, అర్ధించడం, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడం, ఇంకా మొక్కుబడులు ఇంకా ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకవేళ సంక్షిప్తంగా ఓ రెండు మాటల్లో చెప్పాలంటే హృదయ సంబంధమైన, నాలుక సంబంధమైన, శరీర సంబంధమైన, ధన సంబంధమైన ఎన్నో రకాల ఆరాధనలు ప్రతిదీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి. ఆరాధన యొక్క కొన్ని రకాలు ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలిపాను వాటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ నుండి మరియు హదీస్ నుండి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ సమయం సరిపోదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు మా యొక్క వివరణతో కూడిన మీరు వీడియోలు, ఆడియోలు తప్పకుండా వినండి. అక్కడ వివరణ తెలుస్తుంది.

ఇక రండి, రెండో మూల సూత్రం, ఇస్లాం. సోదర మహాశయులారా, సోదర మహాశయులారా, అల్లాహ్ ను మనం తెలుసుకున్నాము. ఇక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అయితే ఆ అల్లాహు త’ఆలా మన జీవన విధానం కొరకు ఇస్లాం ధర్మాన్ని మనకు ప్రవక్తల ద్వారా పంపుతూ వచ్చాడు. అయితే మొదటి ప్రవక్త, ప్రథమ ప్రవక్త, తొలి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం ధర్మాన్నే బోధించారు. కానీ ఆ ప్రవక్తలు చనిపోయిన తర్వాత వారిని అనుసరించే వారిలో కాలం గడిచిన కొద్దీ వారు మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల మంచి విషయాలను అందులో నుండి తీసేసి తమ ఇష్టానుసారం అందులో చేర్పులు చేసుకున్నారు. అయితే అల్లాహు త’ఆలా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగావించాడు. దీనిని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నాడు. అందుకొరకే ఎన్ని కొత్త వర్గాలు పుట్టుకొచ్చినా గాని, ఇస్లాంలో ఎన్ని కొత్త మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేసినా గాని, స్వయంగా ఇస్లాం యొక్క శత్రువులు ఇందులో ఎలాంటి జోక్యం చేసుకొని సరియైన ఇస్లాం నుండి ముస్లింలను, ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కాజాలవు. ఎందుకంటే స్వయంగా అల్లాహ్ ఈ సత్య ధర్మమైన ఇస్లాం ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సంపూర్ణం చేశాడో, దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుని ఉన్నాడు.

అయితే ఇక రండి, ఇస్లాం అన్న దానికి భావం ఏంటి? అల్ ఇస్లాం హువల్ ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్, వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, వల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. మూడు విషయాలు ఇందులో వచ్చాయి గమనించండి. మనం ఏకత్వం, తౌహీద్ ద్వారా అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ. ఆయనకు మాత్రమే విధేయత పాటించుట. ఇచ్చిన ఆదేశాలను పాటించాలి, వారించిన విషయాలకు దూరం ఉండాలి. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, ఆయన యొక్క విధేయత పాటించుట, మాట వినుట, ఆజ్ఞ పాలన చేయుట. మూడోది ఏమిటి? తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్. షిర్క్ మరియు షిర్క్ చేసేవారితో తమకు తాము ఏ సంబంధం లేనట్లుగా దూరంగా ఉండుట.

స్లాం యొక్క ఇక్కడ చిన్నపాటి డెఫినిషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి కొంత వివరణ కూడా మీరు తెలుసుకోండి లేదా అంటే మరికొందరు మిస్అండర్స్టాండింగ్, తప్పుడు అర్థాలు తీసుకొని మనపై బురద చల్లే అటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు. ఏంటి అది? ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్. కేవలం అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. ఎందుకు? ఇప్పటివరకే మనం తెలుసుకున్నాము, ఆయనే మన నిజ ఆరాధ్యుడు. ఈ లొంగిపోవుట అనేది ఎలా ఉండాలి? తౌహీద్ తో ఉండాలి, ఏకత్వంతో ఉండాలి. ఇంకా వేరే ఎవరి వైపునకు మనం లొంగిపోవడానికి ఏ అవకాశం ఉండదు. హా, నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నా హృదయంలో అల్లాహ్ తప్ప ఎవడు లేడు, నోటితో ఇలా చెప్పుకుంటే సరిపోదు, ఇన్ఖియాద్. అంటే ఏమిటి? ఇన్ఖియాద్ లహు బిత్తాఅ. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పాటించడం. ఏ విషయాల నుండి వారించాడో వాటికి దూరంగా ఉండడం. ఈ రెండిటితో పాటు మూడవది, అల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్, బహుదైవారాధన, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయడం. ఈ షిర్క్ కు పూర్తిగా దూరం ఉండాలి. షిర్క్ తో ఏ సంబంధం లేకుండా ఉండాలి.

ఇందులోనే మరో అంశం ఉంది. షిర్క్ తో కూడా మన సంబంధం లేకుండా ఉండాలి, వ అహ్లిహి, షిర్క్ చేసేవారితో కూడా. ఈ పదంతో కొందరు తప్పుడు భావాలు తీసుకుంటారు, అందుకొరకే కొంచెం గమనించండి. ఏంటి గమనించే విషయం? షిర్క్ విషయాలలో, షిర్క్ పనులలో మనం ముష్రికులకు, బహుదైవారాధనలో బహుదైవారాధకులకు మనం ఎలాంటి తోడ్పాటు, సహాయం అందించలేము. ఎందుకంటే ఇది తప్పు. తప్పును తప్పు చెప్పకుండా మనం అభినందిస్తున్నాము, శుభకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే ఆ తప్పును నిజం అని ఒప్పుకున్నట్లు మనం. అది తప్పు అని నోటితో చెప్పినప్పటికీ, తప్పు కాదు అని మనం మన ఆచరణ ద్వారా మనం ప్రదర్శిస్తున్నట్లు అవుతుంది. అందుకొరకు ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. అయితే, మరో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఎవరైతే ముస్లిమేతరులుగా ఉన్నారో, ఎవరైతే బహుదైవారాధన చేస్తున్నారో, ముస్లింలు అయి ఉండి కూడా, ప్రతి ఒక్కరితో షిర్క్ పనులలో మనం ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. కానీ అదే ఇస్లాం బోధిస్తున్న మరో గొప్ప విషయం ఏమిటంటే, షిర్క్ విషయంలో వారికి ఏ సహాయం చేయకండి, వారికి ఏ శుభాభినందనలు తెలుపకండి, వారికి ఎలాంటి కంగ్రాట్యులేషన్స్ తెలిపి వారిని ప్రోత్సహించకండి. కానీ మానవరీత్యా వారితో మానవత్వంగా మసులుకొని, వారికి షిర్క్ యొక్క నష్టాలను తెలియజేస్తూ ఉండండి, తౌహీద్ యొక్క బర్కత్ లను, శుభాలను స్పష్టపరుస్తూ ఉండండి, షిర్క్ నుండి ఆగిపోవాలి అని, తౌహీద్ వైపునకు రావాలి అని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉండండి. ఇంతటి గొప్ప మంచి శిక్షణ కూడా ఇస్లాం ఇచ్చి ఉంది. 28వ ఖాండంలో మనకు దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆయతులు ఉన్నాయి, సూరే మాయిదాలో కూడా ఉన్నాయి, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి.

సోదర మహాశయులారా, ఇస్లాం యొక్క నిర్వచనం, దాని యొక్క చిన్న వివరణ ఏదైతే మనం విన్నామో, ఇక రండి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మూడో సూత్రం గురించి తెలుసుకుందాము.

ఇస్లాం అని మనం అన్నప్పుడు ఇందులో ఇస్లాం యొక్క ఐదు అర్కాన్లు వచ్చేస్తాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, ఐదు పూటల నమాజు స్థాపించడం, విధిదానం జకాతు చెల్లించడం, రమదాన్ ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. అయితే ఈ ఐదిటిలో మూడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం, నమాజు పాటించడం మరియు ఉపవాసం ఉండడం ప్రతి బీదవానిపై విధిగా ఉంది. ఇక ఎవరికి ఎలాంటి కొన్ని ఆరోగ్యపరంగా ఏమైనా ఆటంకాలు వస్తాయో వాటికి తగిన సులభతరాలు చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది, ఆ వివరాలు వేరే సందర్భంలో. ఇక విధిదానం జకాత్ అన్నది ఎవరైతే సంపాదన సంపాదిస్తున్నారో, ఎవరైతే తమ యొక్క అవసరాలు తీర్చిన తర్వాత ఇంకా ఎక్కువగా డబ్బు ఉందో, అయితే నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత కొన్ని విషయాలలో, నిర్ణీత ప్రజలకు ఇవ్వవలసిన హక్కు జకాత్. ఇక హజ్ కూడా శక్తి ఉన్నవారిపై మాత్రమే విధిగా ఉంది. వీటన్నిటికీ కూడా దలీల్ ఖురాన్ లో హదీస్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. హదీసే జిబ్రీల్ మన ముందు ఎంతో స్పష్టంగా ఉంది. కానీ ఆ దలీల్ అన్నీ కూడా ఇప్పుడు తెలియజేయడానికి, చదివి మీ ముందు వినిపించడానికి అవకాశం కాదు. అవకాశం లేదు, సమయం సరిపోదు.

ఇస్లాంలో మరో ముఖ్యమైన విషయం, ఈమాన్. ఈమాన్ అంటే ఇందులో ఆరు మూల సూత్రాలు వస్తాయి. అల్లాహ్ ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, ప్రవక్తలను విశ్వసించడం, గ్రంథాలను విశ్వసించడం, పరలోకాన్ని విశ్వసించడం మరియు మంచి చెడు తక్దీర్, అదృష్టాన్ని, విధిరాతను విశ్వసించడం.

ఇక ఇందులో మరొకటి వస్తుంది, దానినే ఇహ్సాన్ అని అంటారు. ఏమిటి అది? మనం ఏ పని, ఏ సత్కార్యం, ఏ ఆరాధన చేస్తున్నా గానీ, మనం ఏ చెడు నుండి దూరం ఉంటున్నా గానీ, ఎలా చేయాలి, ఎలా మనం ఆ సత్కార్యంలో నిమగ్నులై ఉండాలి? మన ముందు అల్లాహ్ ఉన్నాడు, మనం కళ్లారా అల్లాహ్ ను చూస్తూ ఉన్నాము, అటువంటి విధేయత భావంతో. ఒకవేళ ఇలాంటి భావం రాకుంటే మనసులో, ఇది మాత్రం తప్పకుండా మనం విశ్వసించాలి, అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు, ఏ క్షణం కూడా అల్లాహ్ యొక్క వినడం, చూడడం, జ్ఞానం నుండి మనం దూరం లేము. రాత్రిలో అయినా, పట్టపగలు మట్టమధ్యాహ్నం అయినా గాని, అమావాస్య చీకట్లోనైనా వెలుతురులోనైనా, ఒంటరిగా ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, అల్లాహ్ మనల్ని ఎల్లవేళల్లో చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క దృష్టి నుండి మనం ఏ మాత్రం తప్పించుకోలేము.

ఇస్లాం అంటే ఏమిటి అన్న దానికి ఈ సంక్షిప్త వివరణ కూడా మనం మన మిత్రులకు మనం తెలుపవచ్చు. అయితే సోదర మహాశయులారా, ఈమాన్, ఇహసాన్, ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహసాన్ దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. వీటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ లో, హదీస్ లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి.

మూడో సూత్రం, నీ ప్రవక్త ఎవరు? ఇదే మూడవ ప్రశ్న కూడా సమాధిలో. అయితే మనం మన ప్రవక్తను తెలుసుకొని ఉండడం కూడా తప్పనిసరి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సంక్షిప్తంగా వారి యొక్క వంశం ఏమిటి? ముహమ్మద్ బిన్… ఇక్కడ మనం సర్వసామాన్యంగా అరబీలో బిన్ అని అంటాము కదా, కొడుకు అని భావం. అయితే పైకి వెళ్తూ ఉంటారు ఇందులో అరబీలో. ముహమ్మద్ బిన్, ఎవరి కొడుకు ముహమ్మద్? అబ్దుల్లా. అబ్దుల్లా ఎవరి కొడుకు? అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి కొడుకు? హాషిమ్. హాషిమ్ ఎవరి కొడుకు? ఈ విధంగా. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ వంశానికి చెందినవారు. ఖురైష్ అరబ్బులోని వారు. అరబ్బులు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సంతానంలోని వారు. ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ వంశ పరంపర ఇబ్రాహీం వరకు, మళ్ళీ అక్కడ నుండి ఆదం అలైహిస్సలాం వరకు చేరుతుంది.

ఇక్కడ మనకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశ పరంపరం విన్నాం కదా ఇప్పుడు మనం. అంటే ఆయన ఆదం అలైహిస్సలాం సంతతిలోని వారు, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలోని వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆ కారణంగా, ఈసా అలైహిస్సలాం వారి యొక్క బిషారత్, భవిష్య సూచనకు జవాబుగా వచ్చారు.

ఆయన మానవుడు, అంటే తల్లిదండ్రులతో పుట్టారు. మానవ అవసరాలు తినడం, త్రాగడం, పడుకోవడం, ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడం, మానవ అవసరాలు ఎలా ఉంటాయో అలాంటి అవసరాలు కలిగిన వారు అని భావం ఇక్కడ మానవుడు అంటే. కానీ కేవలం మానవుల్లోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేది ఉందో ప్రతి దానిటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మించిన గొప్పవారు, ఘనత గలవారు వేరే ఎవరూ లేరు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జన్మించారు. మక్కాలో జన్మించిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు అక్కడే గడిపారు. 40 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత ప్రవక్త పదవి లభించింది. ప్రవక్త పదవి అనేది ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ అనే ఈ ఆయతుల ద్వారా, సూరత్ అలఖ్ లోని మొదటి ఐదు ఆయతులు. వీటి ద్వారా ప్రవక్త పదవి లభించింది. మరియు యా అయ్యుహల్ ముద్దస్సిర్ అని ఆ తర్వాత సూరా అవతరించింది. దాని ద్వారా రిసాలత్, ఇక మీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త పదవి లభించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో 13 సంవత్సరాలు జీవించారు. అంటే పుట్టిన తర్వాత 53 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. తర్వాత 13 సంవత్సరాలు అల్లాహ్ వైపునకు ప్రజలను పిలుస్తూ ఉన్నారు. దీనికి దలీల్ సూరతుల్ ముద్దస్సిర్ (సూరా నెంబర్ 74) లోని మొదటి ఏడు ఆయతులు చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక సోదర మహాశయులారా, మక్కాలో దావత్ ఇస్తూ ఇస్తూ 13 సంవత్సరాలు గడిపారు. చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అక్కడ వ్యతిరేకత అనేది మొదలైంది మరియు ఎన్నో రకాల ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఓపిక, సహనాలతో దావత్ లో నిమగ్నులై ఉన్నారు. ఎప్పుడైతే మదీనా వాసులు కొందరు ఇస్లాం స్వీకరించి అక్కడికి ఆహ్వానించారో, అటు అల్లాహ్ వైపు నుండి కూడా ఆదేశం వచ్చిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజరత్ చేశారు, మదీనా వైపునకు వలస పోయారు. మదీనా వలస పోయిన తర్వాత సోదర మహాశయులారా, అక్కడ 10 సంవత్సరాలు జీవించారు. దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు ఎన్నో ఉన్నాయి.

దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ అక్కడ మనం ఏదైనా ఆటంకాలు, ఇబ్బందులకు గురి అవుతే, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో మనకు ఏదైనా అక్కడ సమస్య ఎదురవుతే, ఎక్కడికి వెళ్లి మనం అల్లాహ్ యొక్క ఆరాధన స్వతంత్రంగా చేయగలుగుతామో, అక్కడికి వలస వెళ్లడంలో చాలా చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాల గురించి స్వయంగా అల్లాహు త’ఆలా ఖురాన్ లో ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు. సూరత్ అన్-నిసా, ఆయత్ నెంబర్ 97 నుండి 99 వరకు చదివారంటే ఇందులో కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి.అయితే ఈ వలస అనేది ప్రళయ దినం వరకు ఉంది.

ఇక మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 సంవత్సరాలు అక్కడ ఉండి దావత్ చేస్తూ, అవసరం పడ్డది యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు చేస్తూ ఇస్లాం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. 10వ సంవత్సరం హజ్ కూడా చేశారు. లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట హజ్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తిగా నిండాక 11వ సంవత్సరం, ఏంటి 11వ సంవత్సరం? ఇటు మదీనా వచ్చాక 11వ సంవత్సరం. అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 63 సంవత్సరాలు పూర్తిగా నిండినవి. అప్పుడు ప్రవక్త వారు మరణించారు. కానీ ప్రవక్త మరణించేకి ముందే అల్లాహు త’ఆలా ఈ ధర్మాన్ని సంపూర్ణం చేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. (5:3)

అని సూరతుల్ మాయిదాలో ఆయత్ అవతరించింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు.

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
(ఇన్నక మయ్యితువ్ వ ఇన్నహుమ్ మయ్యితూన్)
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.(సూరత్ అజ్-జుమర్ 39:30)

నీవు కూడా చనిపోతావు, వారందరూ కూడా చనిపోతారు అని ప్రవక్త మరణానికి ముందే ఆయత్ అవతరింపజేయబడింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ కూడా అవతరించింది:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
(మిన్హా ఖలఖ్నాకుమ్ వ ఫీహా ను’ఈదుకుమ్ వ మిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా)
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.(సూరత్ తాహా, 20:55)

ఈ మట్టిలో నుండే మిమ్మల్ని పుట్టించాము. తిరిగి ఇందులోకి మీరు వెళ్తారు, సమాధి చేయబడతారు. మరియు ప్రళయ దినాన ఇక్కడి నుండే మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.

సోదర మహాశయులారా, ఈ విధంగా ఈ మూడు సూత్రాల యొక్క సంక్షిప్త వివరణ మనం ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంతటితో నా సమయం కూడా ముగించింది. అందుకొరకు మనం ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోలేము. కానీ ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ పూర్తి అంశం మూల సూత్రాలకు సంబంధించింది, త్రీ సూత్రాలకు సంబంధించి మా యూట్యూబ్ జీడీకే నసీర్ లో ఇంకా వేరే యూట్యూబ్ ఛానెల్ లో కూడా పాఠాలు ఉన్నాయి. శ్రద్ధగా విని మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఈ మూడు సూత్రాలు చూడడానికి సమాధానం మూడే పదాల్లో ఉన్నాయి. అల్లాహ్, ఇస్లాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అల్లాహ్ ను ఆరాధించకుంటే, ఇస్లాం ప్రకారంగా జీవించకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం విధేయత పాటించకుంటే, సమాధిలో మనకు ఈ మూడు పదాలు పలకడానికి వీలు కాదు.

అల్లాహు త’ఆలా ఈ మూడు సూత్రాల గురించి ఏదైతే తెలుసుకున్నామో, ఇందులోని మంచి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితం సరిదిద్దుకునే అటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

وآخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته.

ఇతర ముఖ్యమైన పోస్టులు

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2023/04/19/u3mnj/

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]

బిస్మిల్లాహ్
త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత- యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zNRaaEnL1ZQB34vY0u2MD

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


క్రింది పుస్తకం హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన   ఇస్లాం మూల సూత్రాలు (ఉసూల్ అత్ తలాత & ఖవాఇద్ అల్ ఆర్బా) అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కొన్ని పదాలలో చిన్న చిన్న మార్పులు చేసాము.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్‌
(అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో)

వ బిహీ నస్తయీను వస్సలాతు వస్సలాము అలా నబియ్యినా ముహమ్మదిన్ వ్వ అలా ఆలిహీ వ సహ్‌బిహీ అజ్‌ మయిీన్‌.

ప్రశ్న : ప్రతి మనిషీ విధిగా తెలుసుకోవలసిన నాలుగు అంశాలు ఏవి?

జవాబు :

  1. మొదటిది – ఇల్మ్‌ (జ్ఞానం), అంటే దైవాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను, ఇస్లాం ధర్మాన్ని గురించి క్షుణ్ణంగా, ప్రామాణికమైన ఆధారాల ద్వారా తెలుసుకోవటం.
  2. రెండవది. : ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం.
  3. మూడవది : దీనిని ఇతరులకు తెలియపరచటం.
  4. నాల్గవది : ఈ మార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఓపికతో సహించి నిలకడను కనబరచటం.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం ఇది :

وَالْعَصْرِ  إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ

(కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి లోనై ఉన్నాడు.అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారు, పరస్పరం సత్యాన్ని ప్రబోధిస్తూ ఉండేవారు, సహనస్థయిర్యాలను గురించి ఒండొకరికి ఉపదేశిస్తూ ఉండేవారు మాత్రం నష్టంలో లేరు.) (అల్‌ అస్ర్ సూరా)

ప్రశ్న: ఈ సూరా గురించి ఇమామ్‌ షాఫయి (రహిమహుల్లాహ్) ఏమన్నారో తెలుసా?

జవాబు : అవును. అల్లాహ్‌ తన సృష్టితాల కోసం ఈ చిన్న సూరా నొక్కదానిని అవతరింపజేసినా వారి మార్గదర్శకత్వం కొరకు ఇది సరిపోయేదని ఇమామ్‌ షాఫయి (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు.

ప్రశ్న: ముందు జ్ఞానమా లేక ఆచరణా?

జవాబు : జ్ఞానం తరువాతనే మాటలయినా,చేతలయినా. దీనికి ఆధారం ఏమిటంటే-

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ

కనుక ఓ ప్రవక్తా! బాగా తెలుసుకో! అల్లాహ్‌ తప్ప ఆరాధనకు అర్హుడైనవాడు ఎవడూ లేడని. నీవల్ల జరిగిన పొరపాట్లకు క్షమాభిక్ష వేడుకో. విశ్వాసులైన స్త్రీ  పురుషుల పొరపాట్లకు కూడా.” (ముహమ్మద్‌  47:19)

ప్రశ్న : ప్రతి ఒక్కరూ తెలుసుకుని తప్పనిసరిగా ఆచరించవలసిన ఆ మూడు ముఖ్యాంశాలు ఏవి?

జవాబు:: మొదటిదేమంటే; మనల్ని అల్లాహ్‌యే పుట్టించాడు. ఆయనే మన జీవికకోసం ఉపాధిని ప్రసాదించాడు. ఆయన మనల్ని ఇట్టే వదలిపెట్టలేదు. మనకు సన్మార్గం చూపడానికని ప్రవక్తల్ని పంపించాడు. ఎవరయితే వారు చెప్పినట్టు వింటాడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరెవరయితే ధిక్కరిస్తాడో అతను నరకానికి ఆహుతి అవుతాడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం ఇది : అల్లాహ్‌ తన గ్రంథంలో ఏమని సెలవిచ్చాడంటే-

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

మేము ఫిర్‌ఔను వద్దకు ఒక ప్రవక్తను పంపిన విధంగా ఒక ప్రవక్తను మీపై సాక్షిగా నియమించి మీ వద్దకు పంపాము. (చూడండి) ఫిరౌను ఆ ప్రవక్త మాటను వినకపోవటం వల్ల మేము అతన్ని చాలా తీవ్రంగా పట్టుకున్నాము.” (అల్ ముజ్జమ్మిల్ 73: 15,16)

రెండవదేమిటంటే; ఆరాధన మరియు దాస్యం విషయంలో తనతోపాటు మరెవరికయినా భాగస్వామ్యం కల్పిస్తే, దీనిని అల్లాహ్‌ సుతరామూ సహించడు. ఇది షిర్క్‌ అవుతుంది. షిర్క్‌ చేసేవారు తనకెంత సన్నిహితులయినా, ఆఖరికి దైవదూతలు, దైవప్రవక్తలు ఈ పని చేసినా సరే దేవుడు క్షమించడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారంగా దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనాన్ని చూడండి –

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

మస్జిద్లు అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం. కనుక వాటిలో అల్లాహ్‌తో పాటు మరొకరిని పిలవకండి.” (జిన్‌ 72:18)

మూడవదేమిటంటే; దేవుని ఏకత్వాన్ని అంగీకరించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కి విధేయుడై ఉంటానని ఒప్పుకున్న మీదట దైవం మరియు దైవప్రవక్తల విరోధులతో స్నేహం చేయరాదు. మరి ఆ దైవవిరోధులు తమకు ఆప్తులు, మిత్రులయినాసరే వారితో తెగతెంపులు చేసుకోవలసిందే.

ప్రశ్న : ఆ మేరకు ఏదైనా నిదర్శనం ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిస్తున్నాడు –

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ

అల్లాహ్‌ను, పరలోకాన్ని విశ్వసించేవారు, అల్లాహ్‌ను ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించేవారు వారి తల్లిదండ్రు లైనా, వారి సోదరులైనా సరే లేదా వారి కుటుంబీకులయినా సరే. వారి హృదయాలలో అల్లాహ్‌ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు. తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి వారికి బలాన్ని ఇచ్చాడు.” (ముజాదల 58:22)

ప్రశ్న : ‘హనీఫియత్‌’ – లేదా ‘మిల్లతె  ఇబ్రాహీం’ అంటే ఏమిటి?

జవాబు: మిల్లతె ఇబ్రాహీం అంటే చిత్తశుద్ధితో, ఏకాగ్ర చిత్తంతో ఒక్కడైన అల్లాహ్‌ను ఆరాధించటం. అల్లాహ్‌ అందరికీ దీని గురించే ఆజ్ఞాపించాడు. ఇందు నిమిత్తమే అందరినీ పుట్టించాడు.

ప్రశ్న : అలా అని ఎక్కడుందీ?

జవాబు : దివ్య గ్రంథమైన ఖుర్‌ఆన్‌లో ఉంది :

నేను జిన్నుల్ని, మానవుల్ని నా దాస్యం చేయడానికి మాత్రమే పుట్టించాను”.

ప్రశ్న : ‘యాబుదూని’ (నా దాస్యమే చేయాలి) అనే మాటలోని ఆంతర్యం ఏమిటీ?

జవాబు : దీని ఆంతర్యం ఏమిటంటే ప్రాణులన్నీ ఆయన ఏకత్వాన్ని అంగీకరించి ఆయన ముందరే తలవంచాలి. ఆయన చేయమన్న దానిని చేయాలి. వద్దన్న దానికి దూరంగా ఉండాలి.

ప్రశ్న : అల్లాహ్‌ ఆజ్ఞాపించిన వాటిలోకెల్లా పెద్ద ఆజ్ఞ ఏది?

జవాబు : తౌహీద్‌ ! అదే ఏకదైవారాధన.

ప్రశ్న : ‘తౌహీద్‌’ అంటే ఏమిటీ?

జవాబు : తౌహీద్‌ అంటే కేవలం ఒక్క అల్లాహ్‌నే పూజించాలి. ఆయన దైవత్వంలో, ఆయన గుణగణాలలో, ఆయన అధికారాలలో వేరొకరికి సహవర్తుల్ని కల్పించ కూడదు. ఆయన అద్వితీయుడనీ, దోషరహితుడనీ, రాగద్వేషాలకు అతీతుడనీ, సృష్టితాలలో ఆయనకు ఏమాత్రం పోలికలేదనీ అంగీకరించాలి. ఇదే స్వచ్భమైన తౌహీద్‌.

ప్రశ్న : అల్లాహ్‌ మనల్ని వారించిన వాటిలోకెల్లా పెద్ద వస్తువు ఏది?

జవాబు : షిర్క్‌.

ప్రశ్న : షిర్క్‌ అంటే?

జవాబు : షిర్క్‌ అంటే అల్లాహ్‌తో పాటు వేరొక దైవేతరుణ్ణి మొర పెట్టుకోవటం, దైవారాధనలో ఇంకొకరికి సాటి కల్పించటం.

ప్రశ్న: దీనికి ఉపమానం గానీ, ఆధారం గానీ ఉందా?

జవాబు : ఉంది. ఉదాహరణకు దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది ఆయత్‌ని గమనించండి:

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

1. “మీరంతా అల్లాహ్‌కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయ వద్దు.” (అన్‌ నిసా 4:36)

فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

2. “ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్‌కు సమానులుగా నిలబెట్టకండి.” (అల్‌ బఖర 2:22)

ప్రశ్న : ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

జవాబు :

  • 1. తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
  • 2. తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
  • 3. తన  ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ప్రశ్న : నీ ప్రభువు (పోషకుడు) ఎవరు?

జవాబు : నా ప్రభువు అల్లాహ్‌. ఆయనే నన్నూ మరియు సమస్తలోక వాసులను తన అనుగ్రహంతో పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దైవం. ఆయన తప్ప నాకు మరో ఆరాధ్యుడు లేడు.

ప్రశ్న : దీనికి నిదర్శనం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని తొలి వాక్యమే దీనికి నిదర్శనం –

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

“ప్రశంసలు, పొగడ్త లన్నీసర్వలోకాలపాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్‌కే శోభిస్తాయి.” (సూరా ఫాతిహా 1:1)

అల్లాహ్‌ తప్ప మిగిలినదంతా లోకంగా పరిగణించడుతుంది. నేను కూడా ఈ లోకంలో ఒక వ్యక్తిని.

ప్రశ్న : నీవు నీ ప్రభువును ఎలా తెలుసుకోగలిగావు?

జవాబు : నేను నా ప్రభువును ఆయన నిదర్శనాల ద్వారా తెలుసుకోగలిగాను. ఆయన సృష్టితాల ద్వారా, రేయింబవళ్ల ద్వారా, సూర్యచంద్రుల ద్వారా, భూమ్యా కాశాల ద్వారా, అందలి ప్రాణుల ద్వారా భూమ్యాకాశాలలో సంచరించే జీవుల ద్వారా తెలుసుకోగలిగాను.

ప్రశ్న : దీనికి నిదర్శనం ఏమిటీ?

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

“ఈ రేయింబవళ్లూ, ఈ సూర్య చంద్రులు అల్లాహ్‌ సూచనలలోనివే. సూర్యచంద్రులకు సాష్టాంగ పడకండి. వాటిని సృజించిన అల్లాహ్ కు సాష్టాంగ పడండి – నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే.” (హామీమ్‌ అస్‌ సజ్‌దా  31:37)

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

“వాస్తవంగా మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయన ఆకాశాలనూ, భూమినీ ఆరు దినాలలో సృష్టించాడు. తరువాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. రాత్రిని పగటిపై కప్పి వేస్తాడు. ఆ తరువాత పగలు రాత్రి వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఇంకా ఆయన సూర్యుణ్జి, చంద్రుణ్ణి, నక్షత్రాలను పుట్టించాడు. అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి! సృష్టి ఆయనదే. దానిపై ఆధిపత్యమూ ఆయనదే. అల్లాహ్‌ అనంతమయిన  శుభాలు కలవాడు. సకల లోకాలకు ప్రభువు. (అల్‌ అరాఫ్ 7:54)

ప్రశ్న : ‘రబ్‌’ అని ఎవరిని అంటారు?

జవాబు : యజమాని, స్వామి మరియు శూన్యంలో నుంచి అస్థిత్వాన్ని తీసుకువచ్చే వానిని ‘రబ్’ అని అంటారు.అటువంటి శక్తిమంతుడే యదార్దానికి పూజనీయుడు.

ప్రశ్న : ఈ మేరకు ఏదన్నా నిదర్శనం ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వాక్యాన్ని పరిశీలించండి –

“మానవులారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీనిద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పు గాను, ఆకాశాన్ని కప్పు గానూ సృష్టించినవాడూ, పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసినవాడూ ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.” (అల్‌ బఖర 2:21-22)

అందుచేతఈవస్తువులను ఎవరు సృష్టించాడో అతడే ఆరాధనలు,దాస్యానికి అర్హుడు.

ప్రశ్న : ‘“ఇబాదత్‌’ అని దేనినంటారు?

జవాబు : ఆరాధ్యుని సమక్షంలో అశక్తతతో, అణకువతో, వినమ్రతతో, ప్రేమాతి శయంతో మెలగటాన్ని “ఇబాదత్‌’ అని అంటారు. వేరే మాటల్లో చెప్పాలంటే దాసుడు దేవుని ప్రసన్నతను చూరగొనడానికి, ఆయన్ని సంతృప్తిపరచడానికి చేసే ఇబాదత్‌ లేక ఆరాధన.

ప్రశ్న : అల్లాహ్‌ ఎన్ని రకాల ఆరాధనలు చేయమని ఆజ్ఞాపించాడు?

జవాబు : ఎన్నో రకాల ఆరాధనలు చేయమన్నాడు. వాటిలో ఇస్లాం, ఈమాన్‌, ఇహ్సాన్‌, దుఆ, భయము, దైవాన్ని కలుసుకోవాలన్న కుతూహలం, కఠోర పరిశ్రమ, అభ్యాసం, ఆశ, అణకువ, దైవంపై భారం మోపటం, ఖుర్బానీ, ఉపవాసం, మొక్కుబడి లాంటివే గాకుండా ఇంకా అనేక ఆరాధనలున్నాయి. వాటిని చేయ మని అల్లాహ్‌ ఆదేశించాడు. మరి ఇవన్నీ అల్లాహ్‌కే ప్రత్యేకం అన్న సంగతిని మరువరాదు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనం గమనించండి.

“మస్జిద్లు అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం. కనుక వాటిలో అల్లాహ్‌తో పాటు మరొకరిని వేడుకొనరాదు.” (సూరె జిన్‌-18)

ఇంకా ఇలా అనబడింది :

“నీ ప్రభువు నిర్ణయం చేసేశాడు – మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరా ధించకండి.” (బనీ ఇస్రాయీల్‌ – 23)

ప్రశ్న : ఎవరయినా వీటిలో దేనిననయినా దైవేతరుల కోసం ప్రత్యేకించినట్టయితే ఏమవుతుంది?

జవాబు : ఎవరయినా వీటిలో దేనినయినా దైవేతరుల కొరకు ప్రత్యేకిస్తే వారు ముష్రిక్‌లు (బహు దైవోపాసకులు) అయిపోతారు.

ప్రశ్న : ఏమిటీ దీనికీ ఆధారం?

జవాబు : దీనికి ఆధారంగా అల్లాహ్‌ ఈవిధంగా సెలవిచ్చాడు –

“ఎవడయినా అల్లాహ్‌తోపాటు మరొక ఆరాధ్యుణ్జి కూడా వేడుకుంటే, దానికి అతని వద్ద ఏ ప్రమాణమూ లేదు.అతని లెక్క అతని ప్రభువు వద్దఉన్నది. అటువంటి అవిశ్వాసులు ఎన్నటికీ సాఫల్యం పొంద లేరు.” (అల్‌ మూమినూన్‌ – 117)

ప్రశ్న : దుఆ (వేడుకోలు)కూడా ఆరాధనే (దాస్యమే) నన్నదానికి ఏమిటీ నిదర్శనం?

జవాబు : అల్లాహ్‌ దివ్య ఖుర్‌ఆన్‌లో ఈవిధంగా సెలవిచ్చి ఉన్నాడు –

“మీ ప్రభువు స్పష్టంగా చెప్పేశాడు : మీరు నన్ను పిలవండి. నేను మీ మొరను వింటాను మరియు ఆమోదిస్తాను. ఎవరయితే నా ఆరాధన యెడల తలబిరుసుతనం ప్రదర్శిస్తారో వారు త్వరలోనే పరాభవంపాలై నరకంలో ప్రవేశిస్తారు.” (….) ఇదిలా వుండగా “అద్దుఆవు ముఖ్ఖల్‌ ఇబాద” (ఈ హదీస్‌ జయీఫ్‌ ఉన్నది.) (దుఆ ఆరాధన యొక్క సారం) అని మహనీయ ముహమ్మదు (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రబోధించారు. వేరొక సహీ హదీసులో “అద్దుఆవు హువల్‌ ఇబాద‘ (దుఆయే అసలు ఆరాధన) అని ఉంది

ప్రశ్న : ఖౌఫ్‌ (భయము, భీతి) కూడా ఆరాధనే నన్నదానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనమే దీనికి నిదర్శనం –

“కనుక మీరు నిజమయిన విశ్వాసులే అయితే ఇక ముందు మానవులకు భయ పడకండి. నాకు భయపడండి.” (ఆలి ఇమ్రాన్‌ – 175)

ప్రశ్న : ‘రజా’ (దైవాన్ని కలుసుకునే కుతూహలం) కూడా ఆరాధనే అన్న దానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని క్రింది వచనమే దీనికి నిదర్శనం –

“కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతోపాటు మరెవ్వరినీ చేర్చకూడదు.” (అల్‌ కహఫ్‌ – 110)

ప్రశ్న : ‘తవక్కుల్‌ (దైవంపై గల నమ్మకం, దైవంపై భారం వేయటం) కూడా ఆరాధనేనన్న దానికి రుజువు ఏమిటీ?

జవాబు : దీనికి రుజువు ఇది-

1. “మీరు నిజంగానే విశ్వాసులయితే అల్లాహ్‌పై భారం వెయ్యండి.” (అల్ మాయిద – 23)
2. “ఎవరయితే అల్లాహ్‌ పై భారం వేస్తాడో అతని కొరకు ఆయన చాలు.” (తలాక్‌- 5)

ప్రశ్న : కఠోర పరిశ్రమ, అభ్యాసం, ఆశ, అణకువ వంటివి కూడా ఆరాధనే నన్న దానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం ఇదే –

“వారు సత్కార్యాల కోసం ఎంతగానో ప్రయాస పడతారు. ఆశతోనూ, శ్రద్ధాభక్తుల తోనూ మమ్మల్ని ప్రార్థిస్తారు. మా సమ క్షంలో అణగిమణగి ఉంటారు.”(అంబియా – 90)

ప్రశ్న : “ఖషియత్‌’ (భయము, భక్తి) కూడా ఆరాధనే అనే దానికి ఆధారంఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం దివ్య గ్రంథంలోని ఈ క్రింది వచనం. ఇందులో అల్లాహ్‌ తన దాసులను ఉద్దేశ్యించి ఏమంటున్నాడో చూడండి –

“కనుక మీరు వారికి భయపడకండి. నాకు భయపడండి.” (అల్‌ మాయిద – 3)

ప్రశ్న : ‘ఇనాబత్’ (మరలటం,రుజువు కావటం) కూడా ఆరాధనే అన్న దానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది వచనం దీనికి నిదర్శనం –

“మీ మీదకు శిక్ష రాకముందే, మీకు ఎవరినుండీ సహాయం లభించని పరిస్థితి ఏర్పడక ముందే మీరు మీ ప్రభువు వైపునకు మరలి, ఆయనకు విధేయత చూపండి.” (అజ్‌ జుమర్‌ – 54)

ప్రశ్న : ‘ఇస్తెఆనత్‌’ (సహాయం అర్థించటం) కూడా ఆరాధనే అనడానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ప్రార్థనే దీనికి నిదర్శనం :

“(దేవా!) మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాము.” (అల్‌ ఫాతిహా – 4)

ఇంకా – హదీసులో ఇలా ఉంది :
“నువ్వు ఏదైనా అర్థించటమే జరిగితే అల్లాహ్‌ను అర్ధించు.”

ప్రశ్న : ‘“ఇస్తెఆజ’ (శరణు కోరటం) కూడా ఆరాధనే ననడానికి ఆధారం ఏమిటీ?

జవాబు : ‘ఇస్తెఆజ’ కూడా ఆరాధనే అనడానికి ఆధారం ఇది :

ఇలా అను,”నేను మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్‌) శరణు కోరుతున్నాను.

ప్రశ్న : ‘ఇస్తెగాస’ (ఫిర్యాదు లేక విన్నపం చేసుకోవటం) కూడా ఆరాధనే అనడానికి ఏమిటీ నిదర్శనం?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ క్రింది వచనమే దీనికి నిదర్శనం –

“ఇంకా మీరు మీ ప్రభువును నహాయం కొరకు విన్నవించుకున్న సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు : “నేను మీ సహాయం కొరకు వెయ్యిమంది దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను.” (అన్‌ ఫాల్‌ – 9)

ప్రశ్న : ఒకరి పేరుమీద జిబహ్‌ చేయటం (బలి ఇవ్వటం) కూడా ఆరాధనే అన్న దానికి ఏమిటి ఆధారం?

జవాబు : దేవుని ఈ ఉపదేశమే దీనికి ఆధారం :

“(ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు : నా నమాజ్‌, నా సకల ఉపాసనా రీతులు, నా జీవనం, నా మరణం-సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్‌ కొరకే. ఆయన కు ఏ భాగ స్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వ బడింది. అందరికంటే ముందు విధేయ తతో తలవంచే వాణ్జి నేనే.” (అల్‌ అన్‌ ఆమ్‌ – 162)

ప్రశ్న : మొక్కుకోవటం కూడా ఆరాధనేనన్నదానికి ఆధారమేమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ఉపదేశమే దీనికి ఆధారం-

“వారు ఎలాంటి వారంటే (ప్రపంచంలో) మొక్కుబడి చెల్లించేవారు,నలువైవుల నుంచీ ఆపదలు కమ్ముకుని వచ్చే దినానికి భయపడేవారు.” (అల్ ఇన్సాన్  – 7)

ప్రశ్న : రెండవ ప్రధానాంశం ఏమిటీ?

జవాబు : ఇస్లాం ధర్మాన్ని ఆధారాలతో సహా తెలుసుకోవటం.

ప్రశ్న : ఇస్లాం అంటే ఏమిటీ?

జవాబు : ఇస్లాం అంటే స్వచ్భమైన ఏక దైవారాధనతోపాటు, బేషరతుగా అల్లాహ్‌కు లొంగిపోవటం, పూర్తిగా సమర్చించుకోవటం,దైవాజ్ఞాపాలన చేయటం, ఆయనకు విధేయత చూపటం, బహు దైవారాధనతో, బహు దైవారాధకులతో తెగతెంపులు చేసుకోవటం.

ప్రశ్న : ఇస్లాం ధర్మంలో గల అంతస్థులు ఎన్ని? అవి ఏవి?

జవాబు : ఈ అంతస్థులు మూడు. 1. ఇస్లాం 2. ఈమాన్‌ 3. ఇహ్సాన్. ప్రతి అంతస్థు లేక స్థాయిలో కొన్ని ప్రధానాంశాలు ఉన్నాయి.

ప్రశ్న : ఇస్లాంలోని ప్రధానాంశాలు – మౌలికాంశాలు – ఎన్ని?

జవాబు : ఐదు.

  • 1. అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడనీ, ముహమ్మద్‌ – (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవప్రవక్తయనీ సాక్ష్యమివ్వడం.
  • 2. నమాజ్‌ను నెలకొల్పటం.
  • 3. జకాత్‌ అనే విధిగా చెల్లించవలసిన దానాన్ని చెల్లించటం.
  • 4. రమజాన్‌ నెలలో విధిగా ఉపవాసాలుండటం.
  • 5. (స్థోమత ఉంటే) హజ్‌ చేయటం.

ప్రశ్న : అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేడన్న  సాక్ష్యానికి నిదర్శనం ఏమిటీ?

జవాబు : దివ్య గ్రంథమైన ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు :

“తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహ్‌యే సాక్ష్యమిచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తిమంతుడూ, ఆ మహాజ్ఞానీ తప్ప వాస్తవానికి మరొక  దైవం లేడు అని నిజాయితీగానూ, న్యాయంగానూ సాక్ష్యమిస్తారు.” (ఆలి ఇమాన్‌ – 18)

ప్రశ్న : “లా ఇలాహ ఇల్లల్లాహ్‌” అంటే భావం ఏమిటీ?

జవాబు : అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్యుడు, పూజ్యుడు లేడనీ, ఆయనే నిజ దైవమనీ భావం.

ప్రశ్న : “లా ఇలాహ్‌” అంటే….?

జవాబు : అల్లాహ్‌ తప్ప ఇతర దైవాలను వదలి వేయటం, త్రోసి పుచ్చటం అని భావం.

ప్రశ్న : “ఇల్లల్లాహ్‌” అంటే భావం ఏమిటీ?

జవాబు : ఆరాధన, దాస్యం, పూజలకు అల్లాహ్‌యే తగినవాడనీ, దాస్యంలో ఆయనకు సహవర్తులు ఎవరూ లేరని ఆచరణ ద్వారా రుజువు చేయటం.

ప్రశ్న : ఈ విషయాన్ని విడమరచి చెప్పేదేమైనా ఉందా?

జవాబు : అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు-

“ఇబ్రాహీమ్‌ తన తండ్రికీ, తన జాతివారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, “మీరు పూజిస్తున్నవాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే ఉన్నది. ఆయనే నాకు మార్గం చూపుతాడు.” ఇబ్రాహీమ్‌ ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచివెళ్లాడు, వారు దాని వైపునకు మరలేందుకు.” (అజ్‌ జుఖ్రుఫ్‌ : 26-28)

మరోచోట ఇలా సెలవిచ్చాడు

“ప్రవక్తా! ఇలా చెప్పు : “గ్రంథం కల ప్రజలారా! మాకూ మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. (అది ఏమి టంటే) మనం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు. మనలోని వారెవరూ అల్లాహ్‌ను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది.”ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను:”మేము ముస్లింలము (కేవలం అల్లాహ్‌కే దాన్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.” (ఆలి ఇమ్రాన్‌ – 64)

ప్రశ్న: ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవప్రవక్త అన్నసాక్ష్యానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ దైవోపదేశమే ఇందుకు ఆధారం-

“చూడండి! మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు తీవ్రంగా నష్టానికి గురికావటం అనేది ఆయనకు కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్నిఆయన తీవ్రంగా కాంక్షిస్తాడు. విశ్వాసులపై ఆయన వాత్సల్యం కలవాడు, కారుణ్యం కలవాడు.” (అత్‌ తౌబా – 128)

అల్లాహ్‌ ఇంకా ఈ విధంగా స్పష్టం చేశాడు –

“ముహమ్మద్‌ అల్లాహ్‌ ప్రవక్త. ఆయనవెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులు గానూ ఉంటారు,పరస్పరం కరుణామయులు గానూ ఉంటారు.”(అల్‌ ఫతహ్‌ – 29)

ప్రశ్న: ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త (రసూలుల్లాహ్‌) అని సాక్ష్యమివ్వ డంలోని మతలబు ఏమిటీ?

జవాబు : దీని మతలబు ఏమిటంటే; ఆయన ఆదేశాలను పాలించాలి, ఆయన ఏ విషయం చెప్పినా దాన్ని సత్యమని ధృవీకరించాలి. ఆయన వారించిన వాటికి దూరంగా ఉండాలి. ఆయన చూపిన షరీయత్‌ కనుగుణంగా దైవారాధన చేయాలి.

ప్రశ్న: నమాజ్‌, రోజా గురించి ఏం ఆధారముంది? తౌహీద్‌కు గల తాత్పర్యం ఏమిటీ?

జవాబు : అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు :

“వారు అల్లాహ్‌కు దాస్యం చెయ్యాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్నిఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను స్థాపించాలనీ, జకాత్‌ ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి (గ్రంథ వహులకు) ఆదేశించటం జరిగింది. ఇదే సరియైన, సవ్యమైన ధర్మం (అని వారికి స్పష్టం చేయబడింది). (అల్‌ బయ్యిన – 5)

ప్రశ్న : “రోజా” (ఉపవాసం)కు ఆధారమేమన్నా ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనం చదవండి :

“విశ్వసించిన ఓ ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది -ఏ విధం గా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” (అల్‌ బఖర : 183)

ప్రశ్న : హజ్‌ చేయాలి అన్న దానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లో హజ్‌ గురించి ఇలా సెలవీయబడింది : “ప్రజలపై అల్లాహ్‌కు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తి గలవారు దాని హజ్‌ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు, అల్లాహ్‌కు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసు కోవాలి.” (ఆలి ఇమ్రాన్‌ – 97)

ప్రశ్న : ఇస్లాం ధర్మం యొక్క  రెండవ అంతస్థు ఏది?

జవాబు : ఈమాన్‌ (విశ్వాసం).

ప్రశ్న: ఈమాన్‌ శాఖలు (విభాగాలు) ఎన్ని?

జవాబు : ఈమాన్‌ శాఖలు డెబ్బయికి పైగా ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ఉన్నతమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్‌. అన్నిటికన్నా తక్కువ స్థాయిగల శాఖ “దారిలో పడి ఉన్న బాధాకరమైన వస్తువులను తొలగించటం.” లజ్జ మరియు వ్రీడ కూడా ఈమాన్‌లో అంతర్భాగమే.

ప్రశ్న : ఈమాన్‌లోని ప్రధానాంశాలు ఎన్ని? అవి ఏవి?

జవాబు : ఈమాన్‌లోని ప్రధానాంశాలు ఆరు. అవి

  • 1. అల్లాహ్‌పై విశ్వాసం
  • 2. దైవదూతలపై విశ్వాసం
  • 3. దైవం తరఫున అవతరింపజేయబడిన గ్రంథాలపై విశ్వాసం
  • 4. దైవప్రవక్తలపై విశ్వాసం
  • 5. అంతిమ దినంపై విశ్వాసం
  • 6. మంచి జరిగినా, చెడు జరిగినా-అంతా దైవం తరఫుననే జరుగుతుంది అనే దాని (విధి వ్రాత)పై విశ్వాసం.

ప్రశ్న : ఏమిటీ దీనికి ఆధారం?

జవాబు : ఆధారం కావాలంటే దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనాన్ని చదవండి. “సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో, పడమరకో త్రిప్పటం కాదు, సత్కార్యం అంటే మనిషి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దూతలనూ, అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథాన్నీఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం.” (అల్‌ బఖర : 127)

ప్రశ్న : ‘విధి’ (తక్‌దీర్‌) అనే దానికి ఆధారం ఏమిటీ?

జవాబు : దీనికి ఆధారం దివ్య గ్రంథంలోని ఈ వచనం –

“మేము ప్రతి వస్తువునూ ఒక విధి నిర్ణయం తోపాటు సృష్టించాము.” (అల్‌ ఖమర్‌ – 49)

ప్రశ్న : ఇస్లాం ధర్మం యొక్క మూడవ అంతస్థు ఏది?

జవాబు : ఇస్లాం మూడవ అంతస్థు ‘ఇహ్సాన్.”

ప్రశ్న : “ఇహ్సాన్’ అంటే అసలేమిటీ?

జవాబు : మీరు అల్లాహ్‌ను చూస్తున్నామన్న భావనతో ఆరాధన చేయండి. లేకుంటే, ఆయన మిమ్మల్నిచూస్తున్నాడన్న తలంపుతోనయినా ఆరాధన చేయండి. అంటే ఏ ఆరాధననైనా ఉత్తమ రీతిలో నిర్వర్తించటమే అసలు ఇహ్సాన్ అన్నమాట.

ప్రశ్న: దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని క్రింది ఆయతే దీనికి ఆధారం.

“భయభక్తులతో పనిచేస్తూ, ఉదాత్త వైఖరి కలిగి ఉండే వారితో అల్లాహ్‌ ఉంటాడు.” (అన్‌ నహ్ల్ -128)

మరో చోట అల్లాహ్‌ ఈ విధంగా ప్రబోధించాడు –

“మహా శక్తిమంతుడైన ఆ అనంతకరుణామయుడిపై భారం మోపు. ఆయన నిన్ను, (నీవు) లేచినవుడు చూస్తాడు, సజ్‌దా చేసేవారిలో నీ రాకపోకలను గమనిస్తాడు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసిన వాడు.”(అష్‌ షుఅరా: 217-220)

వేరొక చోట ఇలా సెలవీయబడింది-

“ప్రవక్తా! నీవు ఏ స్థితిలో ఉన్నాఖురాను నుండి దేనిని వినిపించినా, మానవులారా! మీరుఏది చేసినా ఆ అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్నిచూస్తూనే ఉంటాము” (యూనుస్‌-61)

ప్రశ్న: ఇస్లాం ధర్మానికి చెందిన ఈ మూడు మెట్లకు (ఇస్లాం, ఈమాన్‌ ఇహ్సాన్‌)కి సంబంధించి హదీసు లేక సున్నతులో కూడా ఏమైనా ఆధారముందా?

జవాబు : ఉంది. హదీసె జిబ్రయీల్‌గా ఖ్యాతి చెందిన ఆ హదీసును హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి అల్లాహు అన్హు) ఈ విధంగా తెలిపారు-

“మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమక్షంలో కూర్చుని ఉన్నాము. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని దుస్తులు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి. జుట్టు నల్లగా ఉంది. మరి అతనిలో ప్రయాణ బడలిక కూడా కనిపించలేదు. మాలో ఎవరూ అతన్ని ఎరుగరు. ఆ వ్యక్తి దైవవ్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ఎదుటకూర్చున్నాడు.తన మోకాళ్లను ఆయన మోకాళ్లకు ఆనించి మరీ కూర్చున్నాడు. తన అరచేతులను ఆయన తొడలపై ఉంచి, ‘ఓ ముహమ్మద్‌! నాకు ఇస్లాం గురించి తెలియజేయండి’ అని అన్నాడు. “నీవు అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని సాక్ష్యమివ్వాలి.ముహమ్మద్‌ అల్లాహ్‌ సందేశహరుడని కూడా నీవు సాక్ష్యమివ్వాలి.నమాజ్‌ను స్థాపించాలి. జకాత్‌ ఇవ్వాలి.రమజాన్‌ నెలలో ఉపవాసాలుండాలి. స్థోమత ఉంటే దైవ గృహాన్ని సందర్శించి హజ్‌ చేయాలి’ అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించారు.’తమరు చెప్పింది నిజం’ అన్నాడా వ్యక్తి.మాకు ఆశ్చర్యం కలిగించింది అతని ప్రవర్తన. ప్రశ్నించేవాడూ అతనే, సమాధానాన్ని సత్యమని ధృవీకరించేవాడూ అతనే. “నాకు ఈమాన్‌ గురించి వివరించండి’ అని తిరిగి ప్రశ్నించాడా పృచ్చకుడు. దానికాయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “నీవు అల్లాహ్‌ను,ఆయన దూతలను, ఆయన (గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని, మంచి జరిగినా చెడు జరిగినా అంతా దైవం తరఫుననే జరుగుతుందన్న విధివ్రాతను విశ్వసించు.ఇదే ఈమాన్‌’ అని వివరించారు. “నాకు ఇహ్సాన్‌ గురించి చెప్పండి’ అని మళ్లీ ప్రశ్నించాడా అపరిచితుడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా విడమరచి చెప్పారు: “నీవు అల్లాహ్‌ను చూస్తున్నానన్న (అల్లాహ్‌ ఎదుట ఉన్నాడన్న) భావంతో ఆయన్ని ఆరాధించు.ఒకవేళ నీవు ఆయన్ని చూడ లేకపోయినా, ఆయన నిన్ను చూస్తున్నాడన్న తలంపు నీలో ఉండాలి.” “నాకు ప్రళయదినం గురించి చెప్పండి” అని అడిగాడు ఆ అపరిచిత వ్యక్తి. ‘దాని గురించి ప్రశ్నించబడే వానికి ప్రశ్నించేవానికన్నా ఎక్కువేమీ తెలీదు” అన్నారాయన (సల్లలాహు అలైహి వ సల్లం) . “పోనీ నాకు దాని సూచనలయినా తెలుపగలరా?!’ అని ఇంకో ప్రశ్న వేశాడు అతను. దానికాయన ఇలా చెప్పారు: “దాసీ (బానిసరాలు, పని మనిషి తన యజమానురాలికి జన్మనిస్తుంది. కాళ్లకు చెప్పులు, శరీరంపై చొక్కా లేకుండానే గొర్రెల్ని కాచే గొర్రెల కాపరులు బ్రహ్మాండమైన కట్టడాలు కట్టడం నీవు చూస్తావు. మరి ఆ వ్యక్తి అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. మేము కాస్సేపు మౌనం వహించాము. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఓ ఉమర్‌! ప్రశ్నలు వేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?!’అని అడిగారు. ‘దైవానికి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే తెలిసి ఉండాలి అని మేము విన్నవించుకున్నాము. “ఆయన జిబ్రయీల్‌. మీకుమీ ధర్మాన్ని బోధించే నిమిత్తం ఆయన మీ వద్దకు విచ్చేశారు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (సహీహ్‌ ముస్లిం)

ప్రశ్న : మూడవ ముఖ్యాంశం ఏమిటి?

జవాబు : మహనీయ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి గురించి. ఆయన ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్  బిన్‌ అబ్దుల్ ముత్తలిబ్‌ బిన్‌ హాషిమ్‌ ఖురైష్‌ తెగకు చెందిన వారు. ఖురైషులు అరబ్బులు. మరి ఈ అరబ్బులు దైవప్రవక్తలయిన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌, హజ్రత్‌ ఇస్మాయీల్‌ (అలైహిస్సలాం)ల సంతతికి చెందిన వారు.

ప్రశ్న : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వయస్సు గురించి చెబుతారా?

జవాబు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) 63 సంవత్సరాలు జీవించి ఉన్నారు.40 ఏళ్ల వయస్సులో దైవప్రవక్తగా నియుక్తులయ్యారు. దైవప్రవక్తగా 23 సంవత్సరాలు మానవ జాతికి మార్గదర్శకత్వం వహించారు. సూరె ‘ఇఖ్రా’తో దైవదౌత్య శుభవార్త అందింది. సూరె ‘ముద్దస్సిర్’ అందిన క్షణం నుంచి సందేశకార్యానికి నడుం బిగించారు.ఆయన మక్కాలో జన్మించారు. మక్కా నుండి మదీనాకు ప్రస్థానం (హిజ్రత్) చేశారు. మదీనాలోనే ప్రభువు వద్దకు మహా ప్రస్థానం చేశారు.

ప్రశ్న : అల్లాహ్‌ ఆయన్ని దేని కొరకు పంపాడు?

జవాబు : మానవ జాతిని షిర్క్‌ (బహు దైవారాధన) నుండి రక్షించడానికి, ఏకేశ్వరోపాసనని బోధించడానికి అల్లాహ్‌ ఆయన్ని పంపాడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లోని క్రింది వచనాలు దీనికి స్పష్టమైన ఆధారాలు. “వస్త్రం కప్పుకుని పడుకున్న మనిషీ! లే; లేచి హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, అశుద్ధతకు దూరంగా ఉండు. ఎక్కువగా పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు.నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.” (అల్‌ ముద్దస్సిర్‌ : 1- 7)

ప్రశ్న : “లే,లేచిహెచ్చరించు” అన్న మాటల్లోని అంతరార్థం ఏమిటి?

జవాబు : దీని అంతరార్థం ప్రజలకు షిర్క్‌ గురించి హెచ్చరించమనీ,తౌహీద్‌ను ఉపదేశించమనీను.

ప్రశ్న: “నీ ప్రభువు ఘనతను చాటిచెప్పు.నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో” అనడంలోని భావం ఏమిటి?

జవాబు : తౌహీద్‌ (ఏకేశ్వరోపాసన) ని స్వీకరించటం ద్వారా ప్రభువు గొప్పతనాన్ని అంగీకరించమనీ, ఆచరణలను షిర్క్‌ అనే మలినం నుండి కాపాడుకోమనీ భావం.

ప్రశ్న :“అశుద్ధతకు దూరంగా ఉండు” అనడంలోని ఔచిత్యం ఏమిటి?

జవాబు : విగ్రహాలను, విగ్రవారాధకులను విడిచిపెట్టేయమనీ, వాటితో తెగత్రెంపులు చేసుకోమనీ భావం.

ప్రశ్న : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా మలినమైన వాతావరణానికి దూరంగా ఎంత కాలం ఉన్నారు?

జవాబు : పదినంవత్సరాలు. ఆతరువాత మేరాజ్‌ యాత్ర ప్రాప్తించింది. ఆ సందర్భంగా ఐదు నమాజులు వొసగబడ్డాయి. నమాజు ద్వారా దైవ సహాయాన్ని అర్థించాలన్నది దీని అభిమతం.ఆ తరువాత ఆయన మదీనాకు వలసపోయారు (హిజ్రత్‌ చేశారు).

ప్రశ్న : హిజ్రత్‌ అంటే ఏమిటి?

జవాబు : హిజ్రత్‌ అంటే ప్రస్థానం చేయటం, ఒక చోటి నుండి మరో చోటికి వలసపోవటం! షిర్క్‌ వాతావరణం నుండి ఏకేశ్వరోపాసనా వాతావరణం వైపునకు, చెడులకు నిలయమైన చోటు నుండి స్వచ్చమయిన భావాల పరివ్యాప్తికి అనువైన చోటుకు, చెడు వ్యవస్థ నుండి సత్య ప్రధానమైన వ్యవస్థ వైపునకు తరలి వెళ్లటమే హిజ్రత్‌!

ప్రశ్న : హిజ్రత్‌ ఆజ్ఞ ఎప్పటికీ ఉంటుందా?

జవాబు : ఉంటుంది. షిర్క్‌, బిద్‌అత్‌ల కాలుష్యం నుండి తౌహీద్‌ మరియు సున్నత్‌ల పరిశుద్ధత వైపునకు, చెడు భావాల నుండి సవ్యమైన భావాల వైపునకు, చెడు సహచర్యం నుండి సద్వర్తనుల సహచర్యం వైపునకు తరలిపోవాలన్న ఆజ్ఞ అంతిమ దినం వరకూ ఉంటుంది సుమా!

ప్రశ్న : ఈ వాదనకు ఏదైనా ఆధారం ఉందా?

జవాబు : ఉంది దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయండి-

తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసి, దైవదూతలు వారిని,’ఇదేమిటీ మీ స్థితి ఇలా ఉంది?’అని అడిగారు.అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు; “మేము భూమిపై బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము.”అల్లాహ్‌ భూమి విశాలముగా లేదా మీరు వలస పోవటానికి?’అని దైవదూతలు అడిగారు. వారి నివాసం నరకం. అది మహాచెడ్డ నివాసం.అయితే నిజంగానే నిస్సహాయులై బయలుదేరటానికి ఏ మార్గమూ, ఏసాధన సంపత్తీ లేని పురుషులనూ, స్రీలనూ పిల్లలనూ అల్లాహ్‌ క్షమించవచ్చు.(ఎందుకంటే) అల్లాహ్‌ ఎక్కువగా క్షమించేవాడూ అధికంగా మన్నించేవాడూను.” (అన్‌ నిసా- 97, 98)

ఇంకా ఇలా అనబడింది:

విశ్వసించిన నా దాసులారా! నా భూమి విశాలమైనది, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.” (అన్‌కబూత్‌ – 56)

ప్రశ్న : పై రెండు వచనాల అవతరణ యొక్క పూర్వ రంగం ఏమిటి?

జవాబు : మొదటి ఆయతు అవతరణా సందర్భం : మక్కాకు చెందిన కొంత మంది ఇస్లాం స్వీకరించారు. కాని వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తో పాటు హిజ్రత్‌ చేయలేక మక్కాలోనే ఉండి పోయారు. అటువంటి వారిలో కొంత మంది తమ విశ్వాసంపై నిలకడ కలిగి ఉండలేక, కాలం వేసే కళ్ళెంలో ఇరుక్కుని, పరిస్థితుల ఇంద్రజాలానికి మోసపోయారు. ఆఖరికి వారు బద్ర్‌ సంగ్రామంలో ముష్రిక్కుల పక్షాన నిలిచారు.అందుచేత అల్లాహ్‌ వారి వినతిని తోసిపుచ్చాడు. వారు ఒడిగట్టిన స్వామి ద్రోహానికి ప్రతిఫలంగా వారి కొరకు నరకాన్ని వొసగాడు. రెండవ వచనానికి పూర్వ రంగం ఏమంటే; మక్కాలో కొంతమంది ముస్లిములు హిజ్రత్ చేయలేక ఉండిపోయారు.అప్పుడు అల్లాహ్‌ వారి విశ్వాసాన్ని (ఈమాన్‌) వారికిజ్ఞాపకం చేసి హిజ్రత్‌ (ప్రస్థానం) వైపునకు పురికొల్పాడు.

ప్రశ్న : ‘హిజ్రత్‌’ ఒక శాశ్విత ప్రాతిపదిక గల ఆజ్ఞ అనడానికి హదీసులో ఆధారం ఏదన్నా ఉందా?

జవాబు : ఉంది. మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

“పశ్చాత్తాపం (ద్వారం)మూసుకునే దాకా హిజ్రత్‌ (ద్వారం) మూసుకొనదు.సూర్యుడు తను అస్తమించే చోటున ఉదయించే దాకా పశ్చాత్తాపం (ద్వారం కూడా) మూసుకొనదు సుమా!”

ప్రశ్నః మదీనా మునవ్వరాలో స్థిరపడిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇచ్చిన ఆదేశాలు ఏవి?

జవాబు : మదీనాలో స్థిరపడగానే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్లాం యొక్క మిగిలిన ఆదేశాలను-అంటే; జకాత్‌, రోజా, హజ్‌, అజాన్‌ మరియు జిహాద్‌ తదితర ఆదేశాల ను జారీ చేశారు.

ప్రశ్న: ఈ విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతకాలం మదీనాలో ప్రజల జీవితాలను తీర్చిదిద్దారు?

జవాబు : 10 సంవత్సరాలు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరమపదించారు. కాని ఆయన నెలకొల్పిన ధర్మం మాత్రం యథాతథంగా ఉంది. ఆయన మనకు అందజేయని శుభం లేదు. అన్ని రకాల హానికరమయిన వాటి నుండి ఆయన తన అనుచర సమాజాన్ని జాగరూకపరచి వాటికి దూరంగా ఉండాలని హెచ్చ రించారు.

ప్రశ్న : ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేసిన శుభం ఏది?ఆయన ఏ కీడు గురించి హెచ్చరించారు?

జవాబు : ఆయన మనకు తౌహీద్‌ (దేవుని ఏకత్వం) గురించి నొక్కి చెప్పారు. దైవానికి సమ్మతమయిన, ఇష్టకరమయిన వన్తువులేవో స్పష్టం చేశారు. ఇదంతా మన పాలిట మేలుగా, శుభంగా పేర్కొనబడుతుంది.

ఇకపోతే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) , షిర్క్‌ (బహు దైవారాధన) గురించి గట్టిగా హెచ్చరించారు. దైవానికి సమ్మతం కాని, హానికరమయిన వస్తువులు ఏవేవో సూచించి వాటి యెడల మనందరినీ అప్రమత్తం చేశారు.

ప్రశ్న: అల్లాహ్‌ ఆయన్ని ఏదైనా ప్రత్యేక వర్గానికో, తెగకో ప్రవక్తగా చేసి పంపాడా?

జవాబు : అల్లాహ్‌ ఆయన్ని సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపాడు. జిన్నులు మానవులంతా ఆయనకు విధేయత చూపటం తప్పనిసరి గావించాడు.

ప్రశ్న: దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ దీనికి ఆధారం-

(ఓ ముహమ్మద్‌!) ఇలా ప్రకటించు: నేను మీఅందరి వైపునకు వచ్చిన అల్లాహ్‌ సందేశహరుణ్ణి.” (అల్‌ బఖర : 158)

ఇంకా ఇలా అనబడింది –

“ఆ సంఘటన కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము జిన్నాతుల ఒక వర్గాన్ని ఖుర్‌ఆన్‌ వినేందుకు నీ వద్దకు తీసుకు వచ్చాము.” (అల్‌ అహ్‌ఖాఫ్‌ – 29)

ప్రశ్న : అల్లాహ్‌ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా ధర్మాన్ని పరిపూర్ణం గావించాడా? లేక ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) తదనంతరం ధర్మాన్ని పూర్తి చేశాడా?

జవాబు : అల్లాహ్‌ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా-ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) బ్రతికి ఉండగానే-ధర్మాన్ని పరిపూర్ణం గావించాడు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) తదనంతరం ధర్మంలో ఎలాంటి వస్తువునూ చేర్చవలసిన అవసరం లేదు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏదన్నా ఉందా?

జవాబు : ఉంది. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ను చూడండి:

“ఈ రోజు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం గావించాను.ఇక దీనితో నా వరాలను కూడా పూర్తి చేశాను.ఇంకా ఇస్లాంను మీ జీవనధర్మంగా సమ్మతించాను.” (అల్‌ మాయిద – 3)

ప్రశ్న: ఆయన మరణించారనడానికి ఆధారం ఏమిటి?

జవాబు : ఆయన మరణం సత్యమనడానికి దివ్యఖుర్‌ఆన్‌లోని ఈవచనమే నిదర్శనం.

“(ఓ ప్రవక్తా!) నీవూ మరణిస్తావు. వారూ మరణిస్తారు.చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ మీ వ్యాజ్యాలను వినిపిస్తారు.”(అజ్‌ జుమర్‌ – 30)

ప్రశ్న : మరణించిన పిదప ప్రజలు మళ్లీ  బ్రతికించబడతారా?

జవాబు : అవును. బ్రతికించబడతారు. దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ని చూడండి. “ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టిం చాము, దాని లోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము. దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము.” (తాహా-55)

ఇంకా ఈ విధంగా సెలవీయబడింది.

“అల్లాహ్‌ మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా మొలిపించాడు. తరువాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోకే తిరిగి తీసుకుపోతాడు. మళ్లీ దానినుండే ఎకాఎకీ మిమ్మల్ని బయటకు తీసి నిలబెడతాడు.” (నూహ్‌ – 17)

ప్రశ్న : తిరిగి బ్రతికించబడిన తరువాత ప్రజల లెక్క తీసుకోబడుతుందా? వారికి శిక్షాబహుమానాలు లభిస్తాయా?

జవాబు : అవును.ప్రజల లెక్క తేల్చబడుతుంది.వారి కర్మలను బట్టి శిక్ష విధించటమో, బహుమానం ఒసగటమో జరుగుతుంది.దీనికి ఆధారం ఇది: “చెడు చేసే వారికి, అల్లాహ్‌ వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, సదాచరణ వైఖరి అవలంబించిన వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించేందుకు (అల్లాహ్‌ ఉన్నాడు)”. (అన్‌ నజ్మ్‌ -31)

ప్రశ్న : మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చిన వ్యక్తి గురించి ఏమనబడింది?

జవాబు : మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చిన వాడు అవిశ్వాసి (కాఫిర్‌) అని అనబడింది. దీనికి ఆధారం దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వచనం –

త్రాము మరణించిన తరువాత మళ్లీ లేపబడటం అనేది ఎంత మాత్రం జరుగదు అని అవిశ్వాసులు పెద్ద సవాలు విసిరారు. వారితో ఇలా అను: ‘కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత, మీరు (ప్రపంచంలో) ఏమేమి చేశారో అదంతా మీకు తప్పకుండా తెలియ జేయటం జరుగుతుంది. ఇలా చేయటం అల్లాహ్‌కు చాలా సులభం.” (అత్‌ తగాబున్‌ -7)

ప్రశ్న: అల్లాహ్‌ తన ప్రవక్తలకు ఏమని ఉపదేశించి పంపాడు?

జవాబు : దేవునిఏకత్వాన్ని (తౌహీద్‌ను) అవలంబించేవారికి స్వర్గలోకపు శుభవార్తనివ్వమనీ, బహు దైవోపాసన (షిర్క్‌)కు ఒడిగట్టే వారిని నరక యాతన గురించి హెచ్చరించమనీ అల్లాహ్‌ తన ప్రవక్తలకు ఉపదేశించి పంపాడు.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు –

“ఈ ప్రవక్తలందరూ శుభవార్తను తెలిపే వారుగా, హెచ్చరిక చేసేవారుగా పంప బడ్డారు-వారి ఆవిర్భావం తరువాత అల్లాహ్‌కు ప్రతికూలంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ సాకూ మిగల కూడదని.” (అన్‌ నిసా – 163)

ప్రశ్న : ప్రప్రథమ ప్రవక్త ఎవరు?

జవాబు : హజ్రత్‌ నూహ్‌ అలైహిస్సలాం.

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు :

“(ప్రవక్తా!) నూహ్‌ వైవునకు, ఆయన తరువాతి ప్రవక్తల వైపునకు పంపినట్లుగా మేము నీ వైపునకు వహీ (దైవవాణి) ని పంపాము.” (అన్‌ నిసా -163)

ప్రశ్న : దైవప్రవక్త  పంపబడని జాతి ఏదైనా ఉందా?

జవాబు : లేదు. అన్ని జాతుల వద్దకు దేవుని తరఫున ప్రవక్తలు పంపబడ్డారు. దీనికి ఆధారంగా దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయత్‌ను గమనించండి:

“మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: “అల్లాహ్‌ను ఆరాధించండి. మిథ్యా దైవాల (తాగూత్‌) ఆరాధ నకు దూరంగా ఉండండి.” (అన్‌ నహ్ల్ – 36)

ప్రశ్న : ‘తాగూత్’ అంటే అసలేమిటి?

జవాబు : ఆరాధన విషయంలో దాసుడు హద్దు మీరి పోవటమే ‘తాగూత్‌. తాగూత్‌ అనేది ఆరాధించే వానికీ, ఆరాధించబడే వానికీ వర్తిస్తుంది.తాగూత్‌ ఒక మిథ్య. ఒక పైశాచిక మార్గం.

ప్రశ్న : తాగూత్ లు ఎన్ని రకాలు?

జవాబు : అనేక రకాలు.అయికతే వాటిలో ఐదు రకాలు ముఖ్యమైనవి.

  • 1) దైవ ధూత్కారి అయిన ఇబ్లీస్‌
  • 2) అల్లాహ్‌ మినహా-ప్రజల చేత కొలవబడే వ్యక్తి
  • 3) తనను పూజించమని ప్రజలను కోరే వ్యక్తి.
  • 4) తనకు అగోచర జ్ఞానం ఉందని ప్రగల్భాలు పలికే వాడు.
  • 5) దైవం తరపున అవతరింపజేయబడిన షరీఅత్‌కు విరుద్ధంగా తీర్పులు చేసేవాడు (ఇటువంటి మిథ్యా దేముళ్ళను తిరస్కరించాలనీ, వారికి దూరంగా ఉండాలనీ, దైవ విధేయులుగా జీవించాలనీ అల్లాహ్‌ మనకు ఆజ్ఞాపించాడు).

ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?

జవాబు : దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ వచనమే దీనికి ఆధారం-

“ధర్మం విషయంలో నిర్బంధం గానీ, బలాత్కారం గానీ లేదు. సత్యవాక్కు అసత్య వాక్కుల నుండి ప్రస్ఫుటం చెయ్యబడింది.ఇక నుండి’తాగూత్‌’ను తిరస్కరించి, అల్లాహ్‌ను విశ్వసించిన వాడు సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. (అతడు ఆశ్రయించిన) అల్లాహ్‌ సర్వమూ వింటాడు, సమస్తమూ తెలిసినవాడు.” (అల్‌ బఖరా – 256)

వేరొక చోట ఇలా సెలవిచ్చాడు :

మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరికచేశాము : “అల్లాహ్‌ను ఆరాధించండి. తాగూత్‌ (మిథ్యాదైవాల) ఆరాధన కు దూరంగా ఉండండి.” (అన్‌ నహ్ల్‌ -36)

ఇంకొక చోట ఇలా చెప్పబడింది.

ఓ ప్రవక్తా! ఇలా చెప్పు : “గ్రంథ ప్రజలారా! మాకూ-మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి (అదేమిటంటే) మనం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు.మనలోని వారెవరూ అల్లాహ్‌ను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది”.ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను: “మేము ముస్లిములలో (కేవలం అల్లాహ్‌కే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.” (ఆలి ఇమ్రాన్‌ – 64)

ఇదీ అసలు”లా ఇలాహ ఇల్లల్లాహ్‌” విసృత భావం హదీసులో ఇలా వుంది : “అసలు విషయం ఇస్లాం. దాని స్తంభం నమాజ్‌.దాని ఉన్నత సోపానం దైవ మార్గంలో పోరాటం.”