జుమా నమాజ్ కి తొందరగా వెళ్ళటం వల్ల వచ్చే గొప్పపుణ్యం

493. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తి స్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళే వాడికి ఒక పోట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళే వాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడిగ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 4 వ అధ్యాయం -ఫజ్లిల్ జూముఆ]

జుమా ప్రకరణం – 2 వ అధ్యాయం – శుక్రవారం రోజు సువాసనలు పూసుకోవడం, మిస్వాక్ చేయటం మంచిది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

కలత చెందినపుడు పఠించే దుఆ

1741. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-  భయాందోళనలు కలిగినప్పుడు, కలత చెందినపుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ దుఆ (వేడుకోలు) పఠించేవారు

“లా ఇలాహ ఇల్లల్లాహుల్ అజీముల్ హలీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుల్ అర్షిల్ అజీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బు స్సమావాతి వరబ్బుల్ అర్జి వ రబ్బుల్ అర్షిల్ కరీం”

[మహోన్నతుడు, మృదు మనస్కుడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అత్యున్నత సింహాసనాధిపతి (విశ్వసామ్రాజ్యాధినేత) అయిన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. భూమ్యాకాశాల ప్రభువు, ప్రతిష్ఠాత్మక సింహాసనాధిపతి అయిన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు].

[సహీహ్ బుఖారీ : 80 వ ప్రకరణం – అధ్దావాత్, 27 వ అధ్యాయం -అద్దుఆ ఇన్దల్ కర్బ్]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 21 వ అధ్యాయం – కలత చెందినపుడు పఠించే దుఆ
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

స్వల్పదానం చేసే వారిని చిన్నచూపు చూడటం, కించపరిచే మాటలనడం నిషిద్ధం

598. హజ్రత్ అబూ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

మమ్మల్ని దానం చేయాలని ఆదేశించినపుడు మేము బరువులు మోసి సంపాదన చేసే వాళ్లము (అందులో నుంచే కొంతదానం చేసే వాళ్లము). ఒకరోజు హజ్రత్ అబూ అఖీల్ (రధి అల్లాహు అన్హు) తనకు కూలి క్రింద లభించిన అర్ధ ‘సా’ (తూకం) ఖర్జూర పండ్లను (దానంగా ఇవ్వడానికి) తీసుకు వచ్చారు. మరొక వ్యక్తి అంతకంటే ఎక్కువ తీసుకు వచ్చాడు. అప్పుడు కొందరు కపట విశ్వాసులు (కారుకూతలు కూస్తూ) “దేవునికి అతని (అంటే అబూ అఖీల్ తెచ్చిన) దానం అవసరంలేదు (ఆయన ఇలాంటి అల్పదానాన్ని ఖాతరు చేయడు), రెండవ వ్యక్తి పేరు ప్రతిష్ఠల కోసం (దానం) చేశాడు” అని అన్నారు. ఆ సందర్భంలో ఈ ధైవవచనం అవతరించింది:
“మనస్పూర్తిగా విశ్వాసులు చేస్తున్న ధన త్యాగాలను గురించి వారు ఎత్తిపొడుస్తూ మాట్లాడుతున్నారు. కష్టపడి చెమటోడ్చి ఎంతో కొంత దైవమార్గంలో దానమిస్తున్న (నిరుపేద) విశ్వాసుల్ని ఎగతాళి చేస్తున్నారు. (అలా ఏకసక్కెం, ఎగతాళి చేస్తున్న ఈ పిసినారుల సంగతి అల్లాహ్ కి బాగా తెలుసు). దేవుడే వారిని ఎగతాళి చేస్తున్నాడు. వారి కోసం దుర్భరమైన (నరక) శిక్ష కాచుకొని ఉంది.” (ఖుర్ఆన్ – తౌబా : 79 )

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్, 11 వ అధ్యాయం – ఖౌలిహీ అల్లజీన యల్మిజూనల్ ముత్తవ్వియీన్]

జకాత్ ప్రకరణం – 21 వ అధ్యాయం – స్వల్పదానం చేసే వారిని చిన్నచూపు చూడటం, కించపరిచే మాటలనడం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

బిలాల్ (రధి అల్లాహు అన్హు) ఇచ్చే అజాన్

664. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

తహజ్జుద్ నమాజ్ చేస్తూ ఉండేవాళ్ళు (భోజనానికి) వచ్చేందుకు, నిద్రిస్తున్న వాళ్ళు మేల్కొనేందుకు వీలుగా బిలాల్ (రధి అల్లాహు అన్హు) అజాన్ ఇస్తుంటారు. అందువల్ల ఆయన అజాన్ విని ఎవరూ సహరీ భోజనం తినడం మానివేయనవసరం లేదు. ఆయన ఇచ్చే అజాన్ విని ఉషోదయమయిందని గాని, లేక తెల్లవారిపోయిందని గాని ఏ ఒక్కరూ భావించకూడదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెబుతూ తమ చేతివ్రేళ్ళతో సూచించారు. మొదటి వాటిని పైకి ఎత్తారు. తరువాత క్రిందికి దించారు. అంటే ఈ విధంగా (తెలుపు) వ్యాపించే వరకు అని అర్ధం.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 13 వ అధ్యాయం – అల్ అజాన్ ఖబ్లల్ ఫజ్ర్]

ఉపవాస ప్రకరణం : 8 వ అధ్యాయం – ఉపవాస వ్రతం, ఉషోదయం నుండి మొదలవుతుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది [వీడియో]

రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది
https://youtu.be/VhoL0sQNgaY [4 నిముషాలు]
వక్త : ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

786. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధియల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక అన్సార్ స్త్రీ తో మాట్లాడుతూ

“హజ్ కోసం మాతో పాటు బయలుదేరడానికి నీకు ఏ విషయం అడ్డు వచ్చింది?” అని అడిగారు. దానికామె ఇలా అన్నారు “మా దగ్గర నీళ్ళు మోసే ఒంటెలు రెండు ఉన్నాయి. వాటిలో ఒక దానిపై అబూఫులాన్, ఆయన కొడుకు (అంటే తన భర్త, తన కొడుకు) ఎక్కి (హజ్ చేయడానికి మక్కా) వెళ్ళారు. రెండవ దాన్ని మేము నీళ్ళు మోయడానికి వాడుకుంటున్నాము. “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “సరే, నువ్వు రమజాన్ నెలలో ఉమ్రా నిర్వహించు. రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది” అని అన్నారు.(*)

[సహీహ్ బుఖారీ : 26 వ ప్రకరణం – ఉమ్రా, 4 వ అధ్యాయం – ఉమ్రతి ఫీరమజాన్]

(*) రమజాన్ నెలలో ఉమ్రా చేస్తే హజ్ విధి నిర్వహించినట్లు దీని అర్ధం కాదు. ఉమ్రా సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతిశయోక్తిగా ఇలా అన్నారని తైబీ (రహిమహుల్లా) అభిప్రాయపడ్డారు.

హజ్ ప్రకరణం – 36 వ అధ్యాయం – రమజాన్ నెలలో చేసే ఉమ్రా అత్యంత పుణ్యప్రదం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ప్రళయదినాన ఆ పశువులు ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి

576. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రధి అల్లాహు అన్హు) కధనం :-

నేను (ఓసారి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తే సరిగ్గా అదే సమయంలో ఆయన “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి!” అంటూ లేక “తాను తప్ప వేరే ఆరాధ్యుడు లేనటువంటి శక్తి స్వరూపుని సాక్షి” అంటూ లేక మొత్తం మీద ఆయన ఏదో ఓ రకంగా ప్రమాణం చేస్తూ ఇలా అన్నారు. “ఒంటెలు, ఆవులు లేదా మేకలు కలిగి వున్న వ్యక్తి వాటి హక్కు (అంటే జకాత్) గనక నెరవేర్చకపోతే ప్రళయదినాన ఆ పశువులు బాగా పెరిగి బలసిపోయేలా చేసి తీసుకురాబడతాయి. తర్వాత అవి ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి. చివరి పశువు కూడా పొడిచి, తొక్కి వేసిన తరువాత తిరిగి మొదటి పశువు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ యాతన యావత్తు మానవులను గురించి (పరలోక) తీర్పు ముగిసే దాకా కొనసాగుతుంది.”

[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 43 వ అధ్యాయం – జకాతిల్ బఖర]

జకాత్ ప్రకరణం : 8 వ అధ్యాయం – జకాత్ చెల్లించని వారు కఠినాతి కఠిన శిక్ష చవి చూడవలసి వస్తుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం

390. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 37 వ అధ్యాయం – ఫజ్లిమన్ ఘదా ఇలల్ మస్జిది వరాహ]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 51 వ అధ్యాయం – నమాజు కోసం ముస్జిదుకు వెళ్తే పాపాలు క్షమించబడతాయి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నెలవంక కన్పించనంత వరకు ఉపవాసాలు పాటించకండి. అలాగే (తిరిగి) నెలవంక కన్పించనంత వరకు ఉపవాస విరమణ (పండుగ) చేయకండి.

653. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి రమజాన్ గురించి ప్రస్తావిస్తూ

“నెలవంక కన్పించనంత వరకు ఉపవాసాలు పాటించకండి. అలాగే (తిరిగి) నెలవంక కన్పించనంత వరకు ఉపవాస విరమణ (పండుగ) చేయకండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమయి ఉంటే ఆ నెల ముప్ఫై రోజులు పూర్తిగా ఉపవాసాలు ఉండండి.” (అంటే ఆ నెల 29 రోజులు ఉపవాసముండి 29 వ రోజున సాయంత్రం మబ్బు మూలంగా నెలవంక కన్పించకపోతే ముప్ఫైయ్యో రోజు కూడా ఉపవాసం పాటించి ముప్ఫయి రోజాల సంఖ్య పూర్తి చేయాలన్నమాట).

[సహీహ్ బుఖారీ : 30 వ ప్రకరణం – సౌమ్, 11 వ అధ్యాయం – ఖౌలిన్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇజారయ్ తుముల్ హిలాలు ఖుసూము]

ఉపవాస ప్రకరణం : 2 వ అధ్యాయం – నెలవంక కన్పించగానే ఉపవాసాలు విధిగా పాటించాలి; నెలవంక దర్శనంతో  ఈదుల్ ఫిత్ర్ (పండగ) అవుతుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

రమజాన్ నెలకు ఒకటి, రెండు రోజులు ముందుగా ఉపవాస ముండరాదు

657. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-

రమజాన్ నెల ప్రారంభం కావడానికి ఒకటి, రెండు రోజుల ముందుగా ఎవరూ ఉపవాసం పాటించకూడదు. ఒకవేళ ఎవరైనా ఆ తేదీల్లో ఎల్లప్పుడూ (ప్రతి యేడూ) ఉపవాసాలు పాటిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి ఈ తేదీల్లో ఉపవాసం పాటించవచ్చు.

[సహీహ్ బుఖారీ : 30 వ ప్రకరణం – సౌమ్, 14 వ అధ్యాయం – లా యతఖద్ధమన్న రమజాన బిసౌమి యౌమ్ వలా యౌమీన్]

ఉపవాస ప్రకరణం : 3 వ అధ్యాయం – రమజాన్ నెలకు ఒకటి, రెండు రోజులు ముందుగా ఉపవాస ముండరాదు.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అల్లాహ్ ఎంతో ప్రశంసనీయుడు! ఆయన మిమ్మల్ని ప్రకృతి వైపుకు మార్గదర్శనం చేశాడు

1308. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

మేరాజ్ (గగన విహారం) రాత్రి బైతిల్ మఖ్దిస్ లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు రెండు గిన్నెలు ఉంచబడ్డాయి. వాటిలో ఒక గిన్నెలో సారా ఉంది. రెండవ గిన్నెలో పాలున్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటినీ చూసి పాలగిన్నెను మాత్రమే తీసుకున్నారు. అప్పుడు దైవదూత హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఇలా అన్నారు. “అల్లాహ్ ఎంతో ప్రశంసనీయుడు! ఆయన మిమ్మల్ని ప్రకృతి వైపుకు మార్గదర్శనం చేశాడు. (అంటే ఆయన మీకు మానవ స్వభావాన్ని అనుగణమైన విషయం వైపుకు దారి చూపాడు). ఒకవేళ మీరు సారాయి గిన్నె తీసుకొని ఉంటే మీ అనుచర సమాజం సన్మార్గం తప్పిపోయేది”.

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – తఫ్సీర్, 17 వ అధ్యాయం – బనీ ఇస్రాయీల్ సూరా : 3 , హద్దాసనా అబ్దాన్]

పానీయాల ప్రకరణం : 10 వ అధ్యాయం – పాలు (ప్రవక్తకు ప్రీతికరమైన పానీయం)
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth