ఎవరు నా పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతులు నమాజు చేస్తారో

135. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) బిన్ అఫ్ఫాన్ గురించి ఉల్లేఖకులు ఇలా తెలిపారు :-

హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఒక చెంబులో నీళ్ళు తెప్పించి, మొదట తన రెండు ముంజేతులపై నీళ్ళు పోసి కడుక్కున్నారు. తరువాత కుడి చేతిని చెంబులో ముంచి, (పిడికెడు నీళ్ళతో) నోరు పుక్కిలించారు. అలాగే ముక్కులోకి నీళ్ళు ఎక్కించి శుభ్రపరుచుకున్నారు. ఆ తరువాత మూడుసార్లు ముఖం కడుక్కున్నారు. దాని తరువాత మూడుసార్లు చేతులు మోచేతుల దాకా కడుక్కున్నారు. దాని తరువాత తడి చేతులతో తల తుడుచుకున్నారు. ఆ పై రెండు కాళ్ళు చీలమండలం వరకు మూడుసార్లు కడుక్కున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని తెలిపారు – ” ఎవరు నా పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతులు నమాజు చేస్తారో అతని (ఆ తరువాయి నమాజు వరకు) జరగబోయే పాపాలు క్షమించబడతాయి.” (*)

[సహీహ్ బుఖారీ : 4 వ ప్రకరణం – వుజూ, 24 వ అధ్యాయం – అల్ ఉజూయేసలాసన్ సలాసా]

(*) ఇక్కడ ‘పాపాలు’ అంటే చిన్న చిన్న పాపాలు అని అర్ధం; పెద్ద పాపాలు కాదు. (అనువాదకుడు)

శుచి, శుభ్రతల ప్రకరణం – 3 వ అధ్యాయం – వుజూ చేసే విధానం, దాని సమగ్ర స్వరూపం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1, సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

సామూహికంగా చేసే నమాజు పుణ్యం రీత్యా పాతికరెట్లు శ్రేష్ఠమైనది

387. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

మనిషి తన ఇంట్లోనైనా వీధిలోనైనా ఒంటరిగా చేసే నమాజు కన్నా సామూహికంగా చేసే నమాజు పుణ్యం రీత్యా పాతికరెట్లు శ్రేష్ఠమైనది. మనిషి శుభ్రంగా సముచిత రీతిలో వుజూ చేసి కేవలం నమాజు చేసే ఉద్దేశంతో మస్జిద్ కు వెళుతుంటే, మస్జిద్ లో ప్రవేశించే వరకు అతను వేసే ప్రతీ అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతనికి (పరలోకపు) అంతస్తులు పెంచుతాడు. అదీగాక అతని వల్ల జరిగిన ఒక్కొక్క పాపాన్ని తుడిచి వేస్తాడు. ఇక మస్జిద్ లో ప్రవేశించిన తరువాత సామూహిక నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంతసేపు అతనికి నమాజు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుంది. అతను తన నమాజు స్థానంలో కూర్చుని ఉన్నంతవరకు దైవదూతలు అతని శ్రేయస్సు కోసం ప్రార్ధిస్తూ “దేవా! ఇతని వుజూ భంగం కానంతవరకు ఇతడ్ని క్షమించు, ఇతడ్ని కనికరించు”అని అంటారు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం  – సలాత్, 87 వ అధ్యాయం – అస్సలాతి ఫీ మస్జిదిస్సూఖ్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 49 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దాని ఔన్నత్యం . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్లాహ్ దాశీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడానికి నిరోధించకండి

254. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) భార్యలలో ఒకరు ఫజ్ర్, ఇషా వేళల సామూహిక నమాజులు చేయడానికి మస్జిద్ కు వెళ్ళేవారు. “స్త్రీలు మస్జిద్ కు వెళ్లడాన్ని హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ఇష్టపడరని, ఈ విషయంలో ఆయన ఎంతో అభిమానం గల వ్యక్తి అని తెలిసి కూడా మీరు ఇంటి నుండి బయటికి ఎందుకు వెళ్తున్నారు?” అని ఆమెను ఒకరు అడిగారు. దానికామె “అయితే ఉమర్ (రధి అల్లాహు అన్హు) నన్నెందుకు నిరోధించడం లేదు?” అని ఎదురు ప్రశ్న వేశారు. “ఎందుకంటే అల్లాహ్ దాశీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడానికి నిరోధించకండని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. ఈ ప్రవచనమే మిమ్మల్ని నిరోధించకుండా ఆయనకు అడ్డుతగిలింది” అని అన్నాడు ఆ వ్యక్తి.

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 13 వ అధ్యాయం – హద్దసనా యూసుఫు బిన్ మూసా]

నమాజు ప్రకరణం – 30 వ అధ్యాయం – ఎలాంటి ఉపద్రవం లేదనుకుంటే స్త్రీలు సువాసన పూసుకోకుండా మస్జిద్ కు వెళ్ళవచ్చు.  మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Do not stop Allaah’s Imaa’ (women slaves) from going to Allaah’s mosques

మనిషి చనిపోవడం పట్ల రోదించడం, పెడబొబ్బలు పెట్టడం

532. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రధి అల్లాహు అన్హు) వ్యాధిగ్రస్తులయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రధి అల్లాహు అన్హు), సాద్ బిన్ వఖ్ఖాస్ (రధి అల్లాహు అన్హు), అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) లు కూడా ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడకు చేరుకోగానే ఆ ఇంటి వాళ్ళు ఆయన చుట్టూ మూగారు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (సందేహిస్తూ) ” ఏమిటి ఆయన చనిపోయారా?” అని అడిగారు. దానికి వారు “చనిపోలేదు దైవప్రవక్త!” అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (రోగస్థితి చూసి) కంటతడి పెట్టారు. ఆయన్ని చూసి అందరూ దుఖించడం మొదలెట్టారు. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు – “వినండి, హృదయావేదన కన్నీళ్ళ వల్ల గానీ లేదా నోట దయార్ద్ర పలుకులు వెలువడటం వల్ల గానీ దేవుడు మనిషిని శిక్షించడు. అయితే దీని విషయంలో (దైవప్రవక్త నోటివైపు చూపిస్తూ అన్నారు) మాత్రం (పెడబొబ్బలు పెడితే) అల్లాహ్ తప్పకుండా శిక్షిస్తాడు. కుటుంబసభ్యులు ఏడ్చినా సరే మృతునికి శిక్ష ఉంటుంది.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయెజ్, 54 వ అధ్యాయం – అల్ బకాయి ఇన్దల్ మరీజ్]

జనాయెజ్ ప్రకరణం : 6 వ అధ్యాయం  -మనిషి చనిపోవడం పట్ల రోదించడం, పెడబొబ్బలు పెట్టడం గురించి.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఇతరులకు చెందిన స్థలాన్ని అన్యాయంగా ఒక జానెడు ఆక్రమించుకున్నా సరే ..

1039. హజ్రత్ అబూ సల్మా (రధి అల్లాహు అన్హు) కధనం:-

(ఒక స్థలం విషయంలో) కొందరితో నాకు తగాదా వచ్చింది. నేనీ వ్యవహారాన్ని హజ్రత్ ఆయీషా (రధి అల్లాహు అన్హ) గారి ముందు ప్రస్తావించాను. ఆమె విని ఇలా అన్నారు. ” అబూ సల్మా! స్థలాల వ్యవహారానికి దూరంగా ఉండు. ‘ఎవరైనా ఇతరులకు చెందిన స్థలాన్ని అన్యాయంగా ఒక జానెడు ఆక్రమించుకున్నా సరే (ప్రళయదినాన) అతని మెడలో  ఎడింతల భూపరిమాణం గల హారం వేయబడుతుందని’ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.”

[సహీహ్ బుఖారీ : 46 వ ప్రకరణం – మజాలిమ్, 13 వ అధ్యాయం – ఇస్మిమన్ జలమ షయ్ అన్ మినల్ అర్జ్]

లావాదేవీల ప్రకరణం – 30 వ అధ్యాయం – బల ప్రయోగాలతో ఇతరుల భూముల్ని ఆక్రమించుకోవడం నిషిద్ధం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read the English version of this Hadeeth

చెట్లను నాటడం, సేద్యం చేయడం గొప్ప పుణ్యకార్యాలు

1001. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరైనా ముస్లిం ఏదైనా ఒక (పండ్ల) చెట్టు నాటి లేదా పొలంలో ఏదైనా పంట వేస్తే అందులో పక్షులుగాని, పశువులు గాని లేదా మనుషులు గాని (పండ్లు, పంట) తిన్న పక్షంలో అది అతని తరుఫున సదఖా (దానం) అవుతుంది, అతనికి దాని పుణ్యం లభిస్తుంది

[సహీహ్ బుఖారీ : వ ప్రకరణం – మజారా, వ అధ్యాయం – ఫజ్లిజ్జరయి వల్ గర్సి ఇజా ఉకిల మిన్హు]

లావాదేవీల ప్రకరణం – వ అధ్యాయం – చెట్లను నాటడం, సేద్యం చేయడం గొప్ప పుణ్యకార్యాలు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read the English version of this Hadeeth

నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే

284. హజ్రత్ బసర్ బిన్ సయీద్ (రహ్మతుల్లా అలై) కధనం :- జైద్ బిన్ ఖాలిద్ నన్ను హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరకు పంపించి, నమాజీ ముందు నుంచి వెళ్ళే వ్యక్తి గురించి ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏం విన్నారో తెలుసుకొని రమ్మన్నారు. హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరికి వెళ్తే ఆయన ప్రవక్త ప్రవచనాన్ని ఈ విధంగా తెలిపారు :-

నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే, మనిషి అలాంటి చర్యకు పాల్పడడానికి బదులు నలభై (సంవత్సరాలు, నెలలు, రోజుల పాటు – ఉల్లేఖకునికి ఎంత కాలమో సరిగా గుర్తులేదు) వరకు నిలబడి ఉండటం ఎంతో మేలని భావిస్తాడు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 101 వ అధ్యాయం – ఇస్ముల్ మర్రిబైన యదయిల్ ముసల్లీ]

నమాజు ప్రకరణం – 48 వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

(నా కోసం) డబ్బు ఖర్చు చేయండి, నేను కూడా మీ కోసం ఖర్చు చేస్తాను

580. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

అల్లాహ్ (నా కోసం) డబ్బు ఖర్చు చేయండి, నేను కూడా మీ కోసం ఖర్చు చేస్తాను” అని అన్నాడు.” అల్లాహ్ చేయి (సకల విధాల సిరిసంపదలతో) నిండుగా ఉంది. దాన్ని రేయింబవళ్ళు నిర్విరామంగా ఖర్చు చేసినా తరగదు.” ” అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన దగ్గర్నుంచి ఎంత ఖర్చు చేశాడో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇంత ఖర్చు చేసినా ఆయన చేతిలో ఉన్న నిధి నిక్షేపాలలో రవ్వంత కూడా తగ్గలేదు. ఆయన సింహాసనం నీళ్ళ మీద ఉంది. ఆయన చేతిలో త్రాసు (న్యాయం) ఉంది. ఆయన తలచుకుంటే ఎవరినైనా అధోగతి పాలు చేయగలడు. అలాగే ఆయన తలచుకుంటే ఎవరినైనా ఉచ్ఛ స్థాయికి తీసుకురాగలడు.

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్, 2 వ అధ్యాయం – ఖౌలిహీవకాన అర్షిహీ అలల్ మాయి]

జకాత్ ప్రకరణం : 11 వ అధ్యాయం – సత్కార్యాల్లో ధన వినియోగం – దాని ప్రతిఫలం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English version of this hadeeth : Spend (O man), and I shall spend on you

మనిషి పేరాశ కడుపు (సమాధి) మట్టితో మాత్రమే నిండుతుంది

623. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

మానవునికి సిరిసంపదలతో నిండిన ఓ పెద్ద అరణ్యం లభించినప్పటికీ, అలాంటి మరో అరణ్యం దొరికితే బాగుండునని భావిస్తాడు. అతని పేరాశ కడుపు (సమాధి) మట్టితో మాత్రమే నిండుతుంది. అయితే ప్రాపంచిక వ్యామోహం వదలి పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపుకు మరలితే అలాంటి వ్యక్తిని దేవుడు మన్నిస్తాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు (అతనికి ఆత్మ సంతృప్తి భాగ్యం ప్రసాదిస్తాడు).

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 10 వ అధ్యాయం – మాయత్తఖా మిన్ ఫిత్నతిల్ మాల్]

జకాత్ ప్రకరణం : 39 వ అధ్యాయం – మానవునికి బంగారు లోయలు రెండు లభించినా మూడో దానికోసం అర్రులు చాచుతాడు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

సర్వనాశనం చేసే ఘోరాతి ఘోరమైన ఏడు పాపాలు

56. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్ని ఉద్దేశించి,

” మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు దూరంగా ఉండండని” హెచ్చరించారు. ” ఆ పనులేమిటి ధైవప్రవక్తా?” అని అడిగారు అనుచరులు. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు –

(1) అల్లాహ్ కి సాటి కల్పించటం;
(2) చేతబడి చేయటం;
(3) ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం;
(4) వడ్డీ సొమ్ము తినడం;
(5) అనాధ సొమ్మును హరించి వేయడం;
(6) ధర్మయుద్దంలో వెన్నుజూపి పారిపోవడం;
(7) ఏ పాపమెరుగని అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం.

[సహీహ్ బుఖారీ : 55 వ ప్రకరణం – అల్ వసాయా, 23 వ అధ్యాయం – ఖౌలిల్లాహ్ …. ఇన్నల్లజీనయాకులూన అమ్వాలల్ యతామాజుల్మా]

విశ్వాస ప్రకరణం : 36 వ అధ్యాయం – ఘోరపాపాలు, ఘోరాతి ఘోరమైన పాపాలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth