మూసా, ఖిజర్ లు బయలు దేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగుల గొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరి ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు. (సూరా అల్ కహఫ్ 18: 71)
ఒ క రోజు, మూసా (అలైహిస్సలాం) ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వారిపై తీవ్రమైన ప్రభావం వేసింది. ప్రజల్లో ఒక వ్యక్తి, “దైవప్రవక్తా! భూమిపై మీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు, తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు కాబట్టి తానే అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడినని భావిస్తూ మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తితో, “లేడు” అని జవాబిచ్చారు. కాని తెలుసుకోవలసినదంతా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరని, సంపూర్ణ జ్ఞానానికి ఒకే దైవప్రవక్త కేంద్రం కావడం కూడా జరగదని, ఒక వ్యక్తికి తెలియని విషయాలు తెలిసిన మరో వ్యక్తి ఎల్లప్పుడు ఉంటాడని అల్లాహ్ ఆయనకు తెలియజేశాడు. అప్పుడు మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో, “ప్రభూ! ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? నేను ఆయన్ను కలుసుకుని ఆయన నుంచి విద్య నేర్చు కోవాలని భావిస్తున్నాను” అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి గుర్తు చెప్పమని కూడా అల్లాహ్ ను కోరారు.
అల్లాహ్ ఆయనకు మార్గం చూపుతూ, నీటితో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకుని బయలుదేరాలని, ఆ చేప పాత్ర నుంచి మాయమైన ప్రదేశంలో ఆ వ్యక్తి కనబడతాడని చెప్పాడు. మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఆయన వెంట ఒక అనుచరుడు చేపవున్న నీటిపాత్రను పట్టుకుని రాసాగాడు. వారిద్దరు రెండు నదులు కలసిన సంగమ ప్రదేశానికి చేరు కున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. మూసా (అలైహిస్సలాం) అక్కడ నిద్రలోకి జారుకున్నారు.
ఆయన నిద్రపోతున్నప్పుడు, నీటి పాత్రలోని చేప ఎగిరి నదిలో దూకడాన్ని ఆయన అనుచరుడు చూశాడు. కాని అతడు ఈ సంఘటన గురించి మూసా (అలైహిస్సలాం)కు చెప్పడం మరచిపోయాడు. మూసా (అలైహిస్సలాం) లేచిన తర్వాత ఇద్దరూ ప్రయాణం కొనసాగించారు. వారు బాగా అలసిపోయారు, చాలా ఆకలితో ఉన్నారు. మూసా(అలైహిస్సలాం) తన అనుచరునితో ఆహారం గురించి అడిగారు. అప్పుడు అనుచరునికి నీటి పాత్రలోని చేప నదిలో దూకి వెళ్ళిపోయిన విషయం గుర్తుకువచ్చింది. ఆ విషయాన్ని మూసా (అలైహిస్సలాం)కు తెలియజేశాడు. మూసా (అలైహిస్సలాం), “అర్రర్రె.. మనం వెదుకుతున్న ప్రదేశం అదే” అన్నారు. వారు త్వరత్వరగా వెనక్కి వచ్చారు. రెండు నదులు కలసిన ప్రదేశానికి, చేప నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగ భాగాన్ని ఒక వస్త్రం కప్పిఉంది. ఆయనే ఖిజర్ (అలైహిస్సలాం)… మార్గదర్శి!
వింత మనిషి
మూసా (అలైహిస్సలాం) ఆయనకు అభివాదం చేశారు. “అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక!)” అన్నారు. ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు. “మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారు. కాని ఈ దేశంలో శాంతి ఉందా? అసలు మీరెవరు?” అని ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను ఇస్రాయీల్ వారి ప్రవక్తను” అన్నారు. ఆ వ్యక్తి తిరిగి, “మీకు బోధనలు ఎవరు చేశారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడకు పంపించారు?” అనడిగారు. మూసా (అలైహిస్సలాం) జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. చాలా మర్యాదగా, “నేను మీతో రావచ్చా.. ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడకు వచ్చాను. నేను మీకు అవిధేయత చూపను” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు జవాబిస్తూ, “మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే మీరు అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు. చాలా విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది. అందువల్ల మీరు వాదనకు దిగుతారు” అన్నారు. మూసా (అలైహిస్సలాం) చాలా నిజాయితీగా, “అల్లాహ్ తలిస్తే… నేను సహనంతో ఉంటాను. మీ పట్ల అవిధేయత చూపను” అన్నారు. చివరకు ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంట తీసుకువెళ్లడానికి అంగీకరిస్తూ ఒక షరతు పెట్టారు. తాను ఏం చేసినా ప్రశ్నించరాదని అన్నారు. మూసా (అలైహిస్సలాం) తన అనుచరుడిని వెనక్కు పంపి తాను ఖిజర్ (అలైహిస్సలాం)తో పాటు బయలుదేరారు.
పడవకు నష్టం కలిగించడం
వారు ఒక నది వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒక పడవలోకి ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ (అలైహిస్సలాం) చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకిపారేశారు. దాని వల్ల పడవకు ఒకవైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా (అలైహిస్సలాం), “అరె, ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది” అన్నారు.
ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. మూసా (అలైహిస్సలాం)కు వెంటనే తాను చేసిన పొరపాటు గుర్తుకువచ్చింది. ఆయన్ను క్షమాపణలు కోరుకున్నారు. “నా మతిమరుపుకు కోపం తెచ్చుకోవద్దు, నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు. మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండడానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను” అన్నారు. అందుకు అంగీకరించి ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంటతీసుకుని బయలుదేరారు.
పిల్లవాడిని హతమార్చడం
దారిలో వారికి ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనబడ్డాడు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆ పిల్లవాడిని మిత్రబృందం నుంచి వేరు చేసి ఒక ప్రక్కకు తీసుకు వెళ్ళి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా (అలైహిస్సలాం) నిర్ఘాంతపోయారు. “మీరు ఒక అమాయక పిల్లవాడిని చంపేశారు. ఇది నిజంగా అమానుషం” అని అరిచారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన వైపు తీక్షణంగా చూసి తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. తన పనులను మరోసారి ప్రశ్నిస్తే ఇక తనతో రావడం ఉండదని హెచ్చరించారు. మూసా (అలైహిస్సలాం) మళ్ళీ క్షమాపణ కోరుకున్నారు. “నేను మరోసారి ఈ పొరపాటు చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను మన్నించారు.
ఖిజర్ (అలైహిస్సలాం) చేసిన మంచి పని
వారిద్దరు ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో వారు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కోరారు. కాని పిసినారి ప్రజలు వారికి ఏదీ ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెడుతున్నప్పుడు ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ (అలైహిస్సలాం) ఆ గోడను మరమ్మత్తు చేయడానికి పూను కున్నారు. ఇది చూసిన మూసా (అలైహిస్సలాం) ఉండబట్టలేక, “మీరు భలే విచిత్రమైన మనిషి. ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు. పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకుని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకో గలిగే వాళ్ళం” అన్నారు. తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా (అలైహిస్సలాం) భరించలేరని ఖిజర్ (అలైహిస్సలాం)కు అర్థమయ్యింది. “ఇక చాలు… ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు. అయితే మనం వేరయ్యే ముందు నేను చేసిన పనులకు కారణాలు వివరిస్తాను” అన్నారు. మూసా సిగ్గుపడుతూ తల వంచుకున్నారు.
1. నేను నష్టపరచిన పడవను కిరాయికి నడుపుకుని ఆ పడవ యజమాని, అతని భార్య బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరిచానంటే, వారి రాజు పడవలను స్వాధీనం చేసుకుని పెద్ద నౌకాదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ పడవను నష్టపరచడం వల్ల దీన్ని చూసినా కూడా పనికిరానిదిగా భావించి రాజు దాన్ని వదలివేస్తాడు. మూసా! నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనబడినా… నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి, పడవ యజమానిపై సానుభూతితో చేసిన పని.
2. నేను చంపిన పిల్లవాడి తల్లిదండ్రులు నిజమైన విశ్వాసులు. కాని ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం గురించి నాకు తెలిసింది. కన్నకొడుకు కాబట్టి ఆ తల్లి దండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు. కాని, చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. అతడిని చంపి నేను వారి విశ్వాసాన్ని కాపాడాను. అల్లాహ్ వారికి మంచి సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
3. నేను ఆ గోడను నిర్మించినది స్వార్థపరులైన గ్రామస్తుల కోసం కాదు, ఆ గోడ ఇద్దరు అనాధలైన బాలలది. ఆ గోడ క్రింద గుప్తనిధి ఉందని అల్లాహ్ నాకు తెలియజేశాడు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు, దానధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్తనిధి రహస్యంగా ఉండడం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లాహ్ వారికి ఆ నిధిని చూపిస్తాడు. ఆ గోడ పడిపోతే స్వార్థపరులైన గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు. కాబట్టి నేను చేసిన ప్రతీ పని నా ప్రభువు కారుణ్యం వల్ల చేసిన పని. నేను ఏ పనీ నా స్వంతంగా చేయలేదు. ఈ మాటలు చెప్పి ఖిజర్ (అలైహిస్సలాం) వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
(చదవండి దివ్యఖుర్ఆన్: 18:60-82)
గ్రహించవలసిన పాఠాలు
జ్ఞానం పొందిన వ్యక్తి తానొక్కడే కాదన్న విషయం తెలిసిన వెంటనే మూసా (అలైహిస్సలాం) మరింత జ్ఞానం సంపాదించడానికి కష్టసాధ్యమైన ప్రయాణానికి పూనుకున్నారు. జ్ఞానం సులభసాధ్యంగా లభించేది కాదు. జీవితంలో విజయం సాధించాలంటే మనిషి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది.
అల్లాహ్ ఆదేశాల మర్మాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేము. మనకు తప్పుగా కనబడుతున్న విషయం నిజానికి ఒక అనుగ్రహం కావచ్చు. “తాను చేసేది అల్లాహ్ కు బాగా తెలుసు”.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) – చేప కడుపులో సజీవంగా మిగిలిన మనిషి (800-750 క్రీ.పూ)
ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో] వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్ https://youtu.be/fDVp3h9FRXI [31నిముషాలు]
ఈ ఉపన్యాసంలో, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర వివరించబడింది. ఇందులో యూనుస్ (అలైహిస్సలాం) వారి తండ్రి పేరు, ఖురాన్లో ఆయనకు ఇవ్వబడిన బిరుదులు, మరియు ఆయన నీనెవా పట్టణ ప్రజల వైపుకు ప్రవక్తగా పంపించబడిన వివరాలు ఉన్నాయి. నీనెవా ప్రజలు ఆయన సందేశాన్ని తిరస్కరించినప్పుడు, ఆయన అల్లాహ్ అనుమతి లేకుండానే కోపంతో ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత, నీనెవా ప్రజలు తమపైకి రాబోతున్న దైవ శిక్షను చూసి పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకోగా, అల్లాహ్ వారిని క్షమించారు. మరోవైపు, ఓడలో ప్రయాణిస్తున్న యూనుస్ (అలైహిస్సలాం) వారిని తుఫాను కారణంగా సముద్రంలోకి విసిరివేయగా, ఒక పెద్ద చేప ఆయనను మింగేసింది. చేప కడుపులోని చీకట్లలో ఆయన అల్లాహ్‌ను ప్రార్థించగా, అల్లాహ్ ఆయన ప్రార్థనను అంగీకరించి, ఆయనను రక్షించారు. ఈ సంఘటనల ద్వారా పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత, దుఆ యొక్క శక్తి, మరియు దైవ సందేశాన్ని బోధించడంలో సహనం ఎంత అవసరమో వివరించబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర
ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకుందాం.
యూనుస్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు మత్తా. కాబట్టి, ఆయనను యూనుస్ బిన్ మత్తా అని పిలుస్తూ ఉంటారు. అలాగే, ఆయనకు జున్నూన్ అనీ, అలాగే సాహిబుల్ హూత్ అనీ బిరుదులతో ఖురాన్‌లో ప్రస్తావించబడి ఉంది.
ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు. ఈ నీనెవా పట్టణము ఎక్కడ ఉంది అంటే, ఇరాక్ దేశంలోని ఉత్తర దిశన దజలా అనే ఒక నది ఉంది. ఆ నదికి ఒక వైపు మూసిల్ అనే పట్టణం ఉంటే, ఆ మూసిల్ పట్టణానికి ఎదురుగా నదికి మరో వైపు ఈ నీనెవా పట్టణం ఉంది. మధ్యలో నది, ఒక వైపు నీనెవా పట్టణము, మరోవైపు మోసెల్ పట్టణము ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఈ నీనెవా పట్టణం ఉంది.
ఆ రోజుల్లోనే నీనెవా పట్టణ ప్రజల సంఖ్య లక్ష కంటే ఎక్కువగా ఉండేది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆ పట్టణ ప్రజల సంఖ్య గురించి కూడా ప్రస్తావించి ఉన్నాడు. మనం చూచినట్లయితే, ఖురాన్‌లోని 37వ అధ్యాయం, 147వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ “మరి మేమతన్ని ఒక లక్షమంది, అంతకన్నా ఎక్కువ మంది వైపుకే (ప్రవక్తగా) పంపాము..” (37:147)
అనగా, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడే సమయానికి నీనెవా పట్టణ ప్రజల సంఖ్య లక్ష కంటే ఎక్కువగా ఉంది ఆ రోజుల్లోనే అని ఖురాన్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు.
అయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు ఆ నీనెవా పట్టణ ప్రజల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వారికి బోధిస్తే, వారు యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని పట్టించుకోలేదు, విశ్వసించలేదు. యూనుస్ అలైహిస్సలాం వారు చాలా రోజుల వరకు, చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి దైవ వాక్యాలు వారికి బోధిస్తూ ఉన్నా, వారు మాత్రము ససేమిరా అంటూ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని అసలు విశ్వసించనే లేదు.
చివరికి, ఒక రకంగా యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది, మీ మీద అల్లాహ్ శిక్ష వచ్చి పడుతుంది, ఎన్ని విధాలుగా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెబుతూ ఉన్నా మీరు పట్టించుకోవట్లేదు, విశ్వసించట్లేదు కాబట్టి మీ మీద శిక్ష వచ్చి పడుతుంది అల్లాహ్ తరఫున అని హెచ్చరించి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ పట్టణ ప్రజలని శిక్షించాలని నిర్ణయించాడు. ఆ విషయం యూనుస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేయగా, యూనుస్ అలైహిస్సలాం వారు చివరిసారిగా వెళ్లి పట్టణ ప్రజలకు, మీ మీద ఫలానా సమయంలో ఫలానా దినములో దైవ శిక్ష వచ్చి పడుతుంది అని చెప్పి, అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్లిపోయాడు.
ఒక రకంగా చెప్పాలంటే, యూనుస్ అలైహిస్సలాం వారికి కోపం వచ్చి ఉంది, పట్టణ ప్రజలు ఆయన మాటను విశ్వసించలేదు అని. కాబట్టి, మీ మీద దైవ శిక్ష వచ్చి పడే రోజు సమీపంలో ఉంది అని చెప్పి హెచ్చరించేసి కోపంగా ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఆ విషయం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో తెలియజేసి ఉన్నాడు.
وَذَا النُّونِ إِذ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ “చేపవాడు (యూనుస్ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు.” (21:87)
చేపవాడు అనగా యూనుస్ అలైహిస్సలాం కోపగించుకొని వెళ్ళిపోయినప్పటి స్థితిని జ్ఞప్తికి తెచ్చుకోండి. మేము తనను కష్ట దశలోకి నెట్టమని అతను భావించాడు. కోపగించుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరిపోయి ఏకంగా సముద్రపు ఒడ్డుకి చేరాడు. సముద్రపు ఒడ్డున అప్పటికే సామాను మొత్తం మోసుకొని బయలుదేరటానికి ఒక పడవ సిద్ధంగా ఉంటే, ఆ పడవ ఆయన ఎక్కేశాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని చెప్తున్నాడు అంటే, మా ఆజ్ఞ రాకముందే ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళాలని మా తరఫు నుంచి అనుమతి రాకముందే ఆయన, అల్లాహ్ నాకు కష్టంలోకి నెట్టడులే అని భావించి బయలుదేరిపోయాడు.
నీనెవా ప్రజల పశ్చాత్తాపం
బయలుదేరిన తర్వాత, ఇక్కడ పట్టణ ప్రజల విషయం ఏమి జరిగిందో తెలుసుకొని తర్వాత యూనుస్ అలైహిస్సలాం వారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ, పట్టణ ప్రజలు కొద్ది రోజుల తర్వాత చూస్తే, ఒక నల్లటి మేఘము ఆ నీనెవా పట్టణం వైపుకి వస్తూ ఉంది. ఆ నల్లటి మేఘంలో నిప్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది చూసి వారు అర్థం చేసుకున్నారు, యూనుస్ ఏ శిక్ష గురించి అయితే మమ్మల్ని హెచ్చరించాడో ఆ శిక్ష అదిగో అక్కడ వస్తూ ఉంది అని వారు అర్థం చేసుకొని, వెంటనే ఆ పట్టణ పెద్దల వద్దకు వెళ్లి, ఇదిగో దైవ శిక్ష వస్తూ ఉంది, ఇప్పుడు ఏమి చేయాలి అని వారు వెళ్లి అడిగితే, అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమన్నారంటే, మనకు పూర్వము ప్రవక్తల అనుచర సమాజాన్ని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలను వారు తిరస్కరించిన కారణంగా శిక్షించాడు. వాళ్లు దైవ శిక్షకు గురయ్యి మట్టి కలిసిపోయారు. అదే విధంగా అల్లాహ్ శిక్ష మన మీద కూడా రాబోతుంది. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే, అందరూ ఇళ్ల నుండి బయలుదేరండి, ఒక మైదానంలో ప్రోగవ్వండి అని ఆదేశించారు.
ఇళ్ల నుండి పిల్లా, పెద్ద, ఆడ, మగ అందరూ కూడా చిరిగిపోయిన, అతుకులు వేయబడిన బట్టలు ధరించి మైదానంలో వచ్చి ప్రోగయ్యారు. అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమి చేశారంటే, మనుషులందరినీ విడివిడిగా నిలబెట్టేశారు. చివరికి తల్లి, బిడ్డలను కూడా విడివిడిగా నిలబెట్టేసి, ప్రతి ఒక్కడూ అతను నిలబడిన స్థానంలోనే అల్లాహ్‌కు చిత్తశుద్ధితో ప్రార్థిస్తూ, క్షమాపణ వేడుకుంటూ ఈ శిక్ష మా మీద నుంచి తొలగించమని కోరుకుందాము, ప్రార్థిద్దాము అని చెప్పారు. అలాగే జరిగింది. ప్రజలందరూ కూడా మైదానంలో నిలబడ్డారు, నిలబడి అల్లాహ్‌తో ఏడుస్తూ ప్రార్థనలు చేశారు. మూడు రోజుల వరకు ఆ మేఘాలు ఆ పట్టణం మీద సంచరించాయి అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. ప్రజలు కూడా మూడు రోజుల వరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఏడుస్తూ క్షమాభిక్ష వేడుకున్నారు అని కూడా తెలపబడింది.
వారందరూ చిత్తశుద్ధితో, పశ్చాత్తాపపడి, క్షమాపణ వేడుకొని విశ్వాసము ఎప్పుడైతే పొందటానికి సిద్ధపడ్డారో, అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, వారి మీద సంచరిస్తూ ఉన్న ఆ శిక్షను తొలగించేశాడు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ దయవల్ల ఆ శిక్ష తొలిగిపోయింది. శిక్ష తొలిగిపోయిన తర్వాత, అక్కడ యూనుస్ అలైహిస్సలాం వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యూనుస్ (అలైహిస్సలాం) వారి పరీక్ష మరియు ప్రార్థన
యూనుస్ అలైహిస్సలాం వారు ఎప్పుడైతే పడవ ఎక్కేశారో, కోపగించుకొని వెళ్లి, అల్లాహ్ ఆజ్ఞ రాకముందే ఎప్పుడైతే ఆయన పడవ ఎక్కేసి బయలుదేరిపోయారో, పడవ సముద్రం మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు, తూఫాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ పంపించేశాడు. తూఫాన్ కారణంగా పెద్ద అలలు వస్తూ ఉంటే, పడవ నీట మునిగే ప్రమాదము పొంచి వచ్చింది. అప్పుడు ఆ పడవలో ఉన్న వారు పడవ మునిగిపోరాదని పడవలో ఉన్న భారము తగ్గించేయండి అంటూ అందులో ఉన్న సామాగ్రి తీసి నీటిలో పడవేశారు. అయినా గానీ బరువు తగ్గలేదు. ఇంకా బరువు తగ్గించాలి. కాబట్టి మనుషుల్లో నుంచే కొంతమందిని ఇప్పుడు పడవలో నుంచి బయటికి తోసి వేయాల్సి వచ్చింది. అయితే ఎవరిని తోసి వేయాలి? దాని కోసము వారు ప్రణాళిక ఏమని రచించారంటే, చీటీలు వేద్దాం. ఎవరి పేరు వస్తుందో వారిని నీటిలో పడవేద్దామని చీటీలు వేసి చీటీ ఎత్తితే, యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వచ్చింది.
యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వస్తే, వారు యూనుస్ అలైహిస్సలాం వారు బోధకులు కాబట్టి గౌరవిస్తూ, ఈయనను వద్దు అని రెండవ సారి మళ్లీ చీటీ ఎత్తారు. మళ్లీ ఆయన పేరే వచ్చింది. మూడవసారి చీటీ ఎత్తారు. మూడవసారి కూడా ఆయన పేరే వచ్చింది. ఆ విధంగా మూడు సార్లు చీటీ ఎత్తినప్పుడు ఆయన పేరే వస్తే, అప్పుడు విషయం అర్థమైపోయింది. యూనుస్ అలైహిస్సలాం వారినే ఇక్కడి నుంచి ఇంకా నీటిలో పడవేయాలని. ఆ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారిని నీటిలో పడవేయగా, అల్లాహ్ ఆజ్ఞతో ఒక పెద్ద చేప వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారిని మ్రింగేసింది. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పడవ ఎక్కిన విషయము తెలియజేశాడు, ఆ తర్వాత పడవలో చీటీలు వేయబడిన విషయము కూడా తెలియజేశాడు.
మనం చూచినట్లయితే ఖురాన్‌లోని 37వ అధ్యాయం 140వ వాక్యంలో ఈ విధంగా తెలపబడి ఉంది,
యూనుస్ అలైహిస్సలాం తన జనుల నుండి పలాయనం చిత్తగించి, నిండు నౌక వద్దకు చేరుకున్నాడు. నౌక వద్దకు చేరుకొని, నౌకలో బయలుదేరితే తూఫాను వచ్చింది, అప్పుడు చీటీలు వేయబడ్డాయి. చూడండి 37వ అధ్యాయం 141వ వాక్యంలో తెలపబడింది,
فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ “చీటీలు వేయటం జరిగింది. చివరకు అతనే ఓడిపోయాడు..” (37:141)
చీటీలు వేయటం జరిగింది, చివరకు అతనే ఓడిపోయాడు. అనగా యూనుస్ అలైహిస్సలాం వారే ఓడిపోయారు. ఆయనకే నీటిలో పడవేయటం జరిగింది. ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగింది. 37వ అధ్యాయం 142వ వాక్యంలో చూడండి,
فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ “తరువాత అతన్ని చేప మ్రింగేసింది. అప్పుడు అతను తన్ను తానే నిందించుకోసాగాడు.“ (37:142)
తర్వాత చేప అతన్ని మ్రింగేసింది, అప్పుడు అతను తన్ను తాను నిందించుకోసాగాడు. యూనుస్ అలైహిస్సలాం వారిని ఏ చేప అయితే వచ్చి మింగిందో, ఆ చేపకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. నీవు యూనుస్ అలైహిస్సలాం వారి శరీరానికి ఎలాంటి గాయము కాకుండా చూసుకోవాలి. అలాగే ఆయన శరీరంలోని ఒక్క ఎముక కూడా విరగరాదు అని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి, చేప యూనుస్ అలైహిస్సలాం వారిని నమలలేదు, ఎలాంటి గాయము కలగకుండా మింగింది, ఆయన చేప కడుపులోకి వెళ్లిపోయాడు.
వెళ్లిన తర్వాత, చేప యూనుస్ అలైహిస్సలాం వారితో సముద్ర లోతుల్లోకి వెళ్ళింది. అప్పుడు యూనుస్ అలైహిస్సలాం వారు, అల్లాహ్ ఆజ్ఞ రాకముందే నేను తొందరపడి వచ్చేసానే, తప్పు చేశాను కదా అని అప్పుడు గ్రహించి, చేప గర్భం నుండి, అంటే చేప కడుపు నుండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను తలుచుకొని ఆయన ప్రార్థించాడు. ఆయన ఏమని ప్రార్థించాడో, ఆ పలుకులు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో ప్రస్తావించి ఉన్నాడు. 21వ అధ్యాయం 87వ వాక్యంలో అక్కడ మనం చూచినట్లయితే,
فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు.“ (21:87)
అనగా, అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాడ్ని” అని మొరపెట్టుకున్నాడు. చీకట్లలో నుంచి ఆయన ప్రార్థన చేశాడు అంటే, ఏ చీకటి? ధార్మిక పండితులు మూడు విషయాలు తెలియజేశారు. ఒకటి, ఆయన ప్రార్థన చేసే సమయానికి రాత్రి అయ్యి ఉండింది, రాత్రి చీకటి. రెండవది, చేప ఆయనను తీసుకొని సముద్ర లోతుల్లోకి వెళ్ళింది కాబట్టి, సముద్ర లోతుల్లో అక్కడ చీకటి ఉంది. రెండు. మూడో విషయం ఏమిటంటే, చేప గర్భంలో, చేప కడుపులో ఆయన ఉన్నాడు కదా, అక్కడ కూడా చీకటి ఉంది. ఈ విధంగా, మూడు చీకట్లలో నుంచి ఆయన అల్లాహ్‌కు ప్రార్థన చేశారు.
అలాంటి చోటు నుంచి కూడా ఆయన అల్లాహ్‌ను తలుచుకుంటూ ఉంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వినే శక్తి కలిగిన వాడు, ఆయన ప్రార్థనను విన్నాడు. విని, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మన్నించి, ఆయన ప్రార్థనను ఆమోదించి, ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని, కష్టాన్ని తొలగించాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 37వ అధ్యాయం, 143, 144 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నాడు.
فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُنجِي الْمُؤْمِنِينَ “అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము.” (21:88)
అల్లాహు అక్బర్! ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత నిరాశ చెంది ఉంటే, నాకు చేప మింగేసింది, ఇక నాకు బయట పడే మార్గమే లేదులే అని నిరాశ చెంది ఉంటే, అల్లాహ్‌కు తలుచుకోకుండా ఉండి ఉంటే, ఆయన ప్రళయం వరకు అక్కడే ఉండిపోయేవాడు. కానీ, అక్కడి వెళ్లి కూడా ఆయన అల్లాహ్ మీద నమ్మకం ఉంచి, అల్లాహ్ వింటాడు అని భావించి, వాస్తవానికి అల్లాహ్ వింటున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విని, ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని తొలగించాడు. ఎలా తొలగించాడు అంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, అల్లాహ్ ఆజ్ఞతో చేప సముద్రపు ఒడ్డుకి వచ్చి ఆయనను కక్కేయగా, ఆయన మళ్లీ కడుపులో నుంచి సముద్ర ఒడ్డుకి వచ్చి పడ్డారు.
అయితే చేప కడుపులో ఆయన ఎన్ని రోజులు గడిపారు అంటే, ధార్మిక పండితులు మూడు రకాల విషయాలు తెలియజేసి ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే, ఆయన మూడు రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు, ఏడు రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు, 40 రోజులు గడిపారు అని మరికొందరు తెలియజేసి ఉన్నారు. అయితే మూడు రోజులు గడిపారన్న విషయము ఎక్కువగా ప్రచారంలో ఉంది. అసలు విషయము అల్లాహ్‌కు తెలుసు. ఏది ఏమైనప్పటికిని, యూనుస్ అలైహిస్సలాం వారు వచ్చి మళ్ళీ సముద్ర ఒడ్డున పడ్డారు. ఆయన సముద్ర ఒడ్డుకి చేరుకునే సమయానికి, ఆయన అనారోగ్యానికి, అస్వస్థతకు గురై ఉన్నారు. మూడు రోజులు చేప కడుపులో ఉన్నారు కదా, కాబట్టి ఆయన అస్వస్థతకు గురై ఉన్నారు. ఖురాన్‌లో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు. 37వ అధ్యాయం 145వ వాక్యాన్ని మనం చూచినట్లయితే,
ఆయన ఆరోగ్యము సరిగా లేదు, అస్వస్థతకు గురై ఉన్నారు. ఆయన లేచి నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, అంతగా ఆయన అస్వస్థతకు, అనారోగ్యానికి, బలహీనతకు గురై ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయ తలచి అడవుల్లో నివసిస్తున్న జింకను లేదా ఒక గొర్రెను ఆదేశించగా, ఆ గొర్రె వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారు ఉన్న చోట నిలబడితే, ఆ గొర్రె పాలు లేదా జింక పాలు ఆయన తాగేవారు. అలాగే, ఎక్కడైతే యూనుస్ అలైహిస్సలాం వారు పడి ఉన్నారో, ఆ ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీగ లాంటి ఒక మొక్కను అక్కడ మొలకెత్తించాడు. ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు స్వస్థత లభించింది, అలాగే ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు నీడ కూడా లభించింది అని తెలపబడి ఉంది. మనం చూచినట్లయితే 37వ అధ్యాయం 146వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు,
ఆ తీగ చెట్టు ఏమి చెట్టు అంటే, కొంతమంది ధార్మిక పండితులు సొరకాయ తీగ అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్‌కే తెలుసు. మొత్తానికి ఒక తీగ చెట్టును అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మొలకెత్తించాడు. ఆ ఆకులతో మరియు ఆ చెట్టు నీడతో ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత ప్రసాదించాడు.
ఆ తర్వాత, ఆయన ఎప్పుడైతే ఆరోగ్యవంతుడయ్యాడో, స్వస్థత పొందిన తర్వాత, ఆయన మళ్ళీ అక్కడి నుంచి నీనెవా పట్టణానికి వెళ్ళాడు. అప్పటికే ఆ సంఘటన మొత్తం జరిగి ఉంది. దైవ శిక్ష మేఘాల రూపంలో రావటం, ప్రజలందరూ మైదానంలో ప్రోగయ్యి అల్లాహ్‌ను తలుచుకొని ఏడ్చి, పశ్చాత్తాపము చెంది, క్షమాపణ కోరుకోవటం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి శిక్షను తొలగించటం, ఇదంతా అప్పటికే సంభవించి ఉంది. వారి మీద ఉన్న శిక్ష తొలగించబడింది అన్న విషయము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లోని 10వ అధ్యాయం, 98వ వాక్యంలో ప్రస్తావించి ఉన్నాడు.
لَمَّا آمَنُوا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ “… వారు (యూనుస్ జాతి ప్రజలు) విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకూ జీవనలాభం పొందే అవకాశం వారికి కల్పించాము.” (10:98)
ఆ విధంగా, యూనుస్ అలైహిస్సలాం వారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రజలందరూ కూడా విశ్వాసం పొందారు. యూనుస్ అలైహిస్సలాం ఆ పట్టణ ప్రజలకు దైవ నిబంధనలు నేర్పుకుంటూ అక్కడ జీవితం గడిపారు. ఈ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర క్లుప్తంగా మీ ముందర వివరించబడింది.
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి జీవితంలో – యూనుస్ (అలైహిస్సలాం) వారి ప్రస్తావన
ఇక రండి, యూనుస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక వ్యక్తికి సన్మార్గం దక్కింది. అది ఎలాగా? అది కూడా విందాం ఇన్షాఅల్లాహ్.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో దైవ వాక్యాలు ప్రజలకు బోధిస్తున్న సమయంలో, మక్కా వెలుపల వెళ్లి దైవ వాక్యాలు బోధిద్దామని తాయిఫ్ పట్టణానికి వెళ్లారు. ఇది చాలా ప్రచారంలో ఉన్న సంఘటన. అందరికీ తెలిసి ఉంటుంది ధార్మిక పండితుల నోట విని ఉంటారు. అయితే ఈ ప్రస్తావనలో మన అంశానికి సంబంధించిన విషయం మనం తెలుసుకుందాం. అదేమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ పట్టణానికి వెళ్లారు. అక్కడ ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. ప్రజలు వినకుండా, తిరస్కరించి, చివరికి కుర్రాళ్ళు మరియు పెద్దలు అందరూ కలిసి ఆయనకు రాళ్లతో కొట్టటము, ఆయన స్పృహ కోల్పోయి పడిపోవటము, ఆ తర్వాత బానిస ఆయనను తీసుకెళ్లి ఒక తోటలో రక్తము, గాయాలు శుభ్రపరిచిన తర్వాత, ఆయనకు స్పృహ రావటము, ఆ తర్వాత దైవదూత జిబ్రీల్ వచ్చి, మీరు అనుమతి ఇస్తే ఈ పట్టణ ప్రజలని రెండు పర్వతాల మధ్య నుజ్జు నుజ్జు చేసేస్తాను, అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వద్దు అని నిరాకరించడము, ఇదంతా జరిగిన చోటనే మరొక ముఖ్యమైన సంఘటన జరిగి ఉంది.
అదేమిటంటే, ఏ తోటలోకి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీసుకెళ్లి ఆ బానిస గాయాలు శుభ్రం చేస్తున్నాడో, రక్తం శుభ్రం చేస్తున్నాడో, ఆ తోట వచ్చి రబియా అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండేవారు, ఉత్బా మరియు షైబా అని, ఆ ఇద్దరు కుమారులది అది. ఆ సమయానికి వారిద్దరూ కూడా అక్కడ ఉన్నారు తోటలో. ప్రవక్త వారి పరిస్థితి చూసి, వారు జాలిపడి, వారి వద్ద ఒక బానిస ఉండేవాడు, అతని పేరు అద్దాస్. అతని పిలిపించి కొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చి తీసుకెళ్లి ఆ వ్యక్తికి ఇవ్వండి అని చెబితే, అప్పుడు అద్దాస్ అనే బానిస ద్రాక్ష పండ్లు తీసుకెళ్లి ప్రవక్త వారికి ఇచ్చాడు.
అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ‘బిస్మిల్లాహ్‘ అని ఆ ద్రాక్ష పండ్లు తినటం ప్రారంభించారు. అది విని అద్దాస్‌కు ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రదేశంలో ‘బిస్మిల్లాహ్’ అనే పలుకులు పలికే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఈ పలుకులు పలుకుతున్నారు అంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉందే అని చెప్పాడు.
అప్పుడు ప్రవక్త వారు ఆ వ్యక్తితో ఏమని అడిగారంటే, “అయ్యుల్ బిలాది అంత యా అద్దాస్, వ మా దీనుకా?” (ఓ అద్దాస్, నీవు ఏ పట్టణ వాసివి మరియు నీవు ఏ మతస్థుడివి?) అని అడిగితే, అతను అన్నాడు, “నేను ఒక క్రైస్తవుడిని, నేను నీనెవా పట్టణానికి చెందిన వ్యక్తిని” అని చెప్పాడు. చూశారా, నీనెవా పట్టణ ప్రస్తావన వచ్చేసింది ఇక్కడ.
ఇప్పుడు, నీనెవా పట్టణ ప్రస్తావన ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారో, అప్పుడు వెంటనే ఆయన ఏమన్నారంటే, “ఓహో, నీవు నా సోదరుడైన యూనుస్ బిన్ మత్తా అనే ప్రవక్త పట్టణానికి చెందిన వ్యక్తివా?” అని అడిగారు.
ఆ మాట వినగానే అద్దాస్‌కు ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయింది. ఎందుకంటే మక్కాలో ఉంటున్న ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఈ దూరదర్శనాలు, ఈ టెలివిజన్లు, వేరే వేరే చోట్ల నుంచి ఏ ప్రదేశం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని తెలుసుకునే విషయాలు లేవు. ప్రవక్త వారు కూడా దూరపు ప్రయాణాలు ఆ రోజుల్లో చేసి లేరు. కాబట్టి, ఆయన ఆశ్చర్యపడుతూ, “యూనుస్ బిన్ మత్తా గురించి, నీనెవా పట్టణం గురించి మీకు ఎలా తెలుసండి?” అని అడిగితే, అప్పుడు ప్రవక్త వారు అన్నారు,
“జాక అఖీ, కాన నబియ్యన్ వ అన నబి.” (అతను నా సోదరుడు. అతను ఒక ప్రవక్త మరియు నేను కూడా ఒక ప్రవక్తనే.)
యూనుస్ బిన్ మత్తా ఒక ప్రవక్త అయ్యా, నేను కూడా ఒక ప్రవక్తనే. కాబట్టి, ఒక ప్రవక్తగా ఆ ప్రవక్త గురించి నాకు తెలుసు అని చెప్పారు. ఆ మాట వినగానే క్రైస్తవుడైన ఆ అద్దాస్ ప్రవక్త వారి చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు, నుదుటను ముద్దు పెట్టుకుంటున్నాడు. దూరం నుంచి ఇద్దరు యజమానులు చూసి, “అదో, ఈ ముహమ్మద్ వారి మాటల్లో ఇతను కూడా పడిపోయాడు. ఆ ముహమ్మద్ వారి మాటల ప్రభావం ఇతని మీద కూడా పడిపోయింది” అని చెప్పి వారు మాట్లాడుకుంటున్నారు. తర్వాత, అద్దాస్ యజమానుల వద్దకు వెళితే, అప్పుడు వారిద్దరూ, “ఏమయ్యా, ద్రాక్ష పండ్లు ఇచ్చేసి వచ్చేయ్ అని మేము చెబితే, నీవేమో వెళ్లి అతని చేతులు ముద్దు పెట్టుకుంటున్నావు, నుదుట ముద్దు పెట్టుకుంటున్నావు. ఏంటిది?” అని అడిగితే, అప్పుడు ఆ అద్దాస్ ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అతను అన్నాడు, “లఖద్ అఖ్బరనీ బి అమ్రిన్ మా యఅలముహూ ఇల్లా నబీ.” (ఈయన నాకు ఒక విషయం గురించి తెలియజేశారు. ఆ విషయము ఒక ప్రవక్తకు తప్ప ఇతరులకు అది తెలియదు) అని చెప్పారు.
చూశారా, ఆయన ప్రవక్త అన్న విషయము బానిస అయిన క్రైస్తవుడు అద్దాస్ అర్థం చేసుకున్నాడు. తర్వాత చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, కొద్ది రోజుల తర్వాత ఆ అద్దాస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో హాజరయ్యి అతను ఇస్లాం స్వీకరించాడు అని కూడా తెలుపబడింది.
అయితే మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, యూనుస్ బిన్ మత్తా ప్రవక్త వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే చాలా సంవత్సరాల క్రితము వచ్చి వెళ్ళిన వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడూ కూడా ఆ నీనెవా పట్టణానికి ప్రయాణం చేసి వెళ్లి చూసి రాలేదు. ఒక ప్రవక్తగా ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన చరిత్ర ప్రస్తావించారు కాబట్టి, ఆయన తెలుసుకొని, గుర్తుపట్టి ఆ క్రైస్తవ బానిసకు ఆ విషయాలు తెలియజేసినప్పుడు, వెంటనే ఆ బానిస ఆ విషయాన్ని గ్రహించి ప్రవక్త వారి శిష్యుడిగా మారాడు. కాబట్టి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన దైవ ప్రవక్త అని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యం.
యూనుస్ (అలైహిస్సలాం) వారి జీవితం నుండి పాఠాలు
ఇక రండి, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనము తెలుసుకోవలసిన ఒకటి, రెండు, మూడు విషయాలు చెప్పి నేను ఇన్షాఅల్లాహ్ నా మాటను ముగిస్తాను.
ఒక విషయం ఏమిటంటే, పశ్చాత్తాపము చెందటం వలన మనిషి పాపాలు తొలిగిపోవటంతో పాటు, అతని మీద ఉన్న శిక్షలు, దుఃఖాలు కూడా తొలిగిపోతాయి అని మనకు తెలపబడింది. నీనెవా పట్టణ ప్రజల మీద దైవ శిక్ష వచ్చి పడుతూ ఉంటే, వారు పశ్చాత్తాపం పొందారు. వారు పశ్చాత్తాపం పొందిన కారణంగా, వారి పాపము మన్నించబడింది, వారిపై వస్తున్న, వారిపై పడబోతున్న శిక్ష కూడా తొలగించబడింది. కాబట్టి, పశ్చాత్తాపము చెందాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అనుచర సమాజానికి “పశ్చాత్తాపం పొందుతూ ఉండండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు” అని తెలియజేసి ఉన్నారు.
అలాగే యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, విశ్వాసి అల్లాహ్‌తో దుఆ చేసుకుంటూ ఉండాలి. అతను మేఘాలలో ప్రయాణిస్తూ ఉన్నా, నీటి మీద ప్రయాణిస్తూ ఉన్నా, లేదా భూమి మీద ప్రయాణిస్తూ ఉన్నా, నీటి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, గాలిలో ప్రయాణిస్తూ ఉన్నా, భూమి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నా సరే, ఈ సర్వం అల్లాహ్ ది. ఈ సర్వానికి మొత్తానికి రాజు, రారాజు, అధిపతి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆయన ఆజ్ఞ ప్రతిచోట చెల్లుతుంది. కాబట్టి, విశ్వాసి ఎక్కడ ఉన్నా, అల్లాహ్‌ను తలుచుకుంటూ, అల్లాహ్‌ను వేడుకుంటూ, అల్లాహ్‌కు దుఆ చేసుకుంటూ ఉండాలి. చూడండి యూనుస్ అలైహిస్సలాం వారు నీటి లోపల, చేప కడుపులో ఉండి ఆయన దుఆ చేస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన దుఆను విన్నాడు, ఆమోదించాడు, సమస్యను పరిష్కరించి ఆయనకు గట్టెక్కించాడు. కదా? కాబట్టి, ఎక్కడ ఉన్నా నిరాశ చెందకూడదు. ప్రతిచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వింటున్నాడు, చూస్తున్నాడు. ఆయన జ్ఞానము ప్రతిచోట ఉంది అని మనము గమనించాలి.
అలాగే, యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక బోధకుడు దైవ వాక్యాలు బోధిస్తున్నప్పుడు విసుగు చెందరాదు. యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజలు యూనుస్ అలైహిస్సలాం వారి మాటను పెడచెవిన పెట్టేస్తున్నారు కాబట్టి, ఆయన మాటను వారు పట్టించుకోవట్లేదు కాబట్టి, యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దైవ ఆజ్ఞ రాకముందే, అనుమతి రాకముందే ఆయన వెళ్లిపోయారు. ఒక రకంగా విసుగు చెందారు, కోపగించుకున్నారు. కాబట్టి, ఈ లక్షణము ఒక బోధకునికి సరికాదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ అదే మాట తెలియజేసి ఉన్నాడు. చూడండి,
فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ الْحُوتِ “కనుక నీ ప్రభువు తీర్పు వచ్చే వరకు ఓపిక పట్టు. చేపవాని మాదిరిగా అయిపోకు.” (68:48)
చేపవాడు అంటే యూనుస్ అలైహిస్సలాం వారే. యూనుస్ అలైహిస్సలాం వారు ఎలాగైతే విసుగు చెంది, కోపగించుకొని వెళ్ళిపోయారో, అలా చేయకు అని చెప్పారు. కాబట్టి, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు బోధించే వ్యక్తిలో విసుగు చెందడం అనే లక్షణము ఉండకూడదు.
ఇవి ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్నందరినీ ప్రవక్తల జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన పాఠాలు అన్నీ నేర్చుకొని, తెలుసుకొని, మమ్మల్ని మనము సంస్కరించుకొని అల్లాహ్ మార్గం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
యూనుస్ ను చేపమ్రింగేసింది. అప్పుడు అతను తన్న తానే నిందించుకోసాగాడు. ఒకవేళ అతను (అల్లాహ్) పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే… పునరుత్థానదినం వరకు చేప కడుపు లోనే ఉండిపోయేవాడు (37: 142-144)
నైనవాహ్ పట్టణ ప్రజలు విగ్రహారాధకులు. వారి జీవన విధానం సిగ్గు లజ్జ లేకుండా ఉండేవి. వారి వద్దకు ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం)ను అల్లాహ్ పంపించాడు. వారిని సంస్కరించ డానికి, అల్లాహ్ ను ఆరాధించేలా వారిని తీర్చిదిద్దడానికి ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) వచ్చారు. తమ ఆరాధనా విధానంలో యూనుస్ జోక్యం వారికి నచ్చలేదు. “మా తాతముత్తాతలు ఈ దేవుళ్ళనే ఆరాధించారు. మేము వీటిని చాలా కాలంగా ఆరాధిస్తున్నాము. మాకు ఎలాంటి హాని కలుగలేదు” అని వారు ఆయన మాటలను తిరస్కరించారు.
విగ్రహారాధన ఎంత అవివేకమైనదో, అల్లాహ్ ఆరాధనలోని ఔచిత్య మెంత గొప్పదో ఆయన వారికి నచ్చజెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు. కాని వారు ఆయన మాటలు వినలేదు. తమ విధానాలు మార్చుకోనట్లయితే అల్లాహ్ శిక్ష విరుచుకుపడుతుందని ఆయన వారిని హెచ్చరించారు. అయినా వారు లక్ష్యపెట్టలేదు. తాము ఏ శిక్షకూ భయపడమని అన్నారు. ఆ శిక్ష ఏంటో రానీ చూద్దాం అన్నారు. నిరాశకు గురయిన యూనుస్ (అలైహిస్సలాం) వారితో, “అలా అయితే నేను మిమ్మల్ని మీ దురదృష్టానికి వదలి వేస్తున్నాను” అన్నారు. ఆ తర్వాత ఆయన అల్లాహ్ శిక్ష ఇక ఆ పట్టణాన్ని చుట్టుకుంటుందని భయపడి ఆ పట్టణాన్ని వదలి వెళ్ళిపోయారు.
ఆయన పట్టణం వదలి వెళ్ళిన వెంటనే అక్కడి ఆకాశం ఎర్రగా మంటలా మారిపోయింది. ఈ దృశ్యం చూసి ప్రజలు భయపడ్డారు. ఆద్, సమూద్, నూహ్ జాతి ప్రజల వినాశం గుర్తుకు తెచ్చుకున్నారు. తమకు కూడా అలాంటి గతి పట్టనుందా! అన్న ఆలోచన వారిలో నెమ్మదిగా ధార్మిక విశ్వాసాన్ని సృజించింది. వారంతా ఒక కొండపై గుమిగూడారు. అల్లాహ్ కారుణ్యం కోసం, ఆయన క్షమా భిక్ష కోసం ప్రార్థించడం ప్రారంభించారు. వారి మొరలతో కొండలు ప్రతిధ్వనించాయి. నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం వాతావరణమంతా అలముకుంది. అల్లాహ్ వారిపై తన ఆగ్రహాన్ని తొలగించి వారిని మరలా అనుగ్రహించాడు. భయంకరమైన తుఫాను శిక్ష తప్పుకోగానే వారు యూనుస్ ప్రవక్తను మళ్ళీ రావలసిందిగా కోరారు. ఆయన వచ్చి తమకు సరియైన మార్గం చూపించాలని కోరారు.
పడవ ప్రయాణం
ఈలోగా యూనుస్ ప్రవక్త (అలైహిస్సలాం) ఒక పడవలో ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు కొంతమంది ప్రయాణీకులు ఉన్నారు. సముద్రంలో ప్రయాణమైన తర్వాత తీవ్రమైన తుఫాను గాలికి పడవ చిగురుటాకులా వణకి పోసాగింది. పర్వతాల వంటి అలల తాకిడికి పడవ తలక్రిందులైపోతోంది. పడవలో చాలా సామాను ఉంది. ప్రయాణీకులు తమ సామాన్లను పడవ నుంచి బయటకు విసరివేసారు. అయినా పడవలో బరువు చాలా ఎక్కువ ఉంది. ఇంకా బరువు తగ్గించకపోతే పడవకు ప్రమాదం. కాబట్టి కనీసం ఒక వ్యక్తిని సముద్రం లోకి విసిరేస్తే బరువు తగ్గుతుందని మిగిలిన వాళ్ళు బ్రతుకుతారని అనుకున్నారు. అందరూ చీటీలు వేశారు. ఈ లాటరీలో యూనుస్ ప్రవక్త పేరు వచ్చింది.
యూనుస్ ప్రవక్త గురించి వారికి తెలుసు. చాలా మంచివారు, గౌరవ నీయుడు. అటువంటి మనిషిని సముద్రంలో వదిలేయడానికి వాళ్ళు ఇష్టపడ లేదు. అందువల్ల వాళ్ళు మళ్ళీ లాటరీ వేశారు. రెండవసారి కూడా యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది. చివరిసారిగా చూద్దామని మూడవసారి వేశారు. అప్పుడు కూడా యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది. ఇందులో అల్లాహ్ అభీష్టం ఉందని యూనుస్ ప్రవక్త గుర్తించారు. ఆయన అల్లాహ్ అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదలివేశారు. ఒక ప్రవక్తగా ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారు.
ప్రయాణీకులు తనను సముద్రంలో వదిలేయక ముందే ఆయన లేచి అల్లాహ్ పేరు స్మరిస్తూ సముద్రంలోకి దూకారు. భారీ అలల్లో ఆయన కలసిపోయారు.
చేప కడుపులో
యూనుస్ (అలైహిస్సలాం) కళ్ళు తెరిచేసరికి తాను తడితడిగా మెత్తగా ఉన్న ఒక నేలపై ఉన్నట్లు భావించారు. తన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా మూసివేయబడిన ఒక గుహలా ఉంది. అంతా చాలా చీకటిగా ఉంది. కాని చాలా మృదువుగా, మెత్తగా ఉంది. ఆయనకు కుదుపులు తగులుతున్నాయి. అలల్లో పడవకు తగిలే కుదుపుల వంటివి. తాను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్లు ఆయన గుర్తించారు. తుఫాను సముద్రంలో ఆయన్ను కాపాడడానికి గాను అల్లాహ్ ఆయన్ను ఒక చేప మింగేసేలా చేశాడు. ఆయన వెంటనే అల్లాహ్ ను తలచుకుని తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. “అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు. ఔన్నత్యం ఆయనదే. నిస్సందేహంగా నేను తప్పు చేశాను” అన్నారు. అనంత కరుణామయుడు, అపారంగా క్షమించేవాడయిన అల్లాహ్ ఈ ప్రార్ధనను ఆలకిం చాడు. ఆ వెంటనే తాను బలవంతంగా బయటకు తోయబడిన అనుభూతి యూనుస్ (అలైహిస్సలాం)కు కలిగింది. ధడాలున ఆయన మెత్తని నేలపై వచ్చిపడ్డారు. ఆయన్ను బయటకు కక్కేసేలా అల్లాహ్ ఆ చేపకు ఆజ్ఞాపించాడు. యూనుస్ (అలైహిస్సలాం) వెంటనే అల్లాహ్ కు కృతజ్ఞతలు చెల్లించారు.
ఆయన ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నారు. బలహీనంగా, ఒంటరిగా మిగిలి పోయారు. ఆయన పెద్ద పెద్ద ఆకులున్న ఒక పొదలో పడి ఉన్నారు. ఎండ వేడిమి నుంచి ఆ ఆకులు రక్షణ కల్పిస్తున్నాయి. అక్కడ చాలా సొరకాయలు ఉన్నాయి. వాటితో ఆయన తన ఆకలిని తీర్చుకున్నారు. నెమ్మదిగా ఆయన శక్తిని పుంజు కున్నారు. తన స్వస్థలం నైనవాహ్ కు ప్రయాణమయ్యారు. అక్కడ ప్రజల్లో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందించారు. ప్రజలంతా ఆయన్ను చాలా ఆదరంగా స్వాగతించారు. తామంతా నిజమైన దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించామని ఆయనకు తెలిపారు. వారంతా కలసి అల్లాహ్ కు కృతజ్ఞతా సూచకంగా ప్రార్ధనలు చేశారు. (చదవండి దివ్య ఖుర్ ఆన్ 6:86-57, 21:87-88 37:139-158)
గ్రహించవలసిన పాఠాలు
యూనుస్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు అప్పగించబడిన పనిని మధ్యలో విడిచి పెట్టి పట్టణాన్ని వదలి వెళ్ళిపోయారు. ఆయన అల్లాహ్ ను మార్గదర్శనం కొరకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్లక్ష్యానికి శిక్షను అనుభవించారు. తమపై శిక్ష విరుచుకుపడే సూచనలు కనబడగానే దుర్మార్గులు తమ తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాభిక్ష అర్ధిస్తూ కారుణ్యం కోసం ప్రార్ధంచారు. అల్లాహ్ తన ఆగ్రహాన్ని ఉపసంహరించుకుని వారిని సురక్షితంగా విడిచిపెట్టాడు.
యూనుస్ ప్రవక్త (అలైహిస్సలాం) విషయంలోనూ ఇదే జరిగింది. అల్లాహ్ ఆయన్ను ఒక విచిత్రమైన, భయంకరమైన సంఘటనకు గురిచేశాడు. ఆయన తన తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. అల్లాహ్ కరుణ చూపి ఆయన్ను కాపాడాడు.
ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) చేసిన సరళమైన, చిన్న ప్రార్ధన చాలా ప్రాముఖ్యం కలిగినది
హజ్రత్ సాద్ బిన్ అబీ వక్కాస్ ఉటంకం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “కష్టాల్లో ఉన్న ముస్లిం యూనుస్ ప్రవక్త చేసిన ప్రార్ధనతో అల్లాహ్ కు మొరపెట్టుకుంటే అల్లాహ్ ప్రతిస్పందిస్తాడు. ఇది అల్లాహ్ చేసిన వాగ్దానంగా భావించబడుతుంది” – లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక , ఇన్ని కుంతు మినజ్ఞాలిమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
“ఆ సోదరులు నిద్ర పోతుండగానే నీ ప్రభువు తరఫున ఒక ఆపద వారి తోటను చుట్టుముట్టి పోయింది. అంతే! తెల్లవారే సరికల్లా ఆ తోట కోత కోసిన చేను మాదిరిగా అయిపోయింది.(ఖుర్ఆన్ 68 : 19 – 20)
ఒ క రోజు ప్రాతఃకాలం, నలు దిశలా ప్రశాంత వాతావరణం అలుముకుని ఉంది. రాతి నేలపై చేతికర్రతో కొడుతూ ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. మధ్యమధ్యలో ఆ వ్యక్తి ఆయాసంతో దీర్ఘశ్వాస విడువడం కూడా చెవులకు సోకుతోంది. ఆ వ్యక్తి ఒక ముసలివాడు.ఆయన తన తోట వద్దకు వెళుతున్నాడు.ఆ తోటలో అనేక పండ్ల చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ విరగకాసాయి. తోట మధ్యలో ఒక సెలయేరు ప్రవహిస్తోంది. అనేక పూల వాసనతో అక్కడ గాలి మధురంగా గుబాళిస్తోంది. ప్రాతఃకాలం మసకమసక వెలుతురు నెమ్మదిగా ప్రకాశ మానం అవుతోంది. పక్షులు ప్రపంచాన్ని నిద్రలేపడానికి కిలకిలరావాలు ప్రారంభించాయి. కాని ఈ ప్రకృతి సౌందర్యం ఆ ముసలి వ్యక్తి ధ్యాసను మరల్చలేదు. విశ్వప్రభువు అనుగ్రహాలను అన్వేషించే విషయంలో ఆయన ఏమాత్రం నిర్లక్ష్యంచేయదలచుకోలేదు. ఆయన సమయం కాగానే అల్లాహ్ ను స్మరిస్తూ నమాజు చేసి అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించాడు.
తన తోటలోకి ఆయన అందరినీ అనుమతించేవాడు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించేవాడు. అయితే ఎవరూ తన తోటను నాశనం చేయకుండా జాగ్రత్తగా ఉండేవాడు. తోటలో పండ్లను దించేటప్పుడు బీదలను పిలిచి వారికి ఉదారంగా తన ఫలసాయం నుంచి పంచి పెట్టేవాడు. అంతేకాదు, తోటలో దించకుండా మిగిలిపోయిన పండ్లను దించుకునే అనుమతి బీదలకు ఇచ్చేవాడు.
ముగ్గురు కుమారులు
ఆ ముసలి వ్యక్తికి ముగ్గురు కుమారులు. అందులో ఇద్దరు తమ తండ్రికి పూర్తి విరుద్ధమైన స్వభావం కలిగిన వారు. తమ తండ్రి ఉదారంగా చేసే దానధర్మాలు వారికి సహించేవి కావు. వారిలో ఒకడు తండ్రితో, “మీరు బీదలకు అంతా పంచి పెట్టి మాకు రావలసిన వాటా తగ్గిపోయేలా చేస్తున్నారు” అని కూడా అన్నాడు. రెండవ కుమారుడు మరింత ముందుకు పోయి, ”మీ దానధర్మాలు చివరకు మనల్ని కూడా బిచ్చగాళ్ళయ్యేలా చేస్తాయి” అన్నాడు. ఇది విన్న మూడవ కుమారుడు జవాబు చెప్పబోయాడు. కాని తండ్రి అతడిని వారించాడు. ఆ ముసలి వ్యక్తి తన కుమారులను విచారంగా చూస్తూ, “పిల్లల్లారా! నేను దానధర్మాలు చేయడం వల్ల మనం బీదవాళ్ళమై పోతామని మీరనుకోవడం చాలా పొరపాటు. ఇది స్వార్థపూరితమైన ఆలోచన. మీరు కోరుతున్న ఈ సంపద నిజానికి మీది కాదు, నాది కాదు. ఈ సంపద అల్లాహ్ ది. నేను కేవలం ఈ సంపదకు పర్యవేక్షకుడిని మాత్రమే. ఈ సంపదను కేవలం నా స్వంతానికి మాత్రమే ఖర్చు చేసుకునే అనుమతి నాకు లేదు. అల్లాహ్ సృష్టించిన మిగిలిన వారికి కూడా దీనిలో భాగం ఉంది. ముఖ్యంగా బీదలకు, బాటసారులకు, అవసరార్థులకు ఇందులో భాగం ఉంది. పక్షులు, క్రిమి కీటకాలకు కూడా ఇందులో భాగం ఉంది. ఎందుకంటే, అవి కూడా అల్లాహ్ సృష్టిలోనివే. ఆ తర్వాత మిగిలినదే మనది. ఆ విధం గానే మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకోగలడు. సౌభాగ్యాన్ని, సంపదలో వృద్ధిని పొందగలడు. నేను ఈ విధానాన్ని నా యవ్వనం నుంచి అనుసరిస్తూ వస్తున్నాను. మరణించే వరకు ఈ పద్ధతికే కట్టుబడి ఉంటాను.
ఇప్పుడు నేను ముసలివాడినై పోయాను. నా శరీరం వ్యాధులతో క్రుంగిపోయింది. నా చావు ఇక ఎంతో దూరంలో లేదు. కాబట్టి ఇదంతా మీరు స్వంతంచేసుకునే రోజు పెద్ద దూరంలో లేదు. అప్పుడు మీ ముందు రెండు దారులుంటాయి. మీరు కూడా నా మాదిరిగా మీ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తే అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాని మీరు స్వార్థపరులై సంపదనుఅల్లాహ్ మార్గంలో ఖర్చు చేయకపోతే మీరు ఆయన అనుగ్రహాలను కోల్పోవడమేకాదు, చివరకు ఉత్త చేతులతో మిగులుతారు. కాబట్టి కుమారులారా! అల్లాహ్మనల్ని ఇలా ఉండాలని ఆదేశిస్తున్నాడు” అని చెప్పాడు.
ఈ సంభాషణ జరిగిన కొంత కాలానికే ఆ ముసలి వ్యక్తి మరణించాడు.తర్వాత తోటలో పండ్లు దించే సమయం వచ్చినప్పుడు బీదలు ఎప్పటి మాదిరిగా అక్కడకు వచ్చి తమకు కూడా ఇవ్వడం జరుగుతుందని ఎదురు చూడసాగారు.కాని ఇప్పుడు ఆ తోటకు యజమానులు కుమారులు. వాళ్ళు బీదలకు తోటలోలభించే పండ్లలో ఏదీ ఇవ్వరాదని, బాటసారులు తోటలో ప్రవేశించే అనుమతి ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు. కాని మూడవ కుమారుడు తండ్రిని పోలినవాడు. అతను తన సోదరులతో, “మీరు చెప్పే మాటలు దుర్మార్గంతో కూడుకున్నవి. దుర్మార్గం చెడును కొనితెస్తుంది. బీదలను కాదనడం ద్వారా మనం ప్రయోజనాలు పొందలేం. పైగా మనం స్వయంగా ఇబ్బందులకు గురికావచ్చు. కాబట్టి అల్లాహ్ ప్రసాదించిన ఈ సంపద మన తండ్రి వద్ద ఉన్నప్పుడు ఆయన ఎలా ఇచ్చేవారో అలాగే ఇవ్వడం మంచిది” అన్నాడు. కాని సోదరులు ఈమాటలకు ఆగ్రహించి, “నీకు సంబంధంలేని వ్యవహారాల్లో మాకు సలహాలు ఇవ్వవద్దు. నాన్న బ్రతికి ఉన్నప్పుడు చాలా సలహాలు తీసుకున్నాం” అన్నారు.కాని మూడవ కుమారుడు తన పట్టు వదల్లేదు. ”మనం అల్లాహ్ ను ప్రార్థించి అల్లాహ్ మార్గదర్శనాన్ని కోరుకుందాం.. ప్రార్థన మనిషిని చెడు నుంచి కాపాడుతుంది” అన్నాడు. కాని సోదరులు అతని మాటలను ఏమాత్రం లక్ష్యపెట్టలేదు.
మరుసటి రోజు తెల్లవారుజామున లేచి తోటలోని పండ్లను దించి తామేపంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలాగే మరుసటి రోజు తెల్లవారుజామున తోటకు వెళ్ళారు. కాని అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. వారి తోట పరిస్థితే మారిపోయింది. అంతా నాశనమై పోయింది.అసలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా మారిపోయింది.
ఈ వార్త మూడవ కుమారునికి తెలిసి, “మీ దుర్మార్గపు ఆలోచనల వల్లఏమయ్యిందో చూడండి” అని వ్యాఖ్యానించాడు. ఇద్దరు సోదరులు తమ తప్పు తెలుసుకుని అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. “మా ప్రభువు పరిశుద్ధుడు.. నిజంగానే మేము పాపాత్ములం… మన ప్రభువు దీనికి బదులు దీనికన్నా మెరుగైన తోటను మనకు ప్రసాదించడం అసంభవమేమీ కాదు” అన్నారు.(చదవండి దివ్యఖుర్ఆన్ : 68:17-33)
గ్రహించవలసిన పాఠాలు
అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దానితో మనం ఏం చేస్తామో పరీక్షిస్తాడు. ఆ సంపదలో బీదలకు, అవసరార్థులకు, బాటసారులకు ఇవ్వడానికి నిరాకరిస్తే అల్లాహ్ సంపదను తీసుకుని అనేక విధాలుగా శిక్షిస్తాడు. మనం చేసిన తప్పుకు చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడితే, అల్లాహ్ తాను తీసుకున్న దానికన్నా మెరుగైనది ప్రసాదిస్తాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
హునైన్ యుద్ధం జరిగిన రోజున అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు. కాని ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకై పోయింది. అప్పుడు మీరు వెన్ను చూపి మరలిపోయారు. ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరపు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. (9:25,26)
తాయిఫ్ నగరానికి మాజీ నాయ కుడు జురైజ్. ఆయన వయోవృద్ధుడు, అంధుడు. యుద్ధతంత్రాల గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన, ఒక ఒంటె మీద కూర్చొని ఉన్నాడు. సేవకుడు ఒంటె తోలుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం తాము ఏ ప్రదేశంలో ఉన్నామని ఆయన తన సేవకుణ్ణి అడిగాడు. అది ఔతాస్ ప్రదేశమని సేవకుడు చెప్పాడు. అక్కడే విడిది చేయమని జురైజ్ తన ప్రజలకు సలహా ఇచ్చాడు. ఆ ప్రదేశం కొండలేవీ లేకుండా, మరీ సమతలంగాను కాకుండా చాలా అనుకూలంగా ఉంది.
అక్కడికి కొద్దిదూరంలో ఆయనకు స్త్రీల, పిల్లల శబ్దాలు, జంతువుల అరుపులు వినిపించాయి. అక్కడ ఎవరున్నారని ఆయన తన సేవకుల్ని అడిగాడు. “మన కొత్త నాయకుడు మాలిక్ ప్రజలను యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు. ధనసంపదల్ని, భార్యాబిడ్డల్ని సైతం వెంటబెట్టు కొని ఒక చోట సమావేశం అవమని ఆయన ప్రజలకు ఆదేశించాడు” అని సేవకులు జురైజ్ కు తెలిపారు. తనను ఆ కొత్త నాయకుని వద్దకు తీసుకువెళ్ళమని జురైజ్ సేవకుల్ని కోరాడు. సేవకులు ఆయన్ని మాలిక్ దగ్గరికి తీసుకు వెళ్ళారు. జురైజ్, మాలిక్ ను “ఏం జరుగుతుందిక్కడ?” అని అడిగాడు. దానికి మాలిక్ బదులిస్తూ, “ముహమ్మద్ ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాకుండానే నిక్షేపంగా మక్కాలోకి ప్రవేశించాడు. మక్కా తర్వాత పెద్ద నగరం మాదే. కనుక భవిష్యత్తులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై కూడా దాడి చేయవచ్చు. హవాజిన్, నస్ర్, జుషామ్, సఖీఫ్ మొదలగు తాయిఫ్ తెగలన్నీ కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద మెరుపుదాడి చేయాలని నిశ్చయించాయి” అని చెప్పాడు. అది విని జురైజ్, “మరయితే ఇక్కడ పశువుల అరుపులు, చిన్న పిల్లల ఏడుపులు ఎందుకు వినపడుతున్నాయి?” అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ మాలిక్, “మనవాళ్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సైన్యాన్ని చూసి బెదిరిపోయి యుద్ధం చేయకుండా ఉంటారేమోనని నాకు భయంగా ఉంది. అందుకని నేను వారి స్త్రీలను, పిల్లలను యుద్ధ మైదానానికి వెంట తీసుకొచ్చాను. తమ భార్యాబిడ్డల్ని, సిరిసంపదల్ని కాపాడుకోవటానికి అయినా మన సైనికులు తప్పకుండా యుద్ధం చేయవలసి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. దానికి జురైజ్ తల అడ్డంగా ఆడిస్తూ, “ఈ విషయంలో నేను నీతో ఏకీభవించలేను. మీరు ఓడిపోతే మీ భార్యాబిడ్డల ముందే అవమానం పాలవుతారు. కాబట్టి వీళ్లను యుద్ధమైదానం నుంచి పంపేయండి” అని సలహా ఇచ్చాడు. కాని మాలిక్ మాత్రం తల పొగరుతో, “నీవు ముసలోడివై పోయావు. యుద్ధ తంత్రాలకు సంబంధించి నీ విద్యలకు కాలం చెల్లింది. ఈ విషయాలను నువ్వు పట్టించుకోకు. ‘నీ కన్నా సమర్థవంతులే ఈ వ్యవహారా లను పర్యవేక్షిస్తున్నారు” అన్నాడు.
మొత్తానికి వారు ముస్లింలపై మెరుపుదాడి చేయటానికి గట్టిగా నిశ్చయించుకున్నారు.
ఓటమి తీరంలో…
మక్కాను జయించి మదీనాకు బయలుదేరారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). మార్గ మధ్యంలో ఆయనకు కొన్ని తెగలు తమ మీద దాడి చేయటానికి పూనుకున్నాయన్న వార్త అందింది. మదీనాకు చేరుకున్న తర్వాత ఆయన ముస్లింలకు, ఆయుధాలు దింపవద్దని ఆదేశించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదని చెప్పారు. అరేబియాలో అవిశ్వాసులకు గట్టి పట్టు ఉన్న చివరి ప్రాంతం తాయిఫ్. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిం సైన్యాలను అటు వైపు నడిపించారు. తన తెల్లటి కంచర గాడిదపై స్వారీ చేస్తూ ఉన్నారాయన.
దాని పేరు దుల్ దుల్. ముస్లింలు సూర్యాస్తమయానికి ముందే తాయిఫ్ నగరానికి దగ్గర్లోని హునైన్ పర్వతాల వద్దకు చేరుకున్నారు. అయితే హఠాత్తుగా అవిశ్వాసులు అన్ని వైపుల నుంచి ముస్లింలపై దాడి చేశారు. ఆ హఠాత్పరిణామానికి ముస్లింలు కకావికలయ్యారు. ముస్లిం సైన్యం ఛిన్నాభిన్నమైపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆందోళనకు గురయ్యారు. కలసికట్టుగా పోరాడమని ముస్లింలను పిలిచారు. కాని ఆ స్థితిలో ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూస్తే అబూబక్ర్, ఉమర్, అలీ, అబూ సుఫ్యాన్, ఇంకా తన వంశస్తులు మరికొంత మంది మాత్రమే ఆయనకు కనిపించారు. అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) తన భావాలను అణచుకోలేకపోయారు. బిగ్గరగా అరుస్తూ, “అల్లాహ్ సాక్షి! ఇక మనం ఓడిపోయినట్లే. అవిశ్వాస సైన్యాలను సముద్ర కెరటాలే ఆపగల్గుతాయి” అన్నారు.
అటు శత్రువుల వైపు నుంచి హంబల్ కుమారుడు కలాదా గట్టిగా అరుస్తూ, “నేటితో ముహమ్మద్ మంత్రజాలం అంతమైపోతుంది” అన్నాడు. అన్సార్లనందరినీ తిరిగి కూడగట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబ్బాస్ (రదియల్లాహు అన్హు)కు ఆదేశించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు), “ఓ అన్సార్లారా!, దైవప్రవక్త కోసం ప్రాణార్పణకు సిద్ధపడ్డ వీరుల్లారా!, శత్రువులకు వ్యతిరేకంగా తనకు సహాయపడమని ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు” అని ఎలుగెత్తి ప్రకటించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు) పిలుపు తమ కర్ణపుటాలకు తాకగానే అన్సార్ యోధులు, పారిపోతున్న వారల్లా వెనక్కి తిరిగి, “లబ్బైక్ యా రసూలల్లాహ్, లబ్బైక్ (దైవప్రవక్తా! వచ్చేస్తున్నాం)” అంటూ పరుగెత్తుకొచ్చారు. క్షణాల్లో ముస్లిం సైన్యం బారులు తీరింది. దృఢచిత్తులైన యోధులతో ముస్లిం సైన్యం అవిశ్వాసులపై ఉవ్వెత్తున ఎగిసిపడింది. ముస్లింల ధైర్యం అవిశ్వాసులకు సముద్రంలో తుఫానులా అగుపించింది. భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని, వెంటతెచ్చిన సామగ్రినంతటిని వదలి పెట్టేసి, యుద్ధమైదానం నుంచి పలాయనం చిత్తగించారు అవిశ్వాసులు. (చదవండి, ఖుర్ఆన్ 9: 25)
తాయిఫ్ ముట్టడి
హునైన్ యుద్ధమైదానం నుంచి పారిపోయిన బనూ సఖీఫ్ తెగ తాయిఫ్ నగరంలోకి జొరబడింది. ఈ నగరంలో పటిష్టమైన కోటలెన్నో ఉన్నాయి. రక్షణ నిమిత్తం నగరం చుట్టూ ఎన్నో ప్రాకారాలు నిర్మించబడి ఉన్నాయి.
ముస్లిం సైనికులు వారిని వెంబడించారు, కాని వారు అప్పటికే తమ కోటల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఒక యేడాదికి సరిపోయే ఆహారం కూడా వారు ముందే కోటలో సమకూర్చుకొని పెట్టుకున్నారు. ముస్లిం సైనికులు సాహసం చేసి ప్రహరీ గోడలు దూకి లోనికి ప్రవేశించారు. కాని అవిశ్వాసులు పైనుంచి వారిపై ధారాపాతంగా బాణాల వర్షం కురిపించారు. దాని వల్ల ఎంతో మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. అయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముట్టడిని ఆపలేదు. పగలు, రేయి ఇరవై రోజుల వరకూ ఈ యుద్ధం కొనసాగింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక చెక్క ట్యాంకును తయారు చేసి దాన్ని బండి చక్రాలపై బిగించారు. ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధ ట్యాంకుగా దీన్ని చెప్పుకోవచ్చు. కొంత మంది సైనికులు ఆ ట్యాంకులో కూర్చున్నారు. తర్వాత ఆ ట్యాంకును ప్రాకారంలోనికి నెట్టటం జరిగింది. అయితే ప్రతిఘటించేవారు కూడా బాగా తెలివైనవారే. ఇనుమును బాగా కాల్చి మండుతున్న ఆ ఇనుప ముక్కల్ని వారు చెక్క ట్యాంకులపై విసరివేయసాగారు. కాలుతున్న చెక్క ట్యాంకుల నుంచి బయటపడి, పారిపోతూ వున్న ముస్లిం సైనికుల్ని శత్రువులు బాణాలతో ఏరివేయటం ప్రారంభించారు.
ఖర్జూర చెట్లను, ద్రాక్ష తోటల్ని నరికివేస్తామని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోటలోని వారిని బెదిరించారు. దాని వల్ల మరుసటి యేడు శత్రువులకు ధాన్యపు గింజలు ఉండవు. అందుకు భయపడి శత్రువులు లొంగిపోతారేమోనని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశించారు. అయితే బనూ సఖీఫ్ తెగవారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు రాయబారం పంపించారు. చెట్లు రాతి నేలలో నాటబడి ఉన్నందున వాటిని గనక ఒకసారి ధ్వంసం చేస్తే మళ్లీ ఆ నేలలో చెట్లు పెరగవనీ, అలా చేయకుండా కేవలం పంట వరకు తీసుకోవలసిందని వారు దైవప్రవక్తను కోరారు. చెట్లు నరకటం వల్ల శాశ్వత నష్టం వాటిల్లుతుందని గ్రహించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ నిర్ణయం మానుకున్నారు.
తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరో పద్ధతిలో దాడి చేయాలని నిర్ణయించారు. కోటపై నిప్పుల బాణాలు కురిపించి, మెరుపుదాడుల్లో తర్ఫీదైన సైనికుల్ని కోట పైకి వదలాలని అనుకున్నారు అయితే అంతలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆ నగరంతో ప్రగాఢమైన అనుబంధం ఉంది, తాను ఒక నిస్సహాయ అనాధునిగా ఉన్నప్పుడు తనను పెంచి పోషించిన హలీమా దాది ఆ నగరంలోనే నివసించేవారు. ఆ విషయం గుర్తుకు రాగానే ఆయన మనసు ద్రవించిపోయింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు ఇండ్ల నుంచి బయలుదేరి అప్పటికి రెండు మాసాలు గడిచిపోయాయి. త్వరలో జుల్ ఖాదా నెల కూడా ప్రారంభం కానుంది. ఆ నెలలో యుద్ధం చేయటం నిషిద్దం. అందుకని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక నిర్ణయానికి వచ్చారు. శత్రువులకు ఓ సందేశం పంపిస్తూ తాము తాయిఫ్ ముట్టడిని ఎత్తివేస్తున్నామనీ, ఈ విషయమై చర్చించటానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపమని ఆ సందేశంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శత్రువులను కోశారు. అక్కణ్ణుంచి బయలుదేరే ముందు శత్రువుల నగరంపై శాపం పెట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సహచరులు కోరారు. కాని ఆయన మాత్రం, తాయిఫ్ వాసులకు సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థించారు.
ముస్లింలు మరుసటి సంవత్సరం తిరిగొచ్చి తమ చెట్లను నరికివేశారంటే ఇక తమకు చావు తప్పదని గ్రహించిన శత్రువులు, ముస్లింలపై దాడి చేయటం, వారిని ఎదిరించటం సముచితం కాదని భావించారు. ఇరువర్గాల మధ్య ఒక ఒప్పందం తీసుకువచ్చే విషయమై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని మదీనా పంపించారు. వారి రాక గురించి తెలుసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో సంతోషించారు.
బనూ సఖీఫ్ బృందం మదీనా నగరానికి చేరుకుంది. చూస్తే అక్కడి ప్రజలందరూ ముస్లింలుగా మారి ఉన్నారు. వారి మొండితనం మెత్తబడింది. ఇప్పుడిక తాము ముస్లింల ముందు లొంగిపోవటమే సముచిత మని భావించారు వారు. కాని ఒక షరతు మీద ఇస్లాంలోకి ప్రవేశించాలని వారు భావించారు. మూడు సంవత్సరాల వరకు తమ విగ్రహాలను పూజించుకోవటానికి అనుమతి ఇవ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కోరారు. కాని దైవప్రభక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ షరతును అంగీకరించలేదు. కనీసం ఒక్క సంవత్సరమైనా పూజించు కోనివ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను బ్రతిమాలారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ససేమిరా అన్నారు. కనీసం ఆరు నెలల కోసమైనా అనుమతించండి దైవప్రవక్తా! అని విన్నవించుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తౌహీద్ (ఏకదైవారాధన) విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ తాను రాజీపడేదిలేదని, ఖరాకండిగా చెప్పేశారు. ఎట్టకేలకు తాయిఫ్ వాసులు లొంగిపోయారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాయిఫ్ వాసుల పట్ల ఎంతో కరుణావాత్సల్యాలతో వ్యవహరించారు. హునైన్ యుద్ధంలో పట్టుబడిన వారి బందీలను విడుదల చేశారు. ఒకప్పుడు తాయిఫ్ వాసులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను రాళ్లతో కొట్టి ఆయన రక్తం కళ్లచూశారు. తనకు సహాయం చేయమని కోరటానికి వెళితే అత్యంత పరాభవ స్థితిలో నగరం నుంచి వెడలగొట్టారు. అయినా కూడా ప్రస్తుతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవేవీ పట్టించుకోలేదు, బేషరతుగా వారి బందీలను విడిచి పెట్టారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవలంబించిన ఉదార వైఖరి వారి మనసుల్ని చాలా ప్రభావితం చేసింది. వారి మనసులు ఇస్లాం వైపు మొగ్గాయి. వారందరూ దృఢమైన ముస్లింలుగా మారిపోయారు.
గ్రహించవలసిన పాఠాలు
విధ్వంసంతో కూడిన విజయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశయం కాదు. యుద్ధ సమయంలో ఆయన మనుషులనే కాదు, వృక్షజాతి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. తాయిఫ్ నగరాన్ని చూడగానే ఆయనకు తన బాల్యం గుర్తుకు వచ్చింది. చిన్నతనంలో తనను అల్లారుముద్దుగా పెంచిన ‘హలీమా అమ్మ’ ఆ నగరంలోనే నివసించేదని గుర్తుకురాగానే ఆయన హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన యుద్ధ తంత్రంలో మార్పులు చేసుకున్నారు.
ప్రాణ శత్రువులను సైతం శపించకుండా, వారు సన్మార్గంపైకి రావాలని ప్రార్ధించటం ఆయన ఔదార్యాన్ని చాటిచెబుతోంది.
తౌహీద్ విషయంలో ఎన్నటికీ రాజీపడకూడదు.
శత్రువులు వ్యక్తిగతంగా తనను ఎంతో బాధపెట్టారు. అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా వారిపట్ల కరుణా వాత్సల్యాలతోనే వ్యవహరించారు. ఫలితంగా ప్రాణశత్రువులు సైతం ప్రాణ మిత్రులుగా మారి ఇస్లాంలో దృఢవిశ్వాసులుగా రాణించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“చివరికి మేము ఖారూన్ ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.” ( సూరా అల్ ఖసస్ 28: 81)
ఖారూన్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో జీవించేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖవిలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో విర్రవీగేవాడు.
ఖారూన్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిం దాని మిడిసిపడేవాడు.
జకాత్* చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి చెప్పారు. జకాత్ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాటా. విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. కాని ఈ సలహా విన్న ఖారూన్ కోపంతో మండిపడ్డాడు. తనపై అల్లాహ్ అనుగ్రహం వర్షిస్తుందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూసా (అలైహిస్సలాం)తో చెప్పాడు. తన జీవిత విధానాన్నిఆమోదించినందు వల్లనే అల్లాహ్ తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి నచ్చ జెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు.
* జకాత్ అంటే పేదల కోసం, సమాజ శ్రేయస్సు కోసం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్ట వలసిన సొమ్ము
చివరకు ఖారూన్ తన సంపదపై జకాత్ లెక్కించాడు. జకాత్ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది. అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లనిపించింది. జకాత్ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తన స్వార్థప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. ప్రవక్త మూసా (అస)కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమందికి లంచాలు కూడా ఇచ్చాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) గురించి నానావిధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.
ఖారూన్ కుట్రల గురించి అల్లాహ్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం)ను హెచ్చరించాడు. ఖారూన్ పిసినారితనానికి, అల్లాహ్ చట్టాల పట్ల అతని తిరస్కారానికిగాను అతడిని శిక్షించాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ ను ప్రార్దించారు. అల్లాహ్ ఆగ్రహం ఖారూన్ పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులుబారి ఖారూన్ సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదను తనలో కలిపేసుకుంది. ఖారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచిపెట్టుకు పోయాడు. ఖారూన్ సంఘటన మూసా (అలైహిస్సలాం) జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలి పోయింది.
ఈ విషయమై దివ్య ఖుర్ఆన్లో ఇంకా ఏముందంటే, ఖారూన్ సంపదను చూసి ఈర్ష్యపడిన వారు, అప్పటి వరకు ఖారూనను కీర్తించడమే ఘనకార్యంగా భావించిన వారు ఈ సంఘటన తర్వాత, “అల్లాహ్ ఎవరికి తలచుకుంటే వారికి సంపద ఇస్తాడు. ఎవరికి తలచుకుంటే వారికి నిరాకరిస్తాడు. మనపై అల్లాహ్ అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మ్రింగేసి ఉండేది. అల్లాహ్ ను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించలేరు. ఈ ప్రపంచంలో ఔన్నత్యాన్ని కోరుకోని వారికి, దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి” అనడం ప్రారంభించారు.
గ్రహించవలసిన పాఠాలు
ఖారూన్ వంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను, అప్పటి కష్టాలను మరచి పోతారు. తాము కష్టపడి, శ్రమించి తమ తెలివితేటలతో సంపాదించిందే అంతా అనుకుంటారు. అందులో అల్లాహ్ కారుణ్యం లేదని భావిస్తారు. అల్లాహ్ పట్ల ఏలాంటి కృతజ్ఞత చూపించరు. అల్లాహ్ ఆదేశాలను విస్మరిస్తారు. బీదసాదలకు ఏలాంటి సహాయం అందించడం వారికి ఇష్టం ఉండదు. పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా, అనవసరమైన ఆడంబరాల ద్వారా, ఖరీదైన దుస్తులు, వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ విర్రవీగు తుంటారు. మరికొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు. పిల్లికి బిచ్చమెత్తని ధోరణి ప్రదర్శిస్తారు. స్వంతం కోసం, తమ కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడుతారు. సంపద పోగుచేయడంలోనే మునిగిపోతారు. కాని ఇలాంటి వారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మరచిపోతుంటారు.
అల్లాహ్ నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు. లేనట్లయితే సంపద కలుషితమై పోతుంది. సంపద ఒక శాపంగా మారిపోతుంది. తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లాహ్ అభివర్ణిస్తున్నాడు. అల్లాహ్ కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందడం అన్నది మనిషికి ఎంత గౌరవప్రదం! ఎంత శుభప్రదం!!
అల్లాహ్ మనిషికి ధనసంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు (అమానత్-అంటే ఏదన్నా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించడం), ధనసంపదలు కూడా అల్లాహ్ మనిషికి అప్పగించిన అమానత్ (అప్పగింత). తాను ఇచ్చిన ధనసంపదలతో ఎవరు ఏం చేస్తారన్నది చూడడానికి అల్లాహ్ వాటిని ప్రసాదిస్తాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
మంచికైనా చెడుకైనా మనిషి నాలుక, హృదయాలే మూలమని చెప్పిన మహానుభావుడు లుక్మాన్
లుక్మాన్ (అలైహిస్సలాం) ఆఫ్రికా ఖండంలో జన్మించారు. ఆయన అడవుల్లో పెరిగి పెద్దయ్యారు. అడవుల్లో కాలికి చెప్పులు కూడా లేకుండా తిరిగేవారు. కేవలం ఒక వస్త్రాన్ని చుట్టుకుని అడవుల్లో వన్య మృగాలతో పాటు ఉండేవారు. అడవిలో జీవితం, రోజూ అడవి మృగాలతో తల పడడం – ఈ విధంగా ఆయన కఠిన మైన జీవితాన్ని గడిపేవారు. భయం అంటే ఎరుగని వ్యక్తిత్వాన్ని సంతరిం చుకున్నారు. తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి దీర్ఘంగా ఆలోచించేవారు. ఈ ఆలోచనల వల్ల అనేక కొత్త విషయా లను ఆయన తెలుసుకున్నారు.
బానిసత్వం
ఆఫ్రికాపై దండెత్తిన బానిస వ్యాపారులు ఆయన్ను నిర్బంధించారు. ఆయన్ను ఒక బానిసగా అమ్మివేశారు. తన స్వేచ్ఛా స్వాతంత్రయాలు కోల్పోయా రాయన. స్వేచ్ఛగా తిరగడానికి లేదు, మాట్లాడడానికి లేదు. జీవితంలో ఎదు రైన ఈ కష్టాన్ని ఆయన భరించారు, సహనం వహించారు. అల్లాహ్ అనుగ్రహం కోసం ఎదురుచూడసాగారు.
ఆయన్ను కొనుక్కున్న వ్యక్తి మంచి మనిషి. తెలివి, వివేకం కలిగినవాడు. అతను లుక్మాన్ను దయగా చూసేవాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) సాధారణమైన వ్యక్తి కాదని అతను గుర్తించాడు.
లుక్మాన్ వివేకానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒక రోజు లుక్మాన్ను పిలిచి గొర్రెను కోసి అందులో అత్యంత చెడ్డ భాగాలు తన వద్దకు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) ఒక గొర్రెను కోసి దాని గుండె, నాలుకలను తీసుకుని యజమాని వద్దకు వెళ్ళారు. లుక్మాన్ తీసుకొచ్చిన వాటిని చూసి యజమాని మెచ్చుకోలుగా చిరు నవ్వు నవ్వాడు. శరీరంలో అత్యంత చెడ్డ భాగాలుగా గుండె, నాలుకలను తీసుకు వచ్చిన ఎన్నిక ఆయనకు నచ్చింది. లుక్మాన్ (అలైహిస్సలాం) చాలా లోతయిన విషయాన్ని ఈ విధంగా చెప్పారని అతను అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి యజమాని లుక్మాన్ (అలైహిస్సలాం) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రారంభించాడు. ఆయన్ను మరింత ఆదరంగా చూడసాగాడు.
కొన్ని రోజుల తర్వాత యజమాని లుక్మాన్ను మళ్ళీ పిలిచి ఈసారి గొర్రెను కోసి దానిలో అత్యంత ఉత్తమమైన అవయవాలు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ యజమాని చెప్పినట్టు చేశారు. కాని విచిత్రంగా ఈసారి కూడా గొర్రె గుండె, నాలుకలే తీసుకువచ్చారు. యజమాని వాటిని చూసి శరీరంలో అత్యంత చెడ్డ భాగాలు, మంచి భాగాలు రెండు కూడా ఇవే ఎలా అవుతాయని ప్రశ్నించాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) యజమానికి సమాధానమిస్తూ, “మనిషి మంచివాడైతే అతని గుండె, నాలుకలు చాలా ఉత్తమమైన భాగాలు, మనిషి చెడ్డవాడైతే అతని గుండె, నాలుకలు అత్యంత చెడ్డ భాగాలు” అన్నారు. ఈ సంఘటన తర్వాతి నుంచి యజమాని లుక్మాన్ పట్ల అత్యంత గౌరవాదరాలు చూపడం ప్రారంభించాడు. చాలామంది లుక్మాన్ వద్దకు సలహా కోసం కూడా వచ్చేవారు. ఆయన వివేక విచక్షణలు, తెలివితేటలు యావత్తు రాజ్యంలో మారు మోగిపోసాగాయి.
స్వేచ్ఛ
యజమాని తన కుటుంబ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తన మరణానంతరం లుక్మాన్ (అలైహిస్సలాం)కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పాడు. యజమాని మరణించిన తర్వాత లుక్మాన్ (అలైహిస్సలాం)కు స్వాతంత్ర్యం లభించింది. ఆయన (అలైహిస్సలాం) అక్కడి నుంచి బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి చివరకు బనీ ఇస్రాయీల్ వద్ద స్థిరపడ్డారు. దావూద్ (అలైహిస్సలాం) పాలనా కాలంలో ఆయన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. మహావివేకంతో, విచక్షణతో, నిష్పక్షపాతంగా ఆయన ఇచ్చే తీర్పులు చాలా ప్రసిద్ధి పొందాయి. అక్కడే ఆయన పెళ్ళి చేసుకుని సంసార జీవితాన్ని గడిపారు.
లుక్మాన్ తన కుమారుడికి చేసిన బోధ దివ్యఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది:
మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.
ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో. అయితే (మార్గానుసరణ విషయంలో మాత్రం) నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తరువాత మీరంతా నా వైపుకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ తెలియపరుస్తాను.”
(లుఖ్మాన్ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు.
“ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.
“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.”
(దివ్యఖుర్ఆన్ 31 : 13-19)
గ్రహించవలసిన పాఠాలు
మనిషి మంచివాడు లేదా చెడ్డవాడన్నది అతని హృదయం, నాలుకల వల్ల తెలుస్తుంది. ఈ రెండు అవయవాలను ఎలా వాడాలన్నది మనిషి చేతుల్లో ఉంది.
మంచి యజమాని తన వద్ద ఉన్న వివేకవంతులైన నౌకర్లను గౌరవించాలి.
లుక్మాన్ తన కుమారునికి ఇచ్చిన సలహాను అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ప్రస్తావించి మానవాళికి ఒక ఉదాహరణగా చూపించాడు. ఈ సలహాను యావత్తు మానవాళి మార్గదర్శక సూత్రంగా అనుసరించవలసి ఉంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, తఫ్సీరే ఖుర్ఆన్ (ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం) తెలుసుకోవలసిన ఆవశ్యకతపై దృష్టి సారించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ ఖుర్ఆన్‌ను అవతరింపజేసి, దాని వివరణ బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు. ఖుర్ఆన్‌ను కేవలం అనువదించి చదవడం సరిపోదు, ఎందుకంటే దాని యొక్క లోతైన భావాన్ని మరియు ఆదేశాలను అర్థం చేసుకోవడానికి తఫ్సీర్ అవసరం. సహాబాలు (ప్రవక్త అనుచరులు) అరబీ భాషలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ, వారు కూడా కొన్ని ఆయతుల యొక్క వివరణ కోసం ప్రవక్తపై ఆధారపడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ఆయతులను హదీసుల ద్వారా వివరించారు. ఉదాహరణకు, ఉపవాసానికి సంబంధించిన ఆయత్‌లోని “తెల్లని దారం, నల్లని దారం” అనే పదాన్ని మరియు విశ్వాసాన్ని పాడుచేసే “జుల్మ్” (అన్యాయం) అనే పదాన్ని ప్రవక్త ఎలా వివరించారో ఈ ప్రసంగంలో స్పష్టంగా చెప్పబడింది. సరైన మార్గదర్శకత్వం కోసం ఖుర్ఆన్, సహీ హదీసులు, మరియు సహాబాల అవగాహన ఆధారంగా తఫ్సీర్‌ను నేర్చుకోవాలని నొక్కి చెప్పబడింది.
అల్ హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్.
ప్రియ విద్యార్థులారా!ఈ రోజు తఫ్సీర్ క్లాస్‌లో మన యొక్క అంశం, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి?
సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇంతకుముందు కాలాల్లో ఏ ప్రవక్తలైతే వచ్చారో ఆ ప్రవక్తలపై గ్రంథాలు అవతరింపజేసి వాటి యొక్క వివరణ స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలిపి ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలన్నటువంటి బాధ్యత ప్రవక్తలకు అప్పగించాడు. ఆ పరంపరలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిట్టచివరి ప్రవక్తగా చేసి పంపాడు.
అయితే, ప్రవక్తలపై అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాల రీతిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసి, ఖుర్ఆన్‌తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చి, ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలని చాలా స్పష్టంగా తెలిపాడు.
ఖుర్ఆన్ అవతరణ మరియు దాని వివరణ
సూరతుల్ హదీద్, ఆయత్ నంబర్ 25లో,
لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ (లఖద్ అర్సల్నా రుసులనా బిల్ బయ్యినాతి వ అన్జల్నా మ’అహుముల్ కితాబ వల్ మీజాన లియఖూమన్నాసు బిల్ ఖిస్త్) వాస్తవానికి మేము మా ప్రవక్తలను స్పష్టమైన నిదర్శనాలతో పంపాము. ప్రజలు న్యాయంపై నిలబడాలని మేము వారితో పాటు గ్రంథాన్ని, త్రాసును అవతరింపజేశాము. (57:25)
అయితే, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు, ఈ విషయం మనందరికీ తెలిసినదే. రమదాన్‌కు సంబంధించిన ఆయత్ ఏదైతే ఉందో, ‘షహ్రు రమదానల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆను హుదల్లిన్నాసి వబయ్యినాతిమ్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్’. ఇంకా వేరే అనేక సందర్భాల్లో, సూరె ఆలి ఇమ్రాన్ ప్రారంభంలో అనేక సందర్భాల్లో ఆయతులు ఉన్నాయి. అయితే, ఖుర్ఆన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సర్వ మానవాళి మార్గదర్శకత్వానికి ఇచ్చి పంపాడు. అయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేసి సర్వ మానవాళికి సన్మార్గం చూపాలని, తెలియజేయాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ఇచ్చాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు ఈ ఖుర్ఆన్ బోధ చేస్తూ ఉండేవారు. మరియు ఈ ఖుర్ఆన్‌తో పాటు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చాడు. ఈ విషయం ఖుర్ఆన్‌లో అనేక సందర్భాల్లో ఉంది. సూరతుల్ బఖరాలో, సూరత్ ఆలి ఇమ్రాన్‌లో, సూరతుల్ జుముఆలో. ప్రత్యేకంగా దీని కొరకు “అల్ హిక్మ” అన్న పదం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉపయోగించాడు. మరియు ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ దాని యొక్క వ్యాఖ్యానంలో, వ్యాఖ్యానకర్తల ఏకాభిప్రాయం తెలియజేశారు, అల్ హిక్మ అంటే ఇక్కడ అల్ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు అని.
అయితే ఈ రోజు మన యొక్క ప్రసంగం అంశం, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? అయితే ఎప్పటివరకైతే మనం ఖుర్ఆన్ దాని యొక్క కేవలం అర్థం చదువుతామో, దాని యొక్క తఫ్సీర్, దాని యొక్క వ్యాఖ్యానం తెలుసుకోమో, చాలా విషయాలు మనకు అస్పష్టంగా ఉంటాయి. ఎందుకు? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు, వారు అరబీ తెలిసినవారు, అరబీ భాషలో ఎంతో ప్రావీణ్యత, ఎంతో వారికి అనుభవం ఉన్నప్పటికీ, ఎన్నో ఆయతుల భావాన్ని, భావాలను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరిచి చెప్పాడు, విడమరిచి చెప్పారు.
అయితే, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్, ఇది వ్యాఖ్యానకర్తలు తమ ఇష్టప్రకారంగా చేస్తారు అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన కొందరిలో ఉన్నది. అయితే వాస్తవానికి ఇది తప్పుడు ఆలోచన, ఎందుకంటే మీరు ఖుర్ఆన్‌లో గనుక చూస్తే సూరతుల్ ఖియామాలో ఈ తఫ్సీర్ యొక్క బాధ్యత కూడా అల్లాహ్ యే అన్నట్లుగా స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు. గమనించండి ఇక్కడ. సూరతుల్ ఖియామా, సూర నంబర్ 75, ఆయత్ నంబర్ 16 నుండి 19 వరకు చూస్తే, ప్రత్యేకంగా 19 లో ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే రండి అనువాదం మనం చదువుతున్నాము.
“ఓ ప్రవక్తా! నీవు ఖుర్ఆన్‌ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుకను వేగంగా కదిలించకు. దాన్ని సమకూర్చే, నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది.” సమకూర్చే అంటే నీ మనస్సులో, నీ హృదయంలో దాన్ని హిఫ్జ్ చేసే, దాన్ని భద్రంగా ఉండే ఉంచే అటువంటిది. “కాబట్టి మేము దానిని పఠించాక నువ్వు దాని పఠనాన్ని అనుసరించు.
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ (సుమ్మ ఇన్న అలైనా బయానహ్) మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మా పైనే ఉంది.” (75:19)
దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మా పైనే ఉన్నది. చూస్తున్నారా? ఖుర్ఆన్ అవతరింపజేసిన వాడు అల్లాహ్, దాని యొక్క వివరణ, ఎక్కడ ఎలాంటి వివరణ అవసరమో అక్కడ అలాంటి వివరణ ఇచ్చేటువంటి బాధ్యత కూడా మాదే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలియబరిచాడు.
అయితే ఇక్కడ హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క మాట మన కొరకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంతకుముందు కూడా వేరే కొన్ని క్లాసులలో ఈ విషయం ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఈ మాట చెప్పడం జరిగింది. అయితే సంక్షిప్తంగా ఇప్పుడు అందులోనే ఒక విషయం చెబుతున్నాను గమనించండి. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, ఖుర్ఆన్‌లోని ఆయతులు కొన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఏమిటి? కొన్ని ఒక రకమైన ఆయతులు ఎలాంటివి అంటే ప్రతి మనిషి ఎలాంటి వివరణ లేకుండా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఎలాంటివి అవి? అవి ప్రత్యేకంగా అల్లాహ్ ఏకత్వం గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రిసాలత్ గురించి, మరియు పరలోకం రానున్నది, మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పకుండా పుట్టిస్తాడు, సర్వ మానవుల్ని మలిసారి బ్రతికిస్తాడు అన్నటువంటి అంశాలకు సంబంధించిన ఆయతులు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అందులో చాలా లోతైన వివరాలు ఏమీ అవసరం లేకుండానే కేవలం వాటిని తిలావత్ చేస్తూ, కొంతపాటి అరబీ భాష వచ్చినా గాని లేదా అనువాదం చదివినా గాని అర్థమైపోతుంది.
రెండో రకమైన కొన్ని ఆయతులు ఎలా ఉన్నాయి? అందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు అహ్కామ్, వారి జీవిత వ్యవహారాలకు సంబంధించిన ఎన్నో ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. అయితే ఇవి కొందరికి స్పష్టంగా అర్థమౌతే, ధర్మ జ్ఞానంలో ఎవరు ఎంత అధ్యయనం చేసి లోతు జ్ఞానంతో ఉన్నారో వారికి త్వరగా అర్థం కావచ్చు. కానీ సామాన్య ప్రజలకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అయితే ఆ సామాన్య ప్రజలు ఏం చేస్తారు? ఆ విషయాలను ఆ ఉలమాలతో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఎన్నో ఆదేశాలు వాటి యొక్క వివరణ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియబరిచాడు. ఈ రెండవ రకానికి సంబంధించిన వాటిలోనే కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. కానీ ఆ ఉదాహరణలు తెలుసుకునేకి ముందు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక నియమం ఏదైతే తెలిపాడో దాన్ని కూడా మీరు ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ ద్వారా చాలా స్పష్టంగా గమనించండి. చూస్తున్నారా సూరత్ అన్నహల్, ఆయత్ నంబర్ 44.
وَأَنزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ (వ అన్జల్నా ఇలైకజ్ జిక్ర లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిమ్) “ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు మేము అవతరింపజేశాము ఈ జ్ఞాపిక ఈ గ్రంథాన్ని.” (16:44)
ఓ ప్రవక్త నీవు ప్రజలకు విడమరచి చెప్పడానికి. గమనించారా? అల్లాహ్ ఏ తఫ్సీర్ ప్రవక్తకు తెలుపుతాడో ప్రవక్త ఆ విషయాన్ని విడమరచి చెప్పేవారు. ఇదే భావం, ఇదే సూరత్ అన్నహల్ లోని మరోచోట ఆయత్ నంబర్ 64 లో ఉంది.
وَمَا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ (వమా అన్జల్నా అలైకల్ కితాబ ఇల్లా లితుబయ్యిన లహుముల్లజీ ఇఖ్తలఫూ ఫీహి వహుదన్ వ రహ్మతన్ లిఖౌమిన్ యు’మినూన్) వారు విభేదించుకునే ప్రతీ విషయాన్ని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం. (16:64)
చూశారా? అయితే ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ అవతరింపజేయడంతో పాటు దీని యొక్క తఫ్సీర్‌ను కూడా అవతరింపజేశాడు. ప్రవక్తకు ఈ విషయాలు వివరంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పేవాడు మరియు ప్రవక్త సహాబాలకు వివరించేవారు.
తఫ్సీర్ ఆవశ్యకతకు ఉదాహరణలు
దీనికి కొన్ని ఉదాహరణలు ధర్మవేత్తలు ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా తెలిపి ఉన్నారు. ఉదాహరణకు, మీరు ఇదే ఖుర్ఆన్‌లో చూడవచ్చును. సూరతుల్ బఖరాలోని ఒక ఆయత్, ఉపవాసాలకు సంబంధించినది. ఆయత్ కొంచెం పెద్దగా ఉన్నది, కానీ ఇందులో ఒక ఆదేశం ఏమున్నది?
وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ (వ కులూ వష్రబూ హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతిల్ అస్వది మినల్ ఫజ్ర్) అల్లాహ్ ఏమంటున్నాడు ఇందులో? తొలిజాములోని తెలుపు, నడిరేయి నల్లని చారలో నుంచి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి, త్రాగండి. (2:187)
ఉపవాసం గురించి అల్లాహ్ యొక్క ఆదేశం ఇది. రాత్రివేళ మనం తిన త్రాగవచ్చు, కానీ ఎప్పటివరకు? ఫజ్ర్ సమయం ప్రవేశించే వరకు అని సర్వసామాన్యంగా హదీసుల ఆధారంగా మనం చెబుతాము. కానీ ఖుర్ఆన్‌లో వచ్చినటువంటి విషయం ఏంటి? “హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యద్”. అల్ ఖైతుల్ అబ్యద్, శాబ్దిక అర్థం ఏంటి ఇది? అల్ ఖైత్ అంటే దారం, అల్ అబ్యద్ అంటే తెల్లది, “మినల్ ఖైతిల్ అస్వద్” నల్లని దారం నుండి. అయితే ఒక సహాబీ ఏం చేశారు? ఈ ఆయత్ పదాలతో స్పష్టమై భావం ఏదైతే ఉందో, దాన్ని చూసి అతను తన మెత్త కింద ఒక నల్ల దారం, మరొక తెల్ల దారం పెట్టుకున్నారు. ఇక కొంత కొంత సేపటికి తీసి చూసేవారు. కానీ రాత్రి పూట, చీకటి పూట తెల్ల దారమా, నల్ల దారమా అది స్పష్టంగా కనబడుతుందా? కనబడదు. తెల్లారిన తర్వాత కనబడుతుంది. కదా? అయితే ఆ విషయం వచ్చి ప్రవక్తకు చెబితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరచి చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరచి చెప్పారు. నీ మెత్త, పిల్లో ఏదైతే నువ్వు పెట్టుకున్నావో, అది చాలా పెద్దగా ఉన్నట్టు ఉన్నది. అయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో ఏదైతే అల్ ఖైతుల్ అబ్యద్, తెల్లని దారం అని అంటున్నాడో, దాని ఉద్దేశం, నిజంగా ఏమైనా దారాలు తీసుకోండి అని మాత్రం భావం కాదు, భావం అది కాదు. దీని భావం ఏంటి? ఆకాశంలో, ఆకాశంలో ఈ భేదం అనేది కనబడుతుంది. దాన్ని గమనించి, ఇక్కడ అసలు ఉద్దేశం ఫజ్ర్ సమయ ప్రవేశం గురించి చెప్పడం జరిగింది అని సహీ బుఖారీలో కూడా ఈ హదీస్ వచ్చి ఉంది, హదీస్ నంబర్ 1916. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఈ హదీస్ హజ్రత్ అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు తాలా అన్హు ద్వారా ఉల్లేఖించడం జరిగింది.
గమనిస్తున్నారా మీరు? ఈ విధంగా కొన్ని ఆదేశాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్‌లో ఏదైతే తెలిపాడో, హదీసుల్లో వాటి వివరణ వచ్చి ఉంది. ఇక అందుకొరకే మనం తఫ్సీర్‌ను తెలుసుకోవడం, తఫ్సీర్‌ను నేర్చుకోవడం, ఖుర్ఆన్ యొక్క ఆయత్ కేవలం నాకు అరబీ వస్తుంది లేదా అనువాదం చదువుకొని ఆచరిస్తాను అంటే సరిపోదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖుర్ఆన్ ఆయతుల, ఏ ఆయత్ యొక్క ఏ భావం ఎలా తెలిపారు? సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారు? ఆ రీతిలో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. లేదా అంటే ఖవారిజ్‌ల మాదిరిగా, ఖదరియా ముర్జియాల మాదిరిగా, మోతజిలాల మాదిరిగా తప్పుడు విశ్వాసాల్లో, బిద్అతులలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని పేర్లు ఏదైతే చెప్పానో, ఖవారిజ్, మోతజిలా, ఖదరియా, ముర్జియా, ఇవి గుమ్రాహ్ ఫిర్ఖాలు. చూడడానికి ముస్లింలే, ఖుర్ఆన్ ద్వారానే మేము ఆధారం తీసుకుంటాము అన్నటువంటి వాదన వాదిస్తారు. కానీ వాస్తవానికి వారు ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా నచ్చజెప్పారో, విడమరిచి చెప్పారో, వివరించి చెప్పారో, ఆ అలా సహాబాలు అర్థం చేసుకున్న రీతిలో వారు ఆచరించరు. అందుకొరకే వారు పెడమార్గాన పడిపోయారు. సన్మార్గం నుండి దూరమైపోయారు. మన పరిస్థితి అలా కాకూడదు. మన పరిస్థితి అలా కాకూడదు.
ఇప్పుడు నేను సూరతుల్ బఖరాలోని ఉపవాసాలకు సంబంధించిన ఒక ఆయత్ మరియు దాని యొక్క వివరణ తఫ్సీర్ సహీ బుఖారీలోని 1916 హదీస్ నంబర్‌తో తెలిపాను. ఇలాంటి ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాటి ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి? మనం తప్పకుండా తఫ్సీర్ తెలుసుకోవాలి. దీనికి మనకు ఇంకా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఉదాహరణకు, సహీ బుఖారీలోని హదీసే చూడండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఇచ్చినటువంటి దుఆ. దాని పూర్తి సంఘటన చెప్పలేను. సహీ బుఖారీలో ఇమాం బుఖారీ రహిమతుల్లాహ్ ఈ హదీసును ఎన్నో సందర్భాల్లో తీసుకొచ్చారు. సంక్షిప్త భావం ఏమిటి?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యల్లో ఒకరు హజ్రత్ మైమూనా రదియల్లాహు తాలా అన్హా. హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఖాలా అవుతుంది. ఖాలా అంటే తెలుసు కదా, పిన్ని అంటారు, చిన్నమ్మ అంటారు. ఇబ్ను అబ్బాస్ యొక్క తల్లి మరియు మైమూనా రదియల్లాహు తాలా అన్హా ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ళు. ఒక రాత్రి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద రాత్రి గడుపుతారు. అయితే రాత్రి ఎప్పుడైతే ప్రవక్త వారు మేల్కొంటారో, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తారో, ప్రవక్త తిరిగి వచ్చేవరకు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఏం చేస్తారు? ప్రవక్త ఉదూ చేసుకోవడానికి నీళ్లు సిద్ధం చేసి పెడతారు. ఉదూ నీళ్లు. ప్రవక్త వచ్చాక ఈ విషయాన్ని చూసి సంతోషపడి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి దుఆ ఇస్తారు. ఏమని దుఆ ఇస్తారు? ఏమని దుఆ ఇస్తారు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ… తొందరగా! మన టాపిక్ ఏం నడుస్తుంది మీకు తెలుసు కదా. అందరి మైక్ ఆఫ్ ఉన్నదా ఏంటి? ఉంది. కానీ ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు. లేదా నా వాయిస్ ఎవరి వరకు చేరుతలేదా ఏంటి? ఆ వచ్చింది షేక్. ఖుర్ఆన్ యొక్క జ్ఞానాన్ని అల్లాహ్ మీకు ఇవ్వాలని దుఆ చేస్తారు. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ఇది నేను మొదటిసారిగా చెప్పడం లేదు. మిమ్మల్ని ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఈ మాట చెప్పడం జరిగింది.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు, ఓ అల్లాహ్, ఇబ్ను అబ్బాస్‌కి నీవు ఖుర్ఆన్ యొక్క విద్య, ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం, వివరణ జ్ఞానం ప్రసాదించు అని దుఆ చేశారు. ధర్మ అవగాహన, ఖుర్ఆన్ యొక్క జ్ఞానం, మరియు ఈ ఖుర్ఆన్ యొక్క త’వీల్, వివరణ, దాని యొక్క వ్యాఖ్యానం యొక్క జ్ఞానం ప్రసాదించు.
ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు చిన్న వయసులో ఉన్నప్పటికీ, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు 13 ఏళ్ల వయసు కూడా వరకు చేరలేదు. కానీ అల్ హందులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ, కరుణ, అతని యొక్క లెక్కలేనన్ని కరుణా కటాక్షాలు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ బరకత్, అల్లాహ్ కరుణా కటాక్షాలు, ప్రవక్త వారి దుఆ బరకత్ మరియు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఖుర్ఆన్ జ్ఞానం నేర్చుకోవడానికి పెద్ద పెద్ద సహాబాల తలుపుల ముందు కూర్చొని ఎండ తాపాన్ని భరించి, దుమ్ము ధూళిని భరించి, ఏదైతే కష్టపడి నేర్చుకున్నారో, ఆ ప్రకారంగా అల్లాహ్ వారికి ప్రసాదించాడు. మరియు సహాబాలలోనే హబ్రుల్ ఉమ్మ, ఖుర్ఆన్ సహాబాలలో ఖుర్ఆన్ యొక్క పెద్ద జ్ఞాని ఎవరు అంటే, ఒక వైపున అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు పేరు వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క పేరు వస్తుంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మన అంశానికి సంబంధించింది, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా కొందరు సహాబాలకు ఇలాంటి దుఆ ఇచ్చారు. మరియు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి, అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు వారి గురించి, ఇంకా వేరే కొందరు సహాబాల గురించి, సూరతుల్ బఖరా దానిని కంఠస్థం చేయడం, దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, తఫ్సీర్‌ని నేర్చుకోవడంలో 8 నుండి 10 సంవత్సరాలు పట్టినది మాకు అని అంటున్నారు. సహాబాల విషయం చెబుతున్నానండి. తర్వాత వచ్చిన కాలాల్లోని తాబిఈన్, తబే తాబిఈన్, ఇంకా ఉలమాలు, అయిమ్మాల గురించి కాదు. సహాబాలు. సూరే బఖరా యొక్క వ్యాఖ్యానంలో మనకు ఒకచోట ఇమాం ఖుర్తుబీ రహిమహుల్లాహ్ ప్రస్తావించారు. ఒక హజ్ సందర్భంలో అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నుల్ ఆస్ గురించి ఉంది. మరికొన్ని ఉల్లేఖనాల్లో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గురించి ఉంది. వారు సూరే బఖరా యొక్క తఫ్సీర్ ఎంతసేపు, ఎంత వివరంగా చెప్పారంటే, ఒకవేళ ఆ సందర్భంలో గనుక ఆ తఫ్సీర్‌ను యూదులు, క్రైస్తవులు విని ఉంటే ముస్లింలు అయిపోయేవారు అని ఉల్లేఖనకారులు అంటున్నారు. అంటే ఏమిటి విషయం? ఖుర్ఆన్‌ను దాని యొక్క తఫ్సీర్‌తో నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, ఇది సహాబాల యొక్క అలవాటు కూడా. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇక రండి, సమయం సమాప్తం కావస్తుంది. ఈ అంశం మీకు మరింత మంచి రీతిలో అర్థం కావడానికి మరొక ఉదాహరణ నేను ఇస్తాను. ఈ ఆయతును మీరు గమనించండి ఖుర్ఆన్‌లో మరియు దీనికి సంబంధించిన సహీ హదీస్ ఏదైతే వచ్చి ఉందో, దాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి ఆయత్ ఇక్కడ? సూరతుల్ అన్ఆమ్. చూస్తున్నారు కదా సూరతుల్ అన్ఆమ్. ఆయత్ నంబర్ 82.
الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ (అల్లజీన ఆమనూ వలమ్ యల్బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాఇక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్తదూన్) ఎవరైతే విశ్వసించారో, తమ విశ్వాసాన్ని జుల్ముతో కలగాపులగం చేయకుండా ఉన్నారో, ఇక్కడ అరబీలో చూస్తున్నారు మీరు. “వలమ్ యల్బిసూ” కలగాపులగం చేయలేదు, కలుషితం కానివ్వలేదు. “ఈమానహుమ్” తమ విశ్వాసాన్ని, తమ యొక్క ఈమాన్‌ని దేనితో కలుషితం కానివ్వలేదు? “బి జుల్మిన్” జుల్ముతో. ఎవరైతే తమ విశ్వాసాన్ని జుల్ముతో కలుషితం కాకుండా కాపాడుకున్నారో, అలాంటి వారే “లహుముల్ అమ్న్” సురక్షితంగా ఉన్నవారు. వారికొరకే శాంతి, వారికొరకే పీస్ ఫుల్ లైఫ్. “వహుమ్ ముహ్తదూన్” మరియు వారే సన్మార్గంపై ఉన్నవారు కూడా.
ఇక ఈ ఆయత్ అవతరించిన వెంటనే సహాబాలు భయపడిపోయారు. సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 82 గుర్తు ఉంది కదా. సహాబాలు భయపడిపోయారు. ఎందుకని? మాలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక చిన్న రీతిలో చిన్నపాటి జుల్మ్ జరుగుతూనే ఉంటుంది. ఇక మా విశ్వాసం బాగులేదా? మేము సన్మార్గంపై లేమా? మాకు నరకం నుండి సురక్షితం అనేది లభించదా? అన్నటువంటి భయం వారికి కలిగింది. అందుకొరకే సహీ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 32. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం. సహీ బుఖారీ ఎంత ప్రామాణిక గ్రంథమో మీ అందరికీ తెలుసున విషయమే. ఇంతకుముందే ఇప్పుడు ఇంతకుముందే మనం అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు వారి పేరు కూడా చెప్పాము. తఫ్సీరే ఖుర్ఆన్‌లో ఆయన పేరు కూడా వస్తుంది. సూరే బఖరా నేర్చుకోవడంలో 8 సంవత్సరాలు వీరికి కూడా పట్టింది అని. ఇక ఖుర్ఆన్ తఫ్సీర్ యొక్క ఆవశ్యకత ఎంతగా ఉన్నదో అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ద్వారా సహీ బుఖారీలోని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. హదీస్ నంబర్ 32. ఏమంటున్నారో గమనించండి. “లమ్మా నజలత్” ఎప్పుడైతే అవతరించిందో ఈ ఆయత్, “అల్లజీన ఆమనూ వలమ్ యల్బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాఇక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్తదూన్” (సూరతుల్ అన్ఆమ్, ఆయత్ నంబర్ 82). అందులో ఏమున్నది? ఈమాన్‌ను జుల్ముతో కలుషితం చేయని వారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ అంటున్నారు, “ఖాల అస్హాబు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం”, ప్రవక్త వారి యొక్క సహచరులు అప్పుడు చెప్పారు, ఏమని? “అయ్యునా లమ్ యజ్లిమ్?” మాలో ఎవరు ఏ మాత్రం జుల్మ్ చేయకుండా ఉండేవారు? అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ లుఖ్మాన్, ఆయత్ నంబర్ 13 తెలియబరిచాడు.
إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ (ఇన్నష్ షిర్క ల జుల్మున్ అజీమ్) నిశ్చయంగా షిర్క్ అత్యంత ఘోరమైన జుల్మ్. (31:13)
ఇక సూరతుల్ అన్ఆమ్‌లో జుల్మ్ యొక్క పదం ఏదైతే వచ్చిందో ఆయత్ నంబర్ 82 లో, ఇక్కడ జుల్మ్ అంటే సామాన్యమైన జుల్మ్, ఒకరు మరొకరిని కొట్టడం గానీ, తిట్టడం గానీ, ఏదైనా సొమ్మును కాజేయడం గానీ, ఇవన్నీ కూడా జుల్మ్. కానీ ఇక్కడ ఈ ఆయతులో ఈ జుల్మ్ కాదు ఉద్దేశం. ఈ ఆయతులో జుల్మ్ అంటే షిర్క్ అని భావం.
అర్థమైంది కదా? ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసుల ద్వారా మరియు స్వయంగా ఖుర్ఆన్ ద్వారా మనకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖుర్ఆన్ తఫ్సీర్‌తో నేర్చుకోవడం, తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఏ ఉలమాలైతే, ఏ ఆలిములైతే, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్, ఖుర్ఆన్‌తో, సహీ హదీసులతో, ప్రవక్త సహాబాల యొక్క వ్యాఖ్యానాలతో తెలియజేస్తున్నారో, అలాంటి వారి ద్వారానే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. లేదా అంటే ఈ రోజుల్లో కొందరు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్ చేస్తున్నారని. కానీ ఎలా? మాకు అరబీ భాష తెలుసు, అరబీ గ్రామర్ తెలుసు, ఖుర్ఆన్ ఈనాటి కాలంలో మన అందరి కొరకు సన్మార్గ గ్రంథం గనుక సైన్స్ టెక్నాలజీ యొక్క విషయాలు అందులో ఏవైతే వచ్చాయో, వాటి యొక్క వివరణలతో తెలుసుకుంటే మరింత మనం వేరే వాళ్లకు కూడా మంచిగా నచ్చజెప్పవచ్చు అని దానిపై మాత్రమే ఆధారపడి అలాంటి విషయాలను వెతికి… చూడండి ఖుర్ఆన్‌లో మానవులందరికీ ప్రళయం వరకు వచ్చే అటువంటి సర్వ మానవాళి కొరకు మార్గదర్శకత్వం ఉంది గనుక, ప్రజలకు లాభదాయకమయ్యే ప్రతీ విద్య మూలాలు ఇందులో ఉన్నాయి. అవును, సైన్స్ కు సంబంధించి, టెక్నాలజీ కి సంబంధించి, జాగ్రఫియా కు సంబంధించి, మెడికల్ కు సంబంధించి, ఇంకా ఎన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే విద్యలు ఉన్నాయో, వాటన్నిటి గురించి, వాటన్నిటి గురించి మూల విషయాలు ఉన్నాయి. కానీ ఖుర్ఆన్ యొక్క అసలైన ఉద్దేశం ఏమిటి? ఖుర్ఆన్ యొక్క అసలైన ఉద్దేశం, మానవులు ఈ లోకంలో కేవలం అల్లాహ్ ను ఆరాధిస్తూ, అల్లాహ్ చెప్పిన ప్రకారంగా జీవితం గడిపి, ఎలా వారు నరకం నుండి రక్షణ పొంది స్వర్గం పొందగలుగుతారో, అల్లాహ్ యొక్క ఏకారాధన, అల్లాహ్ యొక్క ఆదేశాలన్నిటినీ పాటిస్తూ ప్రవక్త విధానంలో అల్లాహ్ ను ఆరాధిస్తూ, నరకం నుండి రక్షణ పొంది స్వర్గం ఎలా పొందాలి, దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఇది గనుక దీనిని మనం కరెక్ట్ గా ఫాలో అవుతూ, ఇంకా అన్ని రకాల వేరే లాభాలను కూడా మనం స్వయం పొందడం, ఇతరులకు లాభం చేకూర్చడం మంచి విషయమే. కానీ అసలైన ఉద్దేశం నుండి దూరం కాకూడదు.
అయితే ఈ కొన్ని ఆధారాలు, ఎగ్జాంపుల్స్, ఉపమానాల ద్వారా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఖుర్ఆన్ తప్పకుండా మనం దాని యొక్క వ్యాఖ్యానం, తఫ్సీర్‌తో చదివే, నేర్చుకునే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మంచి రీతిలో మనం ఆచరించగలుగుతాము. లేదా అంటే, ఒకవేళ తఫ్సీరే ఖుర్ఆన్ అవసరం లేదు అంటే, ఒక చిన్న ఉదాహరణ ఇలాంటి పొరపాటులో పడిపోతాము. ఒక రెండు చిన్న ఉదాహరణలు ఇచ్చి నేను సమాప్తం చేస్తాను. ఖుర్ఆన్‌లో ఇప్పుడు నేను చూపించుకుంటూ మళ్ళీ వస్తే సమయం చాలా పడుతుంది, అందుకొరకే రెండే రెండు ఎగ్జాంపుల్స్ తొందరగా చెప్పేస్తున్నాను, గమనించండి మీరు. ఖుర్ఆన్‌లో ఒకచోట కాదు, ఎక్కువ చోట్ల ఉంది, రక్తం నిషిద్ధం అని. కదా? ఈ ప్రకారంగా చూసుకుంటే, ఒక మేకనే అనుకోండి ఉదాహరణకు, మనం జిబహ్ చేసిన తర్వాత సున్నత్ ప్రకారంగా, రక్తం అంతా వెళ్ళిపోతుంది కదా. కానీ ఎప్పుడైతే మనం మాంసపు ముక్కలు కూడా చేసేస్తామో, లోపట దాని యొక్క నరాల్లో, మాంసం మధ్యలో చిన్నపాటి రక్తం అనేది, కొంతపాటి రక్తం అనేది కనబడుతుంది. అవునా కాదా? అయితే, ఖుర్ఆన్ ప్రకారంగా చూస్తే అది కూడా ఎక్కడా ఒక చిన్న చుక్క ఉండకుండా పూర్తిగా శుభ్రమైపోవాలి అన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారి సహీ హదీస్ ఉన్నది, ప్రవహించే రక్తం ఏదైతే ఉంటుందో, అదంతా పోయింది. ఈ మాంసం మధ్యలో, చిన్న చిన్న నరాల మధ్యలో ఏదైతే కొంచెం ఆగి ఉన్నదో, అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మినహాయింపు ఇచ్చాడు. దానివల్ల మనకు నష్టం జరగదు, ఎందుకంటే అది చాలా ఇబ్బందితో కూడిన పని.
ఇక సోదర మహాశయులారా, ఇది ఇలా ఉంటే, ఎవరైతే హదీస్ అవసరం లేదు, మనకు తఫ్సీర్ అవసరం లేదు, ఖుర్ఆన్ యొక్క బాహ్యమైన ఈ ఆయతుల అనువాదాలు చూసి మనం ఆచరిస్తే సరిపోతుంది అంటారో, వాస్తవానికి వారి యొక్క నమాజులు కూడా సరియైనవి కావు, వారి యొక్క రోజువారి జీవితంలో వివాహ, పేరంటాలు ఇవి కూడా సరియైన సున్నత్ ప్రకారంగా జరగవు. ఎందుకు? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ద్వారా ఏ ఖుర్ఆన్‌ను విడమరచి హదీసు ద్వారా కూడా మనకు చెప్పారో, దాన్ని విడనాడినందుకు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖుర్ఆన్‌ను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా సహాబాకు నేర్పారో, సహాబాలు నేర్చుకున్నారో, అలా నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మదీనా కాలానికి చెందినది. ఇందులో 12 ఆయతులు ఉన్నాయి. ఇది ముఖ్యంగా విడాకుల గురించి ప్రస్తావించిన అధ్యాయం. మొదటి ఆయత్లో వచ్చిన పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ఈ సూరా కుటుంబ బంధాల ప్రాముఖ్యాన్ని చాటి చెప్పింది. వివాహ మర్యాదను కాపాడాలని, తొందరపడి విడాకుల నిర్ణయానికి రాకూడదని బోధిస్తూ, ఆ విధంగా హక్కులకు భంగం కలిగే పరిస్థితిని నివారించింది. ఇస్లామ్ అనుమతించిన వాటన్నింటిలోను అల్లాహ్ కు అత్యంత అయిష్టమైన చర్య విడాకులు. కాని అందుకు అనుమతి ఇవ్వబడింది. గృహ సంబంధమైన ఇలాంటి వ్యవహారాల్లో అల్లాహ్ పట్ల భక్తితో, అల్లాహ్ పట్ల భయంతో వ్యవహరించాలని, తమ నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు పునరాలోచించు కోవాలని విశ్వాసులను ఈ విషయమై హెచ్చరించడం జరిగింది. భార్యకు విడాకులిచ్చే హక్కు భర్తకు ఉంది. కాని విడాకులన్నవి సరియైన పద్ధతిలో, సరియైన సమయంలో ఇస్లామీయ చట్టం ప్రకారం జరగాలి. ఎలా అంటే :
భార్య రుతుకాలంలో ఉన్నప్పుడు విడాకులు ఇవ్వరాదు.
నిర్దిష్ట సమయం గడిచేవరకు ఆమెను ఇంటినుంచి బలవంతంగా బయటకు పంపరాదు.
నిర్ధిష్ట సమయం (ఇద్దత్) మూడువిధాలుగా ఉంటుంది.
ఈ నిర్దిష్ట కాలంలోనూ, గర్భంతో ఉన్న కాలంలోను భర్త తన భార్యపోషణకు ఖర్చు చేయాలి.
శిశువు జన్మించిన తర్వాత భర్త తాను విడాకులిచ్చిన భార్య కొరకు వేరుగానివాస వసతి ఏర్పాటు చేయాలి.
విడాకులిచ్చిన భార్య శిశువుకు పాలుపట్టడానికి అంగీకరిస్తే, అందుకుభర్త తగిన పారితోషికం చెల్లించాలి.
పాలుపట్టే విషయంలో వారిద్దరి మధ్య ఎలాంటి అంగీకారం కుదరనట్లయితే,వేరే మహిళతో పాలుపట్టించే ఏర్పాటు చేయాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 44 ఆయతులు ఉన్నాయి. ప్రళయం, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, తీర్పుదినాల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరాకు పెట్టిన పేరు ఇందులోని 3వ ఆయతులో వచ్చింది. తీర్పుదినం నాటి భయానక పరిస్థితులను ఈ సూరా అభివర్ణించింది. తుదితీర్పు జరుగుతుందనీ, లెక్కతీసుకునే రోజు భ్రమ ఎంతమాత్రం కాదనీ, సత్యతిరస్కారులను నాశనం చేసే సామర్ధ్యం అల్లాహ్కు ఉందనీ, వారి కన్నా ఉత్తమమైన ప్రజలను వారి స్థానంలో తీసుకొచ్చే శక్తి అల్లాహ్ కు ఉందని ఈ సూరా ప్రకటించింది. కాలానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఈ సూరా తెలియజేసింది. తీర్పుదినం చాలా దూరంగా ఉన్నట్లు మనకు కనబడినా, అల్లాహ్ దృష్టిలో ఆ రోజు చాలా దగ్గరగా ఉంది.
ఈ సూరా అవిశ్వాసులను విమర్శిస్తూ, వారి అనుమానాలు నిష్ప్రయోజనకరమైనవనీ, ఎందుకంటే మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది అనివార్యమనీ తెలిపింది. మరణించిన వారిని మళ్ళీ లేపే రోజున చనిపోయిన వారందరూ లేచి నిలబడుతారు. సత్యాన్ని తిరస్కరించినవారు, అవిశ్వాసులు తమ సమాధుల నుంచి పరుగు పరుగున కంగారు కంగారుగా వస్తారు. వారు పరాభవానికి, నైచ్యానికి గురయి ఉంటారు. వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 31 ఆయతులు ఉన్నాయి. విశ్వసించి మంచిపనులు చేసిన వారికి లభించే సుఖసంతోషాల గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఈ సూరాకు పెట్టబడిన పేరు మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది. అల్లాహ్ మనలను సృష్టించి, మనకు రుజుమార్గాన్ని చూపించాడు. అల్లాహ్ పట్ల కృతజ్ఞతగా వ్యవహరించడం లేదా కృతఘ్నత చూపడం అన్నది మన ఇష్టానికి వదిలేయడం జరిగింది. ఈ సూరాలో విశ్వసించి మంచిపనులు చేసేవారి గుణగణాలను వర్ణించడం జరిగింది. వారు తమ ఆధ్యాత్మిక, సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తారు. తీర్పుదినానికి భయపడతారు. నిరుపేదలకు, అనాధలకు సహాయపడతారు. కాగా, సత్యతిరస్కారుల కోసం సంకెళ్ళు, గుదిబండలు, భగభగలాడే అగ్ని సిద్ధం చేయబడ్డాయి. పుణ్యాత్ములకు అల్లాహ్ అనుగ్రహాలు అపరిమితమైనవి. వారికి స్వర్గంలోని సెలయేటి నీరు కలిసిన మద్యం పాత్రలు అందుబాటులో ఉంటాయి. వారు చక్కని పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారు బంగారు జలతారు వస్త్రాలు ధరిస్తారు. వారికి సౌకర్యవంతమైన ఆసనాలు ఉంటాయి. అక్కడ తీవ్రమైన వేడిగాని, తీవ్రమైన చలి గాని ఉండవు. అక్కడ వారికి వివిధ రకాల ఫలాలు లభిస్తాయి. అవి వారికి అందుబాటులో క్రిందికి వేలాడుతూ ఉంటాయి. వెండిపాత్రలు వారి ముందు ఉంటాయి. వారక్కడ సొంటి కలిసిన మధు పాత్రలు అందుకుంటారు (ఆ మద్యం ఎలాంటి మత్తు కలిగించదు- ఖుర్ఆన్:47:15). వారి సేవ కోసం నిత్యబాలలు అటూఇటూ పరుగిడుతూ ఉంటారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.