وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు. (సూరా అల్ హుమజా 104:1)
2. చాడీలు చెప్పేవారు స్వర్గంలో ప్రవేశించలేరు:
హజ్రత్ హుజైఫా (రజియల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “చాడీలు చెప్పేవాడు స్వర్గంలోకి వెళ్ళలేడు.” (బుఖారీ-ముస్లిం, సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)
చాడీలు చెప్పటం ముమ్మాటికీ నిషిద్ధం. ఈ విషయం తెలిసి కూడా ఎవడైనా దాన్ని ధర్మసమ్మతంగా భావించి చాడీలు చెబుతూ ప్రజల మధ్య సంబంధాలను చెడగొట్టటానికి పాల్పడితే అలాంటివారు ఎన్నటికీ స్వర్గానికి వెళ్ళలేరు.
3. చాడీలు చెప్పేవారికి సమాధి శిక్ష తప్పదు
హజ్రత్ ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు సమాధుల దగ్గర్నుంచి వెళ్తూ ఇలా అన్నారు. “ఈ రెండు సమాధుల్లో ఉన్నవారికి శిక్షపడుతోంది. వీరికి ఈ శిక్ష ఏదో పెద్ద విషయం మూలంగా పడుతుంది కాదు! (ఆ తర్వాత ఆయనే అన్నారు) ఎందుకు కాదు, అది పెద్ద విషయమే. వీరిలో ఒకడు చాడీలు చెప్తూ తిరుగుతుండేవాడు. మరొకతను మూత్రం పోసినప్పుడు ఒంటిమీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్తపడేవాడు కాదు.” (బుఖారీ-ముస్లిం)
4. చాడీలు చెప్పేవారికి నరక శిక్ష తప్పదు
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు: “నాకు మేరాజ్ (యాత్ర) చేయించబడినప్పుడు నేను కొంత మంది సమీపం నుంచి వెళ్ళటం తట స్థించింది. వారికి ఇత్తడి గోళ్ళున్నాయి. వాటితో వారు తమ ముఖాలను,రొమ్ములను గీక్కుంటున్నారు. అది చూసి నేను (ఆశ్చర్యంతో) “జిబ్రయీల్ ఎవరు వీరు?” అని అడిగాను. అందుకు జిబ్రయీల్ సమాధానమిస్తూ, “వీరా, వీరు (ప్రపంచంలో) ప్రజల మాంసం తినేవారు (అంటే వారిని పరోక్షంగా నిందించేవారు) వారి మాన మర్యాదలను కాలరాసేవారు” అని చెప్పారు (అబూదావూద్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.
అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.
ముక్తికి మార్గం
ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?
“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,
مَنِ النَّجَاةُ؟ (మన్ నజాత్?)” “ముక్తికి మార్గం ఏది?”
ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:
أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ (అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక) నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి
ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.
అంటే ఈ హదీస్‌లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.
దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.
నాలుక ప్రాముఖ్యత
ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్‌కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.
ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ (మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్) “ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”
ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.
ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,
ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:
مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ (మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ) “ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”
ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.
నాలుక ఉపద్రవాలు
మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟ (అతద్రూన మల్ గీబహ్?) “గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”
సహాబాలు అన్నారు,
اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ (అల్లాహు వ రసూలుహూ అ’అలమ్) “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”
సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్‌కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,
ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ (దిక్రుక అఖాక బిమా యక్రహ్) “నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”
అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్‌ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),
أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟ (అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?) “ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”
“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,
إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ (ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు) “అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”
అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.
وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ (వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు) “ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”
అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.
కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్‌లో ఇలా తెలియజేశాడు:
…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ “… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)
అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.
ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.
రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.
మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్‌లోని చివరి భాగం ఇది:
وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ “ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”
ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.
నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ “నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”
సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.
ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్‌లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.
ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్‌ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్‌కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.
అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
చెడు అనుమానానికి దూరంగా ఉండండి | బులూగుల్ మరాం | హదీసు 1284 https://youtu.be/yLseG7LgNmM [6 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1284. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకాకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు:
“దురనుమానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దురనుమానం చాలా పెద్ద అబద్ధంగా పరిగణించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం)
సారాంశం: దురనుమానం ఒక పెద్ద అసత్య విషయంగా పరిగణించబడటానికి కారణం ఏమిటంటే మనిషి తనలో తానే దాన్ని పెంచి పోషించుకుంటూ పోతాడు. ఆఖరికి అసలేమీ లేని దాన్ని గురించి ఏదో ఒక సందర్భంగా నోటితో చెప్పేస్తాడు. అందుకే విద్వాంసులు దీన్ని అభాండంగా, అపనిందగా ఖరారు చేశారు. ఒకరిపై అపనింద మోపటం నిషిద్ధం కదా! దీని ద్వారా తేటతెల్లమయిందేమిటంటే దురనుమానం అపనిందకు ఆనవాలు. అపనింద మహాపరాధం. పశ్చాత్తాపం చెందనిదే ఇది క్షమార్హం కాజాలదు. అందుకే వీలయినంత వరకు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దురనుమానాలు, సంకోచాలు పుట్టిపెరిగే సమాజంలో సదనుమానం, సద్భావన అనేవి నిలదొక్కుకోలేవు. అలాంటి సమాజంలోని సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, పరస్పర సహకార భావాల వాతావరణం కూడా ఏర్పడదు. ఒండొకరిని అడుగడుగునా శంకిస్తూ ఉంటారు. ఇది సమాజ అభ్యున్నతికి, వికాసానికి శుభ సూచకం కాదు సరికదా పతనానికి, అధోగతికి ఆనవాలు అవుతుంది. సత్సమాజ రూపకల్పనకు ఉపక్రమించినపుడు దురనుమానవు సూక్ష్మక్రిములను ఎప్పటికప్పుడు సంహరించటం అవసరం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలహందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలిల్లాహ్. అమ్మాబాద్, ఋజుమార్గం టీవి ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశం లో స్వాగతం.
ఈనాటి మన శీర్షిక సమాధి శిక్షలు, సమాధి అనుగ్రహాలు. మహాశయులారా సమాధి శిక్షల గురించి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం వల్ల మనకు అతి ముఖ్యమైన లాభం ఏమిటంటే మన చావు రాక ముందే, సమాధి జీవితంలోకి ప్రవేశించక ముందే మనకు మనం సరిదిద్దుకొని సత్కార్యాల మార్గంలో ఉంచుకోవచ్చు. ఎలాగైతే మనం తెలివైన విద్యార్థిని చూస్తామో వారు మోడల్ పేపర్స్ ని చూసుకొని ఇలాంటి ఇలాంటి ప్రశ్నలు రావచ్చు, ఇలాంటి కష్టమైన ప్రశ్నలు కూడా రావచ్చు, మనకు పేపర్ ఈ రకంగా కష్టంగా ఉండవచ్చు అని ఏదైతే చూసుకొని ఊహించుకొని, వాటిని తెలుసుకొని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారో, అలాగే సమాధిలో ఏమేమి జరగనుంది? ఆ వివరాలు ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటే అంతే మనలో మంచి మార్పు రావచ్చు.
సమాధిలో ఏయే శిక్షలు అయితే జరుగుతాయో, వాటికి మనం ఇహ లోకంలో చేసే దుష్కార్యాలే మూల కారణం అవుతాయి. ఉదాహరణకు విశ్వాస మార్గాన్ని అవలంబించక పోవుట, అల్లాహ్ ఏకత్వాన్ని స్వీకరించకపోవడం, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసి అల్లాహ్ పంపిన సత్య ధర్మాన్ని స్వీకరించకపోవుట ఇది సమాధి శిక్షలకు మూల కారణం.
సూరయే గాఫిర్ ఆయత్ నంబర్ 46 లో అల్లాహ్ (తఆలా), ఫిరౌను మరియు అతన్ని అనుసరించిన వారి గురించి, వారికి సమాధిలో ఎలాంటి శిక్షలు జరుగుతున్నాయో ఈ విధంగా తెలిపాడు.
النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ఉదయం సాయంకాలం నరకాగ్ని వారి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. (40:46)
అంటే నరకాగ్ని యొక్క జ్వాలలు, దాని యొక్క వేడి ఇదంతా వారికి ప్రతిరోజు ఉదయం, సాయంకాలం రెండు సార్లు దాని శిక్ష ఇవ్వడం జరుగుతుంది మరియు ఇంతకు ముందు మనం సూరయే అన్ ఆమ్ లోని ఆయత్ నెంబర్ 93 విని ఉన్నాము.
ఈ దుర్మార్గులు మరణయాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, “సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది” అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు! (6:93)
ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించడం జరుగుతుంది. ఎందుకు? మీరు అల్లాహ్ పట్ల అసత్య మాటలు పలికారు. అల్లాహ్ కు ఇతరులను భాగస్వామిగా కలిపారు. అందుగురించి మహాశయులారా షిర్క్ ను విడనాడాలి. అల్లాహ్ కు చేసే ఏ ఆరాధన అయితే ఉందో దానిని మనం ఇతరులకు ఎంత మాత్రం చేయకూడదు.
అలాగే రెండవ విషయం సమాధి శిక్షకు ఏదైతే కారణం అవుతుందో కపట విశ్వాసం, బాహ్యంగా ఇస్లాం స్వీకరించినట్లు నటించడం, చూసేవారికి ముస్లిములుగా కనపరచడం, కానీ మనసులో ఇస్లాం, ఈమాన్, విశ్వాసం పట్ల ప్రేమ ఉండకుండా మనస్పూర్వకంగా ఇస్లాం పై ఆచరించకుండా ఉండడం. “నిశ్చయంగా కపట విశ్వాసులు నరకం లోని అతి దిగువ స్థానములో ఉంటారు.”
ఇంకా ఎవరైతే అల్లాహ్ ధర్మంలో మార్పులు చేర్పులు చేస్తారో అల్లాహ్ హరామ్ చేసిన వాటిని హలాల్ గా, హలాల్ చేసిన వాటిని హరామ్ గా చేస్తారో, అల్లాహ్ ఏ విషయాల్ని ధర్మంగా, ధర్మ సమ్మతంగా తెలుపలేదో వాటిని యొక్క ధర్మంగా ప్రజల ముందుకు తీసుకొస్తారో అలాంటి వారికి కూడా చాలా భయంకరమైన శిక్ష సమాధిలో జరుగుతూ ఉంటుంది.
అమర్ బిన్ లుహయ్ అని ఒక నాయకుడు. అతన్ని చాలా గౌరవించేవారు ఖురైషులు. అతడు చాలా రోజుల వరకు చాలా మంచి విధంగా వారికి నాయకత్వం వహించాడు. కానీ సీరియా, వేరే దేశాల పర్యాటనకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కాబాలో తొలిసారిగా షిర్క్ మొదలు పెట్టాడు. విగ్రహాలను తీసుకొచ్చి పూజించడం, ప్రజల్ని వాటి యొక్క పూజకు పురికొల్పడం మొదలుపెట్టాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. – “నేను అమర్ బిన్ లుహయ్ చూశాను, అతడు నరకంలో తన యొక్క ప్రేగులను తానే బయటికి లాక్కుంటూ ఉన్నాడు.” (సహీ బుఖారిలో ఉన్నహదీస్ ఇది. 4623 హదీత్ నెంబర్). ప్రళయం వరకు ఇలాంటి శిక్ష అతనికి ఎందుకు జరుగుతుంది? ఇలాంటి దుష్కార్యాలు మరియు ఇలాంటి దురాచారాలను ధర్మం పేరిట ప్రజల్లో వ్యాపింప చేశాడు. మరి ఈ రోజుల్లో కూడా కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకురావడం ముస్లింలలో కూడా ఎంతో మంది ఎన్నో విషయాలని ఆరాధనగా, ధర్మంగా, పుణ్యకార్యాలు గా చేస్తూ వాటిని వ్యాపింప చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మనల్ని సమాధి శిక్షకు గురి చేస్తాయి.
సమాధి శిక్షకు గురి చేసే విషయాల్లో ఒకటి ఖురాన్ చదవకపోవడం, నేర్చుకొని దానిని మర్చిపోవడం. ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాంటి వారి గురించి మరియు ఎవరైతే నమాజ్ లు విడనాడుతారో ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ ఎవరైతే చేయరో సామూహికంగా దాని యొక్క సమయంలో, అలాంటి వారి గురించి కూడా సమాధి శిక్షల గురించి హెచ్చరించారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూశారు: ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. మరో వ్యక్తి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి అతని తల మీద పడేస్తున్నాడు. తల ముక్కలు ముక్కలై రాయి దూరంగా పడిపోతుంది. ఆ వ్యక్తి రాయిని తీసుకుని వచ్చేసరికి మళ్ళీ ఈ తల పూర్తి తలగా అయిపోతుంది. సరి అయిపోతుంది, మళ్ళీ కొడతాడు. మళ్ళీ ముక్కలు ముక్కలు అవుతుంది. ఇలాగే అతనికి శిక్ష జరుగుతూ ఉన్నది. ఈ శిక్ష ఎలాంటి వారికి జరుగుతుంది అంటే జిబ్రీల్ దూత తెలిపారు: “ఎవరైతే ఖురాన్ నేర్చుకొని మరిచిపోయారో , ఖురాన్ చదవడం మానేశారో మరియు ఫజర్ నమాజ్ చదవకుండా పడుకుని ఉంటారో అలాంటి వారికి శిక్ష జరుగుతుంది“. ఎవరైతే ఈ రోజుల్లో ఫజర్ నమాజ్ లు వదిలేస్తున్నారో, ఎనిమిది తొమ్మిది పది పదకొండు వారి యొక్క డ్యూటీ సమయం వరకు, ఒకవేళ ఉదయం పూట డ్యూటీ లేకుంటే ఫజర్ నమాజ్ చదవకుండా అలాగే పడుకొని ఉంటారో, వారు ఇలాంటి శిక్షల నుండి భయపడి తమను తాము ఇలాంటి శిక్షల నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏమిటి? ఫజర్ నమాజ్ చదవడం మొదలు పెట్టాలి. ఖురాన్ చదువుతూ ఉండాలి. ఖురాన్ పారాయణం ని వదలకూడదు.
అలాగే సమాధి శిక్షలకు గురిచేసే దుష్కార్యాల్లో ఒకటి మూత్ర విసర్జన సందర్భంలో దాని యొక్క తుంపరలు పైన పడకుండా జాగ్రత్త పడకపోవడం, మూత్ర విసర్జన తరువాత పరిశుభ్రత చేసుకోకపోవడం, అలాగే చాడీలు చెప్పడం, పరోక్ష నింద చెప్పడం ఇవన్నీ కూడా సమాధి శిక్షకు మనల్ని గురి చేస్తాయి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి ఒక దారిలో వెళ్తున్నారు. అటు పక్కన రెండు సమాధులు కనబడ్డాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “వీరిద్దరూ చేసే పాపాన్ని మహా ఘోరమైన పెద్ద పాపంగా భావించలేదు వీళ్ళు. అయినా వీరికి శిక్ష చాలా ఘోరంగా జరుగుతుంది. వారిలో ఒకతను మూత్ర విసర్జన నుండి, మూత్ర తుంపరలు నుండి జాగ్రత్తపడేవాడు కాదు. మరొక వ్యక్తి చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు.” మరో ఉల్లేఖనంలో ఉంది. “పరోక్ష నిందలు చెప్పుకుంటూ ఉండేవాడు.”
సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి అబద్ధం. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యలో జరిగే మాటల్లో అబద్దం పలకడం కానీ మరియు ప్రత్యేకంగా ఎవరైతే న్యూస్ ఛానెల్ లో పని చేస్తున్నారో, ఎవరైతే అల్లాహ్ (త’ఆల) వారికీ వాక్చాతుర్యం ప్రసాదించాడో మాట్లాడేటువంటి విధానం ఇచ్చాడో వారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతో మంది శాటిలైట్ ఛానెల్ లో గానీ లేక ఇంకా వేరే సోషల్ మీడియాల ద్వారా వారి యొక్క మాట వ్యాప్తి చెందుతూ ఉందో అలాంటి వారు మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్త పడాలి. అబద్ధం ఏదైతే వారు తెలుపుతారో అబద్దం మాట ఏదైతే పలుకుతారో దానికి ఎంత ఘోరమైన శిక్ష ఉందంటే మనం దాన్ని ఊహించలేము, భరించలేము. అబద్ధం పలికే వారు ప్రత్యేకంగా ఎవరైతే ఏదైనా మాట మాట్లాడిన తర్వాత వారి యొక్క మాట ప్రపంచంలో వ్యాపించి పోతుందో అలాంటి వారు మరీ జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే సహీ బుఖారి హదీస్ నెంబర్ 7074 లో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నరకంలో ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి యొక్క నోట్లో కత్తి వేసి ఇటు మెడ వరకు కోయడం జరుగుతుంది. ఇటు నుండి ఇక్కడి వరకు వెనకకు వస్తాడు దైవదూత కోసుకుంటూ, మళ్ళీ తర్వాత అదే కత్తి తీసి ఇటు వైపు నుండి ఇటు మెడ వరకు కోస్తాడు. ఈ విధంగా ఇటు నోట్లో పెట్టి, ఇటు ముక్కులో పెట్టి, ఇటు కన్నులో పెట్టి ఈ విధంగా కోస్తూ ఉంటాడు. ఇటు కోసిన తర్వాత ఇటు వస్తాడు, ఇటు నుండి మళ్ళీ ఇటు వచ్చేసరికి సరి అయిపోతుంది. మళ్ళీ కోస్తాడు. ఈ విధంగా అతని నుండి రక్తం కూడా వెళ్తూ ఉంటుంది. ఈ శిక్ష జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఈ శిక్ష ఎవరికీ జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రశ్నించినప్పుడు, ఇతను ఎవరు అంటే, ఇతను పొద్దున్న లేసిన తరువాత అబద్దం పలికే వాడు. ఆ అబద్ధాన్ని ప్రపంచంలో వ్యాపింప చేసే ప్రయత్నం చేస్తూ దాన్ని వ్యాపించే వారు. అందుకు అతనికి ఇలాంటి శిక్ష జరుగుతుంది అని. అయితే అబద్ధాల్లో కూడా కొన్ని స్టేజ్ లు ఉన్నాయి. ఒక వ్యక్తి తన వ్యక్తిగత లాభం కొరకు ఒక మనిషితో ఏదైనా మాట్లాడుతూ అబద్ధం పలుకుతాడు. ఇందులో ఇద్దరి మధ్యలోనే ఏదైనా ఎవరికైనా నష్టం జరగవచ్చు. మరొక అబద్ధం ఒక సమాజానికి కావచ్చు. కొన్ని సందర్భాల్లో అబద్ధం మనిషి అల్లాహ్ యొక్క ప్రవక్త మీద, మరి కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ అల్లాహ్ కు వ్యతిరేకంగానే అల్లాహ్ మీద అబద్ధం, అసత్యం పలుకుతాడు. ఈ రకంగా అబద్దం ఎవరి పట్ల ఎంత కఠినంగా ఉంటుందో అదే ప్రకారంగా అతని యొక్క శిక్ష కూడా కఠినంగా ఉండవచ్చు.
సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో మరొకటి వడ్డీ తినడం, వడ్డీ తీసుకోవడం, వడ్డీ వ్యాపారాలు, వడ్డీ లావాదేవీలలో పాల్గొనడం. అదే సహీ బుఖారీ హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నరకంలో ఒక వ్యక్తిని చూశారు. అతన్ని ఒక రక్తపు నదిలో వేయడం జరిగింది. ఈదుతూ ఈదుతూ దాని చివరి వరకు వచ్చి పైకి ఎక్కుదాము అని అనుకుంటాడు. ఈ నదిలో నుండి బయటికి వచ్ఛేద్దాము ఈ శిక్షను నేను భరించలేను అని అనుకుంటాడు. అంతలోనే ఆ ఒడ్డుమీద ఒక దైవదూత ఉంటాడు. అతని వద్ద కొన్ని రాళ్ళు ఉంటాయి. ఎప్పుడైతే ఒడ్డుకు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాడో ఆ రాళ్లతోనే అతన్ని కొడతాడు. అతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. మళ్లీ రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే దగ్గరికి వస్తాడో ఈ దైవదూత అతన్ని రాళ్లతో కొడతాడు. ఈ విధంగా అతనికి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు జిబ్రీల్ అమీన్ తెలిపారు “ఇతడు ప్రజల నుండి ప్రజలకు అప్పు ఇచ్చి, అసలైన అప్పు తో పాటు వడ్డీ కూడా తీసుకుంటూ ఉండేవాడు” అని చెప్పారు. అందుకు మహాశయులారా ఈ రోజుల్లో వడ్డీ తీసుకోవడంలో మనకు కొంత లాభం కనబడుతుంది కావచ్చు. కానీ వాస్తవానికి ఇది లాభం కాదు. మన ఇహ పర లోకాలను నష్టాలలో చేకూర్చి అతి భయంకరమైన పాపం.
సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో మరొకటి వ్యభిచారం. ఈ రోజుల్లో ఇంత అభివృద్ధి చెందిన కాలం, టెక్నాలజీ డెవలప్ అయిన కాలం, అన్ని రకాల వనరులు, అన్ని రకాల సౌకర్యాలు పెరిగిన ఈ కాలంలో అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎక్కువగా తెలుపుకొని ఆయనకు విధేయత చూపే దానికి బదులుగా అనేక మంది యువకులు, యువతులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అన్నటువంటి తేడా లేకుండా వ్యభిచారం యొక్క పాపములో కూరుకుపోతున్నారు. వ్యభిచారం ఎంత ఘోరమైన చెడ్డ కార్యం అంటే దానికి ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్, ఒక కార్యక్రమం అవసరం ఉంటుంది. కానీ సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఇది కూడా ఒకటి. అదే సహీ బుఖారీ హదీస్ లో ఉంది – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూశారు: ఒక చాలా పెద్ద కుండ ఉంది. లోపల పురుషులు, స్త్రీలు నగ్నంగా ఉన్నారు. దాని కింద మంట ఉంది. ఎప్పుడైతే మంట భగభగ మండుతూ పైకి వస్తుందో వారందరూ ఘనమైన శబ్దంతో అరుస్తూ బయటికి రావాలి అనుకుంటారు. కానీ కుండ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మూత చిన్నగా ఉంటుంది. దాని లోపలి భాగం చాలా పెద్దగా ఉంటుంది. ఈ విధంగా వారు బయటికి రాలేక పోతారు. మళ్ళీ ఆ మంటలు చల్లారినట్లు అవుతూ ఉంటే వెంటనే కిందికి పడిపోతారు. ఈ రకంగా వారికి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ శిక్ష ఏవరికి జరుగుతుంది అంటే వీళ్ళందరూ వ్యభిచారం చేసేవాళ్ళు అని చెప్పడం జరిగింది. ఈవిధంగా మహాశయులారా ఇలాంటి కార్యాలకు, ఇలాంటి పాపాలకు దూరంగా ఉండాలి. మన సంతానంలో ఎవరైనా ఇలాంటి చెడు కార్యాలకు పాల్పడటం అయితే లేదు కదా అని మనం జాగ్రత్తపడాలి. వారి యొక్క ఉత్తమ శిక్షణకై చాలా కృషి చేస్తూ ఉండాలి.
సమాధి శిక్షకు గురి అయ్యే పాపాలలో ఒకటి ప్రజలకు మంచిని గురించి ఆదేశించి స్వయంగా ఆ మంచిని ఆచరించకపోవడం. అల్లాహ్ ప్రత్యేకంగా మాలాంటి వాళ్లందరినీ కూడా కాపాడుగాక, వారందరికీ కూడా సన్మార్గం చూపు కాక. వాస్తవానికి మహాశయులారా ఇది మహా భయంకరమైన విషయం. ఏ ధర్మబోధనలను అయితే మనం ఇతరులకు బోధిస్తామో, వాటిని ఆచరించే ప్రయత్నం కూడా చేయాలి. ఎవరైతే చెప్పే మాట ఒకటి కానీ వారి ఆచరణ దానికి భిన్నంగా ఉంటుందో, ప్రళయదినాన వారిని ఎలా శిక్షించడం జరుగుతుంది? ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గగన ప్రయాణానికి వెళ్ళిన రాత్రి కొందరిని చూశారు. వారి యొక్క పెదవులు, నరక కత్తెరలతో కత్తిరించ బడుతున్నాయి. మళ్లీ కొంతసేపట్లో అవి సరి అయిపోతాయి. మళ్లీ కత్తిరించడం జరుగుతుంది. మళ్ళీ సరి అయిపోతాయి. ఇలాంటి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అంటే నీ అనుచర సంఘంలోని ప్రసంగీకులకు. ఎవరైతే ప్రసంగాలు చాలా బ్రహ్మాండంగా చేస్తారో, కానీ వాటి ప్రకారంగా ఆచరించే ప్రయత్నం చెయ్యరు.
సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి రమదాన్ లో పాటించే ఉపవాసాలు, అందులో ఉపవాసాలు పాటిస్తున్నట్లు గా ప్రజల అందరితో కలిసి ఉండడం, ఉపవాసాలు ఉండటం. కానీ ఇఫ్తార్ సమయం కాకముందే ఇఫ్తార్ చేసేయడం, ఉపవాసాన్ని భంగ పరచడం, ఏమైనా తినేయడం. దీని మూలంగా కూడా సమాధిలో కఠినమైన శిక్ష జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హెచ్చరించారు. సహీ ఇబ్నె హిబ్బాన్ మరియు ముస్తద్రక్ లోని హదీత్ షేక్ అల్బానీ రహిమహుల్లా దానిని సహీ గాపేర్కొన్నారు. ఇలాంటి వారిని తల క్రిందులుగా చేసి, కాళ్ళు పైకి చేసి వ్రేలాడ తీయడం జరుగుతుంది మరియు వారి యొక్క నోటిని కత్తెరలతో కోసుకుంటూ వెనుక వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. రక్తం చిందుతూ కిందికి కారుతూ ఉంది. ఇలా ఈ శిక్ష జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. ఇలాంటి శిక్ష ఎవరికీ జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు ఎవరైతే ఇఫ్తార్ సమయం కాకముందే రమదాన్ లో తమ ఉపవాసాలను భంగపరిచేవారో, ఇఫ్తార్ చేసేవారో అలాంటి వారికి ఈశిక్ష జరుగుతుంది అని తెలపడం జరిగింది.
ఇంకా మహాశయులారా సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో, ఈ రోజుల్లో అనేక మంది దీనికి పాల్పడి ఉన్నారు. ఏమిటంటే, తమ యొక్క ప్యాంటు గాని, పైజామా గాని, లుంగీ గాని,సౌబ్ కానీ, ఏ దుస్తులు అయినా చీలమండలానికి (ankles) కిందిగా తొడగడం. సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హదీత్ ఉంది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. “మీకంటే ముందు ఒక వ్యక్తి గర్వంతో తన వస్త్రాన్ని వ్రేలాడ తీసుకుంటూ భూమిపై వెళ్తూ ఉన్నాడు. అల్లాహ్ తఆలా అతన్ని భూమిలోనే ధ్వసం చేసాడు (భూమిలోకి కృంగిపోయాడు). అతడు ప్రళయదినం వరకు భూమిలో ధ్వసం అవుతూనే ఉన్నాడు.” అల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ . ఎవరికైనా ఏదైనా గర్వ ఉద్దేశం లేకున్నా గాని ఇలా చీలమండలానికి కిందిగా తొడగడం ఇది యోగ్యం లేదు, ధర్మ సమ్మతం కాదు. పరలోకం లోనే కాకుండా, అంతకంటే ముందు సమాధి శిక్షకు కూడా ఒక కారణం అవుతుంది. అందుగురించి మనం దీని నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.
ఇంకా మహాశయులారా సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి జంతువులను కష్టపెట్టడం, వాటిని శిక్షించడం, వాటికి బాధ కలిగించడం కూడా. ఏ స్త్రీ ఒక పిల్లిని కట్టేసి, బంధించి అన్నం నీళ్లు ఇవ్వకుండా దానిని శిక్ష పెట్టిందో, అదే స్థితిలో అది చనిపోయిందో ఆమెకు నరక శిక్ష ఉంది అని ఏదైతే ఒక ప్రఖ్యాతిగాంచిన హదీత్ ఉందో అదే స్త్రీ గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు. ఆమెను సమాధిలో కూడా శిక్షించ బడుతూ ఉన్నట్లుగా నేను చూశాను అని. అందుకు ఏ జంతువులను కూడా శిక్షించకూడదు.
అలాగే సమాధి శిక్షలకు గురిచేసే పాపాల్లో మరొకటి అప్పు తీసుకొని అప్పు ఇచ్చిన వారికి చెల్లించకపోవడం, అదే స్థితిలో చనిపోవడం. ఈ రోజుల్లో ఎంతో మంది ఇలాంటి పాపానికి గురి అవుతున్నారు. తమ అవసరానికి అప్పులు తీసుకుంటారు గడువు దాటిపోతుంది. దాటి పోయిన తర్వాత కూడా అప్పు ఇచ్చినవాడు నాలుగు సార్లు ఇంటికి వచ్చి అప్పు అడిగాడు అంటే వెళ్లి కోర్టు నుండి స్టే తీసుకురావడం, అప్పు ఇవ్వకుండా ఏదైనా సాకులు చూపి తప్పించుకునే ప్రయత్నం చేయడం మరియు ప్రత్యేకంగా ప్రభుత్వం వైపు నుండి ఏ అప్పులు అయితే ఇవ్వబడతాయో వాటిని బూటకపు సాకులు ద్వారా తప్పించుకునే ప్రయత్నాలు కూడా ఎంతో మంది చేస్తూ ఉంటారు. అయితే గమనించాలి. అప్పు ఎవరి నుండి తీసుకున్నామో వారికి చెల్లించకపోవడం కూడా ఇది ఒక పాపం, ఇది కూడా మన సమాధి శిక్షకు కారణం అవుతుంది.
ఈ విధంగా మహాశయులారా ఇప్పటివరకు మనం ఈ కార్యక్రమంలో సమాధి శిక్షకు గురి చేసే పాపాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే దీని తర్వాత కార్యక్రమం తర్వాత ఎపిసోడ్ లో నరక శిక్ష నుండి రక్షింపబడే పుణ్యకార్యాలు ఏమిటో అవి కూడా మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము. తరువాయి భాగం కూడా వినడం మర్చిపోకండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బారకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్మల్ని ఉద్దేశించి “నేను మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాలను గురించి తెలుపనా? అని అడిగారు. ఈమాట ఆయన మూడుసార్లు పలికారు. దానికి మేము “తప్పకుండా తెలుపండి దైవప్రవక్తా!” అన్నాము. అప్పుడాయన “అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించటం, తల్లిదండ్రులమాట వినకపోవటం” అని తెలిపారు. ఆ తరువాత ఆయన ఆనుకుని కూర్చున్న వారల్లా ఒక్కసారిగా లేచి సరిగా కూర్చొని “జాగ్రత్తగా వినండి! అబద్ధమాడటం (అన్నిటికంటే ఘోరమైన పాపం)” అని అన్నారు. ఇలా మాటిమాటికి చెబుతూ పోయారు. చివరికి మేము మనసులో “అయ్యో! ఈయన ఈ మాటలు ఇక చాలిస్తే బాగుండు” అని అనుకున్నాం.
[సహీహ్ బుఖారీ : 52 వ ప్రకరణం – షహాదాత్, 10 వ అధ్యాయం – మాఖీల ఫీషహాదతిజ్జూర్]
విశ్వాస ప్రకరణం : 36 వ అధ్యాయం – ఘోరపాపాలు, ఘోరాతి ఘోరమైన పాపాలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1.
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి రెండు సమాధుల మధ్య నుంచి నడుస్తూ “ఈ రెండు సమాధుల వాసులు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షకు పెద్ద కారణం ఏదీ లేదు. వారిద్దరిలో ఒకడు మూత్రం (చుక్కలు) వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు. రెండవ వ్యక్తి చాడీలు చెబుతూ తిరుగుతుండే వాడు. అంతే” అని తెలియజేశారు. తరువాత ఆయన ఓ పచ్చటి మండ తీసుకుని, దాన్ని మధ్యకు చీల్చి రెండు భాగాలు చేశారు. ఆ రెండింటిని ఆ రెండు సమాధులపై నాటారు.
అనుచరులు అది చూసి “దైవప్రవక్తా! మీరిలా ఎందుకు చేశారు” అని అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఇలా చేయడం వల్ల ఈ మండలు ఎండిపోనంత వరకు వీరి (సమాధి) శిక్ష కొంత వరకు తగ్గిపోవచ్చని భావిస్తున్నాను” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 4 వ ప్రకరణం – వుజూ, 56 వ అధ్యాయం -మాజా అఫీ గస్లిల్ బౌల్]
శుచి, శుభ్రతల ప్రకరణం – 34 వ అధ్యాయం – మూత్రం ఆశుద్దత కు దూరంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హద్దథనా ముహమ్మద్ ఇబ్ను అల్ ముథన్న వ ఇబ్ను బష్షారిన్ ఖాల హద్దథనా ముహమ్మద్ ఇబ్ను జఅఫిన్ హద్దథనా షుఅబతు సమియ్ తు అబా ఇస్హాఖ యుహద్దిథు అన్అబి అల్అహ్వశి అన్ అబ్దిల్లాహ్ ఇబ్ని మస్ఊదిన్ ఖాల, ఇన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల “ఆలాఉనబ్బి ఉకుమ్ మా అల్ అద్హు?హియన్నమీమతు అల్ ఖాలతు బైనన్నాసి” రవాహ్ సహీ ముస్లిం.
అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త ← ముహమ్మద్ ఇబ్ను అల్ ముథన్న← ఇబ్ను బష్షారిన్← ముహమ్మద్ ఇబ్ను జఅఫిన్ ← షుఅబతు ← అబా ఇస్హాఖ ← అబి అల్అహ్వశి ← అబ్దిల్లాహ్ ఇబ్ని మస్ఊదిన్ (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.
అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయంగా ఇలా ఉపదేశించినారు. “మీకు అల్ అద్హు అంటే ఏమిటో తెలుపనా? అదిమానవుల మధ్య చాడీలు విస్తరింప చేయడము”. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.
హదీథ్ఉల్లేఖకునిపరిచయం – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క ఇస్లాం ధర్మం సందేశాన్ని ప్రారంభంలోనే స్వీకరంచిన వారిలో ఉత్తమములలో అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఒకరు. వీరు ప్రముఖ ధర్మనిష్ఠాపరుల, ఖుర్ఆన్ పారాయణుల, ధర్మజ్ఞానకోవిదుల ప్రసిద్ధులలో ఒకరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం దగ్గర దాదాపుగా 70 ఖుర్ఆన్ అధ్యాయాలను కంఠస్థం చేసారు. 32వ హిజ్రీ సంవత్సరంలో, 60 సంవత్సరాల వయస్సులో మదీనా పట్టణంలో వీరు మరణించారు.
హదీథ్వివరణ
ఇస్లాం ధర్మం ప్రజలకు పరస్పర ప్రేమాభిమానాలతో, సోదర భావంతో, కలిసిమెలిసి ఆదర్శవంతంగా జీవితం గడపే మంచి మార్గం వైపునకు దారిచూపుతున్నది. ఇంకా పరస్పర వైషమ్యాలు, ఈర్ష్యాద్వేషాలు, కోపతాపాలు, భేదాలు కూడదని నివారిస్తున్నది. ప్రజల మధ్య ప్రేమాభిమానాలను తుడిచిపెట్టి, వారిలో సంఘీభావాన్ని, కలిసిమెలిసి జీవించటాన్ని ముక్కలుముక్కలు చేసే అత్యంత ప్రమాదకరమైన దురలవాటు చాడీలు చెప్పటం. దీని వలన ప్రజల హృదయాలలో కోపతాపాలు భగ్గుమంటాయి. ఒకరినొకరు అసహ్యించుకోవటం మొదలవుతుంది. మంత్రగాళ్ళు సంవతర్సరకాలంలో లేపలేని అలజడిని, అపోహలను, అల్లర్లను ఒక్కోసారి చాడీలు మరియు అబద్ధాలు చెప్పేవారు కేవలం ఒక గంటలోనే లేపుతారు. కాబట్టి, ధర్మవిద్య నేర్చుకునే సోదరులారా! మీరేదైనా విషయం విన్నప్పుడు దానిలోని సత్యాసత్యాలను, నిజానిజాలను, వాస్తవాలను బాగా పరిశోధించ వలెను, పరిశీలించ వలెను మరియు, పరీక్షించ వలెను. తెలిసిన వారు చెబుతున్నారు కాదా అని గ్రుడ్డిగా నమ్మరాదు. కేవలం సందేహం మరియు అనుమానం మీద ఆధార పడవద్దు. ఖుర్ఆన్ లోని అల్ హుజురాత్ అనే అధ్యాయంలో 6వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు –
దైవవిశ్వాసులారా! ఎవరైనా దుర్మార్గుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, నిజానిజాలు విచారించి తెలుసుకోండి. అలా చేయకపోతే, మీకు తెలియకుండానే మీరు ఏదైనా వర్గానికి నష్టం కలిగించవచ్చు, తర్వాత చేసినదానికి పశ్చాత్తాప పడవలసి రావచ్చు.
కాబట్టి ఎల్లప్పుడూ చాడీలు చెప్పేవారితో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటువంటి వారికి సమాజంలో గౌరవమర్యాదలు ఉండవు. ఇంకా అటువంటి వారిలో మంచి నడవడిక కూడా ఉండదు. అటువంటి వారి యొక్క ఏకైక లక్ష్యం ప్రజలు కష్టం కలిగించటం మరియు బాధలకు గురిచేయటం. ఎదుటి వారు కష్టనష్టాలలో కూరుకు పోవటం చూసి సంతోషపడతారు. అటువంటి నుండి అల్లాహ్ మమ్ముల్ని కాపాడు గాక! ఆమీన్.
ఈ హదీథ్ వలన కలిగే లాభాలు:
చాడీలు చెప్పటం మరియు అపవాదాలు వేయటం హరామ్, ఇస్లాం ధర్మం పూర్తిగా నిషేధించినది.
చాడీలు చెప్పటమనేది అత్యంత ఘోరమైన పాపాలలో పరిగణించబడుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.