అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]
మూలం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్
తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల హఖ్ తెలుగు పబ్లికేషన్స్
కరుణామయుడు కనికరించేవాడు అయిన అల్లాహ్ పేరుతో
మహాశయులారా !
ఇస్లాంలో దైవ గృహాన్ని మస్జిద్ అనంటారు. మస్జిద్ లో అల్లాహ్ ఆరాధన జరుగుతుంది. ఇతర ధార్మిక కార్యక్రమాలు కూడా మస్జిద్ లో జరుగుతాయి. మస్జిద్ ల అన్నింటి దిశ మక్కాలో ఉన్న అల్లాహ్ కేంద్ర ఆరాధనా స్థలమైన కాబా గృహం వైపుకు మరలి ఉంటుంది. ఏ విధంగానయితే ఒక ముస్లిం పై ప్రతి రోజూ అయిదు పూటల నమాజ్ విధిగా చేయబడిందో అదే విధంగా అది సవ్యంగా నెరవేరేందుకుగాను జమాఅత్ తో కలసి, అంటే సామూహికంగా నమాజ్ చేయమని కూడా ఆదేశించటం జరిగింది. సామూహికంగా చేసే నమాజ్ లో అపారమయిన, అసంఖ్యాకమైన ప్రాపంచిక, పరలోక శుభాలు ఇమిడి ఉన్నాయి.
అయితే ప్రతి సామూహిక నమాజ్ కోసం వేళకు చేసే ప్రకటననే ‘అజాన్‘ అంటారు. ఈ ‘అజాన్’లో యావత్తు ఇస్లామీయ బోధనల సారాంశం పొందుపరచబడి ఉంది. అందుకే అజాన్ ను ‘దావతితామ్మ‘ అన్నారు. అంటే అది పరిపూర్ణమైన పిలుపు అన్నమాట. ఈ పిలుపులో గొప్ప ఆకర్షణ ఉంది. అదెంతో ప్రభావవంతమైంది. వేళకు అయ్యే ‘అజాన్’ పనిలో వున్న వారిని, ఖాళీగా ఉన్న వారిని, నిద్రించేవారిని అందరినీ కదిలిస్తుంది. అజాన్ పిలుపు ద్వారా, అల్లాహ్ – దైవదాసుని వాస్తవం ప్రస్ఫుటం చెయ్యబడుతుంది. ఈ పిలుపులో ఇహపర సాఫల్యాల సందేశం ఉంది. ఈ పిలుపు దాసుడ్ని అతని స్వంత పనులన్నింటి నుండి, కోర్కెల నుండి వేరు చేసి అతన్ని అల్లాహ్ తో, అల్లాహ్ నామ స్మరణతో, అల్లాహ్ ఆరాధనతో సంబంధం ఏర్పరుస్తుంది. మహత్తరమైన ఈ పిలుపు దాసుని హృదయాంతరాళాల్లో ఓ విధమైన ప్రకంపనం పుట్టిస్తుంది. అల్లాహ్ ఆరాధనకై అతన్ని సమాయత్తం చేస్తుంది. అంతేకాదు, ఈ గొప్ప పిలుపు, అల్లాహ్ పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉన్న వారెవరో, బూటకపు ప్రేమ కలిగి ఉన్న వారెవరో కొద్ది సేపట్లోనే తేల్చి వేస్తుంది. సర్వోన్నతుడయిన అల్లాహ్ పట్ల, దైవ ప్రవక్త పట్ల, దైవ ధర్మం పట్ల నిజమయిన, నిష్కల్మషమైన ప్రేమ, విశ్వాసం ఉన్నవారు ఈ పిలుపు వినగానే అల్లాహ్ గృహం వైపుకు మరలి వస్తారు. మనో వాక్కాయ కర్మలచేత వారు ఈ పిలుపుకు బదులు ఇస్తారు. అంటే, వారు అల్లాహ్ ఆరాధనలో నిమగ్నులవుతారు.
అజాన్ పిలుపు విన్న తరువాత అల్లాహ్ గృహం వైపుకు మరలటం ముస్లిం పురుషులకు తప్పనిసరి అయిపోతుంది. ఇది శక్తిమంతుడయిన అల్లాహ్ యొక్క తిరుగులేని ఆదేశం. అజాన్ ఎవరి పిలుపు అనుకున్నారు ?! అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేరిట పంపబడే ఓ గొప్ప ట్రంకాల్, ఆ ట్రంకాల్ ను అందుకుని దానికి బదులు ఇవ్వటం దాసులు విధి. ‘ఒక విశ్వాసి అజాన్ పిలుపు ఇస్తే ఆ పదాలకు మీరు బదులు పలకండి’ అని మానవ మహోపకారి (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధించారు. ఉదాహరణకు, ముఅజ్జిన్ ‘అల్లాహు అక్బర్’ అనంటే మనమూ ఆ పదాన్ని పలకాలి. ఆ విధంగా చేస్తే మన ప్రక్కనున్న వారు కూడా దాన్ని అనుసరిస్తారు. ఆ వాతావరణం చూస్తుంటే దాసులు తన ప్రభువుతో సంభాషిస్తున్నారా! అన్నట్లే ఉంటుంది. అందుకే అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేర వచ్చిన ట్రంకాల్ అని అనటం ఎంతో సమంజసం.
అల్లాహ్ స్వయంగా తన దాసుడ్ని ‘అజాన్’ ద్వారా తన దర్బారుకు పిలుచుకున్నాడంటే ఎంత దయగలవాడాయన! ఆ పిలుపును, ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయన దర్బారుకు వెళ్ళిన దాసుడు ధన్యుడు. ఇక్కడ అతిధేయుడు అల్లాహ్ అయితే అతిథి దాసుడు. అడిగేవాడు దాసుడయితే ఇచ్చేవాడు అల్లాహ్. అతిథి అయిన దాసునికి అతిథేయుడు అయిన అల్లాహ్ ఇచ్చే వరాలకు, అనుగ్రహాలకు హద్దే లేదు.
అల్లాహ్ ఆరాధన కోసం దాసుడు మస్జిద్ లో అడుగు పెట్టగానే దైవ దూతలు అతని చుట్టూ అల్లుకుంటారు. నమాజ్ కోసం నిరీక్షించినంత వరకూ దూతలు అతని కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉంటారు. అల్లాహ్ కారుణ్యం అతనిపై కురవాలనీ, సుఖశాంతులు అతనికి ప్రాప్తం కావాలని వేడుకుంటారు. అతని పాపాల క్షమాభిక్షకై వేడుకుంటారు.
అల్లాహ్ చివరి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఏమని ప్రబోధించారంటే “దాసుడు అల్లాహ్ గృహం వైపుకు మరలి అతను వేసే ఒక్కో అడుక్కీ ఒక్కో పాపం చెరిపివేయబడుతుంది. అతని ఖాతాలో ఒక్కో అడుక్కి ఒక్కో సత్కార్యం రాయబడుతుంది. అతని స్థాయి, ఒక్కో మెట్టు అల్లాహ్ సాన్నిధ్యంలో పెంచబడుతుంది.”
ఇహ పరాలలో అజాన్ ఎన్ని శుభవార్తలనిస్తుందో ఆలోచించండి !
అజాన్ స్థానం
ఇక ధర్మంలో అజాన్ ఔన్నత్యం ఏమిటో చూద్దాం. దైవ ధర్మమయిన ఇస్లాం నిదర్శనాలలో ఓ గొప్ప నిదర్శనం అజాన్. ఇది సున్నతె ముఅక్కిద. అంటే దీని ప్రాముఖ్యం ధర్మంలో ‘ఫర్జ్’కు దరిదాపుల్లో ఉంది. ఒకవేళ ముస్లింలు సామూహికంగా ‘అజాన్’ వ్యవస్థను గనక బహిష్కరిస్తే, కాలపు ఖలీఫా వారికి వ్యతిరేకంగా కఠిన చర్య తీసుకోగలడు. అందుకు కారకులయిన వారిపై మరణ దండన కూడా విధించగలడు.






You must be logged in to post a comment.