మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం
https://www.youtube.com/watch?v=75Sw5ptc_50
[మరణానంతర జీవితం – పార్ట్ 20] [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద. అమ్మా బాద్.
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక: ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం.
త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి. మనం దైనందిన జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి.
ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా వ్రాయబడి ఉంటాయో, ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో, ఈ విషయాల్ని అపరాధులు, పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు. వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో, ఆ విషయాన్ని అల్లాహు తాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు.
وَوُضِعَ الْكِتَابُ
కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది.
فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ
అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు, వారు భయ కంపితులై వాటిలో ఉన్న, వ్రాయబడిన ఆ విషయాలన్నింటినీ చూసి భయకంపితులై పోతారు.
وَيَقُولُونَ
మరియు అంటారు:
يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ
మా పాడుగాను, ఇది ఎలాంటి గ్రంథం, ఎలాంటి కర్మపత్రం.
لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً
ఏ చిన్న దానిని గానీ, ఏ పెద్ద దానిని గానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో వ్రాయబడింది.
إِلَّا أَحْصَاهَا
ప్రతీ ఒక్కటి అందులో చేర్చడం జరిగింది.
وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا
వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు.
وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
నీ ప్రభువు ఎవరిపై కూడా ఏ మాత్రం అన్యాయం చేయడు, ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు.
ఇంతే కాదు, ప్రళయ దినాన నెలకొల్పబడే ఆ త్రాసు యొక్క మరో విశిష్టత, మరో ప్రత్యేకత ఏముంటుందంటే, అది మనిషిని తూకం చేస్తుంది మరియు మనిషిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతని యొక్క బరువును తెలియబరుస్తుంది. అల్లాహు అక్బర్.
మనిషిలో ఎంత విశ్వాసం ఉంది, దానిని బట్టి అతని బరువు ఎంత కాగలుగుతుందో దానిని చూపిస్తుంది. ఇంతకుముందు ఇలాంటి హదీథ్ లను కొందరు విని తిరస్కరించే ప్రయత్నం చేశారు, నవూదుబిల్లాహ్ అస్తగ్ ఫిరుల్లాహ్. కానీ ఒక నిజమైన విశ్వాసి ఖురాన్లో వచ్చిన విషయాన్ని, హదీథ్ లో వచ్చిన విషయాన్ని ఏ స్థితిలో కూడా తిరస్కరించలేడు. ఎందుకంటే అల్లాహ్ చెప్పిన మాట, ప్రవక్త తెలిపిన మాట నూటికి నూరు పాళ్లు నిజమవుతాయి. అది ఇప్పుడు ప్రస్తుతం మనకు అర్థమైనా కాకపోయినా.
కానీ అల్లాహు అక్బర్, అల్లాహ్ యొక్క దయ కూడా ఎంత గొప్పగా ఉంది, “నా దాసులు నేను పంపిన ఏ విషయాన్ని కూడా తిరస్కరించవద్దు, కొన్ని సందర్భాల్లో వారికి మింగుడు పడని విషయాన్ని వారు ఏదైనా తిరస్కరించి పాపానికి గురి కాకూడదు” అని అల్లాహు తాలా ఈ అభివృద్ధి చెందిన కాలంలో ఇలాంటి కొన్ని విషయాలను కూడా వెలికితీస్తాడు. ప్రజలు కొన్ని విషయాల్ని, నూతన కొన్ని పరికరాల్ని ఉనికిలోకి తీసుకొస్తారు, వాటి ద్వారా అల్లాహ్ తెలిపిన విషయాలను నమ్మడానికి మరింత సహాయం కలుగుతుంది.
ఉదాహరణకు ఈ రోజుల్లో పెద్ద పెద్ద మాల్స్ లలో, మరికొన్ని షాపులలో ఒక మిషన్, ఒక పరికరం ఉంటుంది. నీవు యాభై రూపాయలు, వంద రూపాయలు, ఫైవ్ డాలర్స్, టెన్ డాలర్స్ దాంట్లో వేసి దాని మీద నీవు నిలబడ్డావు, రెండు చేతులు ఇలా పెట్టావు అంటే కేవలం నీ బరువు మాత్రమే కాదు, నీలో షుగర్ ఎంత ఉన్నది, నీలో బీపీ ఎంత ఉన్నది, కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, ఈ విధంగా మన శరీరం లోపలి ఎన్నో విషయాల్ని కేవలం మనం మన పాదాల మీద, రెండు చేతులు ఇలా పెట్టడం ద్వారా అన్ని విషయాలు కూడా అక్కడ తెలుస్తూ ఉంటాయి.
కొంచెం ఆలోచించండి, మనిషి ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి చిన్నపాటి జ్ఞానం, “వమా ఊతీతుం మినల్ ఇల్మి ఇల్లా ఖలీలా” (وَمَا أُوتِيتُم مِّنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا) అల్లాహ్ వద్ద ఉన్న జ్ఞానంలో మీకు ఆవ గింజంత కూడా దొరకలేదు. సముద్రం, అందులో సూదిని ముంచి తీస్తే ఎంత తక్కువ అవుతుందో, అల్లాహ్ యొక్క జ్ఞానంలో మనకు లభించిన జ్ఞానం అంత కూడా కాదు. అయినా ఇంతటి చిన్నపాటి జ్ఞానంతో మనం ఇలాంటి పరికరాలు, ఇలాంటి యంత్రాలు తయారు చేస్తున్నాము, మరియు ఇంత జ్ఞానం పొందిన తర్వాత ఆ సర్వజ్ఞాని చెప్పిన మాటల్ని తిరస్కరిస్తున్నాము? ఇదేనా మనకు న్యాయం? అందుకని సోదరులారా, పరలోకంలో పరలోక దినాన నెలకొల్పబడే ఆ త్రాసులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మనిషిని ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, అది అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతని యొక్క బరువును తెలియజేస్తుంది. అల్లాహు అక్బర్.
సహీ బుఖారీ లోని హదీథ్, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియపరిచారు:
إِنَّهُ لَيَأْتِي الرَّجُلُ الْعَظِيمُ السَّمِينُ يَوْمَ الْقِيَامَةِ، لَا يَزِنُ عِنْدَ اللَّهِ جَنَاحَ بَعُوضَةٍ
అల్లాహు అక్బర్. ప్రళయ దినాన ఒక లావుపాటి మనిషిని తీసుకురావడం జరుగుతుంది. ఆ త్రాసులో పెట్టడం జరుగుతుంది, కానీ అతని బరువు దోమ యొక్క రెక్క అంత కూడా ఉండదు. దోమంత కాదు, దోమ యొక్క రెక్క బరువు ఎంతుంటుందో అంత కూడా అతని బరువు ఉండదు.
మళ్ళీ అబూ హురైరా (రదియల్లాహు తాలా అన్హు) సూరహ్ కహఫ్ లోని ఈ ఆయత్ చదివారు:
فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا
అల్లాహ్ ఆయత్లను తిరస్కరించిన వారు, పరలోక దినాన్ని తిరస్కరించిన వారు, ఇలాంటి వారికి మేము ప్రళయ దినాన ఏ బరువును లెక్క చేయము, ఏ బరువును కట్టించము.
గమనించారా? దీని ద్వారా మనకు తెలిసిన గుణపాఠం ఏంటి? మనం మనకు ఇష్టమైన ఆహారాలు భుజిస్తూ, మన శరీరానికి ఎంతో మనం బలం చేకూరుస్తున్నాము. జిమ్ లోకి వెళ్లి, ఎక్సర్సైజులు చేసి, అన్ని రకాల బాడీబిల్డర్లుగా మనం తయారవుతున్నాము. ఇంకా ముఖం అందం లేకుంటే ఎన్నో స్నో పౌడర్లు పెట్టుకొని, ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని, మనం ప్రజల మధ్య అందంగా కనబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఎంత చేసినా ఈ శరీరం కుళ్ళిపోయేది, మట్టిలో కలిసేది. మిగిలి ఉండేది ఏమిటి? మన ఆత్మ. దీనికి కావలసిన విశ్వాసం, దీనికి కావలసిన సత్కార్యం, దీనికి కావలసిన అల్లాహ్ పంపినటువంటి ఆకాశం నుండి వచ్చినటువంటి ఆహారం ఖురాన్, హదీథ్. అది దానికి మనం ఇవ్వకుంటే, సత్కార్యాల అలవాటు చేయకుంటే, ప్రళయ దినాన మన ఈ శరీరాలు ఏ మాత్రం బరువుగా ఉండవు. ఎప్పుడైతే బరువుగా ఉండవో, నరకానికి పోవాల్సి వస్తుంది మరి. అల్లాహ్ కాపాడు గాక.
ఆ త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని గురించి వచ్చిన హదీథ్ లు వింటే ఎంత ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా లాభం ఉండదు, మనలో మార్పు రావాలి. మనలో చేంజస్ రావాలి. ఆ కష్టతరం, గాంభీర్యత ఏమిటో తెలుసుకుందాం.
మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును ఏర్పాటు చేయడం అనేది ప్రజలపై వచ్చి పడే ఆపదల్లో ఒక పెద్ద ఆపదగా లెక్కించ బడుతుంది. ఎలా అంటే, దీనికి సంబంధించిన హదీథులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటి ద్వారా మనకు ఈ విషయం బోధపడుతుంది. అందులో ఒకటి, ఆ సందర్భంలో ఎప్పుడైతే త్రాసును నెలకొల్పడం జరుగుతుందో, ప్రజల యొక్క కర్మలు, కర్మపత్రాలు తూకం చేయబడతాయో, ప్రతీ ఒక్కరూ తనను తప్ప ఇంకెవరి గురించి కూడా పట్టించుకోడు, ఎవరి గురించి కూడా ఆలోచించడు.
ఆ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియబరిచారు. అయితే జరిగింది ఏమిటంటే, ఒకసారి హజరత్ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తాలా అన్హా నరకాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు. అల్లాహు అక్బర్. అలాంటి పుణ్యాత్ములు ఉండే వారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కొడుకు ఆరోగ్యం బాగాలేదు, తల్లి హాస్పిటల్లో ఉంది, ఇలాంటి విషయాలు విని మనకు ఎంతో ఏడుపు వస్తుంది. కానీ ఒక్కసారైనా కనీసం ఒంటరిగా ఉండి, అల్లాహ్ ను గుర్తు చేసి, నరకాన్ని గుర్తు చేసుకొని ఎప్పుడైనా మనం కన్నీరు కార్చామా?
ఆయిషా రదియల్లాహు తాలా అన్హా నరకాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు, అదే సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ప్రవేశించారు. “ఆయిషా ఏమైంది? ఏ విషయం నిన్ను ఏడిపిస్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు?” అంటే ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు, “ప్రవక్తా, నరకాన్ని గుర్తు చేసుకొన్నాను, అందువల్ల నాకు ఏడుపు వచ్చింది. అయితే ఒక విషయం చెప్పండి, ప్రళయ దినాన మీరు మమ్మల్ని గుర్తు పెడతారా? ఆ రోజు మమ్మల్ని మర్చిపోకుండా మీరు గుర్తు చేస్తారా?” మరో ఉల్లేఖనంలో ఉంది, ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ప్రశ్నించారు, “ప్రవక్తా, ఏ భార్య లేదా భర్త అయినా తన భార్య లేదా భర్తను, ఏ ప్రియుడైనా తన యొక్క ప్రియమైన వారిని గుర్తు చేస్తారా ఆ ప్రళయ దినాన?” ఆయిషా రదియల్లాహు అన్హా గారి యొక్క ఈ ప్రశ్నకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు:
أَمَّا فِي ثَلَاثَةِ مَوَاطِنَ فَلَا يَذْكُرُ أَحَدٌ أَحَدًا
“ఆయిషా, మూడు స్థానాలు, మూడు ప్రదేశాలు పరలోకంలో ఎలా ఉంటాయి అంటే అక్కడ ఆ సందర్భంలో ఎవరూ కూడా ఎవరినీ గుర్తు చేయరు.” అల్లాహు అక్బర్.
ఒకటి, అల్-మీజాన్ (الْمِيزَانِ). త్రాసు నెలకొల్పడం జరిగినప్పుడు, حَتَّى يَعْلَمَ أَيَخِفُّ مِيزَانُهُ أَمْ يَثْقُلُ. అతని ఆ త్రాసు పళ్ళాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయా లేక తేలికగా ఉండి మీదికి లేసిపోతాయా తెలిసేంత వరకు ఏ మనిషి మరో మనిషిని గుర్తు చేయడు.
రెండో స్థానం, ఇందల్-కితాబ్ (عِنْدَ الْكِتَابِ). ప్రతీ ఒక్కరికి వారి కర్మపత్రాలు ఇవ్వబడుతున్న సందర్భంలో, ఎప్పుడైతే “హాఉముక్రఊ కితాబియా” (هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ) పుణ్యాత్ములు, విశ్వాసులు, “ఇదిగోండి, నాకు నా కర్మపత్రం నా కుడి చేతిలో ముంగటి ద్వారా దొరికింది, తీసుకోండి, మీరు కూడా చదవండి” అని ఏదైతే అంటూ ఉంటారో, అలాంటి సందర్భంలో ప్రతీ ఒక్కరికి వారి కర్మపత్రం ఇవ్వబడే సందర్భంలో ఎవరూ ఎవరినీ గుర్తు చేయరు, ఎప్పటి వరకు? حَتَّى يَعْلَمَ أَيْنَ يَقَعُ كِتَابُهُ، أَفِي يَمِينِهِ أَمْ فِي شِمَالِهِ أَمْ مِنْ وَرَاءِ ظَهْرِهِ. అల్లాహు అక్బర్. ఆ కర్మపత్రం కుడి చేతిలో ముంగటి ద్వారా దొరుకుతుందా, లేదా ఎడమ చేతిలో వచ్చి పడుతుందా ఆ పత్రం, లేదా వీపు వెనక నుండి తీసుకోవడం జరుగుతుందా, ఇది స్పష్టంగా తెలియనంత వరకు ఎవరూ కూడా ఎవరినీ గుర్తు చేయరు.
ఇక మూడో ప్రదేశం, వ ఇందస్-సిరాత్ (وَعِنْدَ الصِّرَاطِ). ఎప్పుడైతే, إِذَا وُضِعَ بَيْنَ ظَهْرَيْ جَهَنَّمَ, ఎప్పుడైతే నరకంపై వంతెన వేయబడుతుందో, పుల్ సిరాత్ అని ఉర్దూలో అంటారో, ఆ వంతెన మీద దాటే సందర్భంలో ఏ మనిషి మరే మనిషిని గుర్తు చేయడు.
ఈ విధంగా ఈ హదీథ్ ద్వారా మనకు ఏం తెలిసింది? త్రాసు నెలకొల్పబడే రోజు ప్రతీ మనిషి అతని త్రాసు పళ్ళాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయా లేదా పాపాలతో తేలికగా ఉంటాయా తెలియనంత వరకు ఎవరూ ఎవరినీ గుర్తు చేయరు. అలాంటి సందర్భంలో గమనించండి, మరి మనం ఈ రోజుల్లో పుణ్యాలు చేసుకొని, విశ్వాస మార్గంలో నడిచి ఉంటేనే కదా ఆ రోజు మన త్రాసు పళ్ళాలు కూడా బరువుగా ఉండేవి.
ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం అక్కడి పెద్ద ఆపదల్లో ఒక పెద్ద ఆపద అనడానికి రెండో ఆధారం: ఆ త్రాసు విషయాన్ని చూసి ఏ క్షణం కూడా పాపం చేయనటువంటి, ఎల్లప్పుడూ దైవ విధేయతలోనే ఉండేటువంటి దైవదూతలు సైతం కంపించిపోతారు, భయపడి పోతారు. “ఓ అల్లాహ్, మేము నీ యొక్క ఆరాధన చేసే హక్కు ఎలా ఉందో అలా చేయలేకపోయాము” అని వారు బాధపడుతూ ఉంటారు. దైవదూతల పరిస్థితి ఇలా అవుతుంది అంటే, ఏ క్షణంలో కూడా వారు పాపం చేయలేదు, దానిని తలచుకొని మన పరిస్థితి ఏం కావాలి?
ముస్తద్రక్ హాకిం లోని హదీథ్, షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహా లో దీనిని పేర్కొన్నారు, హదీథ్ నంబర్ 941.
يُوضَعُ الْمِيزَانُ يَوْمَ الْقِيَامَةِ
ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం జరుగుతుంది.
فَلَوْ وُزِنَ فِيهِ السَّمَوَاتُ وَالْأَرْضُ لَوَسِعَتْ
అందులో ఆకాశాలను, భూములను తూకం చేయదలచినా చేయవచ్చు, అంతటి విశాలంగా ఉంటుంది.
فَتَقُولُ الْمَلَائِكَةُ
అప్పుడు ఆ సందర్భంలో దైవదూతలు అంటారు:
يَا رَبِّ لِمَنْ يَزِنُ هَذَا؟
“ఓ ప్రభువా, ఇందులో ఎవరిని తూకం చేస్తావు, ఏ విషయాల్ని తూకం చేస్తావు?”
فَيَقُولُ اللَّهُ تَعَالَى: لِمَنْ شِئْتُ مِنْ خَلْقِي
అప్పుడు అల్లాహ్ సమాధానం పలుకుతాడు: “నా సృష్టిలో నాకు ఇష్టమైన వారిని, వాటిని నేను అందులో తూకం చేస్తాను.”
అప్పుడు దైవదూతలు అంటారు:
سُبْحَانَكَ مَا عَبَدْنَاكَ حَقَّ عِبَادَتِكَ
“నీవు పవిత్రునివి. అన్ని రకాల లోపాలకు, దోషాలకు, షిర్క్ కు అతీతునివి. మేము నీ యొక్క ఆరాధన చేసే సరియైన హక్కు ఎలా ఉందో అలా చేయలేకపోయాము.”
ఈ విధంగా సోదరులారా, దైవదూతలు భయపడుతున్నప్పుడు మన పరిస్థితి ఏం కావాలి?
ఆ రోజు త్రాసును ఏర్పాటు చేయడం ప్రజలపై వచ్చిపడే కష్టాల్లో, ఆపదల్లో ఒక పెద్ద కష్టం, ఆపద అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, దానికి మూడో ఆధారం: ఒక హదీథ్ ద్వారా బోధపడే విషయం, డైరెక్ట్ గా లేదు కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హజరత్ అనస్ రదియల్లాహు తాలా అన్హు ఒక సందర్భంలో అడిగారు: “ప్రవక్తా, ప్రళయ దినాన మీ సిఫారసు పొందడానికి అక్కడ మిమ్మల్ని ఎలా, ఏ ప్రదేశంలో, ఏ స్థానంలో పొందగలుగుతాము?” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నన్ను ఆ రోజు వంతెన వద్ద కలిసే ప్రయత్నం చెయ్. “అక్కడ మీరు లభించకుంటే?” అని అడిగినప్పుడు, “త్రాసు వద్ద” అని చెప్పారు. “అక్కడ కూడా మీరు లభించకుంటే?” అంటే, “హౌద్ వద్ద, హౌద్-ఏ-కౌథర్” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి, ఈ మూడింటిలో ఏదైనా ఒక ప్రదేశంలో నేను నీకు కలిసి ఉంటాను అని చెప్పారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హౌద్-ఏ-కౌథర్ వద్ద, హౌద్-ఏ-కౌథర్ యొక్క నీళ్లు త్రాపిస్తూ ఉంటారు అన్న విషయం స్పష్టంగా హదీథుల్లో ఉంది. అయితే, పుల్ సిరాత్, వంతెన వద్ద ఏదైతే ఉంటారో, దాని గురించి కూడా “ఓ అల్లాహ్, నా ఉమ్మతీలను, నా అనుచర సంఘాన్ని క్షేమంగా దాటించు” అని సిఫారసు చేస్తూ ఉంటారు. ఇక త్రాసు వద్ద ఎందుకు ఉంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? అయితే, ఇక్కడ కూడా ఆ రెండు విషయాల ద్వారా బోధపడే విషయాన్ని గమనిస్తూ, తప్పకుండా తమ అనుచర సంఘానికి సిఫారసు చేయడానికే అక్కడ ఉంటారు అని అర్థమవుతుంది. ఈ విధంగా, ఎవరి సత్కార్యాలు, దుష్కార్యాలు సమానంగా ఉంటాయో, వారి పట్ల సిఫారసు చేయడానికి, ఇంకా వేరే వారి గురించి సిఫారసు చేయడానికి ప్రవక్త అక్కడ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయడానికి అక్కడ ఉంటారు అంటే అది ప్రజల పట్ల ఎంత కష్టతరమైన విషయం, అందుకే సిఫారసు చేయడానికి ప్రవక్త అక్కడికి వస్తారు అన్న విషయం బోధపడుతుంది.
ఈ విధంగా మహాశయులారా, సాధ్యమైనంత వరకు మనం విశ్వాసం మరియు సత్కార్యాలతో మన యొక్క ఆ త్రాసును బరువుగా చేసేటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి. ఇన్షా అల్లాహ్, దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి, తర్వాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
అల్లాహు తాలా మనందరికీ సత్కార్యాలతో పాటు విశ్వాసం మీద స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]