కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

డౌన్లోడ్ – కలామే హిక్మత్ (వివేక వచనం) -1
రచయిత : సఫీ అహ్మద్ మదనీ
[88 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

ముందుమాట – [డౌన్లోడ్ PDF]

నేటికి పధ్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం కరుణామయుడైన అల్లాహ్ సమస్తమానవాళికి తన సందేశం అందించడానికై తన దాసుల్లో సద్వర్తనులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఎన్నుకున్నాడు. ఆనాడు ప్రపంచం అంధకారంలో మునిగి ఉంది. సత్యం, సదాచారం, సన్మార్గం అనేవి మానవ సమాజంలో బొత్తిగా అరుదై పోయాయి. ప్రజలు సన్మార్గాన్ని అన్వేషించే వారు. కాని వారికి అది లభించేది కాదు. తాత్వికతను, హేతువును ప్రబోధించే విద్యాలయాలెన్నో ఆనాడు ఉన్నప్పటికీ మానవత తన గమ్యాన్ని, గమనాన్ని గుర్తించలేక కారుచీకట్లలో తచ్చాడుతుండేది. ఇలాంటి నికృష్టపు పరిస్థితుల్లో దైవ కారుణ్యం ఉప్పొంగింది. కృపాకరుడైన ఆ ప్రభువు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను తన ప్రవక్తగా అంతిమ సందేశహరునిగా – ఎన్నుకుని సమస్త మానవులకు మహోపకారం చేశాడు.

వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు : స్వయంగా వారినుండేవారి మధ్య ఒక ప్రవక్తను లేపాడు. అతడు ఆయన ఆయత్ లను వారికి వినిపిస్తాడు.వారి జీవితాలను తీర్చిదిద్దుతాడు, వారికి గ్రంథాన్ని, వివేకాన్ని నేర్పుతాడు. వాస్తవానికి ఈ ప్రజలే ఇంతకు పూర్వం ప్రత్యక్షమయిన వక్రమార్గాల్లో పడి వున్నారు.”(ఆలి ఇమ్రాన్ : 164)

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు లభించిన దైవ దౌత్యం, హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) గారి ప్రార్ధనా ఫలం. ఇంకా అది సకల లోకాల వారి కోసం అల్లాహ్ తరఫున వొసంగ బడిన కారుణ్యం. ఒక ప్రవక్తగా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి బాధ్యతలను పవిత్ర ఖుర్ఆన్లో నాలుగు చోట్ల పేర్కొనటం జరిగింది.

  1. తిలావతె ఖుర్ఆన్ : దివ్య ఖుర్ఆన్ ను చదివి వినిపించటం.
  2. తజ్కియ : అంటే తన సహచరుల నీతినడవడికలను, ప్రవర్తనను గమనించి, సంస్కరించటం, వారిలోని చెడుగులను దూరం చేయటం, ఉత్తమ నైతికతను అలవరచుకోమని వారికి ప్రబోధించడం. ఈ లక్ష్య సాధన కొరకు తాను స్వయంగా ఆదర్శవంతంగా నిలబడటం.
  3. గ్రంథ బోధన : అంటే దివ్య ఖుర్ఆన్లోని ఆయత్ల భావాన్ని విడమరచి చెప్పటం, దైవాదేశాలను స్పష్టీకరించటం, స్వీయ ఆచరణ ద్వారా ఖుర్ఆన్ వాక్యాల ధ్యేయాన్ని చాటి చెప్పటం, ఉదాహరణకు నమాజ్, రోజా, జకాత్, హజ్, జిహాద్ మొదలగు విధ్యుక్త ధర్మాలను క్రియాత్మకంగా నిరూపించటం.
  4. వివేకాన్ని నేర్పడం :ఎందరో ప్రాచీన విద్వాంసులు, ఖుర్ఆన్ వ్యాఖ్యాతల అభిప్రాయంలో ‘వివేకం‘ అంటే భావం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఆచరణే. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం )కు దివ్య ఖుర్ఆన్ తో ప్రగాఢ సంబంధం ఉండేది. ఖుర్ఆన్ పై ఆయన ఎల్లప్పుడూ ఆలోచించేవారు, యోచించేవారు. దానికి ఎంతగానో ప్రభావితు లయ్యేవారు. ఆయన జీవితం ఖుర్ఆన్ రంగులో రంగరించబడి ఉండేది. ఇదిలా ఉండగా ఆయనపై సతతం అల్లాహ్ పర్యవేక్షణ ఉండేది. ఆయనకు అనునిత్యం దైవతోడ్పాటు లభించేది. అనువర్తన (ఇత్తెహాద్) కు సంబంధించిన పొరబాటు గనక ఆయన వల్ల ఎప్పుడన్నా జరిగితే, దైవం తరఫున వెంటనే అది సరిదిద్దబడేది. చెప్ప వచ్చిందేమంటే మరే మనిషిలోనూ లేని కొన్ని అసాధారణ ప్రత్యేకతలు మహాప్రవక్తలో ఉండేవి.

దైవత్వం, దేవుని గుణగణాల గురించి ఆయనకు అందరికన్నా ఎక్కువ తెలుసు.ధర్మాధర్మాలు, మంచీ చెడులు యుక్తా యుక్తాల విచక్షణా జ్ఞానం కూడా ఆయనకు అందరికంటే ఎక్కువ ఉండేది.

  • ఆయన అందరికన్నా అధికంగా అల్లాహ్ కు భయపడేవారు. దైవాన్ని సేవించే, విధేయత కనబరిచే విషయంలో అందరికన్నా ముందుండే వారు.
  • ఆయన ఉత్తమ సందేశ ప్రచారకులు. మహా వక్త. ప్రతి విషయాన్ని ఆయన ఎంతచక్కగా, ఉత్తమ రీతిలో బోధించేవారంటే, ఆ విషయాన్ని అంతకన్నా మంచిగా వివరించటం సాధ్యపడదు.

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరికన్నా గొప్ప మానవ శ్రేయోభిలాషి. మానవులను నరకాగ్ని నుండి రక్షించడానికి ఆయన సాధ్యమయినన్ని ప్రయత్నాలన్నీ చేసేవారు. ఈ మహత్కార్యం కొరకు ఎలాంటి త్యాగానికయినా సిద్ధంగా ఉండేవారు.

ఆయన పవిత్ర నోట వెలువడే ఒక్కొక్క పలుకులో బాధ్యతా భావం, భయభక్తులు, ధర్మనిష్ఠ తొణికిసలాడేవి. మరో వంక ఆయన జీవితంలో జీవిత సత్యాల సమగ్ర రూపం ఉట్టి పడుతూ ఉండేది. (అల్లాహ్ తరఫున శాంతి, దీవెనలు ఆయనపై కురియు గాక!) ఆయన పలుకులు సంక్షిప్తంగానే ఉన్నప్పటికీ అందులో ఎంత సమగ్రత ఉండేదంటే, వాటిని వివరిస్తూ పోతే అది మహా సాగరమే అవుతుంది. ఆయన ప్రవచనాల లోతుల్లోకి పోయిన వారికి గొప్ప వివేక సంపద లభిస్తుంది.

దివ్య ఖుర్ఆన్ లాగానే హదీసుల విషయంలోనూ జాగ్రత్తగా ఖచ్చితంగావ్యవహరించాలన్నది సల్ఫెసాలెహ్ విధానం. వారి మార్గానుసరణ లోనే జీవితపు అన్ని రంగాలతో ముడిపడి ఉన్న కొన్ని హదీసుల (ప్రవక్త ప్రవచనాలు) ను ఎన్నుకుని వాటిని విపులీకరించటం జరిగింది. అవసరమనుకున్న చోట్ల మరికొన్ని వివరాలు కూడా క్రోడీకరించవలసి వచ్చింది. ఉదాహరణకు, ఉల్లేఖకులయిన సహాబాల జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలు, దివ్య ఖుర్ఆన్ ఆయత్లు, ఈ గ్రంథాన్ని అందించటంలో ప్రాచీన హదీసు వేత్తల వ్యాఖ్యానాలు, అభిప్రాయాలపై వీలయినంత వరకు ఆధారపడటం జరిగింది.మరికొన్ని చోట్ల ఆయా వ్యాఖ్యాతల అభిప్రాయాలను యధాతథంగా పొందు పరచటాన్ని కూడా మీరు గమనిస్తారు.

అల్లాహ్ ఈ కృషిలోని లోటుపాట్లను మన్నించి కరుణించుగాక! ఇంకా పాఠకులకుదీనిద్వారా ధర్మజ్ఞానం ప్రసాదించుగాక! (ఆమీన్). ఈ పుస్తక ప్రచురణలో ఆర్థిక సహకారం అందించిన శ్రేయోభిలాషులందరికీ అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక! వారి సంపదలో సమృద్ధినొసగుగాక! (ఆమీన్).

– సఫీ అహ్మద్ మదనీ