ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము - షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ [పుస్తకం]

Prophet's Prayer - Imam Ibn Baz

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము
షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [28 పేజీలు]

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
(అనంత కరుణా ప్రదాత, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో)

సకల కృతజ్ఞతలు, ప్రశంసలు కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి, ఆయన ఏకైకుడు. ఆయన దాసుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై అల్లాహ్ యొక్క కరుణ, శాంతీ కురియుగాక.

ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానాన్ని సంక్షిప్తంగా వివరించే కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు. ప్రతి ముస్లిం పురుషుడు మరియు స్త్రీ  ఈ విధానాన్ని అనుసరించడానికి వీలుగా నేను వివరాలను సమర్పించాలనుకున్నాను, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

( صَلُّوا كَمَا رَأَيْتُمُونِي أُصَلِّي )
“మీరు నన్ను ఏవిధంగా నమాజు పాటిస్తుండగా చూశారో ఆవిధంగా నమాజు పాటించండి.”
(సహీహ్ అల్-బుఖారీ, హదీథు సంఖ్య (605))

1- పరిపూర్ణంగా వుజూ చేయడం, అంటే అల్లాహ్ ఆదేశించిన విధంగా వుజూ చేయడం, సర్వోన్నతుడైన అల్లాహ్ వాక్యము:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ

ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్‌ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. (సూరతుల్ మాయిదహ్ 5:6)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనము:

(لَا تُقْبَلُ صَلَاةٌ بِغَيْرِ طُهُورٍ )
“పరిశుద్ధ స్థితిలో (వుజు స్థితిలో) తప్ప నమాజు స్వీకరించబడదు.”
[దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (224)]

మరియు తన నమాజును తప్పుగా ఆచరించిన వ్యక్తి కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు:

( إِذَا قُمْتَ إِلَى الصَّلَاةِ فَأَسْبِغِ الْوُضُوءَ )
“మీరు నమాజు చేయడానికి నిలబడినపుడు, మొదట పూర్తిగా వుజు చేయండి.”
(దీనిని బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (5782))

2- నమాజు చేస్తున్న వ్యక్తి, తాను ఎక్కడ ఉన్నా, తన మొత్తం శరీరాన్ని కాబా గృహం దిక్కుకు, అంటే ఖిబ్లా వైపుకు తిరిగి ఉండేలా నిలబడాలి.

తాను చేయదలుచుకున్న నమాజు కొరకు తన మనస్సులో నియ్యత్ (సంకల్పం) చేసుకోవాలి. ఇది తప్పనిసరి ఫర్జ్ నమాజు అయినా లేదా స్వచ్ఛంద సున్నతు లేక నఫిల్ నమాజు అయినా. ఎందుకంటే నియ్యతును మౌఖికంగా ఉచ్చరించడం అనుమతించబడ లేదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే, అది ఒక నూతన ఆవిష్కరణ, కల్పితము (బిదఅత్) అవుతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు నియ్యత్ ను మౌఖికంగా తన నోటితో ఉచ్చరించలేదు. అంతేగాక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు (రజియల్లాహు అన్హుమ్) కూడా ఎన్నడూ అలా చేయలేదు.

నమాజు చేస్తున్న వ్యక్తి, ప్రజలకు నమాజు చేయిస్తున్న ఇమామ్ అయినా లేక ఒంటరిగా నమాజు చేస్తున్న వ్యక్తి అయినా, ఏకాగ్రత కొరకు తన ముందు ఒక సుత్రా (అడ్డంకి) పెట్టుకోవాలి.

ఇస్లామీయ పండితుల గ్రంథాలలో పేర్కొనబడిన కొన్ని ప్రసిద్ధ మినహాయింపు పరిస్థితులలో తప్ప, ఖిబ్లా వైపు తిరిగి నిలబడడం అనేది నమాజు కొరకు ఒక ముఖ్యమైన షరతు.

3- “అల్లాహు అక్బర్” (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు) అనే పదాలతో తక్బీరతుల్- ఇహ్రామ్ పలుకుతూ నమాజు ప్రారంభించాలి మరియు తాను సాష్టాంగం (సజ్దా) చేసే స్థలంపై మాత్రమే తన చూపు నిలపాలి.

4- తక్బీర్ (అల్లాహు అక్బర్) చెప్పేటప్పుడు తన రెండు చేతులను తన భుజాల స్థాయి లేదా తన చెవుల స్థాయి వరకు పైకి లేపాలి.

5- తన చేతులను తన ఛాతీపై ఉంచి అంటే కుడి చేతిని ఎడమ చేయి వెనుక భాగంపై, ఎడమ చేయి మణికట్టు మరియు ముంజేయి పై ఉంచాలి; ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపించబడింది.

6- ఇక ఆ తరువాత ప్రారంభపు దుఆ పఠించుట సున్నతు:

اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ اللَّهُمَّ نَقِّنِي مِنْ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنْ الدَّنَسِ اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ

అల్లాహుమ్మ బాఇద్ బైనీ వ బైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి అల్లాహుమ్మ నఖ్ఖినీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనసి అల్లాహుమ్మగ్ సిల్ ఖతాయాయ బిల్ మాఇ వస్సల్ జి వల్ బరద్.

(ఓ అల్లాహ్) తూర్పుపడమరలను వేరు చేసినట్లుగా, నా పాపాలను నా నుండి వేరు చేయుము. ఓ అల్లాహ్! తెల్లని వస్త్రం మురికి నుండి శుద్ధి చేయబడినట్లుగా నన్ను నా పాపాల నుండి శుద్ధి చేయుము. ఓ అల్లాహ్! నా పాపాలను నీరు, మంచు మరియు వడగళ్ళతో కడిగి వేయి.” 

 [దీనిని బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (744), మరియు ముస్లిం హదీథు సంఖ్య (598)]

దానికి బదులుగా అతను కోరుకుంటే ఇలా కూడా పలకవచ్చు.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ
“సుబ్’హానకల్లాహుమ్మ వ బిహమ్’దిక, వ తబారకసుక, వ తఆలా జద్దుక, వ లా ఇలాహ గైరుక”

(ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. నీ నామము అన్నింటి కంటే శ్రేష్ఠమైనది, నీ మహిమ అత్యున్నతమైనది. నీవు తప్ప, మరో ఆరాధ్యుడు లేనే లేడు.”) [దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (399)]

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నమోదు అయిన ఈ రెండు ప్రారంభ దుఆలే కాకుండా ఇలాంటి ప్రామాణికమైన వేరే ఏ దుఆ చేసినా, అందులో అభ్యంతరం లేదు. అయితే ఒకసారి ఒక దుఆ, మరొకసారి మరో దుఆ చేయడం మంచిది. ఎందుకంటే అది సున్నతు అనుసరణలో పరిపూర్ణతను చేకూరుస్తుంది. 

తర్వాత ‘అఊదు బిల్లాహి మినష్’ షైతానిర్రజీం’ (శపించబడిన, బహిష్కరించబడిన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను) అని పలకాలి. తర్వాత ‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ (అనంత కరుణాప్రదాత, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) అని పలికి సూరతుల్ ఫాతిహా పఠించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

(( لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأُ بِفَاتِحَةِ الْكِتَابِ ))
“సూరతుల్ ఫాతిహా పఠించని వ్యక్తి నమాజు చెల్లదు.”
[దీనిని బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (756)]

ఆ తరువాత, బిగ్గరగా తిలావత్ చేసే నమాజులలో “ఆమీన్” అని బిగ్గరగా పలకాలి, మరియు నిశ్శబ్దంగా తిలావత్ చేసే నమాజులలో నిశ్శబ్దంగా పలకాలి. 

తరువాత ఖుర్ఆన్ నుండి తనకు వీలైన సూరహ్ పఠించాలి. దీని గురించి ప్రస్తావించబడిన హదీసుల ప్రకారం జుహ్ర్, అస్ర్, ఇషా నమాజులలో సూరతుల్ ఫాతిహా తర్వాత “అవసతుల్ ముఫస్సల్” (మరీ సుదీర్ఘమైన లేదా మరీ చిన్నవైన సూరాలు కాకుండా మధ్యస్థంగా ఉండే సూరాలు) పఠించడం, ఫజ్ర్  నమాజులో “తివాలె ముఫస్సల్” (సుదీర్ఘమైన సూరాలు) పఠించడం మరియు మగ్రిబ్ నమాజులో కొన్నిసార్లు సుదీర్ఘమైన సూరాలు, మరికొన్నిసార్లు చిన్న సూరాలు పఠించడం సున్నతు.

7- తన రెండు చేతులను తన రెండు భుజాలు లేదా చెవుల స్థాయి వరకు పైకెత్తి, అల్లాహు అక్బర్ అని తక్బీర్ పలికి, ముందుకు వంగుతూ తన తలను తన వీపుతో సమతలంగా ఉంచి, తన అరచేతులను తన మోకాళ్లపై ఉంచి, తన చేతివేళ్లను వేరు చేసి, మోకాళ్ళను గట్టిగా పట్టుకుంటూ తన ఈ రుకూ స్థితిలో ప్రశాంతంగా, స్థిరంగా ఉండి, ఇలా పలుక వలెను:

( سُبْحَانَ رَبِّيَ الْعَظِيم  )
 ‘సుబ్’హాన రబ్బియల్ అజీమ్’ 
(పరమ పవిత్రుడైన నా ప్రభువు, అత్యంత గొప్పవాడు). 

ఇలా కనీసం మూడుసార్లు పలుకవలెను, అంతకంటే ఎక్కువ సార్లు పునరావృతం చేయడం మంచిది, మరియు దానితో పాటు ఇలా కూడా పలకమని సిఫార్సు చేయబడింది:

( سُبْحانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ ، اللَّهُمَّ اغْفِرْ لِي )
“సుబ్ హాన కల్లాహుమ్మ వ బి హమ్ దిక్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ” 
(ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. ఓ అల్లాహ్! నన్ను క్షమించు.”)
[దీనిని బుఖారీ ఉల్లేఖించారు. హదీథు సంఖ్య (817), మరియు ముస్లిం హదీథు సంఖ్య (484)]

8- రుకూ స్థితి నుండి తల పైకెత్తి (లేచి నిటారుగా నిలబడి), రెండు చేతులను రెండు భుజాల స్థాయికి లేదా చెవుల స్థాయికి ఎత్తి ఈ దుఆ పఠించాలి: 

సమిఅల్లాహు లిమన్ హమిద
(అల్లాహ్ తనను స్తుతించేవారిని వింటాడు)

ఇమామ్ అయినా లేదా ఒంటరిగా నమాజ్ చేస్తున్న వ్యక్తి అయినా, రుకూ నుండి లేచి నిలబడిన తరువాత ఇలా పలకాలి:

( رَبَّنَا وَلَكَ الْحَمْدُ، حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ، مِلْءَ السَّمَوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ )
“రబ్బనా వ లకల్ హమ్దు, హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహి, మిల్’ అస్ సమావాతి వ మిల్’అల్ అర్ది, వ మిల్’అ మా షి’త మిన్ షయిన్ బఅదు
ఓ మా ప్రభువా! నీకే సకల స్తుతులు; అపారమైన, పవిత్రమైన, శుభకరమైన స్తుతులు. ఈ స్తుతులు ఆకాశాల నిండా, భూమి నిండా, మరియు నీవు కోరిన ప్రతి వస్తువు నిండా విస్తరించి ఉన్నాయి”!

ఒకవేళ జమాతుతో ఇమామ్ వెనుక నమాజు చేస్తున్నట్లయితే, అంటే ముఖ్తదీ అయితే, అతను రుకూ నుండి తల పైకి ఎత్తేటప్పుడు ‘రబ్బనా వ లకల్ హమ్ద్’ అని పలకాలి. అయితే ఇమామ్, ముఖ్తదీ లేదా ఒంటరిగా నమాజు చేసేవారు ఎవరైనా ఈ దుఆలో మిగిలిన పైభాగాన్ని కూడా పఠించి, ఇంకా ఇలా పఠించవచ్చు.

( أَهْلَ الثَّنَاءِ  وَالْمَجْدِ أَحَقُّ مَا قَالَ الْعَبْدُ وَكُلُّنَا لَكَ عَبْدٌ اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ )

“అహ్ లస్సనాఇ వల్ మజ్’ది, అహక్కు మా ఖాలల్ అబ్దు, వ కుల్లునా లక అబ్దున్: అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅ’తైత, వ లా ముఅతియ లిమా మనఅత, వ లా యన్’ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. 

(సకల స్తుతులకు మరియు మహిమకు అర్హుడవైన ఓ అల్లాహ్ ! దాసుడు చెప్పగలిగిన సత్యమైన మాట ఏమిటంటే మేమంతా నీ దాసులమే. ఓ అల్లాహ్ ! నీవు ఇచ్చే దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు, నీవు నిరాకరించిన దానిని ఇవ్వగలిగేవారు ఎవ్వరూ లేరు. బలవంతులలోకెల్లా అత్యంత బలవంతుడి శక్తి కూడా నీ (అనుజ్ఞ)కు వ్యతిరేకంగా అతనికి ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చజాలదు 

ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నమోదు చేయబడిన ప్రామాణికమైన దుఆ కాబట్టి దీనిని కూడా పఠించుట మంచిది.

ఇమామ్, ముఖైదీ (ఇమామ్ వెనుక నమాజు చేసేవాడు) లేదా ఒంటరిగా నమాజు చేసేవాడు, వీరందరూ రుకూ కు ముందు నిలబడిన స్థితిలో చేసినట్లే, రుకూ నుండి తల ఎత్తిన తర్వాత తమ చేతులను (పొట్ట క్రింద కాకుండా) ఛాతి మీద కట్టుకోవడం ముస్తహబ్ (ఉత్తమం). ఎందుకంటే వాయిల్ బిన్ హుజ్ర్  మరియు సహ్ల్ బిన్ సఅద్ (రజియల్లాహు అన్హుమా) ల హదీసుల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా చేసేవారని నమోదు చేయబడింది.

9- సాష్టాంగంలో (సజ్దాలో) వెళ్లేటప్పుడు ‘అల్లాహు అక్బర్’ అని తక్బీర్ చెప్పాలి. సాధ్యమైతే ముందుగా మోకాళ్లను, తర్వాత అరచేతులను నేలపై ఉంచాలి. ఒకవేళ అలా చేయడం కష్టమైతే, ముందు అరచేతులను, తర్వాత మోకాళ్లను నేలపై ఉంచవచ్చు. కాళ్ల వేళ్లు మరియు చేతుల వేళ్లు ఖిబ్లా వైపు మడిచి ఉంచాలి. చేతుల వేళ్లను కలిపి ఉంచాలి, దూరం దూరంగా, విడి విడిగా ఉంచరాదు. ఈ ఏడు అవయవాలు తప్పనిసరిగా నేలను తాకాలి అవి నుదుటి భాగం (నుదుటితో పాటు ముక్కు), రెండు అరచేతులు, రెండు మోకాళ్లు, మరియు రెండు కాళ్ల వేళ్ల అడుగు భాగాలు (కొనలు). 

సజ్దాలో ‘సుబ్’ హాన రబ్బియల్ ఆలా‘ (పరమ పవిత్రుడైన నా ప్రభువు అత్యున్నతుడు) అని మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పలకడం సున్నత్. దీనితో పాటు ఇలా కూడా పలకడం మంచిది:

( سُبْحانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ ، اللَّهُمَّ اغْفِرْ لِي )
“సుబ్ హాన కల్లాహుమ్మ వ బి హమ్ దిక్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ”
(ఓ అల్లాహ్ ! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. ఓ అల్లాహ్ ! నన్ను క్షమించు).”

ఇంకా వీలైనంత ఎక్కువ దుఆలు చేయాలి, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికారు 

( فَأَمَّا الرُّكُوعُ فَعَظَّمُوا فِيهِ الرَّبَّ وَأَمَّا السُّجُودُ فَاجْتَهِدُوا فِي الدُّعَاءِ فَقَمِنٌ أَنْ يُسْتَجَابَ لَكُمْ )
“రుకూలో ప్రభువు గొప్పదనాన్ని స్తుతించండి మరియు సజ్జాలో దుఆలు ఎక్కువగా చేయడంలో శ్రద్ధ వహించండి, ఎందుకంటే అది మీ దుఆలు ఆలకించబడే అవకాశాన్ని పెంచుతుంది.”
[దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (479)]

మరియు మన ప్రభువును ఇహపరలోకాలలోని శుభాలను, అనుగ్రహాలను ప్రసాదించమని దుఆ చేయాలి. ఫర్జ్ (విధి) నమాజు అయినా, సున్నత్ లేదా నఫిల్ (స్వచ్చంద) నమాజు అయినా రెండింటికీ సజ్దాలో ఉన్నప్పుడు ఈ  నియమాలు వర్తిస్తాయి: 

ముంజేతులను ప్రక్కటెముకల నుండి దూరంగా ఉంచాలి (నేలకు ఆన్చకుండా, పైకి లేపి ఉంచాలి), పొట్టను తొడల నుండి దూరంగా ఉంచాలి, తొడలను కాళ్ల నుండి దూరంగా ఉంచాలి, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగానే సజ్దా చేసారు.

( اعْتَدِلُوا فِي السُّجُودِ وَلَا يَبْسُطُ أَحَدُكُمْ ذِرَاعَيْهِ انْبِسَاطَ الْكَلْبِ )
“సజ్దాలో సమతుల్యంగా ఉండండి, మరియు మీలో ఎవరూ శునకంలా తన ముంజేతులను నేలపై చాచి పరచకూడదు.”
[దీనిని బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (788) మరియు ముస్లిం హదీథు సంఖ్య (493)]

సజ్దా నుండి తల పైకి ఎత్తేటప్పుడు ‘అల్లాహు అక్బర్’ అని తక్బీర్ పలకాలి. ఎడమ కాలును విడిగా పరచి, దానిపై కూర్చోవాలి. కుడికాలును నిటారుగా ఉంచి, చేతులను తొడలు మరియు మోకాళ్లపై ఉంచాలి. ఆ తర్వాత ఈ దుఆ పఠించాలి:

( رَبَّ اغْفِرْ لِي ، وَارْحَمْنِي ، وَاهْدِنِي ، وَارْزُقْنِي وَعَافِنِي وَاجْبُرْني )
“రబ్బిగ్ ఫిర్లీ వర్ హమ్నీ వహ్ దినీ వర్ జుఖ్నీ వ అఫినీ వజ్ బుర్నీ. 
(ఓ ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు నాకు సన్మార్గం చూపు, నాకు జీవనోపాధి ప్రసాదించు నాకు ఆరోగ్యం ప్రసాదించు నా అవసరాలను తీర్చు మరియు నాకు శక్తినిచ్చి బలపరచు)”
[తిర్మిజీ 284), అబూ దావూద్ 850. ఇబ్నె మాజహ్ 898]

ఇలా కూర్చోడంలో ఏ మాత్రం తొందరపాటు లేకుండా, నిశ్చింతగా, సాంత్వనతో, స్థిరంగా, ప్రశాంతంగా కూర్చోవాలి.

 11- ‘అల్లాహు అక్బర్’ అని తక్బీర్ చెప్పి, మొదటి సజ్దాలో చేసినట్లే అన్ని విధానాలు పాటిస్తూ రెండవ సజ్దా పూర్తి చేయాలి.

రెండవ సజ్దా నుండి ‘అల్లాహు అక్బర్’ అని తక్బీర్ చెప్పి తల పైకెత్తాలి. అంతకు ముందు రెండు సజ్దాల మధ్య కూర్చున్నట్లు కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చోవాలి (జల్సతుల్ ఇస్తిరాహ). ఇది ముస్తహబ్ (ఉత్తమం), కానీ దీన్ని వదిలేస్తే ఎలాంటి దోషమూ లేదు. ఈ కూర్చునే సమయంలో ఎలాంటి దుఆ లేదా జిక్ర్ పఠించ వలసిన అవసరం లేదు. 

తర్వాత రెండవ రకాతు కొరకు లేచి నిలబడాలి. సాధ్యమైతే మోకాళ్లపై చేతులు ఆన్చుతూ, లేవాలి, కష్టమైతే నేలపై చేతులు ఆన్చి లేవాలి. తర్వాత సూరతుల్ ఫాతిహా మరియు ఖుర్ఆన్ నుండి సులభమైన ఏదైనా సూరహ్ పఠించాలి. మొదటి రకాత్ లో చేసినట్లే అన్ని ఆచరణలు పునరావృతం చేయాలి.

రెండు రకాతుల నమాజులు (ఫజ్ర్ , జుమా, ఈద్ లాంటివి) చేసేటప్పుడు, రెండవ సజ్దా నుండి లేచిన తర్వాత కుడి కాలును నిటారుగా ఉంచి, ఎడమ కాలును పరచి కూర్చోవాలి. కుడి చేతిని కుడి తొడపై ఉంచి, చూపుడు వేలు తప్ప మిగతా వేళ్లను ముడుచుకోవాలి. చూపుడు వేలుతో తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం) కు సూచిస్తూ దానిని నిటారుగా పైకి లేపాలి. లేదా చిటికెన వేలు, ఉంగరపు వేళ్ళను ముడిచి, బొటనవేలు మరియు నడుమ వేలుతో వలయం చేసి, చూపుడు వేలుతో సూచించడం కూడా సరియైనదే ఎందుకంటే ఈ రెండు -పద్ధతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమై ఉన్నాయి. ఒకసారి ఈ పద్ధతి, మరొక సారి ఆ పద్ధతి అనుసరించడం ఉత్తమం. ఎడమ చేతిని ఎడమ తొడ మరియు మోకాలిపై ఉంచాలి. తర్వాత ఈ కూర్చునే స్థితిలో తషహ్హుద్ ఇలా చదవాలి:

(( التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ ))

“అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు. అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్-సాలిహీన్, అష్టదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్టదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.”

(సకల ప్రశంసలకు, ప్రార్థనలకు మరియు పవిత్రమైన వాటన్నింటికీ అల్లాహ్ కు మాత్రమే అర్హత ఉంది. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కృప మరియు ఆశీర్వాదాలు కలుగుగాక. మాపై మరియు అల్లాహ్ యొక్క సజ్జన దాసులపై కూడా శాంతి కలుగుగాక. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని).”

ఆ తరువాత ఇలా దుఆ చేయాలి:

(( اللَّهُمَّ صَلَّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ ))

“అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అలి ముహమ్మద్, కమా సల్లెత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ్, ఇన్నక హమీదున్ మజీద్. వ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ్, ఇన్నక హమీదున్ మజీద్. 

(ఓ అల్లాహ్ ! నీవు ఇబ్రాహీమ్ పై మరియు ఆయన కుటుంబ సభ్యులపై కరుణ చూపిన విధంగానే ముహమ్మద్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కరుణ, సంరక్షణ చూపుము. నిశ్చయంగా నీవే ప్రశంసనీయుడవు, గొప్పవాడవు అలాగే, నీవు ఇబ్రాహీమ్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై శుభాలు కురిపించిన విధంగానే ముహమ్మద్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై కూడా శుభాలు కురిపించు. నిశ్చయంగా నీవే ప్రశంసనీయుడవు, గొప్పవాడవు).”

ఆ పిదప ఈ నాలుగు విషయాల నుండి ఇలా అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి

( اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابٍ جَهَنَّمَ، وَمِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرَّ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ )

“అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్-మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్-మసీహిద్-దజ్జాల్

(ఓ అల్లాహ్ ! నేను నరకం యొక్క శిక్ష నుండి, ఖబ్ర్(సమాధి) శిక్ష నుండి, జీవితం మరియు మరణం యొక్క పరీక్షల నుండి మరియు మసీహ్ దజ్జాల్ దుష్టపరీక్ష నుండి నీ శరణు వేడుకుంటున్నాను).

తర్వాత ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ మేలు కోరుతూ, తనకు కావలసిన దాని కొరకు దుఆ చేసుకోవచ్చు. మరియు తన తల్లిదండ్రుల కొరకో లేదా ఇతర ముస్లింల కొరకో దుఆ చేయడంలోనూ ఎలాంటి అభ్యంతరమూ లేదు – అది ఫర్జ్ నమాజు అయినా సరే, లేదా సున్నత్, నఫిల్ నమాజు అయినా సరే – ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు తషహ్హుద్ నేర్పిన తరువాత ‘ఇక నీవు నీకు నచ్చిన దుఆ చేయి’ అని ఆదేశించారని హదీథులో ఇబ్ను మస్జిద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించినారు

( ثُمَّ لِيَتَخَيَّرُ مِنْ الدُّعَاءِ أَعْجَبُهُ إِلَيْهِ، فَيَدْعُو )
“ఆ తరువాత తనకు అవసరం ఉన్న, తన మనసుకు నచ్చిన దుఆ చేసుకోవాలి.” [నసాయీ-1298]

మరోచోట ఇలా తెలుపబడింది:

( ثُمَّ لْيَتَخَيَّرُ بَعْدُ مِنَ الْمَسْأَلَةِ مَا شَاءَ )
ఆ తరువాత, అతడు ఏ కోరిక అయినా కోరుకోవచ్చు. [ముస్లిం – 402]

మరియు ఇది ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కోరుకునే అన్ని మంచి విషయాలకూ వర్తిస్తుంది. ఆ తర్వాత కుడి మరియు ఎడమ వైపులకు ‘అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్’ (మీపై అల్లాహ్ యొక్క శాంతి మరియు కృప కురుయు గాక) అని సలాము పలుకుతూ (అంటే తస్లీమ్ పలికి) నమాజు ముగించాలి.

14. ఒకవేళ ప్రార్ధన (సలాత్) మూడు రకాతులు కలిగినదైతే, ఉదాహరణకు మగ్రిబ్ లాగా, లేదా నాలుగు రకాత్లు కలిగినదైతే, ఉదాహరణకు జొహ్ర్, అస్ర్ , ఇషా లాగా, అప్పుడు ముందు చెప్పిన తషహ్హుద్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ చదివాలి. తర్వాత, “అల్లాహు అక్బర్” అని చెప్పుతూ, మోకాళ్ళపై చేతులు వేసి, భుజాల లేదా చెవుల స్థాయికి చేతులను ఎత్తి, నిలబడాలి. అప్పుడు చేతులను ఛాతీపై (మునుపటి విధంగా) ఉంచుకోవాలి మరియు కేవలం సూరా ఫాతిహా మాత్రమే చదవాలి.

అయితే, జుహర్, అస్ర్, ఇషా యొక్క మూడవ మరియు నాల్గవ రకాతులలో కొన్ని సార్లు సూరతుల్ ఫాతిహా తర్వాత అదనంగా ఏదైనా సూరా/ ఆయత్ చదివినా ఎలాంటి అభ్యంతరమూ లేదు, ఎందుకంటే అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) యొక్క హదీథు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా చేయడం గురించి నమోదు చేయబడి ఉన్నది.

ఒకవేళ మొదటి తషహ్హుద్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవకపోయినా ఎలాంటి అభ్యంతరమూ లేదు, ఎందుకంటే ఇది మొదటి తషహ్హుద్ లో సున్నత్ (ప్రోత్సహించబడినది) మాత్రమే, అంతేగాని ఫర్జ్ (తప్పనిసరి) కాదు. తర్వాత, మగ్రిబ్ యొక్క మూడవ రకాతు చివరలో లేదా జొహర్, అస్ర్ , ఇషా యొక్క నాల్గవ రకాతు చివరలో, రెండు రకాతుల నమాజులో పఠించినట్లుగా తషహ్హుద్ పూర్తిగా పఠించాలి. ఆ తర్వాత, కుడి మరియు ఎడమ వైపులకు సలామ్ పలుకుతూ, నమాజు ముగించాలి. 

ఆ తర్వాత మూడు సార్లు “అస్తగ్ ఫిరుల్లాహ్” (ఓ అల్లాహ్! నన్ను మన్నించు) అని పలికి, ఇలా దుఆ చేయాలి.

( اللَّهُمَّ أَنْتَ السَّلَامُ وَمِنْكَ السَّلَامُ، تَبَارَكْتَ يَا ذَا الجَلَالِ وَالإِكْرَامِ )
“అల్లాహుమ్మ అంతస్సలాము వ మిన్కస్సలాము, తబారక్త యా జల్-జలాలి వల్-ఇక్రామ్”
(ఓ అల్లాహ్ ! నీవే శాంతివి, మరియు శాంతి నీ నుండియే లభిస్తుంది. & మహిమాన్వితుడా, గౌరవానికి అర్హుడవైనవాడా, నీవే అత్యంత శుభకరుడవు). [ముస్లిం – 591]

ఇమామ్ అయితే, ప్రజల వైపు తిరిగి వారి వద్ద నుండి వెళ్లి పోయే ముందు ఇలా పఠించాలి:

(( لَا إِلَهَ إِلَّا الله وحدَهُ لا شَرِيكَ له، له الملك، وله الحمد، وهو على كُلِّ شيءٍ قَدِيرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله، اللَّهُمَّ لَا مَانِعَ لِما أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الجَدَّ مِنْكَ الجَدُّ، لَا إِلَهَ إِلَّا الله، وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ، لَهُ النَّعْمَةُ وَلَهُ الفَضْلُ، وَلَهُ الثَّنَاءُ الحَسَنُ ، لَا إِلَهَ إِلَّا الله مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الكَافِرُونَ ))

“లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్! లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహుమ్మా లా మానిఅ లిమా అతయ్’త, వ లా ముత్’తియ లిమా మనత్’త! వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు, లా ఇలాహ ఇల్లల్లాహు, వ లా నఅ’బుదు ఇల్లా ఇయ్యాహు! లహు న్నిఅమతు వ లహుల్ ఫద్లు, వ లహుథ్ థనాఉల్ హసన్! లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్ లిసీన లహుద్ దీన్, వ లౌ కరిహల్ కాఫిరూన్! 

(అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఒకే ఒక్కడే, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరు. ఆయనకే సార్వభౌమత్వం, ఆయనకే స్తుతి! ఆయన ప్రతిదానిపై సర్వశక్తిమంతుడు. (మనిషికి) పాపాల నుండి తప్పించుకునే శక్తి లేదు, సత్కార్యాలు చేసే శక్తి లేదు, అల్లాహ్ సహాయం ఉంటే తప్ప! ఓ అల్లాహ్ ! నీవు ఇచ్చే దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు, నీవు నిరాకరించిన దానిని ఇవ్వగలిగేవారు ఎవ్వరూ లేరు. బలవంతులలో కెల్లా అత్యంత బలవంతుడి శక్తి కూడా నీ (అనుజ్ఞ)కు వ్యతిరేకంగా అతనికి ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చజాలదు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, మేము ఆయన్నే ఆరాధిస్తాము! ఆయనే అనుగ్రహించేవాడు, ఆయనే మహిమాన్వితుడు, ఆయనకే మంచి స్తుతులన్నీను! అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు! మేము ఆయన్నే ఏకాగ్ర హృదయంతో ఆరాధిస్తాము, సత్యతిరస్కారులు ఎంతగా అసహ్యించుకున్నా).”

33 సార్లు ‘సుబ్ హానల్లాహ్’ (పరమ పవిత్రమైనవాడు అల్లాహ్) అనీ, 33 సార్లు ‘అల్ హమ్దు లిల్లాహ్’ (సకల ప్రశంసలు అల్లాహ్ కే) అనీ, మరియు 34 సార్లు ‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు) అనీ అల్లాహ్ యొక్క జిక్ర్ చేయాలి.  చివరిగా జిక్ర్  ను 100 కు చేరుస్తూ ఇలా పలకాలి: 

“లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్! 
(అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఒకే ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేడు. ఆయనకే సార్వభౌమత్వం, ఆయనకే ప్రశంసలు! ఆయన ప్రతిదానిపై సర్వశక్తిమంతుడు).”

ప్రతి ముస్లిం (పురుషుడు / స్త్రీ) కొరకు ఈ క్రింది సున్నతు నమాజులు చేయడం సిఫారసు చేయబడినాయి: జొహర్ (మధ్యాహ్నం) నమాజుకు ముందు: 4 రకాతులు (2 + 2), జొహర్ నమాజు తర్వాత: 2 రకాతులు; మగ్రిబ్ (సూర్యాస్తమయం) నమాజు తర్వాత: 2 రకాతులు: ఇషా (రాత్రి) నమాజు తర్వాత: 2 రకాతులు; ఫజ్ర్  (ఉదయం) నమాజుకు ముందు: 2 రకాతులు, మొత్తం 12 రకాతులు (వీటిని “సునన్ అర్రవాతిబ్” అని అంటారు). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అదనపు నమాజులను ఎప్పుడూ విడిచిపెట్టేవారు కాదు. 

ప్రయాణ సమయంలో సున్నతు నమాజులు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణ సమయంలో (సునన్ అర్రవాతిబ్ లో నుండి) ఈ క్రింది నమాజులు మాత్రమే చేసేవారు, మిగతావి వదిలి వేసేవారు: ఫజ్ర్ నమాజుకు ముందు 2 రకాతుల సున్నత్ (ఇది చాలా ముఖ్యమైనది) మరియు విత్ర్‌ నమాజు (ఇషా తర్వాత చేసే బేసి రకాతుల నమాజు). ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలో ఉన్నప్పుడూ, ప్రయాణంలో ఉన్నప్పుడూ, ఈ రెండు అదనపు నమాజులను ఎన్నడూ విడిచి పెట్టలేదు.

( أَفْضَلُ صَلَاةِ المَرْءِ فِي بَيْتِهِ، إِلَّا الصَّلَاةَ المَكْتُوبَةَ )
“ఒక వ్యక్తి నమాజులలో ఉత్తమమైనది (అదనపు సున్నత్, నఫిల్, విత్ర్‌ నమాజు) ఇంట్లో చేసేదే, అయితే తప్పనిసరి (ఫర్జ్) నమాజులు తప్ప.” [ముస్లిం – 728]

ఈ నమాజులను (సున్నత్ / నఫిల్) నిరంతరం చేయడం అనేది స్వర్గ ప్రవేశాన్ని ప్రసాదించే కారణాలలో ఒకటి అవుతుంది, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికారు:

( مَن صَلَّى اثْنَتَيْ عَشْرَةَ رَكْعَةً فِي يَومٍ وَلَيْلَةٍ، بُنِي لَهُ بِهِنَّ بَيْتُ فِي الْجَنَّةِ )
“ఎవరైతే రోజుకు 12 రకాతుల (సున్నతు) నమాజులు చేస్తారో, అతని కొరకు స్వర్గంలో ఒక భవనం నిర్మించబడుతుంది.” [బుఖారీ – 6860]

అస్ర్ (మధ్యాహ్నం) నమాజు కు ముందు 4 రకాతులు, మగ్రిబ్ (సాయంత్రం) నమాజుకు ముందు 2 రకాతులు, ఇషా (రాత్రి) సలాహ్ కు ముందు 2 రకాతులు అదనంగా నమాజు చేస్తే మంచిది. 

ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

(( مَنْ حَافَظَ عَلَى أَرْبَعِ رَكَعَاتٍ قَبْلَ الظُّهْرِ وَأَرْبَعِ بَعْدَهَا حَرَّمَهُ اللَّهُ تَعَالَى عَلَى النَّارِ))
“ఎవరైతే జొహ్ర్  (మధ్యాహ్నం) సమాజుకు ముందు 4 రకాతులు మరియు తర్వాత 4 రకాతులు నమాజు నిరంతరంగా చేస్తారో, అల్లాహ్ వారిపై నరకాన్ని నిషేధిస్తాడు.”

[దీనిని అహ్మద్ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (25547), అత్తిర్మిథీ హదీథు సంఖ్య (393) మరియు అబూ దాఉద్ హదీథు సంఖ్య (1077)]

దీని అర్థం ఏమిటంటే, జొహర్ ఫర్జ్ నమాజు తరువాత మరో రెండు రకాతులు అదనంగా నమాజు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే జొహర్కు సంబంధించిన సునన్ అర్రవాతిబ్ సున్నతు నమాజులు ఫర్ద్ సలాహ్ కు ముందు నాలుగు రకాతులు మరియు తర్వాత రెండు రకాతులు. అయితే, జొహర్ ఫర్డ్ నమాజు తర్వాత (సునన్ అర్రవాతిబ్ యొక్క 2 రకాతులతో పాటు) ఇంకా రెండు రకాతులు అదనంగా నెరవేర్చితే – అంటే మొత్తం నాలుగు రకాతులు నమాజు అప్పుడు ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించిన హదీథులోని ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. మరియు నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే సఫలతకు అధిపతి.

అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైనా, ఆయన కుటుంబ సభ్యుల పైనా, సహాబాల పైనా మరియు ప్రళయదినం వరకు చిత్తశుద్ధితో ఆయనను అనుసరించే సజ్జనుల పైనా తన కృపా, కరుణా మరియు శాంతిని నిరంతరం వర్షింపజేయుగాక!