93. సూరా అద్ దుహా – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

93. సూరా అద్ – దుహా – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/-brxXfYs6GU [ 50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 11 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలు ఇందులో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఊరటనిస్తూ, అల్లాహ్ ఆయన్ను వదలిపెట్టలేదని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనాధబాలునిగా ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేసింది అల్లాహ్ యేనని, మార్గం తెలియని స్థితిలో ఉన్నప్పుడు మార్గం చూపింది అల్లాహ్ యేనని, బీదరికంలో ఉన్నప్పుడు సంపద ప్రసాదించింది అల్లాహ్ యేనని గుర్తుచేయడం జరిగింది. రాబోయే కాలం గతకాలం కన్నా నిశ్చయంగా మేలైనదిగా ఉంటుందని చెప్పడం జరిగింది. అనాధల పట్ల దయతో వ్యవహరించాలని, యాచకులను కసురుకోరాదని, అల్లాహ్ ప్రసాదించిన వరాలను గురించి అందరికీ తెలియజేయాలని చెప్పడం జరిగింది.

93:1 وَالضُّحَىٰ
పొద్దెక్కుతున్నప్పటి ఎండ సాక్షిగా! [2]

93:2 وَاللَّيْلِ إِذَا سَجَىٰ
కుదుటపడిన రాత్రి సాక్షిగా! [3]

93:3 مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నీ ప్రభువు నిన్ను వదలిపెట్టనూ లేదు, నీతో విసిగిపోనూ లేదు. [4]

93:4 وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ
నిశ్చయంగా నీ కోసం చివరి కాలం తొలికాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. [5]

93:5 وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
నీ ప్రభువు త్వరలోనే నీకు (గొప్ప బహుమానం) వొసగుతాడు. దాంతో నీవు సంతోషపడతావు. [6]

93:6 أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ
ఏమిటి, నువ్వు అనాధగా ఉండటం చూసి, ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? [7]

93:7 وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ
మరి నిన్ను మార్గం తెలియనివానిగా గ్రహించి, సన్మార్గం చూపలేదా? [8]

93:8 وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ
ఇంకా – నిన్ను అభాగ్యునిగా పొంది భాగ్యవంతునిగా చేయలేదా? [9]

93:9 فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ
కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా అనాధ పట్ల దురుసుగా ప్రవర్తించకు. [10]

93:10 وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ
యాచించేవానిని కసిరికొట్టకు. [12]

93:11 وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ
ఇంకా నీ ప్రభువు అనుగ్రహాలను గురించి పొగుడుతూ ఉండు. [13]

[1] ఒకసారి దైవప్రవక్త ముహమ్మదు (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి జబ్బుచేసింది. రెండు మూడు రాత్రులు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తహజ్జుద్ నమాజుకై లేవలేకపోయారు. ఒక స్త్రీ వచ్చి ఆయన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో “ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ! నీ దెయ్యం నిన్ను విడిచిపెట్టేసినట్టుందే! నాకు తెలిసినంతవరకు రెండు మూడు రాత్రుల నుండి అది నీ దగ్గరకు రావటం లేదు కదూ!” అన్నది. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ ఈ సూరాను అవతరింపజేశాడు (సహీహ్ బుఖారీ – అజ్జుహా సూరా వ్యాఖ్యానం). ఇంతకీ ఆ స్త్రీ ఎవరోకాదు, ఆమె అబూలహబ్ భార్య అయిన ఉమ్మె జమీల్. (ఫతుల్ బారీ)

[2] సూర్యుడు ఉజ్వలంగా ప్రకాశిస్తూ పైకెక్కే సమయాన్ని అరబీలో ‘జుహా’ (الضُّحَىٰ) అంటారు.

[3] ‘సజా’ ( سَجَىٰ ) అంటే శాంతించిన, కుదుటపడిన, నిశ్చలమైన అని అర్థం. రాత్రి దట్టమైన చీకటిని అలుముకున్నప్పుడు ఈ స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో నలువైపులా ప్రశాంతత, నిశ్శబ్దం ఆవరిస్తుంది.

[4] నీ ప్రభువు నిన్ను అనాధగా, అనామకునిగా విడిచిపెట్టేశాడని ఈ అవిశ్వాసులు అనుకుంటున్నారు కదూ! ముమ్మాటికీ అది నిజం కాదు.

[5] లేదా (మరొక అర్థం ప్రకారం) పరలోకం ఇహలోకంకన్నా శ్రేష్ఠమైనది. రెండు అర్థాలు కూడా సందర్భం రీత్యా సరైనవే.

[6] అంటే – ప్రపంచంలో నీ ప్రభువు నీకు గొప్ప విజయాలు ప్రసాదించటంతో పాటు, పరలోకంలో కూడా నీకు అనంతమైన పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాడు. మహాప్రవక్త (సఅసం) తన అనుచర సమాజంలోని పాపాత్ముల కోసం చేసే సిఫారసు కూడా ఈ బహుమానంలో చేరి వుంది.

[7] అంటే – నువ్వు కూడా బాల్యంలో తండ్రి నీడను కోల్పోయావు. మేము నీకు అండగా ఉన్నాము. నీ పోషణకు కావలసిన ఏర్పాట్లు చేశాము.

[8] ఒకప్పుడు నీకు ధర్మజ్ఞానంగానీ, షరీయతు పరిజ్ఞానంగానీ ఉండేది కాదు. మరి మేము నీకు దారి చూపాము. ప్రవక్త పదవిని అనుగ్రహించాము. నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అంతకుముందైతే నువ్వు సన్మార్గం కోసం చింతాగ్రస్తుడై ఉండే వాడివి.

[9] అంటే – ఒకరిపై ఆధారపడకుండా నిన్ను స్వతంత్రునిగా, నిరపేక్షాపరునిగా చేశాను. నీవు లేమిలో సహనశీలునిగానూ, కలిమిలో కృతజ్ఞుడిగానూ ఉండి సరైన మార్గాన్నే ఎన్నుకున్నావు. అందుకే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అంటూ ఉండేవారు: “పుష్కలమైన సాధనసంపత్తులే ‘కలిమి’కి చిహ్నం కావు. అసలు సిసలు కలిమి హృదయంలోని కలిమి (నిరపేక్షాభావం) మాత్రమే.” (సహీహ్ ముస్లిం – జకాత్ ప్రకరణం).

[10] పైగా నువ్వు తండ్రిలేని బిడ్డపట్ల మృదువుగా వ్యవహరించు. అతనిపై జాలి చూపు.

[11] అర్థించేవారిని అదిలించకు. వారిపై విసుగును, అసహనాన్ని ప్రదర్శించకు. కరకు మాటలతో వారి మనసు నొప్పించకు. వారికేదన్నా చెప్పవలసివస్తే మంచిగా, ప్రేమగా చెప్పు, అంతే.

[12] అంటే (ఓ ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం!) అల్లాహ్ నీకు చేసిన అపారమైన మేళ్లను మరచిపోకు. ఉదాహరణకు : అల్లాహ్ నీకు సన్మార్గం చూపటమే కాకుండా నిన్ను తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నీవు ఒక అనాధ అయినప్పటికీ నీ పోషణకు గొప్ప ఏర్పాటు చేశాడు. నీకు ఆత్మతృప్తినీ, నిరపేక్షాభావాన్నీ ప్రసాదించాడు. కాబట్టి నువ్వు కృతజ్ఞతా వైఖరి ద్వారా ఈ అనుగ్రహాలను వ్యక్తపరుస్తూ ఉండు. దీనిద్వారా అవగతమయ్యేదేమిటంటే దైవానుగ్రహాలను వ్యక్తపరచటం, మెచ్చుకోలుగా చెప్పు కోవటం దైవానికి ఇష్టకరమైనది. అయితే అలా వ్యక్తం చేస్తున్నప్పుడు మనిషిలో అహంకారంగానీ, బడాయిగానీ తొంగిచూడకూడదు. పైగా దేవునిపట్ల వినయంతో, కృతజ్ఞతాభావంతో అతని గుండెలు కరిగి, కళ్ల ద్వారా వర్షించాలి. అదే సమయంలో దేవుని మహోజ్వలానికి కించిత్ భయం కూడా చెందాలి. ఎందుకంటే ఈ అనుగ్రహ భాగ్యాలు ఏ క్షణంలోనయినా దక్కకుండా పోవచ్చన్న భయం మనిషిని వినమ్రునిగా ఉంచుతుంది.

30వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ అమ్మ – యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3P1gmLLtmLJ_qczbvpmWWr