95. సూరా అత్ తీన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

95. సూరా అత్ తీన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/8mq5MIxqjEM [45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. సృష్టిరాసులన్నింటిలోను మానవునికి అత్యున్నత స్థానాన్ని ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. మొదటి ఆయతులో వచ్చిన ‘తీన్’ (అంజూరం) అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. మనిషిని చక్కని రూపులో సృష్టించడం జరిగిందని, ఉత్తమమైన శారీరక, మానసిక శక్తులు ప్రసాదించడం జరిగిందని, ఇవన్నీ అల్లాహ్ అనుగ్రహాలని తెలియజేసింది. అందువల్ల మనిషి అల్లాహ్ కు కృతజ్ఞుడై ఉండాలని బోధించింది. అల్లాహ్ కు దూరమైతే మనిషి తన హోదాను కోల్పోతాడనీ, అవమానాల పాలయి పతనమవుతాడనీ, పరలోకం అనివార్యమని హెచ్చరించింది.

95:1 وَالتِّينِ وَالزَّيْتُونِ
అత్తి పండు సాక్షిగా! ఆలివు సాక్షిగా!

95:2 وَطُورِ سِينِينَ
సినాయ్ పర్వతం సాక్షిగా! [1]

95:3 وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ
శాంతియుతమైన ఈ నగరం (మక్కా) సాక్షిగా! [2]

95:4 لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ
నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము. [3]

95:5 ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ
అటుపిమ్మట అతణ్ణి అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము. [4]

95:6 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
అయితే విశ్వసించి, ఆ పైన మంచి పనులు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. [5]

95:7 فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ
మరైతే (ఓ మానవుడా!) ప్రతిఫల దినాన్ని ధిక్కరించమని ఏ వస్తువు నిన్ను పురమాయిస్తున్నది. [6]

95:8 أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ
ఏమిటి, అధికారులందరికంటే అల్లాహ్ గొప్ప అధికారి కాడా? [7]

[1] అల్లాహ్ తన ప్రవక్త అయిన మూసా (అలైహిస్సలాం)తో సంభాషణ జరిపినది ఈ పర్వతం మీదే.

[2] శాంతియుతమైన నగరం అంటే మక్కా నగరం. ఈ నగరంలో హత్యాకాండకు అనుమతి లేదు. ఈ నగరంలో ప్రవేశించిన వారికి రక్షణ లభిస్తుంది.

మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ సూరాలో మూడు ప్రదేశాలపై ప్రమాణం చేయబడింది. ఈ మూడు ప్రదేశాలు కూడా చరిత్రాత్మకమైనవి. ఎందుకంటే ఆ స్థలాలలో గొప్ప గొప్ప ప్రవక్తలు, షరీయతు ప్రదాతలు వచ్చారు. “అత్తిపండు, ఆలివ్ సాక్షిగా!” అంటే అత్తిపండ్లు,ఆలివ్ పండ్లు విరివిగా ఉత్పత్తి అయ్యే ప్రదేశం అని అర్థం. అది బైతుల్ మజ్లిస్ (జెరూసలేము) ప్రదేశం. దైవప్రవక్త ఈసా (ఏసుక్రీస్తు) ఆ ప్రదేశంలో ప్రభవించారు. సినాయ్ పర్వతంపై మూసా (అలైహిస్సలాం)కు ప్రవక్త పదవి ఇవ్వబడింది. కాగా; మక్కానగరంలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించారు (ఇబ్నె కసీర్).

[3] పై మూడు ఆయతులలో చేయబడిన ప్రమాణానికి జవాబు ఈ ఆయతులో ఇవ్వబడింది. అదేమంటే ఈ లోకంలో మానవుణ్ణి అల్లాహ్ అత్యుత్తమ రీతిలో సృజించాడు. ఇతర ప్రాణులతో, జంతువులతో పోల్చుకున్నప్పుడు ఈ తేడా కొట్టొచ్చినట్లే కనిపిస్తుంది.ఇతర జీవుల ముఖాలు క్రిందికి వంగి ఉంటాయి. కాని అల్లాహ్ మనిషిని మాత్రం నిటారుగా నిలబడి నడిచేవానిగా, అందగాడుగా మలిచాడు. ఇతర ప్రాణులకు భిన్నంగా మానవుడు తన చేతులతో సంపాదించి తింటాడు. త్రాగుతాడు. అతని శరీరావయవాలు ఎంతో పొందికగా ఉన్నాయి. వేర్వేరు అవయవాల మధ్య చాలినంత ఎడమ ఉంది. ఇతర ప్రాణుల మాదిరిగా వాటి మధ్య అస్తవ్యస్తతగానీ, అసౌకర్య పరిస్థితిగానీ లేదు. ముఖ్యమైన అవయవాలు రెండేసి చేయబడ్డాయి. మరి అతనిలో కనే, వినే, ఆలోచించే, అర్థంచేసుకునే శక్తియుక్తులు పొందు పరచబడ్డాయి. “అల్లాహ్ ఆదంను తన ఆకారంపై పుట్టించాడ”న్న హదీసును (ముస్లిం – కితాబుల్ బిర్….) విద్వాంసులు ఈ నేపథ్యంలో ఉదాహరించటం కూడా గమనార్హ విషయమే. మానవ సృజనలో ఈ విషయాలన్నింటి మేళవింపే “అహ్సని తఖ్వీమ్” (అందమైన ఆకృతి). అందునా అల్లాహ్ మూడుసార్లు ప్రమాణం చేసిన తరువాత ఈ మాట చెప్పాడు (ఫత్హుల్ ఖదీర్).

[4] ఈ ఆయతును పలువురు వ్యాఖ్యాతలు పలు విధాలుగా గ్రహించారు. కొంతమంది ప్రకారం ఈ ఆయతు మనిషి యొక్క హీనాతి హీనమైన వార్ధక్యాన్ని (ముసలితనాన్ని) సూచిస్తోంది. ఈ వయసులో మనిషి జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. అతను విచక్షణా జ్ఞానాన్ని సయితం కోల్పోయి పసిపిల్లవాడిలా ప్రవర్తిస్తాడు. మరికొంత మంది ప్రకారం మానవుడు తన దురాగతాల కారణంగా నైతికంగా దిగజారి పాతాళానికి త్రోసివేయ బడతాడు. పాముల, క్రిమికీటకాల కన్నా హీనుడిగా తయారవుతాడు. ఇంకా కొంత మంది ప్రకారం నరకంలో అవిశ్వాసులకు పట్టే దురవస్థ ఇది! అంటే మానవుడు దైవాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎదిరించి, తనను అత్యుత్తమ స్థానం నుంచి ఎగదోసుకుని నరకంలోని అధమాతి అధమ స్థానంలో పడవేసుకుంటాడు.

[5] అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని మాత్రం అల్లాహ్ ఈ దుష్పరిణామం నుండి మినహాయించాడు.

[6] ఇది మనిషికి చేయబడే హెచ్చరిక! ఓ మనిషీ! నిన్ను అత్యుత్తమ ఆకృతిలో పుట్టించి, గౌరవోన్నతుల్ని వొసగిన ప్రభువు అత్యంత అధమస్థితికి చేర్చే శక్తి కూడా కలిగి ఉన్నాడని మరచిపోకు. అలాగే నిన్ను తిరిగి బ్రతికించటం కూడా ఆయనకు ఏమాత్రం కష్టతరం కాదు. ఇది తెలిసి కూడా నువ్వు ప్రళయదినాన్ని, శిక్షాబహుమానాన్ని త్రోసిపుచ్చుతున్నావా? మరికొందరు దీని అర్థం ఇలా చెబుతారు: (ఓ ముహమ్మద్!)దీని తరువాత తీర్పుదినానికి సంబంధించి నిన్ను ఎవరు ధిక్కరించగలరు?

[7] ఆయన ఏ ఒక్కరికీ అన్యాయం చేయడు సరికదా, తీర్పు దినాన్ని నెలకొల్పి అన్యాయం జరిగిన వారందరికీ న్యాయం చేస్తాడు. ఈ సూరా చివరిలో “బలా వ అన అలా జాలిక మినష్షాహిదీన్” (ఎందుకు కాడు?! ఈ విషయానికి నేను సయితం సాక్షినే) అని పలకాలని తిర్మిజీ గ్రంథంలోని ఒక బలహీన హదీసు ద్వారా తెలుస్తోంది.

30వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ అమ్మ – యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3P1gmLLtmLJ_qczbvpmWWr

ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/